Jump to content

మాటా మన్నన/4. సంభాషణలోని కష్టాలు

వికీసోర్స్ నుండి

సంభాషణలోని కష్టాలు :

భావ వినిమయములో ఆలోచించవలసిన బాధ ఏమిటంటే కొందరు సంభాషణలో పాల్గొనటానికి సందేహిస్తారు. పదిమంది కలిసి మాట్లాడుతున్నపుడు, విందులలోనూ, వినోదాలలోనూ కలసినపుడు మౌనం వహిస్తారు. అతిగా మాట్లాడటం ఎంత అనర్ధదాయకమో ఏమీ మాట్లాడక పోవటమూ అంతే. ప్రతివారూ పాల్గొన్నపుడే దేనికైనా అందచందాలు వచ్చేది. మాట్లాడకుండా మూగవానివలె వున్న వారివంక మిగతావారంతా చూస్తూ ఉంటారు, అతడొకవిధంగా అవమానం పొందినట్లే లెక్క.

కొంతమంది మాట్లాడకుండా ఉండటం శక్తి లేక కాదు, సిగ్గు. సభాపిరికి, ఇంతమాత్రంచేత ఊరుకోరాదు. ఈ బిడియాన్ని పోగొట్టుకొనుటకు ప్రయత్నం చేయాలి, బాగా మాట్లాడేవారు. ఆ బిడియపడేవారిని మాట్లాడేటట్లు చేయటానికి సర్వవిధాల సానుభూతితో ప్రయత్నించటం అవసరం, అతనికి అందుబాటులో ఉండే విషయాన్ని అందు కొని అతనితో సంభాషించటానికి ప్రయత్నించాలి. ఆ మాదిరిగా అందరిని రంగములో దింపి ఆనందించాలి తెలిసిన వారు,

మంచి సంభాషణకర్త ఎప్పుడూ ఇతరులకు తెలియని విషయాలను మాట్లాడ ప్రయత్నించడు. తన గొప్పదనాన్ని ప్రదర్శించేవారు మంచి సంభాషణకర్త కానే కాడు. అందరూ పాల్గొనటంలోనే సంభాషణ సొగసున్నది. ఎదుటి వారి ప్రశంస పొందకపోతే అరణ్యరోదన.

మానవులు కలసి మెలసి మాట్లాడుకొన్నందువల్ల నే ఒకరి నొకరు అర్థం చేసుకొంటారు. తద్వారా మైత్రి కలుగుతుంది,

సంభాషణలో నిన్ను గురించే నీవు అధికంగా మాట్లాడరాదు. అందుచేతనే , 'ఆత్మస్తుతి, పరనింద పనికిరా' దన్నారు. అసలు అధికంగా మాట్లాడటమే తప్పు. అది అనేక అనర్థాలకు ఆలవాలం.

తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను. ఇందులో ఎక్కువ లాభాలున్నాయి. నీవు మాట్లాడినందున నీకు వచ్చేదిలేదు. విన్నందువలన నీకు అనేక విషయాలు తెలియవచ్చు.

అదీగాక ప్రతివారు మాట్లాడ తలుస్తారు. నీవు ఇతరుల దృష్టిలో మంచివాడవని అనిపించుకోవాలంటే శ్రద్ధగా ఇతరులు చెప్పేది విను.

మంచి సంభాషణకర్త చక్కగా వినేవాడే. సంభాషణలో వాగ్వివాదాలు పనికిరావు. అవి చివరకు తగాదాలు క్రిందకు వస్తవి, ఎదటివారి అభిప్రాయాల్ని ఖండించటానికి మనం ప్రయత్నిస్తే, తన అభిప్రాయాల్ని సమర్ధించుకోవటానికి అతడు ప్రయత్నిస్తాడు. అశక్తుడైనపుడు "శేషం కోపేన పూరయేత్ " అన్నట్లు | పవర్తిస్తాడు. 'Debate is the death of conversation' - Emil Luting.