Jump to content

మీఁగడతరకలు/వాషింగుటన్

వికీసోర్స్ నుండి

వాషింగుటన్


పాంథుఁడొక్కఁడు పట్టణపరిసరమున
హయముపై నెక్కి యెచటికో అరుగుచుండె
ఊరి వెలుపల కొందఱు యుద్ధభటులు
త్రోయుచుండిరి బరువైన దూల మొకటి.

బలిమిమై వార లందఱు పట్టి పెనఁగి
అదిమి లాగిన దూలంబు కదల దయ్యె;
'పట్టు, డెత్తుఁడు, నెట్టుఁడు, కట్టి లాగుఁ'
డంచు నొక్కఁడు వారి గద్దించుచుండె.

పథికుఁ డది చూచి వానితోఁ బలికె నిట్లు:
'అయ్య ! ఇటు చేయుఁ డటు సేయుఁ డంచు నిల్చి
నుడువుకంటెను నీవును నడుముకట్టి
సాయ మొనరించి కార్యంబు చేయరాదె?"



చుఱుకుచుఱుకున నాతండు చూచి అనియె:
"నన్ను కేవలసామాన్యనరునిరీతి
మాటలాడెదు తారతమ్యంబు లేక ;
ఎవ్వరనుకొంటి? సేనానిఁ జువ్వె యేను."

“ అహహ ! మీర లంతటి మహామహు లటంచు
ఎఱఁగ కాడితి, నను క్షమియింపుఁడయ్య ”
అనుచు తెరువరి మెల్లన హయము డిగ్గి
శక్తి కొలఁదిని భటులకు సాయపడియె.

తోడనే వారు పథికుండు తోడుపడఁగ
ఎత్తి రవలీల దూల మువ్వెత్తు గాఁగ;
చెంత నిలుచుండె నడుమునఁ జేయివైచి
భూవరుం డన దళవాయి ఠీవి మెఱయ

అంత తెరువరి నవ్వుచు నతని కనియె
"అన్న! ఎపుడైన పని యున్న నన్ను పిలువుఁ;
డన్యుడను గాను, సర్వ సైన్యాధిపతిని,
నన్ను పిలుతురు 'వాషింగుట 'న్నటంచు."

అంత పడవాలు గ్రుక్కుమి క్కనఁగ లేక
చిత్తరువు రీతి నిలఁబడె చేష్టలుడిఁగి;
'సెల వొసంగుఁడు పోయివ చ్చెద' నటంచు
చనియె తెరువరి వేగ నశ్వంబు నెక్కి