Jump to content

మీఁగడతరకలు/బాటసారులు—ఎలుఁగుగొడ్డు

వికీసోర్స్ నుండి

బాటసారులు - ఎలుఁగుగొడ్డు



చిట్టి చీమయు చొరరానిదట్ట మైన
దారుణం బగు నొక్క కాంతరమందు
రాత్రి వేళను భీముఁడు రాముఁడ నెడు
పాంథు లిరువురు కాల్నడఁ బయన మైరి .

రాముఁ డిట్లని వచియించె భీము తో డ:
"దారిలో నేది యైనను క్రూరమృగము
ఎదురుగా వచ్చి మన పైని గదిసెనేని,
ఏమి చేయద ? " మనవుడు భీముఁ డనియె:

"ఏను నీ చెంత నుండ నీ కేమిభయము ?
ఎన్ని గుండెలు గలవు నే నున్న చోట
ఘాతుక మృగంబు కదియంగ ? కదిలెనేని,
చించి చెండాడనే యొక్క చిటికలోన"


అతఁ డిట్లనియెనో లేదొ - అంతలోనే,
ఎచటనుండియొ యొక పెద్ద యెలుఁగుగొడ్డు
గుఱ్ఱుగుఱ్ఱున సటలెత్తి ఘుర్ఘురించి
పరుగువాఱుచు నాచెంత కరుగు దెంచె.

జల్లుజల్లున నొడలెల్ల జలదరింప
తనదుమిత్రునిమాటయె తలఁపు గొనక ,
పిక్క సత్తువ చూపించి భీముఁ డంత
తరువుమీఁదికి గుప్పించె సరభసమున

ఏమి చేయంగఁ దోచక రాముఁ డంత
చాపకట్టుగ నేలపై సాగిలఁబడి
కాలుసేతుల నట్టిట్టు కదపకుండ
ఉర్పు బిగబట్టి చచ్చిన యోజ నుండె

అంత భల్లూక మాతనిచెంతఁ గదిసి
ముక్కు నోరును చెవులును మూరుకొనుచు
చచ్చి యెన్నఁడో చివికిన శవమిదేల ?
అనుచు నాతని విడనాడి యనలఁ జనియె.


కొంత సేపటికిని గుండె కుదుటఁబడఁగ
డిగ్గు రని చెట్టు పైనుండి డిగ్గ నుఱికి
భీముఁ డడిగెను " మిత్రుఁడా ! ఏమి చెప్పె
తెలుపుమా నీదుచెవిచెంత ఎలుగుబంటి.”

అనుడు రాముఁడు వానితో ననియె నిట్లు :
"మంచిమాటలు చెప్పి నమ్మంగఁ జేసి,
అవల మోస మొనర్చెడి స్వార్థపరుల
చెలిమి చేయంగవల దంచు చెప్పె నెలుఁగు."