Jump to content

మార్కండేయపురాణము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

మార్కండేయపురాణము

ద్వితీయాశ్వాసము




మత్ప్రతాపరుద్రమ
హామండలనాథమండలావనదక్షా!
శ్రీమందిరఘనవక్షా!
రామారతినాథ! గన్నరథినీనాథా!

1

ఆడిబకయుద్ధవృత్తాంతము

వ.

పరమజ్ఞానచక్షు లైనపక్షు లాజైమిని కి ట్లనియె హరిశ్చంద్రుం డొనరించినరాజ
సూయంబునిమిత్తంబునం బ్రజానాశనకారణం బై ప్రవర్తిల్లినయాడిబకయుద్ధంబు
తెఱం గెఱింగించెద వినుము గంగాప్రవాహమధ్యంబునం దపోనిష్ఠం బండ్రెండు
వత్సరంబు లుండి వెడలి వచ్చి.

2


క.

ఘనుఁడు వసిష్ఠమునీంద్రుఁడు, వినియె హరిశ్చంద్రవిభుఁడు విశ్వామిత్రో
గ్రనికారంబున నివ్విధ, మున నెంతయు ఘోరదుఃఖములఁ బడు టెల్లన్.

3


ఆ.

విని నితాంతదుఃఖవేదనానలశిఖా, వలియుఁ దీవ్రకోపవహ్నిశిఖలు
నొక్కమాట యెగసి యుల్లంబులో నగ్గ, లింప మోము జేవురింప నపుడు.

4


వ.

అమ్మునీంద్రుండు విశ్వామిత్రు నుద్దేశించి యి ట్లనియె.

5


ఆ.

అతఁడు మత్తనూజశతముఁ జంపిననాఁడు, పుట్ట దన్నరేంద్రుఁ బెట్టినట్టి
వివిధబాధ లెల్ల విన్న నామనమున, నేఁడు పుట్టినట్టివాఁడియలుక.

6


వ.

అని పలికి యక్షణంబ.

7

వసిష్ఠవిశ్వామిత్రు లన్యోన్యశాపముల నాడేలును గొంగయు నై పోరుట

క.

బక మై యుండెద వని కౌశికు నతఁడు శపించె విని వసిష్ఠునకుం గౌ
శికుఁడును నాడే లగుమని, ప్రకటక్రోధమున నిచ్చెఁ బ్రతిశాపంబున్.

8


వ.

అ ట్లన్యోన్యశాపంబుల నయ్యిరువురును మూఁడువేలుందొంబదియాఱు యోజనం
బులపొడవైనబకంబును ద్విసహస్రయోజనోత్సేధం బైన యాడేలును నై
యంతంతరోషంబునం జేసి.

9

స్రగ్ధర.

పత్రప్రోద్ధూతవాతప్రబలరయమున న్పర్వతశ్రేణి దూలన్
గాత్రోద్యత్సాంద్రదీప్తు ల్గగనము దిశలు న్గప్పుచుండంగఁ జంచ
న్నేత్రప్రాంతంబులం దగ్నికణము లురల న్వీఁక నొండొంటిఁ దాఁకె
న్బత్రిద్వంద్వంబు లోకప్రకరము దలర న్భైరవాటోపలీలన్.

10


వ.

ఇట్లు తాఁకి.

11


సీ.

తామ్రలోచనసముద్ధతవిస్ఫులింగపాతములును దమముఖాగ్రములు గమర
సునిశితచండచంచుప్రహారములఁ బరస్పరపృథులపార్శ్వములు వ్రయ్య
నతిదీర్ఘదృఢచరణాహననముల నన్యోన్యశిరస్స్థలు లగలి పగుల
ఘనతరపక్షతాడనముల నితరేతరస్థిరాంగములు జర్జరితములుగ


తే.

ధరణిధరములు గూలఁగ ధరణి వణఁక, జలధు లుప్పొంగి కడవ గర్సులను సకల
భువనసంక్షోభముగఁ జలంబును బలంబు, డిగక నలువుమైఁ బోరె నాడియు బకంబు.

12


వ.

ఇవ్విధంబున నవ్విహంగంబులు పోరుచుండ.

13


తే.

పర్వతంబులు విఱిగి పైఁబడినఁ గొన్ని, వనధి వెల్లువ గట్టిన మునిఁగి కొన్ని
యవనితలచలనోగ్రరయమునఁ గొన్ని, గాఁగఁ బ్రాణు లెల్లను బరిక్షయము నొందె.

14


వ.

అంత.

15

బ్రహ్మదేవుఁ డాడిబకయుద్ధము మాన్పుట

చ.

అతులితపక్షిపక్షపవనాహతపర్వతపాతభీతికం
పితజనహాకృతిధ్వనుల పెల్లున నెంతయు లోక మాకులీ
కృత మగుచుండఁ దద్విషమకిల్బిషశాంతివిధాయి యై ప్రజా
పతి చనుదెంచె నమ్మహితపక్షులయొద్దకు వేల్పుమూకతోన్.

16


వ.

చనుదెంచి.

17


క.

మునులార! మీకుఁ దగునే, యని సేయఁగః వలవ దుడుగుఁ డఖిలహితముగా
ననినను మానక యవి రణ, మొనరింపఁ దదీయవికృతు లూహించి వెసన్.

18


వ.

పరమేష్ఠి వారలతిర్యక్త్వం బపనయించె నంతం బూర్వప్రకారాకారు లై నిలిచిన
కౌశికవసిష్ఠులం జూచి యద్దేవుండు మీకీవిరోధంబు హరిశ్చంద్రుని రాజసూయవిపా
కంబునఁ బ్రజాక్షయం బగుటకుఁ గారణంబై పుట్టె విశ్వామిత్రుండును నమ్మహాత్మునకు
నెగ్గు సేసినవాఁడు కాఁడు నాకలోకప్రాప్తికై యుపకారం బొనరించెఁ గావున మీరు
తపోవిఘ్నమూలం బైనరోషంబు విడువుం డనిన నమ్మహామును లట్ల కా నెఱిఁగి
యక్షీణక్షమావంతు లై యొండొరులం గౌఁగిలించుకొనిరి విరించియు నిజ
నివాసంబున కరిగె వారునుం దమతమతపోవనంబున కరిగి రని చెప్పి.

19

ఫలశ్రుతి

క.

ఆడిబకసాంపరాయము, వేడుకఁ జెప్పినను వినిన విఘ్నము లడఁగున్
రూడిగఁ బాయుం బాపము, లీడితజయసిద్ధి గలుగు నెపుడు నరులకున్.

20

క.

అని చెప్పిన విని జైమిని, మనము ప్రమోదమునఁ దేల మఱియును దా ని
ట్లనియె న్గుతూహలంబును, వినయంబును బెనఁగొనంగ విహగంబులకున్.

21

జడోపాఖ్యానము

సీ.

భూతవర్గంబు సంభూతి స్థితి
ప్రళయంబు లెట్టివి? జంతు వంగబాధ
నొందుచు నెట్లుండు నుదరంబులోఁ? దల్లి భుజియించు గురుతరభోజ్యనిచయ
మెల్ల జీర్ణంబుగా నెట్లు గ్రాఁగఁడు? ప్రాణి పుట్టి యెట్టులు వృద్ధిఁ బొందుఁ? జచ్చు
నెడ నిజజ్ఞానంబు నెట్టు దొఱఁగుఁ? జచ్చి యెచ్చట నుండి యహీనపుణ్య


తే.

పాపఫలములు గుడుచు? నేర్పడఁగఁ జెప్పుఁ, డీరహస్య మంతయు నాకు మీర లనినఁ
బక్షు లిట్లను విను మొకబ్రాహ్మణుండు, భార్గవాఖ్యుండు నిజపుత్రుఁ బరమశాంతు.

22


సీ.

అతివిమలాకారు సుతు నుపనీతునిఁ గావించి యిట్లను గారవమునఁ
గోరి భిక్షాశి వై గురుప్రీతి బ్రహ్మచర్యముఁ దాల్చి వేదంబు లభ్యసింపు
మఱి గృహస్థుండ వై మఖచయం బొనరించి బహుళసంతానంబుఁ బడయు మనఘ!
యటమీఁద వనవాసి వై ఫలమూలశాకాహారవిధిఁ దప మాచరింపు


తే.

తుది సమస్తంబు విడిచి విదూరమోహ, మతి వినిర్జితేంద్రియుఁడ వై యతివి గమ్ము
గడఁక నని యెంత చెప్పిన జడుఁడువోలె, నొక్క పలుకు పలుక కతఁ డూరకుండె.

23


క.

జనకుండు దన్నుఁ బ్రేమం, బునఁ బెక్కువిధముల మఱియు బోధించిన నా
జనకునిఁ గనుగొని నవ్వుచుఁ, దనయుం డి ట్లనియె వినుము తండ్రీ! తెలియన్.

24


సీ.

ఏను నీయుపదేశ మింతయుఁ జేసితి మును పెక్కుమాఱులు వినుతశాస్త్ర
బహువిధాఖ్యానశిల్పము లభ్యసించితిఁ బంచదశసహస్రభవము లెఱుఁగ
నయ్యెడు నిపుడు నా కందు నానాక్లేశసుఖములఁ బొందియు సుతకళత్ర
శత్రుమిత్రవియోగసంప్రయోగంబు లంగీకరించితి వి న్మనేకమాతృ


ఆ.

తతులచన్నుఁబాలు ద్రావితి బాలయౌ, వనజరావికారజనితబాధ
లతినికృష్టవృత్తి ననుభవించితి గర్భ, జన్మదుఃఖమరణసమితిఁ బడితి.

25


మ.

సకలక్లేశసుఖానుభూతి నిటు లీసంసారచక్రంబున
న్వికలస్వాంతుఁడ నై భ్రమించుచుఁ దుది న్నీ కిఫ్టు జన్మించితి
న్ప్రకటజ్ఞానసమన్వితుండ నయి కర్మభ్రాంతి బొంద వే
దకళాభ్యాసము లింక నేమిటికి? విద్వన్ముఖ్య! యూహింపుమా.

26


తే.

వినుము తండ్రి! యేర్పడఁ ద్రయీవిహితధర్మ, మరయఁ గింపాకఫలమున ట్లఘభరితము
పరమపదము మోక్షమ్ము తత్ప్రాప్తిఁ గోరు, నాకు నేటికిఁ గర్మకాననముఁ జొరఁగ.

27


వ.

అనిన విని వెఱఁగుపడి తండ్రి యి ట్లనియె.

28


తే.

ఏటిమాట లాడెదు గుఱ్ఱ! యెఱుక నీకు, నెక్కడిది? మున్ను జడభావ మేమికతన
నొదవె? నీప్రబుద్ధతయున్న యునికి నెచటఁ, గంటి?యిది శాపవికృతియో కాక నిజమొ?

29

తరల.

అనినఁ దండ్రికిఁ బుత్త్రుఁ డిట్లను నర్థితోఁ దొలుబామునం
దనఘ! విప్రుఁడ బ్రహ్మవిద్యఁ బరాయణత్వముఁ బొంది పెం
పొనర నేను గురుండ నై కరమొప్పుశిష్యులు తత్త్వవి
ద్ఘనులు గా నొనరించి యొక్కయుదాత్తపుణ్యవశంబునన్.

30


వ.

ఏకాంతశీలుండ నై యజ్ఞానాకృష్ణభావుండ నగుటం జేసి ప్రమాదంబునం గాలంబు
ప్రాప్తం బైనం ద్రయీధర్మంబులకుం బడయరానిజాతిస్మరణజ్ఞానంబు శిష్యు
లకుం బరమజ్ఞానదానంబుఁ జేసినఫలంబున నా కీభవంబున సంభవించె నిప్పుడు
పూర్వయోగాభ్యాసంబునఁ జిత్తంబు నిర్మలత్వంబు నొంది యున్నయది యింక
వివిక్తప్రదేశంబున నిలిచి నైష్ఠికుండ నై మోక్షార్థము యత్నించెద. నీకు
సంశయం బెయ్యది దాని నడుగుము చెప్పి ఋణవిముక్తుండ నయ్యెద ననిన భార్గ
వుండు.

31


ఆ.

అనఘ! నీవు మమ్ము నడిగినయట్టుల, యడిగె నడుగుటయును నతఁడు వేడ్క
యెసఁగ నీయనుజ్ఞ నెఱిఁగింతు నుత్క్రాంతి, విధము మున్ను గాఁగ వినుము తండ్రీ!

32

జడుఁడు దనతండ్రి కుత్క్రాంతివిధము నెఱిఁగించుట

క.

మానవులకుఁ జనుకాలం, బైనం బెనువెచ్చ మేన ననిలక్షుభితం
బై నెగయు నవియు మర్మ, స్థానము లూర్థ్వగతి నయ్యుదానుఁడు నడుచున్.

33


తే.

కట్టు విణ్మూత్రములు పొంగుఁ గడుపు పెదవు, లెండుఁ గుత్తుక తడియాఱు నెలుఁగు డిందు
నూర్పు లెడతెగుఁ గన్నుల నొందు వికృతి, వెక్కు పుట్టును నాలుక వెగడు గదురు.

34


వ.

అట్టియవస్థయందు.

35

మనుజశుభాశుభకర్మభోగవివరణము

సీ.

తోయాన్నదానపరాయణుం డగువాఁడు వేదనారహితుఁడై విడుచు నొడలు
శ్రద్దధానుఁడు నిత్యసత్యవ్రతుండును భూసురగురుపూజ్యపూజకుండు
విను కామసంరంభవిద్వేషములఁ జేసి ధర్మంబు దప్పనినిర్మలుండు
ననసూయుఁడును హ్రీసమన్వితుఁడును సుఖమృతిఁ బొందుదురు శీతవితతమోహ


తే.

తామసంబులఁ బొరయక ద్రవిణచాన, పరుఁడు జ్ఞానప్రదాయి దీపప్రదాత
యును శరీరము దొఱఁగుదు రొగిన పలికి, నట్ల చేయువాఁ డొందు మే లైనచావు.

36


ఆ.

అన్నదాత గానియతఁడు క్షుద్బాధ న, గారదాహకారి యారటమున
ననృత మాడుసాక్షియును వేదదూషక, జనుఁడు మోహపరతఁ జత్తు రపుడు.

37


ఉ.

దారుణనేత్రులు న్వికటదంష్ట్రులు ముద్గరపాశహస్తులు
న్ఘోరతరాననస్ఫురితకోపులు నై యమదూత లానరు
న్జేరినఁ గాంచి మైవడఁకఁ జేష్టలు వైకృత మందఁ బల్మఱు
న్నోరును గన్నులుం దెఱచు నుక్కట యై వెగ డగ్గలింపఁగన్.

38


ఆ.

తల్లిఁ దండ్రి నాలిఁ దనయులఁ దోఁబుట్టు, వులను దలఁచి పిలువ నెలుఁగు రాక

తల్లడమునఁ గేలఁదడవు బ్రాణంబులు, వెడలుటయును నొడలు విడుచు నరుఁడు.

39


వ.

విడిచి మాతాపితృసంభవంబు గాక నిజకర్మంబున నావిర్భవించినవయోరూపప్రమా
ణంబులం బూర్వశరీరంబునట్టిద యైనయాతనాదేహంబున దేహి ప్రవేశించుటయుం
గాలకింకరు లతిరయంబున.

40


సీ.

ఘనదీర్ఘదారుణకాలపాశంబులఁ గినుకతో వడిఁ బెడకేలు గట్టి
అత్యంతభయదంబు లగునిన్పగుదియల నఱవంగ నొడ లెల్ల ముఱుగ మోఁది
యెండఁ గాలిన నేల నెసఁగు వెన్మంటలఁ గాళులు వొక్కంగఁ గండ్లు ముండ్లు
క్రొవ్వాఁడి కొయ్యలు గుట్టలు పుట్టలు నైనదుష్పథమున నఘమయాత్ము


ఆ.

నీడ్చికొనుచు యామ్యు లేఁగుదు ర్నక్కలు, గలసి యతనిఁ దినఁగఁ గడురయమునఁ
గూడు నీరు నిల్లు గొడుగు చెప్పులు దాన, మిచ్చినతఁడు వోవఁ డట్టిత్రోవ.

41


క.

విను దేహి బంధు లిక్కడఁ, దన దేహముఁ గాల్పఁ దాపతప్తుం డగుచు
న్జనుఁ బండ్రెండుదినంబుల, ననేకదుఃఖాయనముల యమపురమునకున్.

42


వ.

అ ట్లరుగుచు.

43


ఆ.

బంధుజనులు సేయుబహుతిలోదకపిండ, విహితవివిధదానవిధుల భూమి
శయనముఖ్యమహితసద్వ్రతంబుల మృష్ట, భోజనములఁ దృప్తిఁ బొందుచుండు.

44


క.

విను పండ్రెండవదినమునఁ, దనబాంధవు లాచరించు తైలాభ్యంగం
బున నంగసౌఖ్యసంవా, హనమున నద్దేహి యలరు నాప్యాయితుఁ డై.

45

రౌరవనరకవర్ణనము

వ.

అంతం బదుమూఁడవుదినంబున నద్దేహి కింకరాకృష్యమాణుం డై తల్లడిల్లుచు.

46


శా.

నీలాభ్రాంజనపుంజవర్ణు నరుణోన్నిద్రాంబకోదగ్రు నా
భీలస్ఫీతనిశాతదంష్ట్రు భ్రుకుటిభీమాస్యు నానారుజా
కాలోగ్రాంతకమృత్యువందితు యముం గాంచు న్గదాదండపా
శాలోకస్ఫురణాభయంకరమహాహస్తుం గరాళాంగునిన్.

47


వ.

అయ్యముండును నద్దురాత్ముల నుపలక్షించి గతి నిర్దేశించిన నతండు.

48


సీ.

ద్విసహస్రయోజనవిస్తారమును జానుదఘ్నంబు నైనగర్తముననుండి
యనలకణంబులు గనగనఁ గనలంగ దారుణం బైనయారౌరవంబు
నడుమఁ గింకరులచే విడువంగఁబడి పడి నొఱలుచు నలుఁగడఁ బఱవఁ జరణ
యుగము నీ ఱగుచును మగుడంగ మొలచుచు నుండ హాహాకృతు లుడుగ కడర


ఆ.

ఘోరదుఃఖ మొకయహోరాత్ర మమ్మెయి, ననుభవించి యంత నచటు వాయ
వేయియోజనముల వెడలుపు గలవహ్ని, యందు బిట్టు వైతు రతని నెత్తి.

49


క.

బహునరకంబుల మఱియును, బహుదుఃఖము లొంది యతఁడు బహుకాలమున
న్మహికిఁ జనుదెంచి క్రిమిముఖ, బహుయోనులఁ బుట్టి క్షీణపాపుం డగుచున్.

50

వ.

మనుష్యత్వంబు నొంది సకలహీనజాతులకును జనించి శూద్రవైశ్యక్షత్రియబ్రాహ్మ
ణత్వంబులం బొంది సుకృతఫలంబున నారోహిణి యైనదేవగతిం బడయు మఱియుఁ
బుణ్యపరుం డైననరుండు యమశాసనంబున దివ్యాంబరాభరణమాల్యానులేపనాభి
రాముండును దివ్యవిమానారూఢుండును నై నాకంబున కరిగి కిన్నరగంధర్వగీతా
కర్ణనాప్సరోనృత్తాలోకన ప్రముదితహృదయుం డగుచు దివ్యసుఖంబు లనుభవించి
పుణ్యావసానంబున నవరోహిణి యైనమనుష్యగతిం బ్రాపించు నని యిట్లు మర్త్యుల
మరణప్రకారంబును శుభాశుభకర్మభోగంబులుం జెప్పి జంతూత్పత్తిప్రకారంబు
వినుమని కొడుకు తండ్రి కి ట్లనియె.

51

జంతూత్పత్తిప్రకారము

క.

సతిఋతుపుష్పరసంబును, బతిరేతోబీజ మందఁ బరలోకసమా
గతుఁ డయినయట్టిజీవుం, డతిరయమున వాయుభూతుఁడై యం దొలయున్.

52


వ.

ఇట్లు శుక్లశోణితద్వయంబున జీవసంక్రమణంబు సుస్థిరత్వంబు నొందిన.

53


క.

కలలము బుద్బుదమును నై, బలసి కరుడుగట్టు దానఁ బంచాంగములున్
మొలచును దాన నుపాంగం, బులు నన్ని క్రమక్రమమునఁ బుట్టు మహాత్మా!

54


ఆ.

సహజకఠినకోశసంవృద్ధితోడన, చాల వృద్ధి నొందు నాళికేర
ఫలముమాడ్కిఁ గోశపంజరంబున జంతు, వుండి దానితోన యొలయు వృద్ది.

55


వ.

అట్లు సకలావయవసంపూర్ణుండై.

56


సీ.

ఒకయంగుటంబుపై నొకయంగుటము మోపి జానుపార్శ్వముల హస్తములు సేర్చి
యంగుళు ల్జానులయగ్రంబులం దిడి కనుఁగవ జానుల వెనుక నూఁది
నాసిక జానులనడుమఁ బొందించి పిక్కలు రెండురెట్టలు గదియ హత్తి
చాల నొదిఁగి యిట్లు జానుమధ్యంబునఁ గడునిరోధంబునఁ గడుపులోన


తే.

నుండుననలంబు గాఠిన్య మొందఁజేయుఁ, దల్లి గొనునన్నపానము ల్దనువుఁ బెనుప
సతులవిజ్ఞానసంపద నతిశయిల్లుఁ, బుణ్యపాపాశ్రయత్వంబుఁ బొందు శిశువు.

57


వ.

అంతం దొమ్మిదవనెల నైనను బదియవమాసంబున నైనను బ్రాజాపత్యమారుత
ప్రేరితుం డై యధోముఖత్వంబు నొంది.

58


చ.

భ్రమఁ గడుఁ దల్లడిల్లుచును బైకొను వాయువుతాఁకున న్శరీ
రము నలియంగ వేదనభరంబు గరం బలయింపఁ బుట్టి మూ
ర్ఛ మునిఁగి బాహ్యమారుతము చల్లఁదనంబునఁ దేఱుఁ జాలఁ బూ
ర్వమహితబోధ మెల్లఁ జెడ వైష్ణవమాయ భజించి క్రక్కునన్.

59


శా.

మాయావేశమున న్విమోహరసనిర్మగ్నాత్ముఁ డై బాల్యదుః
ఖాయత్తుండును యౌవనోద్ధతవికారావిష్ణుఁడు న్వృద్ధతా
హేయప్రాప్తుఁడు నై పునర్మృతిభవానేకత్వదుఃఖాకులుం
డై యుండున్ నరుఁ డిట్లు సంసరణచక్రాక్రాంతివిభ్రాంతుఁ డై.

60

వ.

అని వెండియు.

61


సీ.

జననిగర్భంబుఁ జొచ్చినయది యాదిగా నీమనుష్యత సుఖ మింత లేదు
స్వర్గంబు పుణ్యసంక్షయపాతనభయాన్వితము గాన దుఃఖప్రదంబ యదియు
నరకంబు ఘోరదుస్తరతీవ్రయాతనాశీలం బగుట వేఱె చెప్ప నేల?
పశుపక్షిమృగక్రిమిప్రముఖతిర్యగ్జంతుచయత వాటిల్ల దుస్తరము మనకు


తే.

నిట్లు గావునఁ బరికించి యెందు సౌఖ్య, మించు కంతయు లేకున్న నెఱిఁగి కాదె
యిపుడు నైష్కర్మ్యనిష్ఠ వహించి బుద్ధిఁ, బరిహరించితి నేఁ ద్రయీసరణి తండ్రి!

62


క.

అనినను దండ్రి తనూజున, కను రౌరవనరకభంగి యంతయు వింటి
న్వినవలయు నరకవిధములు, వినిపింపుము మొదలుకొని వివేకనిరూఢా!

63

నరకవిధములు

వ.

అని యడిగినం బుత్రుండు దండ్రీ! నరకముల కెల్లను రౌరవంబు మొదలినరకంబు
దానివిధంబుఁ జెప్పితిఁ దక్కిననరకంబుల తెఱంగులు నెఱింగించెద.

64

మహారౌరవనరకము

సీ.

విను చతుఃపంచయోజనవిస్తృతమ్మును దామ్రమయము నైనదారుణాగ్ని
తప్తమై విద్యుదుద్దామప్రభాజాలదేదీప్యమాన మై తేఱి చూడ
రాక యత్యంతభైరవ మగుచుండు మహారౌరవం బందు యమునిభటులు
కాళ్లుసేతులు పట్టి కట్టి వైచినఁ బడి వృకములు బకములు వృశ్చికమశ


తే.

కములు గాకు లులూకము ల్గ్రద్దలు దిన, నఱచుచును దహ్యమానులై యతులదుఃఖ
మనుభవించి వెడలుదురు హాయనాయు, తార్జితం బైనదురితంబు లడఁచి నరులు.

65

తమోనరకము

మ.

అతిఘోరంబు తమోభిధాననరకం బందుండి దుష్కర్ము లు
గ్రతమశ్శీతనిరుధ్ధులై యొఱలుచు న్గంపించుచున్ క్షుత్తృషా
హతి వాపోవుచు శైశిరానిలవిభిన్నాన్యోన్యదేహోత్థశో
ణితమద్యంబులు ద్రావుచు న్నిరయవహ్నిం గాంతు రేణస్థితిన్.

66

నికృంతననరకము

చ.

అరుదు నికృంతనాఖ్య నరకం బది యందుఁ గులాలచక్రము
ల్దిరుగుచునుండు వానిపయిఁ దెచ్చి యఘాత్ములఁ బెట్టి కాలకిం
కరు లొగిఁ గాలపాశములఁ గాళులనుండి శిరంబుదాఁక భీ
కరముగఁ ద్రెంచుచుండుదురు ఖండము లెప్పటిరూపు దాల్పఁగన్.

67

అప్రతిష్ఠనరకము

తే.

అప్రతిష్టాఖ్యనరకంబునందు దుష్ట, నరునిఁ ద్రిప్పుదు రొగి రాటనములఁ గట్టి
పెక్కువేలేండ్లు నెత్తురు ల్గ్రక్కులోచ, నములఁ బ్రేవులు నురలి వక్త్రముల వ్రేల.

68

అసిపత్త్రవననరకము

సీ.

అసిపత్త్రవననిరయంబు సహస్రయోజనవిస్తరము పటుజ్వలనమయము
దానిమధ్యమున శీతలమును నసిరూపదలఫలకలితంబు బలవదుగ్ర
సారమేయాయుతస్వనసంకులమును నై పెనుపొంది యొకమహావనము వొలుచుఁ
బాపు లాబహిరగ్నిఁ బడి తనువులు గ్రాఁగి వనము డాయఁగఁ జని యనిలహతిని


తే.

రాలునాకులతాఁకున వ్రస్సి యొడళు, లవనిఁ గూలంగఁ గుక్కలు కవిసి కఱవ
బహువిధంబుల నలుగులపడుదు రింకఁ, దప్తకుంభంబుదారుణత్వంబు వినుము.

69

తప్తకుంభనరకము

క.

ఉడుగక యనలము మండఁగ, నుడుకుచు నూనియలు నిండి యున్నకడవల
న్వడి దుష్కర్ములఁ గింకరు, లిడుదురు దల క్రిందు గాఁగ నెత్తి యఱవఁగన్.

70


చ.

తలలును నెమ్ములు న్బగుల దందడి శోణితమజ్జతోయము
ల్గలయఁగఁ జర్మమాంసములు గ్రక్కున ముద్దలు గట్టఁ జేరి గ్ర
ద్దలు వడిఁ బీఁకఁ గింకరులు దవ్వులఁ ద్రిప్పఁగఁ బ్రాణవాయువు
ల్వెలువడకుండఁ బాపులను వేఁతురు దారుణతైలవహ్నులన్.

71


వ.

తండ్రీ! యవధరింపు మతీతసప్తమజన్మంబున వైశ్యుండ నై పుట్టి యొక్కనాడు.

72

అమితకర్దమనరకము

తే.

అర్థి నీళులు ద్రావఁగ నరుగుగోగ, ణంబు నాఁగినయట్టియఘంబు పేర్మి
నమితకర్దమ మనునిరయమున బ్రుంగి, యినుపముక్కులపులుఁగు లనేకభంగి.

73


తే.

ఏఁప నాఁకలి నీరువ ట్టెసఁగ నోర, నుడుగ కెప్పుడు నెత్తురు వడియ నార్తి
యొదవ నూఱు నేఁబదియేఁడులుండ నొక్క, నాఁడు దనుగాలి వీఁచె నానంద మడర.

74


వ.

వీచినం గరంభవాలుకానరకంబునం దున్న యందఱు నేనునుం బరమప్రమోదంబు
నొంది యమ్మందానిలంబు రాకకు వెఱఁగువడి యద్దిక్కు గనుంగొనునప్పుడు
ప్రచండదండహస్తుం డైనదండధరుకింకరుండు ప్రదర్శితమార్గుం డగుచు నిందు
నిందు రమ్మనితో డ్తేర నొకపురుషరత్నం బరుగుదెంచి తీవ్రయాతనాపీడితు లగు
చున్న యన్నారకుల నాలోకించి కరుణాభరితాంతరంగుం డై యేము వినుచుండఁ
గింకరున కి ట్లనియె.

75

జనకయమకింకరుల సంవాదము

మ.

వినుతక్షత్త్రచరిత్రుఁ డైనజనకోర్వీనాథవంశంబునం
దొనరం బుట్టి విపశ్చిదాహ్వయుఁడ నై యుద్ధంబులన్ శత్రుభం
జనము న్నిర్జరరంజనంబు బహుయజ్ఞక్రీడలన్ బర్వపూ
జనల న్భక్తిఁ బితృప్రమోదమును రక్షన్భూప్రజాహర్ష మున్.

76


శా.

ప్రీతిం బాయక సేయుచు న్బరధనస్త్రీరాగదూరుండనై
యాతిథ్యక్రియ నప్రమత్తమతినై యత్యంతధర్మస్పృహా

న్వీతస్వాంతుఁడ నైననాకు నకటా! పెం పేది యిచ్చోటి కి
ట్లేతేరం గత మేమి యెట్టిదురితం బేఁ జేసితిం జెప్పవే.

77


వ.

అనినం గింకరుండు నీచేసినపాపంబు గొంతఁ గలదు చెప్పెద వినుము.

78


తే.

నీమహాదేవి వైదర్భి నొమ్మిఁ బుష్ప, వతియు శుచియునై యుండ నవ్వనిత మొరఁగి
భావజాసక్తి రెండవభామయైన, కైకకడ నుండి తిష్టభోగములఁ దగిలి.

79


క.

ఋతుకాలంబున విను కుల, సతికిం బతివలన శుక్లసంప్రాప్తి ప్రజా
పతి గోరు హోమకాలా, హుతి యతిసంప్రీతిఁ గోరు హుతవహుమాడ్కిన్.

80


క.

ఋతువు విఫలంబు సేయుటఁ, బితృఋణదోషంబుఁ బొంది పృథ్వీశ జుగు
ప్సిత మగు నిచ్చోటికి వ, చ్చితి నీ వొండొకయఘంబు సెందదు నిన్నున్.

81


తే.

ఇంకఁ బుణ్యంబు భోగింప నేఁగు దెమ్ము, పార్థివేశ్వర! యనిన నబ్భటునితోడ
నీవు గొనిపోవ వచ్చెద నెచటికైన, నంత కొకటి ని న్నడిగెద నర్థిఁ జెపుమ.

82

విదేహరాజడిగినప్రశ్నము

తే.

ఎట్టికర్మంబు లొనరించి యిట్టిఘోర, నరకదుఃఖానుభవముల నెరియుచున్న
వారు వీ రెల్ల నెఱిఁగింప వలయు ననిన, నవనిపతితోడఁ గింకరుఁ డనియెఁ దండ్రి.

83


క.

విను తళియ నిడినయన్నం, బును బోలెం జేసినట్టిపుణ్యము పాపం
బును మానవులకు నేవిధ, మునఁ గుడువక పోవుఁ గర్మములు ప్రబలంబుల్.

84


తే.

ఉత్సవంబులమీఁద యుత్సవములు, పొందుచుండుదు రెప్పుడుఁ బుణ్యనరులు
పాపపరులకుఁ బై పయి నాపదలు మ, హాభయంబులు చావులు నడరుచుండు.

85


క.

తెరువున నూరక యరుగఁగ, నురగకరివ్యాహ్రతస్కరోద్భటభయము
ల్దొరకొనుఁ బాపులకడ నివి, దొరకొనుఁ గుడువంగఁ గట్టఁ దొడఁ బుణ్యులకున్.

86


తే.

అఘ మొకింత యొనర్చిన నది యొకపుడు, గాలములు గొఱ్ఱునాటిదుఃఖములు దెచ్చు
నొదుగఁ జేసినఁ దలయేరు మొదలు గాఁగఁ, గలుగుతెవుళులవేదన సడలు కొలుపు.

87


క.

ఎంతెంత సేసెఁ బుణ్యం, బంతంతయె సుఖము నిచ్చు నది నరునకుఁ దా
నెంతెంత సేసెఁ బాపం, బంతంతయ దుఃఖ మిచ్చు నది తఱితోడన్.

88


వ.

కావునం బుణ్యపాపోద్భవంబు లైనసుఖదుఃఖంబు లవశ్యభోక్తవ్యంబు లగుటం
జేసి యీనారకు లిందఱు నరకదుఃఖానుభవంబులం దమచేసినపాపంబులు వొలి
యించి స్వర్గంబునం బుణ్యఫలంబులు భోగింతు రని చెప్పి యమానుచరుం డారా
జుతో నీవడిగిన యిజ్జనంబులు పాపంబుల తెఱం గెఱింగించెద.

89

వైదేహునకు యమకింకరుఁడు వేర్వేఱుగ నారకులం జూపుట

చ.

ఖరతరవజ్రతుండములు కన్నుల నొల్వఁగ నార్తి నొందుచు
న్బరవనితాధనావళులపైఁ దమకంబునఁ జూడ్కు లిడ్డదు
ష్పురుషు లఖర్వదుఃఖములఁ బొందుదు రెన్నినిమేషము ల్పొరిం
బొరి మును సూచి రబ్దములు భూవర! యన్నియు నీక్షణవ్యధన్.

90

వ.

తోడ్తోన మొలచునాలుకలు నెఱకత్తులం దఱుగ నొఱలుచున్న వీరలు గదా శిష్యు
లకు నసచ్ఛాస్త్రోపదేశములు చేసినవారు శాస్త్రంబులయం దర్ధంబు లొండుతెఱం
గునం జెప్పినవారు నపద్వాదంబులాడినవారు దేవగురుద్విజామ్నాయదూష
ణంబు లొనరించువారును.

91


క.

అలుకం బితృమాతృతనూ, జుల భార్యాపతుల సఖులఁ జుట్టల గురుశి
ష్యుల భ్రాతల భేదించిన, ఖలులను గోసెదరు వ్రయ్యఁ గరపత్రములన్.

92


తే.

వ్యజనచందనోశీరాపహారకులను, సాధుహృదయప్రమోదనిషేధకులను
బరుల కుపతాప మొనరించుప్రల్లదులను, నిదె కరంభవాలుకను వ్రేల్చెదరు చూడు.

93


మానిని.

ఒక్కనిచేత నిమంత్రితుఁడై మఱియొక్కనిశ్రాద్ధమునందు మదిన్
స్రుక్కక పోయి భుజించినవిప్రునిఁ జూడు ఖగంబులు చీరెడుఁ బెం
పెక్కినసాధుజనంబులమర్మము లెప్పుడుఁ దూఱఁగ నాడుఖలుల్
ద్రొక్కి ఖగంబులు ముక్కున నంగము దూఁటులు పుచ్చుచు నున్న వొగిన్.

94


సీ.

కొండీనినాలుక రెండుగాఁ జీఱెడు నలఖగంబులఁ జూడు మవనినాథ!
పూయమూత్రపురీషపూర్ణగర్తంబున మునుఁగుచున్నాఁ డధోముఖత నొంది
జననీజనకగురుజనుల కవజ్ఞఁ జేసినదుర్మదాంధుండు వినుము దేవ
తాతిథిపితృవహ్నిభూతపక్షిప్రజాభ్యాగతభృత్యజనావళులకు


తే.

నీడక యన్నంబు మును దాన కుడిచినట్టి, పాపకర్ముండు పర్వతప్రతిమతనుఁడు
సూచిసూక్ష్మముఖుండు నై క్షుత్ప్రపీడ, నొంది చీము బంకయు నానుచున్నవాఁడు.

95


తే.

ఒక్క బంతిన విప్రున కొరున కైన, విషమగతిఁ గూ డిడునతండు విష్ఠ గుడుచు
యాత్ర తనతోన వచ్చినయతని కన్న, మిడక భుజియించి శ్లేష్మంబు గుడుచునితఁడు.

96


ఉ.

ఎంగిలితోడ గోవును మహీసురవహ్నుల నంటినట్టియా
వెంగలికేలు కుండశిఖి వేమఱుఁ గాల్చెద రట్లకైరవా
ప్తుం గమలాప్తుఁ జుక్కలను బోలఁగఁ జూచినవారికన్నులం
దింగిల మిడ్డవా రదె నరేశ్వర! కర్మఫలంబు దప్పునే!

97


మ.

జననిం దండ్రి సహోదరుం జెలియలిన్ జ్ఞాతి న్గురు న్వృద్ధు వి
ప్రుని గోవు న్శిఖి నల్కఁ దన్నినయతిక్రూరాత్ము పాదంబుల
స్ఘనతీవ్రానలతప్తశృంఖల నొగి న్గాఢంబుగాఁ గట్టి ప
ట్టిన వాఁడుఁ దొడబంటినిప్పుకలలో డిందు న్మహీవల్ల భా!

98


సీ.

భాగమాంసము పాయసము పులగంబును నాదిగా దేవయోగ్యాన్నచయముఁ
దగినసంస్కృతి సేయ కొగి భుజించినవాని నవనిపైఁ బడవైచి యంగకంబు
నదె మునిపండ్లఁ జీఁ కెద రంతకునిభటు ల్దేవతాగమగురుద్విజుల నింద
సేయ వినినవారిచెవుల సూదులు గాల్చి యొండొండ కూర్కొనుచున్న వారు


తే.

క్రోధలోభాత్ములై రచ్చకొట్టమును సు, రాలయంబును బ్రపయును గూలఁ ద్రోచి

నతనితి త్తొల్చెదరు లోభి యైనసకల, సుకృతవిక్రయు నుఱిచెద ర్సూడు మధిప!

99


క.

ము న్నొకని కిచ్చి యెరునకుఁ, గన్నియ మఱి యిచ్చినట్టికష్టుఁడు శస్త్ర
చ్ఛిన్నాంగుం డై తేలుచు, నున్నాఁ డదె క్షారనది ననూనార్తిమెయిన్.

100


సీ.

తెగి మూత్ర మర్కగోద్విజులకు నెదురుగా నాచరించినతుచ్ఛునట్లు కాక
ములు నోటఁ బొడుచు రాముక్కులఁ బ్రేవులు గఱవున నాలిని గన్నప్రజల
విడిచి తా నొక్కఁడు కడుపుఁ బ్రోచికొనినఖలునిపం డ్లన్నియు డులిచి యెడలు
దఱిగి కండలు నోరఁ దుఱిగెద రదె భీతి శరణంబుఁ జొచ్చిననరుని లంచ


తే.

మర్థితోఁ గొని యొప్పించినట్టియధము, నధికదారుణతరఘటీయంత్ర పడ
నలఁచుచున్నవా రెంతయు యమునిభటులు, చూచితే పాపఫలములసొంపు లధిప!

101


క.

ఇల్లడ గొని యాఁచికొనిన, బల్లిదు లదె యిఱియఁ గట్టఁబడి కీటకము
ల్పెల్లుగఁ దేళ్లుం గాకులు, తల్లడ పెట్టంగ నొఱలెదరు నో రెండన్.

102


తరల.

తనువు లెంతయు వ్రస్సి నెత్తురు ధారలై తొరఁగంగ ని
య్యినుపముండులబూరువు ల్వెస నెక్కఁ ద్రోవఁగఁ జీలువా
రనుజనాథ! పరాంగనాకుచమండలీపరిరంభణం
బును దివాసురతంబు చేసినభూరిపాపపరాయణుల్.

103


క.

మనుజేశ్వర! విను శ్రాద్ధం, బునఁ దమలోఁ దారు గలసి భోజన మొనరిం
చినభూసురు లొండొరులవ, దనలాలలు రక్తములును ద్రావుట కంటే?

104


క.

చెలులును నతిథియు నిజభృ, త్యులు చూడఁగ సురుచిరాన్న మొక్కఁడు వడి ని
మ్ములఁ గుడిచిననరుఁ డిదె నిప్పులు మ్రింగెడు వృకనికాయములు వీఁపు దినన్.

105


చ.

అనఘ! కృతఘ్నుఁ డైనమనుజాధముఁ డోలిన తప్తకుంభవే
దనలఁ గరంభవాలుకలతాపముల న్బహుయంత్రపీడనం
బున నసిపత్త్రఖండనసముద్ధురయాతనఁ గాలసూత్రకృం
తనకృతతీవ్రదుఃఖమునఁ దక్కెడు నిష్కృతి వీని కెన్నఁడో?

106


చ.

వినుము పసిండి మ్రుచ్చిలుట విప్రునిఁ జంపుట గల్లు ద్రావు టే
పున గురుపత్నిఁ జెందుట ప్రభూతతరాఘము లెందు వీనిఁ జే
సిననరుఁ డుండుఁ జుట్టుఁ బెనుచి చ్చిడి పెక్కుసహస్రవర్షము
ల్నముగఁ గాల్పఁ బుట్టు భువి గ్రమ్మఱఁ గుష్ఠమహాక్షయాంగుఁ డై.

107


తే.

చచ్చు మఱియును నరకాగ్ని వెచ్చు మగుడఁ
బుట్టు క్షయకుష్ఠబాధలఁ బొందు మాన
వేంద్ర! కల్పంబుతుది దాఁక నిట్ల తిరుగు
చుండుఁ బాతకి యైనయాతండు వినుము.

108


వ.

ఇమ్మహాపాతకంబులకంటె నుపపాతకంబులు కొంత దక్కువ కాన వాని నొనరించిన
వారు మహాపాతకు లనుభవించుదుఃఖంబులకంటెఁ గొంత తక్కువ లైనదుఃఖంబు
లనుభవింతురు.

109

క.

అని చెప్పి కింకరుం డి, ట్లను సంక్షేపమున నిజ్జనావళు లొనరిం
చినపాపములవిధమును ద, దనుగుణబహునరకతీవ్రయాతనలు నొగిన్.

110

జంతువులకు జన్మాంతరపాపములకుఁ దగుజన్మముల వివరము

క.

నరవర! చెప్పితిఁ జెప్పెద, నరకంబులు వదలి పోయి నరులు ధరిత్రిం
దురితానురూపయోనులఁ, బరువడిఁ బుట్టెడివిధంబు ప్రవ్యక్తముగాన్.

111


క.

పతితునిచే భూదేవుఁడు, ప్రతిగ్రహము గొనిన గర్దభం బగుఁ గ్రిమియై
క్షితిఁ బుట్టు యాజకత్వం, బతనికి నొనరించినట్టియధముం డధిపా!

112


సీ.

ఒజ్జకుఁ గైతవ మొనరించినతఁడు తదంగనాజనముల నఱిమినతఁడు
శునకంబును గర్దభంబు నగుదురు తల్లిదండ్రులకు నవజ్ఞ దనరఁ జేసి
శారిక యై పుట్టువారికి హృత్పీడ యడరించి కచ్ఛప మై జనించు
జనుఁడు త న్నేలినాతనియింటఁ గుడుచుచు నతనిశత్రులఁ గొల్చునతడు గ్రోఁతి


తే.

యగు నరేంద్ర! యిల్లడధన మడచికొన్న, వాఁడు గార్దభత్వమును విశ్వాసహర్త
మీనతయు నసూయాగ్రస్తమానసుండు, కంకభావము దాల్చును గ్రమముతోడ.

113


క.

కొలుచుయవలు సెనగలు మినుములు తిల లావలుఁ గుళుత్థములు మ్రుచ్చిలినన్
లలి భ్రాతృసతిని బఱిపినఁ, గలుగును బకజన్మ మట్టి కష్టనరునకున్.

114


వ.

మిత్రక్షత్రియాచార్యభార్యాభిగామి సూకరత్వంబు నొందు యజ్ఞదానవివాహ
విఘ్నకర్తయుఁ గన్యాపునర్దానకారియుఁ గ్రిమిత్వంబు నొందుదురు దేవతాపిత్ర
తిథి బ్రాహ్మణులకు నన్నంబు మున్నిడక కుడిచినపురుషుండు కాకం బగు వృషలీపతి
యైనవిప్రుండును బరగృహంబున నుండుగృహపతియు కట్టియలోఁ బూరువులై
పుట్టుదురు పితృసమానం డైనయగ్రజు నవమానించినవాఁడు క్రౌంచయోని
జాతుం డగు మృగంబుల నడిచి వీపునంజుడు నమలినయతం డంధుండును బంగుం
డును నై యావిర్భవించు ద్విజాంగనాసంగమంబున శూద్రుండు క్రిమి యై
జన్మించు నం దపత్యంబు వడసెనేని కాష్ఠగతకీటంబును సూకరంబును గ్రిమియు
నుం జండాలుండు నై యావిర్భవించు.

115


తే.

క్రిమియుఁ గీటకమును బతంగమును వృశ్చి, కము మత్స్యంబు నొగినకూర్మమ్ము పుల్క
సుండునై పుట్టు భువిఁ గృతఘ్నుండు నరు న, శస్త్రవహుఁ జంపి గర్దభజాతుఁడగును.

116


క.

స్త్రీవృద్ధబాలహంతలు, భూవర! క్రిమియోనియందుఁ బుట్టుదు రశనా
శావిలత నరుఁడు మ్రుచ్చిలి, కావించినకుడుపు మక్షికాత్వముఁ దెచ్చున్.

117


వ.

మఱియు భోజనవిషయవిశేషచౌర్యదోషంబులు వినుము చెప్పెద నన్న చోరుండు
మార్జాలం బగుఁ దిలపిణ్యాకమిశ్రాన్నతస్కరుండు మూషకం బగు ఘృతాపహారి
నకులం బగు మత్స్యమాంసహర్త కాకం బగు మేషమాంసమలిమ్లుచుండు డేగ
యగు లవణంబు మ్రుచ్చిలికొన్నవాఁడు చిమ్మట యగు మధుస్తేనుండు తూనీఁగ
యగు నూనియ మ్రుచ్చిలి గబ్బిల మగు హవిష్యంబులు దొంగిలినవాఁడు బల్లి

యగు దుగ్ధంబు లపహరించినవాఁడు కొక్కెర యగుఁ బెరుఁగు మ్రుచ్చిలినవాఁడు
క్రిమియగుఁ గాంస్యరజతహేమమయంబు లగుభాండంబు లపహరించినవారు
వరుసన హారీతంబును గపోతంబును గ్రిమియును నగుదురు మఱియు మను
ష్యుండు ధూపద్రవ్యంబులు గొని చీమ యగుఁ గూర్చుండ నర్హంబు లగువానిం
గొని తిత్తిరిపక్షి యగుఁ బొత్తిచీర గొని పసిఁడిపురు వగు వెలిపట్టు గొనిన శార్జ్గం
బగుఁ గార్పాసంబుఁ గొనిన బకం బగు రక్తపరిధానంబుఁ గొని జీవంజీవకం బగుఁ '
బలువన్నెలచీరలు గొని మయూరం బగుఁ జందనాదిసుగందద్రవ్యంబు గొని
చుంచెలుక యగు మాంసంబు గొని కుందే లగు ఫలంబులు గొని నపుంసకుం డగుఁ
గాష్ఠంబులు గొని ఘుణకీటకం బగుఁ బుష్పంబులు గొని దరిద్రుం డగు నెక్కి
పోవం దగినట్టివి గొని పంగుం డగు శాకంబులు గొని పచ్చపులుఁ గగు జలంబులు
గొనినఁ జాతకం బగు భూమిని గోవును రత్నసువర్ణాదిపదార్థములను గొని
రౌరవాదినరకంబులం బడి వెడలి తృణలతాగుల్మభూరుహత్వంబులం బొంది
క్రిమియుఁ గీటంబును బతంగంబును జలచరణంబును మృగంబును గోవునుం
జండాలుండును బధిరాంధపంగుత్వవికలుండును గుష్ఠ కషయముఖాక్షిగుదరోగ
పీడితుండును నపస్మారియు నై తుది శూద్రత్వంబు నొందు నని చెప్పి కింకరుండు.

118


క.

వెలుగుచు నుండ సమిద్ధ, జ్వలనంబున హోమ మొనరఁ జలుపనివాఁ డాఁ
కలి చెడి నిరంతరము న,త్యలఘుతరాజీర్ణబాధ నలఁదురుచుండున్.

119


చ.

పరుసనిపల్కులం బరులఁ బల్కుట మర్మము నాట నాడుట
ల్నరులకు నెగ్గు సేఁత కృపణత్వ మశౌచము దేవదూషణం
బొరులధనంబు గొంట కృప నొందమి యల్క కృతఘ్నభావ మీ
నిరయముఁ బాసి పోయి ధరణిం బ్రభవించినవారిచిహ్నముల్.

120


మ.

గురుదేవర్షిపితృప్రపూజనము సద్గోష్ఠీప్రియత్వంబు సు
స్థిరసత్యోక్తి సమస్తభూతదయ మైత్రీసాధుసాంగత్యముల్
పరలోకాభ్యుదయక్రియారతి శ్రుతిప్రామాణ్యసందర్శనం
బరయ న్స్వర్గముఁ బాసి పుట్టిన మనుష్యశ్రేణిసంజ్ఞల్ నృపా!

121


చ.

తమతమచేతల న్నరకతాపముఁ బొందుచు నున్నవీరిపా
పము లొగిఁ దోచినట్లు జనపాలక! చెప్పితి వింటి నీవు ను
గ్రమయిన కుత్సితంపునరకంబును జూచితి చాలు నింకఁ బో
దము చనుదెమ్ము నావుడు నతం డరుగంగ నుపక్రమించినన్.

122

నారకులు రాజును ప్రార్థించుట

చ.

కనుఁగొని యాతనోగ్రనరకస్థజనంబు లెలుంగు లెత్తి యో
మనుజవరేణ్య! పుణ్యగుణమండన! తారకదేహదివ్యగం

ధనీబిడమారుతంబు పరితాపభరం బడఁగించి మాకు నిం
పొనరఁగఁ జేయుచున్న యది యొక్కముహూర్తము నిల్వవే దయన్.

123


మ.

అని ప్రార్థించిన నవ్విభుండు విని యత్యంతానుకంపాత్ముఁ డై
యనియెం గింకరుతోడ నిజ్జనుల కి ట్లాహ్లాదముం జేయ నో
పినపుణ్యం బది యెద్ది చేసితి నొకో ప్రీతిం బురాజన్మమం
దనఘా! దాని నెఱుంగ నాకుఁ జెపుమా యన్న న్ఫటుం డి ట్లనున్.

124


మ.

పితృదేవాతిథిపోష్యవర్గ మొగి మున్బ్రీతి న్భుజింపం దదం
చితశిష్టాన్నమున న్నిరంతరముఁ దుష్టిం బొందుచు న్విశ్రుత
క్రతువు ల్చేసినపుణ్యమూర్తి వగుట న్రాజేంద్ర! యుష్మత్తనూ
త్గతగంధానిల మిప్డు నారకులకు న్గావించె నాహ్లాదమున్.

125


వ.

అనిన నన్నరేంద్రుండు.

126


ఉ.

ఇట్టిద యయ్యెనేని విను మే నొకచోటికి రాను నిశ్చయం
బిట్టిద నిల్తు నిక్కడన యిందఱు నాకతన న్సుఖింప ని
ప్పట్టున నున్కి నాకమున బ్రహ్మపదంబున నున్కి నాకు న
న్నిట్టల మైనయక్కటిక నీనరకార్డుల కిచ్చి తక్కితిన్.

127


వ.

అని వెండియు.

128


క.

అతిభీతి శరణుఁ జొచ్చిన, ప్రతిపక్షుని నైనఁ గరుణ రక్షింపనిదు
ర్మతిబ్రదుకు గాల్ప నే త,త్క్రతుదానఫలంబు లిహపరములకుఁ గొఱయే.

129


ఉ.

ఆతురబాలవృద్ధవనితాదులయార్తులు సూచి యేరికి
న్రాతిక్రియ న్మనంబు కఠినంబగు వారు మనుష్యులే దయా
ఘాతకు లైనరాక్షసులు గాక తలంపఁగ నట్లు గానఁ దీ
వ్రాతతయాతనావిధురు లై వెగ డొందెడు వీరిసన్నిధిన్.

130


వ.

ఏతదీయహితంబుగా నిల్చితి.

131


తే.

అనలతాపదుర్గంధక్షుదాదు లందఁ, గలుగునీతీవ్రనరకదుఃఖములఁ బడుట
నాకసౌఖ్యంబుకంటెను నాకు మేలు, గాఁ దలంచెదఁ బరహితకరణబుద్ధి.

132


క.

పెక్కండ్రకు సుఖమగు నేనొక్కఁడ నే నరకదుఃఖ మొందుచు నిచ్చోఁ
జిక్కుదు నే నిట్టియొఱవు, దక్కుదు నే యరుగు మీవు తడయక యింకన్.

133

యమభటధర్మేంద్రవైదేహసంవాదము

క.

అనుటయుఁ గింకరుఁ డి ట్లను, జననాయక! వీరు ధర్మశక్రులు నినుఁ దో
డ్కొనిపో వచ్చి రవశ్యముఁ, జనుదేరఁగ వలయు రమ్ము సయ్యన ననినన్.

134


వ.

ఊరక యున్నయన్నరేంద్రునకు ధర్ముం డి ట్లనియె.

135


క.

నరవర! నీసమ్యగుపా, సనకుం బ్రీతుండ నైతి స్వర్గమ్మునకుం
గొనిపోయెద ర మ్మెక్కుము, గనకవిమానంబుఁ దడయఁగా నేమిటికిన్.

136

ఉత్సాహ.

అనుడు నతఁడు ధర్ముతో మహాత్మ మమ్ముఁ గావ వే
యనుచు శరణు వేఁడుయాతనార్తజనుల వీడి రా
ననిన వజ్రి వీరఘాత్ము లగుట నరకవాసు లై
రనఘ! నీవు పుణ్యపరుఁడ వమరపురికిఁ దగుదు రాన్.

137


వ.

అనిన నన్నరేంద్రుం డింద్రధర్ములతో నాచేసినపుణ్యంబులకొలంది మీ రానతీయ
వలయు ననిన ధర్ముం డి ట్లనియె.

138


ఉ.

తారలలెక్క గాఁగ సికతాతతిలెక్క పయోధిశీకరా
సారములెక్క భూరిబహుజంతుచయంబులలెక్క వారిము
గ్ధారలలెక్కయ ట్టగణితం బగునీసుకృతంబు భూప! యి
న్నారకులందుఁ బుట్టినఘృణామతి లక్షగుణంబు లయ్యెడిన్.

139


వ.

అని చెప్పిన నప్పుణ్యపరుం డింద్రునిం జూచి మహాత్మా! యట్లైన మదీయసుకృత
ప్రాప్తి నిన్నారకజనంబులకు నరకమోక్షంబు గావింపవే యని ప్రార్థించుటయును.

140


చ.

అనిమిషవల్లభుం డిటుల నయ్యెడు నీసుకృతంబుపెంపుసొం
పున నిటు సూచితే నరకము ల్వెస వెల్వడి పోవుచున్నవా
రనఘ! యఘాత్ము లెల్ల నని యందఱఁ జూపి లతాంతవృష్టి య
జ్జనపతిపైఁ దగం గురిసె సాధ్యులు సిద్ధులు చోద్య మందఁగాన్.

141


ఆ.

అట్లు సూపి యింద్రుఁ డన్నరేంద్రుని విమా, నాధిరూఢుఁ జేసి యమరసద్మ
మునకుఁ బ్రీతిఁ దోడుకొనిపోయె ధర్ముండు, దాను సురగణములు దన్నుఁ గొలువ.

142


వ.

అట్లు విపశ్చిన్మహీవల్లభుకారుణ్యంబున నరకంబులవలనం బరిచ్యుతు లై యన్నారక
జనంబు లందఱుం దమతమకర్మంబులకు ననురూపంబు లైనజన్మంబులం బొంది
రేనును నరకవిముక్తుండ నై జన్మాంతరంబు నొందితి నాయెఱింగినతెఱంగున నర
కంబులవిధంబు లిట్లు నీకు నేర్పడం జెప్పితి నింక నేమి చెప్పవలయు నడుగు మనిన
భార్గవుండు కొడుకున కి ట్లనియె.

143


క.

కర మేవం బగుసంసృతి, పరివర్తన మెల్ల నెఱుకపడఁ జెప్పితి నా
కరయఁగఁ గర్తవ్యము చె, చ్చెర నెయ్యది దాని నీవ చెప్పు కుమారా!

144

జడుఁడు తండ్రికిఁ గర్తవ్యముఁ జెప్పుట

వ.

అనిన నతండు దండ్రి కి ట్లనియె.

145


సీ.

నామాట మనమున నమ్మి చేసెద వేనిఁ జెప్పెద నేర్పడ శీలధుర్య!
విను గృహస్థత్వంబు విడిచి వానప్రస్థధర్మంబు విధివిహితంబు గాఁగఁ
జలిపి తపస్సిద్ధి సంపత్తి నొంది యగ్ని పరిగ్రహం బంత నపనయించి
యేకాంతమున నుండి యేసంగమునఁ బడ కాత్మునిఁ దనయాత్మయంద యునిచి


తే.

ద్వంద్వముల నోర్చి నిర్జితత్వమున నింద్రి, యార్థసంగతి యుడిపి భిక్షాశి వగుచు
నక్షరైకహేతువును దుఃఖాపహమును, నధికసుఖదంబు నగుయోగ మభ్యసింపు.

146

వ.

అనినఁ గొడుకునకుఁ దండ్రి యి ట్లనియె.

147


సీ.

భవభానుతీవ్రతాపంబున నెరియున న్బ్రహ్మబోధాంబుపూరమునఁ దేల్పు
దారుణావిద్యాహిదష్టు న న్బ్రతికింపు మధ్యాత్మతత్త్వవాక్యామృతమున
సంసారమమతారుజాక్లిష్టు నను సుఖాయత్తుఁ గావింపు విద్యౌషధమున
మాయాంధకారనిర్మగ్ను న న్నిర్మలజ్ఞానదీపస్ఫురచ్చక్షుఁ జేయు


తే.

మిట్టికర్మబంధముల నెల్లఁ బాసి, యఖిలదుఃఖములను ద్రోచి యాత్మ మగుడఁ
బుట్టకుండెడుతెరువునఁ బెట్టునట్టి, యోగ మీవు నా కెఱిఁగింపు యోగివర్య!

148


వ.

అనినం బుత్త్రుం డి ట్లనియె.

149


క.

దత్తాత్రేయుఁ డలర్కున, కుత్తమ మగునట్టియాత్మయోగముఁ జెప్పెం
జిత్తం బలరఁగ దాని ను, దాత్తగుణా! నీకుఁ జెప్పెద న్విను తెలియన్.

150

కౌశికుం డనువిప్రునిభార్యయొక్క పాతివ్రత్యమహిమము

ఆ.

అనిన భార్గవుండు తనయ! దత్తాత్రేయుఁ, డేమహాత్ముపుత్రుఁ? డెద్ది యోగ
మయ్యలర్కుఁ డతని నడిగె! నాభవ్యుని, కెట్లు సెప్పె నాతఁ డెఱుఁగఁ జెపుమ.

151


వ.

అని యడిగిన నక్కుమారుం డి ట్లనియె.

152


ఉ.

దానగజేంద్రభూధరకదంబతురంగతరంగసంఘకాం
తానికురుంబరత్నమహితం బయి లక్ష్మికిఁ బుట్టినిల్లనం
గా నభిరామ మై భువనగౌరవవైభవయుక్త మై ప్రతి
ష్ఠానపురంబు వొల్చు విలసన్మహిమ న్జలరాశిచాడ్పునన్.

153


వ.

అప్పురంబునఁ గౌశికుం డను విప్రుండు పూర్వజన్మపాపఫలంబునం జేసి.

154


చ.

కరచరణాంగుళు ల్ముఱిగి గాత్రము తద్దయు ప్వ్రస్సి చీము నె
త్తురు దొరఁగంగఁ బెన్ముఱికి దుస్సహ మై సుడియంగ ఘర్ఘర
స్వర మొసఁగంగ నీఁగ లనిశంబును జు మ్మని మూఁగుచుండ హే
యరసము మూర్త మైనయటు లాతతకుష్ఠరుజాభిభూతుఁడై.

155


చ.

అలఁదురు చుండఁగా నతనియంగన పుణ్యచరిత్ర సాధ్వి స
త్కులజ పతివ్రతాచరణకోవిద రూపగుణాభిరామ ని
ర్మలినలతాంగి యాత్మవిభు మానుగ దైవముగా మనంబున
న్దలఁచుచు నిత్యభక్తిపరత న్జను లెల్లను బ్రీతి సేయఁగన్.

156


చ.

ఉడుగక నాథుమైఁ దొరఁగుచుండెడునెత్తురుఁ జీముఁ బల్మఱుం
గడుగుచు నూనియం దలయుఁ గాళ్లును జేతులుఁ దోమి తోమి యిం
పడరఁగ నీళు లార్చుచుఁ బ్రియంబునఁ జీరలు దాన కట్టుచుం
గుడుపుచుఁ గామభోగములఁ గోమలి యాతనిఁ బ్రీతుఁ జేయుచున్.

157


క.

అతఁ డెంత యలిగి తిట్టిన, మతిఁ గింకిరి పడక యెపుడు మాఱాడక యా
నత యగుచు నప్పతివ్రత, యతని నతిశ్రేష్ఠుఁ గాఁగ నాత్మఁ దలచుచున్.

158

వ.

ఆరాధించుచుండ నొక్కనాఁ డమ్మహీదేవుండు నిజాంగన కి ట్లనియె.

159


క.

ఏ నొకగణికారత్నము, మానుగఁ గనుఁగొంటి రాజమార్గంబున సా
ధ్వీ! నేఁడు వేడ్క యడరెడు, దానిగృహంబునకు నన్నుఁ దగఁ గొని పొమ్మా.

160


ఉ.

ఆనగుమోముచెన్ను శశియందును బంకరుహంబునందు లే
దానయనప్రభాతి మదనాస్త్రములందు మెఱుంగులందు లే
దానునుమేనికాంతి లతికావలియందుఁ బసిండియందు లే
దానలినాయతాక్షిలలితాకృతి నామదిఁ బాయ నేర్పునే?

161


సీ.

మెఱుఁగారులేఁదీఁగ మెచ్చనియత్తన్వి తనులతచెల్వంబు గనుఁగొనంగఁ
గలకంఠములయెలుంగులయేపు దీపించు నలపొల్తిముద్దుఁబల్కులు వినంగఁ
గనకకుంభంబులకాంతి గైకొనని యాకాంతచన్గవ బిగ్గఁ గౌగిలింపఁ
జిగురుటాకులనునుజిగిసొంపు దెగడు నచ్చపలాక్షికెమ్మోని చవి గొనంగఁ


ఆ.

జిత్త మొదవుత్తివుటఁ జిడిముడి పడియెడు, నీవు ధర్మతత్వనిపుణహృదయ
వాలతాంగి నన్ను ననురక్తిమైఁ గూర్పు, మన్మథాగ్ని నేను మ్రందకుండ.

162


క.

ఇనుఁ డస్తమించెఁ జీకటి, యును మొగులును నడ్డగించె నుగ్మలి నాకుం
జన శక్తి లేదు దర్పకు, ననర్గళాస్త్రములు నెఱఁకు లాడెడుఁ దోడ్తోన్.

163


చ.

అని మదనాతురుం డగునిజాధిపు చెప్పినమాట యేర్పడ
న్విని వినయము భక్తియు వివేకముఁ బ్రీతియు నగ్గలింప న
వ్వనిత కడున్బ్రయత్నమున వల్వ దృఢంబుగఁ గట్టి లంజెకు
న్ధన మొదువంగఁ బుచ్చికొని నాథుని మూఁపునఁ దాల్చి చెచ్చెరన్.

164


చ.

తఱ చయి నీలనీరదవితానముపైఁ బయిఁ గప్పి యెంతయు
న్మెఱవఁగ నేలయు న్దిశలు నింగియు నిండఁగఁ బర్వి చాలఁ గ్రి
క్కిఱిసినచిమ్మచీకటి నిజేశ్వరుకోర్కి యొనర్చువేడ్క న
త్తెఱవ గృహంబు వెల్వడి యతిత్వరితంబుగ నేఁగుచుండఁగన్.

165


వ.

మార్గంబుక్రేవ నొక్కయెడ.

166


ఆ.

మ్రుచ్చుగాఁ దలంచి చెచ్చెర నారెకు, ల్పట్టి తెచ్చి కొఱుతఁ బెట్టినట్టి
మహితపుణ్యుఁ డైనమాండవ్యుఁ డనుద్విజో, త్తమునియెడమమూఁపు దాఁకె బెట్టు.

167


తే.

తాఁకుటయు మేను గదలి వేదనభరంబు
క్రొత్త యగుటయుఁ నమ్మునీంద్రుండు గనలి
నన్ను నిట్లు నొప్పించిననరుఁడు సూర్యుఁ
డుదయమగుటయు మరణంబు నొందుఁగాత.

168

పతివ్రతాశాపమువలన సూర్యోదయము లేక లోకములు తల్లడిల్లుట

చ.

అని ముని శాప మిచ్చుటయు నావనితామణి శోకతప్తయై
యినుఁ డుదయింప మత్పతికి నెగ్గు ఘటిల్లెడు నట్ల యేని న

య్యినుఁ డుదయింపకుండు నిఁక నేను బతివ్రత నైన నన్న న
య్యిన్యుఁ డుదయింప నోడె విను మిట్టివ సుమ్ము సతీప్రభావముల్.

169


వ.

అంతం ద్రియామ బహుయామయై వర్తింపం దొడంగిన జగంబులు సంక్షుభితంబు
లయ్యె నప్పుడు సుర లెల్ల భయంబున సురజ్యేష్ఠుం గానం జని యప్పతివ్రతమహాను
భావంబు లెఱింగించి యి ట్లనిరి.

170


సీ.

ఆదిత్యునుదయాస్తమయములు లేకున్కిఁజేసి కాలంబులు సిక్కువడియె
ననుదినస్నానసంధ్యాజపహోమాదివివిధకర్మంబులు విరతిఁ బొందె
వేదాధ్యయనములు నిధివిహితస్వధాస్వాహాదు లొగి నిలుపంగఁబడియె
నిత్యనైమిత్తికకృత్యము ల్క్ర తుసురాతిథిపూజ లడఁగె ధాత్రీతలమున


తే.

నెలమి నేము హవిర్భాగములు పరిగ్ర
హించి యాప్యాయనముఁ బొంది యీప్సితార్థ
ములును సస్యసమృద్ధియు వెలయ నరుల
కొసఁగుటలు దప్పె జగముల కొదవె బెగడు.

171


వ.

లోకవ్యవహారంబులు విచ్ఛిన్నంబు లయ్యె నింక దివసోత్పత్తి యేవిధంబున నగు నని
విన్నవించిన విరించి కరుణించి యి ట్లనియె వినుఁ పతివ్రతమాహాత్మ్యంబు పతి
వ్రతచేతనే కాని చక్కంబడదు గావునఁ బరమపతివ్రతయుఁ దపస్వినియు నైన
యత్రిభార్య ననసూయ నిక్కార్యంబు సక్కం బెట్టు మని ప్రార్థింపుఁ డనిన నమరు
లప్పుణ్యవతికడ కరిగి బహువిధంబులఁ బ్రార్థించి.

172


చ.

అతులితనిత్యసత్యవతి యైనపతివ్రతయాజ్ఞ నయ్యహ
ర్పతి యుదయింపమిం గడువిపద్దశఁ జేడ్వడి నిన్నుఁ గాన వ
చ్చితిమి దినంబు మాకు దయసేయుము తొల్లిటియట్లు కాఁగ వి
శ్రుతసుచరిత్ర యన్న ననసూయ సురావలిఁ జూచి యి ట్లనున్.

173


చ.

అనుపమ మాపతివ్రతమహత్త్వము దాని నధఃకరింప రా
దనిమిషులార! సెప్పెద నుపాయముచేతఁ దదీయుఁ డైనభ
ర్తను దెగకుండఁ జేయుఁడు యథాస్థితి నుండఁగ నే నొనర్చెద
న్దిన మనినం గరం బలరి దేవత లట్టుల సేయఁ బూనినన్.

174

అనసూయకును గౌశికపత్నికిని జరిగిన సంవాదము

వ.

అనసూయాదేవియు దేవగణసహిత యై యాపతివ్రతారత్నంబుసదనంబున కరిగి
దానిసేమం బడిగి యి ట్లనియె.

175


క.

దేవతలకంటె నధికుం, గావల్లభు మదిఁ దలంచి కళ్యాణీ! సం
భావింతె యతనివదన, శ్రీవిభవము సూచి సంతసిల్లుదె యెపుడున్.

176


క.

పతిశుశ్రూషణమున నే, నతులఫలప్రాప్త నైతి నభిమతఫలముల్
పతిశుశ్రూషానియతిని, సతతముఁ బడయంగ వచ్చు సతులకు సాధ్వీ!

177

మ.

వ్రతము ల్మంత్రజపోపవాసములు తీర్థస్నానము ల్యజ్ఞదా
నతపఃకర్మము లాచరించుచును నానాభంగుల న్నిత్యము
న్బతి యాయాససహిష్ణుఁ డై కడఁగి సంపాదించుపుణ్యంబులో
సతి శుశ్రూషలఁ గైకొను న్మఱియుఁ దా సాఁబాలు ధర్మస్థితిన్.

178


తే.

స్త్రీజనంబుల కుపవాసతీర్థదాన, దేవపూజావ్రతాదుల తెరువు వలదు
పతిసమారాధన వ్రతపరతఁ జేసి, సుగతి వారికిఁ దంగేటిజున్ను సుమ్ము.

179


ఉ.

నీ వతిధన్యురాలవు వినీతవు పుణ్యచరిత్ర వెంతయు
న్దైవముకంటె నెక్కుడుగఁ దత్పరతం బతి గారవింతు పూ
జావినయోపచారముల సంతతముం బరితుష్టుఁ జేయు దీ
భూవలయంబున న్సతులు పోలరు నిన్నుఁ బతివ్రతామణీ!

180


చ.

అని యిటు లత్రిపత్ని ప్రియ మారఁగఁ బల్కినపల్కు కౌశికాం
గన విని ప్రీతిఁ జిత్తము వికాసము నొందఁగ నీయనుగ్రహం
బునఁ గృతకృత్య నై యమరపుంగవదర్శనయోగ్య నైతి న
న్ననిశము భర్తృభక్తినియతాత్మికగా నొనరింపు భామినీ!

181


క.

అని పలికి యాసతి మదీ, యనిలయమున కేఁగుదెంచి యత్యాదరణం
బున నీవు నీకు నే నే, పని సేయుదు నర్థిఁ జెప్పు భవ్యచరిత్రా!

182


వ.

అని యడిగిన నప్పతివ్రతకు ననసూయ యి ట్లనియె.

183


తే.

ఇనుఁడు నీయాజ్ఞ నుదయింప కునికి నిపుడు, సృష్టిఁ జీకటి గవియుటఁజేసి తలఁకి
నిన్నుఁ బ్రార్థింపు మని సుర ల్నన్ను వేఁడి, కొనిన వచ్చితి నీకడ కనఘచరిత!

184


వ.

వినుము దివాభావంబున నిఖిలకర్మనాశనంబును గర్మనాశనంబునం ద్రివిష్టపవాసు
లకుం బుష్టిహీనతయు దాన ననావృష్టియు నగు ననావృష్టిదోషంబున జగంబు
నశియించుం గావున నీవు దేవహితార్థంబు గాఁ బూర్వ ప్రకారంబునం బ్రభాకర
వర్తనంబు చెల్ల ననుగ్రహించి లోకంబు లుద్ధరింపు మనిన నప్పతివ్రత యిట్లనియె.

185


క.

మాండవ్యుఁడు మద్వల్లభుఁ, జండాంశుఁడు వొడుచుటయును జాఁ గలఁడని తాఁ
జండతరశాప మిచ్చుటఁ, జండాంశునిపొడుపు నా కసమ్మత మతివా!

186


తే.

అనిన ననసూయ యి ట్లను విను పతివ్ర, తాంగనలపెంపు నాచేత నతిశయిల్లు
మగువ! నీపతి మృతుఁ డైన మగుడ నతనిఁ, జిరతరాయుస్సమేతునిఁ జేయుదాన.

187


తే.

అనినఁ బ్రియమంది యాతపస్విని కరాంబు, జములు మొగిడించి భక్తి చిత్తమునఁ దనర
నోదివాకర! నిత్యసత్యోజ్జ్వలాత్మ!, దినమణి! వేగ నుదయింపు మనియె ననిన.

188


సీ.

చుక్కలదీప్తివిస్ఫురణంబు చవి గొని మిన్ను లేఁగెంపున మెఱుఁగు వెట్టి
ఘనతమఃపుంజంబు గనుకనిఁ బోఁ దోలి దిక్కులఁ దేజంబు దీటు కొల్పి
కైరవాకరములగర్వంబు కబళించి కమలషండములకుఁ గాంతి యొసఁగి
తలకొన్న తుహినంబుదర్ప మడంగించి చక్రవాకముల కుత్సవ మొనర్చి

తే.

తనసముజ్జ్వలదీప్తివితాన మడరి, యఖిలజనులకు ననురాగ మావహింప
నెలమి ననసూయ మహితార్ఘ్య మెత్తి మ్రొక్క, నుదయగిరిశిఖరంబున నొప్పె నినుఁడు.

189


వ.

పదిరాత్రుల కిట్లు ప్రభాకరుం డుదయించుటయు.

190


క.

మునివరునితీవ్రశాపం, బునఁ బ్రాణవిముక్తుఁ డై విభుఁడు వ్రాలిన మే
దినిఁ బడకుండ నతని న, వ్వనితామణి పొదివి పట్టె వగ మదిఁ గదురన్.

191


వ.

అట్లు మృతుఁ డైన నయ్యత్రికళత్రం బప్పరమపతివ్రతం గనుంగొని.

192


క.

మతి నొక్కింతయు వగవకు, పతిశుశ్రూషాతపంబుబలమున నే నీ
పతి నిదె మగుడం బడసెద, నతిరయమునఁ జూడు శుభగుణాన్వితమూర్తిన్.

193


వ.

అని పలికి.

194


చ.

అనుపమరూపశీలవిజయాదిగుణంబుల నాదుభర్తతో
నెన యొరు నేను గాన నను నీదృఢసత్యము పేర్మి నీద్విజుం
డనయము లబ్ధజీవుఁడు నిరామయుఁడు న్దృఢయౌవనుండు నై
వనితయుఁ దాను గూడి శతవత్సరము ల్పుఖియించుచుండెడున్.

195


తే.

మనముఁ బలుకును జెయ్వు సమత్వ మొందఁ, బతికి శుశ్రూష సతతంబు భక్తిఁజేయు
దాన నే నైతినేని యీధరణిసుతుఁడు, ప్రాణయుతుఁడు గావుతమని పల్కుటయును.

196


ఉ.

ఆవసుధామరుండు విగతామయుఁడు న్నవయౌవనుండు తే
జోవిభవాధికుండు నతిసుందరుఁడు స్సురసన్నిభుండు నై
తా వెస నుత్థితుం డగుడు దైవతసంఘము మెచ్చి సమ్మద
శ్రీవిధిఁ బుష్పవృష్టిఁ గురిసె న్మొరని న్దివి దేవదుందుభుల్.

197


వ.

అప్పుడు బ్రహ్మవిష్ణుమహేశ్వరప్రభృతిదేవత లనసూయతో నిక్కార్యంబు చక్కం
బెట్టుటం జేసి నీవలన నేము సంతుష్టినొందితిమి వరం బిచ్చెద మడుగు మనవుడు నాకుం
బ్రజాపతిశ్రీపతిపశుపతులు పరమయోగ్యు లైనపుత్రులై పుట్టవలయు ననిన నత్తప
స్వినికి నద్దేవత లావరం బొసంగి నిజస్థానంబుల కరిగి రనసూయయు నిజనివాసంబు
నకుం జనె నంతఁ గొంతకాలంబునకు ఋతుమతియు శుచిస్నాతయు మనోహరా
కృతియు నై యున్న నిజాంగనం గనుంగొని యత్రి యంగజాయత్తుం డై దానిం గల
సిన నతనిశుక్లం బప్పడఁతిగర్భంబునం బడునెడం బవనుండు పార్శ్వంబులకు
నూర్ధ్వంబునకుం గా నారేతంబు మూఁడుపాళ్లు గావించుటయు రెండంశంబు
లప్పుణ్యవతియుదరంబునం బ్రవేశించె నయ్యూర్ధ్వగతం బైనభాగంబునం జేసి
యమునీంద్రునేత్రంబునందు.

198

బ్రహ్మవిష్ణురుద్రాంశముల సోమదత్తాత్రేయదుర్వాసు లవతరించుట

క.

అతులరజస్స్ఫురితుండై, శతధృతిసదృశుఁ డయి పుట్టెఁ జంద్రుఁడు తనుదీ
ధితులు వెలుఁగంగ లలిత, స్థితి నోషధు లెలమిఁ బొంద క్షితిజను లలరన్.

199


వ.

అప్పుడు దిశలు పదియు నయ్యమృతకరునిం జేకొని పెనిచె నంత.

200

దత్తాత్రేయుం డనఁ బురు, షోత్తముఁ డనసూయ కర్థి నుదయం బయ్యెన్
జిత్తం బలరఁగ సత్తా, యత్తుఁడు యోగియును దైత్యహరతేజుఁడు నై.

201


వ.

తదనంతరంబ హైహయుం డనురా జనసూయాగర్భనిరోధంబు గావించిన నెఱింగి
వాని నిర్ధగ్ధుం జేయం దలంచి దుఃఖామర్షసమన్వితుం డగుచు గర్భావాసంబున నేడు
దినంబు లుండి దుర్వాసుం డను నామంబున రుద్రుండు తమోగుణోద్రిక్తుం డై యవ
తరించి తల్లిదండ్రులం బరిత్యజించి యున్మత్తాఖ్యం బగునుత్తమవ్రతంబు ధరియించి
ధరిత్రిం బరిభ్రమించుచుండె నివ్విధంబున నత్రికళత్రంబు పురుషత్రయాంశంబు
లైనపుత్రులం బడసి కృతార్థత్వంబు నొందె నంతం బరమయోగి యైనదత్తా
త్రేయుండు.

202

దత్తాత్రేయుని తపశ్చర్యాదిమహిమ

.
క.

అనిశంబు మునికుమారులు, దనుఁ బరివేష్టించి తిగుగఁ దా నిస్సంగ
త్వనిరూఢిఁ గోరి చని యొక, వనజాకరమున మునింగె వా రరుగుటకై.

203


తే.

అట్లు మునిఁగినఁ గనుఁగొని యక్కు మారు, లతని విడిచి పోఁజాలక యర్థితోడ
దివ్యశతహాయనములు దత్తీరభూమి, నుండి రుండిన నెఱిఁగి యయ్యోగివరుఁడు.

204


శా.

ఏణీలోచనఁ బూర్ణచంద్రవదన న్హేమప్రభాంగిన్ ఘన
శ్రోణీమండలఁ బీనబంధురకుచ న్రోలంబపుంజోల్లస
ద్వేణిం బల్లవకోమలాంఘ్రయుగళ దివ్యాంగన న్లోకక
ళ్యాణిం గైకొని యప్పయోరుహవనం బయ్ోయగి లీలాగతిన్.

205


క.

వెలువడియెఁ గామినీజన, కలితుం డగుతన్నుఁ జూచి కడు రోసి కుమా
రులు విడిచి పోదు రనియెడు, తలఁపున నట్లైన వారు దను విడువమికిన్.

206


వ.

మఱియు నయ్యోగీశ్వరుండు.

207


ఉ.

ఆలలితాంగి నర్థిఁ దనయంకతలంబున నుంచి కామలీ
లాలసభావుఁ డై తగిలి యాసవ మాదటఁ దాను నింతియు
న్గ్రోలుచు నట్టె పాడుచును గూరినభూరిమదంబుసొంపునం
దేలుచు నున్నఁ జూచి ముని దేవకుమారులు రోసి క్రక్కునన్.

208


క.

ఆయోగీశ్వరుని విడిచి, పోయిరి మూఢు లయి వినుము పుణ్యులు యోగ
శ్రీయుతులు వారలకు సరి, యై యుండును హవ్యసేవనాసవసేవల్.

209


క.

ఆడుట పాడుట పడఁతులఁ, గూడుట యాసవరసంబు గ్రోలుట యోగ
క్రీడలు గావున యోగుల, నేడిరవులఁ జేర వఘము లేక్రియ నున్నన్.

210


క.

అనిలుఁడు చండాలస్ప, ర్శనమున విను మశుచి గానిచందంబున యో
గనిపుణుఁ డస్పృశ్యస్ప, ర్శనమునఁ దా నశుచి గాఁ డసంగుం డగుటన్.

211


వ.

కావున నమ్మహాయోగి యయ్యంగనయుం దానును మదిరారసం బానుచు మోక్ష
కాంక్షులగు యోగిజనులచేత విచింత్యమానుం డగుచు నాంతరం బగుతపం బాచ

రించుచుండె నంతఁ గొంతకాలంబునకుఁ గృతవీర్యుం డనుమహీపతి పరలోకగతుం
డైన నతనితనయుం డర్జునుండు నిజాభిషేకార్థం బరుగుదెంచిన మంత్రిపురోహిత
పౌరజనంబులం జూచి నరకోత్తరం బైనయీరాజ్యంబు నేఁ జేయ నొల్ల వినుండు.

212

కార్తవీర్యార్జునవృత్తాంతము

సీ.

పరనృపతస్కరబాధలు లే కుండఁ దమ్ముఁ గాచుటకునై ధరణిపతికి
ద్వాదశాంశధనంబు వాణిజ్యపరులు గోపాలకర్షకులు షడ్భాగగవ్య
ధాన్యంబు లిత్తురు తప్పక యజ్ఞనావలుల రక్షింపఁగ వలను లేక
యవనితలేశ్వరుం డప్పాళు లూరక హరియించి దస్యునియట్ల ఘోర


తే.

నరకమునఁ బడు భూవహనమున కిప్పు, డే నశక్తుండఁ గావున నే వనమున
కరిగి తప మాచరించి యధ్యాత్మయోగ, సిద్ధిఁ బొందెద నని యర్థిఁ జెప్పుటయును.

213

గర్గకార్తవీర్యసంవాదము

తే.

అతనిమనమునందలినిశ్చయం బెఱింగి, గర్గుఁ డనుమంత్రి యి ట్లనుఁ గరము నెమ్మిఁ
దపము సేయంగ నీ విట్లు విపినమునకుఁ, జనియె దేనియుఁ జెప్పెద మనుజనాథ!

214


క.

హరి దత్తాత్రేయుం డన, ధరణి నవతరించి యోగతత్పరుఁడును ని
ర్జరమునిసేవితుఁడును నై, పరగుచు నున్నాఁ డతని నుపాసింపు నృపా!

215


క.

అనిమిషపతి యసురులచేఁ, దనరాజ్యముఁ గోలుపోయి తా నయ్యోగీం
ద్రుని నారాధించి మగుడ, దనుజుల నిర్జించి నిజపదస్థితి నొందెన్.

216


వ.

అనిన నర్జునుం డి ట్లనియె.

217


ఆ.

అసురవరులచేత నమరేశ్వరుం డెట్లు, గోలుపోయెఁ దనవిశాలలక్ష్మి
నమ్మునీంద్రు నెట్టు లారాధనము సేసె, మగుడ నెట్లు రాజ్యమహిమ వడసె.

218


వ.

అని యడిగినం గార్తవీర్యార్జునునకు గర్గుం డి ట్లనియె.

219


శా.

జంభాదిప్రకటాసురప్రకరము ల్శక్రాదిదేవాలియు
న్శుంభద్విక్రమకేళిలీల లెసఁగ న్సోమించి యేకాబ్ద ము
జ్జృంభోత్సాహము లుల్లసిల్లఁగ జయశ్రీలోలత న్బోర సం
రంభం బేది నిలింపు లోడి రసురవ్రాతాస్త్రభిన్నాంగు లై.

220


తే.

అమరు లట్లోడి వాలఖిల్యాదిమునులుఁ, దారు గురునిపాలికిఁ జని దైత్యవరుల
నోర్చుతెఱఁగు విచారించుచుండ వారి, కెలమి మిగుల బృహస్పతి యిట్టు లనియె.

221


మాలిని.

అతివికృతచరిత్రుం డత్రిపుత్త్రుండు యోగ
స్థితినిరతుఁడు దత్తాత్రేయుఁ డవ్విష్ణుమూర్తి
న్సతతము నతిభక్తి న్వత్సలుంగా భజింపుం
డతఁ డసురకులఘ్నోద్యద్వరం బిచ్చు మీకున్.

222

దేవతలకు దత్తాత్రేయునకు నైనసంవాదము

సీ.

అనుడు దివౌకసు లతిరయంబున నేఁగి కిన్నరగంధర్వగీయమాను
లక్ష్మీసమన్వితు లలితాంగుఁ దేజస్సముజ్జ్వలు నమ్మహాయోగిఁ గాంచి
యతిభక్తితో మ్రొక్కి యాసవతోయాదు లడిగిన నిచ్చుచు నమ్మహత్ముఁ
డరిగినతోడనే యరుగుచు నిలిచినయెడఁ దారు నిలుచుచు నెలమి మిగుల


ఆ.

ననుదినంబుఁ దగిలి యారాధనము సేయ, నమరవరులఁ జూచి యతఁడు నన్ను
నేమి గోరి మీర లిట్లు సేవించెద, రనిన వార లిట్టు లనిరి ప్రీతి.

223


చ.

బలువిడి మూఁడులోకములు బాహుబలంబున జంభుఁ డాదిగాఁ
గలదితినందను ల్గొనిన గర్వ మడంగి భవత్పదాంబుజం
బులు గొలువంగ వచ్చితిమి భూరిగుణాకర! యమ్మహాసురా
వలిఁ బొలియించి మాకుఁ ద్రిదివస్థితిఁ గ్రమ్మఱఁ జేయవే దయన్.

224


వ.

అనిన దత్తాత్రేయుం డిట్లనియె.

225


శా.

మద్యాసక్తుఁడ నంగనారతుఁడఁ గర్మభ్రంశనోచ్చిష్టుఁడ
న్మాద్యద్దైత్యవినాశశక్తి గలదే నా? కన్న నద్దేవత
ల్విద్యాక్షాళనశుద్ధమానసుఁడ వావిష్ణుండ వాద్యుండ వీ
యుద్యత్పుణ్యచరిత్ర యిందిర మహాయోగీంద్రచూడామణీ!

226


వ.

నీవు సత్యజ్ఞానానందస్వరూపుండవు నీకు విధినిషేధంబు లెక్కడివి? యనిన నమ్మ
హాయోగి నగుచు నది యట్టిద మీరు నాయున్నరూ పెఱింగి యారాధించితిరి.
భవదభిమతం బిప్పుడ యొనరించెద దానవులు నెలయించికొని రం డద్దురాతులు
మదీయదృష్టిపాతంబున నవగతప్రాభవులై నశింతు రనిన నాదిత్యు లత్యంతరయం
బునం జని దైత్యులం బోరికిఁ బిలిచిన.

227


క.

చెలఁగుచు భుజబలదర్పో, జ్జ్వలు లై తలపడిన రాక్షసప్రవరుల కో
ల్తల కోహటించి దేవత, లలజడిఁ జని రత్రిపుత్త్రునాశ్రమమునకున్.

228


తే.

అవ్విధంబున నని నోడి యధికభీతిఁ, జనిన దివిజుల వెనుకొని దనుజు లరిగి
కనిరి మదిరామదాలసు ననుపమాన, దివ్యతేజు దత్తాత్రేయు భవ్యమూర్తి.

229


వ.

కాని మఱియును.

230

దైత్యులు దత్తాత్రేయదారాపహరణంబున నశించుట

ఉ.

ఆముని వామపార్శ్వమున యందు వెలుంగుచునున్న లక్ష్మిఁ ద
ద్భామిని నిందుబింబముఖఁ బద్మవిలోచనఁ జారుభూషణ
శ్రీమహిమాభిరామఁ గని చిత్తజబాణవిభిన్నచిత్తు లై
ప్రేమ మెలర్ప దైత్యులు హరింపఁగఁ గోరిరి దాని నందఱున్.

231


వ.

అట్లు కోరి దనుజు లద్దివిజులవెనుకం జనక నిలిచి.

232


క.

స్త్రీరత్నంబు త్రిలోకీ,సారం బిది మనకు నిపుడు సమకూరెఁ గృతా

ర్థారంభుల మైతి మనుచు, నారక్కసు లంగజార్తు లై యాలక్ష్మిన్.

233


ఆ.

పట్టి శిబికమీఁదఁ బెట్టి శిరంబుల, మోచికొని చనంగ మునివరుండు
సురలఁ జూచి నగుచు సిరి దానవులతల, కెక్కె వృద్ధిఁ బొందుఁ డింక మీరు.

234


వ.

అది యె ట్లనిన వినుండు.

235

లక్ష్మీనివాసస్థానఫలవివరణము

క.

మేనం బురుషునిసప్త, స్థానంబులు గడచి తలకుఁ జని సిరి విడుచు
న్వాని ననిన ననిమిషు లా, స్థానమ్ములు దత్ఫలములు జననుత! చెపుమా.

236


వ.

అని యడిగిన నమ్మునివరుండు.

237


సీ.

పురుషునిపదములఁ బొంది యిందిర శుభమందిరస్థితి కటిమండలమున
నుండి మాణిక్యవస్త్రోన్నతత్వము గుహ్యమునఁ జెంది భార్యాప్రమోదలీల
క్రోడాంగమున నెలకొని సుతబహువృద్ధి హృదయంబు నొంది యభీష్టసిద్ధి
గళమున వసియించి కంఠభూషణలబ్ధి వదనాబ్జమున నిల్చి మృదుతరాన్న


తే.

మంజువాక్యకవిత్వసమగ్రశాంతి, మహిమ గలుగంగఁ జేయుఁ దా మస్తకమున
కరిగెనేని రయంబున నతని విడిచి, యతిముదంబున నన్యుని నాశ్రయించు.

238


వ.

కావున శిరోగత యగుటం జేసి లక్ష్మి యద్దానవులం బరిత్యజించెఁ బరదారాభిలాషం
బున దగ్ధపుణ్యు లైనయద్దురాతుల నేను తేజోబలైశ్వర్యహీనులం గావించితి
మీరు భయంబు దక్కి యారక్కసుల నుక్కడంపుఁ డనుటయు.

239


ఆ.

సురలు చెలఁగి యేయుసునిశితశరముల, జంభముఖనిలింపశత్త్రుకోటి
సమసె లక్ష్మి యెగసి చనుదెంచి యాత్రేయు, నొందె హర్షలీల నొంది యపుడు.

240


క.

అమరేంద్రాద్యమరులు స, ప్రమదు లగుచు నమ్మునీంద్రుఁ బ్రస్తుతులఁ బ్రణా
మముల నలరించి వైభవ, మమరఁగ నాకమున కరిగి రవనీనాథా!

241


క.

అమరేంద్రునట్లు నీవును, నమలినతరభక్తియుక్తి నాదత్తాత్రే
యమునీంద్రుఁ గొల్చి భూవర!, యమితైశ్వర్యంబు వడయు మని చెప్పుటయున్.

242

కార్తవీర్యుఁడు దత్తాత్రేయు సేవించి యిష్టార్థములఁ బడయుట

వ.

గర్గునివచనంబులు విని కార్తవీర్యుం డయ్యోగీంద్రుకడ కరిగి నమస్కరించి యను
దినంబును బాదసంవాహనంబులను మద్యమాంసవివిధాహారసమర్పణంబులను
జందనకర్పూరకస్తూరికాదిసమస్తవస్తుప్రదానంబులను దదుచ్చిష్టావసేవనంబులను
నతనిచిత్తంబు గృపాయత్తంబుగా నారాధించుచుండ నమ్మునివరుండు దనయ
పానపవనజనితం బగుననలంబున నమ్మహీభుజభుజద్వయంబు దగ్ధంబు గావించిన
మఱియు నతం డత్యంతభక్తిం బరిచర్య యొనర్చుచుండం గనుంగొని యి ట్లనియె.

243


శా.

కాంతాసక్తుఁడ మద్యపానరతుఁడం గష్టప్రచారుండ న
త్యంతప్రీతి భజించె దేమిటికి న న్నన్న న్మహీనాయకుం

డంతశ్శుద్ధుఁడ వీ వసంగుడవు విద్యావిస్ఫురస్ఫూర్తి వీ
కాంతారత్నము పద్మవాస త్రిజగత్కళ్యాణి యోగీశ్వరా.

244


క.

నీ వరయఁగ విష్ణుండవు, నావుడు ముని సంతసిల్లి నాతత్త్వము స
ద్భావమున నెఱిఁగి కొలిచితి, గావున వర మిత్తు నడుగు కామ్యయశోర్థీ!

245


మ.

అనిన న్పమ్మద మంది యర్జునుఁడు వేహస్తంబులు న్భూమిపా
లనసామర్థ్యము ఘోరసంగరజయోల్లాసంబు నిష్టార్థము
ల్దనుఁ బేర్కొన్న జనాళి గాంచుటయు సద్ధర్త్మైకతాత్పర్యము
న్ఘనసామ్రాజ్యమహావిభూతియును వేడ్క న్వేఁడె నాసంయమిన్!

246


వ.

మఱియు శైలాకాశజలభూమిపాతాళంబులయందు మదీయరథగతి యకుంఠిత గావ
లయు ననవుడు నమ్మహాయోగీంద్రుం డతనికి నవ్వరంబు లన్నియు నొసంగి మత్ప్ర
సాదంబునం జక్రవర్తిత్వంబు నొందుమని యనుగ్రహించినం గృతార్థుం డై సహస్ర
బాహుం డమ్మునీంద్రునకు నమస్కరించి వీడ్కొని నిజపురంబునకుం జని రాజ్యాభి
షేకమాంగళ్యంబు నంగీకరించి దత్తాత్రేయప్రసాదంబున నభివృద్ధి నొంది భుజ
బలైశ్వర్యసంపన్నుండ నై వచ్చితి నేను దక్క నెవ్వఁ డాయుధంబులు ధరియించి
నను వాఁడు దస్యుండునుంబోలె నాచేత వధ్యుం డగు నని చాటించినం దదీయ
రాష్ట్రంబునం దొక్కరుండును శస్త్రహస్తుండు లే కుండె నంత.

247


ఆ.

భూమిపాలకుండు గ్రామపాలకుఁడు గో, పాలకుండు విప్రపాలకుండు
క్షేత్రపాలకుఁడు నశేషతపోధన, పాలకుండు నగుచుఁ బార్థివుండు.

248


క.

బహుయజ్ఞంబులు సేయుచు, మహనీయాహవవిహార మహితుం డగుచు
న్విహితతపం బొనరించుచు, సహస్రబాహార్జునుఁడు ప్రజాపాలనమున్.

249


వ.

చేయుచున్న నతనియత్యంతసమృద్ధిఁ జూచి యాంగిరసుం డనుమునివరుండు.

250


క.

నానాయజ్ఞంబుల బహు, దానంబుల సతతభూరితపముల రణకే
ళీనైపుణముల నర్జును, నేనృపతులు పోల నేర్తురే! యని పొగడెన్.

251


క.

ఏదినమున వరము వడసె, నాదత్తాత్రేయుచేత నానరనాథుం
డాదినమునఁ దత్పూజన, మాదరమునఁ జేయుఁ దాను నవనీజనులున్.

252


వ.

అని చెప్పి జడుండు తండ్రీ! దత్తాత్రేయుజన్మప్రకారంబును దదీయమాహాత్మ్యం
బును జెప్పితి నింక నలర్కుండు పుట్టినవిధంబును రాజర్షి యైనయమ్మహాత్మునికి
నయ్యోగీంద్రుండు చెప్పినయోగంబును జెప్పెద నాకర్ణింపుము.

253

అలర్కచరిత్రము—ఋతధ్వజుఁ డను నామాంతరముగల కువలయాశ్వునివృత్తాంత మారంభించుట

తే.

శక్రుఁ డెవ్వఁడు సేయుయజ్ఞముల సోమ, పాన మొనరించి సంతోషభరితుఁ డయ్యె
నట్టిశత్రుజిన్నామధరాధినాథు, సుతుఁడు సద్గుణయుతుఁడు విశ్రుతయశుండు.

254


క.

లావణ్యాశ్విసమానుఁడు, దీవిభవామరగురుండు దీపితభుజశౌ

ర్యావష్టంభసురేంద్రుఁడు, శ్రీవిలసితమూర్తి పుణ్యశీలుఁడు జగతిన్.

255


తే.

రాచకొడుకులు దాను నారాసుతుండు, వేడ్కతోఁ గూడి బహువిధవిహరణములు
సలుపుచుండఁ గృతార్థు లై సకలవిప్ర, రాజవైశ్యకుమారులు రమణతోడ.

256


వ.

అక్కుమారునికడ కరుగుదేరం దొడంగి రంత నొక్కనాఁ డహిలోకంబుననుండి.

257


చ.

తరుణులు రూపవంతులు సుదర్శను లశ్వతరాత్మజన్ము లా
నరపతిపుత్రుతో విహరణం బొనరించుకుతూహలంబునన్
ధరణిసురాకృతు ల్వెలయఁ దాల్చి ఫణీంద్రకుమారు లేఁగుదెం
చి రిరువు రిద్ధతేజులు విశిష్టజనస్తవనీయవర్తనుల్.

258


ఆ.

అట్లు వచ్చి భూసురాత్మజవైశ్యకు, మారవరులతో విహారలీల
లర్థిఁ జలుపుచున్న యహిరాజతనయులఁ, గాంచి నృపసుతుండు గారవమున.

259


క.

నెచ్చెలులంగాఁ గైకొని, మచ్చిక వెలయంగ నక్కుమారులు దాను
న్నిచ్చలు వివిధవిహారము, లచ్చుపడ న్జలుపుచు న్బ్రియం బలరారన్.

260


మ.

పొలుపుగ మజ్జనాంబరవిభూషణచందనమాల్యభోజనా
దిలలితభోగలీలల సుదీర్ణరసాన్వితగీతవాద్యవి
ద్యల బహుకావ్యనాటకకటాక్షవినోదముల న్గజాశ్వశి
క్షల వివిధాస్త్రశస్త్రనయశాస్త్రపరిశ్రమనైపుణంబులన్.

261


క.

పరిహాసవచనరచనల, సరసకళాభ్యసనముల నజస్రము మైత్రి
పరిణతి వెలయఁగను ఫణీ, శ్వరతనయులతోడఁ గూడి వారని వెడ్కన్.

262


తే.

తగిలి ప్రొద్దులు పుచ్చుచు ధరణినాథ, తనయుఁ డధికప్రమోదతత్పరత నొందె
నర్థిఁ బాఁపకొమాళ్ళును నతనితోడి, యాట లుల్లంబులకుఁ బ్రీతి యావహింప.

263


వ.

పగలు వినోదించి రాత్రి రసాతలంబున కరుగుచు నివ్విధంబున ననుదినంబును వర్తిం
పుచుండ నొక్కనాఁ డశ్వతరుండు పుత్రులం గనుంగొని.

264


క.

మనుజభువనంబునం దెవ్వనితోడం గూడి యాడువాంఛానిరతి
న్జనియెద రేఁ బాతాళం, బునఁ బెక్కుదినంబు లేనిఁ బొడగాన మిమున్.

265


సీ.

అని తండ్రి యడిగిన నయ్యహిదారకు ల్మ్రొక్కి కరంబులు మోడ్చి వినయ
మెలరార ని ట్లని రిల శత్రుజిన్మహీధవునిసుతుండు ఋతధ్వజుండు
రూపవంతుం డార్జవోపేతుఁ డతులశౌర్యాభరణుండు ప్రియంవదుండు
విద్యావిదుఁడు బుద్ధివినయాభిమానలజ్జాన్వితుం డధికసఖ్యప్రియుండు


ఆ.

వేడ్క నతఁ డొనర్చు వివిధోపచారవి, న్యాసముల మనంబు లలరుచుండు
మాకు నిందు నొండులోకంబునందును, నంతప్రీతి పుట్ట దహికులేంద్ర.

266


వ.

అని చెప్పిన నయ్యహికులేశ్వరుం డనురాగిల్లి.

267


క.

అరయఁగ నెవ్వనిపుత్రుఁడు, పరోక్షమున నిట్లు పొగడఁబడు సతతము స
త్పురుషులచే నమితగుణో, త్తరుఁ డై యాతండు ధన్యతముఁడు తలంపన్.

268

తే.

చెలులు పగతురు నెవ్వనిచెలితనంబు, కలితనంబు గీర్తింతురు కడఁగి యెపుడు
నట్టిపుత్రునిచే సుగుణాఢ్యులార, పుత్రవంతుఁడు నాఁ బెంపుఁ బొందుఁ దండ్రి.

269


క.

ఉపకారపరుఁడు మైత్రీ, నిపుణుఁడు గుణయుతుఁడు నైననృపతనయునకున్
విపులతరప్రీతి న్బ్ర,త్యుపకారోత్సవము మీరు నొనరించితిరే?

270


చ.

మనసదనంబునం గలసమంచితకాంచనరత్నవస్తువా
హనము లశంకత న్నృపవరాత్మజుచిత్త మెలర్పఁగాఁ దగం
గొని చని యిండు జీవితము కుచ్చితమై చనుఁ బుత్రులార! నె
మ్మి నుపకృతిప్రవీణుఁ డగుమిశ్రునకుం బ్రియ మాచరింపమిన్.

271


తరల.

అనినఁ బుత్రులు తండ్రితోడఁ గృతార్థుఁ డాతఁడు వానికి
న్విను ప్రియంబొనరింప శక్యమె! వేల్పుఱేనికి నైన నా
తని కిలం గలయట్టిరత్నవితానవస్తుచయంబు వా
హనము లీయురగాలయంబునయందు లే వహివల్లభా!

272


ఆ.

జ్ఞాన మతనియంద కాని లే దన్యుల, యందుఁ బ్రాజ్ఞజనుల కైన నతఁడు
సంశయంబు లెల్లఁ జయ్యనఁ బాపంగఁ, జాలినట్టిసత్త్వశాలి సుమ్ము.

273


వ.

అతనికిం జేయవలయు కార్యం బొక్కటి గల దది హరిహరహిరణ్యగర్భాదులకుం
దక్కఁ దక్కినవారి కసాధ్యం బనిన నశ్వతరోరగేశ్వరుం డట్టియసాధ్యం బైన
కార్యం బెయ్యది దాని నెఱుంగవలయునని మఱియు ని ట్లనియె.

274


క.

ఇది సాధ్య మగు నసాధ్యం, బిది యనఁగా నేల కార్య మీడితధిషణా
స్పదు లై తగ నొనరించిన, నది సిద్ధిం బొందు నిశ్చలారంభునకున్.

275


క.

అమరత్వం బమరేశ, త్వ మమరపూజ్యత్వ మనుపదంబులు వరుస
న్సమధికతమవిహితోద్యో, గమునన యవి తమ్ముఁ బొందఁ గాంతురు మనుజుల్.

276


ఆ.

అరుగకుండె నేని గరుడఁ డైనను నొక్క, యడుగు నరుగ లేఁడు కడఁగి చీమ
యైన నరుగఁ దొడఁగె నేని యనేకస, హస్రయోజనమ్ము లరుగుచుండు.

277


క.

భువి యెక్కడ దివి యెక్కడ, ధ్రువుఁ డీభువినుండి కాదె ధ్రువ మగుపదమున్
దివిఁ బడసెం గావున స, ద్వ్వవసాయికిఁ బడయరానియదియును గలదే.

278

శత్రుజిత్తుతో గాలవుఁడు స్వాశ్రమపీడఁ జెప్పుట

వ.

అని యశ్వతరుం డక్కుమారులకుం జేయవలయు నసాధ్యకార్యం బెయ్యది వాని
నెఱిఁగింపుఁ డనిన నప్పాఁపఱేనికిఁ దదీయసూను లాఋతధ్వజుండు మాకుం జెప్పిన
తెఱంగున నతనివృత్తాంతం బంతయు నీకుం జెప్పెద మవధరింపుము గాలవుం డను
మునివరుం డొక్కతురగోత్తమంబు గొని శత్రుజిత్తుకడ కరుగుదెంచి నరేంద్రా!
మదాశ్రమంబు చొచ్చి సింహసింధురశార్దూలాదివనచరాకారంబులు ధరియించి
యొక్కరాక్షసుండు మౌనవ్రతపరుండనై తపం బాచరించుచున్న నాకు మనశ్చలనం
బుగా నిచ్చలు విఘ్నంబు లాచరించుచున్ననద్దానవుం గోపానలంబున భస్మంబు

గావింప సమర్థుండ నయ్యును దపోవ్యయంబున కోర్వక యేను దుఃఖించి నభంబు
చూచి నిట్టూర్పు నిగిడించిన నయ్యంబరతలమునుండి వచ్చి యీయశ్వంబు నాయె
దుర నిలువంబడిన నాకాశవాణి యి ట్లనియె.

279


చ.

రవి యొసఁగె న్మునీశ్వర! తురంగము నీ కిది సత్త్వసంపద
న్గువలయ మెల్ల వ్రేల్మిడిన గ్రుమ్మరు నీళులఁ బర్వతంబుల
న్దివి నతలంబున న్సకలదిక్కులఁ జెక్కు సెమర్ప కెందునుం
దవు లొక యింత లేక సతతంబుఁ జరించు సముల్లసద్గతిన్.

280


వ.

కువలయసంచారసామర్థ్యంబునం జేసి.

281


ఆ.

కువలయం బనంగఁ గువలయంబున నతి, ఖ్యాతి నమరునీహయంబు నెక్కి
మునివరేణ్య! నిన్ను ననిశము గారించు, కిల్బిషాత్ము నసురఁ గీటడంచు.

282


క.

ఘనుఁ డైనశత్రుజిన్నృపు, తనయుండు ఋతధ్వజుండు తడయక దీని
న్గొని చని విక్రమతేజో, ధనుఁ డగునాతనికి నిమ్ము తద్దయు నెమ్మిన్.

283


వ.

అని చెప్పిన హర్షించి యీ తురంగరత్నంబు దెచ్చి నీకు నివేదించితి నాతపంబునకు
విఘ్నం బొనరించునక్తంచరు సమయించుటకై కుమారుని నియోగించి ధర్మ
రక్షణం బాచరింపుమనవుడు నన్నరేంద్రుం డమ్మునివచనం బాచరించి.

284


తే.

పరమకౌతుకమంగళస్ఫురితుఁ బుత్త్రు, నత్తురంగంబు నెక్కించి యనిచి పుచ్చె
నమ్మునీంద్రునితోఁగూడ నతఁడు నక్కు, మారుఁ దోడ్కొని తనయాశ్రమమున కరిగె.

285

వరాహముం దఱుముచుఁ గువలయాశ్వుండు బిలముఁ జొచ్చుట

క.

అనిన భుజగేంద్రుఁ డి ట్లను, జననాథకుమారుఁ డట్లు చని యేమి యెన
ర్చెను నటఁ జెపుఁ డేతత్కథ, విన విస్మయ మనుడు నురగవిభునకుఁ బుత్త్రుల్.

286


చ.

అనుపమశౌర్యుఁ డాకువలయాశ్వకుమారుఁడు గాలవాశ్రమం
బునఁ గలసంయమీశ్వరులఁ బొల్పుగఁ గాచుచు సర్వవిఘ్నశాం
తినిపుణుఁ డై యజస్రము నతిప్రమదంబున నుండె నున్న య
జ్జనపతిపుత్రు గాలవునిఁ జంపఁ గడంగి మదంబుసొంపునన్.

287


సీ.

రాక్షసుఁ డుగ్రవరాహరూపము దాల్చి ఘురఘురధ్వనుల నంబరము వగులఁ
గన్నుల విస్ఫులింగములు రాలంగను జరణఘట్టనమున ధరణి వణఁకఁ
జనుదేర మునిశిష్యసమితి గనుంగొని యాక్రోశ మొనరించి రన్నరేంద్రు
సుతుఁడు బాణాసనస్ఫురితపాణియు హయారూఢుఁడు నై కడుఁ గ్రూర మైన


తే.

యర్ధచంద్రబాణము గొని యతిరయమునఁ, గదిసి యప్పంది నేసిన నదియు నొచ్చి
తిరిగి భయమున వనములు గిరులు గడచి, చనఁ దొడంగె నవ్వీరుఁడు వెనుకొనంగ.

288


వ.

అట్లు సహస్రయోజనంబులు చని యవ్వరాహంబు తిమిరపటలపరివృతం బైనభూ
వివరంబునం బాతాళంబునకు దిగంబడినం గువలయాశ్వుండును వెనుకన యత

లంబునకు డిగ్గి యాక్రోడంబుం బొడగానక నిరంతరప్రభావిభాసితం బగునొక్క
రమణీయప్రదేశంబునందు.

289

బిలమున నొకబాలికయుఁ గువలయాశ్వుండు నొండొరు మోహించుట

చ.

అనుపమరత్నకాంచనసమంచితనిర్మలహర్మ్యపంక్తుల
న్ఘనతరదీప్తవప్రమణికాంతులు నున్నతదేవతానికే
తనఖచితాబ్జరాగమణిదామములం గడుఁ దేజరిల్లి య
య్యనిమిషనాథువీటి కెన యై యతలంబు వెలుంగఁజేయుచున్.

290


తే.

పొలుచుసౌవర్ణపురి గని భూపసుతుఁడు, మెచ్చి వర్ణించుచును దానిఁ జొచ్చి యందు
మిడుక మానిసి గాన కప్పుడు మనంబు, కరము విస్మయ మందంగఁ దిరిగి తిరిగి.

291


తే.

కడురయంబునఁ జనునొక్కకాంతఁ గాంచి, తన్వి యెటఁబోయె దెవ్వరిదాన? వనిన
మగువ యూరక చని యొక్కమాడు వెక్కు, టయును నొక్కెడఁ గ్రక్కున హయము గట్టి.

292


క.

మనమున శంకింపక చ, య్యనఁ దానును దానిపజ్జ నాహర్మ్యం బె
క్కి నృపసుతుఁడు మణిమయకాంచనపర్యంకమున నున్న చంద్రనిభాస్యన్.

293


సీ.

ఏకాంతమునఁ దనయిచ్చఁ గ్రీడింప దర్పకుఁ బాసి వచ్చినరతి యనంగఁ
బాతాళవిహరణకౌతూహలమున నేతెంచినజలధీశుదేవి యనఁగ
భాసురాకారసంపదసొంపు దాల్చిన లలితోరగాలయలక్ష్మి యనఁగ
రుచిరతరాంగనారూపంబు గైకొన్న శృంగారరసమయశ్రీ యనంగ


తే.

నసమలావణ్యభాతిఁ బొల్పారుకుసుమ, కోమలాంగి నున్నతకుచకుంభలలిత
నసితవికసితోత్పలతులితాక్షి నొక్క, కన్యకామణి నృపసూతి గాంచె నెలమి.

294


చ.

తనమది కాముబాణములతాఁకున నెంతయు సంచలింపఁగా
ననిమిషలో చనుం డయి ప్రియం బెసలారఁగఁ జూచి మెచ్చుచు
న్జనపతినందనుం డిది రసాతలదేవతయో సుధాంశునం
గనయొ భుజంగరాజవరకన్యకయో ఖచరేంద్రకాంతయో.

295


వ.

అని వితర్కించుచు నక్కుమారుం డాసుందరీరత్నంబుసౌందర్యంబునం దాసక్తుం
డయ్యె నంత.

296


చ.

అమరకుమారసన్నిభుని నానృపనందను బెట్టు గాంచి సం
భ్రమము భయంబు విస్మయము రాగము లజ్జయు నొక్కమాఱు చి
త్తము గబళించినం దలరి తల్పము దిగ్గన డిగ్గి పోయి ప
ద్మముఖి మనోజుఁ డార్వ సఖమాటున నిల్చెఁ బ్రకంపితాంగి యై.

297


చ.

నిలిచి కుమారుమూర్తిపయి నెక్కొనుచూడ్కులఁ గ్రమ్మఱింప వే
డ్కలు గురియింపఁ గోర్కు లొగిఁ గప్పిన నేరక చిక్కుపాటునం

దలరి మనంబులోన ధృతి దర్పకవీరుని యేయుపువ్వుఁదూఁ
పులఁ బొరివోయినం గలఁగి పొల్తుక యెంతయు వీతలజ్జయై.

298


తే.

తనవిలోచనమధుకరద్వయము గరము, దమకమున నక్కుమారుసౌందర్యమధువుఁ
గ్రోలికొనఁగ మెచ్చులు మదిఁ గీలుకొనఁగ, నంబుజాస్య శిరఃకంప మావహిల్ల.

299


క.

ఈరమణీయకుమారుఁడు, మారుఁడొ యక్షాధిపతికుమారుఁడొ పౌలో
మీరమణకుమారుఁడో రుచి, రోరగనాయకకుమారుఁడో తలపోయన్.

300


వ.

అని తలంచుచు నమ్మగువ మదనాతిరేకంబున వెచ్చనూర్చి మూర్ఛపోయి పడినఁ
దదీయవయస్య శిశిరజలసేచనమృదువ్యజనవీజనంబుల దానిసేద దీర్చినంజూచి
కువలయాశ్వుం డి ట్లనియె.

301


క.

అతివా నీ విమ్మెయి మూర్ఛిత వగుటకు నేమికతము చెప్పు మనుడు నా
సతి లజ్జాదై న్యసమన్వితలలితాపాంగదృష్టి నెచ్చెలిఁ జూచెన్.

302


తే.

చూచుటయు రాజనందనుఁ జూచి బోటి,
యిట్లనియె నిన్నుఁ జూచి యీయిందువదన
పారవశ్యంబు నొందినకారణంబు, దీనివృత్తాంతమును విను దేటపడఁగ.

303

కుండల యనుసఖి కువలయాశ్వునితో మదాలసావృత్తాంతము చెప్పుట

సీ.

విశ్వావసుం డన వెలసినగంధర్వరాజుతనూజ యీరాజవదన
పేరు మదాలస యారామమునఁ గేలి యొనరించుచుండఁగ నొక్కనాఁడు
పాతాళపతి యైనపాతాళకేతుఁ డన్పాపురక్కసుఁ డేపు మిగిలి
మాయాబలమున నీమానినిఁ గొనివచ్చి యిచ్చట నునిచి యీవచ్చురేయి


ఆ.

ననఘ తా వరింతు నని నిశ్చయముఁ జేసి, యుత్సవంబుతోడ నున్నవాఁడు
వాఁడు దగినవరుఁడె వనజాయతాక్షికి, నకట శ్రుతికి శూద్రుఁ డర్హుఁ డగునె.

304


చ.

దనుజునిఁ బొంద రోసి వనితామణి పోయినరేయిఁ జావఁ జూ
చినఁ గృపపెంపున న్సురభి చెప్పెఁ దలోదరి భర్త గాఁడు నీ
కు నసుర మర్త్యలోకమునకు న్జనిన న్వడి నెవ్వఁ డే
యు నతఁడు సుమ్ము భర్త యగు నూఱడు మింతయు శీఘ్ర మయ్యెడిన్.

305


వ.

అని చెప్పిన నిప్పడంతి మరణవ్యవసాయనివృత్త యయ్యె నేనీతలోదరి చెలికత్తియను
గుండల యనుదాన వింధ్యవంతునికూతురఁ బుష్కరశాలిభార్య నతండు
శుంభుండను రాక్షసుచేత మృతుం డైనం బరలోకార్థపుణ్యతీర్థంబులకు దివ్యగతి
నరుగుచు నొక్కచోట సూకరాకారుం డైనపాతాళకేతుండు మునిజనత్రాణపరా
యణుం డైనయొక్కరాజకుమారునిచేత నేటువడి పఱతేరం గనుంగొని యత్తెఱం
గరయం దలంచి వాని వెనుకనే మరలి యిచటి కరుదెంచితి నిమ్మచ్చెకంటి మూర్ఛకుం
కారణం బాకర్ణింపుము.

306


తే.

చూడ్కులకుఁ జిత్తమున కింపు సొం పొనర్చుచున్న మన్మథమూర్తి వీ వుండ నింక
నసురు నేసిన యన్యుని కాల నగుదు, నొక్కొ యని తల్లడంబున నువిద సొగసె.

307

వ.

అని చెప్పి కుండల వెండియు.

308


ఉ.

అక్కట యీలతాంగి హృదయంబున నీదెస కూర్మి యెంత యు
న్నెక్కొని యున్న దాసురభి నిక్కము రక్కసు నేసినట్టివాఁ
డిక్కమలాక్షిభర్త యని యేర్పడఁ జెప్పెఁ గుమార దైవ మీ
చిక్కులఁ బెట్టి నెవ్వగలఁ జేడ్పడఁ జేయఁ దలంచెనో సఖిన్.

309


తే.

కాంత పుట్టినకోలె దుఃఖములె గుడిచె, దీనికి వివాహ మయినఁ బృథ్వీతలేంద్ర
మరణ మయినట్టిపతిని గ్రమ్మఱను బొంద, నలయ కే నుగ్ర మగుతప మాచరింతు.

310

కుండలతోఁ గువలయాశ్వుఁడు దనవృత్తాంతముఁ జెప్పుట

సీ.

అని చెప్పి కుండల యనఘ నీ వెవ్వండ వేప్రయోజనమున కిందు రాక
గీర్వాణదైత్యగంధర్వచారణకిన్నరోరగపతులలో నొక్కరుండ
వే మానుషాగతి నిట వచ్చి తీమూర్తి మానుషి యన రాదు మాకుఁ జెపుమ
నావుడు శత్రుజిన్నరనాథపుత్త్రుఁడ జనకుపంపున మునిజనులఁ గావ


ఆ.

నరుగుదెంచి గాలవాశ్రమంబున నుండ, నసుర యొకఁడు పంది యై రయమున
వచ్చి యర్ధచంద్రవత్సాయకమున నా, చేత నొచ్చి తిరిగి భీతి నొంది.

311


ఆ.

హయము దోలుకొని రయంబున నే వెను, కొనఁగ నెట్లొ పఱచి క్రోడ మొక్క
బొఱియఁ జొచ్చి యతలమునకు డిగ్గుటయును, దోన జొచ్చి దానిఁ గాన కిచట.

312


వ.

సాంద్రతమఃపుంజంబునం బరిభ్రమించుచు వచ్చి తేజోవిరాజితంబు నిష్పురు
షంబు నైనయిప్పురంబుఁ జొచ్చి నిన్నుం గని నేను బిలిచిన నదత్తప్రతివచన వైన
నీవెనుకన చనుదెంచి యీహర్మ్యతలం బెక్కితి నిది యిట్టిద కాని.

313


క.

విను కుండల నీ చెప్పిన, యనిమిషముఖ్యప్రవరులయం దెవ్వఁడఁ గా
ననుమాన ముడుగు మనుజుఁడ,ననిమిషముఖు లెల్లఁ బూజ్యు లనిశము నాకున్.

314


చ.

అన విని యమ్మదాలస సహర్షసలజ్జసవిస్మయేక్షణం
బు నిగుడ నిశ్చలత్వమునఁ బొంది ముఖాబ్జము చూచుచుండె న
చ్చిన కృపపెంపున న్సురభి చెప్పినయంతయు నిట్లు నిక్క మై
యెనరిన దైవలీల యొకఁ డోపునె త్రోవఁగ నెందుఁ గుండలా.

315


వ.

అని పలికె నంతఁ గుండల కువలయాశ్వుం జూచి.

316


మ.

ధరణీనాథకుమార! యాసురభిచేత న్విన్న ధన్యుం డ వీ
వరయంగా నగు దీలతాంగి మది యన్యాసంగి గా నేర్చు నే
యొరుఁ డుద్యద్భుజవిక్రమోజ్జ్వలుఁడె నీ వొక్కండునుం దక్క ని
ర్భరలీల న్శరవిద్ధుఁ జేసి యెగువ న్బాతాళకేతు న్మహిన్.

317


ఉ.

కావున నర్కుదీప్తి శశిఁగాంతి గుణాఢ్యుని భూతి వొందున
ట్లీవనజాయతాక్షి నిను నిం పెసలారఁగఁ బొంది యుత్సవ
శ్రీ విలసిల్లునట్లుగ వరింపుము సద్విధిపూర్వకంబుగా
నావుడు రాజసూనుఁ డెలనవ్వు మొగంబు నలంకరింపఁగన్.

318

మదాలసావివాహము

ఆ.

అట్ల కాక యనుడు నపుడు మదాలసా, పితృకులైకగురుని హితుని భక్తి
తోడఁ దలఁచెఁ దుంబురుఁ గుండల, యాక్షణంబ యతఁడు నరుగుదెంచి.

319


వ.

సముచితంబు లగుమంగళాచారంబు లొనరించి.

320


చ.

అనలము ప్రజ్వలించి విహితాగమతంత్రము లాచరించి పెం
పొనరఁగ యుక్త మగుహోమము మున్నొనరించి తుంబురుం
డనఘుఁడు సేయఁగాఁ గువలయాశ్వుఁడు పెండిలి యయ్యెఁ బ్రీతి న
త్యనుపమరూపయౌవనమదాలసమానస నమ్మదాలసన్.

321


వ.

ఇ ట్లయ్యిరువురకుఁ బరమోత్సవంబునం బరిణయంబు చేసి తుంబురుండు నిజతపో
వనంబున కరిగెఁ గుండలయును దీర్థంబు లాడఁ జను కుతూహలంబున వినయా
వనతయై కువలయాశ్వున కి ట్లనియె.

322

కుండల తపమొనర్చి దివ్యగతి కేగుట

క.

చతురుండవు నయధర్మా, న్వితుఁడవు సద్బుద్ధి విట్టినీకు ననఘ! పం
డితజను లైనను నేరరు, హిత ముపదేశింప నేర్తురే యెలనాగల్.

323


క.

ఐనను నెచ్చెలిదెస మది, నూనిన నెయ్యమునఁ జేసి యుడుగక బుద్ధు
ల్నా నేర్చినట్లు సెప్పెద, మానుగ మీ కేను వినుఁడు మగువయు నీవున్.

324


సీ.

పతి ప్రయత్నంబుతో భార్య భరించుచుఁ గీ డొందకుండ రక్షింపవలయు
నవిరోధవృత్తి ధరార్థకామములు భార్యానుకూలతఁ బతి కతిశయిల్లు
భార్యావిహీనతఁ బతికి వర్గత్రితయంబులో నొక్కటి యయిన లేదు
దేవపిత్రతిథిపూజావిధు లొనరింప భార్యయ పతికి నుపాశ్రయంబు


తే.

మగఁడు వెలిగాఁగ సతికి ధర్మంబు ధనము, గామమును మున్న లభ్యము ల్గావు గాన
దంపతులు పరస్పరవశతాప్రమోద, మగ్నమానసు లై కూడి మనుట యొప్పు.

325


వ.

అని బహుప్రకారంబుల భర్తృభార్యాధర్మంబులు చెప్పి.

326


క.

మనుజేంద్రతనయ! నీవును, వనితారత్నంబుఁ గూడి వైభవలీలన్
ధనతనయాయుర్యుతు లై, మనుఁ డని దీవించి యక్కుమారుని నెలమిన్.

327


వ.

వీడుకొని మదాలసం గౌఁగిలించుకొని కుండల దివ్యగతిం జనియె నంత.

328

మదాలసం దెచ్చునపుడు మార్గమునఁ గువలయాశ్వునకు రాక్షసులతోడి యుద్ధము

శా.

ధీరోదాత్తుఁడు శత్రుజిత్తనయుఁ డద్దివ్యాశ్వమున్ దాను నా
నీరేజాక్షియు నెక్కి యయ్యతలము న్నిశ్శంకత న్వెల్వడం
బ్రారంభించినఁ గాంచి కొంద ఱసుర ల్పాతాళకేతుండు పెం
పారం దెచ్చినకన్య వీఁ డొకఁడు శౌర్యస్ఫూర్తిఁ గొం చేఁగెడున్.

329


క.

అని యాక్రోశించుచు వెసఁ, జని చెప్పిన దనుజవిభుఁడు సంధ్యారుణలో
చనదంతతాడనోగ్రా, స్యనితాంతామర్షభీషణాకారుం డై.

330


వ.

రయంబున వెలువడి.

331

చ.

చెలఁగుచు దైత్యసేనలు విశృంఖలవిక్రమలీల నేచి యు
జ్జ్వలవివిధాస్త్రశస్త్రరుచిజాలము పర్వఁ గడుం గడంక ముం
గల నడువంగ దానవుఁ డకంపితుఁ డై చను రాజనందను
న్నిలు నిలు మంచుఁ గూడఁ జని నిష్ఠురనాద మెలర్ప నార్చుచున్.

332


ఆ.

చుట్టుముట్టి వివిధసునిశితాస్త్రములు పైఁ, గురిసెఁ గదిసి యసురకోటియును ర
యమునఁ దీవ్రసాయకాసిగదాశూల, తతుల నన్నరేంద్రతనయుఁ గప్పె.

333


ఆ.

అట్లు దనుజవీరు లరవాయి గొనక త, న్భూరిశస్త్రవృష్టిఁ బొదువుటయును
నలఁతి నగవుతోడి యలుక మోమున కొక, చెలువొనర్ప శత్రుజిత్సుతుండు.

334


వ.

గుణంబు సారించి మార్గణంబులు నిగిడించి.

335


శా.

దైతేయప్రవిముక్తదారుణగదాదండాసినానాయుధ
వ్రాతంబు ల్విలసత్తదాభరణవర్మశ్రేణియు న్జూర్ణ మై
పాతాళైకనికేతనాంతరమునం బర్వంగఁ జేసె న్వెసన్
జాతామర్షత నక్కుమారుఁడు రణోత్సాహంబు దీపింపఁగన్.

336


సీ.

చేసి సముల్లాసహాసభాసురతరవక్త్రుఁ డై యుజ్జ్వలత్త్వాష్ట్రబాణ
మసురవీరుమీఁద నతఁ డేసే నేసినఁ దజ్జాతదారుణదహనశిఖలఁ
గాలి చర్మాస్థికపాలముల్ చటచటధ్వనులతో నెంతయు వ్రస్సి తొరఁగఁ
గపిలమునీశ్వరువిపులకోపాగ్ని సాగరులు రయంబునఁ గాఁగినట్లు


తే.

దగ్ధు లయిరి దానవులు పాతాళకేతుఁ, డాదిగా నొక్కవ్రేల్మిడి నంత విజయ
లక్ష్మిఁ గైకొని యమ్మదాలసయు దాను, దనపురంబున కరిగె ఋతధ్వజుండు.

337

మదాలసాయుతుఁ డగుకువలయాశ్వునిఁ దండ్రి గని యానందించుట

వ.

అరిగి పరమభక్తిం దండ్రిచరణంబులకు నమస్కరించి తాను వరాహంబు నేయు
టను దానిపట్టిన పాతాళలోకంబున కరుగుటయుఁ గుండలం గనుటయు మదాలసం
బరిణయంబగుటయుఁ బాతాళకేతుప్రభృతిదైత్యులం జంపుటయు విన్నవించిన
బ్రమదాశ్రుకణకలితలోచనుండును బులకితశరీరుండును నగుచు నన్నరేశ్వరుండు
గువలయాశ్వుం గ్రుచ్చిలించుకొని.

338


ఉ.

నెట్టన నమ్మునీశ్వరులు నిర్భయభావముఁ బొంద దైత్యులం
గిట్టి వధించి ధర్మమును గీర్తియు శౌర్యముఁ దేజము న్మొగుల్
ముట్టఁగఁ జేసి వంశము వెలుంగ జగంబులఁ లేరు గన్న నీ
యట్టిసుపుత్రుఁ గాంచుటఁ గృతార్థుఁడ నైతిఁ గుమార! యెంతయున్.

339


సీ.

తండ్రిచే సంపాదితము లైనధనయశంబులు ప్రతాపము పొలివోవకుండఁ
దప్పక వర్తించుతనయుఁడు మధ్యముం డాత్మీయసత్త్వసామగ్రిఁ జేసి
తండ్రిమాహాత్మ్యంబు దద్దయుఁ దనరార నొనరించునందనుం డుత్తముండు
తండ్రిసద్గుణసముదయము ద్రుంగుడు వడ మెలఁగుపుత్రుఁడు హీనుఁ డలఘుశౌర్య

తే.

తాన వెలయుమనుష్యుఁ డుత్తముఁడు పితృపి
తామహులచేత వెలయు నాతండు జగతి
మధ్యముఁడు మాతచేతను మాతృబంధు
గణముచేత వెలయువాఁడు గష్టతరుఁడు.

340


శా.

పాతాళం బవలీలఁ జొచ్చి విలసద్బాహాబలస్ఫూర్తిమై
దైతేయప్రకరంబు గీటఁడచి గంధర్వాత్మజం దెచ్చి తీ
వేతన్మాత్రుఁడవే భవత్సదృశులే యేరాజులుం బుత్త్ర! నీ
చేతం బెంపు వహించె వంశము యశశ్శ్రీవృద్ధి నేఁ బొందితిన్.

341


వ.

అని యతని నందందఁ గౌఁగిలించుకొని యాయురైశ్వర్యపుత్రధనవంతుండ నగు
మని దీవించి వీడుకొల్పిన అభ్యంతరావాసంబున కరిగి మదాలసాసహితంబుగఁ
గుమారుండు తల్లికి మ్రొక్కి బంధుజనానందకరుం డగుచుండె నని నాగ
కుమారు లశ్వతరునికిం జెప్పిరని జడుండు తండ్రికిం జెప్పినవిధం బేర్పడం జెప్పి
మఱియును.

342

ఆశ్వాసాంతము

తరల.

శమధురంధర! శంఖకంధర! సౌమ్యనీతియుగంధరా!
కమలలోచన! కావ్యసూచన! కమ్రకాంతివిలోచనా!
విమలవిగ్రహ! విమతనిగ్రహ! విష్ణుభక్తిపరిగ్రహా!
సమరభీకర! సద్గుణాకర! చారుకాంతిసుధాకరా.

343


క.

లోకాలోకనగేంద్ర! గు, హాకేలీలోల! కిన్నరామరమిథునా
నీకోపగీయమాన!, శ్లోకోత్తేజఃప్రదీపశోభితచరణా!

344


మాలిని.

వితరణకవిపుత్రా! వీరలక్ష్మీకళత్రా!
సతతశుభచరిత్రా! సజ్జనస్తోత్రపాత్రా!
కృతవిలసితపూర్తీ! కీర్తిధర్మప్రవర్తీ!
ప్రతిభటసమవర్తీ! భామినీహృద్యమూర్తీ!

345


గద్యము.

ఇది శ్రీమదుభయకవిమిత్ర తిక్కనసోమయాజిప్రసాదలబ్ధసరస్వతీపాత్ర
తిక్కనామాత్యపుత్ర మారయనామధేయ ప్రణీతం బైనమార్కండేయమహా
పురాణంబునం దాడిబకయుద్ధంబును జడోపాఖ్యానంబును నరకప్రకారంబును
విపశ్చిదాఖ్యానంబును బతివ్రతాఖ్యానంబును దత్తాత్రేయజన్మంబును జంభాసుర
వధంబును గార్తవీర్యుచరిత్రంబును గువలయాశ్వనాగకుమారులసఖ్యంబును
నాగకుమారు లశ్వతరునికిం గువలయాశ్వుండు పాతాళంబున కరుగుదెంచి మదాల
సను వివాహంబై పాతాళకేతుప్రభృతిదైత్యులం జంపి నిజపురంబున కరిగిన
విధంబుఁ జెప్పుటయు నన్నది ద్వితీయాశ్వాసము.