మీ పేరేమిటి?

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


మీ పేరేమిటి?

దేవుడు చేసిన మనుషుల్లారా!

మనుషులు చేసిన దేవుళ్ళారా! మీ పేరేమిటి?

పురాణములను గురించి మేము శంకలు వేస్తే, మా గురువు గారు “వెధవ చదువు! మీమతులు పోతున్నాయి. మీరు వొట్టి బౌద్ధులు” అనేవారు.

“బౌద్దులు యేషువంటి వారు శాస్త్రుల్లు గారూ?”అని రామ్మూర్తి అడిగాడు. రామ్మూర్తి శతపెంకే.

“రేపు ఆదివారంనాడు పువ్వుల తోటలో ఉపన్యాసం యిస్తాను, అంతా రండి” అని శాస్రుల్లు గారు శలవిచ్చారు. | ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటలప్పుడు పువ్వుల తోటలో ఒక పరుపు మావిడి చెట్టుకింద సకలో మేమంతా పాతికమందీ కూచున్నాం. మధ్యగావంచా పరచుకుని, మాకు అభిముఖంగా శాస్తులు గారు కూచున్నారు. నేను బల్ల చెక్క తెచ్చి వెయ్యబోతే, “వొద్దురా, మీరంతా కింద కూచుంటే, నేను బల్లమీద కూచుంటానా!” అన్నారు. రెండు కొబ్బరి కాయల నీళ్ళు తాగి, తాంబూలము వేస్తూ ,శాస్తులు గారు బౌద్దమతం విషయమై ఉపన్యాసం ఉపక్రమిం చారు, పది నిమిషములు అయే సరికి, రామ్మూర్తి తన చేతనున్న పుస్తకం విప్పి చూచి, “శాస్తులు గారూ, తాము శలవిస్తూన్నదంతా సర్వదర్శన సంగ్రహములోనిదీ కాదండీ” అని అడిగాడు. ఆశ్చర్యపడి, శాస్త్రుల్లు గారు, “ఔరా నీకెలా తెలిసెనురా? అదేం తర్జుమా కాదు గద?” అన్నారు.

‘‘ఔనండి”

“ఈ యింగిలీషు వాడు ఉద్దండ పిండంరా! ఆ రెండో పుస్తకమేమిటో? ??

“బుద్ద చరిత్రండీ.”

“ఎక్కడ సంపాదిస్తార్రా యీ అపూర్వ గ్రంథాలు, యేదీ తే.”

శాస్తులు గారు పుస్తకం అందుకుని, అతి మధురమైన కంఠంతో చదివి, అర్థం చెప్పడం ప్రారంభించారు. . 

నాలుగు రోజులు పోయిన తరువాత, శాస్తులు గారు క్లాసులో యిలా శలవిచ్చారు. “ఒరే యీ పుస్తకం చదివిందాకా, బుద్ధుడి మహిమ నాకు తెలియలేదురా. తప్పకుండా యీ మహానుభావుడు శ్రీ మహావిష్ణు అవతారవేన్రా”

ఆనాటనుంచీ శాస్తుల్లు గారు మమ్మలిని బౌద్దులని దూషించడం మానేశారు.

కిరాస్తానులమని మట్టుకు అంటూ వచ్చారు. క్రీస్తును, శ్రీ మహావిష్ణు యొక్క పదకొండవ అవతారంగా చెయ్యడం సాధ్యం కాక, వొడబడి వూరుకున్నాం.

మా గురువు గారి వంటి గురువులు లోకంలో లేరు. చిరకాలం కాశీవాసం చేసి తర్కశాస్త్రము చదువుకున్నారు. మన దేశంలో అంత తార్కికుడు లేడని ప్రతీతి. శాస్త్రం మాటకేం గాని, కావ్యాల్లో మంచి రసగ్రాహి. మరి సుగుణ సంపత్తికో అంటే, సత్యకాలపు మనిషి అన్నప్పుడు, ఆయనే సత్యకాలపు మనిషి. అంత పాండిత్యం యింత సత్యకాలం ఒక్క బుఱ్ఱలో యెలా యిమిడి వున్నాయో, ఆశ్చర్యం!.

యీ జరిగినది పది సంవత్సరముల కిందటి మాట. ఇప్పుడు శాస్తుల్లు గారు పించను పుచ్చుకున్నారు. మాలాటి శిష్యుల శుశ్రూష పొందుతూ, మాకు సంస్కృత గ్రంథాలు చెబుతూ, సంతోషిస్తూ, సంతోషపెడుతూ, కాలం వెళ్ళబుచ్చుతున్నారు.

నేను వర్తకం చేస్తున్నాను. రామ్మూర్తికి భూములు లావుగా వున్నాయి. కొత్త కొత్త మోస్తర్లను వ్యవసాయం చేస్తున్నాడు. వూట గెడ్డ దరిని సీతారామ కోరుతున్న ఒక బ్రహ్మాండమయిన తోట వేశాడు. అవి పువ్వులు కావు. అవి పళ్ళు కావు. తొలి ఫలాలు గురువుగారు ఆరగించనిదీ రామ్మూర్తి చెట్టు ముట్టడు. ఆ తోటలో విహరించడం గురువు గారికి అత్యానందం. అక్కడనే మేం తరుచు మీటింగులు చేస్తూ వుంటాం. వెంకయ్య స్కూలులో మేష్టరు. ఖాయిదా లావుచేసి, తిట్లు తింటూ వుంటాడు. మా స్కూలు జట్టులో ఆరేడుగురం యిక్కడనే వున్నాం. గురువు గారూ మేమూ కలసినప్పుడల్లా స్వర్గఖండం ఒకటి అక్కడికి దిగినట్లు వుంటుంది.

యిక ప్రస్తుత కథా -

మా పట్నానికి యెనిమిది మైళ్ళ దూరంలో రామగిరి అని ఒక విష్ణుక్షేత్రం గలదు. దాని వర్ణన మరి వక మాటు చేస్తాను. ఇప్పటి మట్టుకు మీకు తెలియవలసిన దేమంటే- అక్కడి విష్ణుక్షేత్రం ఆధునికం. ఆ వూరి నల్ల కొండల నంతటను శిధిలమైన బౌద్ధ కట్టడములు కలవు. అక్కడి వారు వాటిని పాండవుల పంచలంటారు. ఈ దేశంలో పాండవులు వుండని గుహలూ, సీతామ్మవారు స్నానమాడని గుంటలూ లేవు. 

ఒక పెద్ద గుహలో నున్న బౌద్ద విగ్రహమును శివుడని, దాని పక్కనున్న దేవీ విగ్రహమును గౌరి అని భావించి జంగాలు పూజ చేస్తున్నారు.

ఉండగా, ఉండగా, కొన్నాళ్ళకి, ఒక దొర, గుమాస్తాలతోను, బిళ్ల బంట్రోతులతోనూ వచ్చి, మెట్టల పడమట నున్న ముదర మామిడి తోటలో కాంపు ఖణాయించాడు. మరిన్నీ వొందల కొలది కూలీలను కూర్చి ఆ కొండల మధ్య నున్న దిబ్బలు తవ్వించడం ఆరంభించాడు. ధనం కోసం తవ్వుతున్నాడని అక్కడి వాళ్ళంతా అనుకొన్నారు. కాని, విరిగిన ప్రతిమలూ, జిలుగు చెక్కిన రాళ్ళూ, పాతుకుపోయిన పాత కుండలూ, మండలూ, బళ్ళమీద పెరికి ధనం కంటెనూ యెక్కువ భద్రంగా యేర్చి, పేర్చాడు. ఇవి చూచుటకే మేం వెళ్ళాం.

మేం ఆ వూరు వెళ్ళేసరికి జంగాలు పూజచేసే పాలరాతి బుద్ద ప్రతిమను గూర్చి వూరంతా కోలాహలంగా వుండెను. ఆ బొమ్మ మేం చూశాం. బహు సొగసైనది. ఇంత తీరైన చిత్రము | గాంధార దేశంవైపు తప్ప మరెక్కడా చూడలేదని దొరమాతో చెప్పారు. దాని పీఠం మీద “యే ధర్మా హేతు ప్రభవా' ఇత్యాది బౌద్ద సిద్ధాంతము సొంపుగా వ్రాయబడివున్నది. దొరగారు దాని మీద కన్ను వేసి “ఇస్తారా?” అని అడగగా, శైవులలో పెద్దలు “ప్రాణములనయినా యిత్తుము గాని, దానిని యివ్వ జాలము” అనిరి. దొరగారు నలుగురితో సాయిలా పాయిలాగా తిరిగే వారు గనుక మర్యాదగా జవాబు చెప్పారు. మరివకరైతే కథ చాలా దూరం వెళ్ళి వుండును. దొరగారు అంతటితో ఆ ప్రయత్నం మానుకున్నారు.

ఇలా వుండగా ఒకనాటి రాత్రి పూజచేసే జంగం శరభయ్య ఆ ప్రతిమను పెగిల్చి, కొని పోయి దొరగారికి రెండు వందలకి అమ్మజూపాడు, దొంగతనంగా తెస్తివి పుచ్చుకోజాలను అని, దొర, తనకు మాట రాకుండా వుండగలందులకు వూరి పెద్దలకు కబురు పెట్టాడు. యేమిటి, యీ దొర బుద్ది తక్కువా అని శరభయ్య కొంత ఆశ్చర్యపడి, దొర కొంచెం కనుచాటు కాగానే, మెట్టల వైపు పరుగుచ్చుకున్నాడు. నాటికీ నేటికీ మరి పికరు లేదు.

శాయన్న భుక్త గారి యింట బసచేసి ఆ వూళ్లో మేం మూడ్రోజులు వున్నాం. శాయన్న భుక్త మా గురువు గారి దగ్గర కొన్నాళ్ళు తర్కం చదువుకున్నాడు. మంచి సాహిత్యం కద్దు. కొంచం కవిత్వం కూడా అల్లుతాడు.

మూడోనాడు రాత్రి భోజనం చేసుకుని, డాబా మీద నలుగురమూ కూచున్నాం. చిన్న గాలి రేగి తోటలో కొబ్బరి మట్టలు అల్లాడడం ఆరంభించాయి. యెదట దేవుడి కొండ బ్రహ్మాండవైన మహాలింగము వలె చీకటిని చీల్చుకుని మిన్నుముట్టి మనిషి యొక్క అత్యల్పతను సూచించుచు, యేదో చెప్పరాని చింతను భీతిని మనస్సులకు కలుగజేయు చుండెను. దేవతలు పూజ చేసిన దివ్య కుసుమముల వలె చుక్కలు శిఖరము చుట్టు చేదిరి వెలిగెను. మా మనస్సులు 

గత కాలము నాటి స్థితిగతులను గూర్చిన ఊహాలతో నిండి యుండెను. తలపోసి తలపోసి ఆనాడు యీ స్థలం యెలా వుండెనో బౌద్ధులు యేమి యేమి చేసేవారొ అని నేనంటిని.

ఆ పీనుగులు మనలాగే యేడుస్తూ వుండేవారు. మనకంటే అర్ధాన్నంగా వుండేవారు : అని సున్నితమైన తలంపులు బెదిరి చెదిరే పెళుసు గొంతుకతో వెంకయ్య అరిచాడు. నాకు కళ్ళ మొయ్యా కోపం వచ్చి, “నీ అమూల్యమయిన వూహలతో నువ్వు ఆనందించరాదా, నా తలలోనే కల్పించుకున్న బౌద్ద ప్రపంచమును పెటుకు మాటలాడి యేల కలత పరిచెదవు” అని అడిగాను.

“గాని” శాస్తులు గారు అన్నారు. “బుద్దుడు విష్ణ్యవతారం గదా యీ జంగాలు శివుడని యేల పూజ చేస్తూన్నార్రా?” అని శంక వేశారు.

శాయన్న భుక్త పొడుం డబ్బీ తీసి, పెద్ద పట్టు పీల్చి, గావాంచాతో ముక్కు తుడుచుకుని, “ఒక కథ వుంది” అన్నాడు. కథంటే శాస్తులు గారికి సరదా. “అయితే చెప్పు అన్నారు” చెవి వొగ్గి విన్నాం. యిదీ కథ.

ఈ గ్రామంలో శైవ వైష్ణవ మతాలకు వైరం చిరకాలం నుంచి కద్దు. శివ మతానికి మొనగాడు జంగం శరభయ్య అనగా యిప్పుడు పారిపోయిన పూజారే. మొన్న ప్రతిమనుపెరికి పలాయనం అయిందాకా అతగాడు సాక్షాత్తూ నందికేశ్వరుడి అవతారమని రాత్రులు గృహ యెదుట వృషభ రూపమైఁ మేస్తూ వుంటాడని యిక్కడి జంగాలకూ, దేవాంగులకూనమ్మకం. యిపుడైనా ఆ దొర కిందటి జన్మంలో పరమ మహేశ్వరుడౌట చేత ఆ విగ్రహమును కోరినాడనీ, భక్తవాత్సల్యత చేత శివుడిచ్చిన శలవును అనుసరించే శరభయ్య విగ్రహాన్ని పెరుక్కు వేళ్ళాడనీ డేరా నుంచి పారిపోవడంలో వృషభ రూపం ధరించి రంకె వేసి మరీ దాటేశాడనిన్ని ఒక వార్త అప్పుడే అతని శిష్యులు పుట్టించారు. రేపో నేడో వీరాసనం వేసుకుని ఒక ధ్యానం చేస్తూ కొండ మీదనో, గోపురము మీదనో ఆవిర్భవిస్తాడు. బాజా బజంత్రీలతో వెళ్ళి ఉల్లభం బట్టి తోడ్చుకు వస్తారు. ఆ పైని కంసాలి వీరయ్య (వీరణాచారి అని పిలిస్తేనే గాని కోపగిస్తాడు) ఆ కథకి చిలవలూ పలవలూ కల్పించి ద్విపద కావ్యం రచించి అచ్చు వేస్తాడు. ఆ ఉభయుల కీర్తి దిగ్దంతులకు వెల్లవేస్తుంది.

“ఔరా వీళ్ళ మూఢభక్తి, యీ ప్రపత్తి పండితులకు వుండదురా, వీళ్ళది యేమి అదృష్టం”, అని గురువు గారు అన్నారు. ఆపైని వెంకయ్య యేమో అనబోతే చేతితో నోరు అడ్డాను. యెవరి అభిప్రాయం వారు చెప్పకుండా నీ శాసనం యేమిటి అని అడిగాడు. మాటాడవద్దని చైసౌజ్ఞ చేశాను. శాయన్న భుక్త తిరిగీ యెత్తుబడి చేశారు.

అవును తాము శెలవిచ్చినట్టు పామరులకు వుండే గాఢభక్తి పండితులకు వుండదు గాని, యీ మూఢభక్తి ఒకప్పుడు ప్రాణాంతం తెస్తుంది - అదే చెప్పబోవుచున్నాను వినండి.

“నేను ఆ మాటే చెప్పబోతే చెప్పనిచ్చాడు కాడు” అని వెంకయ్య అన్నాడు. “అవును నీకంటూ తెలియని సంగతి లేదు. మరి వూరుకో” అన్నాను.

శివస్థలం యొక్క ఉత్పత్తి మీకు తెలియనే తెలుసును. పూజారి శరభయ్య చాలా కథకు డౌటచేతను వీడి రోజుల్లో శివస్థలానికి మిక్కిలిగా వైభవం కలిగింది. చుట్టు పట్ల గ్రామాల వాళ్ళందరూ మొక్కుబళ్ళు చెల్లిస్తారు. ఉత్సవపు రోజులలో పెద్ద జాతర్లు సాగుతాయి. మరిన్నీ యిక్కడి దేవాంగులు కలిగినవాళ్ళు. జంగంపాడు యావత్తున్నూ, దేవర పేటానున్నూ, శరభయ్య మాట మీద నడుస్తారు. ఈ గ్రామములో వుండే విష్ణుస్థలం రెండు వందల యేళ్ళ కిందట యీ దేశం యేలే ఒక మహారాజు కట్టించి రాజభోగాలకు వొక గ్రామం స్వామికి సమర్పణ చేశారు. అప్పటి నుంచి రంగాచార్యులు గారి కుటుంబస్టులే యీ స్థలానికి ధర్మకర్తలై వుంటూ వచ్చారు. యీయన యిద్దరు ముగ్గురు వైష్ణవులను జీతమిఁచ్చి వుంచి వాళ్ళ చేత మిక్కిలి భక్తి శ్రద్దలతో స్వాంవారి కైంకర్యం జరిపిస్తూన్నారు. రంగాచార్యులు గారు బహు యోగ్యులు. ఆయన యొక్క సంస్కృత సాహిత్యం మీరు చూడనేచూశారు. ద్రావిడ వేదములో కూడా గట్టివారని ప్రతీతి కద్దు. ఆయన కొమాళ్ళు క్రిష్ణమాచార్యులు కూడ సంస్కారే గాని విశేష ప్రయోజకుడు కాడు. ఆ యింటికి వెలుగు తెచ్చినది యీ కృష్ణమాచార్యులు భార్య నాంచారమ్మ. ఆమె తల్లీ తండ్రి కూడా పండితులౌట చేత ఆంధ్ర గీర్వాణముల యందు మంచి జ్ఞానం సంపాదించిరి. పురాణం ఆ యిల్లాలు చదివినంత శ్రావ్యంగానూ, రసంతోనూ యెవరూ చదవజాల్రు. రూపమూ రూపానికి సదృశమైన గుణ సంపత్తీ కలదు. ఆమెకు ఒక కొమార్తె. ఒక కొమారుడున్నూ. యిల్లూ, దేవాలయం కూడా ఆమే చక్కబెట్టుకుంటారు.

“ఇది కవిత్వమా, నిజమా?” అని వెంకయ్య అడిగాడు.

మాకూ వాళ్ళకూ రాకపోకలు గలవు. నా భార్య చెప్పిన మాటలు నే చెబుతున్నాను. ఆమె పురాణం చదవడం చవులారా విన్నాను. మీకూ వినడపు అభిలాష వుంటే రేపటి దాకా వుండిపొండి. విష్ణుస్థలం యొక్క స్థితి ఇది. గాని, అయ్యంవార్లం గారు మత సంబంధమైన జట్టీలలో యెన్నడూ జోక్యం కలుగజేసుకోవడం లేదు. వైష్ణవ పక్షానికి కెప్తాను సాతాని మనవాళయ్య, అనగా రోజూ పొద్దున్న ఉపాదానానకు వచ్చి, స్తోత్ర పాఠాలతో పెణక యెగర గొట్టేస్తాడే, అతగాడే ఒకనాడు తెల్లవారగట్ల కలక్టరు గారు గుఱ్ఱమెక్కి వస్తూ వుండగా, గ్రామ పొలిమేరను మనవాళ్లయ్య యెదురై, పెళపెళమని శ్లోకం యెత్తుబడి చేసేసరికి, ఇతని స్థూలకాయం బఱ్ఱె నామాలు, రాగి ధ్వజం, కోలాహలమూ చూసి గుఱ్ఱం బెదిరింది. కోపం వొచ్చి కలక్టరు

అయిదు రూపాయలు జుల్మానా వేశారట. యీ కథ శుద్దాబద్దం అనీ, తనచేత శ్లోకాలు చదివించి దొరగారు అయిదు రూపాయలు ప్రెజంటిచ్చారని, అవి పెట్టి కొత్త వ్యాయవార పాత్ర కొన్నాననీ మనవాళ్ళయ్య చెబుతాడు.

2

శైవులలో వున్న ఐకమత్యం వైష్ణవుల్లో లేదు. సాతాన్లు చాలమంది మనవాళ్ళయ్య శిష్యులే. అయినప్పటికీ కొందరుమట్టుకు అతను అవతార పురుషుడని చెప్పరు. అతనంటాడు - శరభయ్యే వృషభావతారమైనప్పుడు నేను గరుడాళ్వారి పూర్ణావతారం కాకపోతే కాకపోవచ్చును గాని వారి యొక్క అత్యల్పాంశవల్లనైనా జన్మించి వుండకూడదా. గరుడాళ్వారి నఖముల యొక్క తేజస్సు నాయందు ఆవిర్భవించి వున్నది కాబట్టే, శరభయ్యను యిలా చీల్చి పేల్చుతున్నాను.

అయ్యవార్లంగారికి ఒక మాటు యీ మాట చెవి సోకి గట్టి చీవాట్లు పెట్టారు. ఆ చీవాట్లు తిని పైకి వచ్చి, “యీ బ్రాహ్మలదీ, జ్ఞానము కాదు. అజ్ఞానమూ కాదు. కడజాతి మనుష్యులే భక్తి ప్రభావం చేత అళ్వార్లు అయివుండిరి గదా! ఇంతకాలవాఁయి రాముడి ధ్వజమును జయప్రదంగా మోస్తూ, శైవ సంహారం చేసిన నేను శ్రీమద్గురుడాళ్వారి నఖాగ్రాగ్రం యొక్క అవతారం యేల కాను? గరుడాళ్వారి నఖములు పెరిగి, ఖండన ఐనప్పుడూ ఆ ముక్కలు నా వంటి భక్తులుగా ఆవిర్భవించి పరమత సంహారం చేస్తవి గాని, వృధాగా పోనేర్చునా? వట్టి మాట!” అన్నాడు. “ఔర : యేమి మూర్ఖత; యేమి అహంభావము. యీ అజ్ఞులా అవతార పురుషులు? యిలా అన్నందుకు వీళ్ల తలలు పగిలిపోవురా?” అని గురువుగారు అన్నారు.

“శాస్తుర్లు గారూ! పాతరోజులైతే వీళ్ళే అవతారాలయి పోదురు. వీళ్ళ పేరట బొమ్మలు నిలిపి, దేవాలయాలు కట్టి, మనవేఁ పూజ్జేతుం. మరి బుద్ధుడూ యిలాంటి మనిషే గదండి” అన్నాడు వెంకయ్య.

“చాకి బట్టెకీ సముద్రానికీ సాపత్యం తెస్తివి” అన్నారు గురువు గారు.

“అన్న మాటకల్లా వ్యాఖ్యానం చేస్తే గాని వూసుపోదురా?” అని నే అన్నాను.

“యీ వూరి నాయలు స్తోమం కలవాళ్లు. అందులో సారధి నాయడు లక్షాధికారి. అతని బావమరిది రామినాయడు గ్రామ మునసబు. కొంచధూర్తూ, నిషా బాజీన్నీ - భోజన ప్రియుడు. యీ తాలూకాలో కల్లా పెద్ద సారా దుకాణం యీ వూళ్ళోనే వుంది. దాన్ని బట్టి ఈ వూరి యోగ్యత మీరు వూహించుకోవచ్చును.

నాలుగు సంవత్సరముల కిందట యిక్కడికి దక్షిణ దేశం నుంచి ఒక అయ్యవార్లంగారు

వచ్చి, సారధి నాయడికీ, ఇంకా మరి కొందరు నాయలకూ, చక్రాంకితం చేసి, వైష్ణవవిఁచ్చారు. ఆనాడు మునసబు రామినాయడు రామస్వామి వారి ఆలయంలో తూంపట్టు పుళిహోరా, వైష్ణవమూ యేక కాలమందే గ్రహించాడు. నాటికీ నేటికీ, రెంటియందూ ప్రపత్తి యేకరీతిగానే వుంది. అప్పటి నుంచి సారధి నాయడు ద్వాదశి ద్వాదశికీ స్వాం వారికి విరివిగా రాగ భోగాలు నడిపిస్తున్నాడు. ద్వాదశి అంటే రామినాయడికి పెద్ద పండుగ.

నాయళ్ళంతా వైష్ణవం పుచ్చుకొని, శివకోవిల వైపు తిరిగి చూడకపోవడం, శరభయ్యకు కంట్లో మిరపకాయ రాసుకున్నట్టు వుండెను. ఆలోచించి, ఆలోచించి ఒక యెత్తు యెత్తాడు.

ఆ రోజుల్లో హైదరాబాదు రాజ్యం నుంచి శివాచార్లు కొందరు దేశ శంచారార్థం యీ ప్రాంతానికి వచ్చారు. మరి రెణ్ణెల్లనాటికి పీఠంతోనూ, ప్రభలతోనూ, రుంజలతోనూ, పెను ప్రళయంగా వచ్చి యిక్కడికి దిగబడ్డారు. రోజూ అర్ధరాత్రి వేళ శివార్చన చేసేవారు. ఆ సమయంలో శంఖాలు, జయఘంటలు, ఢమామీలు, వీటి ధ్వని పామరుల మనస్సులో భయోత్పాతం పుట్టించేది. యీ నల్లరాతి కొండల్లో ఆ ధ్వనులకు ప్రతి ధ్వనులు కలిగి, కోలాహలంగా వుండేది. యీ అట్టహాసంతో, వైష్ణవం పుచ్చుకున్న ఒక్కొక్క నాయడే, నామాలకి నామంబెట్టి, విఫూది రుద్రాక్ష ధారణం చెయ్యడం ఆరంభించాడు. వచ్చిన పదో రోజున శివాచార్లు గుండం దొక్కడానికిపెద్ద ప్రయత్నాలు చేశారు. సారధి నాయణ్ణి కదిలించడవేఁ వాళ్ళ ముఖ్య ప్రయత్నంగా వుండెను. అదివరకే సారధినాయడికి శివమతం వేపు తూగు లావాయెను. గుండం తొక్కడం చూసిన తరవాత సారధినాయడు సిద్ధాంతంగా శైవం పుచ్చుగుంటాడని అంతా నమ్మారు. అందుచేతనే, శైవుల్లో మొనగాళ్ళంతా రుంజలతో సారధి నాయడి యింటికి వెళ్ళి, చాలా కైవాదం చేసి వుత్సవం చూచుటకు రాక తీరదని పిలిచారు.

యీ మాట చెప్పగా, అయ్యవార్లంగారు యేవఁన్నారంటే “రాముడి ఆజ్ఞ యేలా వుంటే, ఆలా జరుగు గాక. వైష్ణవుడు, శైవుడు కావాలని కోరితే, అడ్డి యేమి కార్యం? కాక కాశీలో మృతి పొందిన వారికి శివుడేకదా, తారక మంత్రోపదేశం చేస్తాడు. గనక యీ జన్మంలో పరమ శైవుడైన వాడికి, వచ్చే జన్మలో తారక మంత్రోపదేశం చేసి, ముక్తి యివ్వకపోతాడా? యే మతవైనా ప్రపత్తి వున్నవాడికి తోవ వుంది. అది లేకుంటే వైష్ణవుడైనా, కార్యం లేదు”. సాతాన్లకి అయ్యవార్లం గారి ఉదాసీనత చేయి విరుచుకున్నట్టు వుండెను.

ఈ బ్రాహ్మడికి వైష్ణవాభిమానం తక్కువ. గనక మనం విజృంభిస్తేనే కాని వైష్ణవమత ప్రభావానికి అగౌరవం వస్తుందని మనవాళ్ళయ్య ప్రగల్భించి, శివాచార్లు గుండం దొక్కేనాటి రాత్రి రెండు రూములప్పుడు, కోవిల యెదటి రావి చెట్టు కింద పెద్ద మీటింగు చేశాడు. సాతాన్లూ, నాయలూ వొందలకి జమ అయినారు. అందులో యోధులు, దుకాణంలో రహస్య

శేవ శేవించి, ఒక్కొక్కరే దిగబడ్డారు. అంతట మనవాళ్లయ్య చెట్టు మొదటి రచ్చ రాతి మీద వంగి, నిలిచి, గెడ్డము కింద వక కఱ్ఱ ఆనుకొని, యేమని పలికెను. “పరమ భాగవతోత్తముల్లారా! వింటిరా ఈ శైవుల యొక్క రాక్షస మాయల్లో పడి, అప్పుడే చాలామంది నాయలు వైకుంఠానికి పోయే రాజమార్గమైన వైష్ణవ మతం విడచి, అంధకారబంధురమైన శైవ మతంలో కూలి పోయినారు. ఇక మన పరమ మిత్రుడున్నూ, భక్తాగ్రేసరుడున్నూ అయిన సారధి నాయణ్ణి మాయగమ్మి తమలో పడవేసుకొనుటకు, యిప్పుడు విపుల ప్రయత్నం చేస్తున్నారు. యీ రాత్రి అతడు వెళ్ళి శైవుల ఘోర కృత్యములు చూసెనా, మరి మనవాడు కాడు. గనక అతన్ని కాపాడి శ్రీమహావిష్ణు యొక్క మహిమ ప్రజ్వలింపచేసే సాధనం యేమిటో తాము అంతా ఆలోచించండి. సారధి నాయడు యీ రాత్రి అక్కడకు వెళ్ళకుండా ఉపాయము కల్పించడము కర్తవ్యమని నా అభిప్రాయము”.

యెలాగంటే, యెలాగని నలుగురూ తలపోయుచుండగా, రామనుజయ్య లేచి నిలిచి అన్నాడు. “దీనికింత ఆలోచనేలా? యేమి? వాళ్ళు చేసే పని మనవేఁల చేయరాదూ? రామభక్తుడైన శివుడికే అంత మహిమ వున్నప్పుడు సర్వేశ్వరుడైన ఆ రాముడికి అంతకన్న వెయ్యి రెట్లు మహిమ వుండకపోయినా? గనక, నా సలహా యేమిటంటే శ్రీ మద్గరుడాళ్వారి అవతారమైన మనవాళ్ళయ్య, రాగి ధ్వజం చేతపట్టుకొని నాలాయిరం పఠిస్తూ గుండం తొక్కితే సరి. శ్రీ వైష్ణవ మతాల తారతమ్యం లోకానికి వ్యక్తం కాగలందులకు, శివాచార్ల గుండం కంటే మరి బారెడు ఆస్తి లావుచేసి, యీ చెట్టుకిందే యీ క్షణమందు బ్రహ్మాండవైఁన గుండం తయారు చేస్తాను. యిందుకు అభ్యంతరం చెప్పేవాణ్ణి వైష్ణవుడని భావించను”.

చీకట్లో యెవరికీ కానరాలేదు గాని మనవాళ్లయ్య నోరు వెళ్ళబెట్టాడు. నలుగురూ “బాగుంది! బాగుంది!” అనేసరికి అతని ప్రాణాలు యెగిరిపోయినాయి. ఒక్క నిమిషం ఆలోచించి అన్నాడు. “అన్నలారా! తమ్ముల్లారా! పరమ భాగవతోత్తముల్లారా! రామానుజయ్య నన్ను ఆక్షేపణ చేస్తున్నాడు. నేను పడవలసిందే? యీ శరభయ్యే వచ్చి తాను వృషభావతారవఁని నిక్కి నీలుగుతున్నాడు గదా, మనం దెబ్బకి దెబ్బతీదాం; అని కేవల వైష్ణవాభిమానం చేత, నేను గరుడ వేషం వేశానే గాని, ఇంత భారవైన శరీరంతో నేను గరుడాళ్వారిని యెన్నడూ కానేరనే? ఆ మాట నాకు తెలియదా? ప్రాజ్ఞులైన మీకు తెలియదా? రామానుజయ్య అయితే, చులాగ్గా డేగలా వున్నాడు గనక, అవస్యం అతగాడే గరుడాళ్వారి అవతారం. అతణ్ణే గుండం తొక్కమనండి. నేనుగాని నిప్పుల్లో కాలుబెట్టానంటే గజం లోతుక్కూరుకుపోయి చస్తాను. రామానుజయ్య తేలిగ్గా వున్నాడు; అంటీ అంటనట్టు చపచప అడుగేసుకుపోతాడు. అన్నల్లారా! న్యాయం ఆలోచించండీ” అనేటప్పటికి రామనుజయ్య సన్న సన్నగా జారాడు.

రామినాయడు జల్దుకొని అన్నాడు. “రావఁస్సోవిఁకి మయిమం వుందా లేదా? వుందా, యీ వేషాలు మాని తిన్నగా గుండం దొక్కు". ఆ మాట విని మనవాళ్ళయ్య మొహం జుమాల్మంది. రామానుజయ్యలాగ మందలో జొచ్చి మాయవౌఁదావఁంటే, చీమా, దోమా కాడు. పది యిరవై మణుగుల పట్టు. “హా దైవమా, నేను ఒక్క అరగడియ గరుడాళ్వారినే అయితే, యెక్కడకైనా యెగిరి ప్రాణం దాచుకుందును గదా” అని అనుకున్నాడు.

“యేం, పల్లకుంటావేం?” రామినాయడు పొడవడం ఆరంభించాడు. “అల్లాండం బెల్గాండం అని తెల్లారకుండగ వొచ్చి, తెగ అరుస్తావు గదా, ఆ ముక్కలన్నీ మావంటోళ్ళని బెదిరించి కూరా నారా లాగడానికేనా ఆటి మయిమం యే కాసింతైనా కద్దా?”

మనవాళ్ళయ్య నిట్టూర్పు విడిచి, రామానుజులను స్మరించి, యిట్లా అన్నాడు. “రామి నాయడన్నా, నివ్వూ నేనూ చిరకాలం నాటి నేస్తులం, నువ్వు గవునరుమెంటు వారి తరపున మునసబీ అధికారం చాలా కాలవాఁయి చలాయిస్తూన్నావు. యుక్తాయుక్తం యెరిగిన మనిషివి. అవును గాని, వైష్ణవమతం యొక్క అధిక్యత అగుపర్చాలంటే, ఆ శరభయ్య చేసే తక్కవ పనా, నన్ను చేయమంటావు? “పృధివ్యాపస్తేజో వాయురాకాశాత్” అన్నాడు. విష్ణు భక్తుడైన వాడికి కర్తవ్యం ఉత్తమోత్తం పృధివీ అనగా భూమిమీద నడవడవే. పంచభూతములలో మరి వక భూతం మీద వైష్ణవుడన్న వాడు అడుగేసి నడవనే కూడదు. అంతకు ఒక వీసం తక్కువ ఆపః అన్నాడు. అనగా నీట్లో ఉరకడం ఒకపాటి కర్తవ్యం కావచ్చు. అధమాధమం అగ్గి తొక్కడం గనక మీరు యావన్మందిన్ని యిప్పుడే నా వెంట రండి. యీ నిశీధి సమయంలో శ్రీ మహా విష్ణు నామస్మరణ చేసి అమాంతంగా సీతాగుండంలో వురుకుతాను. అప్పట్లో నా మహిమ మీకు తెలియగల్గు”..

రామినాయడు దగ్గిరకి వచ్చి, మనవాళ్లయ్య చెయి పట్టుకొని గట్టిగా నొక్కుతూ అన్నాడు. “యిన్నావా వైష్టపోడా, మా ఇయ్యంకుడు సారధి నాయడు జంగపాళ్ళలో కలిసిపోతే దోదసి పుళియోరి శక్కర పొంగళం పోతాయి. ఆ మాట నీకూ యెరిక, నాకూ యెరిక. నువ్వు సీతమ్మ గుండంలో ఆనపకాయ తుంబలాగ తేలి, యీతలాడితే, నీ మయిమం ఆడొప్పుతాడా, యెఱ్ఱి కుట్టె కబుర్లు మానేసి, మావాడు రెండు కళ్ళతో సూస్తుండగా అల్లాండం బెల్లాండం అంటూ అగ్గి దొక్కు!”.

“సరే నేస్తం నీ అభిప్రాయం ఆ ప్రకారం వున్నట్టయితే అలాగే కానియ్యండి. శ్రీ మహావిష్ణు యొక్కమహిమ నిలబెట్టడానికి అగ్గి తొక్కుతానా, తొక్కి చూస్తానా. యిప్పుడు చాలా రాతైంది. యిళ్ళకి పోయి పరుందాం. రేపు యీ వేళప్పుడు ఈ స్థలంలోనే బ్రహ్మాండమైన గుండం చేసి, దందహ్యమానమైన ఆ గుండం తొక్కి వైష్ణవ మత ప్రభావం కనపరుస్తాను. అప్పట్లో ఆ గరుడాళ్ళారే నన్ను ఆవహించి, అంత గుండమునూ చెంగున ఒక్క దాటున దాటిస్తారు. 

“ఆ పప్పు వుడకదు. యీ రాత్రి మా వాడు జంగపాళ్ళలో కలిసిపోతే, రేపు నువ్వుదాటేం, దాటకేం, ఆ దాటేదాటేదో, యీయాళ ఆళ్ళ గుండంలోనే దాటు. లెండోస్సి యీ వైష్ణపోణ్ణి మోసు గెళ్ళి గుండం తొక్కిద్దాం” అని రామినాయడు అనేసరికి నలుగురు నాయలు మనవాళ్ళయ్య రెక్కలు పట్టుకు రచ్చ రాతి మీద నుంచి కిందికి దించారు. మీరి వచ్చిందని మనవాళ్ళయ్య ఒక యెత్తు పన్నాడు.

“ఆగండి, ఆగండి గుండం తొక్కవలసి వచ్చినప్పుడు, అందుకు కావలసిన పరికరం అంతా కూర్చుకోవడవాఁ, లేకుంటే కట్టుగుడ్డలతో గుండంలో పడేసి; వొళ్ళు తెగ్గాలుస్తారా? ఆ శివాచార్లు వీరభద్ర విగ్రహం చేతబట్టి, మంత్రాలు పఠిస్తూ, శంఖధ్వనికి వీరావేశం పుట్టి గుండం తొక్కుతారు. అలాగే శ్రీ రామస్వాం వారి తాలూకు ఉత్సవ విగ్రహం వొకటి నా నెత్తిని కొడితే గాని యెలా చస్తాను? గరుడాళ్వారు అయినా యెప్పుడూ పెరుమాళ్వారిని వీపున మోసుకునే బయల్దేరుతారు గాని ఒట్టినే రెక్క కదపరు. మీరెరగరా” అనేటప్పటికి, సారధినాయడు “ఆ మాట నిజవర్రాఁ యిగ్గరవిఁస్తాడు. అయ్యవోర్ని తెలుపుకు రండోస్సి” అన్నాడు. నలుగురు నాయలు పక్కనున్న అయ్యవార్లం గారి యింటికి వెళ్ళి, పైమీద గుడ్డ అయినా లేకుండా ఆయనను మోసుకు వచ్చి రావి చెట్టు కింద రచ్చరాతి మీద కూచోబెట్టారు. యీ గడబిడ కనిపెట్టి కృష్ణమాచార్లు అటకెక్కి దాగున్నాడు.

3

అతి వినయమును నటిస్తూ మనవాళ్ళయ్య రంగాచార్యులు గారికి ప్రస్తుతాంశము విన్నవించి, ఉత్సవ విగ్రహమును యిమ్మని వేడాడు. రంగాచార్యులు గారు అన్నారు. “ఓరి మూర్ఖుల్లారా! మీకు మతులు శుభ్రంగా పోయినాయిరా? యీ గుండం తొక్కడమనేది గర్హ్యమైన తామస వ్యాపారము; వైష్ణవ మత నిషిద్ధము. మన గ్రంథాల్లో ఎక్కడా యీ ప్రక్రియ లేదు. గుండం తొక్కడానికి ఒక విధీ, మంత్రం యేడిస్తేనా?”

“శక్కరంతోటి వొళ్ళల్లా తెగ్గాల్చడానికి మంతరం కద్దా! అట్టే మాటలు శెలవియ్యక, ఆ యిగ్గరవేఁదో సాతానోడికియ్యండి”. అని రామినాయడు అడిగాడు.

“ఛీ! పొండి. మూర్ఖుల్లారా! నేను యిచ్చేది లేదు. ఉత్సవ విగ్రహములు శూద్రులు ముట్టుకో వలసినవి కావు. ముట్టుగుంటే కళ్ళు పేలిపోతాయి. అని రంగాచార్యులు గారు అనేసరికి, మనవాళ్ళయ్య, “బతికానురా దేవుడా”, అనుకొని, సారధి నాయడితో చూశావా నేస్తం; ఆ మాట నిజమే! నేను ఉత్సవ విగ్రహములు ముట్టుగోకూడదు. అందుచేత యిప్పుడు కర్తవ్యం యేమిటంటే ఆ విగ్రహం పట్టుకొని అయ్యవార్లంగారే గుండం దొక్కవలసి వుంటుంది. ఆ ఆధిక్యత అనేది వారికే వుండవలసినదీ”.


మునసబు “ముసలాయన యిగ్గరాలట్టుకుని గుండం తొక్కేదేటి? సిన్నసోవిఁని లెగదీసుకెళదాం, రండి” అన్నాడు.

“వాడి జోలికి వెళ్ళకండి. మా బాగే; వుత్సవ విగ్రహాలు పట్టుకుని, నేనే గుండం తొక్కుతాను. మా వాడు పట్ణం వెళ్ళాడు. వూళ్ళోలేడు” అని రంగాచార్యులు గారు అన్నారు.

“అయితేలెండోయి!” అని మనవాళ్ళయ్య బొబ్బ వేశాడు. అంతట ఆ రావి చెట్టు మాను చాటున గప్పునీ ఒక వెలుతురు పుట్టింది. అందరూ భీతిల్లారు. నిషాలు దిగజారజొచ్చాయి. వెంటనే మాను వెనక నుంచి, ఒక చేత కరదీపము, రెండవ చేత సూరకత్తి, పట్టుకుని, వుంగరాల జుత్తు గాలికి తూగులాడుతుండగా, నిబ్బరంగా అడుగు వేసుకుంటూ వచ్చి నాంచారమ్మ, మామగారి పక్కను నిలిచి, ఆయన రెక్కలు పట్టుకుని వున్న నాయల వంక బాకు మొన జూపి దుష్టుల్లారా! యీ పరమ పవిత్రమైన బ్రాహ్మణ్ణి వొదుల్తారా, బాకుకు బలి యిచ్చేదా?” అని అడిగినది.

హటాత్తుగా వచ్చిన యీ వీర రూపమును చూచి, అందరి ధైర్యాలూ అడుగంటాయి. అయ్యవార్లంగారిని పట్టి నిలిచిన నాయలు బెదిరి దూరం సాగారు. అంతట ఆమె చేతి దీపం రచ్చ రాతిమీద వుంచి, “నీకేం కావాల"ని మనవాళ్ళయ్యను అడిగింది. మనవాళ్ళయ్య రెండడుగులు వెనక్కివేసి, తనకేమీ అక్కరలేదన్నాడు.

“నీకు ఉత్సవ మూర్తులు కావలెనంటివే".

“నాకెందుకు తల్లీ, అపవిత్రుడను; వాటి యెత్తు బంగారం కరిగి యిస్తే నాకు అక్కర్లేదు. రామినాయడు యేమో కొంచం -”

ఆమె అటుంచి యిటు తిరిగి, రామినాయడిని నిస్సాకరంగా చూస్తూ - "నీకేం గావాలి, మునసబు సోయగా” అని అడిగింది.

మొహం వొంచి, రామినాయడు తనకేమి అక్కర్లేదని పైకి చెప్పి. “ఆడదాయితో యవడు . మాటాడగల్గు?” అని గొణుగుకున్నాడు. రామినాయుడి పెళ్ళాం గయ్యాళి.

నాంచారమ్మ - యెవరికీ యేమీ అక్కరలేకుంటే యీ ముసలి బ్రాహ్మణ్ణి వొంటిమీద బట్టయినా లేకుండా నిద్దర మంచం మీంచి యెందుకు యీడుచుకువస్తిరి? యెవడూ మాటాడ్రేవిఁ?”

రామినాయడు కొంచం ధైర్యం తెచ్చుకొని, “ఆడదాయితో మాటలకంటే సాల్లేం గానీ, యీ రాత్రి కాడ ఆ జంగపోళ్ళు శివుఁడి పేరు జెప్పి గుండం దొక్కుతారు గదా, మన రామస్సోంవోరి పేరు జెప్పి మనం కూడా గుండం దొక్కకుంటే, మన పెండెం యిరిగిపోదా?”

నాంచా : “నువ్వేల తొక్కరాదూ?” 

మున : “నాకు మంతరం, మాయా యెరికనేదే! అందకనే సాతానోణ్ణి తొక్కమన్నాను”.

నాంచా : (మనవాళ్ళయ్యతో) “నువ్వెందుకు తొక్క కూడదూ?”

మనవాళ్లయ్య : “అమ్మా యీవేళ యేదో నా ప్రారబ్దం చాలక యీ మీటింగు తలపెట్టాను. బుద్ది గడ్డి తిన్నది. యిదుగో లెంపలు పడపడ వాయించుకుంటున్నాను. తల్లీ నన్ను యీకాడికి వొదిలివేస్తే శ్రీరంగం వెళ్ళిపోతాను. యీ నాలుగు వూళ్ళ పొలిమేరనూ, నేనంటూ తిరిగీ కనపడితే, నా నెత్తి మీద పెద్ద పిడుగు పడిపోవాలి”.

నాంచా : “నీకు కొండంత గుండె వుంది! (రామి నాయడుతో) మునసబు నాయడా, నీ వియ్యంకుడు సారధి నాయుడు విరిగిపోతే, ద్వాదశి ద్వాదశికీ “శక్కర పొంగళం”, “పుళియోరీ” లేకపోతాయని గదా నీ దుఃఖం.

మునసబు : (తలగోక్కుంటూ) “ నాకొక్కడికే అన్న మాటేటమ్మా ఆ రామస్సోంవారికి మాత్రం పుళియోరం కరువైపోదా?”

మనవా :"అమ్మా శర్కరపొంగలి, దధ్యోదనమూ అనేవి ముఖ్యములు కావు. వైష్ణవ మతోత్కర్ష మహిమ కనపర్చి ఉద్దరించాలి, అదీ కర్తవ్యం”.

నాంచాం : ఆ వుద్దరించడం యేదో నువ్వేల చెయ్యరాదు? నీకు ఉత్సవవిగ్రహమంటూ యేలా? ఆకాశమంత రాగిధ్వజం మోసుకు తిరుగుతావు గదా. దానిలో అరకాసంతయినా మహత్తు లేదా?"

మనవాళ్ళయ్య, “మళ్ళీ మొదటి కొచ్చింద"ని సణుక్కుంటూ, కష్టం మీద మందలో దూరి అంతర్ధానం అయిపోయినాడు.

నాంచా : “రాముడే కాడు. యే దేవుడి మీద నయినా నిజమైన నమ్మకమన్నది యేడిస్తే, ఒక్క గుండవేఁ కాదు, అన్ని కష్టాలూ తరించవచ్చును. నేను మా మామగారి పేరు స్మరిస్తూ గుండం దొక్కుతాను. నా వెంట రాగలిగిన వైష్ణవులెవరైనా వుంటే యెదటికి రండి”.

యెవడూ కదలలేదు.

నాంచారమ్మ: నిరసన నవ్వు నవ్వి “ముసలాయనను అగ్గిలో తోసి పైనుంచి చూడడానికి మీరంతా వీరులా?”

యెవరూ ఉలకలేదు పలకలేదు.

నాంచారమ్మ అందరినీ కలయజూసి "పీరు సాయీబు యిక్కడ లేడా?” అని అడిగింది. పీరు సాయీబు వెంటనే యెదటికి వచ్చి "అమ్మా యిదిగో దాసుడ”ని చెయి జోడించి నిలుచున్నాడు. పీరు సాయీబు దూదేకుల సాయీబు అయినప్పటికీ, రామభక్తుడు, కీర్తనలు 

చెప్పుతాడు. హటయోగం అభ్యసిస్తాడు. రోడ్డు పక్క యేటి వొడ్డు తోటలో మఠం యితనిదే. యితనికి శిష్య బలగం లావు.

“సాయీబూ! నువ్వు గుండం తొక్కగలవా?” అని నాంచారమ్మ అడిగారు.

“మీ శలవైతే అవలీలగా తొక్కుతాను తల్లీ” అని అన్నాడు.

నాంచారమ్మ : “యేడీ మనవాళ్ళయ్య? గరుడుడి అవతారం అంతర్ధానమైపోయిందీ. | రామినాయడా పరమ భాగవతోత్తములైయుండిన్ని, మీరు యెవరూ గుండం తొక్కజాలినారు కారు గదా? అట్టి స్థితిలో యీ పచ్చి తురకకి గుండం తొక్కడానికి భగవంతుడు సాహస ధైర్యాలు యిచ్చాడు. గనక మీ వైష్ణవ మతం గొప్పా అతగాడి తురక మతం గొప్పా? రామినాయడా మీ దేవులాటంతా యీ రాత్రి వైష్ణవులు శైవులికి, పరాభవం చెయ్యాలని గదా! అందుకు వుపాయం చెబుతాను వినండి. మతాలు, సాత్వికాలూ తామసాలూ అని రెండు విధాలు. ఈ రెండు విధాల మనుష్యులూ శైవుల్లోనూ, వైష్ణవుల్లోనూ కూడా వున్నారు. గుండాలు దొక్కడం మొదలైన తామస కృత్యాలు చేసే వాళ్ళని శైవుల్లో శివాచార్లు అంటారు. మన వైష్ణవుల్లో అట్టి కృత్యాలు చేసే తెగ కూడా వున్నారు - యెవరో మీకు తెలుసునా?

మనవాళ్ళయ్య గుంపులో మరి వక పక్కనుంచి తన బుఱ్ఱ పైకి పెట్టి “యెవళ్ళమ్మా వాళ్ళు” అని అత్యాతురతతో అడిగాడు.

మునసబు నాయడు “మరెవళ్ళు? సాతానోళ్ళు" అనేటప్పటికి, మనవాళ్ళయ్య బుఱ్ఱ మళ్ళీ మందలో మాయమైపోయింది.

నాంచారమ్మ: “ఆ వైష్ణవులు యెవరా? మరెవరు తురకలు; పీరు అనేది యేమిటనుకున్నారు. శ్రీ స్వామివారి తిరునామమే. పట్టణంలో మా యింటి పక్కనే ఒక సాతాని పీర్లని నిలిపి గుండం తొక్కేవాడు. పట్టణంలో యెంతో మంది హిందువులే పీర్ల పంజాలు వుంచి గుండాలు తొక్కుతారు. గనక శ్రీ రామస్వామి వారి నామం తెచ్చి పీరు కట్టి యిస్తాను. ఆ పీరు పట్టుకు పీరు సాయీబు గుండం తొక్కుతాడు. పీరు సాయీబు యోగ్యత మీరెరిగినదే. అతగాడు కబీరు దాసంత భక్తుడు. గనక భయాలు విడిచి అతని వెంట వెళ్ళి జయించుకురండి. వేళకి భక్తి నిలుస్తుందో, నిలవదో చేతి కఱ్ఱలు మాత్రం మరవకండి.

ఆమె విరమించే సరికి పెళపేళమని ఆ మూకలో నుండి మనవాళ్లయ్య శ్లోక పఠనం ఉపక్రమించి యిటూ అటూ మనుషులను తోసుకుంటూ యెదటికి వచ్చి సాష్టాంగ వేసి “అమ్మా మీరు సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి అవతారం. వైష్ణవ మతం నిలబెట్టారు. మతమే అన్నమాట యేమిటి? మా ప్రాణాలు కూడా నిలబెట్టారు. యిహ నా విజృంభణం చూడండి” అన్నాడు. మన వాళ్ళయ్య పెద్ద హికమద్దారుడు. ఆ రాత్రి వైష్ణవ తంత్రం తరవాయి కథ అంతా అతనే నడిపించాడు.

అంతా చల్లారగానే అటక మీద నుంచి కృష్ణమాచార్యులు దిగాడు. కష్ట సాధ్యమును సాధించిన సంతోషముతో, నాంచారమ్మ కరదీపం తిరిగి చేతపూని, యింటికి సవిలాసముగా నడిచిపోవుచుండగా, పెనిమిటి యెదురైనప్పుడు ఆమె ప్రేమ పరిహాసములు పెనగొను దృష్టితో చూసెను. ఆ దృష్టి తనకు దేవత్వమిచ్చి తన్ను అవతార పురుషుణ్ణి చేసిందని కృష్ణమాచారి మర్నాడు నాతో చెప్పి, ఆ అర్థంతో శ్లోకం రచించాడు. తమ రహస్య శృంగార చేష్టలు మిత్రులతో చేప్పితేనే గాని కొందరికి తనివి తీరదు.

ఆ రాత్రి శివాచార్లు గుండం తొక్కడం చూడ్డానికి నేను వెళ్ళివుంటిని. తెల్లవారగట్ల నాలుగు గంటల వేళ చిరిచీకటిలో గుండంలో నిప్పులు కణకణ లాడుతుండెను. ప్రాతఃకాలపు శీతగాలి సాగింది. ఒక్క పెట్టున గర్భ నిర్భేదమయ్యేటట్టు శంఖాధి వాద్యములు రేగాయి. ఇంగిలీషు చదువుకున్న నాస్తికాగ్రేసరులకు కూడా ఆ కాలమందు బితుకు కలిగిందని వారే వొప్పుకున్నారు.

పందిటిలో నుంచి వీరగంధాలు పూసుకున్న నలుగురు శివాచార్లు గుండం దగ్గరకు వచ్చి నిలుచున్నారు. ఒకడు నెత్తిమీద భీకరమైన రాగి ప్రతిమ పెట్టుకున్నాడు. యెదురుగా నిలిచి మరి వకడు కత్తి ఝళిపించుచూ వీర వాక్యాలు కొలిపాడు. ఒకడు గుండంలో నెయ్యిపోసి గుమ్మిడికాయ తుండలు గుండంలోకి విసిరాడు. వెంటనే శివాచార్లు గుండం జొచ్చి నడుచుకు పోయినారు. అవతల వొడ్డు చేరి తిరిగి తొక్కుటకు వారు యిటు అభిముఖులై యుండగా, “అల్లా-రామ్" అని కెవ్వుమని ప్రళయమైన కేక ఒకటి వేచి, తక్షణం శివాచార్లు గుండం దిగిన వేపు నుంచి, మూకను చీల్చుకుని ఒక మనుష్య ప్రవాహము గుండము దాటుకుని పోయింది. వారిలో అందరున్నూ ముఖముల మీద ముసుగులు వేసుకున్నారు. ఆ మనుష్య ప్రవాహమునకు అగ్రమందు వెండి పీరు వకటి రెండు చేతులా పట్టి ఒక వీరుడు భీముని వలే నడుచుకుపోయి నాడు. యిది అంతా అర నిమిషం పట్టలేదు.

మూక, చకాపికలై చెదిరిపోయినది. కొందరు సాతాన్లకీ, శివాచార్లకీ కూడా యత్కించిత్ కాళ్ళు కాలాయి. అది భక్తిలోపం కింద కట్టారు. తరువాత శరభయ్యకీ, మనవాళ్ళయ్యకీ రాజీనామా అయినదని అనుకుంటారు. పైకి మట్టుకు దెబ్బలాడుతున్నట్టే వుంటారు.

అదుగో, మా యింటికి యెదురుగా ఆ రచ్చసావిట్లో నిలిపిన పీరు ఆ పీరే. నాటినుంచీ, ప్రతి సంవత్సరం ఆ పీరుకు పండుగ చేస్తారు. వూరు ఆబాలగోపాలం శైవ వైష్ణవ భేదం లేకుండా పీరు దేవరకు మొక్కులు చెల్లిస్తారు. త్రిశూలాకారం గనక ఆ పీరు శివపీరే అని శరభయ్య అంటాడు. కేవలం రామస్వామివారి నామం గనుక విష్ణుపీరని మనవాళ్ళయ్య వాదిస్తాడు. ఆ వ్యవస్థయేదో వెంకయ్య పంతులు గారే చెయ్య సమర్థులు. 

“శివుడూ, విష్ణూ పీర్లే అయినప్పుడు, బుద్దుడు శివుడు కారాదా?” అని శాయన్న భుక్త కథ పరిసమాప్తి చేశారు.

మా గురువు గారు యీ చరిత్రకు చాలా ఆశ్చర్యపడి అన్నారు. “ఔరా! కలికాలంలో మనుష్యులే కాదు - దేవుళ్ళు కూడా సంకరం అవుతున్నారు.

“అయినా తప్పేమి? శివుడన్నా, విష్ణన్నా, పీరన్నా బుద్ధుడన్నా ఆ పరమాత్మ మట్టుకు ఒక్కడే గదా?” వెంకయ్య వూరుకుంటాడా, “అందరు దేవుళ్ళూ వక్కరే అయితే, ఆ పీనుగుల్ని అందరినీ ఒక్కచోటే నిలిపి అందరూ కలిసి పూజ తగలెట్టరాదా?” అన్నాడు.

అంత గురువుగారు “ఓరి! దేవుళ్ళని పీనుగులంటావురా? నువ్వు వొట్టి కిరస్తానువి - యింకా కిరస్తానుకైనా దేవుడంటూ వున్నాడు; నువ్వు కిరాతుడివి. పీరో, బిట్రో, దెయ్యమో, దేవరో, యీ అజ్ఞులకు మూఢభక్తి అయినా వుంది. నువ్వు అందరు దేవుళ్ళకీ ఒక పెద్ద నామం బెట్టావు.

“ఒక్క మీకు తప్ప శాస్తులు గారూ”, అన్నాడు.

“నీ జన్మానికల్లా విలవైన మాట అంటివిరా” అని నే అన్నాను.

(ఆంధ్రభారతి, 1910 ఏప్రిల్, మే, జూన్ సంచికలు)


This work was published before January 1, 1928, and is in the public domain worldwide because the author died at least 100 years ago.