మొల్ల రామాయణం/పీఠిక

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు.
రామాయణము.
---
పీఠిక.


శ్రీమహిమాభిరాముఁడు వ
     సిష్ఠమహామునిపూజితుండు ను
త్రామవధూకళాభరణ
    రక్షకుఁడాశ్రితపోషకుండు దూ
ర్యామలసన్నిభాంగుఁడు మ
    హాగుణశాలి దయాపరుండు శ్రీ
రాముఁడు ప్రోచు భక్తతతి
    రంజిలునట్లుగ నెల్లకాలమున్.

ఉ.
శ్రీనగమందిరుం డమరసేవితుఁ డర్ధశశాంకమౌళి స
న్మౌనిమనఃపయోజదిననాయకుఁ డబ్జభవామరేశ్వర
ధ్వానలసత్ప్రసన్నుఁడతిధన్యుఁడు శేషవిభూషణుండు వి
ద్యానిధిమల్లికార్జునుఁడు తానిడుమాకుశుభంబులొప్పుగన్.
ఉ.
తెల్లనిపుండరీకములతేజము మెచ్చనికన్నుదోయితో
నల్లనిశక్రనీలరుచి నవ్వెడుచక్కనిదేహకాంతితో




నల్లనఁబిల్లఁగ్రోవి కరమందలిసంజ్ఞల నింపు నింపఁగా
గొల్లతల౯విరాళితగఁగొల్పెడుకృష్ణుఁడు ప్రోచుఁగావుతన్. 3

ఉ.మించి సమస్తలోకములు మిన్నక తాఁ దననేర్పు మీఱ ని
ర్మించి ప్రగల్భత౯ మెఱసి మేలును గీడును బ్రాణికోట్లు సే
వించి ఘటించు శాస్త్రములు వేదములుంగొనియాఁడుచుం
డునా, కాంచనగర్భుఁడిచ్చు నధికంబుగ నాయువునీప్సితా
ర్థముల్.

సీ.చంద్రఖండకలాపుఁ జారువామనరూపుఁ
గలితచంచలకర్ణుఁ గమలవర్ణు
మోదకోజ్జ్వలబాహు మూషకోత్తమవాహు
భద్రేభవదను సద్భక్తసదను
సన్మునిస్తుతిపాత్రు శైలరాడ్దౌహిత్రు
ననుదినామోదు విద్యాప్రసాదుఁ
బరశువరాభ్యాసుఁ బాశాంకుశోల్లాసు
నురతరఖ్యాతు నాగోపవీతు

తే.లోకవందితగుణవంతు నేకదంతు
నతులహేరంబు సత్కరుణావలంబు
విమలరవికోటితేజు శ్రీవిఘ్నరాజుఁ
బ్రథితవాక్ప్రౌఢికై యెప్డుఁ బ్రస్తుతింతు.

చ.కరిముఖుఁడుంగుమారుఁడువికారపుఁజేఁతలముద్దుసూపుచు
న్గురువులువాఱుచున్సరిగగట్టులుదాఁటుచుఁ జన్నుదోయితో
శిరములు రాయుచుం గబరిఁజేర్చినచంద్రునిఁ బట్టితీయఁగాఁ
గరములఁ జాఁప నవ్వెడుజగమ్ములతల్లి శుభంబు లీవుతన్.

ఉ.సామజయుగ్మ మింపలరఁ జల్లనినీరు పసిండికుండల౯
వేమఱు వంచివంచి కడువేడుకతో నభిషిక్తఁజేయఁగాఁ


దామరపువ్వుగద్దియ ముదంబుననుండెడిలోకమాత మా
కామునితల్లి సంపద నఖండముగా నిడు మాకు నెప్పుడున్. 7

ఉ. మేలిమిమంచుకొండ నుపమింపఁగఁజాలినయంచ నెక్కి వా
హ్యాళి నటించి వచ్చుచతురాస్యు నెదుర్కొని నవ్వుదేరఁగా
వాలికసోగకన్నుల నివాళి యొనర్చి ముదంబుఁ గూర్చువి
ద్యాలయ వాణిశబ్దముల నర్థముల౯సతతంబు మాకిడున్.

సీ.సురసన్నుతజ్ఞాను సువివేకి వాల్మీకి
    నఖిలవేదాగమాభ్యాసు వ్యాసు
ఘోరాంధకారప్రభారవి భారవి
    సత్కాంతిహిమకరశ్లాఘు మాఘు
వివిధకళాన్వీతవిఖ్యాతి భవభూతిఁ
    బ్రకటకార్యధురీణు భట్టబాణు
మానినీలోకసమ్మదముద్రు శివభద్రుఁ
    గవితారసోల్లాసుఁ గాళిదాసు

తే. స్తుతగుణోద్దాము నాచనసోము భీము
నవ్యమంజులవాగ్ధుర్యు నన్నపార్యు
రసికుఁడై నట్టిశ్రీనాథు రంగనాథుఁ
దిక్క కవిరాజును నుతించి ధీని మించి.

క. తొల్లిటి యిప్పటి సత్కవి
వల్లభులను రసికవినుతవాగ్విభవకళా
మల్లులఁ గవితారచనల
బల్లిదు లైనట్టిఘనుల భక్తిగఁ దలఁతున్.

క. గురులింగజంగమార్చన
పరుఁడును శివభక్తిరతుఁడు బాంధవహితుఁడు౯



గురుఁ డాతుకూరి కేసయ
వరపుత్రిని మొల్ల యనఁగ వఱలినదానన్. 11

సీ. దేశీయపదములు దెనుఁగులు సాంస్కృతుల్
      సంధులు ప్రాజ్ఞులశబ్దవితతి
   శయ్యలు రీతులుఁ జాటుప్రబంధంబు
      లాయా సమాసంబు లర్ధములును
   భావార్థములుఁ గావ్యపరిపాకములు రస
      భావచమత్కృతుల్ పలుకుసరవి
   బహువర్ణములును విభక్తులు ధాతు ల
      లంకృతిఛ్ఛందోవిలక్షణములుఁ

తే. గావ్యసంపద క్రియలు నిఘంటువులును
   గ్రమము లేవియు నెఱుఁగ విఖ్యాతగోప
   వరపుశ్రీకంఠమల్లేశువరముచేత
   నెఱిఁ గవిత్వంబుఁ జెప్పఁగా నేర్చికొంటి. 12

క. చెప్పు మని రామచంద్రుఁడు
   సెప్పించిపలుకుమీఁదఁ జెప్పెద నే నె
   ల్లప్పుడు నిహపరసాధన
   మిప్పుణ్యచరిత్ర తప్పు లెంచకుఁడు కవుల్. 13

వ. అని మఱియును. 14

చ. వలివపుసన్నపయ్యెదను వాసిగ గందపుఁబూఁతతోడుత౯
   గొలఁదిగఁ గానవచ్చువలిగుబ్బచనుంగవఠీవి నొప్పఁగాఁ
   దెలుఁగని చెప్పుచోటఁ గడుతేటలమీటలఁ గ్రొత్తరీతులం
   బొలుపు వహింపకున్న మఱి పొందగునే పటహాదిశబ్దముల్.

క. మును సంస్కృతములఁ దేటగఁ
   దెనిఁగించెడిచోట నేమి దెలియక యుండ౯


దనవిద్య మెఱయఁ గ్రమ్మఱ
ఘన మగు సంస్కృతముఁ జెప్పఁగా రుచి యగునే. 16

ఆ. తేనె సోఁక నోరు తీయన యగురీతి
   తోడ నర్థమెల్లఁ దోఁచకుండ
   గూఢశబ్దములను గూర్చినకావ్యమ్ము
   మూఁగ చెవిటివారిముచ్చ టగును. 17

క. కందువమాటలు సామెత
   లందముగాఁ గూర్చి చెప్ప నది తెలుఁగునకుం
   బొందై రుచియై వీనులు
   విందై మఱి కానుపించు విబుధులమదికిన్. 18

వ. అని మఱియును. 19

క. ఆది రఘురాముచరితము
   నాదరముగ విన్నఁగ్రొత్తయై లక్షణసం
   వాదమ్మై పుణ్యస్థితి
   వేదమ్మైతోఁచకున్న వెఱ్ఱినె చెప్పన్. 20

ఉ. రాజితకీర్తి యైనరఘురామచరిత్రము ము౯ గవీశ్వరుల్
   తేజ మెలర్పఁ జెప్పిరని తెల్సియుఁ గ్రమ్మఱఁ జెప్ప నేలన౯
   భూజనకల్పకం బగుచు భుక్తికి ముక్తికి మూల మైనయా
   రాజును దైవ మైనరఘురాము నుతించినఁ దప్పు గల్గునే. 21

క. వారాంగన శ్రీరాముని
   పే రిడి రాచిలుకఁ బిలిచి పెంపు వహించె౯
   నేరుపు గలచందంబున
   నారాముని వినుతి సేయ హర్షము రాదే. 22

క. నేరిచి పొగడినవారిని
   నేరక కొనియాడువారి నిజకృప మనుపం

   
   గారణ మగుటకు భక్తియె
   కారణ మగుఁ గాని చదువు కారణ మగునే. 23

ఉ. సల్లలితప్రతాపగుణసాగరుఁడై విలసిల్లి ధాత్రిపై
   బల్లిదుఁ డైనరామనరపాలకుని౯ స్తుతిసేయుజిహ్వకు౯
   జిల్లరరాజలోకమును జేకొని మెచ్చఁగ నిచ్చ పుట్టునే
   అల్లము బెల్లముం దినుచు నప్పటికప్పటి కాన సేయునే. 24


వ. అని విత్కరించి ముదంబున నిష్టదేవతాప్రార్థనంబును బురా తనకవీంద్రస్తుతియునుం జేసి నాచేయం బూనిన మొల్ల రామాయణమునకుఁ గథావిధానం బెట్టు లనిన. 25