మొల్ల రామాయణము/అయోధ్యా కాండము/గుహుని ప్రపత్తి

వికీసోర్స్ నుండి

గుహుని ప్రపత్తి[మార్చు]

ఆ. చనుచు రాఘవుండు స్వర్ణది యొడ్డున
గుహుని గాంచి యతనిఁ గుస్తరించి
తడయ కోడఁ బెట్టి దాఁటింపు మనవుడు
నట్ల చేయఁ దఁలచి యాత్మలోన. 31
క. "సుడిగొని రాము పాదములు సోఁకిన ధూళి వహించి రాయి యే
ర్పడ నొక కాంత యయ్యె నఁట, పన్నుగ నీతని పాద రేణు వి
య్యెడ వడి నోడసోఁక నిది యేమగునో" యని సంశయాత్ముఁడై
కడిగె గుహుండు రామపద కంజయుగంబు భయమ్ము పెంపునన్‌. 32
వ. ఇట్లు శ్రీరామచంద్రుని శ్రీపాదంబుల నీటఁ గడిగి యోడపై
నెక్కించి, యమ్మువ్వుర నవ్వలికి దాఁటించిన నా క్షణంబ. 33