మీఁగడతరకలు/గృహము
స్వరూపం
గృహము
జగము కంటెను స్వీయ గృహంబు ప్రియము
దానికన్న ప్రియతరంబు తన పురంబు,
అంతకంటెను ప్రియతమ మాత్మగృహము;
గృహముకంటెను సౌఖ్యంబు మహిని గలది ?
తల్లి యైనను చేయంగ నొల్లనట్టి
మేలు లెల్లను సమకూర్చఁ జాలు నిల్లు '
అనెడి లోకోక్తి ధారుణి నమరెఁ గానఁ
గృహముకంటెను సౌఖ్యంబు మహిని గలదె?
తనకు గ్రాసంబు లేకున్నఁ మనఁగవచ్చు.
కాని వాసంబు లేకున్న గడపరాదు'
అనెడి లోకోక్తి ధారుణి నమరెఁ గాన,
గృహముకంటెను సౌఖ్యంబు మహిని గలదె?
అఖిలభోగ భాగ్యంబుల కాకరంబు,
సకలకల్యాణముల కెల్ల జన్మ భూమి,
భవ్యసుఖముల కెల్లను పట్టుకొమ్మ;
గృహముకంటెను సౌఖ్యంబు మహిని గలది?
కామితంబుల నొనఁగూర్చు కల్పతరువు,
ఊర్జితం బగు శుభముల కునికిపట్టు,
పరమసంతోషముల కెల్ల పంటచేను;
గృహముకంటెను సౌఖ్యంబు మహిని గలదె?