Jump to content

మార్కండేయపురాణము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

మార్కండేయపురాణము

తృతీయాశ్వాసము




మదజపదభవాన్వయ
తామరసవనార్క! మహితధర్మవితర్కా!
సామహితమితవచనరచ
నామోదితలబ్ధవర్ణ! నాగయకర్ణా!

1


వ.

పరమజ్ఞానచక్షు లైనపక్షు లాజైమిని కి ట్లనిరి జడుండు తండ్రీ యశ్వతరుండు
మదాలసాకువలయాశ్వులు పదంపడి యెట్లు వర్తించి రని యడిగిన నతనికిం
గొడుకు లి ట్లనిరి.

2


ఉ.

అత్తకు మామకు న్సవినయంబుగ నిచ్చలు భక్తి మ్రొక్కుచు
న్జిత్త మెలర్పఁ బంపుఁ దగఁ జేయుచుఁ దాను బ్రియుండు వేడ్కమైఁ
జిత్తజభోగరాగములఁ జేసి మనంబులఁ గౌతుకంబు ద
ళ్కొత్తఁగ నమ్మదాలస మదోత్కటలీల ననేకభంగులన్.

3


శా.

లీలోద్యానముల న్మదాలసమరాళీకేళిరమ్యాబ్జినీ
కూలస్ఫాటికమండలంబుల లతాకుంజంబులన్ రత్నరు
గ్జాలాలంకృతకృత్రిమాద్రివిలసత్పానుప్రదేశంబుల
న్జాల న్వేడ్క వినోదము ల్సలుపుచు న్సాంద్రానురాగంబునన్.

4


వ.

అభిమతసుఖంబు లనుభవించుచునుండె నంత నొక్కనాఁడు శత్త్రుజితుండు పుత్త్రున
కి ట్లనియె.

5


ఉ.

పాపపురక్కసు ల్గలరు పల్వురు దద్భయ మందకుండఁగాఁ
దాపసకోటి గాచునది ధర్మువు గావున శౌర్య మొప్ప నీ
వీపయి వాహనోత్తమము నెక్కి కుమారవరేణ్య! నిచ్చలు
న్దీపిని సంచరింపు ధరణి న్ధరణీసురరక్షణార్థమై.

6

తాళకేతునిమాయచే మదాలస మృతినొందుట

వ.

అని పనిచినం గువలయాశ్వుండు పూర్వాహ్ణంబునం గువలయంబుం గలయం దిరిగి
యరుగుదెంచి తండ్రికి మ్రొక్కుచు మదాలసామనోహరవిహారంబులం దవిలి

దివసశేషంబును రాత్రియు సుఖియించుచు ననుదినంబును నివ్విధంబునం జరి
యించుచుండి యొక్కనాఁడు పాతాళకేతునితమ్ముండు తాళకేతుం డనుదై
తేయుండు పూర్వవైరంబు దలంచి యమునానదీతీరంబున మాయామయం బగు
నాశ్రమంబు గావించికొని మునివేషంబుననున్న వానిం గనియె నంత వాఁడును
నక్కుమారునిం జేర నరిగి యి ట్లనియె.

7


ఉ.

వీరకుమార! యేను నిను వేఁడెదఁ బ్రార్థన సల్పుమయ్య పెం
పార మఘం బొనర్పఁగఁ బ్రియంపడి దక్షిణ లేమి వచ్చితి
న్గారవ మొప్ప నీమహితకంఠవిభూషణ మిమ్ము నాకు ర
క్షారతి పూని యేమఱక కావు మదాశ్రమముం గృపామతిన్.

8


తే.

అంత కేను జలంబులయందు మునిఁగి, సకలభూప్రజావృద్ధిహేతుకము లైన
మహితవైదికవారుణమంత్రవిధుల, వరుణు నాభిమంత్రితునిఁ జేసి వత్తు ననిన.

9


తే.

కపటమునికి నతఁడు మ్రొక్కికంఠభూష,ణం బొసఁగి యేను భవదాశ్రమంబుపొంత
నుండఁగా విఘ్న మొనరింప నొక్కరునికి, రాదు విహితకృత్యము సల్పి రమ్ము పొమ్ము.

10


తే.

అనిన యమునాజలంబులయందుఁ గ్రుంకి, యసురమాయాబలంబున నక్కుమారు
పురమునకుఁ బోయి రాజమందిరముఁ జొచ్చి, మొగముపై శోకదైన్యము ల్ముసుఁగువడఁగ.

11


వ.

ఎల్లవారికి నెఱింగించుచు మదాలసకడకుం జని డగ్గుత్తిక వెట్టుచు.

12


ఉ.

అక్కట యేమి సెప్పుదు మదాశ్రమభూమి ఋతధ్వజుండు పెం
పెక్కినవిక్రమంబున మునీశ్వరరక్షణకేళి నుండఁగా
రక్కసుఁ డొక్కరుండు గడురౌద్రమునం జనుదెంచి తాఁకి పే
రుక్కున నొక్కశూలమున నుగ్రతఁ జీరినఁ గూలె మేదినిన్.

13


వ.

అట్లు గూలి.

14


తే.

మరణవేళను దనకంఠమాల దీని, నిచ్చె నా కింక దాపఁగ నేల? వినుము
శూద్రతాపను ల్గొంద ఱచ్చోట నుండి, యగ్నికార్యంబు లొనరించి రతని కపుడు.

15


తే.

ఎసఁగు హేషారవం బేడ్పుటెలుఁగు గాఁగ, నశ్రుజలపూరితానన మైనకువల
యాశ్వరత్నంబు గొనిపోయె నద్దురాత్ముఁ, డింతయును నేమి సెప్పుదు నేను దల్లి!

16


క.

ఏ నెంతపాపకర్ముఁడ, నో నాముందఱన యింతయును నొనరింపం
గా నాకుఁ జూడవలసె, న్మానిని! యింకేది తగవు? నడుపుము దానిన్.

17


తే.

హృదయమునకు నమ్మిక యగునివ్విభూష, ణంబు గైకొందుఁ గాకిది నాకుఁ దపసి
కేల యనుచు నచ్చట వైచి తాళకేతుఁ, డరుగుటయు నెల్లజనులును నార్తిఁ బొంది.

18


ఉ.

హా! యని యేడ్చుచు న్వివశులై పలవింపఁగ దేవు లమ్మహీ
నాయకుఁడు న్గుమారునిగుణంబులు పేర్కొనుచుం బ్రలాపము

ల్సేయఁగ నవ్విభూషణము చేరి మదాలస ప్రాణవాయువు
ల్వోయి ప్రచండవాతహతపుష్పలతాకృతిఁ గూలె మేదినిన్.

19


క.

అంతటఁ బురజనసదనా, భ్యంతరముల నెల్ల నేడ్పు లడరెను ధరణీ
కాంతునిగృహమున నెట్లు దు, రంతాక్రందనము లడరె నట్టుల పెల్లై.

20


క.

పతిమరణశోకతాపా, హతి విగతప్రాణ యై మదాలస వజ్రా
హతిఁ బడినమణిశలాకా, కృతి నేలంబడినఁ జూచి క్షితిపతి మదిలోన్.

21

శత్రుజిత్తుఁడు దత్పత్నియు వైరాగ్యము నొందుట

వ.

ధైర్యం బవలంబించి పరిజనుల నవలోకించి యిట్లనియె.

22


తే.

అధ్రువంపుసంసారంబునందుఁ గల్గు, నఖిలసంబంధముల యనిత్యత దలంప
మనకు నాఱడి యిట్లు రోదనముచేత, తగవు గాదని చూచెదఁ దత్త్వయుక్తి.

23


క.

మతి నొక్కించుకయును నే, సుతునకుఁ గోడలికి నేని శోకించెదనే
కృతకృత్యత్వంబున వి, శ్రుతులగునయ్యిరువురును నశోచ్యులు మనకున్.

24


వ.

అది యె ట్లనిన.

25


ఉ.

నావచనంబున న్మునిజనస్థిరరక్షణనిత్యతత్పరుం
డై వెస నేఁగి యామునులకై సమరావని వీరకేళిమై
నేవపుదేహము న్విడిచి యెంతయు ధాత్రిఁ గృతార్థుఁ డైనపు
ణ్యావహమూర్తి యాకువలయాశ్వుఁ డశోచ్యుఁడు గాక శోచ్యుఁడే.

26


క.

జననిసతీత్త్వము వంశం, బున విమలత్వమును దనదుభుజవీర్యము నా
తనయుం డిటు వెలయించునె, యని విప్రార్థంబు కాఁగఁ బ్రాణచ్యుతుఁడై.

27


చ.

పతిమృతి విన్నమాత్ర నిజభావము దద్గత మైనఁ దాన సు
వ్రత యిటు ప్రాణము ల్విడిచి గ్రక్కున భర్తను గూడఁగా శుభ
స్థితి మెయిఁ జన్న యీసతివిచిత్రచరిత్రము దుఃఖహేతువే
పతిఁ గడవంగ దైవతము భామల కెందును గల్గనేర్చునే?

28


ఆ.

మగఁడు లేక యింట మలమల మఱుఁగుచు, నీలతాంగి యుండె నేనిఁ జూచి
మనకు నఖిలబంధుజనులకు నొక్కనాఁ, డైన శోకవహ్ని యాఱు టెట్లు?

29


క.

పురుషవిహీన లయినయా, తరుణులదైన్యముల కడలఁ దగుఁ గాక మది
న్బురుషానుమరణపుణ్యో, త్తర యగునీసాధ్వి వగవఁ దగియెడునదియే?

30


వ.

అని శత్త్రుజితుండు పలికినపలుకులం బుత్రమరణప్రకారం బెఱింగి కువలయాశ్వ
జనని జనితహర్షయై పతిం జూచి యి ట్లనియె.

31


చ.

మనమున భీతగోద్విజసమాజముఁ గావఁగఁ బూని యాజి న
స్త్రనిచయదారితాంగు లయి చచ్చువినిర్మలధర్మకర్మఠుల్
మనుజులు గాక రోగముల మ్రంది గృహంబులయందు బంధు లే
డ్వ నిలుగుకష్టులు న్నరులె వారలతల్లులు తల్లులే మహిన్.

32

ఆ.

ఉగ్రవైరివిజయి యొండె మృతుం డొండె, నాజిభూమి నెప్పు డగుఁ దనూజుఁ
డపుడు గర్భదుఃఖ మతివకు సఫలతఁ, బొందు నని తలంతు భూపవర్య.

33


వ.

అని పలికె నంత నన్నరేంద్రుండు గంధర్వరాజనందన నలంకరించి యుచితప్రకా
రంబునం బురంబు వెలువడం గొని చని సంస్కరించి కృతస్నానుం డై కొడుకునకుఁ
గోడలికి నుదకకర్మంబు లాచరించి వీటికిం జనియె నటఁ దాలకేతుండును యమునా
జలంబులు వెలువడి కువలయాశ్వునికడ కరిగి మహాపురుషా! నీవలనం గృతార్థుం
డనైతి నీ విచ్చటం గదల కునికింజేసి మదభిలషితం బంతయు సాధితంబయ్యె
వేంచేయు మనిన నతనికి నమస్కరించి వీడుకొని యక్కుమారుండు.

34


క.

అసమానసౌకుమార్యో, ల్లసితమృదుతనూలతావిలాసమదభరా
లస యై కర మమరుమదా, లసఁ గనుఁగొను నతికుతూహలం బెలరారన్.

35


వ.

కువలయాశ్వంబు నెక్కి రయంబునం జని.

36

కువలయాశ్వుఁడు మదాలసమరణము విని దుఃఖించుట

సీ.

అవగతాలంకార మై యపహృష్టజనావళీవిరళ మై యప్రవర్తి
తాతోద్యవాద్య మై యవ్విధంబున నున్న పురవరంబు కుమారవరుఁడు సొచ్చి
తనరాక కద్భుతంబును నతిమోదంబు నొంది చెలంగుచు నొండొరులను
నెలమి నాలింగనంబులు సేయుచును బ్రీతిఁ జేరి దీవింపుచుఁ బౌరు లెల్లఁ


తే.

బొదివికొని రాఁగ మందిరంబునకుఁ జనిన, దల్లిదండ్రులు సకలబాంధవులు నధిక
హర్షవిస్మయమగ్ను లై యతనిఁ జక్కఁ, గౌఁగిలించి రాశీర్వచఃకలితు లగుచు.

37


వ.

అక్కుమారుండు వారలసంభ్రమచేష్టితంబులు చూచి విస్మితుం డగుచుఁ దండ్రికి
మ్రొక్కి యది యేమి యని యడిగిన నతండు గొడుకున కంతవృత్తాంతంబునుం
దేటపడం జెప్పుటయును.

38


చ.

చెవులకు శూల మై యెదకుఁ జి చ్చయి తాఁకి మదాలసామృతి
శ్రవణము వేదనం బెనుప రాజకుమారుఁడు తల్లిదండ్రు లొ
ద్ద విపులశోకలజ్జలకుఁ దావల మై వదనంబు వ్రాల్చి ని
ల్చె వెఱఁగుపాటు నొంది కడుఁజేష్ట యడంగి విషణ్ణమూర్తి యై.

39


వ.

అటు నిలిచి యంతర్గతంబున.

40


క.

ఆవెలఁదుక నామృతి విని, జీవము వెసఁ దొఱఁగి చనియెఁ జేడియమరణం
బే వినియు నున్నవాఁడను, జీవముతో నింతకఠినచిత్తుఁడు గలఁడే?

41


వ.

అనుచు నందంద నిట్టూర్పులు సందడింప డెందంబు గొందలంబు నొంద నన్నరేంద్ర
నందనుండు వెండియు.

42


సీ.

ఎలనాగఁ బేర్కొని యేడ్చెద నందునే మముబోంట్లకును నిది మానహాని
పడఁతి కిచ్చెదఁ దనుప్రాణంబు లందు నేఁ దనువు ప్రాణంబులు తండ్రిసొమ్ము

మునివృత్తి నడవికిఁ జనియెద నందునే జనకుఁడు నన్నేల చనఁగ నిచ్చు?
నుడిగి మడిఁగి మాని యుండెద నందునే నొవ్వనివారికి నవ్వుఁ బట్టుఁ


తే.

బ్రాణములు నాకు నిచ్చినపడఁతిసదుప,కృతికి నేర్తునె ప్రత్యుపకృతి యొనర్ప?
భామినీభోగసౌఖ్యము ల్పరిహరించి, విరతి నొందెదఁ గా కింక వేయు నేల.

43


వ.

అని తలంచి మదాలసకుం దిలోదకప్రదానంబును ననంతరక్రియాకలాపంబును
నిర్వర్తించి ఋతధ్వజుం డెల్ల వారును విన ని ట్లనియె.

44

కువలయాశ్వుఁ డన్యభార్యపరిగ్రహణము సేయనని ప్రతిన పట్టుట

తే.

నాకు నీజన్మమున సుగుణైకభద్ర, యెగుమదాలస యొక్కర్త యాలు గాని
యన్యభార్యాపరిగ్రహ మాచరింప,నింక సత్యంబు పలికితి నే వినుండు.

45


వ.

అని ప్రతిజ్ఞ చేసి ఋతధ్వజుం డంగనావిషయభోగసుఖంబు లన్నియుఁ బరిత్యజించి
తుల్యవయోరూపగుణసంపన్ను లైనసఖులతోడం గూడి క్రీడించుచున్న వాఁ డత
నికి మదాలసం దెచ్చి యిచ్చుటయ పరమకార్యం బది యీశ్వరాదులకుం జేయ
రాదనిన నితరులకు శక్యంబు గామి చెప్ప నేల యనినం గొడుకులకు నశ్వతరుండు
నవ్వుచు ని ట్లనియె.

46


తే.

జనులు మున్న కై పెక్కి యశక్యమని మ, నంబులోపల స్రుక్కి కార్యంబునందుఁ
బూని యుద్యోగ మొనరింప రేని యెట్లు, దానిసఫలతాఫలతలు దారు గండ్రు.

47


క.

తన పౌరుషంబు వదలక, మనుజుఁడు కార్యం బొనర్ప మానుగ దైవం
బునయందుఁ బౌరుషమునం, దును దత్ఫలసిద్ధి దోఁచుఁ దుల్యస్థితితోన్.

48

అశ్వతరుఁడు సరస్వతిని గుఱించి తపము చేయుట

క.

దారువునం దనలంబును, ధారిణిఁ బరమాణువులును దద్దయు నున్న
ట్లారాధనీయమూర్తిని, భారతి! నీయందు నుండు బ్రహ్మము జగమున్.

49


క.

ఆరయ నీ నెల వగునోం, కారము మాత్రాత్రయమునఁ గాదే యుండు
న్భారతి! సదసన్మయ మగు, సారాసారద్వయంబు సంపన్నం బై.

50


వ.

కావునం దత్కార్యంబునకు యత్నంబు సేసెద నని తనయులకుం జెప్పి యప్పుడ
హిమవంతంబున కరిగి యురగేశ్వరుండు ప్లవతరణం బను తీర్థంబునం దపో
యుక్తుండై సకలవాఙ్మయస్వరూప యైనసరస్వతిం దనహృదయకమలంబున నిలిపి
కొని కరకమలంబులు మొగిచి యి ట్లనియె.

51

అశ్వతరునకు సరస్వతి గానప్రావీణ్య మొనఁగుట

వ.

దేవీ! యనిర్దేశ్యస్వభావంబును బ్రణవార్థమాత్రాశ్రితంబును వికారరహితంబును
దాలుదంతోష్ణపుటజిహ్వావ్యాపారదూరంబును సాంఖ్యవేదాంతోక్తంబును నాది
మధ్యాంతరహితంబును నై వెలుంగు పరంజ్యోతి నీస్వరూపం బిట్టి దని నిరూ
పింప నెవరికి శక్యంబు నిత్యంబులు ననిత్యంబులు స్థూలంబులు సూక్ష్యంబులు నైన

బహువిధపదార్దంబులు నీవలన నుద్భవిల్లు నీస్వరవ్యంజనంబులం జేసి సమస్తంబు
సంవ్యాప్తం బై యుండు నీమహామహిమ యవాఙ్మౌనసగోచరం బని యనేకప్రకా
రంబులం ప్రస్తుతించిన బ్రసన్నసరస్వతి యశ్వతరునిం గనుంగొని పరలోక
ప్రాప్తుండైన నీయనుజుండు కంబళుండు చనుదెంచి తొల్లిటియట్ల నీకు సహాయుండు
గా వరం బిచ్చితినింక నీకభిమతం బెయ్యది? యడుగు మనిన నతండు దేవీ!
కంబళునకు నాకు సప్తస్వరమహితమధురగీతవిద్యావిశారదత్వంబు ప్రసాదింప
వలయు ననిన వాగ్దేవి యవ్వరం బొసంగి మత్ప్రసాదంబున మీరు స్వర్గమర్త్య
పాతాళంబులయం దెవ్వరికంటె నధికులయిన గాయకుల రగుఁ డని యంతర్ధానంబు
చేసినం బదతాళస్వరాదిలక్ష్యలక్షణంబంతయు నప్పుడ తమ కవగతం బగుటయు
నయ్యన్నయుం దమ్ముండును బరమానురాగంబునం దేలుచుఁ గైలాసంబున కరిగి.

కైలాసమున శివుఁ డశ్వతరునిపాటకు మెచ్చి వరమొసంగుట

స్రగ్ధర.

శ్రుతిశాంతావక్త్రపద్మస్ఫురితబహువిధస్తోత్రనవ్యార్థజాతో
ద్గతవైచిత్రీనిమగ్నాత్మకు సురమునిగంధర్వవిద్యాధరేంద్రా
ర్చితపాదాంభోజుఁ గాంతీశితృదశశతదృక్ఛ్రీపతి బ్రహ్మసేవా
సతతప్రేమాత్మచేతోజనితఘనదయాశాలిఁ జంద్రార్ధమౌళిన్.

53


మ.

కని భక్తిం బ్రణమిల్లి పన్నగపతు ల్గౌతూహలం బెంతయు
న్దనరంగా నధికప్రయత్నమున నిత్యంబు న్గడు న్జేరి రే
పును మధ్యాహ్నమునప్డు సంజలను మాపుం గొల్చి యప్పార్వతీ
శునిఁ గీర్తించుచు నింపుఁ బెంపు నెదలో సొంపారఁగాఁ బాడుచున్.

54


క.

అహిపతు లారాధన మిటు, బహుకాలము సేయ వారిపాటకుఁ గడుమె
చ్చి హరుం డడుగుఁడు వరముల, నహీనముగ నిత్తు ననిన ననురాగముతోన్.

55


తే.

అశ్వతరుఁడు తమ్ముండును నధికభక్తి, నమ్మహాదేవునకు మ్రొక్కి యమరవంద్య
దేవదేవ త్రిలోచన త్రిపురమథన, యిందుశేఖర దయ వర మిచ్చె దేని.

56


వ.

అవధరింపుము మరణప్రాప్త యైనకువలయాశ్వకుమారుని కులప్రమద మదాలస
తనపూర్వవయోరూపకాంతివిలసనములతో నా కిప్పుడు పుత్రి యై పుట్టి జాతిస్మ
రయుఁ బరమయోగినియును యోగిమాతయును గావలయు ననిన భవుండును
మత్ప్రసాదంబున నట్ల యయ్యెడు నీవు నిజపురంబునకుఁ జని నియతుండ వై
పితృప్రియంబుగా శ్రాద్ధం బొనరించి మధ్యమపిండం బుపయోగించి మదాలసాజనన
కామధ్యానపరుండ వగుచుండ నీమధ్యమఫణంబున నాసుమధ్య యుద్భవించు నని
వరం బిచ్చిన హర్షించి భుజగేశ్వరుండు భుజగకుండలునకు నమస్కరించి రసాత
లంబున కరిగి తత్ప్రకారంబున నాగంధర్వరాజనందనం బడసి యెవ్వరు నెఱుంగ
కుండ నంతర్గృహంబున నంగనాజనరక్షితం గావించి యొక్కనాఁడు కొడుకుల
కి ట్లనియె.

57

నాగకుమారులతోఁ గువలయాశ్వుఁడు నాగలోకమున కరుగుట

క.

మనుజేంద్రసుతున కుపకృతి, యొనరింపఁగవలయు నంటి రొనరించితిరే
చని నాకడ కేలా తో, డ్కొని రా కొకనాఁడు నట్టిగుణరత్ననిధిన్.

58


క.

అని ఫణిపతి పలికినఁ ద, త్తనయులు మఱి తద్దయును ముదంబు దనరఁగాఁ
జని యిష్టాలాపమ్ముల, యనంతరమ వేడ్కఁ గువలయాశ్వునితోడన్.

59


క.

శ్రీయుత నీవు ప్రియమున, న్మాయింటికి రాఁగ వలయు నావుడు మాయి
ల్మీయిల్లని వేఱడ మిటు, సేయుదురే యిది సఖత్వశీలము తెఱఁగే.

60


వ.

అనిన నురగకుమారు లి ట్లనిరి.

61


క.

వినుము ఋతధ్వజ! యించుక, యును సందేహంబు వల దహో! యిట్టిద మా
మనమును వేఱుగఁ దలఁపము, నిను మాజనకుండు గరము నెమ్మిం జూడన్.

62


చ.

మనమునఁ గౌతుకం బడర మానుగఁ దోడ్కొని తేర బంచిన
న్జనుత! యేము వచ్చితిమి నావుడు దిగ్గున లేచి రాజనం
దనుఁ డటు లైన నెంతయును ధన్యుఁడ నైతిఁ బొదండు లెండు మీ
రనుచుఁ గరంబు లెత్తి తనయౌదలఁ జేర్చుచు భక్తియుక్తుఁడై.

63


క.

మీతండ్రియ మాతండ్రి వి,నీతిని యట్ల నేను నెమ్మి నతనికి
న్బ్రీతి యొనరింపఁ దగుదును, వీతకళంకాత్ములార! వేయును నేలా?

64


తే.

తండ్రి పిలువఁబంచిన నేను దడయ వెఱతు, నమ్మహాత్మునియడుగులయాన యనుచు
నపుడ కదలి కాల్నడఁ గుతూహల మెలర్ప, నక్కుమారులుఁ దాను నృపాత్మజుండు.

65


తే.

పురము వెడలి గోమతీ యనుపుణ్యతటిని, నడుము కొని చని యారాజనందనుండు
దీనియావలి దెస నొకో ద్విజకుమార, వరులయూ రని యడుగంగ వారు నేరి.

66


క.

ఇరుగేలు పట్టి తదనం, తరమున వివరమున డిగి ఋతధ్వజుఁ గొనిపో
యిరి పాతాళమునకు న, చ్చెరువుగ నిజమూర్తు లెలమిఁ జేకొని యంతన్.

67


క.

ఫణముల మణిస్వస్తికల, క్షణరుచికాంగు లగువారిఁ గనుఁగొని ఫుల్లే
క్షణుఁడై యతఁ డాహా బ్రా, హ్మణులరె మీర లది లెస్స యని కడు నగుచున్.

68


క.

ప్రమదరసమగ్నుఁ డగున, క్కొమరునికిని నశ్వతరునికొడుకులు తమతం
డ్రి మహోరగేంద్రుఁ డనియును, నమరనికరమాన్యుఁ డనియు నతిగుణుఁ డనియున్.

69


వ.

చెప్పి తమవృత్తాంతం బంతయు నెఱింగించి తోడ్కొని చనిన నక్కుమారుండును
మణిమయాభరణకిరణస్ఫురితకుమారతరుణజఠరోరగసముదయసంకులంబును హార
కేయూరనూపురాదినానావిధభూషణభూషితావయవోపశోభితనాగనితంబినీని
కురుంబాలంకృతంబును నై తారకానికరాభిరామం బైనయంబరతలంబునుం
బోలె నభిరమ్యం బగుపాతాళభువనంబుఁ జూచుచుం బ్రతిగృహంబునఁ జైలంగు
వీణావేణుస్వనానుగతంబు లైనగీతంబులును మృదుమృదంగపణవాదివాద్యంబులు
నాకర్ణింపుచుం జని యయ్యురగేంద్రుమందిరంబుఁ బ్రవేశించి నిజప్రియవయ

స్యలు గానిపింప దివ్యమాల్యాంబరాభరణశోభితుండును వజ్రవైడూర్యఖచిత
కాంచనాసనాసీనుండును భుజంగమాంగనాకరకలితచారుచామీకరచామరవ్యజ
నవీజ్యమానుండును నై వెలుంగుచున్న పన్నగేశ్వరుం గని తచ్చరణంబులకుం
బ్రణామంబు నేసిన నతండు కువలయాశ్వుం గౌఁగిలించుకొని మూర్ధఘ్రాణంబు
చేసి దీవించి యుచితాసనంబున నునిచి యి ట్లనియె.

70

నాగేంద్రుఁడు కువలయాశ్వుని గౌరవించుట

తే.

నిరుపమానతేజుఁడ వైననీగుణముల, కెలమి నొందుచు నుండుదు నెపుడు నేను
సద్గుణునిజీవితము జనశ్లాఘనీయ, మనఘ! గుణవిహీనుండు సప్రాణశవము.

71


క.

తనయుండు తల్లిదండ్రుల, కనుపమసద్గుణసమృద్ధి నానందకరం
డును రిపులకు హృదయజ్వర, మును నై మను టొప్పు జన్మమునకు ఫలముగాన్.

72


క.

పరదూషణములు సేయక, దరిద్రు లగువారియందు దయ గలిగి విప
త్పరిపీడితులకు దిక్కై, పరగెడుపురుషుండు సుగుణబంధుగుఁ డెందున్.

73


చ.

అని ప్రియమారఁగాఁ బలికి యానృపసూతియుఁ దాను నాత్మనం
దనులును గూడి యొక్కట ముదంబున మజ్జనభోజనాదిని
త్యనియతకృత్యము ల్సలిపి యంత నభీష్టకథాప్రసంగతిన్
మన మలరంగఁ జేయుచుఁ గుమారునకు న్భుజగేంద్రుఁ డి ట్లనున్.

74

అశ్వతరకువలయాశ్వులసల్లాపము

తే.

భద్రమూర్తి మాయింటి కభ్యాగతుఁడవు, గానఁ బూజింపవలయు ని న్గారవమునఁ
గొడుకు తండ్రి నశంకత నడుగునట్టు, లడుగు నన్ను నీ కభిమత మైనధనము.

75


వ.

అనినం గువలయాశ్వుండు దేవా! మదీయసదనంబున సువర్ణాదిసమస్తవస్తువులు
సంపన్నంబులు సకలభూవల్లభుం డగుమాతండ్రి గలపదివేలేండ్లకు నా కేమిటం
గొఱంత లేదు పాతాళాధిపతి వైననీకారుణ్యంబునకు భాజనంబ నైతి నట్టినే
నింక నేమి యడుగువాఁడ నని వెండియు.

76


చ.

జనకభుజావనీజములచల్లనినీడ వసించి యుండునం
దనులు జగంబున న్సుఖులు తండ్రి మృతుం డయి చన్నఁ బిన్ననాఁ
డ నిజకుటుంబభారము గడంగి వహించుచుఁ తీవ్రదుఃఖవే
దనఁ బడువా రపుణ్యులు విధాతృనిచేఁత భుజంగమేశ్వరా!

77


వ.

కావున.

78


తే.

తండ్రికృపఁ దృణప్రాయము ల్ధనము లకట, గొఱఁత లే దర్థులకుఁ బెట్టఁ గుడువఁ గట్టఁ
బొలుచు యౌవనారోగ్యము ల్గలవు మున్న, యిట్టినాకు వేఁడంగ నిం కేమి వలయు.

79


క.

అనిన భుజంగమవిభుఁ డి, ట్లను మణికనకాదు లొల్ల వై తేని మనం
బున కొండెద్ది ప్రియము దా, నిన యడుగుము ప్రీతి నిత్తు నీకుఁ గుమారా.

80

చ.

అనుడు నతండు ని న్గని కృతార్థుఁడ నైతిఁ బవిత్ర మయ్యె
తనువునఁ బొంది నాయొడలు తావకపాదరజంబు మచ్ఛిరం
బునకు విభూషణం బగుటఁ బూర్ణము సర్వము నైన నిచ్చె దే
ని నహీకులేంద్ర! నా కొసఁగు నిర్మలధర్మమతిస్థిరత్వమున్.

81


చ.

అనుపమరత్నకాంచనగృహాసనవాహనవస్త్రమాల్యచం
దనరుచిరాన్నపానవనితాతనయాదిసమస్తసంపద
ల్దనరిన యట్టిధర్మము ఫలంబులు గావున నిన్ను వేఁడెద
న్ఘనతరధర్మతత్పరత నావుడు నయ్యురగేంద్రుఁ డిట్లనున్.

82


తే.

నీవు గోరినయట్టుల నీదుహృదయ, మధికధర్మాన్వితం బగు ననుదినంబు
నైన మేదినిఁ బడయంగ రానివస్తు, వనఘ! యొకటి నాచే నెట్లుఁ గొనఁగవలయు.

83


వ.

అని ప్రార్థించుటయుఁ గువలయాశ్వకుమారుఁ డురగకుమారులయాననం బాలో
కించిన నతనియభిప్రాయం బెఱింగి మయ్యిరువురు తండ్రిచరణంబులకుం బ్రణ
మిల్లి దేవా! నీ వితని కభిమతం బైనదానిం బ్రసాదించెద వేని నవధరింపుము.

84


మ.

అసురాపాదితమాయఁ జేసి తనకై ప్రాణచ్యుతిం బొంది చ
న్నసతిం దన్వి మదాలస న్దలఁచుచు న్సక్తాత్ముఁ డై యీనరేం
ద్రసుతుం డొండొకభార్య నొల్లక ఫణింద్రా! యున్నవాఁ డమ్మదా
లసఁ గారుణ్యము సేయు మీతనికి సుల్లాసంబు సంధిల్లఁగన్.

85


వ.

అనిన నశ్వతరుండు కువలయాశ్వు నాలోకించి.

86


క.

చచ్చినవారి మగుడఁ దే, వచ్చునె కలలోన నొండె వారి న్గాన
న్వచ్చునొకొ మాయ నొండెను, జెచ్చెరఁ జూప నగుఁ గాక చిత్రస్ఫూర్తిన్.

87


చ.

అనవుడు నక్కుమారుఁడు ప్రియాంగనఁ గన్గొనువేడ్క ద్రిప్పుగొ
ల్పిన ధృతిపొందు వాసి మదిఁ బేర్చినప్రేమము సిగ్గు నుత్తరిం
చిన వినయావనమ్రుఁ డయి చేతులు మోడ్చుచు మాయతన్వినై
నను దయఁ జూపవే భుజగనాయక! నాకు వెస న్మదాలసన్.

88


ఆ.

అనుడు మాయరూపు గనుఁగొనఁ బ్రియమేని, చూడు మనుచు దందశూకవిభుఁడు
తాను దాచి యున్నతరలాక్షి నమ్మదాలస నుదాత్తగుణవిలాసవతిని.

89

నాగేంద్రుఁడు కువలయాశ్వునకు మదాలస నొసంగుట

వ.

ఉరగాంగనలం బిలిచి యక్కుమారుముందఱికి మదాలస రప్పించి యురగేశ్వ
రుండు.

90


క.

మాయఁ బ్రకటించుచును వెడ, మాయపుమంత్రములు రిత్త మంత్రించుచు భూ
నాయకనందన గనుఁగొను, మాయామదిరాక్షి నీమదాలస యగునే.

91


వ.

అనిన నతండు.

92

సీ.

మెఱయు క్రొమ్మెఱుఁగులమించును మెలఁతగా మీనకేతనుఁడు నిర్మించినట్లు
చారుశృంగారరసముతేట నింతిగా నించువిల్తుండు చిత్రించినట్లు
నవకల్పలతికలనవకంబు నాతిగా శ్రీనందనుఁడు సంతరించినట్లు
నిండారుచందురునినుపారునునుఁగాంతిఁ జెలువగా మరుఁడు సృజించినట్లు


తే.

విస్మయం బైనలావణ్యవిలసనమునఁ, బొలుచు నమ్మదాలసఁ జూచి భూపసుతుఁడు
విగతలజ్జుఁ డై ననుఁ బాసి వెలఁది యెందుఁ, బోయి తనుచు నాదటఁ జేరఁబోవుటయును.

93


వ.

ఫణీశ్వరుఁ డతని వారింపుచు.

94


క.

మాయారూపము ముట్టిన, మాయం బగుఁ గాన నృపకుమారక! నీ వీ
మాయారూపము ముట్టకు, మీ యనవుడు మోహవశత నిల నతఁ డొఱగెన్.

95


క.

ధరణిజలానలమరుదం, బరచేష్టం దోఁచునీప్రపంచం బెల్ల
న్బరికింప మాయ యగుట, న్దరుణియు మాయ యని యశ్వతరుఁ డిటు సూపెన్.

96


వ.

అంత నతని మూర్ఛఁ దేర్చి యూఱడించి యురగేశ్వరుండు గంధర్వరాజనందనం
బడసినతెఱం గెల్ల నెఱింగించినం గువలయాశ్వుండు విస్మయహర్షమగ్నుం డగుచు
నభివందనం బాచరించి సముచితంబుగా వీడ్కొని తలంచినయంతన యరుగుదెంచిన
కువలయాశ్వంబు నక్కువలయగంధియుం దాను నెక్కి నిజపురంబున కరిగి తండ్రి
చరణంబులకుం బ్రణమిల్లి మదాలసాపునరుద్భవప్రకారం బేర్పడం జెప్పి జననీ
ప్రభృతిబంధుజనంబులకుం బరమానందం బొనరించె నాసుందరియును శ్వశురాది
గురుజనంబులకు మ్రొక్కి సంభాషణసంభావనాశ్లేషంబుల సుహృజ్జనులం బ్రమోద
భరితులం గావించి యెప్పటియట్ల వర్తించుచు.

97


క.

ప్రియము చెలంగ మదాలస, ప్రియకరణిన్ హర్మ్యవనగిరిస్థలములఁ ద
ద్దయుఁ గామభోగపుణ్య, క్షయ మెదఁ గోరుచు రమించె సద్భావమునన్.

98


వ.

అంత.

99


శా.

శత్రుక్షత్రలతాలవిత్రపటుదోశ్శౌర్యాధ్యుఁడై శత్రుజి
ద్ధాత్రీనాథుఁడు పెద్దకాల మిటు లీఛాత్రితలం బిద్ధచా
రిత్రం బొప్పఁగ నేలి నిర్జరపరశ్రీలోలతం జన్నఁ ద
త్పుత్త్రుం డుత్తముఁ డాఋతధ్వజుఁడు దాఁ బూనె న్ధరాభారమున్.

100

మదాలస పుత్రులఁ గనుట

క.

అంత మదాలస గాంచె ని, తాంతోజ్జ్వలతేజుఁ డైనతనయు నతనికి
న్సంతసమున జనకుఁడు వి, క్రాంతుం డనుపేరు పెట్టె గారవ మెసఁగన్.

101


వ.

దానికి భృత్యామాత్యజనంబులు సంతసిల్లిరి మదాలస నవ్వుచుం గనకపర్యంకతలం
బున నుత్తానశాయి యై యవిస్వరంబుగ నేడ్చుకొడుకును ముద్దాడునదియుఁ
బోలె ని ట్లనియె.

102

మదాలస తనపుత్త్రులకు తత్త్వోపదేశము చేయుట

సీ.

నీవు నిర్మలుఁడవు నీ కెక్కడిది పేరు భావింపు మది కల్పనావికార
మొడలు నీయదియు నీవొడలివాఁడవు గామి యెఱుఁగు మేడ్వకుము నీయేడ్పు టెలుఁగు
భూమ్యాదినివహంబుఁ బొంది విశ్వజ మైన శబ్దంబు గాని నీస్వనము గాదు
హానివృద్ధులఁ బొరయవు నీవు భోజ్యాన్నపానభోక్తవు గావు గానఁ గుఱ్ఱ


తే.

యితఁడు తండ్రి తల్లి యిది యేను దనయుండ, వీరు హితులు నాకు వీ రహితులు
నీధనంబు నాది యే నియ్య ననుపల్కు, లుడుగు మయ్య! భేద ముడిగి యుండు.

103


ఆ.

పుణ్యపాపకర్మపుంజనిబద్ధ మై, తొడిగినకుబుసంబువడువు దాల్చ
జీర్ణ మగుచునుండు చెనఁటి దేహంబున, యందు నీవు మమతఁ బొంద వలదు.

104


వ.

అని మఱియు మదాలస బహుప్రకారంబుల దేహజీవాత్మతత్త్వరూపంబు లాలాప
పథంబున నుపదేశింప ననుదినప్రవర్ధమానుం డగునబ్బాలుండు బలంబును బుద్ధియు
నానాఁటికిం బ్రవృద్ధిం బొందినట్లు తల్లి వచనంబులంజేసి విమలజ్ఞానం బంత కంతకు
నతిశయిల్లుచుండం బెరిఁగి పరమయోగియై గృహస్థత్వంబు విడిచి చనియెం దద
నంతరంబ యిరువురుకొడుకు లుదయించిన వారికిం గ్రమంబున నన్నరేంద్రుండు
సుబాహుండు శత్రుమర్దనుండు నని నామంబు లొనరించిన నగుచు నమ్మగువ
యయ్యిద్దఱునందనుల నెప్పటియట్ల యోగవిద్యావిదగ్ధులుగాఁ బ్రబోధించె నంత
నయ్యింతికి నాలవపుత్రుండు పుట్టుటయును.

105


క.

బాలునికిఁ బే రిడఁగ భూ, పాలుఁడు వచ్చిన నిజాస్యపద్మము వికచ
శ్రీలసితముగ మదాలస, యాలాపము నేయఁ జూచి యతఁ డిట్లనియెన్.

106


మ.

రమణీ పుత్తుల కర్థి నే నిడినవిక్రాంతాదినామంబు లె
ల్ల మది న్మెచ్చవు నీవు రాజతనయాలంకారము ల్గావొకో
విమతక్ష్మావరకోటిచిత్తముల కుద్వేగంబు గల్పింపవో
యమితైశ్వర్యము సేయవో నగఁ గతం బం దెద్ది యూహింపఁగన్.

107


ఉ.

నేరనివార మేము రమణీ! యిటు వెట్టితి మర్థిఁ బేళ్లు నీ
నేరిమి చూడ నీసుతుని నిర్మలినాహ్వయుఁ జేయుమా ప్రియం
బారఁగ నన్న నింతి! భవదాజ్ఞ నొనర్చెద నేను వీనికిం
బే రిల వీఁ డలర్కుఁ డనఁ బెంపు వహించు నరేంద్ర! నావుడున్.

108


క.

అద్ధరణీశుఁడు నవ్వుచు, బుద్ధివివేకములఁ గరము ప్రోడ విటు లసం
బద్ధ మలర్కుండనుపే, రిద్దచరిత! యెట్లు పెట్టి! తిది సార్థకమే?

109


తే.

అనిన నయ్యోగిమాత యిట్లనియె నధిపః, యవధరింపు మసద్వ్యవహారమునకు
నై యొనర్తురు గాక యాహ్వయము సార్థ, ముగ నొనర్పఁగ వచ్చునె పురుషునకును.

110


క.

నీపెట్టినపేళ్లును విను, నాపెట్టినపేరు వోలె నరవర! సర్వ
వ్యాపి యగుపురుషునికి న, ర్థోపేతత్త్వంబుఁ బొంద వూహింపంగన్.

111

వ.

అది యెట్లనిన.

112


సీ.

ఒకచోటినుండి వేఱొకచోటి కరుగుట క్రాంతి నాఁజను నిట్టిక్రాంతి లేక
సర్వగతుండును సర్వాత్ముఁడును సర్వభూతేశుఁడును నగుపురుషునకును
విక్రాంతుఁ డనుపేరు విపులార్థవంతమో వ్యర్థమో యిది నీవ యవధరింపు
నిరవయవుం డైన నిత్యునకు సుబాహు నామం బొనర్చిన నగవు గాదె


తే.

యెల్లజీవంబులందును నేకభావ, మై వెలుఁగునాత్మునకు నెవ్వఁ డహితుఁడు హితుఁ
డనఁగ నెవఁ? డెట్టు శత్రుమర్దనసమాఖ్య, కర్థగతి యించుఁ జెప్పుమా పార్థివేంద్ర!

113


క.

తనయోద్దేశంబున నీ, వొనరించినపేళు లర్థయుక్తములే ని
త్యనిరాలంబజ్యోతికి, సనాతనుం డైనయట్టిసర్వాత్మునకున్.

114


వ.

కావున.

115


క.

వ్యవహారార్థపునామము, లవనీశ! నిరర్థకంబు లవుటకు నొడఁబా
టవు నేని యలర్కాఖ్యయు, నవుఁ గైకొను మపురుషార్థ మనకుము దానిన్.

116


వ.

అని పరమార్థవాదిని యగుజీవితేశ్వరి చెప్పిన విని మహామతి యైనఋతధ్వజుండు
దానికి నొడంబడియె నంత నక్కాంతాతిలకంబు పూర్వనందనుల బోధించినట్టులఁ
బరమబ్రహ్మబోధకంబు లగువాక్యంబుల నయ్యలర్కు బోధింపం దొడంగినం గువల
యాశ్వుం డద్దేవి నాలోకించి.

117


ఉ.

ఎక్కడి బ్రహ్మబోధ? మిది యేటికి వీనికి? నెంత వెఱ్ఱివే
యక్కట! పుత్రరత్నముల నాఱడి బోద్ధలఁ జేసి పుచ్చి వే
చిక్కునఁ బెట్టి తింక నటు చేయకు మీసుతుబుద్ధి శ్రద్ధతో
నెక్కొనఁ ధర్మమార్గమున నిల్పుము దెల్పుము రాజధర్మముల్.

118


వ.

అని మఱియును.

119

మదాలస యలర్కు డనుపుత్త్రునకుఁ గర్మమార్గ ముపదేశించుట

క.

విను పుణ్యాపుణ్యంబుల, ననిమిషతిర్యక్త్వయుక్తు లగుపితరులకు
న్మనుజుఁడు దృషయును క్షుధయును, దనుకఁగ నీఁ డుదకపిండదానక్రియలన్.

120


ఆ.

అతిథిబంధుదేవపితృపిశాచప్రేత, యక్షమనుజభూతపక్షికీట
కముల కెల్ల విహితకర్మరతుం డైన,యతఁడు సూవె యాశ్రయంబు దరుణి!

121


క.

కావున మత్సుతుఁ దన్వీ!, కావింపుము రాజధర్మకర్మావితుఁగా
నావుడుఁ బతిబంపున న, ద్దేవి యలర్కునకుఁ గర్మదీక్ష యొనర్పన్.

122


వ.

తలచి యనుదినంబును నబ్బాలుని ముద్దాడుచు.

123


ఉ.

ధన్యుఁడ వైతి పుత్త్ర! వసుధాతల మెల్ల నకంటకంబుగా
నన్యనరేంద్రభీకరకరాసిసమంచితదోర్బలక్రియా
మాన్యత యొప్ప నేలి యసమానయశోవిభవంబు నొంది ప
ర్జన్యపురోపభోగబహుసౌఖ్యము లందఁగ నీవు గాంచుటన్.

124

శా.

క్షత్త్రాచారముఁ దప్పఁ ద్రొక్కకుము రాజ్యశ్రీ దలిర్ప న్సుహృ
న్మిత్రవాతముఁ బ్రోవు ముజ్జ్వలకృపాణీవిస్ఫురత్పాణివై
శత్రుశ్రేణి జయింపు క్షోణిసురరక్షాప్రౌఢి వాటింపు స
త్పాత్రత్యాగ మొనర్పు యజ్ఞములు పుత్త్రా! సేయు మత్యున్నతిన్.

125


తరువోజ.

అనురాగమున నోలలార్పు బాంధవుల, ననఘ! శైశవవిహారాలాపలీలఁ
బను లెల్లఁ జేయుచు భక్తి మీతండ్రిఁ, బరితుష్టుఁ గావింపు బాల్యంబుమీఁద
మనసిజసుఖకేళి మగువలఁ దేల్పు, మహనీయయౌవనమదవిభ్రమమున
వనమున మునివృత్తి వార్ధకమందు, వర్తింపు వనవాసివర్గంబు లలర.

126


వ.

అని జనని బోధింపుచుఁ బెనుపం బెరిఁగి కృతోపనయనుండును మహాప్రాజ్ఞుండును
నై యలర్కుం డయ్యంబచరణంబులకుం బ్రణమిల్లి తల్లీ! యైహీకాముష్మికసుఖార్థం
బెయ్యది కర్తవ్యంబు నా కెఱింగింపు మనిన నద్దేవి యి ట్లనియె.

127


సీ.

పట్టభద్రుండైన పార్థివేంద్రునకుఁ గర్తవ్యంబు మును ప్రజారంజనంబు
సప్తవ్యసనములఁ జనదు సక్తుండుగా నేమఱ వలదు దన్నెపుడు రిపుల
వలన మంత్రము వెలిఁ జిలుక నిచ్చుట చెట్ట తనవారు దానును దానఁ జెడుదు
రహితులు హితులును నగుట యెఱుంగఁగ వలయు మంత్రుల బుద్ధిబలము మెఱసి


ఆ.

చరులఁ బనిచి వైరిచరుల రోయించుట, నెమ్మనమున నెఱిఁగి నమ్మకునికి
కార్యయోగమునకుఁ గా శత్త్రు నైనను, నమ్మినట్ల యునికి నయవిధంబు.

128


స్రగ్విణి.

స్థానవృద్ధి యజ్ఞానసంపన్నుఁడు, న్దానషాడ్గుణ్యమంత్రప్రవీణుండు నై
మానవేంద్రుండు గామ్యవ్యపేతాత్మకుం, డైన నిర్జించు ఘోరాజి వీరారులన్.

129


క.

విను సక్తుం డగుకుత్సిత, జననాథునిఁ జెఱుచు కడిఁదిశత్త్రులు సుమ్మీ
జననుత! కామముఁ గ్రోధ, మును లోభము మదము మానమును హర్షంబున్.

130


వ.

కామంబునఁ బాండుండు, గ్రోధంబున ననుహ్రదాత్మజులు, లోభంబున నైలుండు,
మదంబున వేనుండు, మానంబున నహుషుండు, హర్షంబునఁ బురంజయుండును
హతులగుటయుఁ గామాదులచేత నిర్జితుండు గాక మరుత్తుండు లోకోత్తరుం
డగుటయు నెఱింగికొని ధైర్యధురంధరుం డైనధరణీశ్వరుండు కామాదిషడ్దో
షంబులఁ బరిహరింపవలయు.

131


క.

నరనాయకుండు మధుకర, పరభృతకలహంసబర్హిపన్నగబకసూ
కరచరణాయుధబాలుర, చరితమ్ములు గఱవవలయు జననుతచరితా.

132


తే.

ఉడుగ కెప్పుడు నొనరింపుచుండవలయు, నృపతి కీటకక్రియఁ బ్రతినృపతియందుఁ
దఱి యెఱింగి పిపీలికోత్కరముచేష్టఁ, జూపునది నీతికోవిదు ల్చోద్యపడఁగ.

133


క.

విను మవనీపాలనక, ర్మనియుక్తుం డైన రాజు మహిలో సంక్రం
దనభాస్కరయమచంద్రప, వనరూపము లైదు దాల్పవలయుం దఱితోన్.

134


ఆ.

మహితవర్షదానమహిమ నాలుగు నెల, లిలకుఁ దనుపొనర్చునింద్రుకరణి

క.

నెసఁగ నడుగు వారి కొసఁగి మన్ననఁ బ్రజ, ముదముఁ బొందఁ జేయునది విభుండు.

135


క.

ఎనిమిదినెలలును నల్లనఁ, దనకరముల భూరసంబు దఱుఁగం గొనుభా
నునిక్రియ సూక్ష్మోపాయం,బున నరిగొనవలయు నృపతి భూప్రజచేతన్.

136


క.

విమతులఁ బ్రియులం గాల, క్రమమునఁ దెగఁ జూచుయమునికరణిం దా దో
షము లరసి ప్రియాప్రియులను, సముఁడై దండింపవలయు జనపతి పుత్రా.

137


చ.

తమతమవర్ణధర్మములు దప్పి కుమార్గమున న్జరించుదు
ష్టమనుజవర్గముల దగినశాంతి యొనర్చుచు నైజధర్మమా
ర్గమునఁ జరింపఁజేయుమహికాంతుఁడు వారలపుణ్యసంపద
న్సమధికలీల నొంది దివి సౌఖ్యముఁ బొందఁగఁ గాంచుఁ బుత్రకా.

138


క.

వర్ణాశ్రమధర్మంబులు, పూర్ణము లై యుండు నేనృపునిరాష్ట్రమునన్
స్వర్ణదివిజసంగమసౌ, ఖ్యార్ణవమునఁ దేలఁ గాంచు నానృపుఁ డనఘా.

139


క.

నరుల నిజకర్మములఁ ద, త్పరులం గావించు ధరణిపాలుఁడు దా న
న్నరులసుకృతములలోన, న్బరువడిఁ గొనుచుండు షష్ఠభాగము పుత్రా.

140

వర్ణాశ్రమధర్మనిరూపణము

క.

అని చెప్పిన విని సుతుఁ డి, ట్లను వింటిని రాజనీతు లన్నియు జలజా
నన వర్ణాశ్రమధర్మము, లొనరఁగ నెఱిఁగింపు నాకు నుత్తమచరితా.

141


వ.

అని యడిగినం గొడుకునకుఁ దల్లి యిట్లను వినుము దానాధ్యయనయజ్ఞంబు
లను త్రివిధకర్మంబులు బ్రాహ్మణుక్షత్త్రియవైశ్యులు మువ్వురకు ధర్మంబులు శూద్రు
నకు దానద్విజాతిశుశ్రూషలు ధర్మంబులు మఱియు బ్రాహ్మణునకు యాజనాధ్యా
పనో త్తమప్రతిగ్రహంబులు క్షత్రియునకు ధాత్రీపాలనశస్త్రజీవిత్వంబులు వైశ్యు
నకుఁ గృషివాణిజ్యగోరక్షణంబులు శూద్రునకు సేవయు జీవిక లివి వర్ణధర్మంబు
లాశ్రమధర్మంబు లాకర్ణింపుము.

142


మ.

ఉపనీతుం డయి బ్రహ్మచారి వినయం బొప్ప న్గురుం జేరి భ
క్తిపరుం డై పను లెల్లఁ జేయుచు సకృద్భిక్షాశియు న్శాంతుఁడు
న్విపులప్రీతియుతుండు నై సతతము న్వేదత్రయాభ్యాసవా
క్యపటుత్వంబు భజించి సల్పఁ దగు నయ్యాద్యాశ్రమాచారమున్.

143


ఆ.

అనఘ బ్రహ్మచారి కవలియాశ్రమముల, కరుగుచోట వినుము వరుస వలన
దిష్ట మైనయట్టి దేయాశ్రమం బైనఁ, జేకొనంగఁ దగు విశిష్టచరిత!

144


శా.

దారస్వీకృతియు న్దయాభిరతియు న్ధర్మార్జితార్థక్రియా
స్ఫారత్వంబును దేవపిత్రతిథిపూజాస్థైర్యము న్దీనదా
సీరాజీసుతబాంధవాతురజన శ్రేణీసమృద్ధాన్నస
త్కారోదారతయు న్గణింప గృహికి న్ధర్మంబు లుద్యన్మతిన్.

145

మ.

వనితాపుత్రసుహృజ్జనావలులపై వైరాగ్య ముల్లంబున
న్దనరం గానకు నేఁగి వల్కలజటాధారుండు సద్బ్రహ్మచ
ర్యనిరూఢుండును గందమూలఫలశాకాహారసంతృప్తుఁడు
న్ఘనబోధామలినాత్మకుం డగుచు వానప్రస్థుఁ డుండు న్సుతా!

146


మ.

మతికాలుష్య మడంచి యింద్రియముల న్మర్దించి కామాదిశ
త్త్రుతతిం ద్రుంచి యసంగుఁడు న్సతతసంతుష్టుండు నారంభవ
ర్జితుఁడు న్నిర్మలుఁడు స్సమాధిపరుఁడు న్జిత్సంప్రబుద్ధుండు నై
యతి శోభిల్లు నిరంతరంబు విమలైకాంతప్రదేశస్థితిన్.

147


తే.

నాలుగాశ్రమములయందు నోలి నుండు, వారిధర్మంబు లెల్లను వరుస నీకు
నెఱుఁగఁ జెప్పితిఁ జెప్పెద నింక వినుము, సర్వవర్ణాశ్రమార్హలసద్గుణములు.

148


క.

క్షమయు నకార్పణ్యము శౌ, చము ననసూయయును నానృశంస్యము సంతో
షమును నహింసయు విను స, త్యము నెనిమిది వలయు గుణము లఖిలజనులకున్.

149


సీ.

సంక్షేపమున నిట్లు సర్వవర్ణాశ్రమధర్మము ల్సెప్పితి తనయ! వినుము
తమతమధర్మము ల్దప్పి దుర్మార్గులై దురితంబు లొనరించునరుల ధారి
ణీశుండు దండింప కెడ నుపేక్షించినఁ బొలియు నిష్టాపూర్తపుణ్యఫలము
లతనికిఁ గావున నతులప్రయత్నపరుం డయి సర్వవర్ణులను రాజు


తే.

విహితదండం బొనర్చుచు విమలధర్మ్య, కర్మపరులుగ సతతంబు గావవలయు
ననిన విని తల్లి కతివినయమున మ్రొక్కి, యయ్యలర్కుండు మఱియు ని ట్లనియెఁ దండ్రి!

150

గృహస్థధర్మనిరూపణము

తే.

జనుల కుపకారముగ గృహస్థునికిఁ జేయఁదగిన దెయ్యది విడువంగఁ దగిన దెద్ది?
తనకు సతతంబు నొనరింపఁ దగినయట్టి, దేది? యనుడు మదాలస యిట్టు లనియె.

151


చ.

అనఘ! గృహస్థధర్మపరుఁ డైననరుండు ద్రిలోకపోషకుం
డనుపమపుణ్యమూర్తి యతఁ డాతనిసంతతధర్మసంపద
న్మునిపితృదేవభూతగణముం గ్రిమికీటకపక్షిసంఘము
న్మనుఁ గనుఁగొంచు నుండుదురు మానక యర్థులు వానివక్త్రమున్.

152

త్రయీధేనువర్ణనము ఆయాదేవతలకు బలిహరణవిధియు

వ.

ఇట్టిగృహస్థునకుం జేయదగినధర్మంబు వినుము సకలలోకాధారభూతయు ఋగ్వే
దాపరభాగయు యజుర్మధ్యయు సామవక్త్రయు నిష్టాపూర్తవిషాణయు సాధు
సూక్తరోమయు శాంతిపుష్టిశకృన్మూత్రయు నైనత్రయీకామధేనువునకుం జతుస్తనం
బులు స్వాహా కారస్వధాకారవషట్కారహంతకారంబు లన బరగు వానిచే దేవ
పితృమునిమనుజవర్గంబులకు నాప్యాయనం బనుదినంబును నాచరింపవలయు నట్లు
సేయనిపురుషుండు దామిస్రనరకంబునం బడు మఱియు గృహస్థుండు నిత్యంబును
శుచిస్నాతుం డై దేవర్షిపితృతర్పణంబు లొనరించి సుమనోగంధధూపదీపంబుల

దేవతలం బూజించి గృహమధ్యంబున బ్రహ్మ కీశానదిశయందు విశ్వేదేవతలకు ధన్వం
తరికిఁ బూర్వదక్షిణపశ్చిమోత్తరంబులు నింద్రయమవరుణసోములకు గృహద్వార
దేశంబున ధాతకు విధాతకు గృహాంగణంబున నాదిత్యునకు నాకాశంబున దైత్య
ప్రేతభూతంబులకు యామ్యాభిముఖుం డై పితరులకును బలు లొసంగి నామ
పూర్వకంబుగాఁ దదాచమనార్థంబు జలంబు లిచ్చి వీడు కొలిపి యిట్లు గృహవిధా
నంబున నఖిలభూతతృప్తి గావించి వైశ్యదేవంబు చేసి.

153

అతిథిపూజావిధానము

క.

విను దివసాష్టమభాగం, బున సదనద్వారమునకుఁ బోయి కడుఁ బ్రియం
బున నతిథి నరయవలయుం, దనయ తదర్చనకు నెనయె ధర్మువు లెందున్.

154


వ.

అ ట్లరసి మిత్రుండు నేకగ్రామవాసియుం గానివాని.

155


మ.

అతిథిం గాలసమాగతు న్ఘనబుభుక్షార్తుం బథిశ్రాంతు
తతమార్గోత్థితధూళిధూసరితగాత్రస్వేదబిందూత్కరా
న్వితు నజ్ఞాతకులాభిధానుఁ గని యవ్విప్రు న్మహాత్ముం బ్రజా
పతిగా నాత్మఁ దలంచుచు న్సుముఖుఁడై భక్తి న్బ్రయత్నంబునన్.

156


క.

అతనికులశీలవిద్యా, స్థితు లడుగక యెంతవికృతదేహుం డైన
న్మతి విష్ణునిఁ గాఁ దలఁచుచు, నతిముదమునఁ బూజ సేయునది నిజశక్తిన్.

157


క.

అతిథికిఁ బెట్టక కుడిచిన, యతికష్టుఁడు దురితభోక్త యండ్రు మునీంద్రు
ల్సతతపురీషాశనుఁ డై, యతఁ డుండును మీఁదిభవమునందుఁ గుమారా!

158


తే.

ఎలమి నెవ్వనిగృహమున కేఁగుదెంచి, యఫలితాశుఁ డై క్రమమ్ఱు నట్టియతిథి
తనదుదుష్కృత మాగృహస్థునకు నిచ్చి, యతనిసుకృతమంతయుఁ గొని యరుగుఁ బుత్ర!

159


ఆ.

కాన నతిథిఁ గడవఁ గా దంబుశాకదా, నమున నైన నతనిఁ బ్రముదితాత్ముఁ
గా నొనర్ప వలయుఁ గడుకొని నిజశక్తి, తోడ వినుము ధర్మధుర్యహృదయ.

160


వ.

అని చెప్పిన.

161


క.

ఒనరింపవలయు శ్రాద్ధం, బనువాసరమును దగంగ నన్నంబున నై
నను నుదంబున నైనను, దనయ పితృప్రియము గాఁగఁ దద్దయు భక్తిన్.

162


తే.

భిక్ష యొకకడియంత యాభిక్ష లనఘ, నాలు గగ్ర మయ్యగ్రము న్నాల్గు హంత
కార మిం దెది యైనను గలిమితోడ, నడరి విప్రున కిడకము న్గుడువ రాదు.

163


చ.

నిజవిభవానురూపముగ నెమ్మి యెలర్ప గృహస్థుఁ డిమ్మెయిన్
ద్విజవికలాంగబాలగురువృద్ధసుహృజ్జనకోటి కన్న దా
నజనితతృప్తి పొందఁగ ననారతము న్దగ నాచరించుచు
న్ద్రిజగదభీష్టదస్థితిఁ బ్రదీప్తుఁడు గావలయు న్గుణోజ్జ్వలా!

164


తే.

జ్ఞాతి శ్రీమంతుఁ డగునిజజ్ఞాతిఁ జేరి, యును గరంబు దరిద్రుఁ డై యుండె నేని
నతఁడు చేసినదురితంబు లనుభవించు, ననఘ శ్రీమంతుఁ డతనిఁ దా నరయ కునికి.

165

క.

విను పగటియటుల సుత మా, పును గృహి విధ్యుక్తకర్మములు సలుపుచు నా
సనశయనభోజనాదుల, ననఘా పూజింపవలయు నతిథిఁ బ్రియమునన్.

166


చ.

తనర గృహస్థతాభరముఁ దాల్చి చరించుచునుండు నమ్మహా
త్మునికి ననేకభూరిశుభము ల్దగ నెప్పుడు నిచ్చు దేవతా
మునిపితృబాంధవాతిధిసమూహములు న్బశుపక్షికీటకా
దినిఖిలభూతకోటియును దృప్తి యతం డొనరించుట న్సుతా!

167


వ.

ఈయర్థంబునఁ నత్రి చెప్పిన వాక్యంబు లాకర్ణింపుము.

168


క.

తనసదనంబునఁ గల ధన,మున ఫలమూలాన్నశాకముల నెయ్యది యై
నను మును విధివంతముగా, నొనరింపక చనదు గృహికి నుపయోగింపన్.

169

నిత్యనైమిత్తికాదికశ్రాద్ధనిరూపణము

సీ.

అని వెండియును నమ్మదాలస యనుఁ ద్రివిధంబు లై యుండు శ్రాద్ధక్రమములు
నరవర నిత్యంబు నైమిత్తికము నిత్యనైమిత్తికంబు ననంగ నోలి
నందు నిత్యము పంచయజ్ఞాశ్రితం బైన యది సుతోదయవివాహాదిభద్ర
వేళలయందుఁ గావింపఁగాఁ బడునది వినుము నైమిత్తిక మనఁగఁ బరగు


తే.

నరయఁ బర్వప్రభృతితిథులందుఁ జేయు, నదియ సూ నిత్యనైమిత్తికాఖ్య మండ్రు
విస్తరింతు నైమిత్తికవిధులు మఱియు, నాదువాక్యము లెల్ల మనస్కరింపు.

170


క.

తనయోదయాదివేళలఁ, దనరంగాఁ జేయునాభ్యుదయికశ్రాద్ధం
బునఁ బితరులు నాందీముఖు, లనునభిధానమునఁ బూజ్యు లగుదురు పుత్రా.

171


క.

ధరణీసురయుగ్మములను, వరియించి ప్రదక్షిణముగ వారిని భక్తి
స్థిరుఁ డై యజమానుఁడు తత్పరత న్శుభవృద్ధిపూజ దగు నొనరింపన్.

172


క.

విను దధియవమిళితాన్నం, బునఁ బిండము లిడఁగవలయుఁ బూర్వముఖుం డొం
డె నుదఙ్ముఖుఁ డొండెను నై, చనును సదగ్నికరణవిధి సంపాదింపన్.

173

ఏకోద్దిష్టశ్రాద్ధనిరూపణము

వ.

ఇది యాభ్యుదయికప్రకారం బింక నౌర్ధ్యదైహికం బైన యేకోద్దిష్టశ్రాద్ధంబువిధం
బాకర్ణింపుము.

174


సీ.

మృతుఁ డైనయతనికి సుతుఁ డతిభక్తితోఁ బ్రతిమాసమును విధియుతము గాఁగఁ
దద్దివసమున శ్రాద్ధం బొనరించుచు నబ్దంబు పరిపూర్ణ మైనఁ జేయు
నది సపిండీకరణాహ్వయశ్రాద్ధంబు ప్రేతత్వమును బాసి పితృత నొందు
నతఁ డంత నేఁ టేఁట మృతిదినంబున శ్రాద్ధ మొనరింపవలయు శాస్త్రోక్తభంగి


తే.

ననఘ యట్ల యేకోద్దిష్ట మంగనలకు, విను సపిండీకరణము నందనులు లేని
యతివలకుఁ గాదు కార్యము మృతిదినంబు, నందు వారి కేకోద్దిష్ట మర్హ మండ్రు.

175

సప్తపురుషలేపభాగాదినిర్ణయము

క.

అనఘ సపిండీకరణం, బొనరించుడుఁ బిండలుప్తి నొందుచు యజమా

నునిమూఁడవతాత రయం, బునఁ గలయుం జూవె లేపభుక్పితృగుణమున్.

176


వ.

పితయుఁ బితామహుండును బ్రపితామహుండు ననుమువ్వురు పిండసంబంధులు
ప్రపితామహునితండ్రినుండి యటమువ్వురు లేపసంబంధులు శ్రాద్ధకర్త యైనయజ
మానుం డేడవువాఁ డిట్లు సంబంధంబు సాప్తపౌరుష మని మునులు సెప్పుదురు
మఱియు వినుము యజమానుని యన్వయంబునం దావిర్భవించి యనేకగతులం
బొంది యున్నపూర్వులు నజాతదంతు లగుబాలురు నసంస్కృతు లయోగ్యులు
నాదిగాఁ గలవారెల్లను నతం డొనరించు శ్రాద్ధంబులయందు జలాన్నవికరణంబులఁ
జేసి యాప్యాయితులగుదురు సమ్యక్ఛ్రాద్ధపరుం డైననరునికులంబునం బ్రభవించిన
వాని కొక్కరునికిం జెట్ట లేదు కావున శాకోదకంబుల నైన నిత్యనైమిత్తికశ్రాద్ధంబు
లవశ్యంబు నాచరింపవలయుఁ దదీయకాలంబు లాకర్ణింపుము.

177

శ్రాద్ధకాలము

క.

విమలశ్రద్ధాన్వితుఁడై, యమవసలం దెల్ల నట్ల యష్టకలందుం
గ్రమమునఁ బితృవరుల కవ, శ్యముఁ జేయఁగ వలయు సుతుఁడు శ్రాద్ధము పుత్త్రా!

178


వ.

ఇష్టశ్రాద్ధకాలంబు వినుము.

179


మ.

రవిచంద్రగ్రహణాయనంబులను సంక్రాంతి న్వ్యతీపాత న
ర్ఘ విశిష్టావని దేవతానివహసంప్రాప్తి న్లసద్ద్రవ్యవై
భవవేళం దనజన్మతారగ్రహదౌర్బల్యంబు వాటింప నం
దు విధిప్రోక్తము శ్రాద్ధకర్మ మనఘా! దుస్స్వప్నముం గాంచినన్.

180

శ్రాద్ధమున నిమంత్రణీయులు

సీ.

యోగీశ్వరుండు నత్యుత్తమశ్రోత్రియుండును జ్యేష్ఠసామగుండును సమస్త
వేదవేదాంగకవిదుఁడు దౌహిత్రుండు నల్లుండు ననఘపంచాగ్నికర్మ
నిష్ఠపరుఁడు తపోనిరతుండు పితృభక్తిపరుఁడు సంబంధియు బాంధవుండు
మామయుఁ దన మేనమామయుఁ భాగినేయుండు ఋత్విజుఁడు శిష్యుండు మఱియు


ఆ.

నధికమంత్రజపపరాయణులును సదా, చారపరులు వినుము శ్రాద్ధమునకు
నర్హు లైనయట్టియవనీసురోత్తము, లండ్రు బుధులు గుణగణాభిరామ!

181

శ్రాద్ధమున ననిమంత్రణీయులు

క.

అవకీర్ణి రోగిఁ బౌన,ర్భవు భృతకాధ్యాపకుని నిరాకృతి వేదా
గ్నివిహీను వైద్యు గురుపితృ, వివర్జకుని ముచ్చు సోమవిక్రయిఁ బిశునున్.

182


తే.

శ్యావదంతు హీనాతిరిక్తాంగు నంధుఁ, గుండు గోళకు వృషలీపుఁ గునఖిఁ గుష్ఠిఁ
గన్యకావిక్రయి వికర్ము నన్యు శ్రాద్ధ, ములను వర్జింతు రార్యులు పుత్ర! వినుము.

183


తే.

దైవకార్యంబునందుఁ బిత్ర్యంబునందు, సద్ద్విజనులఁ బూర్వవాసరమునందు
నధికనియతి నియంత్రించునది కుమార! వారు నియమస్థులై యుండవలయుఁ గాన.

184

శ్రాద్ధాచరణవిధానము

ఉ.

శ్రాద్ధమున న్భుజించినధరాసురముఖ్యుఁడు భక్తియుక్తుఁడై
శ్రాద్ధము పెట్టినాతఁడును రాత్రి భుజింపఁగరాదు గామసం
బద్ధమనస్కుఁ డై తిరిగి భామలఁ గూడినఁ దత్పితృవ్రజం
బిద్ధగుణాఢ్య! యుండు నెలయెల్లను రేతమున న్మునుగుచున్.

185


మానిని.

కావున విప్రుని మున్ను నియంత్రణగౌరవయుక్తునిఁ జేయుట మే
ల్భావజుచేఁ బడి భామను గూడినబ్రాహ్మణు మాని గృహస్థుఁడు భూ
దేవుని కాదట భిక్షుకుఁ డై చనుదెంచినవానికి నైనను సం
భావన భోజన మారఁగ బెట్టిన భద్రగుణా! పితృతృప్తి యగున్.

186


వ.

పితృదేవతలకు శుక్లపక్షముకంటెఁ గృష్ణపక్షంబు ప్రియం బైనయట్లు పూర్వా
హ్ణంబుకంటె నపరాహ్ణం బభిమతం బగుటం జేసి.

187


క.

కుతపసమాగతసద్ద్విజ, తతియం దొగి విశ్వదేవతల కిరువురనుం
బితృదేవతలకు మువ్వుర, నతిభక్తి నొనర్పవలయు నధికశ్రద్ధన్.

188


సీ.

అటుగాక దైవపిత్ర్యములకు నొకఁ డొకఁ డైనను నగు శక్తి కనుగుణముగఁ
దద్విధంబునను మాతామహాదులకును విశ్వదేవతలకు విప్రచయము
నొనరించునది వేఱ యని చెప్పుదురు గొంద ఱి ట్లిరుదెఱఁగుల నేర్పఱించి
ప్రాగుదఙ్ముఖులుగాఁ గ్రమమున విశ్వదేవతలను నొగిఁ బితృవరుల నునిచి


ఆ.

సప్రదక్షిణంబు నప్రదక్షిణముగ, మంత్రయుతసమస్తతంత్రములను
నధికభక్తితోడ నారెండుదెఱఁగుల, వారలకును జలిపి గారవమున.

189


ఆ.

ఇష్టభోజనంబు లిడి కర్త సిద్ధార్థ, ములును దిలలు నచటఁ గలయఁ జల్లి
దైత్యహారిమంత్రతత్పరుఁ డై తత్త, దుచితవిధుల నెల్ల నొనర సలిపి.

190


వ.

వారలు భుజించినయనంతరంబ తదుచ్ఛిష్టసన్నిధిం గుశాస్తరణంబులందు.

191


ఆ.

ఎలమి నుభయపక్షములవారలకు భక్తి, వేఱువేఱ పిండవిధి యొనర్చి
వారితిలలతోడ వారికి వారికి, వలయుఁ బిత్ర్యతీర్థకలన మనఘ!

192


క.

తదుచితకృత్యము లన్నియు, విదితములుగఁ జేసి కర్త విప్రుల కెల్ల
న్ముదమున దక్షిణ యిడి తా, సదనద్వారంబుదాఁకఁ జని వారి నొగిన్.

193


ఆ.

వీడుకొలిపి వచ్చి విహితనిత్యక్రియా, జాత మెల్లఁ జలిపి సకలమిత్ర
బంధుజనులుఁ దానుఁ బఙ్క్తిఁ బ్రియంబునఁ, గుడుచునది విశిష్టగుణవరేణ్య.

194


వ.

ఇట్లు గృహస్థుండు సమాహితుం డై మహీసురులకుం బరితోషంబుగా శ్రాద్ధంబుఁ
జేయునది యని చెప్పి మఱియును.

195


తే.

శ్రాద్ధములయందు విను పవిత్రములు మూఁడు, కుతపకాలంబు తిలలును గూఁతుకొడుకు

ననఘ! దాతృభోక్తలకు వర్జ్యములు మూఁడు, తెరువు నడుచుట కినుక వేగిరమనంగ.

196


ఆ.

రజతపాత్రచయము రజతకీర్తనమును, రజతదర్శనంబు రజతకథయు
ననఘ! రజతదానమును బితృకోటికి, శ్రాద్ధవేళఁ గడుబ్రశస్త మండ్రు.

197

శ్రాద్ధమునందు వర్జ్యావర్జ్యద్రవ్యములు

వ.

అని చెప్పిన మదాలస మఱియు నలర్కున కి ట్లనుఁ బితృదేవతలకుం బ్రీతి గా నిడ
వలయునవియు నుడుగవలయు నవియు నెఱింగించెద నాకర్ణింపుము.

198


క.

వినుతగుణ! హవిష్యాన్నం, బున నొకనెల మత్స్యమాంసమున రెండునెలల్
విను లేడిమాంసమునఁ బిత, లొనరఁగ మూన్నెలలు దృప్తి నొందుదురు గడున్.

199


తే.

శశముపిశితంబుబు పక్షిమాంసంబు పంది, యామిషము వేఁటపలలంబు నధిక మైన
తృప్తి యొనరించు నొగిఁ పితృదేవతలకు, నెలమి నాలుగు నేను నా ఱేడునెలలు.

200


వ.

ఇఱ్ఱిమాంసం బష్టమాసంబులు దుప్పిమాంసంబు నవమాసంబులు గురుపోతు
మాంసంబు దశమాసంబులు తగరుమాంసం బేకాదశమాసంబులు గోవుపాలును
బాయసంబును బండ్రెండుమాసంబులు పితృదేవతలకుఁ దృప్తి యొనరించు
మఱియుం గాలశాకంబును దేనియయుఁ గయాశ్రాద్ధంబును వారికి ననంతకాల
తృప్తి వహించు.

201


క.

తిలలు యవలు గోధూమం, బులు గొఱ్ఱలు కోవిదారములు ముద్గము లా
వలు కందులు మినుములు గడుఁ, బొలుపగు నివి కరము యోగ్యములు పితృతతికిన్.

202


తే.

శ్రాద్ధకర్మంబునందు వర్జ్యములు వినుము, పెండలంబును దోస పలాండు వుల్లి
యానుగ మ్మింగు వలసందియలు విచార, సారప్రత్యక్షలవణమసూరములును.

203


క.

కన్నియ కుంకువకును జే, కొన్నధనము పతితువలనఁ గొన్నధనము ద
ర్పోన్నతి వాదజయమునం, గొన్నధనము శ్రాద్ధమునకుఁ గుత్సితము లిలన్.

204


తే.

రాత్రిఁ దెచ్చిననీరు దుర్గంధఫేన, పూరితం బగునీరును బొక్కనీరు
సూర్యుఁ డంటనికూపంబునీరు ననసు, గోవు తృప్తిఁ బొందనినీరు కుత్సితములు.

205


వ.

అజావిమృగీమహిష్ట్రులదుగ్ధంబులును నీనినపదిదినంబులోనియావుపాలును
వర్జించునది.

206


ఆ.

కోడి యూరఁబంది కుక్క నపుంసకుఁ, డసురగణము శ్రాద్ధహాని నేయుఁ
గాన మఱువునందుఁ గావించునది రక్ష, గాఁగ దిలలు ధరణిఁ గలయఁ జల్లి.

207


క.

పతితులు సూతకులు రుజా, న్వితులు మలిను లంటిరేని విను ద్రవ్యము వ
ర్జ్యత నొందు రజస్వలచూ, పతినింద్యము శ్రాద్ధవేళయందుఁ గుమారా.

208


సీ.

విను కేశకీటకాన్వితము వస్త్రానిలాహతము దుర్గంధసంయుతమును శున
కాదినిరీక్షితం బైనది పర్యుషితము నివి యెల్ల వర్జ్యములు సుమ్ము

పాటించి భక్తితోఁ బాత్రములందు యోగ్యములును జవులును నైనయట్టి
యాహారములు వెట్టునది పితృకోటికి నవి వారి కర్హంబు లై ఫలించు


ఆ.

నతులయోగధరులు పితృవరు ల్గానఁ ద, దర్థముగ మహాత్ము లైన యోగి
జనులఁ బ్రీతితోడ శ్రాద్ధకర్మమునందుఁ, బూజసేయవలయుఁ బుత్త్ర! వినుము.

209


తే.

భవ్యవిప్రసహస్రంబు పఙ్క్తి నొక్క, యోగి యగ్రాసనస్థుఁ డై యుండెనేని
యతఁడు దాతనుభోక్తల నంబుపూర, గతులఁ బోతంబువిధమునఁ గడవఁ బెట్టు.

210

పితృగీతలు

వ.

ఈయర్థంబునం దొల్లి యైలుం డనుమహీపతికిం బితృదేవతలు చెప్పినగీతలు బ్రహ్మ
వాదులచేత వినంబడు వాని వినుము.

211


ఉ.

ఎన్నఁడు పుట్టు నొక్కొ సుతుఁ డెవ్వని కైనను మత్కులంబునం
జెన్నుగఁ బిండసంస్కృతి విశిష్టతరం బగుయోగిభుక్తశి
ష్టాన్నమునం బొనర్చుసుగుణాన్వితుఁ డంచును గౌతుకంబున
న్సన్నుతకీర్తిధుర్య! పితృసంఘము గోరుచునుండు నెప్పుడున్.

212


సీ.

గయఁ బిండ మొండెను ఖడ్గమాంసం బొండెఁ గాలశాకం బొండె గవ్య మొండెఁ
దగఁ దిలాఢ్యం బగుద్రవ్యచయం బొండె భాద్రపదాపరపక్షమునఁ ద్ర
యోదశీ మఘమధుయుతము పాయస మొండె మద్వంశజుఁ డొకండు మాకు నిడఁడె
కొని చనఁ గాంచెద మినలోకమున కేము నని కోరుఁ బితృకోటి యట్లు గాన


తే.

నర్థిఁ దృప్తులఁ గావించునది సమగ్ర, పూజనంబులఁ బితరులఁ బుత్త్ర! వారు
తృప్తి వసురుద్రులకును నాదిత్యులకును, జేయుదురు తారకాగ్రహశ్రేణులకును.

213


క.

పితృగణము శ్రాద్ధసంత, ర్పిత మై మనుజులకు నిచ్చు శ్రీవిద్యాయు
స్సుతబహుధనసామ్రాజ్య, స్థితులును స్వర్గాపవర్గదివ్యసుఖములున్.

214


వ.

అని చెప్పి యయ్యోగిమాత తిథినక్షత్రంబులయం దొనర్చు కామ్యశ్రాద్ధఫలంబులు
సెప్పం దలంచి యి ట్లనియె.

215

కామ్యశ్రాద్ధములు

సీ.

విను మాదిదినమున విత్తంబు విదియను ద్విపదచయంబు తృతీయ నిష్ట
వరము చతుర్థియం దరివినాశనము పంచమి లక్ష్మి షష్ఠిఁ బూజ్యత్వమహిమ
సప్తమి నొగి సర్వసైన్యాధిపత్య మష్టమి నభివృద్ధి నవమి వధూస
మాగతి దశమిఁ గామ్యార్ధసంపత్తి యేకాదశి నగణితవేదసిద్ధి


తే.

జయము ద్వాదశి నాయురైశ్వర్యపుష్టి, కీర్తి మేధాప్రజాస్ఫూర్తి కెరలుఁ గామ్య
దేవదినమునఁ బితృదేవతావళులకు, శ్రాద్ధములు భక్తి నొనరించుజనుల కెపుడు.

216


క.

తరుణవయస్కతఁ జచ్చిన, నరులకు శస్త్రమృతు లైననరులకుఁ దనయుల్
నరవర! శ్రాద్ధము భక్తి, స్ఫురణమతిం జేయవలయు భూతదినమునన్.

217


క.

పితృవరుల కమావాస్య నియతమానసుఁ డై యతిప్రయత్నముతో నం

చిత శ్రాద్ధం బొనరించిన, యతఁ డభిమతసిద్ధిఁ బొందు నమరతఁ బడయున్.

218


సీ.

స్వర్గసౌఖ్యము పుత్త్రసంపద తేజంబు శౌర్యంబు సుక్షేత్రచయము పుష్టి
సుతలబ్ధి వంశముఖ్యత సుభగత్వంబు ప్రకటవిశ్రాణనాపత్యమహిమ
శ్రేష్ఠత సంతానసిద్ధి వాణిజ్యలాభము విశిష్టత సార్వభౌమపదవి
యాధిపత్య మనామయమ్ము యళ మ్మశో, కత పుణ్యలోకంబు కనక మాగ


తే.

మాప్తి వైద్యప్రసిద్ధి యజావివృద్ధి, వనిత రజత మశ్వము లాయు వనఘ కలుగుఁ
గృత్తికాద్యష్టవింశతికీర్త్యతార, లందు శ్రాద్ధంబు నొగిఁ జేయునార్యతతికి.

219


వ.

కావునఁ గామ్యశ్రాద్ధంబు లీనక్షత్రంబులం జేయునది యిట్లు గృహస్థుండు హవ్య
కవ్యంబుల దేవపితృగణంబుల రుచిరాన్నపానంబుల నతిథిబాంధవభృత్యభిక్షు
భూతపశుపిపీలికాదులనుం బరితుష్టి నొందించుచు సదాచారపరుండు గావలయు
ననిన నలర్కుం డాచారప్రకారం బెట్టి దెఱింగింపు మనవుడు మదాలస యి
ట్లనియె.

220

సదాచారప్రకారము

క.

ఆచారము వలయు గృహి క, నాచారుఁ డిందుఁ బరమునందును రెంట
న్నీచత్వంబున నొందు స, దాచారపరుండు పూజ్యుఁ డగు విమలమతీ!

221


క.

దానము దపమును యజ్ఞము, మానుగ సఫలత్వ మొందు మహితాచారా
నూనునకు సదాచారవి, హీనునకు విఫలత నొందు నిద్ధవిచారా!

222


క.

కావున నాచారంబు శు, భావహ మట్లగుట నీవు నవహితమతివై
కావింపు దత్స్వరూపము, శ్రీవిలసితమూర్తి! నీకుఁ జెప్పెద వినుమా.

223


క.

అనుపమవర్గత్రయసా, ధన మహితోద్యోగపరతఁ దనరుగృహస్థుం
డనఘ! యిహాముత్ర లయం, దనవరతాభీష్టసిద్ధి నభిరమ్యుఁ డగున్.

224


సీ.

ఒనరంగ బ్రాహ్మముహూర్తంబునందు మేల్కనుట ధర్మార్థచింతనము సేఁత
సంకల్పితస్నానసంధ్యాజపాగ్నిహోత్రాదినిత్యక్రియ లాచరించు
టాదిత్యు నుదయాస్తమయములఁ జూడమి యనృతంబు వల్కమి యలుక లేమి
యపవాదపురుషవాక్యప్రలాపంబుల నుడుగుట నగ్న యై యున్న యన్య


ఆ.

వనిత నైన నాత్మవనిత నైనను గనుఁ, గొనమి యంటరానివనితదర్శ
నంబు తదభిభాషణంబు మానుట సదా, చార మండ్రు బుధులు జనవరేణ్య!

225


ఆ.

విష్ఠ యుముక పెంకు వెలిమిడి మూత్రంబు, బొగ్గు కేశచయము భూమిసురుల
చేను ప్రాఁత యైనచీర త్రాడూషర,స్థలము గాలఁ ద్రొక్కఁ దగదు పుత్ర!

226


తే.

దర్పణాలోకనము దంతధావనంబు, వెండ్రుకలను గైసేయుట వినుము దేవ
తార్చనము లివి గృహికిఁ బూర్వాహ్ణముననె, యాచరింపంగవలయు గుణాభిరామ!

227


తే.

వార్చి వాఙ్మనోనియతితో వలను గలిగి, యుత్తరంబొండెఁ దూర్పుదిక్కొండె జూచి
జానుమధ్యంబునందు హస్తంబు లుండఁ, గుడుచునది పవిత్రాన్నంబు గుణవరేణ్య.

228

ఆ.

పసులమందలోన భవనతీర్థాశ్రమ, వర్త్మములను జేయవలదు మూత్ర
మధికదోష మందు రనఘ! విణ్మూత్రవిసర్జనంబు పవనజలములందు.

229


సీ.

ఒడలికి నుపఘాత మొదవినప్పుడు దక్క దోషంబు సు మ్మన్న దోషగణన
మెంగిలితోఁ బల్క నేమియుఁ జదువ గో ధరణీసురాగ్నులఁ దనశిరంబు
నంట రవీందుతారావళిఁ గనుఁగొనఁ దగదు వర్జ్యములు ప్రత్యక్షలవణ
మును భిన్నభాజనంబును విశీర్ణాసనశయ్యలు తినుచుండి చనదు వార్వ


తే.

నొక్కయడు గైన గురులప్రత్యుద్గతియును, వందనము నర్చనంబును వలయు నాను
కూల్యమును జేయవలయును గురునియెడ ది, గంబరత శయనింప నీరాడఁ గాదు.

230


చ.

విను పయిచీర లేక సురవిప్రుల నర్చన సేయఁ దెల్ప భో
జన మొనరింపఁ గాదు దివసంబును రేయుఁ బురీషమూత్రస
ర్జనముఁ గుబేరదక్షిణదిశాముఖతం దగు నాచరింప మ
ర్త్యునికి నిజేచ్ఛఁ జేయ నగు రోగముఁ బొందినయప్పు డప్పునుల్.

231


సీ.

తలతీఁట యిరుగేలఁ దగదు గోఁకగ నిమిత్తము లేక యుమఁదలఁ దడుపఁ దగదు
తల నున్ననూనియ దగ దంగమునఁ బూయఁ దగదు వేదం బనధ్యాయతిథులఁ
జదువంగ కొరుచీర జన్నిదంబు ధరింపఁ దగ దన్యుచెప్పులు దగదు తొడుగ
భూతాష్టమీపర్వములయందుఁ దగదు తైలాభ్యంగమును నంగనానుభవము


ఆ.

కాలు కాలఁ దొడయఁ గాదు మర్మం బాడ, నాడఁ జనదు గొండియంబు దగదు
వ్యసని మూర్ఖు మత్తు నధము హీనాంగు సౌం దర్యరహితుఁ జూచి తగదు తెగడ.

232


క.

తెరు విచ్చి తొలఁగవలయుం, బురుషుఁడు విప్రునకు ధరణిపుని కార్యుని కా
తురునకు గర్భణి కంధుని, కురుభారవహునికి రిపున కున్మత్తునకున్.

233


క.

గుడియును నగరనరులు వో, యెడితెరువును రచ్చ మ్రాఁకు నెక్కుడువిద్యం
గడ చనినయతని వినయం, బడరఁ బ్రదక్షిణము సేయునది నరుఁ డనఘా!

234


క.

శిరమున నగస్త్యుఁ డొండెను, సురనాథుం డొండె నుండ సుప్తిఁ గనఁ దగు
న్నరుఁ డుత్తరపశ్చిమముల, శిరముగ నిద్రించు టెగ్గు సేయుఁ గుమారా!

235


సీ.

స్నాతుఁడై మెయినీరు చేతఁ దొడయఁ జీర నార్ప వెండ్రుకలు విదుర్పఁ గూడ
దాలేపనంబు నీళ్ళాడకము న్నకర్తవ్యంబు రక్తాసితములు వీత
దళములు నైనవస్త్రము లధార్యములు చిరోషితములును బర్యుషితములును
శుష్కతరమ్ము లిక్షుక్షీరపిష్టశాకములును బలలవికార మైన


తే.

యవియు నెల్లను విను మభోజ్యములు రేపు, మాపు గుడుచుట విధ్యుక్తమార్గ మనఘ
సవితృ నుదయాస్తమయముల శయన మెగ్గు, నిట్లు గూర్చుండునెడ మేలు నెపుడు వలయు!

236

మ.

పరదారాగమనంబునం గలుగుపాపం బెక్కు డత్యంతదు
స్తర మాయుఃక్షయ మాచరించు నయుతేష్టాపూర్తము ల్సేసిన
న్హరియించు న్బరలోకము న్యశము నిత్యైశ్వర్యము న్గావున
న్నరుఁ డన్యాంగనపొంతఁ బోవమి గడు న్ధర్మంబు ధర్మాత్మకా!

237


క.

విను నురువును దుర్గంధం, బును లేనిపవిత్రవారిఁ బూర్వముఖుం డొం
డె నుదఙ్ముఖుఁ డొండెను నై, యనఘ! యశబ్ధముగ వార్చునది కడు నియతిన్.

238


సీ.

దంతతాడనమును దనుతాడనము చేఁత నింద్యంబు సంధ్యల నిద్ర గుడుపు
సురతంబు చదువును దురితంబుఁ జేయుఁ బూర్వాహ మధ్యాహ్నా పరాహ్ణవేళ
లమర మనుష్యపిత్రర్చనలకు మేలు క్షౌరకార్యములకుఁ గరము లెస్స
ప్రాగుదఙ్ముఖతలు పరులకు నుపతాప మొనరించుపను లెఫ్డు నుడుగవలయు


తే.

జంతుచయము నొప్పింపంగఁ జనదు కన్యఁ, గులజ నైనను రోగిణి గినఁటిఁ జెనఁటిఁ
బరిణయం బగు టొప్పదు భార్యఁ బ్రీతి, నరసి రక్షించునది తగ దాత్మ నీసు.

239


ఆ.

అంటరానిదాని నఖిలవర్ణులకును, ననఘ! నాల్గురాత్రు లంట రాదు
కొడుకు సమదినమునఁ గూఁతురు విషమది, నమునఁ బుట్టు టెఱిఁగి నడువవలయు.

240


ఆ.

పంచపర్వములను బగలు నంగనఁ బొందు, నతని కుద్భవింతు రధికపాప
యుతులు సుతులు సంధ్యనుగ్మలి నాదటఁ, గూడె నేని యతఁడు వేడిఁ గాంచు.

241


వ.

క్షౌరక్రియాంగనాసంగమావసానవమన శ్మశానప్రదేశంబుల సచేలస్నానంబు
సేయుట గురుద్విజరాజమంత్రిపతివ్రతాతపస్సులయందుఁ బరివాదపరిహాసంబులు
పరిహరించుట యత్యున్నతాతినీచంబు లగుశయనాసనంబులు వర్జించుట ధవళాం
బరకుసుమానులేపనంబులు ధరియించుట మాంగళ్యవేషభాషణంబు లంగీకరించుట
యాచారంబు లని మఱియును.

242


సీ.

మత్తుఁ డున్మత్తుఁ డుద్వృత్తుఁ డసత్త్వుండు దుర్వినీతుఁడు చౌర్యదూషితుండు
లుబ్ధుఁ డతివ్యయలోలుండు శత్రుఁ డబద్ధుండు బంధకీభర్త హీనుఁ
దతిబలవంతుఁడు నతినిష్ఠురుఁడు నింద్యుఁ డనువీరితోడ సఖ్యంబు దగదు
తగు మహీపాలబాంధవబుధదీక్షితస్నాతకాద్యుత్తమజనులతోడ


తే.

ఋత్విగాదుల నార్వుర నెఱిఁగి పూజ, సేయునది యాశ్రయించి విశిష్టభక్తి
నేఁడు గాల ముండిన వారి నెపుడు విడువ, కర్థి రక్షింపవలయు శక్త్యనుగుణముగ.

243


శా.

అంగుష్ఠాంతరరేఖ యాచమనయోగ్య బ్రాహ్మ్యతీర్థంబు సు
మ్మంగుష్ఠంబునఁ జుట్టవ్రేలియెడఁ బిత్ర్యం బైనతీర్థంబు
నంగుళ్యగ్రము దైవతీర్థమునఁ బొల్పారు ఋషిప్రీతి యో
జం గావించుఁ గనిష్ఠి కాద్య మగుప్రాజాపత్యతీర్థం బనన్.

244


తే.

దేవమునిపితృతతికిఁ దత్తీర్థములను, చేయునది కృత్యములు తప్పఁ జేయవలవ
దాభ్యుదయికపితృక్రియ కర్హ మండ్రు, దివ్యమునులు ప్రాజాపత్యతీర్థ మనఘ!

245

వ.

హుతవహు నాహుతులం బూజించి గృహబలి యాచరించి వైశ్వదేవం బాచరించి
దేవతోద్దేశంబున వేఱువేఱ బలిదానం బాచరించి మఱియును.

246


చ.

అనలము నోర నూఁదఁ దగ దగ్గియు నీరును నొక్కమాటు తేఁ
జనదు విలంబనంబు నిజశౌచవిధానమునందుఁ గూడ దె
గ్గొనర గురుండు దేవతలు నుండఁగ నద్దెసఁ గాళ్ళు చాఁచు ట
ర్థి నిగుడఁ గ్రేపుఁ జన్గుడుపుధేనువుఁ గొట్టుట తప్పు పుత్రకా!

247


క.

ఎచ్చట శ్రోత్రియుఁడును ధన, మిచ్చునతఁడు నీరు గలుగునేఱును వెజ్జు
న్మచ్చికయును లేకుండును, నచ్చట వసియింప వలవ దభినుతచరితా!

248


క.

జితశత్రుఁడు బలవంతుఁడు, నతిధర్మపరుండు నైనయవనీశుకడ
న్మతిమంతుల కుండఁ దగుఁ గు,పతికడ వసియించునతఁడు పడయునె సుఖముల్?

249


క.

ఎందలిజను లవినీతిం, బొందక మత్సరముపొంత పోవక పరమా
నందమునఁ గూడి యుండుదు, రం దుండుట పరమసుఖము నాపాదించున్.

250


క.

ఎం దెల్లమందులును గల, వెందుఁ గృషీవలులు ధనికు లెందు ధరణి చె
న్నొందు బహుసస్యదాయిని, యందు న్నివసింపఁ దగు సుఖార్థులు పుత్రా!

251


వ.

అని చెప్పి యింక వర్జ్యావర్జ్యంబులు వర్జ్యంబులకుం బ్రతిక్రియలుం జెప్పెద
నాకర్ణింపుము.

252


సీ.

ఘృతయుక్తిఁ జిరపర్యుషితమయ్యు భోజ్య మౌ నన్నంబు గోధూమయవలు సేరు
పునఁ జేయఁబడినవి విను ఘృతాక్తమ్ములు గాకున్న నవి ప్రాఁచి గావు మత్స్య
కూర్మశల్యశశకగోధావ్రజంబులు భక్షణార్హము లూరఁబంది కోడి
యనుపయోగ్యం బౌషధార్థమై సేవింపనగుఁ బ్రోక్షితం బైనయామిషంబు


ఆ.

పసిఁడి వెండి రాగి పవడంబు శంఖంబు, నీరు పాలు పెరుగు కూరగాయ
మౌక్తికంబు మణులు మనుజునియొడ లంబు, సేచనమున శుద్ధిఁ జెందు ననఘ.

253

పాత్రాదిశుద్ధి

తే.

అరయ నుపహతి వాటిల్లినట్టిచోట, నాజ్యతైలాభ్యుపేతభాండావలులకు
నేళ్లనీళ్లులనొండె వేనీళ్లనొండె, గడువ ఱాతఁ దోమిననొండెఁ గలుగు శుద్ధి.

254


క.

విను శూర్పధాన్యకృష్ణా, జినముసలోలూఖలములు చీరలపెనుబ్రో
వును శుద్ధిఁ బొందుఁ బ్రోక్షణ, మున నిట్టుల నుష్ణతోయముల వల్కలముల్.

255


సీ.

భసితోదకములఁ గార్పాసోద్భవంబులు దారుశృంగాస్థిదంతములు శుద్ధిఁ
బొందు మృద్భాండము ల్పునరగ్నిసంస్కృతి నతిశుద్ధిఁ దాల్చుఁ బణ్యంబు భైక్ష
మును గారుహస్తంబు వనితాముఖము నిజస్తన్యపానాసక్తతనయవతియు
దుర్గంధబుద్బుదదూష్యతఁ బొరయని యూటనీరును శుచు లుర్వి దహన


తే.

మార్జనంబులఁ గాలక్రమమున గోచ, యంబు ద్రొక్కిన వినుము గృహంబు మన్ను
గలయఁ ద్రొక్కినఁ బూసిన నలికినను న, లంకరించిన శుద్ధి నుల్లాస మొందు.

256

తే.

మనుజకృతతటాకాదుల మన్ను ముద్ద, లైదు పుచ్చక సుస్నాన మాచరింపఁ
జనదు దేవఖాతము లగుసరసులందు, బావులందును నదులందు వలదు వత్స!

257


సీ.

అన్నంబు గోవు మూర్కొన్నఁ గీటక మీఁగ వెండ్రుక లం దున్న విమలభూతి
యుతజలప్రోక్షణ నతిశుద్ధ మగు భసితమునఁ గాంస్యంబు నామ్లమునఁ దామ్ర
మును క్షారమున సీసమును దగరంబు పై పై వారి చల్ల ద్రవనిచయములు
శుద్ధి వహించు రశులు రజోగోవహ్ను లశ్వంబు మారుత మవని నీళ్ళ


తే.

బిందువులు మణికలు గీడుఁ జెందియును బ, విత్రతనె పొందు నెప్పుడు విను మజాశ్వ
వదనములు పక్షికులముఖవిదళితంబు, లై పడినఫలములు శుచు లండ్రు బుధులు.


క.

ఇనశశికరపవనస్ప, ర్శనముల నతిశుద్ధిఁ బొందు శయ్యాయానా
సనయానపాత్రమార్గము, లును దృణమును బణ్యములును లోకస్తుత్యా!

259


ఆ.

అంటఁ గానిదాని నంత్యజుఁ బతితు శ, వంబుఁ బేడి నగ్నుఁ బరవధూప
రాయణుని నధర్మరతు మృతహారకుఁ, జూచి సేయవలయు నాచమనము.

260


ఆ.

కోడి నూరఁబందిఁ బేడిఁ జండాలుని, నక్కఁ గుక్కఁ గృతకనారిఁ బతితు
ననఘ! పిల్లి నెలుక నాశౌచి సూతిక, నంటినతఁడు నీళు లాడవలయు.

261


క.

ఏనరుఁడు సదాచారవి, హీనుం డేనరుఁడు భూసురేంద్రత్యక్తుం
డేనరుఁడు ధర్మబాహ్యుం, డానరుఁ డఘభోక్త యగునరాధముఁడు సుమీ!

262

బ్రాహ్మణాదులయాశౌచప్రకారము

వ.

కావున నిత్యకర్మకలాపంబు ప్రయత్నంబున ననుష్ఠింపవలయు వాని ననుష్ఠింపవల
వనిదినంబులు మరణజన్మంబులందుఁ గల వాకర్ణింపుము.

263


క.

పదిదినములు బ్రాహ్మణులకుఁ, బదియును మఱి రెండు ధరణిపాలురకు నొగి
న్బదియేను వైశ్యులకు ము, ప్పది శూద్రుల కఖిలకర్మబాహ్యత వలయున్.

264


సీ.

ప్రథమచతుర్థసప్తమనవమదినంబు లస్థిసంచయమున కర్హములు చ
తుర్వర్ణులకును జతుర్థాహముల నగు నగ్నివిషంబుల నంబువులను
శస్త్రంబులను ననశనవిధిఁ బ్రాయోపవేశంబునను బరదేశమునను
సన్న్యాసమున బాల్యసమయమునను మృతు లైన సద్యశ్శౌచ మావహిల్లు


ఆ.

ననఘ! మూఁడుదినము లాశౌచ మండ్రు గొం, దఱు మునీంద్రు లతులధర్మయుక్తి
నెన్ని నెలలబాలుఁ డీల్గె నన్నిదినంబు, లశుచిభావ మొందు విశదకీర్తి!

265


వ.

తమతమసూతకదినంబులు చనిన నఖిలవర్ణులును సుస్నాతు లై నిజకర్మంబు లనుష్ఠిం
చునది యివ్విధంబున గృహస్థులు ధర్మార్థకామంబులు పరస్పరవిరోధులు గాకుండ
నవలంబించి సదాచారపరు లై యిహపరసుఖంబులు వడయుదురని మదాలస
బహుప్రకారంబులఁ జెప్పిన కర్మకాండవిధంబు విని యలర్కుం డానందభరితుం
డయ్యెనని చెప్పి వెండియుఁ దండ్రికి జడుం డిట్లనియె.

266

అలర్కుఁడు రాజ్యభోగము లనుభవించుట

ఉ.

అంత మనోహరప్రకటయౌవనలీల యలర్కుఁ బొందె న
త్యంతమదోల్లసద్విభవ మైంద్రగజేంద్రముఁ బొందినట్లు స
త్కాంతికళావిలాసము సుధాకరుఁ బొందినయ ట్లుదాత్తవా
సంతికవిభ్రమంబు విలసత్సహకారముఁ బొందిన ట్లొగిన్.

267


వ.

ఇ ట్లభినవయౌవనుం డై.

268


ఉ.

దారపరిగ్రహంబును నుదారగుణైకపరిగ్రహంబు వీ
రారిభయంకరోత్కటపరాక్రమకేలిపరిగ్రహంబుఁ బొ
ల్పారఁగఁ దండ్రియాజ్ఞఁ దనయౌదలఁ దాల్చి యలర్కుఁ డొప్పునా
శారదనీరదేందువిలసద్యశుఁ డై బహుపుత్రవంతుఁ డై.

269


ఉ.

అంత ఋతధ్వజుండును ననంతజరాగురుభారధుర్యతా
శ్రాంతి వహించి మేదినిభరంబు వహింపఁగ నోహటించి య
త్యంతగుణాభిరాముని నిజాత్మజుఁ బట్టము గట్టి ప్రీతితో
నింతియుఁ దానుఁ బేరడవి కేఁగి తపం బొనరించె వేడుకన్.

270


వ.

అప్పుడు మదాలస మహనీయమంగళకరం బగునొక్కగాంగేయమయాంగుళీయ
కంబు కొడుకున కిచ్చి పరమహితంబు లగువాక్యంబుల నతని కి ట్లనియె.

271

మదాలస యలర్కున కొకయుంగరం బిచ్చి హితోపదేశము సేయుట

చ.

అనఘ! మమత్వబద్ధుఁడు గృహస్థుఁడు సంతతసర్వదుఃఖభా
జన మటు గొన నెప్పుడు విషాదము బంధువియోగవిత్తనా
శనరిపుపీడలం గడు నసహ్యతరం బగునేని యప్పు డీ
కనకమయాంగుళీయకము గ్రక్కున నేర్పడఁ బాపి యిందులోన్.

272


వ.

సూక్ష్మక్షరంబుల నేను లిఖియించి యిడినకనకమయశాసనపట్టిక పుచ్చికొని చదువు
కొనునది యని యాదేశించి యతని నుచితాశీర్వాదంబుల నభినందించెఁ గువలయా
శ్వుండు నట్లు పుత్త్రునికిం బూజ్యం బైనసామ్రాజ్యం బిచ్చి మదాలసాసమన్వి
తుండై తపోవనంబు కరిగెనంత.

273

అలర్కుఁడు రాజ్యము సేయుట

చ.

అతులపటుప్రతాపమహిమార్కుఁ డలర్కుఁ డపారశౌర్యని
ర్జితరిపువీరుఁ డార్యనుతశీలుఁడు పాలనకేళిలోలుఁ డై
యతిశయలీల నేలెఁ జతురబ్ధిపరీతమహీతలంబుఁ గ
ల్పితవివిధాధ్వరుం డగుచుఁ బ్రీతి ననేకసహస్రవర్షముల్.

274


వ.

మఱియును.

275


ఉ.

ధర్మమున న్ధనంబు సతతంబు ప్రవృద్ధము గా ధనంబున
న్ధర్మము తొంగలింప ధనధర్మవిరోధులు గానికామభో

గోర్ముల నొప్పుసంసృతిసుఖోదధిఁ దేలుచు నించు కేనియు
న్గర్మవిరక్తి లేక బహుకాల మలర్కుఁడు ప్రీతి నుండఁగన్.

276


చ.

అనఘ! తదగ్రజుండు విపినాంతరవాసి సుబాహుఁ డయ్యల
ర్కు నవిజితేంద్రియత్వమును గుత్సితరాజ్య మమత్వము న్ధనా
ర్జనకలితత్వము న్విని కరం బెద రోసి యహా! యితండు క
ర్మనిగళబద్ధుఁడై కడుబ్రమత్తత నొందునె యిట్లు మూఢతన్?

277


వ.

అని చింతించి.

278


చ.

అతనిసమగ్రబోధమహిమాన్వితుఁ జేయునుపాయ మమ్మహా
మతి మదిఁ గాంచి తద్రిపు నమందపరాక్రముఁ గాశిరాజు నా
తతచతురంగసైన్యఘసదర్పమహోజ్జ్వలుఁ గానఁబోయి తా
నతివినయంబుతోడఁ బ్రియమారఁగఁ జేరి సుబాహుఁ డి ట్లనున్.

279


చ.

శరణము గమ్ము నాకు నృపసత్తమ! నాయనుజుం డలర్కుఁ డు
ద్ధురుఁ డయి రాజ్య మంతయును దుర్వినయంబునఁ దాన కొన్నవాఁ
డరిమదభేది నా కొసఁగు మాతని నిర్జితుఁ జేసి నావుడు
న్జరుఁ బనిచె న్సుబాహు ననుజన్మునిపాలికి నమ్మహీశుఁడున్.

280


క.

పనిచిన నరిగి యలర్కునిఁ, గని చరుఁ డోయవనినాథ! కాశీశ్వరుఁ డి
మ్మని యానతిచ్చెను సుబా, హుని కి మ్మీరాజ్య ముడుగు మొండుదలంపుల్.

281


చ.

అనిన నలర్కుఁ డల్కయును హాసము మోము నలంకరింపఁ గా
శినృపతిదూతవో తగవు సెప్పితి లెస్స సుబాహుఁ డేఁగుదెం
చి నను ధరిత్రి మైత్రి విలసిల్లఁగ వేఁడిన నిత్తుఁ గాక మీ
జనపతియాజ్ఞ కే వెఱచి శౌర్యము ధైర్యము దక్కి యిత్తునే?

282


వ.

అనిన విని దూత చని యలర్కుపలుకులు కాశీశ్వరునికిం జెప్పిన సుబాహుండు
బాహువీర్యమహనీయుం డగుమహీపతికి నొరు వేఁడికొనుటయు ధర్మంబు గా
దని యూరకుండె నప్పుడు.

283


సీ.

చతురంగబలపదాహతి నిల గంపింప గాశీశ్వరుం డలర్కక్షితీశు
పైఁ జని సామాద్యుపాయప్రయోగసామగ్రిఁ దదీయసామంతదుర్గ
పాలాటవికబలావలుల నెల్లను వశగతులను గావించి యతనిపురము
చుట్టును విడిసిన స్రుక్కి తల్లడ మంది యతఁ డల్పబలుఁడును నరినిపీడ్య


తే.

మానుఁడును నిస్సహాయుండు హీనధనుఁడు, నై విషాదంబు నార్తియు నాత్మఁ జాల
నగలించినఁ దల్లిప ల్కపుడు దలఁచి, యొనర నయ్యుంగరంబునం దున్నయట్టి.

284


వ.

పరిస్ఫుటాక్షరభాసురం బగుశాసనంబు పుచ్చికొని చూచి.

285


క.

సంగంబు విడువవలయును, సంగము విడువంగఁ గడు నశక్య మయినఁ జే
యంగవలయు సత్సంగము, సంగరుజకు నౌషధంబు సద్భజన మిలన్.

286

క.

కామము హేయము విడువం, గా మదికిని శక్య మెట్లు గా కున్న ముము
క్షామతి వలయుం గలవే, కామవ్యాధికి ముముక్షఁ గడచినమందుల్.

287


క.

అని పెక్కుమాఱు లతిముద, మున నాపద్యములు చదివె ముత్పులకంబు
ల్దనువునఁ బాదుకొనంగా, మన మలర మదాలసాకుమారుఁడు తండ్రీ!

288


వ.

అట్లు చదివి యమ్మహాత్ముండు శ్రేయంబు పురుషునకు ముముక్షం బోలనొండు గలుగ
దది యుత్తములసేవం గాని జనింపఁదనుచు మనమున నిశ్చయించి యప్పుడు
రహస్యవృత్తిం జని.

289

అలర్కదత్తాత్రేయసంవాదము

క.

ఆయుర్వీశుఁడు దత్తాత్రేయుం గరుణావిధేయు దేవమునిగణ
ధ్యేయు నసంగత్వమహా, స్థేయు విషయరిపుబలావిజేయు నమేయున్.

290


వ.

కని దండప్రణామం బాచరించి యంజలి యొనర్చి యార్తుం డగుచు ని ట్లనియె.

291


క.

శరణార్థి నైననాకును, శరణ మగుము జన్మమరణజనితవ్యాధు
ల్హరియింపుము నాదుఃఖము, కరుణింపుము నన్నుఁ జూడు కామభరార్తున్.

292


తే.

అనిన ముని యట్ల చేసెద నధిప! చెపుమ, వగవఁ గత మేమి నీకు నెవ్వండ నేను
వనట యెవ్వని దగునొక్కొ యని వివేక, దృష్టిఁ బరికింపు నిను నీవె తెలిసికొనిము.

293


క.

అంగంబులు చింతింపు ద, దంగిం బరికింపు మది నిరంగునిఁ గనుఁగొ
మ్మంగీకృతనిజబుద్ధి న,సంగుఁడవై యెఱుఁగు మధిప సర్వాంగములన్.

294


క.

అనిన నతఁడు నయ్యోగీం, ద్రునికారుణ్యమునఁ ద్రివిధదుఃఖస్థాన
మును నరసి యపుడఁ గనుఁగొని, తనుదా నవ్వుచును ననియెఁ దత్త్వజ్ఞుం డై.

295


సీ.

నేల నీ రనలంబు గాలి నభం బను నేనింటిపొడ వైనయీశరీర
మును మనంబును బుద్ధియును నహంకారంబు గా నేను నిత్యుండఁ గాన నెపుడు
శారీకమానసాధారము లౌసుఖదుగఖము ల్నా కవి దూరతరము
లత్యంతసంబంధ మైనదేహము తదీయంబు గా దనిన నాగాశ్వరథధ


తే.

నాదిసంబంధ మెక్కడియది విరోధి, యెవ్వఁ డింకఁ బురభ్రాంతి యేల యనుచుఁ
బరమవైరాగ్యసుజ్ఞానభరితవిమల, మానసుండై యలర్కుండు మఱియు ననఘ.

296


తే.

ఆకసం బొక్కటియ యె ట్లనేకఘటము, లందుఁ బెక్కయి తోఁచుఁ దా నట్ల యాత్ముఁ
డొకఁడ సకలంబునందును నొగి వెలుంగుఁ, గానఁ గాశీపతియు నేను గాము వేఱు.

297

అలర్కుని యాత్మవివేకము

చ.

అని తెలివొంది యమ్మునివరాగ్రణికిం గడుభక్తి మ్రొక్కి యి
ట్లనియె నలర్కుఁ డేను సుగుణాకర! నీకృప సమ్యగాత్మద
ర్శనుఁడను వీతదుఃఖుఁడను బ్రాజ్ఞుఁడ నైతి నసమ్యగాత్మద
ర్శను లగువారు దుఃఖజలరాశినిమగ్నులు గారె యెప్పుడున్?

298


వ.

అని మఱియును.

299

క.

ఎందెందుఁ గరము మమతం, బొంది పరగుచుండు నపుడు పురుషుని మది దా
నందంద తెచ్చి యిచ్చు న, మందము లగువగల నది క్రమక్రమయుక్తిన్.

300


తే.

ఘనబిడాలంబుచేఁ బడి కాటుపడిన, యపుడు తనకుక్కుటంబునయందుఁ గలుగు
వంత గలుగునె మదిమమత్వంబు లేని, యెలుకయందుఁ బిచ్చుకయందు నించు కైన.

301


క.

కావున నే నిప్పుడు మమ, తావికలతఁ బడక ప్రకృతిదవుల నిలిచి స
ద్భావజ్ఞ దుఃఖి గాక సు, ఖావిష్ణుఁడు గాక నీదయం బ్రతికితినే.

302


వ.

అనిన విని దత్తాత్రేయుం డిది నీ చెప్పినయట్టిద యాకర్ణింపుము.

303


క.

మమ యనుట దుఃఖమునకు న, మమ యనుటయ నిర్వృతికిని మార్గము లగుట
న్మమ యనుశాల్మలితూలం, బమలభవద్బోధపవనహతిఁ దూలె నృపా!

304


వ.

అని మఱియును నయ్యోగీంద్రుఁ డహంకారాంకురోద్భవంబును మమకారస్కంధ
బంధురంబును గృహక్షేత్రోచ్చశాఖంబును బుత్త్రదారాదిపల్లవంబును ధనధాన్య
మహాపత్త్రంబును బుణ్యాపుణ్యపుష్పంబును సుఖదుఃఖఫలభరితంబును విచికిత్సాళి
మాలికాకలితంబును ననేకకాలప్రవర్ధితంబునునై యజ్ఞాన మనుకుదుట నెలకొని
ముక్తిపదంబు బ్రుంగుడువడం బర్వి యున్నయిమ్మహాతరువునీడ యాశ్రయించి
సంసారపథపరిశ్రాంతు లగు మిథ్యాజ్ఞానసుఖాధీనమానసులకు నయ్యాత్యంతికసుఖం
బత్యంతదూరంబు.

305


సీ.

విమలవిద్యాకుఠారము తత్త్వవిత్సాధుజనసంగపాషాణమునఁ గరంబు
వాఁడి గావించి యెవ్వరు నఱకంగ నేర్తురు వెస నమ్మహాతరువు వారు
నిష్కంటకంబును నీరజస్కంబునై రాజిల్లుచల్లనిబ్రహ్మవనము
చొచ్చి నిత్యానందసుఖలీల నపునరావృత్తి నుండుదు రందు విను నృపాల!

306


తే.

పంచభూతేంద్రియస్థూలసంచయంబు, పంచతన్మాత్రమయసూక్ష్మసంచయంబు
నరయ నీవును నేను గా మిరువురకును, నొనర నీవు గాంచినయాత్ముఁ డొక్కరుండు.

307


క.

జననాయక! యౌదుంబర, మున మశకము నీట మత్స్యము నిషీక కుశన్
గనుఁగొన నొకఁడై వేఱై, చనుగతి దేహాత్ములందుఁ జర్చింపఁదగున్.


వ.

అనిన విని యలర్కుండు దేవా! భవత్ప్రసాదంబునం బ్రకృతిపురుషవివేకకరం బైన
యీజ్ఞానంబు నాకు సంభవించె నింక నిర్గుణబ్రహ్మైకత్వంబునం బొందించు యోగం
బెట్టి దెఱింగింపవే యనిన దత్తాత్రేయుం డి ట్లనియె.

308

అలర్కునికి దత్తాత్రేయుం డుపదేశించిన యోగమార్గము

క.

గురుఁడు శరీరమునందలి, పరమజ్ఞానమునకు నుపద్రష్ట నరే
శ్వర! మోక్షార్థికి శ్రేయ, స్కరవిమలజ్ఞానపూర్వకము యోగంబున్.

309


క.

ప్రాకృతగుణనివహముతో, నేకత్వము లేమియును మహీవల్లభ! బ్ర
హ్మైకత్వము గలుగుటయును, బ్రాకటముగ ముక్తి యండ్రు భవ్యవిచారా!

310

వ.

ముక్తి పరమయోగంబునం గలుగు యోగంబు సంగత్యాగంబున సిద్ధించు సంగ
త్యాగంబున సంసారదుఃఖంబులకు విసుగుడుం బుట్టు వినుము దుఃఖంబు సంగోద్భవం
బగుటంజేసి యోగి సంగంబు నుడుగవలయు సంగరాహిత్యంబున మమత్వంబు
చెడు నిర్మమత్వంబునం బరమసుఖ మైనవైరాగ్యంబు జనియించు వైరాగ్యంబున
సకలదోషంబులుం గాన నగుం గావున.

311


క.

జ్ఞానంబున వైరాగ్యము, మానుగ వైరాగ్యమున సమగ్రజ్ఞానం
బూను మది న్మోక్షార్థం, బై నది తాజ్ఞాన మన్య మజ్ఞాన మగున్.

312


మ.

తనపూర్వార్జితపుణ్యపాపఫలము ల్దా నప్డు భోగించుట
న్విను నిత్యోక్తము లైనకర్మము లొగి న్నిష్కాముఁడై సేయుట
న్దనుబంధంబును వెండిఁ బొందఁడు నిజాత్మజ్ఞానవంతుండు యో
గనిరూఢాత్మకుఁడైనయుత్తముఁ డలర్కక్ష్మాపచూడామణీ.

313

ప్రాణాయామాదిలక్షణము

వ.

అని చెప్పి యయ్యోగీశ్వరుండు నీకు యోగప్రకారంబుఁ జెప్పెద యోగికి మున్నాత్మ
జయంబు వలయు దానికి నుపాయంబు వినుము ప్రాణాయామంబున దేహదోషంబు
దహించునది.

314


తే.

తామ్ర మాదిగఁగ లయట్టి ధాతుచయముఁ, గొలిమి నిడి యూఁదఁ గీడెల్లఁ బొలియునట్లు
ప్రాణపవననిగ్రహమునఁ గ్రాఁగిపోవు, ననఘ! యింద్రియజనితదోషాదు లెల్ల.

315


వ.

ప్రాణాయామలక్షణం బెట్టి దనిన.

316


సీ.

కనుమోడ్చి విచ్చుటయును నొక్కలఘువును ననుకొలఁదులమాత్ర యమరుమాత్ర
లొగిన పండ్రెండు తద్ద్విగుణంబు త్రిగుణంబు గావింప నిశ్చలగతి యొనర్పఁ
బొలుచుఁ బ్రాణాయామములు లఘువును మధ్యమును నుత్తమంబును ననఁ ద్రివిధము
స్వేదంబు కంపవిషాదము లడఁగించి వశ్యము ల్గానట్టివాయువులను


తే.

వశ్యములఁ జేయు రహి యోగివర్యులకును, వసుధలో సింహశార్దూలవారణములు
పరిచయంబున నెంతయు మరిగి మార్ద, వంబు గైకొనువిధమున వసుమతీశ.

317


తే.

మావటీఁ డల్ల నల్లన మదగజంబు, నిచ్చతోఁ గూడ నోజకుఁ దెచ్చునట్లు
యోగవిద్యాపరుండును నొయ్యనొయ్య, ననువుతోఁగూడఁ బవనంబు నాఁగవలయు.

318


క.

మరగినసింహము మృగములఁ, బొరిగొనుచును నరులఁ గాచుపోలికి నంతః
పరిచితపవనుఁడు నఘములఁ, బొరిగొనుచును నరులదేహములు రక్షించున్.

319


వ.

కావున సదానుష్ఠానపరుండై యోగి ప్రాణాయామపరుండు గావలయు నని తదీ
యంబులైన ధ్వస్తిప్రాప్తిసంవిత్ప్రసాదంబు లనుచతురవస్థలప్రకారంబును నేర్పడం
దెలిపి యిట్లు ప్రాణాయానులఁక్షణయుక్తుం డైనయతనికి విహితం బైనయోగంబుఁ

జెప్పెద నాకర్ణింపుము పద్మస్వస్తికాద్యాసనములలోనం దన కభిమతం బైనయాస
నంబున నాసీనుండై హృదయంబునం బ్రణవంబుఁ గదియించి వదనంబు సంవృతంబు
గావించి శిరం బించుక నెగయించి దంతంబు లొండొంటిం బొంద నీక దెసలు
చూడక నాసాగ్రంబున దృష్టి నిలిపి తమోరజంబు లడంచి నిర్మలత్వం బవలం
బించి పవనం బాకంఠపూరితంబు గావించి.

320


తే.

మనసుతోఁగూడఁ గ్రమమున మారుతేంద్రి, యములఁ గూర్మంబులోని కంగములఁ దిగుచు
నట్లు తిగువఁ బ్రత్యాహార మవ్విధంబో, నర్చి తత్త్వైకనిష్ఠ మనంబు నిలిపి.

321


క.

తనయందు యోగి తన్నుం, గనుఁగొని ధారణ యొనర్పఁ గదలక యుండు
న్మన సొగిఁ బ్రాణాయామము, లనఘా! పండ్రెండు సేయునది ధారణకున్.

322


క.

ధారణలు రెండు నివి యో, గారూఢులు యోగ మందు రఖిలాఘములు
న్దూరము లగుఁ గడు నియతా, హారులు దృఢయోగపరులు నగుయోగులకున్.

323


వ.

ఇట్లు యోగం బతిప్రయత్నంబున సాధించిన యతండు యోగి యగు వినుము
ప్రాణనియమంబు ప్రాణాయామంబు మనఃపవనేంద్రియములఁ బ్రత్యాహరించుటం
బ్రత్యాహారంబును మనంబు గదలకుండ ధరించుట ధారణయు నగు ధారణా
స్థానంబులు పది గల వాకర్ణింపుము.

324


క.

మునునాభియు హృదయము నుర, మును గంఠము నాననమును ముక్కుతుదయు లో
చనములు బొమలనడుము తల, యును నట నూర్థ్వమును నెలవు లొగి ధారణకున్.

325


చ.

అనలము నీరు కూప మురగాలయ మున్నయెడ న్జతుష్పథ
మ్మున వెఱ గల్గుచోటఁ బితృభూమి సరీసృపసంచరస్థలం
బున నది రచ్చకొట్టమున మ్రోఁత చెలం గెడిపట్టునం బొన
ర్చిన విఫలంబు యోగము విశీర్ణదలస్థలియందు మందలోన్.

326


సీ.

ఈకీడుచోటుల నేమి పొమ్మని యోగయుతుఁ డగునజ్ఞానయోగి కనఘ
యోగంబునకు విఘ్న మొనరించుదోషము లుదయించు వానిఁ జెప్పెద జడత్వ
మును బధిరత్వము మూకత్వమును విస్మృతియును నంధతయు వేఁకియు ననంగ
నట్లు ప్రమాదజ లైనయారుజలకు రయమునఁ దగుఁ బ్రతిక్రియ లొనర్పఁ


తే.

గంకు మడరు నపుడు ఘనగిరి మనమునఁ, జెవిటితనమునందుఁ జెవి సువాక్చ
యందు నీరువట్టునప్పుడు విను మామ్ర, ఫలము రసనఁ దాల్ప వలయు యోగి.

327


వ.

మఱియును యోగీశ్వరుం డుష్ణంబునందు శీతంబును శీతంబునం దుష్ణమును
ధరించునది యమానుషసత్త్వజాతబాధలు పొందెనేని వాయువహ్నిధారణం
బునంజేసి వానిం జెఱచునది ధర్మార్థకామమోక్షంబులకు సాధనంబగుట నవ
శ్యంబు శరీరంబు రక్షించునది మునిజనప్రవృత్తిలక్షణం బొరులకుఁ జెప్పుటం

ధనవిమలజ్ఞానంబు విలయంబుఁ బొందుఁ గావునం దదీయప్రవృత్తిగోపనంబు
సేయునది యని చెప్పి.

328


శా.

ఆరోగ్యంబు ననిష్ఠురత్వము నలౌల్యంబు న్వపుఃకాంతియు
న్సౌరభ్యంబును సంస్వరత్వము మనస్సౌమ్యత్వము న్మూత్రవి
ట్చారాల్పత్వము నిర్మలత్వముఁ గృపాసంగిత్వము న్బ్రాప్తయో
గారంభుం డగుయోగికిం బ్రథమచిహ్నంబు ల్మహీవల్లభా!

329


తే.

భూతములు దాను నన్యోన్యభీతి లేక, యునికి శీతోష్ణబాధ దా నొంద కునికి
భువన మనురాగమునఁ దన్నుఁ బొంద కునికి, వెలయు నివి సిద్ధలక్షణములు నరేంద్ర!

330

యోగవిఘ్నకార్యములు

ఆ.

దానయజ్ఞదేవతాపూజనాతప, స్తంత్రకలితకామజంబు లైన
కడిఁది యోగవిఘ్నకరము లౌకర్మము, ల్పరిహరింపవలయుఁ బరమయోగి.

331


వ.

మఱియును గటుకోదయంబు లైనప్రాతిభశ్రావణదైవభ్రమావర్తంబు లనుపంచ
విధోపసర్గంబులు పరిహరించి నియతాహారుండును జితేంద్రియుండును బ్రహ్మ
ప్రవణమనస్కుండు నై యోగి సూక్ష్మం బగు ధారణాసప్తకంబు ధరియించునది
తద్విధం బాకర్ణింపుము.

332


సీ.

ధరణి మూర్ధంబున ధరియించి తన్మయత్వముఁ బొంది దానిగంధంబు విడుచు
నది యట్ల జలమును నగ్నియు వాయువు వాయుపథంబును వరుసఁ దాల్చి
జననుత రసరూపసంస్పర్శశబ్దంబు లనుగుణంబులఁ ద్రోచునది క్రమమునఁ
దనమనంబును బుద్ధియును సర్వభూతదయంబు మనోబుద్ధులందుఁ జొనిపి


తే.

ధారణాభ్యాసతత్పరత్వమునఁ జేసి, యమ్మనోబుద్ధిసౌక్ష్మ్య మొయ్యనఁ దొఱంగు
నది గురూక్తి ని ట్లతిసూక్ష్యు లైనయేడు, వృత్తుల విడిచినతఁడు నివృత్తిపరుడు.

333


వ.

ఇట్లు సప్తధారణాభ్యాసంబున జేసి పృథివ్యాదులగంధాదిసూక్ష్మగుణంబులం
దొఱంగి శుద్ధాత్ముం డగుయోగసిద్ధుం డణిమాద్యక్షైశ్వర్యసిద్ధిసంపన్నుండును
షడ్భావవికారరహితుండును యోగాగ్నిదగ్ధదోషుండును నై యనలం బనలంబు
నందును జలంబునందును నొందుచందంబునం దాను బరమాత్మైకత్వంబునం
బొందు ననవుడు నలర్కుండు బ్రహ్మపదవర్తియైన యోగిచరిత్రంబు నా కెఱిఁగిం
పవే యనిన దత్తాత్రేయుం డిట్లనియె.

334

యోగిధర్మములు

క.

మానము నవమానంబును, మానవులఁ బ్రమోదఖేదమగ్నులఁ జేయు
న్మానము యోగికి విష మవ, మానం బమృతంబు సుమ్ము మహితవిచారా!

335


వ.

అని మఱియును.

336


తే.

త్రావునుదకంబు వస్త్రపూతంబు నడుగు, వెట్టునెడ దృష్టిపూతంబు ప్రీతితోడఁ
బలుకు సత్యపూతంబును బరమమైన, తలఁపు బుద్ధిపూతంబు గావలయు యతికి.

337

తే.

సిద్ధి గోరుయోగికి విను శ్రాద్ధమునకు, దైవయాత్రామహాజనస్థానమునకు
నధ్వరాతిథ్యవూజల కతులితోత్స, వముల కెప్పుడు నరుగంగ వలవ దనఘ!

338


చ.

మనుజులు దన్నుఁ జూచి యవమానపరాభవము ల్పొనర్చువ
ర్తనమును నట్టివేషమును దాల్చి సమస్తజనమ్ములు న్భుజిం
చిన మఱి యోగి బొగ్గుపొగ చీఁకిలి ముంగల లేనియిండ్లకుం
జనునది భిక్ష కెఫ్డు మును చన్నగృహంబుల కేఁగరా దొగిన్.

339


తే.

వేదవేదాంగపారగవిప్రగృహము, లందు సంపాదితం బైనయట్టిభిక్ష
మనఘ! ప్రాణాగ్నిహోత్రంబు సాంగముగ నొ, నర్చి యొనరించునది భోజనంబు యోగి.

340


వ.

అహింసాస్తేయబ్రహ్మచర్యాలోభత్యాగంబు లనునియమంబు లేను నంగీకరించి
మనోదండవాగ్దండకర్మదండంబు లనుదండత్రయంబు ధరియించి త్రిదండి యన
నతిశయిల్లి వివిధజ్ఞానంబులచిక్కునం బడక నిర్మలజ్ఞానవంతుండును సమలో
ష్టాశ్మకాంచనుండును సమస్తభూతదయాళుండును సతతధ్యానపరాయణుండు
నైనయోగి పరబ్రహ్మానందభరితుం డగు నని చెప్పి యత్రిపుత్రుండు వెండియు
నలర్కున కి ట్లనియె.

341


క.

విశ్వకరచరణకంధరు, విశ్వానననయనకర్ణు విశ్వాకారున్
విశ్వాత్ముఁ బొందుటకు యో, గీశ్వరుఁడు జపింపవలయు నెపుడు ప్రణవమున్.

342

మరణసూచకములగు స్వాప్నికాద్యరిష్టములు

క.

అని యోంకారము రూప, మ్మును సగుణత్వాగుణత్వములు తధ్యాన
మును నుచ్చారణవిధమును, నొనరంగాఁ జెప్పి వెండియును ని ట్లనియెన్.

343


వ.

కలలోనను బ్రత్యక్షంబునం గలుగునరిష్టంబులం జేసి యోగి మరణకాలం బెఱింగి
యోగస్మరణపరుండైన నప్పుడు సిద్ధింపకున్న నయ్యోగం బతనికి మీఁదటిభవంబున
సిద్ధించు.

344


క.

కావున నరిష్టములు సద్భావంబున నెఱుఁగవలయుఁ దత్త్వజ్ఞాన
శ్రీవిలసితుఁ డగుయోగికి, భూవర! యెఱిఁగింతు వినుము పొలుపుగ దానిన్.

345


క.

దివిజపథంబున శుక్రుని, ధువుని శశిచ్ఛాయ నయ్యరుంధతి నేమా
నవుఁ డొగిఁ గానఁ డతఁడు మృ, త్యువు నొకవత్సరముమీఁద నొందు నరేంద్రా!

346


క.

కిరణరహితరవిబింబముఁ, గిరణావృతవహ్నిఁ గనినఁ గీడును గలుగు
న్నరులకుఁ బదునొక్కఁడునెల, లరిగిన నటమీఁద మరణ మవనీనాథా!

347


సీ.

రజతసువర్ణమూత్రపురీషములు గల నైన దృష్టంబున నైనఁ గ్రక్కు
నాతఁడు పదినెల ల్ప్రేతపిశాచకనకవృక్షగంధర్వనగరదర్శి
తొమ్మిదినేల లతిస్థూలుండు బడుగును బడుగును దొడ్డనెపంబు లేక
యైన నెన్మిదినెల లతిసాంద్రరేణుకర్దమమున బ్రుంగి పాదంబు ఖండ


తే.

ములుగఁ గలఁ గన్నవాఁ డేడునెలలు గువ్వ, గ్రద్ద వాయస మాదిగాఁ గలుగుపులుఁగు

లడరి నడుతలవ్రేసిన నమ్మనుష్యుఁ, డాఱునెలలు గాని మనఁ డుదాత్తపుణ్య!

348


తే.

పాంసువృష్టిచేతను గాకపంక్తిచేత, మానవునితల పీడిత మైన మేని
నీడ యొండుచందం బైన నెలలు నాల్గు, గాని యాయువు గలుగదు వాని కనఘ!

349


సీ.

ద్విత్రిమాసములలోఁ దెగు నరుఁ డపగతమేఘయామ్యమ్మున మెఱుఁగు నింద్ర
ధనువున నుదకంబు గనినఁ దైలాజ్యాంబుదర్పణాంతరమునఁ దనదురూపు
తల లేక తోఁచిన నెలఁ జచ్చు గొరియగ దురు శవగంధంబు బొరయఁ దనువు
నర్ధమాసాయుష్యుఁ డగును నీళ్లాడిన నతనికాళ్లును హృదయంబు మిగుల


తే.

నెండినను నీరు ద్రావంగ నెసఁగి దాహ, మగ్గలించిన విను దశాహమునఁ దీఱు
ఋక్షకపియానగతుఁ డైన దక్షిణమున, కొనరఁ బాడుచుఁ జనఁ గలఁ గనియెనేని.

350


చ.

ఇనుఁ డుదయంబు సేయ వఱ డెవ్వనికై యెదు రేఁగు నిష్ఠుర
ధ్వని సెలగంగ నెవ్వనికిఁ దద్దయు నాఁకలి యుద్భవిల్లు భో
జన మొనరించినప్డు నెద సాధ్వస మూరక పుట్టుచుండు నె
వ్వని కొగి రేయునుం బగలు వాఁడు యమాలయగామి భూవరా!

351


ఉ.

ఎవ్వఁడు పెల్చఁ బ ల్కొలుకు నెంతయు నన్యునితారకంబులం
దెవ్వనిరూపు దోఁప దొగి నింద్రధనుర్గ్రహతారకోత్కరం
బెవ్వఁడు రాత్రియు న్బగలు నేర్పడఁ గాంచు స్రవించుచుండుఁ దా
నెవ్వనిసవ్యనేత్రమున నెప్పుడు నీరము వా రనాయుషుల్.

352


తే.

నాసికాగ్రంబు వంగుట నాల్క నల్ల, నగుట వదనంబు గడు నెఱ్ఱ నగుట యుష్ట్ర
రాసభమ్ములు పూనినరథము నెక్కి, యమునిదెసఁ జనఁగలఁగంటయాయువడఁచు.

353


తే.

కర్ణములమ్రోఁత వ్రే ళ్ళిడఁ గలుగదేని, నీల్గుఁ బాతఱఁ బడినఁ ద న్నెగయకుండఁ
గప్పి రని మానవుఁడు గలఁగనియెనేని, యదియ తుద వానిమనుగడ కగు నరేంద్ర.

354


ఆ.

ఊర్ధ్వదృష్టి యైన నోలిని బ్రచలిత, దృష్టి యైన వక్రదృష్టి యైనఁ
బురుషుఁ డేఁగు జమున ప్రోలికి బొడ్డు లోఁ, తైన మొగము శుష్క మైన ననఘ!

355


క.

తనకట్టిన సితవస్త్రము, లనయము రక్తాసితంబు లైనపగిదిఁ దోఁ
చిన నిజభావప్రకృతులు, విను మగుడంబడిన నరుఁడు వీడ్కొను భవమున్.

356


వ.

అని చెప్పి యయ్యరిష్టంబులు మహాత్ములైన యోగులు మొదలుగా నెల్లవారికి
నెఱుంగవలయు సంవత్సరాంతంబు ఫలదంబు లగునరిష్టంబులు పరీక్షించి కాలం
బెఱింగి మరణంబునకు వెఱవక ధైర్యం బవలంబించి యోగం బనుష్ఠించుచు దివా
రాత్రంబులం దోఁచునరిష్టంబులు పరికించి యవి విఫలంబు లగునట్లుగా నయ్యైవేళ
లందు యోగయుక్తుం డగుచుఁ గాలంబు గెలిచి మనంబు సుస్థిరంబు గావించి
గుణత్రయవికృతు లడంచి యాత్ముని నాత్మయందు సంధించి తన్మయుం డై యోగి
నిరాలంబంబును నతీంద్రియంబును నైననిర్వాణంబుం బొందు నని యివ్విధంబున
యోగప్రకారం బెఱింగించి మఱియు నప్పరమయోగి యలర్కున కి ట్లనియె.

357

బ్రహ్మప్రాప్త్యుపాయము

క.

ఇనశశికరయోగంబుల, నినశశికాంతోపలముల నెమ్మెయి ననలం
బును సలిలము నుద్భూతము, లొనరఁగ నగు నివ్విధములు యోగికి నుపమల్.

358


చ.

విను నకులంబు బల్లి కలవింకము మూషక మర్థితో గృహం
బున వసియించి తద్విభులు వోలె సుఖస్థితి నొందు నాగృహం
బున కొకహాని యైనఁ జనుఁ బొంద వొకింతయు వంత తద్గృహ
స్థులక్రియ యోగి కయ్యుపమ చొప్పడఁ గొప్పడు యోగసిద్ధియున్.

359


క.

తన కున్నయదియె యిల్లుగఁ, దనయాఁకలి కొదవినదియ తగుభోజ్యముగాఁ
దనకుఁ గలయదియ ధనముగ, మనమున ముద మందుయోగి మమతఁ బొరయునే?

360


వ.

అని యోగులకు నెఱుంగవలయువాని నెఱింగించిన నలర్కుండు పరమహర్షరస
భరితహృదయుం డగుచు నందంద మ్రొక్కి యయ్యోగీంద్రుని కిట్లనియె.

361


సీ.

భాగ్యంబు గాదె సుబాహుకాశీశులు పురముపై వచ్చి సంగరముసేఁత?
సంగరంబున సర్వసైన్యబాంధవధనక్షయ మగు టధికభాగ్యంబు గాదె?
కడ లేనిభాగ్యంబు గాదె శాత్త్రవబాధఁ దలరి యే మిమ్మిట్లు గొలువ రాక?
మిముఁ గన్నమాత్రన విమలాత్మబోధంబు కలిమి నాతొంటిభాగ్యంబు గాదె?


తే.

వేయుఁ జెప్పంగ నేటికి విను శుభోదయమున నరున కనర్థసహస్ర మైన
నది శుభము చేయుఁ గావున నాసుబాహు, కాశిపులు నాకుఁ గడు నుపకారు లైరి.

362


చ.

పరమమునీంద్ర! కాశిపసుబాహునిమి త్తమున న్భవత్ప్రసా
దరుచిరదీపదీప్తిని హతం బయి పోయె మదంతరంగబం
ధురమమతాంధతామసము తోన పదస్థుఁడ నైతి దుఃఖదు
స్తరగృహధర్మ మేఁ దొఱఁగెద న్ద్రిజగన్నుత! మీయనుజ్ఞతోన్.

363


క.

అనిన విని యట్ల చేయుము, చను మేఁ జెప్పినవిధంబు సద్బుద్ధిం
కొను మమతాహంకృతులకు, మన సీకుము మోక్షవృత్తి మఱవకు మనఘా!

364

అలర్కసుబాహుకాశీరాజసంవాదము

మ.

అని దీవించిన మ్రొక్కి వీడ్కొని ముదం భార న్సుబాహుండు గా
శినృపాలుండును నున్నచోటికిఁ గడు న్శీఘ్రంబు మై నేఁగి యి
ట్లనియె న్నవ్వుచు నయ్యలర్కుఁడు సముద్యద్జ్ఞానవై రాగ్యసం
జనితానందనిమగ్నచిత్తుఁ డగుచు న్సంప్రీతిఁ గాశీశుతోన్.

365


క.

ఓకాశీశ్వర! రాజ్యము, గైకొను మిచ్చితి సుఖింపు కడువేడుకతో
నీకుఁ బ్రియ మెట్టు లట్టుల, ప్రాకటముగ నిమ్ము దగ సుబాహునకైనన్.

366


వ.

అనిన విని నవ్వి యమ్మహీపతి యలర్కున కి ట్లనియె.

367


ఉ.

క్షత్త్రియుఁ డెందు నాజి వెలిగా నిజరాజ్యము వైరి కిచ్చునే
క్షత్త్రియధర్మవేది విటు గా దన కెట్టులు పల్కి తాహవ

క్షేత్రమునందు శాత్త్రవుని గెల్చి ధరిత్రి పరిగ్రహించి స
త్క్షత్త్రియుఁ డెల్లభోగములు గైకొనుఁ గా కిటు లేల గైకొనున్.

368


క.

అనిన నలర్కుం డి ట్లను, జనవర మును నా మనంబుచందము నీ చె
ప్పినయట్ల యిపుడు శాంతిం, దనరెడు మగుడఁబడె వినుము తత్కారణమున్.

369


ఉ.

నీవు సమస్తసైన్యమహనీయుఁడ వై చనుదెంచి మత్పుర
శ్రీవిభవంబు సైన్యము నశింపఁగఁ జేసిన వంత నేను దుః
ఖావిలబుద్ధి నై చని మహాత్ముని నత్రితనూజు బ్రహ్మవి
ద్యావిదుఁ గంటిఁ దత్కృపఁ జిదాత్మవివేకము నన్నుఁ బొందినన్.

370


చ.

లలిఁ బ్రసరించునింద్రియముల న్గుదియించి సమస్తసంగముం
దొలఁగఁగ ద్రోచి బ్రహ్మమున త్రోవకుఁ దెచ్చి మనంబు నెంతయు
న్గెలిచినవాఁడ నెమ్మనము గెల్చిన సిద్ధికి వేఱ యత్నము
న్వలవదు సేయ నెవ్వరి కవార్యపరాక్రమధుర్య యెమ్మెయిన్.

371


చ.

అరయఁగ నీచరాచరములందు వసించి వెలుంగుచున్న య
ప్పురుషుఁ డొకండ కాఁగ నిజబోధవినిర్మలదృష్టిఁ గాంచి త
త్పరమతి నైన నాకుఁ బరిపంథివె నీవు నరేంద్ర! యేను నీ
కు రిపుఁడనే సుబాహుఁ డనఘుం డపకారపరుండె నాయెడన్?

372


వ.

అని నీకు శత్త్రుం డొరుండు గలండేని వెదకికొను మనిన నయ్యలర్కునివచనంబు
లకు నన్నరేంద్రుండు ప్రహృష్టహృదయుండయ్యె సుబాహుండు దిగ్గన లేచి హర్షించి
యయ్యనుజుం గౌఁగిలించుకొని దీవించి కాశీకు నాలోకించి యేను
నిన్ను శరణంబుఁ
జొచ్చి యిటఁ దెచ్చినకార్యంబు నాకు సఫలం బయ్య సుఖివి గమ్ము పోయి
వచ్చెద ననిన నమ్మహీపతి యి ట్లనియె.

373


ఉ.

కారణ మేమి నీవు ననుఁ గానఁగ రాకకుఁ గార్యసిద్ధి ని
న్జేరినచంద మెట్లు దగఁ జెప్పు వినం గడువేడ్క యయ్యెడు
న్గోరినయట్లు రాజ్య మనఘుం డగునీయనుజన్ము నోర్చి పెం
పారఁగఁ గొంటిఁ గైకొను ముదాత్తసుఖస్థితి నందు మిప్పురిన్.

374

కాశీరాజునకు సుబాహుఁడు చెప్పిన స్వాగమనకారణములు

వ.

అనిన సుబాహుండు నవ్వుచు ని ట్లనియె.

375


క.

జనవర! నీయొద్దకుఁ బ్రియ, మొనరఁగఁ జనుదెంచి యింత యుద్యోగం బే
నొనరించుటకు నిమిత్తము, విను చెప్పెద నేర్పడంగ విమలచరిత్రా!

376


సీ.

మాతల్లి నన్నును మాతోడఁ బుట్టినవారిని నిద్దఱ గారవమున
బాల్యంబు మొదలుగా బ్రహ్మబోధకవాక్యనిచయంబు వీనుల నించి నించి
విమలతత్త్వజ్ఞానవిదులుగ నొనరించి యితని బోధింపక వితతకర్మ
కాండప్రవీణుని గావించుటయుఁ దత్త్వమూఢుండు గార్హస్థ్యమోహితుండు

తే.

సతతసంసారభోగసంగతుఁడు నై యి, తండు చెడుటకు నేను చిత్తంబునందుఁ
దెరువు నడుచుసార్థమున నొక్కరుని కొకటి, యైన సహచరు ల్వగచినయట్ల వగచి.

377


చ.

ఘనతరదుఃఖహేతు వెడఁ గల్గినఁ గాని విరక్తి పుట్ట దీ
తని కని నిశ్చయించి యుచితంబుగ నే నిను నట్టు లాశ్రయిం
చిన నృపవర్య! యుద్యమముఁ జేసితి వెంతయు నిట్లు నీకతం
బునఁ బ్రతికె న్ప్రబోధమును భూతవిరక్తియుఁ గల్గి యీతఁడున్.

378


వ.

అని మఱియును.

379


క.

అనఘ! మదాలసకడుపున, జనియించియు యోగిమాతచను గుడిచియుఁ బె
ర్గినతనయు లితరవనితల, తనయులు చనుత్రోవఁ జనఁగఁ దగియెడువారే?

380


చ.

అనియుఁ దలంచి యేను భవదాశ్రయపూర్వక మైనయుద్యమం
బొనరఁగ నిట్లు చేసితి నృపోత్తమ! నీమహనీయసంగమం
బున ఫలియించె నాతలఁపు వోయెద నీ వభివృద్ధి నెప్పుడు
న్దనరుచు నుండు మాత్మతనుతత్త్వవివేకనిబద్ధబుద్ధి వై.

381


తే.

అనిన నాతఁడు నీ వలర్కునకు నకట, పూని యుపకృతి చేసితి గాన నాకు
వలదె యుపకృతి సేయ సత్ఫలము గాక, సాధుసంగతి విఫలయె బోధనిలయ.

382


వ.

అనిన సుబాహుం డమ్మహీపతితోడ ధర్మార్థకామసక్తు లైనసకలజనంబులు నశియించు
చుందురు పరమం బైనయది మోక్షంబ దానిం బడయునుపాయంబు నీకు సంక్షేప
రూపంబునం జెప్పెద మనస్కరించి విని యాలోచించి యెట్లు మేలట్లు ప్రవర్తింపుము.

383


సీ.

ఇది మదీయం బని యేఁ గర్తనని తోఁచుఁ బొందకు భ్రమ నిజబోధ మెఱుఁగు
మే నెవ్వఁ డనొ నాయ దెయ్యదియో యని యాలోచనము సేయు మనుదినంబు
నపరరాత్రముల బాహ్యాంతర్గతస్థితి యరయు మవ్యక్తాద్య మైనభూత
సంఘాత మెల్లను సవికారమును నచేతనమును నగుట గన్గొనుము భూప


తే.

యిట్టు లెంతయు నేర్పడ నెఱుఁగఁబడియె, నేని నిఖిలంబు నీచేత నెఱుఁగఁబడిన
యదియె యాత్మవిజ్ఞాన మనాత్మయందుఁ, గలిమి మూఢత్వముగ మదిఁ దెలిసికొనుము.

384


క.

అని చెప్పి యాసుబాహుఁడు, చనియెం గాశీశ్వరుండు సంప్రీతి నల
ర్కునిఁ బూజించి రయంబునఁ, దనపురమున కేఁగె బలవితానముతోడన్.

385

అడవి నలర్కునకు యోగాతిశయమున వైరాగ్యము

తే.

అంత సంత్యక్తసంగుఁ డై యయ్యలర్కుఁ, డఖిలసామ్రాజ్యభారవహనసమర్థుఁ
బ్రథమపుత్రుఁ బరాక్రమమథితశత్త్రు, నర్థిఁ బట్టంబు గట్టి తా నడవి కరిగె.

386


వ.

అరిగి పెద్దకాలంబునకు నిర్మలజ్ఞానసిద్ధుం డై యతండు ససురాసురమానుషం బైన
జగం బింతయుఁ బుత్రకళత్రభాతృమిత్రాదిభవపాశబద్ధంబును నింద్రియాకృష్య
మాణంబును ననంతదుఃఖార్తంబును విచ్ఛిన్నదర్శనంబును నై యజ్ఞానపంకంబునం

బడి వెడల నేరమియును దాను దానివలన సముత్తీర్ణుం డగుటయుఁ గాంచి
యొక్కపద్యం బిట్లు పఠించె.

387


తే.

అకట! యింతకాలము రాజ్య మర్థితోడ, నింపుతోఁ జేసితినె యిసీ యిట్టికీడు
గలదు నా కిప్పు డింతయుఁ గానఁబడియె, యోగసుఖమునకంటె లే దొండుసుఖము.

388


వ.

అని ప్రమోదభరితుం డయ్యె.

389


ఉ.

కావున నయ్యలర్కవిభుకైవడి నిర్మలినాత్మయోగము
న్నీవును ముక్తిసిద్ధికయి నిష్ఠ నొనర్పు నిరంతరంబుఁ దం
డ్రీ! విను మింకఁ గర్మములత్రిక్కున నేనును జిక్క మోక్షల
క్ష్మీవితతానుభూతి కయి చేసెదఁ గానకు నేఁగి యత్నమున్.

390


క.

అని చెప్పి జనకుననుమతి, ననఘుం డాసుమతి చనియె నప్పుడు తాఁ గా
ననమునకు న్జయ్యన న, త్యనుపమవైరాగ్యసంవిదమలాత్మకుఁ డై.

391


వ.

అంత నవిద్యాతమోజాలబాలదివాకరుం డగునబ్బాలునిజనకుం డాభార్గవుండును
గృహస్థత్వంబు విడిచి వానప్రస్థయత్యాశ్రమంబులం గ్రమంబునం గైకొని యింద్రి
యంబుల గెల్చి మనోజయంబు నొంది పరమసిద్ధిం బొందె నని చెప్పి.

392

ఆశ్వాసాంతము

ఉ.

భద్రగుణాభిరామ! రిఫుభంజనభీమ! సమగ్రధైర్యహే
మాద్రిసదృక్ష! సంతతదయారసరమ్యకటాక్ష! కామినీ
భద్ర! నితాంతభక్తిసముపాసితరుద్ర! వితీర్ణికేళిక
ల్పద్రుమతుల్యభూరిభుజభాస్వర! వైభవనిర్జరేశ్వరా!

393


క.

ప్రౌఢస్త్రీమకరాంకా!, గాఢభజనసుప్రసన్నగరుడవృషాంకా!
గూఢనయతత్త్వవేదీ! వ్యూఢప్రతిపక్షబలసముత్కటభేదీ!

394


మాలిని.

శ్రుతసకలపురాణా! శుద్ధధర్మప్రవీణా!
వితతగుణవరేణ్యా! వీరలోకాగ్రగణ్యా!
సతతవినయముద్రా! సత్యసంవత్సముద్రా!
పతిహితనయదక్షా! పద్మపత్త్రాయతాక్షా!

395


గద్యము.

ఇది శ్రీమదుభయకవిమిత్ర తిక్కనసోమయాజిప్రసాదలబ్ధసరస్వతీపాత్ర
తిక్కనామాత్యపుత్ర మారయనామధేయప్రణీతం బైనమార్కండేయమహాపురా
ణంబునందుఁ గువలయాశ్వుండు తండ్రినియోగంబున మునిజనరక్షణార్థం బవనీత
లంబునం బరిభ్రమించుటయు మాయావియైనతాళకేతునిచేతఁ గువలయాశ్వుండు
మృతుండయ్యె నని విని మదాలస మరణప్రాప్త యగుటయుఁ గువలయాశ్వుండు
సకలవనితాభోగపరాఙ్ముఖుం డగుటయు నశ్వతరోరగేశ్వరుండు మదాలసం
గ్రమ్మఱం బడయుటయుఁ గువలయాశ్వమదాలసాపునస్సంగమంబును శత్త్రు

జితుండు పరలోకగతుండగుటయు విక్రాంతసుబాహుశత్త్రుమర్దనులజన్మంబును
వారల మదాలస పరమయోగులుగాఁ బ్రబోధించుటయు నలర్కోత్పత్తియు
నక్కుమారునికి నయ్యోగిమాత రాజధర్మంబులు వర్ణధర్మంబులు నాశ్రమధర్మం
బులు నాచారవిధులుం జెప్పుటయుఁ గువలయాశ్వుండు మదాలసాసహితంబుగ
వనంబున కరుగుటయు నలర్కునిరాజ్యభోగాసక్తియు సుబాహుం డలర్కుని
పురంబుపైఁ గాశీశ్వరుం దెచ్చుటయు శత్త్రుపీడార్తుండై యలర్కుండు మాతృ
దత్తాంగుళీయాంతర్గతశాసనలిఖితపద్యపఠనంబున విరక్తిం బొంది దత్తాత్రేయుఁ
గానం జనుటయు నయ్యోగీశ్వరుం డలర్కునకుం బరమయోగం బుపదేశించు
టయు నలర్కుండు పరమసిద్ధిం బొందుటయు జడుండు తండ్రి కింతయు నెఱిం
గించి తానరణ్యంబున కరిగి యోగపరాయణుం డగుటయు నా భార్గవుండు పుత్త్రుని
చేత నియుక్తుం డయి గృహస్థత్వంబు విడిచి చని యత్యాశ్రమంబు ధరియించు
టయు నన్నది దృతీయాశ్వాసము.