మీఁగడతరకలు/పక్షి—వరిపొలము

వికీసోర్స్ నుండి

పక్షి - వరిపొలము



ఊరి వెలుపల, నొక సెలయేఱుదరిని
పండఁ బాఱిన పొలమందు, పక్షి యొకటి
గూటిలో, దాను పిల్లలు గూడి మాడి
కాపురము చేయుచుండె సౌఖ్యంబు మీఱ.

చంచువుల గింజ లిరికించికొంచు పక్షి
ప్రేమతో కందువులఁ దినిపించుచుండె;
అపుడే మొలచిన ఱెక్క లల్లార్చి కొనుచు
కొదమపులుఁగులు కిలకిల కూయుచుండె.

అంత నచటికి పొలముకా పరుగుదెంచి,
తనదుపు త్రునితో నిట్టు లనియె: " కుఱ్ఱ !
పండె పొల మెల్ల , నిఁక తడ వుండరాదు,
కాపు లందఱ బిలిపింతు రేపే కోయ."


"అమ్మ ! వింటి వె పొలముకా పన్నమాట  ?
నిలువవచ్చునె మన మిందు నిముస మైన ?
ప్రొద్దుపుచ్చితి మిన్నాళ్లు ముదము మీఱ,
ఎందు బోవుదు మక్కటా ! ఇప్పు డింక ?"

అనుచు పిల్లలు వచియింప, అనియె తల్లి:
"ఇందె యుందము, అప్పుడే తొందరేల ?
రేపె జరుగవు కోతలు, కాఁపువాఁడు
ఒరులసాయ మపేక్షించియుండెఁ గాన. "

కడచె కొన్నాళ్లు; మరల నాకాఁపువాఁడు
పొలమునకు వచ్చి వచియించె పుత్రు తోడ:
"ఒరుల పైఁ బెట్టి మన మింక నుండఁ దగునె?
నేఁడె కోతము స్వయముగ నీవు నేనె. "

అంత పిల్లలలో నిట్టు లనియె తల్లి:
“ గడియ యైనను మన మింక తడయరాదు;
పరులసాయంబు లేకయె స్వయముగానె
కార్య మొనరింప సమకట్టె కాపువాఁడు.



"రమ్యమగు నొక్క పద్మాకరంబుపొంత
గూడు కట్టితి నొక చెట్టుకొమ్మమీఁద;
హాయిగా నందు సకలసౌఖ్యములతోడ
నుంద మెప్పుడు నా ముద్దుకందులార ! "