మీఁగడతరకలు/వేఁటకాఁడు—రాబందు
వేఁటకాఁడు - రాబందు
వేఁటకుక్కలు డేగలు వెంట రాఁగ,
వెడలె కానకు నొకనాఁడు వేఁటకాఁడు;
అంత నతఁ డేగెనో లేదొ కొంతదవ్వు,
దారిలో నొక్క రాబందు తారసిల్లి .
"అయ్య ! మృగయుఁడ ! నీవు వేఁటాడునపుడు
నాదుబిడ్డలలో నీకు నేది యైన
కానిపించిన, చంపక కాతు ననుచు
అభయహస్త మొసంగుమా! " అనుచు వేఁడె.
అంత నాతఁడు పక్షితో ననియె నిట్లు:
"అట్టులే కాని, నీబిడ్డ లనుచు నేను
గుఱుతుపట్టుట యెట్టులో యెఱుఁగఁజాల
కాన చెప్పుమ యేదేని యానవాలు.”
పక్కు మని నవ్వి యతనితో పక్కి యనియె:
“ ఔర ! మృగయుఁడ ! యెంత మాటాడినావు ?
పులుఁగుజాతుల నిన్నాళ్లు మెలఁగుచుండి
అడిగెద వె నాదుబిడ్డల యానవాలు ?
"జగములందలి బహువిధఖగము లెల్ల
నాదుబిడ్డలతోడ సౌందర్యమందు
సాటివచ్చునె? కాన నోవేఁటకాఁడ!
వాని నవలీల పోల్పఁగవచ్చు నీకు. "
"పెక్కుమాట లిఁ కేల ! ఓపక్కిఱేడ!
వినుము చెప్పెద- నీబిడ్డ లనఁగ నేల ?
సుందరం బగు పక్షులజోలిఁ బోవ
నంచు నే నిదె బాస గావించువాఁడ. "
అనుచు వచియించి యాతఁడు వనములోని
"కేగి, దిన మెల్ల పక్షుల నెన్నొ కూల్చి,
వాని నన్నిటి నొక త్రాట వరుసఁ గూర్చి
తరలి వచ్చుచునుండె నాదారి వెంట.
ఎదురుగా వచ్చి రాపులుఁ గిట్టు లనియె!
అవుర ! యెంతటి మోసకాఁడవుర నీవు ?
మంచిమాటల నన్ను నమ్మంగఁ బలికి
నాదుబిడ్డలఁ జంపంగ న్యాయ మగునె ? ”
"నీదుబిడ్డలు లే విందు నిక్కముగను,
నేడు చంపిన పిట్టలన్నింటియందు
అంద మగు పిట్ట యొక్కటి యైన లేదు;
నీవె చూడుము నామాట నిజమొ , కాదొ! "
"ఇంతమాత్రమె మూర్ఖుఁడా యెఱుఁగ వైతి,
వవనియందలి సర్వవస్తువులలోన
తనదుబిడ్డలె యధిక సౌందర్యవంతు
లనుచు మనమునఁ దలఁపని జనని గలదె?"