మీఁగడతరకలు/అల్పజంతువులు

వికీసోర్స్ నుండి

అల్పజంతువులు



సమరతలమున నోడి రాకొమరుఁ డొకడు
అరులు చెలరేఁగి తన్ను వెన్నంటి తఱుమ ,
వడిగఁ బరుగెత్తి యొక్క కారడవిఁ జేరి
వృక్షములచేయ నించుక విశ్రమించె.

బడలికలు వాయ నక్కింత తడ వతండు
నిద్రవో నెంచి చేలంబు నేలఁ బఱవ,
చీమలును సాలెపురుగులు చేరి, వాని
పాన్పుపై బ్రాకి చీకాకుపఱచె మిగుల.

మాలదైవము కటకటా ! ఏల కూర్చె
క్షుద్రజంతుల మనుజుల నిద్ర చెఱుప
శత్రువుల బాధ నెటులైన సైపవచ్చు,
వీని బాధల సైప నెవ్వానివశము ?

3



అనుచు నీరీతిఁ దలపోసి యాతఁ డెట్లొ
తుదకు నిదురించె; వానిని వెదకికొనుచు
వచ్చి నిలిచె తటాలున వైరివీరుఁ
డొక్కరుఁడు వాఁడు నిద్రించుచున్న యెడకు

ఏమిచిత్రమొ అంతలో చీమ యొకటి
కఱచె రాజకుమారుని కరతలంబు ;
ఉలికిపడి లేచి యాతండు తెలివి నొంది
కాంచె వెసఁ దన్ను జంప నుంకించు వైరి.

కని, జరీలున నొఱనుండి కత్తి దూసి
ఒక్క వ్రేటున పగతుని నుక్కడంచి
కడమ శత్రులు తన పైని పడకమున్నె
గంతుగొని దాఁగె నా చెంత గహ్వరమున

తరణి గ్రుంకిడె; నంత శాత్రవులు రాత్రి
రాకుమారుని కనుఁగొనఁ లేక విసిగి,
ఉదయమున లేచి యటునిటు వెదకి వెదకి
చేరి నిలిచిరి గహ్వరద్వారముకడ.


"సందియం బేల? ఈగుహాయందె యతడు
జొచ్చి తలదాచుకని యుండవచ్చు నిజము ”
అనుచు వచియించె నొక్కఁడు; “అట్లు కాదు
ఇందు లేఁడని నే వచియింపఁ గలను.

సఖుఁడ ! అల్లదె చూడుమా సాలెగూఁడు
అల్లిబిల్లిన ద్వారంబు నల్లి కొనియె:
వచ్చి రాకొమరుం డిందుఁ జొచ్చె నేని
చెక్కు చెదరక నిలుచు నే చెలఁదిగూఁడు ? "

అనుచు నీరీతి "రెండవయతఁడు పలికె ;
"సర్పములు క్రూరమృగములు సంచరించు
నిందు జొర నేల ? చావంగ నేల" యంచు
వారు వెడలిరి వచ్చినదారి బట్టి.

'బ్రతుకు జీవుఁడ' యంచు నీవలికి వచ్చి,
రాజసుతుఁ డంత తనయంతరంగ మందు
నిట్లు తలపోసె అక్కటా ! యిఁతదనుక
అల్ప జంతువులను నింద సల్పినాఁడ.




చిన్న జంతుల నేల సృష్టించె నంచు
నోరికకొలఁదిని దైవంబు దూఱియుంటి,
చీమచెలఁదుల సాయంబుచేతఁ గాదె
నిలిపి దైవంబు నాజీవములను నేడు.'