Jump to content

ముకుందవిలాసము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

ముకుందవిలాసము

తృతీయాశ్వాసము

      శ్రీకర కృష్ణాతుంగా
      శీకరకృత రంగవల్లి చిత్రాంగణదే
      శాకరసోమాధిపల
      క్ష్మీకరసుసహాయ చెన్న కేశవరాయా!1

గీ॥ అవధరింపుము హరికథాశ్రవణవిభవ
      లోలుఁడగునట్టి జనకభూపాలునకును
      శ్రీహరిస్తవనామృత శ్రీవిశేష
      హీతరచనయోగి శుకయోగి యిట్టులనియె2

కం॥ ఈ రీతి శౌరిదయ గని
      కీరము ఖేచరతఁ గాంచి కేకయనగరిం
      జేరఁ జని చెంగట శృం
      గారవనిన్ విశ్రమించి గళితశ్రమమై.3

కం॥ అంతఁ దన కెదురుజను శుక
      కాంతులనఁగ భవనమణులఁ గాంతులెనయఁగా
      నంతంత ఖగము నగరా
      భ్యంతరమున నరుగునప్పు డయ్యైయెడలన్.4

కం॥ చిలుకా! చెలికాడ యిటీ
      వలనినుఁ గనమెన్నఁడనుచుఁ బలికెడు తన నె

      చ్చెలుల కొకానొకరీతిం
      గెలుపుచుఁ దనరాకఁ జని మణీసౌధమునన్.5

సీ॥ వలపు రెట్టింపఁ నిల్వఁగరాని సొక్కుచే
                    నరమోడ్పుఁగనుదోయి నమరుదానిఁ
      గమలాక్షుఁ డెదుట సాక్షాత్కరించినట్లైన
                    నులికిపాటున లేచి యొదుగుదాని
      నాథుఁ డిచ్చటికి నెన్నడు వచ్చునో యను
                    చింతచేఁ జెక్కు చేఁ జేర్చుదానిఁ
      బ్రియసఖుల్ బలిమిఁ బ్రార్థించి పిల్చినఁగాని
                    యొక్కమాఱునుఁ బల్కకుండుదానిఁ
      గీర మేటికి రాదొకో యా రమేశుఁ
      గాంచినదొ లేదొ యనుచు నూహించుదానిఁ
      జేరి హరి చిత్రఫలక మీక్షించుదాని
      ననుఁగుఁజెలి భద్రఁ గనియె విహంగ మటుల.6

కం॥ ప్రియమునఁ గని రయమునఁ జని
      శయమున నది వ్రాలుటయును సంతసిలి మృగీ
      నయన వరానయనభ్రమ
      నయనప్రమదాశ్రువులఁ గనన్ శుక మంతన్.7

కం॥ హరి యిపుడే రాలే దనఁ
      బరవశయై మఱియు నిన్నుఁ బరిణయమగునో
      తరుణీ! యీలో ననగాఁ
      దెఱపి గనియెఁ జెలియవలపుఁ దెలియ వశంబే.8

వ॥ అంత నా శుకశకుంతం బా కాంతం గొంతఁ బ్రశాంతం గావించు
      నంతరంగంబున.9

కం॥ కొమ్మా కొమ్మని కమ్మని
      కొమ్మావిచిగుళ్ళఁ బొదిగికొని హరిసతికై
      యిమ్మనిన పారిజాతసు
      మమ్ముల హార మ్మొసఁగి మానినితోడన్.10

కం॥ నీ చెలువు డిచ్చె నీ కన
      నాచెలి యా విరులసరము నామోదకళా
      గోచరముగ నళిచయరుచి
      సూచనలోచనమరీచిఁ జూచి శుభరుచిన్.11

సీ॥ వనరుహాలోకభావము నీకుఁ గలదని
                   యొకకొంతఁ గన్నుల నొత్తి యొత్తి
      శంఖసుకరకాంతి సవరించు నీకని
                   వేడ్కతో గళపీఠి వ్రేసి వ్రేసి
      ఘనసుమనోమాలికా ముఖ్యగతి నీకుఁ
                   గలదని భుజవల్లిఁ గమిచి కమిచి
      యచ్యుతస్థితి నీకు నామోదరతి గల్గు
                  నని యురోజములపై నునిచి యునిచి
      కౌస్తుభస్ఫూర్తియును నీకుఁ గలదటంచుఁ
      దన విభుని పేరుగా దానిఁ దలఁచి తలఁచి
      పడఁతి పతి పంపినట్టి యా పారిజాత
      హారమును శౌరిఁ గనునట్ల యరసి యరసి.12

కం॥ ఆహా రమేశుఁ డంపిన
      యా హారంబిదియు సంతతానందిత హ

     వ్యాహారము గనుఁగొన నమృ
     తాహారముఁ బోని తృప్తి నలరిచె ననుచున్.13

కం॥ ఆ చెలువంబున నది గని
     యా చెలువ ప్రియంబునంద నది గని వనితా!
     నే చనినవార్త విను మిదె
     వాచించెదననుచుఁ గీరవర మిట్లనియెన్.14

కం॥ నిను వీడ్కొని యటఁ జనిచని
     జనపదములు మునిపదములు సరముల్ పురముల్
     ఘననిగమములగమములున్
     మునుఁ గనుచుఁ బ్రభాసతీర్థపుంబ్రాంతమునన్.15

కం॥ వారినిధిన్ భూరినిధిన్
     హారివిధిన్ విశ్వకర్మ యలరించిన వి
     స్తారవతిన్ సారవతిన్
     ద్వారవతిం గంటిఁ గని తదంతికసీమన్.16

కం॥ పారావతవారాహత
     పారేవతగళిత సారభారవదవనిన్
     శ్రీరైవతకాచలశృం
     గారవనిన్ మత్పురాధిగతసుకృతమునన్.17

కం॥ముద మొదవఁ బొదలు నొక పూఁ
     బొద మొదలంగదలి మ్రొక్కఁబోయిన దేవుం
     డెదురైనరీతి దోచిన
     యదుకులపవిహేతిఁ గంటి నసురారాతిన్.18

సీ॥ చిఱుతప్రాయమువాఁడు చిఱునవ్వువెన్నెలల్
                  మొలకలెత్తిడి ముద్దుమోమువాఁడు

    వలపుఁ జిల్కెడువాడు చెలువమౌ నమృతంపుఁ
                   దావి కిమ్మైన కెమ్మోవివాఁడు
    కలికికన్నులవాఁడు మలఁచి తీర్చినఠీవి
                  గననైన ఱొమ్ముపొంకమ్మువాఁడు
    మరుని మీఱినవాఁడు మరకతమ్ములకన్న
                  మిసమిసల్గను మేనిమెఱుఁగువాడు
    సొంపుగలవాఁడు చల్లనిచూడ్కివాఁడు
    నెనరుగలవాఁడు నేర్పులఁ దనరువాఁడు
    మేలుగలవాఁడు ముజ్జగ మేలువాఁడు
    మాధవుండు సమాశ్రితోమాధవుండు.19

కం॥ అతని గుణంబులు నేనా
    స్తుతి జేయగ నురగపతియు సురపతియు నహ
    ర్పతియునుఁ దగరన నియమ
    వ్రతులై వర్ణించి కాంచి వ్రాసి గణింపన్.20

కం॥ పలుకులు గమ్మని కపురపుఁ
    బలుకులు మానసము సుగుణపరికరహంసా
    వళిమానసంబు నయనము
    లలరుఁ గృపానయనములు మురారికి సకియా!21

చం॥ తెఱవ! తళుక్కునన్మెఱుఁగుదేఱెడు చెక్కులు చక్కనైన పే
    రురము గనం బదాఱుకళ లుట్టిపడందగు మోము వట్రువల్
    దిరిగి చొకాటపున్సొగసు దెల్పెడి బాహపు లింద్రనీలపున్
    వెరవులఁ గేరడించు నెఱవెండ్రుక లయ్యదుభర్తకే తగున్.22

గీ॥ అడుగులు పంకజాతముల కాజ్ఞలిడంజను గౌనటంటిమా
    పిడికిటఁ బట్టనౌను కడుపెద్ద యురంబు మరుండు కొల్వుకై
    పడయఁగవచ్చు ముచ్చటగు పాణియుగమ్ము విలోచనమ్ములా
    బుడిబుడి నేగి వీనులకు బుద్ధులు సెప్పు సుమీ మురారికిన్.23

గీ॥ వాని కన్నులు సొగసుమేల్బూనుటఁ గని
    వాని కన్నులు సొగసుమేల్ బూనుదు రిల
    వాని చెలువంపుదొరఠీవి వరుసనాభ
    వాని చెలువంపుదొరఠీవినైన మలచు.24

కం॥ సల్లపనంబును హాసల
    సల్లపనము దోఁప నాప్తజనములమీదం
    జల్లగఁ గరుణామృత మెదఁ
జల్లగల కటాక్షలహరి సహజము హరికిన్.25

కం॥ నుదురైతే రాజౌలే
    నదురైతేరాజు భువననాథుం డౌలే
    యదురాజున కెవరైనా
    యెదురా యరవిందనయన! యెందుననైనన్.26

గీ॥ అక్క వైదర్భియును భల్లుకాత్మజయును
    నిఘ్నపౌత్రియు మఱి తాపనియునుఁ గోస
    లాత్మజయు నాగ్నజితి యఁట హరివధూటు
    లతని కొకరైన సరిరా రొకందునైన.27

కం॥ ఆ బంగరయ్యతో ని
    న్నో బాలామణిరొ కూర్ప నాగి భూషణమౌ

    గాఁబోలది యట్లుండెఁ గ
    దా బహునాళ్ళకుఁ దదీయదర్శన మొదవన్.28

క. నేనే హరిఁ గనబోయెడి
    లోనే ననుఁ బట్టఁదలఁప లోనైతో నా
    శ్రీనేతకు నినుఁ దెలిపితి
    నే నేర్చినరీతి నాతి నెన రుప్పొంగన్.29

క. అందున నీయందున నో
    కుందరదన కూర్మిచే ముకుందుఁడు మదన
    స్పందితగుణసంధితశర
    బృందమహావర్షచలితహృదయాంబుజుఁడై.30

సీ. కలికి చల్లనిచూడ్కిఁ గన నెన్నఁ డొదవునో
                    మరుశరంబులరూపు మాఱుపఱప
    నిభయాన మోమెన్న డీక్షింపఁగల్గునో
                    రిక్కరాయని పెంపు ధిక్కరింప
    నాతిమృదూక్తు లెన్నడు వినఁగల్గునో
                    శుకపికంబుల నోటిరకము మాన్ప
    నతివ నెమ్మే నెన్న డలఁముకోఁగల్గునో
                    సంపఁగివిరిశయ్య జలుపనీయ
    నువిద నెన్నడు కాంతు వియోగజలధి
    నెన్నడు తరింతు సుఖియింతు నెన్నటికను
    మగువ! నీమీది బాళిచే నగు విరాళి
    చాలఁ దమిఁ దూలి వనమాలి జాలిమాలి.31

గీ. అనుచుఁ దమిఁజెందు యదువంశవనధిచంద్రు
    డెందము గలంకపడకుండఁ బొందుపఱుప
    నిందువదన నే తెత్తు నిందు ననఁగ
    ననియె దయమించి తగునట్టు నినుగుఱించి.32

క. మీవారిజముఖి యనుమతి
    మీవారిం దెలిసి వారి మేలుపఱచి పై
    నే వచ్చు నెలవు దెలుపుము
    నీవే సుమ్మనియెఁ బొమ్మనియె రమ్మనియెన్.33

క. ఓకన్నియ! వేయేటికి
    నీకన్నన్ వలపు హెచ్చు నీమీదట నా
    లోకోన్నతచరితు నకట
    నాకన్గవయాన హంసనాయకయానా!34

క. అని శుకతిలకము సెప్పిన
    విని చెప్పగరాని విరహవేదన వనితా
    జనతామణి తనుజనితా
    తనుతాపదురావరాగతన్మయమతియై.35

క. ఎన్నడు హరి రాగలఁడిట
    కెన్న డతని నెనయఁగలుగు నీగతి చిలుకా!
    యెన్నతిఁ బ్రభువుల మాటలు
    సన్నధినే కాక పిదప సత్యము లగునే.36

గీ. అనుచుఁ గలఁగబాఱు హరి జూడనేకోరు
    చెలుల కవలఁజేరు చలువ గోరు
    పరవశంబుబారు పలుమాఱు తనచంద
    మారుదూరుజేయు మారుఁ దూఱు.37

గీ. ఆశుగమ్ముల దాడికి నట రతీశు
    నాశుగమ్ములవాడికిఁ నలఁత నొంది

    యాశుగతి చైత్రవిధులకు నలికి కలికి
    యాశుగతి చైత్రవిధులకు నాకరముగ.38

కం॥ ఆయెడ నీగతిఁ గాయజ
    తోయజశరహతి లతాంగి దూలుచు హరిపైఁ
    బాయనిమతి డాయని ధృతి
    హాయని మితిలేని కూర్మియర్మిలి బెట్టన్.39

సీ॥ చిలుక చెప్పిననైనఁ జెలువుండు రాఁడాయె
             నే డాయగలనె ప్రాణేశుకడకు
    నినుఁ డిట్లు రానిచో దిన మొక్కయేఁడాయె
           నేఁడాయెడకుఁ బోవనేర్తు రెవరు
    పద్మినీరిపుఁడు ప్రభంజనుతోడాయెఁ
             దోడాయె వారికెంతో వసంతుఁ
    డిట మారునకు నాదు హృదయంబు వీడాయె
            వీఁ డాయములెఱుంగు విరహులందుఁ
    గాన నేనెట్లు నోర్వఁగాఁగా దటంచు
    నా హరిఁ దలంచు నూహించుఁ దా హసించు
    సాహసించు వసించు లో జాలిమాలి
    నటుల యా భద్ర నిర్ణిద్ర యగుచునుండ.40

మ॥ భవదంశోద్భవభద్రపద్మముఖి నీ పద్మాక్షిఁ బద్మాక్షుఁడున్
    భవదుద్యద్దయచే వరించు నిఁక నన్ భవ్యోక్తిమిత్రత్వవై
    భవతం బద్మకు వార్ధిసంభవకుఁ జెప్పంబోయె నాఁ బద్మబాం
    ధవుఁ డంతం జనె వార్ధిచెంతకుఁ బ్రచేతస్సంగతిస్ఫూర్తిచేన్.41

చ॥ సమయభిషగ్వరుం డపరశైలపుకుప్పె దినేంద్రుఁడన్ రసేం
    ద్రము నిడి పైఁ దదూర్ద్వకరతామ్రశలాక ఘటించి వహ్నియో

    గము నొనరింప సిందురముగాఁ బయికిం బ్రసరించె నాఁ గరం
    బమరెను సాంధ్యరాగము నభోంతరదంతురితాంశుభాగమై.42

చ॥ ద్యుమణి వడంగ విచ్చు చరమోదధి బైల్పడ వచ్చు బాడబో
    ద్గమితశిభానికాయ ఘనకాంతి యనం దనరారె సంధ్య త
    త్సముదితధూమజాల మనఁజాలె నిరుల్ రవి దుంక లేచు తో
    యముననుఁ జిందు బిందువులయట్ల నభంబున భంబు లేర్పడెన్.43

చ॥ దిన మను గ్రీష్మ మేగ జగతి న్నిశ నాఁగ ఘనాగమంబు దా
    ర్కొనఁ గొనసాంధ్యరాగపు మెఱుంగు మెఱుంగుగ మబ్బు మబ్బుగాఁ
    దనరఁ దదంబుదాంతరగతస్ఫుటమౌక్తికముల్ గ్రహించి య
    య్యనిమిషరాశి రాశినిడి రా దివినాఁ దనరారెఁ దారకల్.44

కం॥ మఱియును దినపురుషుఁడు రే
    విరిబోడింగూడముడికి విడుదురుముసిరుల్
    దొరయ నిరుల్ నెరియుచునం
    దొరయ విరుల్బోలెఁ దారకోత్కర మలరెన్.45

కం॥ తారకములు గగనద్రుమ
    సారకుసుమ సముదయ ప్రసారకములుగాఁ
    దోరముగాఁ దచ్ఛాయా
    కారముగాఁ దనరె నంధకారము ధరణిన్.46

కం॥ ఇనుఁ డపరాశం జనఁ గని
    పని యేమని ముడిచెఁ గన్నె పద్మిని యట న
    య్యినుఁ డపరాశం జనఁ గని
    పని యేమని ముడుచకున్నె పద్మిని యెచటన్.47

కం॥ దీపములు ప్రమితభావో
    ద్దీపములు దనర్చె వసువుదే నినునకుఁగా

    దేవల నల భువననిధిం
    గేపులఁజను నల్ల తరణికిరణము లనఁగన్.48

చం॥ కలువలవిందు పాల్కడలికందు సుధారుచిచిందు కామికిన్
    వలపులమందు బుట్టునను వారిధికన్యకు ముందు ఱొమ్మునం
    గలిగినకందు తెల్లజిగి గట్టినబొందు కరాళిక్రందుగా
    చలువలపొందు ముందొదవెఁ జందురుఁ డందు సురేంద్రుదిక్కుగన్.49

కం॥ తుంగంబన సుధ దివియు సు
    రంగంబన హృదతాభ్రరంగంబన సా
    రంగంబన శశమన శశి
    యంగంబున నంక మెసఁగె నసితాంకంబై.50

కం॥ చదలీ కదళీదళముగ
    బొదలీశశిశశిగ దాని బ్రోదిసలుపు సం
    పదలీను తండులమరీ
    చదళీగతతారకాంకసంగతు లలరెన్.51

కం॥ బిరుసుందెలి పువ్వులనన్
    సరసం దారకలు నెఱిసెఁ జంద్రజ్యోతిం
    దొరసెం జందజ్యోతియు
    వరుసం దివి దివిజులుత్సవము సల్పిరనన్.52

వ॥ మఱియును.53

సీ॥ విరహుపై వచ్చు మరుఁడు వట్టించిన
               జయసమున్నతసితచ్ఛత్రమనఁగఁ

    బ్రియుఁడుబ్బ నుబ్బిన వియదాపగాపయః
                 కల్లోలభవఫేనఖండమనఁగ
    వెన్నెలయనుపేరి వెలిగుడారంబుపై
                 నిలిపిన వజ్రాల కలశ మనఁగ
    రేమానినీమణి సీమంతసీమపైఁ
                 జూపట్టు ముత్తేలచుక్క యనఁగ
    నంచితకళంక సంచరచ్చంచరీక
    తారకాకారకైరవోత్కరపరీత
    గగనకాసారపుండరీకంబనంగ
    సాంద్రరుచితోడ నడురేయిఁ జంద్రుఁ డమరె.54

    క్రొన్నెల జాడఁ బుట్టి తెలి కొన్ననకాంతుల తోడఁదొట్టి రే
    వెన్నెలగూడపెట్టి జలువన్నెలరాలసరాల జాలురా
    జిన్నెలఁ జూడ ముట్టియల జిమ్మనజీకటిజూడ మొట్టియా
    వెన్నెలలాడ మెట్టినటు విన్నలమెన్ మునుమున్నిలాస్థలిన్.55

    దివియను సురగవి నమృతాం
    శువనుం బొదుగుననుఁ బిదుక సొరిది నజాండం
    బవుకుండ నిండు నవవిధ
    సవిధపయఃపూర మనఁగఁ జంద్రికలలరెన్.56

    క్రొన్నెలమ్రుచ్చు జగంబుల
    వన్నెల హరియింప నింపువగదెలిమచ్చుం
    జిన్నెల నించిన సంచున
    వెన్నెల రోదోంతరాళవీథుల నొలసెన్.57

వ॥ వెండియు నిజాధరసుధాదానవిధానాదుల సుమనోధనుఃకేళినారాధింప
    నధీనులగు మనోధవులచేత వివిధవిధంబులం బ్రసాధితలగు స్వాధీన
    పతికల ధమ్మిల్లమల్లికామాలికా ధావళ్యధాళధళ్యంబు ననుసంధింపు
    నిశాసమయంబులగుట నిజేశసమాగమాశల నావాసాదులకు విలాసంబు
    లొసెంగు వాసకసజ్జికల సాలంకృతవిశదశయ్యావిసరంబు ననుస
    రింపుచు సంకేతనిశాంతంబులకుఁ గాంతులు రామిం జింతింపం దెల్లనగు
    విరహోత్కంఠితల కపోలకాంతులతో మంతనంబొనర్పుచుఁ బతుల
    నవమతింబొమ్మని పదరి పిదపం బరితపలగు కలహాంతరితలను
    పచరించు నుచితోపదార చందనాదులరుచిం గోచరింపుచు సంకేత
    కుంజంబులకుంజని నాథవంచితలై స్తబ్ధచేతలగు విప్రలబ్ధలంగని
    లతాలతాంగులు నవ్వు నవ్వుగతి నివ్వటిల్లు పువ్వులతోఁ జివ్వసేయుచుఁ
    బ్రాణేశులు దేశాంతర వాసులుగా సూనశరసంతప్తలగు ప్రోషితభర్తృ
    కల శరీరంబులకుఁ దాపశమనకరంబులగు బిసాదికంబులసిరులఁ
    గరంబొలయుచుఁ బరాంగనాపదాలక్తసక్తంబులగు వక్త్రంబులతోడం
    బఱతెంచు పతులంబ్రతీక్షించి ఖండితగతుల ఖండితసతులాదుండగంబు
    వారలకుందెలియఁజూపు హీరముకుర నికరంబు ననుకరింపుచు సఖీ
    సూచితలై యధీశుల నభిసరణంబుసలుపు శ్వేతాభిసారికల వసన
    భూషణాదివేషంబులఁ బోషణంబు గావింపుచు నఖండంబుగా
    నొండొండ మెండుకొను పండువెన్నెల లజాండభాండంబునఁ బాండుర
    తరంబులై ప్రసరించె నయ్యవసరంబున.58

    అవ్వారిజారితోడుత
    నవ్వారిజశరుఁడు పవనుఁ డవ్వల జైత్రుం
    డవ్వారిగఁ దమిరేఁపఁగ
    నవ్వారిజవదన తాళ కటఁగని నగుటన్.59

    తనకును సమ్ముఖగతి నగు
    చనవున హరికిని మనోనుసారి యగునటం
    చనియునుఁ గువలయబాంధవుఁ
    డనియును మృగనయన యా మృగాంశునకనియెన్.60

    తెలుపవే యిట నాదు వలఱేని చెఱునుండు
                  చంద మా యీశుతోఁ జందమామ
    చక్రిదోడుకరమ్ము సహియింపఁగారాదు
                  మందమారుతధాటి చందమామ
    మరుఁడు సాపత్న్యంబు నెఱపి నా మానాథు
                 పొందు మానఁగఁజాల చందమామ
    విరహాంబునిధి గ్రాగ వెన్నెలల్ జమరింప
                 నందమా యిది నీకుఁ జందమామ
    యమృతవారాశిగర్భంబునందుఁ బొడమి
    రమణఁ దగు నిన్ను భక్తిఁ బున్నమల నోచు
    నా చకోరేక్షణల నేఁతువంట గుణము
    మందమా నీకు హిమధామ చందమామ.61

వ॥ అని యిట్లు చంద్రాదులం బ్రార్డింపుచుం బరితపించు చంచలాక్షి
    నీక్షించి ప్రియవయస్య లయ్యెడ.62

సీ॥ ఆంతరంగికుఁడ వీవని నమ్మి యుండితే
                 దర్పక! నీకింత దాడి తగునె
    మును మోమెఱుంగుదీవని నమ్మియుండితే
                 సోమ! నీకింత హెచ్చుటలు దగునె

    ప్రాణబంధుండ వీవని నమ్మియుండితే
               పవన! నీకింత తీవ్రంబు దగునె
    అనురాగతరుడ వీవని నమ్మయుండితే
               చైత్ర! నీకింత పక్షంబు దగునె
    రతిసమాంగి చకోరాక్షి రంజితాంజ
    నాభవేణి పికీవాణి యైనయట్టి
    యిట్టి సుకుమారిఁ బ్రోచక యేఁచఁదగునె
    మీ రనుచుఁ జేరి నెచ్చెలల్ పేరువాఱి.63

కం॥ మారా! యిది మేరా తగ
    వేరాజనయింతి నేఁచనిల నుదయంబౌ
    మా రామామణియు సుమా
    మారామామణి సుమాస్త్ర మాఱనకు మిఁకన్.64

కం॥ మారుండ! నీకు నెవరు
    న్మారుండరె నీదు మేనమామ యొకండే
    వీరుండె హరుఁడు హరియును
    వీరుండరె మిమ్ము నడుప వెస మది నణపన్.65

కo॥ ఇంచుక యాశుగమునకే
    కొంచుచుఁ జని చలతనందు కుసుమాంగిపయిం
    బందాశుగములు బఱుతురె
    పంచాశుగభీతిఁ జెందఁ బంచాశుగముల్.66

గీ॥ అకట నీ మేనమామ గ్రహంబ యగుట
    నగు నొకట నేఁచుట రతీశ! యతనిఁ బోలి

    నిధనగతి మారకుఁడవౌట నీకుఁ దగునె
    తండ్రిఁ బోలి రక్షించుట దగునుఁగాక.67

కం॥ సితిగళుఁడు హరించినయెడఁ
    బతి వేడ్కొని సతియ నిన్ను బ్రతికించినచో
    సతులనె వేధించెద వీ
    జతకుఁ గృమ్నుఁడవు కావె శంబరవైరీ!68

కం॥ క్షితి మును హతునిగఁ జేసియు
    బ్రతుకంగాఁజేసె నేలఁ బశుపతిసతికై
    రతివర! కృతాఘు నిన్నున్
    సతివశులు నీశులగుట సహజము జగతిన్.69

చం॥ మలినతనంది నీ గుణము మాలల పాలగు నీ విజాతియౌ
    బలమును నెక్కు డయ్యడవిపాలగు నీదగు గంట్లధర్మమా
    పెలుచకొనామొదల్ సెడియుఁ బిప్పికిఁబాలగు నీ జయాంకమా
    పలువల పాలుగాదె యిటు పాంథులబాధ యొనర్ప దర్పకా!70

సీ॥ ఇది చక్రకటితటి యిట రాకు మకరాంక!
                   భీతిదంబగు నీదు బిరుదురీతి
    కిది చంద్రబింబాస్య యిట రాకు నలినాస్త్ర!
                  సంకోచ మొదవి నీ శరమువోవ
    నిది చంపకసునాసయిట రాకు మధుపమౌ
                  ర్వీక! నీగుణముల వీఁక సెడఁగ
    నిది సాంకవామోద యిట రాకు శుకవాహ
                  యహహ! నీ యెక్కుడుమహిమ దఱుఁగఁ
    గంటి వింటి వజీర ముక్కంటివింటి
    వంటి సిరులగు నీ మచ్చెకంటి సిరులు

    దంటకుచశైలములు నటువంటివగుట
    నంటరాకుము నీ జన్మమాఱ మార!71

క. అని పలుమాఱున్ మారుం
    గని దూరి యదూరగతినిఁ గనినటు లనియెన్
    వనజారిఁ జీరి యొకసకి
    యనివారణవారణాభయాన ప్రియానన్.72

క. సోమా! సితగుణసీమా
    మా మానినియందు సహజమహనీయదయా
    శ్రీమంతు కెక్కఁజేయుము
    శ్రీమంతుఁడ వొచు వృద్ధిఁ జెందెదు మొదలన్.73

చ. అకట చతుర్థభూతగతి నందినవాఁడు ప్రభంజనుండు ద
    ర్పకుఁడల శంబరాంతకుఁడు పైనిమధుం డొకహీనజాతి వీ
    రికి సరి పాంథవేధ యొనరింతురె యో ద్విజరాజ! నీవు ని
    ల్వక యటుగా సరేకద కళంకయుతాత్మముల నమ్మవచ్చునే.74

ఉ. ఆ గహనాంతరభ్రమణ మందుట నుత్పలసక్తిఁ జెందుటన్
    యోగము భూతభర్త కడనొందుటమై వటయుక్తిఁ బొందుటన్
    హా గణియింపఁగా గ్రహామవౌట నిజంబగుచ న్నిశాట వీ
    వేగతి పాంథవేధ ఘటియింపకనుందువె యొంటిఁ జిక్కినన్.75

క. కప్పింత దోఁప బూడిది
    గప్పిన నిప్పుగతి నీవు గనుపడి పైపై
    నొప్పుచుఁ దపింపఁజేతువు
    చొప్పెఱుఁగక పథికజనులు సొచ్చిన నబ్జా!76

క. చొచ్చి పెడక్రంతలము లో
    మ్రుచ్చిలి మానార్థతతుల ముదితలఁ గొనుచో
    నచ్చందురుఁ డందురె నిను
    మ్రుచ్చుందురుగాక లోకములు రాత్రిచరా!77

క. సహజన్యగ్రోధాంకము
    మహి నుగ్రభవావతంసమహిమయఁ గను నీ
    రహికాలకంసగతి యని
    యహహా నిను హరి హరింపఁడా! కుముదహితా!78

క. అని హిమకరు నని సమయము
    ననుగతిఁ బితృపతినివాస మందుచు మఱియుం
    దను నొక భూతం బనుటనుఁ
    గని పథికుల సోకు నాశుగమునకు ననియెన్.79

క. అనిలా! భవదీయస్థితి
    నని లాభంబేమి యేఁచకంబరమధ్యం
    జని లాభమైనఁ జూడుము
    ఘనలోభము గలుగుచోటఁ గరుణలు గలవే.80

ఉ. కాలసమాకృతిం గనియెఁ గాముఁడు సోముఁడు నా మధుండునుం
    గాలసమాకృతిం గనిరి కానఁ బ్రభంజన! నీవు తద్గతిం
    గాలసమాకృతిన్ లయము గైకొనఁ దద్దిశఁ జేరితో సతీ
    కాలసమాన మంచిది కఁ గాంత ననంతుఁడు ప్రోచు నెంతయున్.81

ఉ. పూని ప్రచేతునిన్ మఱియుఁ బుణ్యజనేశ్వరుజోడు గూడుటల్
    మానియమానుయుక్తి నసమాననిశాటకృశానుసంగతిన్

    మానకనూని మానినుల మానము నొంచితివౌర దక్షిణా
    శానిల! మందవృత్తులకు నక్కట భూరివిచారమున్నదే!82

ఉ॥ హత్తుక ధూర్తుఁడౌ మదనుఁ డంచునుఁ బైఁగనకాఖ్యఁ జెందును
    న్మత్తుఁ డటంచుఁ బర్యయత మాతులుఁ డౌటను వచ్చెఁ జంద్రుఁడీ
    విత్తఱి రాక భీమగతి నేటికి మారుత! ధర్మరాడ్దిశా
    వృత్తినిఁ దండ్రిదౌ వరుస నెంచుక మామనటంచు వచ్చితో.83

కం॥ అని చరదనిలుం దూఱుచు
    ననుచురుఁడై శంబరారి కాసవకరుఁడై
    వనచరుఁడై కాననపత
    దనుచరుఁడైనట్టి మధున కనియె నయమునన్.84

గీ॥ ఘనతరుల డాసి సుమనోవికాసివగుచు
    సురభిచరితంబు గైకొని సరసగతిని
    నురుతరస్ఫూర్తిలొనందు నో వసంత!
    వనవిహృతి పాంథవేధ నీ కనఘ! తగునె.85

ఉ॥ ఈ వనలక్ష్మి నీవెనయ నిందుఁడు నీకలవిందుఁడయ్యెనో
    నీవలనం జనించుటను నీకగుమారుఁడు మారుఁడయ్యెనో
    భావనధర్మపద్దతిని బాంధవుఁ డయ్యెనొ మారుతంబు లే
    కీవిధి వీరి మైత్రి గ్రహియింతె విచారివి నీవు మాధవా!86

కం॥ కూడి ప్రద్యుమ్నుతోడఁ దద్గుణము గనియు
    గంధవహయుక్తిఁ జాపల్యకలన గనియు
    రాజసహితత వికృతి నేర్పడితి మధుఁడ
    యల రజోవ్యాప్తి తగువారినైనఁ జెఱుచు.87

గీ॥ పల్లవస్థితి ననురాగపరత నెసఁగి
    కడులతాంగుల కుసుమసాంగత్యమెనసి
    మధుసమాఖ్యలోనగు జాతివిధుర నీవు
    మాననేర్తువె మానినీమానహృతిని.88

కం॥ మధుకరవృతిచే సుమతతి
     మధు వొనరింపుచును మఱియు మదనుననుగవౌ
     మధుఁడవు పురుష శ్రేష్ఠుల
     మధురోష్ఠుల మది గరంచు మతి నీకరుదే !89

కం॥ శారికమా ! కలహంసకి
    శోరకమా ! పికమ! కిసలచోరకమా యో
    కీరకమా! భ్రమరకమా
    మీఱక మా సకియ తరమె మీరకమానన్.90

కం॥ అని చైత్రాదుల నధ్వగ
     జనజైత్రుల దూఱు వారు సన్నిధి గనున
     ట్లనురాగగతినిఁ దోచిన
     ఘనరాగనిమగ్న యగుచుఁ గామిని యంతన్.91

కం॥ కీరమ్మునకున్ గూయిడు
    శారమ్మునకుం బికోక్తి సారమ్మునకుం
    గ్రూరమ్మగు మరుని శరా
    సారమ్మున కలికి కలికి సైరణలేమిన్.92

కం॥ వెన్నెలచిచ్చున మారుని
    క్రొన్ననగచ్చున విరాళిగొని వెలవెలనై

    కన్నియ పరవశగా న
    య్యన్నులు తన్నారిఁ జేరి యాదరణమునన్.93

కం॥ ఈ మానినిలో మానని
    యా మానసజార్తి మాన నేమాడ్కి శమం
    బే మందునఁ బొందింతుము
    నే మందఱు మని విచారనిహితాశయలై .94

సీ॥ కందర్పరసమునఁ గలికి కూష్మము హెచ్చె
                నష్టమూర్తిహితాప్తి నందరమ్మ
    చంద్రోదయమటన్న సతికిఁ గాఁక యెసంగె
                మార్తాండయోగాశ మనుపరమ్మ
    నవమాలినీవసంతమున శాంతిల దింతి
                మధుసూదననియుక్తి మనుపరమ్మ
    శీతప్రభంజనస్థితి లతాంగి చలించె
                వాతభంజినిఁ గూర్పవలవరమ్మ
    సతియు భావభవాతంకశంకఁ బూన
    స్నేహగతిఁ గాఁచ నెవ్వారిచేత నోపు
    నచ్యుతానంత గోవింద యని తలంచి
    చేరి భవరోగ వైద్యు భజింపరమ్మ.95

వ॥మఱియును 96

చ॥ మదవతికిన్ మధుస్థితి హిమద్యుతిభంగియు మోహదంబెకా
    మదనుని బీజ మట్టిదయ మాటికి వీటికి గంధవాహవృ
    ద్ధిదగి మతిభ్రమవ్యథనుఁ దెల్ప విషంబుగ నాభిగన్నెరల్
    మొదలగువానిఁ బూన్చుటలు మోసమ యీ తిలసూననాసకున్.97

వ॥ అని తలంచి యంత98

చ॥ చివురు లరంటి జంటి పొరచిప్పలు పుప్పొడి తెప్పలెన్నఁ బొ
    న్నవిరులు శైవలంబు సుమనఃస్తబకంబులు పద్మనాళముల్
    నవశశిఖండపాళి నలినంబును గల్వలు చల్వ లీయ న
    య్యువిదకు నంగసంగతుల యోగ్యగతిన్ ఘటియించి రంగనల్.99

గీ॥ అటుల ననుఁగుకాంత కనుచారికలు గొంత
    శీతలములు గూర్చి సేదఁదేర్చి
    యుపచరింపఁ దేఱి యొకదారి మరుబారి
    నందు నిందువదన కనిరి సఖులు.100
.
సీ॥ మకరకేతనుఁడన్న మదిఁ బెట్టనేటికే
               మకరభేదనుఁడుండ మధురవాణి
    క్షణదాచరుఁడటన్నఁ గడుకలం కేటికే
               క్షణదాటహరుఁడుండ జలదవేణి
    చటులానిలమటన్నఁ జలియింపనేటికే
               చక్రినామకుఁడుండ జలజపాణి
    మధుసమయంబన్న మఱి భ్రాంతి యేటికే
              యల మధుద్విషుఁడుండ నలరుబోణి
    సుకరశుకవిక శారికానికరముఖవి
    హాయసములన్న వ్యర్థ ప్రయాస మేల
    పతగనాథాంకుఁడుండ లోఁబడక యున్నె
    విభునిఁ బ్రార్థింపు మిందిరావిభుని శుభుని.101

ఉ॥ ఆ హరికిం గుమారుఁడగు నంగన మారుఁడు చంద్రుఁడందమా
    యా హరి చిత్తవృత్తిదగు నా హరి ప్రాణహితంబు మారుతం

    బాహరికిన్ వసంతుఁడు శుభాంగవిభూతి నెసంగువాఁడు నేఁ
    డాహరి ప్రేమ గల్గ భయమందఁగనేటికి నిన్ను బోఁటికిన్.102

కం॥ అని చెలులాడు ప్రియోక్తులఁ
    దనదు ప్రియోక్తులును దోపఁ దరుణి ముదితగా
    మన శుక మినసుకరాగతిఁ
    గని వచ్చు నటంచు మఱియుఁ గామినులనుచోన్.103

చ॥ తెలతెలవారవచ్చె శశితేకువలేకువగాంచి తారకల్
    వెలవెలఁబార విచ్చెఁ దగువీక్షలఁ బక్షులు వృక్షశాఖలం
    బిలవిలఁజేరఁజొచ్చె రవిబింకము పొంకము నంకురింపఁగాఁ
    గలకలలూర హెచ్చె జిగికమ్ములు తమ్ముల కిచ్చె నత్తటిన్.104

వ॥ అంత 105

సీ॥ ఉభయదిక్కాంతాముఖోదారకర్పూర
               కాశ్మీరతిలకపంకంబు లనఁగ
    శైలద్వయీసాను సంకీర్ణపున్నాగ
               కంకేళిసుమగుచ్ఛకంబు లనఁగ
    నుత్తుంగనగశృంగయుగళీమిళచ్ఛిలా
               ధాతుగైరికవెళత్కాంతులనఁగ
    సమయాధికారిపార్శ్వద్వంద్వసందీప్త
              ధవళారుణాతపత్త్రంబు లనఁగ
    నాథసమ్ముఖులగు వరుణాని శచియుఁ
    గీలుగంటుల వజ్రాల కెంపుఱాలఁ
    బేర్చి తార్చిన రేకడబిళ్ళలనఁగ
    నస్తగిరిఁ జంద్రుఁ డుదయాద్రి నర్కుఁ డలరె.106

కం॥ గగనాబ్ధి నడఁగు బుగ్గల
    పగిది నుడుల్ సడలె దిశలు ప్రతిభాదశలం

    దగియెఁ బ్రసరించే శిశిరా
    శుగములు కోకముల కెసఁగె సుఖపాకంబుల్.107

సీ॥ నిడుదకన్నుల నింపు నిద్రమంపులు మీఱఁ
                 బలుగెఱల్ మోవుల పచ్చిదేఱ
    వీడినతురుముల విరిసరంబులు జాఱ
                మేతావిచెమట క్రొమ్మిసిమి యాఱఁ
    దడఁబడునడల తత్తరము బిత్తరమూఱ
               నెదలపైఁ గదలి పయ్యెదలు జాఱ
    సురతంపుచిన్నెల సొంపులు వెలిపాఱ
               మోముల బడలికల్ ముద్దుగాఱ
    నప్పు డెవ్వరు సూతురో యను రయమునఁ
    బట్టి నీరొల్కు చేగిండ్లుబడక యిండ్లు
    వెడలివచ్చు విలాసినీవితతి చూడ
    ముచ్చటలొనర్చె రసికసమూహములకు.108

వ॥ అంత 109

కం॥ ఆవేళకు సకు లా రా
జీవాక్షి యొకింతఁ దెలిపిఁజెందిన మనకీ
దేవుఁ డినుండే హరి యని
భావించిరి మఱియు భద్రభావము గనుచున్.110

సీ॥ చెలి ననంగుఁడు దనవలెఁ జేయఁదలఁచెనో
              యంతంతఁ గృశమయ్యె నంగలతిక
    సతి సితాంశుఁడు నిజస్థితి జేయఁదలఁచెనో
             ప్రబలె బంగరుమేనఁ బాండిమంబు

    అనిలుఁ డంగనఁ దనయటు జేయఁదలఁచెనో
                తెరువనక కెందేనిఁ దిరుగఁగోరు
    మధు వాత్మవృత్తి భామనుఁ జేయఁదలఁచెనో
                మదిలోన నేవేళ మఱపు హెచ్చె
    వనవిహగరాజి సకిఁ దమవలెను జేయఁ
    దలచెనో వనవాంఛ లోఁదలఁచు ననుచుఁ
    గేళివనకేళి వలయుఁగాఁబోలు ననుచుఁ
    వనిత నెచ్చెలు లమ్మ రమ్మనుచుఁ బ్రీతి.111

చ॥ జిలుగుపయఁట నంటి వలఁజిక్కిన జక్కవదంటనా విభా
    సిల గుభళించు నున్ బసపు సిబ్బపు నిబ్బపు టుబ్బుగబ్బి గు
    బ్బల పెనుముమ్మరమ్మునకు బాళికిఁ జాలక కౌనిటట్టు బి
    ట్టులికి పడన్ వడంకఁజను నుగ్మలిఁ దోడ్కొనిపోయి రయ్యెడన్.112

వ॥ ఇట్లు చని యవ్వనిత లనితరప్రచారంబగు నవ్వనసంచారంబున
    సతులగుటఁ దమకు వనదేవత లాచరించు నుచితో పచారంబుల గతుల
    నతులలతాప్రతాననీవితానంబులు వినూతన నికేతనంబులునుఁ గుసుమ
    విశేష విశీర్ణధరాగతసరాగ పరాగంబులు నూత్నంబులగు రత్న
    కంబళంబులును, మరుత్పరంపరలందరలు కప్పురంపుఁదెరలు
    దెరలును, నుపరితలపరీత ప్రనూనసంతానంబు వితానంబును, సమీప
    దీపిత నీపకళికలు దీపకళికలును, పరిసరస్యందిమరందరసప్రసారంబు
    పాద్య నీరంబును, పాటలకుటజకుట్మలావళిత పత్రపుటపాత్రిక
    లారాత్రికలును, పరిపాకపతిత శశికాంతఫల కాంతరఫలనికాయంబు
    లుపాయనంబులును, శుకముఖశకుంతకలకలంబు వంది బృందాకలనం
    బుగా నృపథవనంబు ననుకరించుచు నుపవనంబున విహరించు. 113

సీ॥ మాధవస్థితి యిది మాధవస్థితి యని
                 కలిసి వర్తిలు నొక్క కలికికొమ్మ
    మాకందములు నివి మా కందము లటంచుఁ
                గ్రీడించు మఱియొక కీరవాణి
    మాధవళంబిది మాధవళ మటంచుఁ
                 బాడుచుఁ జను నొక్క భ్రమరచికుర
    నారంగములు నివి నా రంగములటంచు
                 నాడు వేఱొక మయూరాభవేణి
    మదను భావమునకు దాపు మరువమిదియు
    మదనుభావమునకు దాపు మరువ మనుచు
    నొక్క కలకంఠి యాస్వాద మొనరఁజేయుఁ
    జెలులు విహరించుతఱి వనస్థలముఁ జేరి.114

మ॥ తమ బింబాధరసామ్య మొందు ననుచున్ ద్రాక్షాఫలచ్ఛాయలం
    దమ వక్షోజసమంబులౌననుచు నంతం బాఱి జంబీరముల్
    దమ చంచచ్చుబుకాప్తి నందుననుచందాలన్ రసాలంబులన్
    రమణుల్ గోసిరి లో సహింపని మనోరాగంబు వే కన్పడన్.115

చ॥ సుకరగృహీతకాండమయి సొంపుగఁ బల్లవపాళి కొమ్మకొ
    మ్మకు ఘటియింపసాగి ధృతిమై నలరందగి యంతటన్ ఫల
    ప్రకరము నందుచుం జెలువు రంజిల నొక్క రసాలశాఖికై
    యొక లతకూన దా సుఖనియుక్తిఁ జివుక్కునఁ బ్రాకె నత్తఱిన్.116

కం॥ సతులు విలాసకళారస
    వతులు కుసుమతతులు గోసి వనసంగతులం
    బతికై శరములు గొనియెడి
    రతులో యన వెలసి రతనురమ్యాకృతలై .117

కం॥ ఖేలనమున సతులు లతాం
    దోళనమున నెగయ సురవధూటులతోడన్
    హేళనమునఁ దగఁ బదయు
    క్చాలనమునఁ గయ్యమునకుఁ గాల్సాచుగతిన్.118

వ॥ అంత 119

సీ॥ పదములనంటకు ముదిత యశోకంబుఁ
               దిలకించి చూడకు తిలక మతివ
    చేరి భాషింపకు చెలికకర్ణికారంబు
               సింధువారము నిఃశ్వసించ కబల
    బాలరసాలంబుఁ గేల నంటగరాకు
              నాతిరో సురపొన్న నవ్వఁబోకు
    కలికి గండూషింపఁగవయకు వకుళంబు
               కూర్పకు సందిటఁ గురవకంబు
    చారయిది పాటఁబాడకు చంపకమిది
    సఖిముఖం బెత్త కీవిట్లు సలిపితేని
    తోనవిప్రసూనము లొసంగు సూనశరుఁడు
    బాణముల జేయునవె నిన్ను బాధ సేయు.120

గీ॥ అనుచు నెచ్చెలి కెఱిగించి యటఁ జరించి
    శయతతుల నేర్చి పుష్పాపచయ మొనర్చి
    చెలువ లొకమంచి చల్లని కొలను గాంచి
    యచటి కేతెంచి క్రీడింప నభిలషించి.121

కం॥ సారసముఖభావంబుల
    సార సముఖు లపుడు కేళి సలిపిరి తత్కా
    సారమునను లసదమృతా
    సారమునను సరసతరవిసారమున నొగిన్.110

గీ॥ ఆ భువనకల్పితక్రీడ నబ్జభవవి
    కాసములు కేశవేశసంగతులఁ దగియె
    నాభువనకల్పితక్రీడ నబ్జభవ వి
    కాసములు కేశవేశసంగతులఁ దగవె.123

కం॥ జలములు గ్రహించి మించిన
    జలదములనఁ గొప్పు లచటి చంచలలన వా
    రళికఫలకముల నలఁదిన
    హలదీనవదీప్తు లలరె నా జలకేళిన్.124

సీ॥ చికురశైవాలంబు సుకరాక్షిమీనంబు
                వదనపాణిపదాంకవారిజంబు
    గళశంఖ మధరకోకనదప్రభాస్పూర్తి
                 రదమౌక్తికము భుజారసిక బిసము
    స్తనరథాంగము కటీసైకతంబు వళీత
                రంగంబు నాభికా భమము రోమ
    రాజిక్రమేందీవరము నూరువారీభ
               కరము జానువరాటికాతలంబు
    ప్రపదకమఠంబు గుల్ఫనీవారగర్భ
    సురుచిరముగ నలంకార నిరతి నెఱుపు
    లీల నేకిభవింపుచుఁ గేళి సలిపె
    సరసుల నెసంగి పద్మినీసముదయంబు.125

కం॥ అంబరవలగ్న లంతట
    నంబరములు కటి ఘటించి యట విమలవిభా
    డంబరములఁ బులుగడిగిన
    శంబరహరు శరములన నెసంగుచు మఱియున్.126

కం॥ మనమొక దేవునిఁ గొలుతమె
    వనితా! యన నా లతాంగి వారలతోడన్
    మనకొక దేవుఁడు గలఁడే
    మనసిజజనకుఁడె కాక మాన్యుండనినన్.127

కం॥ లాలసమున మృదులాలస
    బా సమీరములు దోడుపడఁ గేళివనిన్
    బాలికను నిలిపి వలపుల
    మూలమగు రసాలసాలమూలవితర్దిన్.128

సీ॥ హరి యని శౌరి సంప్రార్థింత మందమా
               యది సమీరుని నామ మతివలార
    యల విధుండని శౌరి నర్చింత మందమా
               యది నిశాపతినామ మతివలార
    ప్రద్యుమ్నుఁడని శౌరిఁ బలుకుద మందమా
               యది మన్మథుని నామ మతివలార
    మాధవుండని శౌరి మది నెంతమందమా
              యది వసంతుని నామ మతివలార
    కాన ఫణిశాయిని నిశాటమానమథను
    మదనహరసఖు మధువైరి మహి గణించి
    యంచితస్థితిఁ గాంచి సేవించినంత
    వీరి మదములు వదలు వేర్వేఱ ననుచు.129

ఉ॥ శ్రీరమణీయతం దనరి క్షీరపయోనిధిఁ బోని యొక్క కా
    సారవిలాససీమ సిత సైకతమై తెలిదీవిఁబోని వి
    స్తారసమేతశీతసికతామయవేదిక దివ్యకల్ప మం
    దారతరుప్రతానసుమనః కమనీయత బొల్చునొక్కచోన్.130

కం॥ మణిగణకిరణగుణారుణ
    ఫణిభోగఫణాళి నెనయు ప్రసవాస్తరణాం
    గణమునఁ దృణఘృణియుతమగు
    శణహరిణమృణాళనాళచత్వరవసతిన్131

కం॥ జోకం గొజ్జగినీటం
    జేకొని పుప్పొడియరుంగు జేసి యచట నా
    శ్రీకాంతుని నొక తామర
    రేకున లిఖియించి కస్తురింజలి చెలియల్.132

గీ॥ హరికి దాపల శ్రీదేవి నావహించి
    చేరువ లిఖించి వారి కుమారు మారు
    సరతిఁ బూజింపఁ గమ్మఁదెమ్మెరలు వీవ
    ఝల్లురని క్రొవ్విరులు రాల సకియ లలరి.133

కం॥ హరి పువ్వులు రాల్చెఁగదే
    పరఁగు శుభంబింక మనకు బాలిక యనుచో
    నరుదెంచి దివ్యకీరము
    పరమానందంబుతోడ భద్రకు ననియెన్ .134

కం॥ నీ కథ సువసువ విని తాఁ
    గేకయనాథుండు దృష్టకేతుఁడు నాతో
    నో కాంతా! యింతక ము
    న్నేకాంతముగాక పలికె నింతి వినంగన్.135

కం॥ ప్రాయపుసిరి మన భద్రా
    తోయజముఖియందు వింత దోచెను సరిగా
    నాయిక కనురూపంబగు
    నాయకు నేర్పఱపు కీరనాయక! యనుచున్136

వ॥ అనిన నేనునుం గొంత విమర్శించినట్లుండి యిట్లంటి.137

మ॥ ధరణీనాయక! నాయకుండన యదూత్తంసంబె కాకన్యులె
    వ్వరు మీరక్కమలాంశఁ గాంచనగునవ్వాల్గంటికిం గంటికిం
    గర మానందమొసంగుఁ జూడ హరి శృంగారాంగముందుల్య మి
    ర్వురకున్నేనునుఁ జూచినాడ హరి మీరుంజూచినారే కదా !138

కం॥ చతురతయు గభీరతయున్
    ధృతియు మతియుఁ గులము బలము హితమున్నతమున్
    రతిపతిఁ గేరు నొయారము
    పతగధ్వజు నందెకాక పరులకుఁ గలవే.139

చ॥ అది యటులుండెఁ జుట్టరికమా కడు దగ్గర లాఁతిజాగగా
    దది వసుదేవుచెల్లెలు గదా శ్రుతకీర్తి భవద్వధూటి యి
    మ్మదవతి మేనయత్త వనమాలికిఁ గావున మీర లిర్వురున్
ముదమునఁ గన్న కన్నియను ముఖ్యము శౌరికొసంగ భూవరా!140

కం॥ మీ కేయరిగలఁడాతఁడు
    మీకేయరిబెట్టు చక్రిమిత్రత నదియుం
    గాక మదిఁ దెలిసి చూచిన
    నా కన్నియ కతనియంద యాసక్తి సుమా!141

గీ॥ మఱియుఁ గోరుచుండు మనభద్రమదిగదా
    మాధవునకెనైన మంచిమగని
    మఱియు గోరుచుండు మనభద్రమదిగదా
    మాధవుండ కలుగ మంచిమగఁడు.142

కం॥ అన నృపుఁడనియెన్ హరి నే
    వనిత వలచు నదియ మనకు వాంఛితమైనన్

    వినఁగా నిది నృపధర్మం
    బనఁగాఁ జాటింత మిల స్వయంవర మనఘా!143

కం॥ అనినన్ మీ జననియు నే
    ననుమోదిల్లితిమి నీకు నాశుభవార్తల్
    వినిపింపవచ్చితన న
    వ్వనితయుఁ భీతిల్లి నిజనివాసముఁ జేరెన్ .144

ఉ॥ అంతటఁ గేకయక్షితితలామరభర్త సువార్తగా జగం
    బంతయు సంతసిల్లఁగ నిజాత్మజకైన స్వయంవరోత్సవం
    బెంతయుఁ జాట సర్వధరణీశకుమార సభాంతరాళికిం
    బ్రాంతజనాళిఁ బంచి చతురంతపరీతధరిత్రి నంతటన్.145

చ॥ పురము నలంకరించి తగు భూషణముల్ వసనంబులుండఁగా
    నిరవులు నన్నపానముల కష్టపదార్థము లెంతయే సుగం
    ధరసము నాగవాసములు ద్రవ్య మనేకము వాద్యభేదముల్
    దిరములుగా నొకొక్క విడిదిం బతి బూనిచె వచ్చువారికిన్.146

చం॥ పఱపుగఁ దోచు నొక్కపురబాహ్యతలో పవనాంతరంబునం
    దిరుదెస జాలువాఱు పనులెంతయు వింతలుగా వెడల్పునై
    కుఱుచలుగాక సొంపులొనఁగూడఁగ మంచెలు బూన్చె రాజు త
    త్పరత స్వయంవరోచిత నృపాలకుమారులు కొల్వు గూడఁగన్.147

వ॥ ఇట్లనేకవిధంబులం గేకయేంద్రుండు నిజనందనోచిత
    స్వయంవర మహోత్సవం బొనరించుచుం దత్సమయంబున.148

కం॥ ఆ రీతి వార్త లనిచిన
    నా రాజసుతాస్వయంవరార్థము సకల

    క్ష్మారమణకుమారకు లటఁ
    జేరిరి కడు వింతవింతశృంగారములన్.149

కం॥ బంధులు ప్రియబంధులు నయ
    సంధులు బహుసుగుణరత్నచయ సింధులు సం
    బంధులగు దేశదేశపు
    సంధులఁ గల రాజసుతులు సనుదేఱంగన్.150

గీ॥ లేమ కుంతిచెల్లెలి తనూజయౌటను
    వావిగనియుఁ గేకయావనీశు
    వరుస దగునటంచు సిరిమదంబున దుష్ట
    యుక్తి వచ్చె నా సుయోధనుండు.151

వ॥ తదనంతరంబున152

చం॥ హరిఁ గనుఁగొన్నకన్యకయు నన్యులఁగోర దవశ్యమా స్వయం
    వరమున కమ్మురారియును వచ్చును మేనమఱందలీ సుధా
    ధర తన కౌనటంచుఁ దమ తల్లికిఁ జెల్లెలిబిడ్డయైన సో
    దరివిభవంబుఁ జూడఁజనెఁ దమ్ములతోడుత ధర్మసూతియున్. 153

ఉ॥ వచ్చినరాజులందు బలవంతుఁడు రూపరి కౌరవేశ్వరుం
    డిచ్చ వరించు నానృపతినే చెలి యంచు మనంబునందుఁ బె
    న్ముచ్చటఁ దల్లి చెల్లెలితనూజ వివాహశుభంబుఁ జూడగా
    వచ్చిరి దంతవక్త్రుఁడు నవార్యగతిన్ శిశుపాలుఁ డెంతయున్.154

కం॥ అందధికులు కురుపతియు ము
    కుందుం డిందొకరి సకియ గోరు ననుమదిన్
    విందానువిందు లరిగిరి
    విందగు మాతృష్వసేయి విభవముఁ జూడన్.155

ఉ॥ ధీరుల నుగ్రసేనవసుదేవుల మాధవుఁడాదియౌ యదు
    క్ష్మారమణాగ్రగణ్యులను మత్ప్రియబంధులఁ దోడి తెమ్మనం
    గీరము సేరి ద్వారవతిఁ గేకయుపంపు నెఱుంగఁజేసినన్
    శౌరియు వృష్ణిభోజయదు సంతతిరాజుల కేర్పరించినన్.156

కం॥ హరి కా సతిపై మతిగల
    వెర వెఱుఁగుట బంధుమిత్రవిధములను స్వయం
    వరణేచ్చ దక్కి వచ్చిరి
    హరితోడం గొలిచి యాదవాదినరేంద్రుల్.157

కం॥ అపు డాగతి విపులాకృతి
    నృపు లాదృతి నేఁగుదేఱ నెదురుకొని కృత
    స్వపురావృతిగాఁ గేకయ
    విపులాపతి వారి నునిచి వేర్వెఱనంతన్.158

కం॥ మంచెలపై నృపనందన
    పంచాస్త్రులనుంచి మఱియు బంధుజనుల క
    య్యంచుల నుచ్చస్థలులీ
    క్షింప నియోగించి దృష్టకేతుఁడు ప్రీతిన్.159

కం॥ మెఱుఁగునకు మెఱుఁగుబెట్టిన
    సిరితనయం గ్రొత్త క్రొత్త శృంగారములం
    బరగించి కేకయేంద్రుఁడు
    కరుణారస మొలుకఁ జిలుకఁ గని యిట్లనియెన్.160

చ॥ అతిసుకృతోచితస్థలమునందు శుకద్విజజన్మ మంది భా
    రతికడ వృద్ధిఁ బొంది మఱి బ్రహ్మకడం గళ లెల్లఁ జెంది య
    చ్యుతుకృపఁ బేరునొంది సుగుణోన్నతిఁగన్న వివేకి వీవు మ
    త్సుతకు హితుండవౌట శుభసూచితభాగ్యముగా ఖగాగ్రణీ!161

కం॥ కావున మా వనజానన
    కీ వనధిపరీతభూతలేశకుమార
    శ్రీవిభవనామరూప
    ప్రావీణ్యము లేర్పరింపు పతగకులేంద్రా!162

గీ॥ అని నృపతి వల్క రాచిల్క నెనరుఁ జిల్క
    మోముపై నవ్వు దొలఁక సమ్మోదపులక
    తిలకితాంగంబుతోఁ జాల ధీవిశాల
    ఫణితి సతిఁ గాంచి యిట్లనుఁ బ్రౌఢి మించి.163

కం॥ పురుషోత్తముఁడై సముఁడై
    సరసుండై మరునిగురుఁడె సరి చెలువమునన్
    ధర నీ విభుఁడనఁగాఁ దగి
    గుఱియగు మంచివరు నేఱుకొమ్మా కొమ్మా!164

కం॥ ఒకమాఱు రెండుమాఱులు
    సకియ! కలయవెదకి నీకు సరివచ్చిన శూ
    రకుమారకుమెడ నిడు మని
    శుక మొసఁగెం బారిజాతసుమహారంబున్.165

కం॥ అది మును హరి తనకొసఁగిన
    యది గావున ముదిత ముదితయయ్యెను శుకమా
    సుదతిని రథమున నిడుకొని
    సదయత నృపసుతులఁజేరఁ జనుటయు నంతన్.166

కం॥ భద్రగతి నృపులు గాంచిరి
    భద్రన్ మృదుగమనవిజితభద్రం దనుహా
    రిద్రన్ హరిలక్షితహృ
    న్ముద్రం బరిపూర్ణగుణసముద్ర ననిద్రన్.167

వ॥ ఇట్లు కనుంగొని తమ మనంబుల168

కం॥ నక్షత్రపుఁదునుకో తను
    సాక్షాన్మోహినియొ మరుని సామ్రాజ్యకళా
    నిక్షేపమొ లేక మనో
    విక్షేపమొ కాక యిట్టి వెలఁదుక గలదే!169

కం॥ అనుచున్ రాసుతు లా సతిఁ
    గనుచుం దమిఁ బెనుచు కోరికల వివశములౌ
    మనసుల నొకరీతి ధృతిన్
    మనుచుచు నిట్లుండి రంత మది ముద మొదవన్.170

సీ॥ వలపైనదానిఁ గల్వలఱేని వలఱేని
                 కులమానినుల నవ్వు చెలువుదానిఁ
    గుదురైనదాని నిగ్గుల పెంపుగల కెంపు
                 బలుసొంపుగల మోవికలిమిదాని
    నొఱపైనదానిఁ దొల్కరిమించు సరిమించు
                సిరిసంచుగను మేని మెఱుఁగుదాని
    సొగసైనదాని మెచ్చులఁ దొల్కుఁ నెలతళ్కు
                 గళఁజిల్కు నగుమోముతెలివిదాని
    మొలకనవ్వులదానిఁ జెన్నొలయు గబ్బి
    గుబ్బపాలిండ్లగవ నీటు గులుకుదాని
    రూపయౌవనములతీపుఁ జూపుదానిఁ
    గేకయకుమారి భద్ర నీక్షించె శౌరి.171

కం॥ శుకము వచించుటకన్నన్
    సుకరంబగు చిత్రపటముఁ జూచుటకన్నన్

    శుకవాణిఁ గాంచి కనకాం
    శుకుఁ డెంతయు నెమ్మనంబు సోద్యము నొందన్.172

చం॥ మలయుబ్రమోదమూరి పలుమాఱిటు గూరిమిమోముదారియీ
    కలికికి వారిజారియనుకారి కుచప్రకటారి ప్రాయపుం
    గలిమి కొటారిదేకద జగాజిగిపైడిపెటారి మారు చే
    నలరుకటారి యంచు శకటారి నుతించు మిటారి మించుగన్.173

కం॥ అవురా యనుఁ గ్రొమ్మెఱుఁగుల
    నవురా యను మేనితళుకు నవురా తొవరా
    సవురా యను ముఖరుచి వా
    సవురాయను నెఱుల సిరుల సవరణ సతికిన్.174

కం॥ చిలుకో పరువపుమరువపు
    మొలకో మరుచేతిపూవుములికో మెఱుగుం
    దళుకో జీవపుఁజిత్తరు
    పలకో యీ కలికిఁ దెలియఁబలుకం దరమే!175

కం॥ చికురములా హరినీలపు
    నికరము లా యింపుసొంపు నింపు ముఖరమా
    ముకురమ రదనాంశుకమా
    శుక మాసింపనగు ఫలము సుమ్మీ చెలికిన్.176

గీ॥ ఈ సునాస జిగింబైడిజేసునాస
    యీసురాగ కుచోన్నతియేసురాగ
    మీసుమాలిని నఖపాళియాసుమాలి
    యీసువాసిని మోమిందుబో సువాసి.177

కం॥ గిండ్లో సంపఁగి పూవుల
    చెండ్లో మరుచేతి పుట్టచెండ్లో వలపౌ
    నిండ్లో పసినిమ్మజగా
    పండ్లో తెలియంగ బాల పాలిండ్లు భళీ!178

చం॥ పగలొగిఁగాంచి తావికలభావము గైకొనెఁ గైరవంబు రా
    జగతిని హెచ్చఁబూని జలజాతము గుందె విశేషమైన లీ
    లఁ గనఁగఁబూని మీన మవలం జనె నీ సతి నేత్రసన్నిధిం
    దగునె సుదృక్సమాప్తిఁ గుముదంబునుఁ బింకజమున్ విసారమున్.179

కం॥ సుదతీరుచిరాధరమా
    సుధతీరు సుమా శుభాంగశుకరతఁ గను నా
    మదనాగమసంపద యీ
    మదనాగమనోజ్ఞయానమై సిరి దలపన్.180

గీ॥ ఇందునందుఁగందు పొందమ్మి విరియందు
    ముందుముందు రజము ముకురమందుఁ
    జెందు కసటుమందమందమేమందమీ
    మందగమన మోమునందు సమము.181

ఉ॥ కౌనున కౌ నభంబు సరి కావిజగావిలసిల్లు మోవికిం
    పానఁగఁ బానకంబు సమమానన మా ననవిల్తు మేనమా
    మేననమేననంగనకమేననమీనన కన్గవందగున్
    వేనలి వేనలిన్ విరులవేయుసువే యువతీమతల్లికిన్.182

సీ॥ దొరసెఁబో యీ చాన గురుకుచద్వయమాన
                    రైవతకాద్రి దర్శనఫలంబు
    నెనసెఁబో యీ రామ తనులత నంటఁగా
                  నారామలతలఁ జేనంటుఫలము

    నలరెఁబో యీ బాల యధరంపురుచిఁ గ్రోల
                సహకారఫలరసాస్వాదఫలము
    కలిగెఁబో యీ కల్కి పలుకులాకర్ణింప
               జిలుకతో గోష్ఠిఁజేసిన ఫలంబు
    తనరెఁబో దీని పరిణయోత్సవ మొనర్పఁ
    దరుతతి కొనర్చు పరిణయోత్సవఫలంబు
    మంచి శుభసూచకములు ఫలించకున్నె
    యంచచేజేతనంచు వర్ణించి శౌరి.182

కం॥ చిలుక కొరులు నేర్పిన పలు
    కలరి వినం బ్రియమొనర్చునట యీ చెలికా
    చిలుకే నేర్పినదట యా
    పలుకులు వినఁ బ్రియము గాదె పలుమఱు జగతిన్.182

కం॥ అని మాధవుఁ డీవిధమునఁ
    దన భావమునన్ గణించి తరుణిం గరుణిం
    చినఠీవిం గను వావిం
    దన దేవిం గాఁగనెంచెఁ దగ నాలోనన్.182

వ॥ అంతఁ దనంత శుకశకుంతంబు విదితవృత్తాంతంబయ్యునుం గొంత
    వాగ్వినోదంబు సలిపెదంగదా యని యా రాజతనూజకు నా రాజ
    తనూజుల యనురూపరూపనామవిభవంబులు వేఱువేఱు నేఱుపఱుపం
    దలంచి యుత్సాహంబుతో నిట్లనియె.182

సీ॥ కాశకరూశకురూశరాజులు వీర
                  లాశాంతవిఖ్యాతి నలరువారు
    మాళవమాగధమత్స్యరాజులు వీర
                  లాదిమాభ్యుదయంబు నమరువారు

    చోళనేపాళబంగాళరాజులు వీరు
               పృథుల శేఖరరూఢిఁ బెనుచు వారు
    గాంధారగజపతి గౌళరాజులు వీర
               లసమాగ్రగస్ఫూర్తి నెసఁగువారు
    శూరసేనసురాష్ట్రసువీరసుబల
    సుప్రసిద్ధప్రభావయశోవిభూతి
    సుముఖత నెసంగు రాజులు సుమ్మువీరు
    వీరిఁ గనుగొనుమా శరన్నీరజాక్షి!187

కం॥ కరహాటులు మరహాటులు
    మెఱయఁగఁ గాంభోజభోజమిత్రసుమిత్రుల్
    మఱి కొంకణటెంకణు లన
    వరుసం జంట దగుసిరులవారిం గంటే!188

కం॥ ప్రతివింద్యున్ హృతమాంద్యున్
    ధృతినంద్యున్ నృపతివంద్యు దేవప్రస్త
    క్షితిపతి సేనాబిందుం
    దతసేనాబృందుఁ గనుము తామరసాక్షీ!189

కం॥ మాహిష్మతీపురీపతి
    హైహయుఁ డవ్యయసమృద్ధి నలరారు గుణ
    గ్రాహియగున్నీలాఖ్యను
    దాహృతుఁ డీ భూపరమణి నరయుము రమణీ!190

కం॥ కుల్యున్ శుభగుణగణసా
    కల్యుం గృతమద్ర విషయకల్యున్ ధృతనై
    ర్మల్యున్ సురపతితుల్యున్
    శల్యుం గను మహితహృదయశల్యుం దన్వీ!191

గీ॥ చారుభూరిక్రియాఢ్యుఁ బాంచాలుఁ జూడు
    నవ్యమాధుర్యశాలిఁ బౌండ్రకునిఁ గనుము
    సంగతఫలాతివిబుధుఁ గాళింగు నరయు
    శివచంత్రుఁ గాశీశు నీక్షించు మబల!192

కం॥ అరయుము కమలాంశభవా
    పరమగభీరగతి సింధుపతిఁ గురుభూతిన్
    మఱియును ధరఁగల రాజుల
    గరిమలు గను సహజభావకలనన్ లలనా!193

కం॥ కురుకులులు భూవిముఖ్యులు
    గరిమం గను వీరి భరతఖండవిభుండీ
    గురుమతి యని కురుపతి సో
    దరయుతునిగఁజూపి శుకము తరుణికి ననియెన్,194

గీ॥ హస్తిపురభర్త యీతండు నిస్తులమగు
    నిస్తుల ప్రశస్తి నెసఁగు నో సింహమధ్య
    భోగికేతనుఁ డత్యంతభోగి మఱియు
    బాగుగాఁ జూడు మీ ఱేని బర్హివేణి!195

కం॥ అని వీర లాదియగు న
    జ్జనపాలురఁ దెలిపి వారి సౌఖ్యాదులు బే
    ర్కొననూఱకున్న సతిఁ గని
    చని శుక మవల నొక నృపతిసభఁ గని యచటన్.196

గీ॥ ఏకశతసంఖ్య గల యదువృష్ణిభోజ
    మధుదశార్హాదివంశసంభవులఁ జెప్పి

      యవల బలకృతవర్మసాత్యకుల నెన్ని
      యంతట శుకంబు హరిఁ జూపి యతివ కనియె.197

సీ॥ కలితసుధాంశు రేఖాచాకచక్యంబు
                    నుదురుగాఁ గొనని నెన్నుదురువాని
      శరదరవిందసుందరదళంబులకన్నఁ
                 దళతళాయించు నేత్రములవానిఁ
      గళ లీను హరినీలఫలకమ్ముల హసించు
                   తళుకెక్కు చెక్కుటద్దములవాని
      వరుకొల్వకూటంబుమాడ్కి విస్తృతమై మ
                  హోన్నతశ్రీఁ బొల్చు నురమువాని
      హారకేయూర మంజీరచారుకటక
      మకుటకుండలనిగనిగల్ మలయువానిఁ
      బ్రియగుణసహిష్ణు యాదవాన్వయచరిష్ణుఁ
      గృష్ణు రోచిష్ణుఁ గనుము రాకేందువదన!198

కం॥ అనుచుం జెప్పియుఁ జెప్పక
      మునుపే హరిఁ గనదలంచు ముదితయు ముదితం
      గనఁదలఁచు హరియు నిరువురి
      నెనరులు నేకీభవించి నెమ్మది పొదలన్.199

కం॥ ఇరువురు నిరువురి చూడ్కులఁ
      జురచురఁ గన రాగశిఖలఁ జూపు శరములన్
      మరుఁ డెంత భావవేదియొ
      హరిహరి యెద గాఁడనేసె హరినిం దరుణిన్.200

వ॥ అంత201

గీ॥ మహి విరాజరాజమధ్యంబునను హేమ
      దీప్తవాసు వాసుదేవుఁ గాఁగ
      నెఱిగె నంత నంతరితగాఁగ విస్పూర్తి
      హితశుకైక కైకయేంద్రతనయ.202

కం॥ మునుఁగోర్కిగన్న చూడ్కులు
      కనుఁజూడ్కులకన్న హృద్వికాసము హృదయం
      బునకన్న మున్న భావము
      జని శౌరిం గలయఁదివురు సతి కవ్వేళన్.203

కం॥ కీరము సెప్పిన మాటలు
      శ్రీరమణుం జూచు తనదు చిత్తముతేటల్
      మాఱాకులెత్త నత్తఱి
      మారాకుల యగుచు మగువ మదిలో ననియెన్.204

సీ॥ ఇతని యాకృతికెల్ల నెనగాక చంద్రుండు
                    నెమ్మోము తీరుగా నిలువఁబోలు
      నితని లోచనముల కెనగాక పద్మముల్
                    పదములరేఖలై యొదుగఁబోలు
      నితని దానప్రౌఢి కెనగాక కల్పశా
                     ఖలు కరంబులరీతి మెలఁగఁబోలు
      నితని ధైర్యంబున కెనగాక హేమాద్రి
                     దరితానురఃస్ఫూర్తిఁ దనరఁబోలు
      నౌర ! శృంగారరసములో సౌరు దీసి
      నేర్పున నొనర్పఁబోలు నీనేత ధాత
      లేక యేతాదృశవిలాసలీల గనునె
      దానవారాతి మానినీసూనహేతి.205

వ॥ అదియునుంగాక206

సీ॥ ఈ రమేశు సురంబు గోరాడవలవదె
                     బటువుపాలిండ్ల నిబ్బరము మాన్ప
      నీ విభానిధికిఁ గెమ్మోవి విందొనరింప
                    వలవదే మదిలోని వాంఛ మాన్ప
      నీ మనోహరుని మో మీక్షింపవలవదే
                   తివురుకన్నుల తరితీపు మాన్ప
      నీ శుభాకారు మే నెనయఁ గావలవదే
                  మసలు ప్రాయంపుముమ్మరము మాన్ప
      రతులఁ దేలఁగవలదె యీ చతురచర్యుఁ
      గలసి చొక్కుచుఁ జొక్కించి కళల మించి
      మనసుకన్నును దనియఁగా ననుచుఁ దలఁచు
      వనిత హరిమీదఁ గడలేని వలపుఁ బూని.207

కం॥ వినమో కనమో గుణబల
      ధనమోదాన్వితుల నృపతితనయుల వనితా
      జనమోహనకరుఁడగు నీ
      వనజోదరుఁ బోలఁగలరె వారెవ్వామరున్.208

ఉ॥ కన్నులు పద్మపత్రరుచి గాంచు భళీ! నగుమోము చందమా
      పున్నమ చందమామ పొరపొచ్చెము లెంచు భుజంబులా సిరుల్
      చెన్నగు కల్పశాఖల హసించు భుజాంతరమా రమాభవుం
      డున్న హజారపుంజెలువు నొచ్చెములుంచుఁ గదమ్మ శౌరికిన్.209

ఉ॥ వచ్చినవాఁడు మాధవుఁ డవశ్యము నేనొనరించు భాగ్యముల్
      హెచ్చుగదమ్మ కోరుకొని యీ విభుకౌగిటిలోన నిచ్చనే

      నిచ్చకు వచ్చినట్టు సుఖియించగఁ గల్గెఁ గదమ్మ మున్న నే
      నిచ్చినదాన నా హృదయ మిచ్చక మానక దానవారికిన్.210

కం॥ అవురా హరి నన్నేలిన
      దవురా సౌఖ్యముల నొకటఁ దక్కువ లేకం
      జివురాకుకటారిదొర
      న్నవురా వివరింప శౌరి నవురా యనుచున్.211

కం॥ ఇటు లా కుటిలాలక యట
      నిటలాంబకమిత్రు వికచనీరజనేత్రుం
      బటులాలసఘటనావశ
      చటులాశయ యగుచు వినుతి సలుపుచు మఱియున్.212

చ॥ మును హరిఁ గాంచి సిగ్గునను మో మరవాంచి భ్రమించి తేర్కొనం
      దన కుచమధ్యహారమణిదర్పణసీమ రమేశురూపముం
      గని తనివారగా నితఁడకా విభుఁడంచుఁ దలంచునంతలోఁ,
      జని చెలు లామె కోరుకొను సైగఁ గనుంగొని తేరు డించినన్.213

చ॥ ఒసపఱి గబ్బిగుబ్బగవయుబ్బునఁ గౌ నసియాడఁ గ్రొమ్ముడిం
      దుసికి పిఱుందుపై సరులు తుంపెసలాడ బిరాన సిగ్గుతో
      ముసిముసినవ్వు మోముపయి ముచ్చటలాడ రవందెమ్రోతతో
      గుసగుసలాడ నంచగమి గూడఁ జనెం జెలి శౌరిమ్రోలకున్ 214 .

వ॥ ఇట్లు చని215

కం॥ మిసమిసమను సిరు లెసఁగెడి
కిసలయవిసరము హసించుకేలన్ సకి య

      య్యసమశరుఁ గన్న సామికిఁ
      గుసుమముల సరమ్ము నఱుతఁ గూఱిచి యంతన్.216

కం॥ దిగ్గున మఱలి పెనంగొను
      సిగ్గున రథమెక్కి చనియెఁ జెలినగరికిగా
      నగ్గజగామిని మైసిరి
      నిగ్గులగల నృపులమనము నెరనెరబెట్టన్.217

కం॥ మాయలు వన్నెఁగదా నేఁ
      డీ యాదవుఁ డనుచుఁ గనలి నృపతులలో నా
      నాయోధనాథు లయ్యెడ
      నాయోధనబుద్ధిఁ గదిసి రయ్యదువీరున్.218

కం॥ ఇది నృపధర్మము దానే
      ముదితయుఁ గోరుకొనె హరియు ముఖ్యుం డనుచుం
      గదలిరి కొందఱు కొందఱు
      గదిసి రనిం గనలు నిగుడఁగా హరితోడన్.219

కం॥ తరతమవృత్తియుఁ దెలియక
      ధరఁ దమవృత్తియె విశేషతరమను మతిచే
      నురగధ్వజుఁ డురువడిగా
      గరుడధ్వజుఁ దాకె యోధగణములతోడన్.220

గీ॥ అటుల హరిమీదఁ గురువిభుఁ డడర మగధ
      పౌండ్రకకళింగ కాశికాపతులు మఱియుఁ
      దోడుపడునట్టి రాజులు తోడ నడచి
      రాతఱి గజాశ్వరథబటవ్రాత మడరె.221

కం॥ మఱియును శస్త్రాస్త్రగదా
      శరముఖబహుసాధనములఁ జక్రధరుం డి
      ట్టురువడిఁ బొదివిన భ్రుకుటీ
      స్ఫురణ నొకించుక సరోషపూర్తి నతండున్.222

కం॥ తన రథమున సంతర్దన
      జనపతి సారథి నొనర్చి సాహాయ్యముగా
      నని యదుకేకయు లడరిన
      వనజాక్షుఁడు వారివారి వారించి వెసన్.223

కం॥ ఆ యదుపతి మీరెచటికిఁ
      బోయెదరని కదిసి తద్రిపువ్రాతంబుం
      జేయమ్ములఁ గాయంబుల
      గాయమ్ము లొనర్చెఁ జెదరగా నుమ్మలికన్.224

కం॥ హరి యీరీతి నొనర్చిన
      కర మరుదుగ వారి వివిధఘనబల మెల్లన్
      మరుదాశ్రయు హరిఁ దాకెను
      హరిదావృతినంత నాతఁ డతిరయ మొలయన్.225

కం॥ కోపమ్మునఁ జాపమ్మున
      రోప మ్మొనఁగూర్చి వాని రూపఱచి రణా
      టోపమ్మున హరి వారల
      చాపమ్ములు దునిమి విరథశస్త్రులఁ జేయన్.226

వ॥ ఇట్లు నిస్సాధనులైన యోధజనులం దలకడచి యురవణించిన భట
      ప్రపంచంబు ఘటీపంచకంబునం బటాపంచలగుటం గాంచి కాంచన

      పటుండు పంచజనోత్కటుండగుచుం బాంచజన్యారావంబు గావించె
      నయ్యెడ.227

కం॥ వైరులు మఱియుం బురికొని
      తారందఱు పొదువఁ దివుర దామోదరునిన్
      వీరలతో నేమని యదు
      వీరుండొక చిత్రసమరవిరచనబుద్దిన్.228

కం॥ నోవక పోవకయుండఁగ
      జీవకళల్ నిలిపి విగతచేష్టులఁ జేయన్
      భావించి యరుల హరియుఁ గృ
      పావనధి నిజాయుధములఁ బనిచిన నవియున్.229

సీ ॥ చక్ర మందరి కన్నిచక్రంబులై చుట్టి
                     యున్న చోటఁ జలింపకుండఁ జేయ
      శంఖంబు బహుమంత్రశబ్దాళిఁ దనయందఁ
                    గమిచి నిశ్శబ్దంబుగా నొనర్ప
      శార్ఙ్గంబ శస్త్రాస్త్రశరధనుర్ముఖముల
                    జత తనలో నుపసంహరింప
      గదగదాముసల ముద్గరపరిఘాదులఁ
                    దనచేతనె తిరోహితములఁజేయ
      నందకము సైంధవధ్వజస్యందనాది
      బంధనము లూడ్చి సడలింప బవరముననుఁ
      జేయునది లేక రిపులు నిశ్చేష్ట నిలువ
      నంద ఱాశ్చర్యపడఁజేసె నచ్యుతుండు.230

కం॥ ఆ వేళల సంతర్దన
      భూవిభుఁ డా హరిశరాసభూరివిలాస
      ప్రావీణ్యమునకు మెచ్చుచు
      భావమరందిపడఁజూచె బావమఱందిన్.231

కం॥ అంతట హరి సంతర్దనుఁ
      డెంతయు వేడుకొన బంధుహిత మరిధరణీ
      కాంతుల విడిచె ధరాభర
      మంతయుఁ దుదవారికతన నణిచెటివాఁడై.232

వ॥ ఇవ్విధంబున233

సీ॥ విముఖభావంబునఁ గమిచి విదర్భుల
                    నల విదేహుల విదేహుల నొనర్చి
      స్తుతిఘటించిన మాగధుల మాగధులఁ జేసి
                    పాండ్యుల దాక్షిణ్యపటిమ గాచి
      పేర్చి పౌండ్రకులనుఁ బీల్చి పిప్పిరచించి
                     మత్స్యరాజివిసారమతి గణించి
      మొగి నంగవిభులందుఁ దగరమ గ్రహియించి
                     పొదివి కాళింగునిఁ బుచ్చఁజేసి
      సహిపుళిందులఁ గాననచరులఁజేసి
      రహిఁ గుళింగుల నిజపక్షరతులఁజేసి
      భీమయుక్తి నజాతారిధాముఁడగుచు
      మాధవుం డటు విజయసంపద వహించె234

కం॥ అంగభవుల తనయుగ్రత
      కంగభవుల గారవించి యంతట మఱియున్

      సంగరహితులగువారల
      సంగరహితులుగఁ గలంచెఁ జక్రధరుఁ డనిన్. 235

కం॥ మత్సరము వీడి వచ్చిన
       మత్సరణి భజించువారి మన్నన గనుచున్
       వత్సగతులఁ దను డాసిన
       వత్సతతులఁ బ్రోచె భక్తవత్సలుఁ డంతన్. 236

గీ॥ కై కయీభర్తయగునట్టి లోకభర్త
     యాజిఁ బూనిచె నమరవీరారిజయము
     కైకయీభర్తయగునట్టి లోకభర్త
     యాజిఁ బూన్పడె యమరవీరారి జయము. 237

కం॥ ఆ రాజీవాక్షుని దయ
       నౌరా జీవావశిష్టులై నెలవులకున్
       ఘోరాజిపరాజితులై
       యా రాజతనూజు లరిగి రంతట నిచటన్. 238

కం॥ కేకయపతి నిజతనుజకు
       శ్రీకల్యాణోత్సవమ్ముఁ జేయుటకు హరిం
       దోకొని బంధులతోఁ జని
       లోకోన్నతలగ్నమునను లోకంబెన్నన్. 239

కం॥ పురముసిరి మెఱయ శుభపరి
       కర మాదరమున ఘటించి కరము నయమునం
       బరిణయమునకగు విభవాం
       కురసరణిన్ హరినిఁ బెండ్లికొడుకుం జేయన్. 240

కం॥ హరిణవిలోచన లయ్యెడఁ
       జరణమ్ముల వినమదమర సముదయమునదౌ
       శిరసంటిన నెరపంటకు
       శిరసంటిరి ముత్తియముల సేసలు సెలఁగన్. 241

కం॥ మజ్జనమాడెను శారి న
       మజ్జనతాపాపహారి మంగళవిధులన్
       లజ్జావతీకరాబ్జమి
       శజ్జాతిసుగంధగంధిలజలంబులచేన్. 242

కం॥ హేమాంబరుఁడట నవ్య
       క్షౌమాంబరధారి యగుచుఁ జపలాంచితమౌ
       శ్యామాంబుదమన భూషా
       స్తోమంబుల నలరి పెండ్లి సొంపలరారెన్. 243

కం॥ ఆ సమయంబుల సకలవి
       లాసమయంబులగు నిత్యలాలిత్యశుభో
       ల్లాసంబులఁ గల్యాణా
       వాసంబుల భద్ర కైదువలు సవరింపన్. 244

సీ॥ సతికిని శిరసంటెఁ జంద్రరేఖాళిక
                యోర్తుక సస్నేహయోగకలనఁ
      గమలాంశజకుఁ జేసి రమృతాభిషేకంబు
                హేమకుంభంబుల నిభగమనలు
      సరసాంబరస్ఫూర్తి చంచలాక్షు లొసంగి
               రెంతయే నీలాభ్రకుంతలకునుఁ
      గనకాంగి కంగరాగములు గావించిరి
               కాశ్మీరలాక్షాది గంధరచన

      లక్షణోన్నతి బహువిధాలంకృతులను
      నేర్పఱించిరి శుభసదాకృతికి సుదతి
      కాలతాంగి విరులఁ బూన్చి రంచితాళు
      లగరుధూపంబు లెసఁగె నయ్యచలకుచకు. 245

కం॥ ఈ రీతి నచటివా రా
       నారీతిలకము నొనర్చిన వధూవరులుం
      జేరఁగ వివాహవేదిక
      వారక శోభనవిశేషవాద్యము లొలసెన్. 246

కం॥ ఆలోఁ జనవున హరితో
       నాలోచనసేసి కీర మాలోలవినీ
       లాలోకనానుమతిచే
       నాలోకంబునకు మఱియు నరిగి రయమునన్. 247

కం॥ శౌరికిఁ గేకయరాజకు
       మారికిఁ బరిణయ మటంచు మదిరాదెలుపన్
       శ్రీరమణికీరమణిఁ గని
       యా రమణి నిజాంశజాత యని ప్రియమెసఁగన్. 248

సీ॥ చిలుకపల్కులు గేళిసేయక శ్రీదేవి
                 మగనితోఁ జెప్పిన మఱియు హరియు
      భార్యమాటంతయు బంగారుగా నెంచి
                 హేమగర్భునితోడ నెఱుకసేయఁ
      దన రాణికి నజుండు వినిపింప నావాణి
                యా వాణి ననురక్తి ననుకరింప
      హరివిధుల్ గుణయుక్తి హరునకుఁ దెల్ప నా
               తఁడు సర్వమంగళాదరణ దెలియ

      నంత హరి యిందు నేనుందు నందు మీరు
      రమణఁ బరిణయ మొనరించి రమ్మటన్న
      నెమ్మనంబునఁ బమ్మిన సమ్మదమున
      భవ్యమతి నియ్యకొనెఁ బద్మభవుఁడు భవుఁడు. 249

గీ॥ వేడ్కఁ దమవెంట నంటి యా విబుధవిబుధ
      కాంతులు సకాంతులుగ రాగ ఘనసురాగ
      భూరికల్యాణసానులదారి మీఱి
      శౌరికల్యాణదర్శనేచ్ఛలను జేరి. 250

కం॥ వాణీశుండు శచీశుక
       పాణీశుం డాదిగాఁగ వచ్చిరి కల గీ
       ర్వాణీశులెల్ల మును శ
       ర్వాణీశులు నడువ హరివివాహముఁ జూడన్. 251

కం॥ హరి వారి నెదుర్కొని రాఁ
       బరివారముతోడ నంతఁ బరిణయవేళన్
       సురవారనటుల నటనలు
       మురవారభటుల్ సెలంగె మురవైరికడన్. 252

కం॥ హరిహరి ముఖసుర లత్తఱి
       హరిహరిణాక్షీవిలాస మరయు మనీషన్
       సిరిమించు సూనవారిం
       గురియించిరి దానవారిఁ గురియించి వెసన్. 253

చ॥ తనకడ కిట్లు వచ్చిన విధాతను మాధిపతిన్ శచీపతిన్
      ఘనతనయస్థితిన్ హితవికాసగతిం దనకన్న నున్నతిం
      గని విడుదుల్ ఘటించె యదుకాంతుఁడు నైజవివాహవైఖరుల్
      గొనకొన నంతఁ గేకయుఁడు కూకుదవైఖరిఁ జేరి యచ్చటన్.254

సీ॥ మేదిని కెనయైన వేదికఁ గావించి
                 దివికి దీటైన పందిలి ఘటించి
      బ్రహ్మాండసమమైన పళ్లెరం బొనరించి
                 సూర్యచంద్రులవంటి జ్యోతులుంచి
      తెలిదీవిసరిపదస్థలపాత్ర సవరించి
                కనకాద్రికెన పీఠికల నమర్చి
      శరదభ్రములచాలు దొరయు నుల్లెడ యెత్తి
               తెరలు మాయకు సాటి తెర యొనర్చి
      యాదిలక్మీమహాదేవి హరి కొసఁగు
      క్షీరజలధీంద్రుఁ డనఁబోలి కేకయేంద్రుఁ
      డాత్మనందన హరి కిచ్చునవసరమున
      నఖిలకల్యాణవస్తువు లలవరించె. 255

కం॥ వరునెదుట దంతకన్యా
       వరణం బొనరించి మంచి వైభవమెసఁగం
       దెర గట్టించిరి హరి మది
       తెఱఁగెట్టిదొ మఱియు మరుఁడు తీవరపెట్టన్. 256

కం॥ తెఱవం గని తెర యించుక
       తెరవం గని భ్రమయు మెఱుఁగుతెఱఁగో యనుచున్
       మురవారణుండు మదిలోఁ
       దరువాత మనోజుఁడట్లు తరువానంగన్. 257

కం॥ మనసూనఁ దెలియనైతిన్
       నను సూనశరంబు గూర్చునాఁ డీ వనజా
       నన యంచు నెంచు హరియా
       ననయించున్ విలుతునంగననయించుఁ జెలిన్. 258

కం॥ చెలి శృంగారరసాంబుధి
      నలముచు నోలాడఁదివురు హరి చూడ్కులకుం
      గలశములయ్యెం గుచములు
      పొలుపుగ నాధారగతులు భుజలతలయ్యెన్.259

కం॥ ఆఱుగురిఁ జెలుల నేలితి
      వారొకరీ రీతివారె వారక యనుచున్
      మారుగురుఁ డెంచు నాచెలి
      యాఱుగురియగాఁగ మతి ననంతవిభూతిన్.260

కం॥ అవ్విధిఁ దలఁచుచు మాధవుఁ
      డవ్వాంఛోర్మీవశాశయనితి సతివౌ
      నవ్వళు లూరులు నెంచుచు
      నువ్విళులూరుచు వసించె నొగి నవ్వేళన్.261

చ॥ కన నపు డాభిముఖ్యగతిఁ గాంతకుచాంతరహరమధ్యవే
      ష్టనమణిదర్పణంబునను శౌరి గనంబడఁ బొల్చె నెంతయేఁ
      దనదు సురఃస్థలిన్ హరియుఁ దామరసాక్షిభరింప దీటుగాఁ
      దనదు నురఃస్థలిం జెలియుఁ దామరసాక్షి భరించెనో యనన్.262

వ॥ అంత నవ్విధంబున నవ్వధూవరులు పరస్పర ప్రేమంబులం
      బ్రమోదించునవనరఁబున.263

కం॥ తరుణమ్ములైన మురహరు
      చరణమ్ములు గడిగి పుణ్యజలములఁ గనకా
      భరణమ్ములచేఁ గన్యా
      భరణమ్ము నలంకరించి భవ్యస్ఫురణన్.264

కం॥ ప్రేమమున దృష్టకేతు
      క్ష్మామండలభర్త హరిసమర్పణబుద్ధిన్
      దామోదరునకుఁ ద్రిజగ
      ద్ధామోదరునకు నొసంగె తనయన్ సనయన్.265

కం॥ మంగళసూత్రము చెలికి భ్ర
      మంగళమునఁ గట్టె చతురిమంగలిగి పత
      త్పుంగవకేతనుఁ డజుడుం
      బుంగవకేతనుఁడు వేలుపుంగవ లెన్నన్.266

కం॥ అంగన లయ్యెడ సొంపొల
      యం గనఁ బాడి రల రఘుకులాధీశ్వరసీ
      తాంగన లపూర్వపరిణయ
      మంగళగీతికలు సర్వమంగళతోడన్.267

ఉ॥ అత్తఱి భద్రయున్ హరియు నాత్మఁ బరస్పరసమ్మదంబులుం
      బొత్తులొనర్చుచుండ మునుమున్నుగ నొండొరుమీఱి దోయిలె
      త్తెత్తి యిరుంగడం జెలువ లెత్తిన పాత్రల నించినించి వే
      ముతైపుఁబ్రాలు వోసిరి సమున్నతి నొండొరు మౌళిసీమలన్. 268

కం॥ సరసిజరాగములయ్యెన్
      సరసిజముఖి రాగకాంతి సంబంధమునన్
      హరినీలనిచయమయ్యెన్
      హరినీలరుచిప్రసక్తి నమ్మౌక్తికముల్.269

కం॥ త్రిపదంబులచే సురలను
      విపదంబుధిఁ దేల్చినట్టి విష్ణునిచే స

      ప్తపదంబులు మెట్టించిరి
      నుపదంబుగ నటవశిష్టసుదతిం గనియెన్.270

కం॥ నాలుగుదినాలు విప్రజ
      నాలు విధానాలు భోజనాలును మేలిన్
      వ్రేలిమి గలుగఁగ ముదముల
      వ్రేలి మిగుల నవల నాగవ్రేలి మెరింపన్.271

కం॥ పైఁదలిరులొత్తుకరుణులఁ
      బైదలి మ్రొక్కింప నాకబలి దీర్చినపై
      నైదవదినమున మావలె
      నైదువ గమ్మనుచుఁ బలికి రాదిమదేవుల్.272

కం॥ శిబికములు విడిచి కాంచన
      శిబికారోహణ మొనర్పఁజేసి హొయలుగా
      నబలాబలానుజులతో
      న బలారిపురంబు మెరవణం బొనరించెన్.273

గీ॥ అంతఁ గేకయమహిభర్త హరి కసంఖ్య
      లరణము లొసంగి నేఁ జేయునట్టి పూర్వ
      భాగ్య మద్భుతమని శౌరిఁ బ్రణుతిసేసి
      యాత్మలో నమస్కార మాచరించె274

గీ॥ అపుడు బువ్వంబు లలరించి యలవరించి
      ముఖ్యులకును యథోచితములు ఘటించి
      కైకయవిభుండు మఱియు లోకైకవిభుల
      భూరివిభుల సభక్తిగాఁ బూజ సేసె275

కం॥ హరి భద్రాన్వితుఁడైనం
      బరమేశ విరించిముఖులు భద్రాన్వితులై
      యరిగిరి గిరివైరియుఁ జనెఁ
      బరివారముతోడ విశదభద్రాన్వితుఁడై.276

కం॥ ఆ విధుఁడు బంధుకోటికిఁ
      గావించిన విభవమెన్నఁగా శక్యంబె
      యా విద్వత్కవిముఖసం
      భావనలె యన్న శక్యపడకుండంగన్.277

గీ॥ అంత వసుదేవుఁడాదియౌ యాదవులకు
      విందులును వీడుకోలును వింతవింత
      ప్రియములును జేసి పనిచెఁ గేకయవిభుండు -
      ముదిత శ్రుతకీర్తియును దాను విదితకీర్తి.278

కం॥ హరి మ్రొక్కఁదలఁప నవ్విభు
      కర మొక్కటఁ బట్టి యెత్తి కౌగిటనిడి యీ
      ధరఁ బ్రోవ నవతరించిన
      పరమేశుఁడవీవు నీకు భక్తుఁడ సుమ్మీ!279

వ॥ అని ప్రియంబు సెప్పి యితోధికశుభంబులు మీకు సులభంబు లగునని
      వచియించి వేంచేయుండని పంచశరగురుంబంచి యా గుణాంబురాశి
      తలవంచియున్న కూతుం గాంచి మ్రొక్కినం దీవించి ప్రేమరసాతి
      శయంబు హృదయంబున నిమిడించి యూఱడించి శిరంబు మూర్కొని
      మాయమ్మ పోయిరమ్మని పలికెనంతట.280


కం॥ తనకు మఱి మ్రొక్కి నిలిచిన
      తనయ దయం గౌగిలించి తల మూర్కొని త

     జ్జనని కడు దీనముఖియై
     కనుగవ నెనరొలుకఁ బలికె గద్గదగళయై.281

చ|| కనినది మాత్రమే యొకటిగాదు సుమీ పిననాటనుండియున్
     నెనరు వహించి పెంచి మతి నేఱిపి విద్యలు సెప్పి యెప్పుడున్
     నిను నెడఁబాయకున్న యది నీదు ప్రయాణము విన్నవిన్ననై
     కని పదమూదకుండు చిలుకంగని చెప్పగదమ్మ కొమ్మరో !282

కం|| ఇటులుందు రమ్మ పొమ్మని
     చిటిచిటినెచ్చెలులతోడఁ జెప్పఁగదమ్మా
     తటుకుననె తోడి తెత్తుము
     కుటిలాలక కొడుకు నెత్తుకొని రావమ్మా !283

సీ|| మేనమామ యటంచు మీఱుక మా యన్న
               వసుదేవునెడఁ బ్రీతి వదలకమ్మ
     మేనత్త యని మందెమేళంబు సేయక
               దేవకిమాటలోఁ దిరుగుమమ్మ
      మేనబావని మేర మానియుండక బుద్ధి
               బలదేవునెడ భక్తి మెలఁగుమమ్మ
      తోటివారని కొంచెపాటుగాఁ జూడక
               సవతులతో మైత్రి సలుపుమమ్మ

      శౌరిమేనరికంబని చసవు గనక
      విథుని దేవునిగాగ భావింపుమమ్మ
      యుభయవంశంబులకు గుణోద్యుక్తియుక్త
      పూర్తిఁదేవమ్మ మాయమ్మ పోయి రమ్మ.284

కం॥ అని బుజ్జగించి వెంటం
     దనయు నియోగించి జనని తగనంపించన్
     వనజాక్షియు వనజాక్షుడు
     సని రా ద్వారకకు బంధుజనములతోడన్.285

వ|| ఇట్లు చని పరిణయోచితాలంకారవతియగు ద్వారవతిం బ్రవేశించి
     యందు.286

కం|| తల్లి యుఁ దండ్రియు మొదలుగఁ
     దెల్లముగా గురుజనంబు దీవించంగా
     నిల్లాంద్రడ్ర నాదరింపుచు
     నిల్లాలుం దాను నెసఁగె నీశ్వరుఁ డంతన్ .287

కం|| ఆ రాత్రి శోభనంబని
     యారాత్రి దినములు మంచివని బుధులనఁగా
     నారాత్రివిధంబులుగా
     నారాత్రిక లెత్త హరియు నభిహితలీలన్,288

కం|| అత్తరువులఁ జిత్తరువులఁ
     గ్రొత్తహరువులోలయు కేళికూటగృహములో
     నత్తమినత్తమిబొత్తమి
     చిత్తజగురు(డౌట మదినిఁ జిత్తరువుజుఁ డొదవన్.289

చ|| చికిలికడాని జీనిపని చిత్తరుపుత్తడులూడి కెంపుపొం
      దికలిడమానికెంపునునుచెట్టుల పట్టెలు పట్టుపట్టెయుం
      జెకడపుగోళ్ళమెప్పుజిగి చిప్పిలుచప్పరమొప్పు శయ్యయం
      దొకట ననంతభోగగతి నొందఁగ నందు ముకుందుఁడున్నెనడన్ 290

     పతికి విడెమిచ్చి వత్తుర మ్మతివ యనుచు
     పొలఁతు లా యించుబోణిని బుజ్జగించి
     కొన్ని చిన్నెల వగ గుసగుసలు దెలిపి
     కోరి హరియున్న యెడకుఁ దోడ్కొనుచు నరిగి.291

కం॥ ఒక రొకరొకపని నెపముల
     సకియ లరుగ రత్నభిత్తిసక్తి నిజకళల్
     సకులె యని యుండు చెలివే
     డ్కకుఁ గోర్కులు మీటి శౌరి గనుఁగొన నింతిన్.292

సి॥ కలికిమిటారి చిక్కని చొకాటపు గుబ్బ
               లెదకు నాటకమున్న నెదకునాట
     మగువ పిసాళిసోయగపుఁ దీయనిమోవి
               రుచులనందకమున్న రుచులనంద
     చెలువ మేల్కళలూరు మొలక నవ్వులమోము
               ముద్దు జూపకమున్న ముద్దుజూప
     వెలఁది చిల్కు టొయారివలపువాల్జుాపులు
              కలికియ్యక మున్నగలియికీయఁ

     దమిఁ బెనుచఁ జూచి చెలువుఁ డాతరుణిఁ దిగిచి
     క్రుచ్చి కౌగిటఁజేర్ప నా కొలఁదులెంచఁ .
     బరవశంబులఁ దముఁదామె యెఱుఁగరైరి
     యొరులెటులఁదెల్ప నవ్వధూవరుల సుఖము.293

కం॥ రమణుఁ డిటు పాన్పుఁ జేర్చిన
      మమతన్ భ్రమతం బడంతి మదిముడి సడలం
      గ్రమమునఁ దనంత నంతన్
      బొమముడి రవికెముడి పోకముడియన్ సడలెన్.294


కం॥ ఆ విభుఁడు గౌగిలించఁగ
    మోవెనగఁ గళలునంట ముచ్చటెఱిఱిగెఁబో
    నావల సుఖ మింతంతని
    భావింపఁగనేరదయ్యె భామిని యంతన్ .295

వ॥ ఇవ్విధంబున296

సీ॥ సహజ నిత్యానంద సంధానశశికాంత
              కాంతసౌధాంత రంగంబులందు
    రమ్యధాతు విచిత్రరైవతాచల శృంగ
             శృంగార కేళికా గృహములందు
    ఘనతరామోద చందన నందనారామ
             రామణీయకకుంజ ,సీమలందు
    రతిరహస్యవిశేషరచనాభిముఖరత్న
             రత్నాకరద్వీపరాజియందుఁ

    బ్రమద మొప్పఁ గళాకలాపములు నేర్పి
    భ్రమదలిర్ప నవోడనుఁ బ్రౌఢఁజేసి
    భావరసపేటి శౌరి భద్రావధూటి
    మదన సామ్రాజ్యవిభవ సంపదలఁ దేల్చె297

కం॥ ఆ భద్రతోడఁ గృష్ణుఁడు
    శోభనవిధి నిటుల శశియు శోభయుసుమనో
    వైభవము దావినా నవి
    నాభావము దెలుప సుఖమునన్ వెలయుతఱిన్.298

కం|| చనుఁగొనగవ నలుపెక్కెను
     గనుఁ గొనఁగఁ గపోలపాళికలఁ దెలుపెక్కెన్

      మనమునఁ గడు దలపెక్కెను
      ఘనమున గురుకుచకు గర్భకళ సొలపెక్కెన్. 299

కం॥ మించుగ వరదుని దయచే
       కాంచీదేశంబు వృద్ధిగనె నా సతికిన్
       మించుగ వరదుని దయచేఁ
       గాంచీదేశంబు వృద్దిగనుటది యరుదే ! 300

వ॥ అంత 301


కం॥ సూనశరగురుని కృప నా
       సూనశరీరిణికి నొక్క శుభలగ్నమునన్
       సూనశరుం డితఁడో యన
       సూనుఁడు భద్రజయుఁడనఁగ సునయుం డొదవెన్. 302

కం॥ ఆ నందనుఁ డంతంతట
       దైనందినబంధుకల్పితవిధానముచే
       నా నందననందనుఁడు గడు
       నానందమునంద బుద్ధి నభివృద్ధి గనెన్. 303

కం॥ భద్రాసోదరుఁ డపుడు సు
       భద్రాసోదరుఁడు పనుపఁ బటుగతిఁ బురికిన్
       భద్రాద్యనుగతితో బల
       భద్రాద్యనుమతినిఁ జనియె బహుమతి నిటులన్. 304

వ॥ అప్పు డప్పుత్రోత్సవంబున నప్పురుషోత్తము నప్పరమకీర
      సత్తమంబు విచిత్రంబుగా స్తోత్రంబు గావించె నవ్విధంబున. 305

వృత్త కందగర్భితసీసము


    సమదభాస్వద్దనుజన్మభేదనరణా
                క్ష్మాభామినీపాలనాభవాప్త
    వరదముఖ్యామరపారికాంక్షివినుతి
                ప్రావీణ్యసౌఖ్య ప్రదావధాన
    ఘనదయాపాంగయుగాయ గాహితహితా
                జ్ఞాతాఖిలామ్నాయ నీతివేది
    శరదనీకాశవిశాల నీలరుచిగా
                త్రా కేశవా శ్రీవరా మురారి
    యమితవిభవానుభావితతశమవిలసిత
    ధీరవర్తి సలలితకీర్తి ప్రమహిత
    సకలభువనచయ విమలసవితృహృదయ
    విహరి విశ్వమయ హరి పవిత్రమూర్తి. 306

గర్భమత్తేభవృత్తము



    మదభాస్వద్దనుజన్మ భేదనరణా క్ష్మాభామినీ పాలనా
    రదముఖ్యామరపారికాంక్షి వినుతి ప్రావీణ్య సౌఖ్యప్రదా
    సదయాపాంగయుగాయగాహితహితా జ్ఞాతాఖిలామ్నాయనీ
    రదనీకాశవిశాలనీలరుచిగాత్రా కేశవా శ్రీవరా! 307

గర్భకందము



    అమితవిభవానుభావిత
    శమవిలసితధీరవర్తి సలలితకీర్తి

      ప్రమహితసకలభువనచయ
      విమలసవితృహృదయవిహరి విశ్వమయహరీ! 308

ద్విపద చౌపదిలాలి శోభాన మంగళహారతి సువ్వాల ధవళాది


వివిధ భేదసీసము



      శ్రీరంజితాకార శృంగారపూర వీ
                  రారిసంహార విద్యావిహార
      కారుణ్యవిస్తార కాంతి ప్రసారసా
                  రప్రియోదార శాంతిప్రచార
      దీనార్థిమందార ధీరప్రకార దా
                 నావనోద్ధార ధర్మైకహార
      మానాఢ్యహంవీర మాన్యసంచర గా
                నామృతాసారగణ్యాధికార
      చారుకాంచనవాస చంచద్విలాస
      సారసాంచితహాస శశ్వద్వికాస
      వారిదాకృతిభాస భవ్యస్వదాస
      సీరిసంగతవాస శ్రీశ్రీనివాస! 309

పాదభ్రమకందము



      మారసమరామసరమా
      సారావనరసవిభావి సరనవరాసా
      హారి యరిధారియరిహా
      భారతజయదపరధీర పదయజతరభా! 310


నిరోష్ఠ్య ద్వివిధకందము



   కృష్ణా జయసంరక్షిత
   కృష్ణా జయజలధర చయకృతఘనసశ్రీ
   కృష్ణా జయనతహృన్నగ
   కృష్ణా జయనరహరిహరిధృతగిరిశార్ఙ్గీ !311

ద్వితీయకందము



    జయసంరక్షితకృష్ణా
    జయజలధరచయకృతఘనసశ్రీ కృష్ణా
    జయనతహృన్నగకృష్ణా
    జయనరహరి హరిధృతగిరిశార్ఙ్గీ కృష్ణా !312

సోష్ఠ్యకందము



    భూమావామాభవ్య
    ప్రేమానుభవాభవాప్త పృథుభావిభవా
    భౌమాభిగుప్తభామా
    స్తోమ వివాహోప్యభావ సుమనోభావ్యా !313

నిరోష్ఠ్యసోష్ఠ్యసంకరము



    రామా ! రావణముఖ్యవి
    రామా ! నిర్మలగుణాభిరామా ! శ్రీసు

    త్రామా కంపితభార్గవ
    రామా ! కమలాభిజన్మరామా ! రామా !314

ఆపంచ వర్గీయముక్త పదగ్రస్తము



    సరసావంశీసురవా
    సురవారాశంసిశౌర్యశూరా శరహా
    శరహారిహరిస్వరయా
    స్వరయావహలీలయాస్యవశహా సరసా !315

శుద్ధపంచవర్గీయము



    పద్మాభవదచ్చందా
    పద్మానందానుగతకృపా బృందపద
    త్ఫద్మాప్త బింబకుందా
    పద్మజముఖకందధూతబంధ ముకుందా !316

అచలజిహ్విక



    ఆభోగమహీభాగమ
    హాభాగమహామహామహాభోగ మహా
    మాభామావహబహుమహి
    మా భామావహవిభావమమవముఖావా !317


అక్షరద్వయకందము



      మిమ్మే మేమారేమా
      మమ్మోము మఱేమిమర్మమా మమ్మారా
      ముమ్మాఱు రమారామా
      రమ్మరమరమేర మీఱి రామ మురారీ !318

సర్వతోభద్ర శ్లోకము



      రమావాససవామార
      మావతార రతావమా
      వాతాదసాసాదతావా
      సరసాననసారస319

ఈ శ్లోకానకు అర్థరూపముగా మత్తేభవృత్తము



     సిరికావాసమధారుణీసహితుఁడా శీఘ్రంబ సర్వావతా
     రరతా ప్రోవు ననన్ మరుద్గ్రసనదర్పఘ్నా యనల్వత్వగ
     మ్య రహిన్ మీఱనకారవాచ్య సరసాస్యాంభోజ యంచున్ రమా
     వర మిమ్మెంచితి శ్లోకరూపముగ ఠేవన్ సర్వతోభద్రలోన్.320

కం॥ మంగళ మంగజకృతికిన్
     మంగళ మంగజహరాది మంగళనుతికిన్
     మంగళ మభంగవిహృతికి
     మంగళమీ రంగపతికి మంగళమనుచున్.321

కం॥ శోభనమే విష్ణునకున్
    శోభనమే భక్తభవనసుచరిష్ఠునకున్
    శోభనమే జిష్ణునకును
    శోభనమే కృష్ణునకును శోభనమనుచున్ .322

కం॥ శ్రీరమణీపతి నీగతి
     హారమణీవితతిరీతి నభినవభాతిం
     గీరమణి సారమనిమతి
     గీరమణీయమగు వినుతిఁ గీర్తించి తగన్ ,323

కం|| అంతట సతికి సుతోదయ
     సంతోషము గాంచి శుకము సమ్మదమొదవం
     గాంతామణి నీవును నీ
     కాంతుఁడు సుఖముల మెలంగఁగంటి నటంచున్.324

కం|| హరి యాజ్ఞ గాంచి భద్రా
     వరవర్ణిని గారవించి వనజభవసభాం
     తరమునకున్ ద్వారవతీ
     పురమునకుం జిలుక వచ్చిపోవుచునుండెన్,325


     ఇవ్విధంబున.326

సీ॥ అంభోజభవవచస్సంభావనాలబ్ధ
              విగ్రహుం డాపద్వినిగ్రహుండు
     దంభగోరూప విశ్వంభరాభారాప
                 హారకుం డాశ్రితోద్ధారకుండు
     జంభారిశాత్రవాహంభావ సర్వస్వ
                 భంజనుం డమరైకరంజనుండు

సంభూతకార్పణ్య కుంభినీసురభాగ్య
           దాయకుం డిందిరానాయకుండు

విహితసితహయరథహయగ్రహణ వహన
సహనమహనీయతా హేతుశమితవిమత
శతశత సమీక పరిహృతక్షితిభరార్థ
కృతనరస్ఫూర్తి విలసిల్లెఁ గృష్ణమూర్తి327

వ॥ఇట్లు నిరంతరానంత కల్యాణవిలాసవిభవాను భావుండగు నవ్వాసు
దేవుండు.328

సీ॥ పరిజనమ్ములలీల బలసి దేవతలైన
                 పనిబూని తనదైన పంపు నేయ
ధర్మంబు నాల్గుపాదములందు వరిల్లెఁ
                 బ్రజలెల్లఁ జల్లఁగా బ్రతుకుచుండ
సాత్యకి మొదలైన సకలయాదవకోటి
                 యఖి లంబునను దనయాజ్ఞ నడుప
శిష్టుల రక్షింప దుష్టుల శిక్షింప
                 విహరింప భూదేవివేడ్క నంద .

నలరి భద్రాకృతి నెసంగు నాదిలక్ష్మి
రుక్మిణీముఖ్యల విధానరూఢిఁ గొలువ
నలువగన్నయ్య ద్వారకానగరినుండి
లీల జగములనెల్లఁ బాలింపుచుండె.329

కం॥ ఈ చక్రపాణిపరిణయ
గోచరళుభకందమగు ముకుందవిలాసం


బాచక్రవాళ మహియం
దాచంద్రార్కంబుగాఁగ నభివృద్ధియగున్330

కం॥ అని శుకముని పలికిన విని
వనజాక్షుని భక్తిపారవశ్యమువలనన్
జనకనృపాలకుఁ డలరెన్
మనమున నానందవిభవమగ్నత మెఱయన్,331

మ॥ సమయస్వీకృతపార్థచిద్విరచనా సంధాన సంధానయా
గ్రిమలీలాపరిక్ల ప్రసేవకసుధీ బృందావబృందావన
క్రమసంపాదిత మౌళిభాగశిఖిరంగద్వాల గద్వాలర
మ్యమహాపట్టణఖేలనాలసదమందామోద దామోదరా !332

కం|| వారణముఖ నిజయానా
ధోరణతాముఖ్యదాస్య ధూర్వహ సోమ
క్ష్మారమణ ! భరణదక్షా
శ్రీరమణ కృపకటాక్ష శ్రితజనరక్షా !333

మంగళమహాశ్రీ

శ్రీధవసదావిబుధ శేవధి సుధాధవళశీలవిధిశోభిత యశశ్శ్రీ
సాధువన మాధవసుసాధనగదారి దరసాధిత నిరంతర జయశ్రీ
భూధవసుధీనికర బోధకర సాధుతరభూషితవినిర్మల గుణశ్రీ
మాధవదయావనధి మందరగిరీంద్రధర మజుతర మంగళ
మహాశ్రీ.334


కం|| వరకేశవ దేవాంకిత
సరణిన్ గద్వాల సోమజనపతి భద్రా
పరిణయ కృతిఁ జేయించెను
స్థిరఁ బెద్దన సుకవిచేత శ్రీ శ్రీ జేయున్ ,335

ఇది శ్రీమదుభయకవితా నిస్సహాయసాహితీవిహార
కాణాదాన్వయ తిమ్మనార్య కుమార వినయ
గుణధుర్య పెద్ద నార్యప్రణీతంబైన
భద్రాపరిణయోల్లాసంబగు
ముకుంద విలాసంబను
మహాప్రబంధంబునందు
తృతీయాశ్వాసము
సమాప్తము.