మహాపురుషుల జీవితములు/స్వామి దయానంద సరస్వతి

వికీసోర్స్ నుండి

స్వామి దయానంద సరస్వతి

ఈయన హిందూ దేశమునందు, ఆర్యసమాజమను క్రొత్త మతమును స్థాపించిన మహాత్ముడు. ఈతఁడు ఘూర్జర దేశములోనున్న 'కతేవారు' సంస్థానము నందలి మోర్వీ యను గ్రామమున 1825 వ సంవత్సరమున జన్మించెను. తల్లిదండ్రులపేరు లెవ్వ రెఱుంగరు. ఆయన తండ్రి యాగ్రామమునకు జమీందారుగా నుండుటయేగాక స్వల్పధనవంతుడై వడ్డీవ్యాపారము చేయుచు సుఖముగఁ గాలక్షేపము చేయువాడు. మతమున నతడు పరమశైవుడు. ఆతని భార్యయు బాతివ్రత్యంబునకు సౌజన్యతకుఁ జాల పేరువడినది. దయానందున కైదవ యేట నక్షరాభ్యాసమయ్యెను. అది మొద లెనిమిదవ యేడు లోపుననే దేశభాషను సంస్కృతమును దన యీడు పిల్లలకంటె నెక్కువ తెలివితో నతఁడు నేర్చికొనెను. ఎనిమిదవయేట నుపనయనము జరుగుటచే నప్పటినుండియు దండ్రి వానికి శైవమత రహస్యముల నుపదేశించి పార్థివలింగపూజనము ప్రతిదినము చేయించి రుద్రాధ్యాయములోఁ జెప్పఁబడిన విధుల నన్నిటిని గ్రమముగఁ జేయుమని కుమారుని బలవంతపెట్టఁ జొచ్చెను. దయానందుడు సహజముగ బలహీను డగుటచే నతఁ డంత చిన్న తనమున బెద్దలు చేయవలసిన నియమములన్నియు జేసినచో శరీరస్థితిచెడునని యప్పు డప్పుడు తల్లి మొఱవెట్టుకొనుచు వచ్చినను వినక తండ్రి వానిచే నట్టి నియమముల జేయించు చుండెను. ఎనిమిదవయేడు మొదలు పదునాలుగవయేడు వఱకుఁ దయానందుఁడు శ్రద్ధతో విద్యనేర్చి కొన్ని కావ్యములను జాలవఱకు వ్యాకరణమును యజుర్వేదసంహితను ముగించెను. అప్పుడు తండ్రి వానిని బరమశైవుఁడుగ జేయదలచి 1859 వ సంవత్సరమున మహా


స్వామిదయానందసరస్వతి

శివరాత్రినాడు దానికి ముహూర్త మేర్పరచెను, అప్పటికి దయానందునకు శరీరమునందు స్వస్థత లేనందున దినమంతయు నతఁ డుపవాసముండలేడనియు రాత్రి జాగరము చేయ లేడనియు లింగధారణము మఱియొకప్పుడు చేయవచ్చుననియు జెప్పి యప్పు డాపని మానుమని తల్లి యనేకవిధముల దండ్రినిఁ బ్రతిమాలుకొనియెను. కాని యతఁ డామాట పెడ చెవినిఁబెట్టి యది యప్పుడే జరిగితీరవలయునని పట్టు పట్టెను. అందుచే దయానందుడు శివరాత్రినా డుదయమున స్నానముచేసి మడిఁగట్టుకొని తండ్రింగూడి శివాలయమునకుఁ బోయి దినమెల్ల నుపవసించి యుండెను.

ఆలయమంతటను జనులు ఓంహర, ఓంహర, మహాదేవ, యని కేకలు వేయుటచే గుడి ప్రతిధ్వనులిచ్చెను. రాత్రి భక్తులందఱు జాగరము చేయదలంచి కష్టపడి రెండుజాములవఱకు మేలుకొని నిద్ర నాపుకొనలేక యెక్కడివా రక్కడనే కటికినేలం బండుకొని నిద్రించిరి. జాగరముచేయ లేకపోయినచో ఫలము చెడునేమో యని భయపడి బాలుడు దయానందుఁడు మాత్రము కన్ను మూయక శివవిగ్రహమువంక జూచుచు గూర్చుండెను. అట్లుండ నావిగ్రహము మీద నొక చిట్టెలుక ప్రాకి దేవునకు నై వేద్యము నిమిత్తము పెట్టిన వస్తువులఁ గొన్నిటి నెత్తుకొని పోయెను. అది చూచినతోడనే దయానందుని మనస్సు పరిపరివిధములఁబోవ తనలో దానిట్లని వితర్కించుకొనియె.

"ఈరాతిబొమ్మనంది పై నెక్కి త్రిశూలము చేతఁబట్టుకొని సృష్టిస్థితిలయములు చేయగల మహాదేవుడేనా! అట్లయినం దనమీద నెలుకబ్రాకి తననిమిత్త ముంచినపండ్ల నెత్తుకొనిపోవుచుండ దాని నదలింపఁ జాలఁడేమి? ఈ నల్లఱాయి దేవుఁడుగాడు." అని కొండొకసేపు తలపోసి నిదురించుచున్న తండ్రినిలేపి సంశయము యెందునుం బాలునింగానక విసికి వేసారి యింటికివచ్చిరి. తలిదండ్రులు బిడ్డనియెడ నాసవిడిచి దుఃఖితులై యూరకొనిరి. దయానందుడు వివాహబాధ తప్పినందుకు సంతసించుచు బయనమైపోయి త్రోవలోఁ దన శరీరముమీఁదనున్న మురుగులు మొదలగు నగలనుదీసి బ్రాహ్మణులకు దానమిచ్చి యొకబ్రాహ్మణు నాశ్రయించి కావిగుడ్డలు సంపాదించి బ్రహ్మచర్యాశ్రమమునం బ్రవేశించెను. జ్ఞానవంతులగు సన్యాసులు సాధువులు బైరాగులు ఎక్కడనున్నారని తెలిసిన నది యెంత దూరమైనసరే యచటకుఁబోయి వారిని సేవించి యతఁడు జ్ఞానము సంపాదించుచుండును. సిద్ధిపురమను నొక పుణ్యక్షేత్రమున జరుగఁబోవు తిరునాళ్ళకుఁ బోవఁదలఁచి కొందఱు సన్యాసులంగలసి యతఁ డుండ వానిని వానితండ్రిని నెఱిఁగిన యొక మనుష్యుఁడు వాని నాన వాలుపట్టి పోవు చోటు తెలిసికొని రహస్యముగఁ దండ్రికి జాబు వ్రాసెను.

ఆ వార్త విని తండ్రి మహానందభరితుఁడై మెఱియలవంటి బంట్లను పదుగురఁదోడ్కొని సిద్ధిపురమునకు వచ్చి రెన్నాళ్ళు రేయింబవళ్ళు వెదకి యెట్ట కేలకు మదిమంది సన్యాసులనడుమఁ గూర్చుండఁగ గుమారు నానవాలుపట్టి యక్కడనే వాని కాషాయ వస్త్రములం జింపివేసి యనుచితమగు నాపని చేసినందుకు దూషించి జాగ్రత్తగాఁ గాపాడుమని వానిని సేవకులకప్పగించెను. ముష్కరులగు నాబంటులు వాని నిట్టట్టు గదలనీక గడు జాగరూకతతో నాదినమంతయుఁ గాచిరి. నిద్ర యెట్టిపనినై నను మరపించునుగదా, ఆ బంట్లు రాత్రి యంతయు మేలుకొని తెల్లవారగట్ల కనుమూసి నిద్రించిరి. తాను మరల దండ్రిచేతఁ బడినందుకు విచారించుచు దయానందుఁడు కన్ను మూయనందున బంట్లు నిదురింపఁగానే యదేసమయమని లేచి మెల్ల మెల్లగ నావలకుఁ బోయి గబగబ పరుగెత్తి కొంతదూరముపోయి తానెటుపోయిన బంట్లు పట్టుకొనకమానరని యొక యాలయమున మఱిచెట్టిక్కి చిట్టచివర కొమ్మమీఁద యేరికిం గనఁబడకుండనాకుల మధ్య గూర్చుండెను. తండ్రి బాలునింగానక బంట్లం దిట్టి కొట్టి మరలఁ వానివెదకి తేరఁబంచెను. ఆ బంటులు సిద్దిపురమునఁ బ్రతి గృహము ప్రతిచోటు వెదకి వెదకి వానిని గానక విసికిరి. కొందఱు బంట్లు దయానందుఁడు గూర్చున్న చెట్టుక్రిందను గుడిలోను వెదకిరి గాని దయానందుఁడు నిశ్శబ్దముగఁ గూర్చుండుటచే వానిం గనుగొన లేకపోయిరి. తండ్రి విఫలప్రయత్నుఁడై మరల యొప్పటియట్లు తన యూరికిఁ బోయెను.

దయానందుఁ డాపగలంతయుఁ జెట్టుమీఁద గూర్చుండి రాత్రి దిగివచ్చి పయనమై పోయెను. దొరకినప్పు డన్నముదినుచు దొరకనప్పు డుపవసించుచు నిదురవచ్చినచోటనే పండుకొనుచు నాబాలుఁడు దేశముల వెంబడి బయలుదేరెను. ఆ పయనములో నొకసారియెలుఁగు గొడ్డొకటి వానిపై బడవచ్చెను. దయానందుఁడు మనశ్చాంచల్యము వీడి ధైర్యము దెచ్చుకొని యెలుఁగున కెదురుగ నిలిచి దానిముక్కుఁమీద నొకగుద్దు గుద్దెను. ఆ బెబ్బతో యది నెత్తురు గ్రక్కు కొనుచుఁ నఱచుచు బాఱిపోయెను. మఱియొకనాఁడతడొక యూరికిఁబోవ నచటి దేవాలయధర్మకర్తయగు మహంతు వాని నాదరించి తనవద్దనుండి గుడి పెత్తనము సేయుమనియు గావలసిన ధనమిత్తుననియుఁ బలికెను, "ధనము గావలసినచో మాయింటివద్ద తండ్రికడనే యుందును. నాకక్కరలే" దని చెప్పి యచ్చోటు వాసిపోయెను. మఱియొకసారి యతఁడొక యడవిలోనుండి పోవుచు దారితప్పి ముండ్లకంచెలలోఁ బడెను. వెనుకకు వెళ్ళినచోఁ బోదలఁచిన గ్రామము సత్వరముగఁ జేరవీలులేదని యాముండ్లత్రోవనేపట్టి కాళ్ళనిండ ముండ్లు గ్రుచ్చుకొన్నను శరీరము గీచుకుపోయినను లెక్క సేయక గమ్యస్థానమునుఁ జేరెను. వేరొకసారి నర్మదాసాగరసంగమమువద్ద నెవరో మహాత్ముఁ డున్నాఁడనివిని యచటికిఁ బయనమైపోయెను. దారిలో బ్రహ్మదండి ముండ్లువిరిగి కాళ్ళనెత్తురువరదలై మాంసము పైకిఁగనబడునట్లు తొక్కలూడినను సరకుసేయక దయానందుఁ డా పయనము చేసి చేసి యొకనాఁడు సాయంకాలము నడువలేక యొక యూరుబైట చెట్టు క్రింద యొడలెఱుంగక నిద్రించెను.

ఆరాత్రి యాగ్రామస్థులు పెద్దయుత్సవ మేదో చేసికొనుచు దివిటీలతో నూరుబైటకు వచ్చిరి. ఊరుపెత్తనదారు మఱికొందఱు చెట్టుక్రింద నిద్రించుచుండిన బాలునిచుట్టుమూగి లేపి యూరిలోనికి రమ్మనిరి. ఆతఁడు నడిచి రాఁజాలనని చెప్ప వానియందు పరమ భక్తుఁడై పెత్తనదారు వడివడి నింటికిఁ బోయి పాలు పండ్లు పంపి యారాత్రి వాని కపాయము రాకుండఁ దనమనుష్యులను వానికిఁ గావలియుంచెను. మఱునాఁ డక్కడనుండి బయలుదేఱి దయానందుఁడు మహాత్మునిఁ జూచి సన్యాసాశ్రమమును స్వీకరించి తన జ్ఞానము నింకను వృద్ధిచేసుకొనఁ గోరి మధురాపురమున నొక గొప్ప పండితుఁ డున్న వాఁడనివిని యచటి కరిగెను. ఆ పండితునిపేరు విరజానందుఁడు. విద్య గరపుటలో నతడు ప్రాచీన పద్ధతిలోనివాఁడు. శిష్యులకు శాస్త్రములు నేర్పునపుడు ఋషికృతములగు ప్రాచీన శాస్త్రములనే గాని నవీనులు చేసిన సిద్ధాంతకౌముది మొదలగు గ్రంథములను నేర్పుట కిష్టము లేనివాఁడు.

దయానందుఁ డాయన వద్దకుఁబోయి తనరాకకుఁ గారణ మెఱిఁగింప సన్యాసికిఁ దాను చదువు చెప్పనని విరజానందుఁడు పలికెను. ఎట్లయినఁ దన్ననుగ్రహింపు మని దయానందుఁడు వాని పాదములమీద పడి యెంతయుఁ బ్రార్థింప విరజానందుఁ డెట్టకేలకుఁ గృపాళువై శిష్యుఁడుగ వానినిఁ బరిగ్రహించి యదివఱ కతఁడు చదువుకొన్న గ్రంథములన్నియు యమునలోఁ బాఱవేయించి వెనుకటి చదువు మఱచిపోయినట్లె యెంచుకొమ్మని మఱల నక్షరాభ్యాసముచేసి వానికిఁ జదువు చెప్ప నారంభించెను. దయానందుఁ డదివఱకే జాల చదువుకొన్నవాఁడు. విశేషించి కుశాగ్రబుద్ధియు నగుటచే విద్యానిధియగు విరజానందుఁడు చెప్పినదంతయు నతఁడు సూక్ష్మముగ గ్రహించెను.

మధురాపురములో మాధుకరము చేసికొని చదువుకొనుచు దయానందుఁడు గురువునకు సంతుష్టి గలిగించినందున విరజానందుఁడు శిష్యునిపై జాలిఁగొని తానే వానిభోజనమునకుఁ గావలసిన సొమ్మిచ్చుచుండెను. అట్లుండి యతఁడు నాలుగు వేదములు, షడంగములు, షట్చాస్త్రములు స్మృతులు చదువుకొనెను. విద్య పూర్తియైన తోడనే దయానందుఁడు గురువునకు నమస్కరించి "స్వామీ ! నేను నిరుపేదను, గురుదక్షిణ నియ్యఁజాల నేనేమి చేయవలయునో సెల వీయవలయు"నని వినయమున మనవియొనర్ప గురువు పరమానంద భరితుఁడై తనకు ధన మియ్యనక్కఱలేదనియు జిరకాలమునుండి సత్యమయిన మతమును లోకమునకు బోధింపవలయునని తాను దలంచితిననియుఁ దనకుఁ గన్నులు లేకపోవుటచేఁ దానట్టిపనిఁ జేయ వీలులేకపోయె ననియుఁ దనకు మనోభీష్టమగు నా కార్యమును జేయుటయే తనకు గురుదక్షిణ యిచ్చుట యనియుఁ జెప్పి యాపనిఁ జేయుమని సెలవిచ్చి వాని నంపెను.

గురునియాజ్ఞ శిరసావహించి దయానందుఁడు మధురాపురము విడిచి కొన్ని కొన్ని గ్రామములలో వేదమతము బోధించెను. అంతలో హరిద్వారతీర్థము సమీపించెను. హరిద్వారము హిందువుల పుణ్య తీర్థములలో నగ్రగణ్యమయినది. గంగానది యీ పట్టణమువద్దనే హిమవత్పర్వతము మీఁదనుండి భూమిమీఁదికి దిగును. సంవత్సరము నందుఁ బ్రతిమాసమున దేశమంతటనుండి తీర్థవాసు లీ పట్టణముఁ జేరుచునే యుందురు. ప్రత్యేకముగ నచ్చట దీర్థము వచ్చినప్పుడు చేరు జనులసంఖ్య మితిమీఱియుండును. అట్లు వేనవేలు జనులు చేరిన సమయమునఁ దనమతము బోధింపవలయునని దయానందుఁడు సంకల్పించి తీర్థము జరుగుట కొక నెలముందు హరిద్వారముఁ జేరెను. చేరి రాత్రి యనక పగలనక యా నెలదినములును దరువాత తీర్థదినములబోను దయానందుఁ డెత్తగు నొకకొండపైనిలచి వాక్ప్రవాహమును దొర్లున ట్లుపన్యసించి విగ్రహారాధనముఁ జేయగూడదనియు నదీజలములలో మునిగినంతమాత్రమున మోక్షము లేదనియు బోధించెను. ఆజానుబాహుఁ డగు నతని మూర్తియు గంభీరమగు వాని కంఠధనియుఁ జూచి వినిన వారికి వానియందు పరమభక్తికుదిరెను, విగ్రహారాధనము ఖండించుటచే నతనిసాహసమున కంద ఱచ్చెరువడిరి. అతని మాటల నొక్కసారి వినినవారు తరుచుగ వాని పక్షమే దిరుగుచువచ్చిరి. అతని బోధలవలన విగ్రహారాధనము మంచిదని బోదించు బ్రాహ్మణులకుఁ గొంతనష్టము గలిగినందున వారతనిని నిందించిరి. ఆనిందలకు లెక్క సేయక జనులతో వాదనలు సేయునపుడు తన కెక్కువ చిత్తశాంతియు నెక్కువ నోపికయు నుండవలయునని యాగుణముల నలవరచు కొనుటకు రెండేండ్లడవి కేగి తపస్సు చేసెను. ఆతపస్సు ముగిసినపిదప దయానందుఁడు మరల తనపని నారంభించి గంగాతీరమున నున్న కాన్పూరు నగరమునకు వచ్చెను. ఆ నగరమున హలధరోజుఁ డను మహాపండితుఁ డొకఁ డుండెను.

విగ్రహారాధనము దుష్కార్యమని దయానందుఁడు బోధింపఁ గానే యాయూరిపండితు లది సహింపలేక హలధరునితో వాదింపుమని వాని నడిగిరి. అతఁ డందుకు సమ్మతించి సభ గావింపు మని యెను. అప్పుడు జరిగిన సభకు వేన వేలు జనులువచ్చిరి. కానుపూరు నగరమం దశిష్టాంటుకలక్టరును సంస్కృత భాషాపరిచితుఁడు నగు 'తేరా' యను దొరగారుభయుల వాదములువిని తీర్పు చెప్పుటకు మధ్యవర్తిగ నేర్పడియెను. అప్పు డతివిచిత్రముగ హలధర దయానందులకు వాదోపవాదములు జరిగెను. విగ్రహారాధనము మంచిదని హలధరుఁ డెన్నిప్రమాణములు చూపినను దయానందుఁడు వాని నన్నిఁటి నవలీలగా ఖండించెను. దయానందుని ప్రమాణములుప్రబలముగ నుండుటయు హలధరుని ప్రమాణములు దుర్బలములుగ నుండుటయు గ్రహించి 'తేరా' దొరగారు తానక్కడ నటమీఁద నుండ నక్కఱలేదని దయానందునివద్ద శలవుపుచ్చుకొని వెళ్ళెను. అతఁడు పోయినతోడనే హలధరునిపక్షమున వచ్చిన పండితులు తాము గెలిచితిమని కేకలువేయుచు లేచి హలధరునొక బండిమీఁద గూర్చుండఁ బెట్టి యూరేగించుచు దీసికొనిపోయిరి. ఆసాహసమున కచ్చెరువడి యెవరు గెలిచిరో సత్యమును దెలుపుమని దయానందుని పక్షమువారు దొరగారికి వ్రాసిరి. ఆదొరగారును జరిగినపనికి విస్మితుఁడై దయానందుఁడే గెలిచెననియు హలధరుఁ డోడిపోయెననియుఁ దానాసంగతి వ్రాఁతమూలముగ దయానందునకుఁ దెలియఁ జేయఁ దలంచుచుండె ననియు వ్రాసి ప్రత్యుత్తరమంపెను. అనంతరము (అనఁగా 1869 వ సంవత్సరమున) దయానందుఁడు హిందువులకు భూలోకకైలాసము విద్యలకు నిధానము, పుణ్యభూములలో నగ్రగణ్యము నగు కాశీనగరమునకుఁ బోయెను.

వందలకొలది దేవాలయములు వందలకొలది విగ్రహములు నున్న యన్నగరమున నీస్వామి విగ్రహారాధనము వేద వేదవిరుద్ధమని బోధింప నారంభించినతోడనే బ్రాహ్మణులు రోషావేశ పరవశులై రాజుతోఁ జెప్పిరి. అప్పుడు కాశీరాజగు శివప్రసాదుగారు వారణాశీ పండితులతో వాదించి వాదము నిలఁబెట్టుకొమ్మని దయానందునకు వర్తమానమంపిరి. వాదనల కెప్పుడును దయానందుఁడు వెనుకదీయువాఁడు గాఁడు గావున తానందుకు సిద్ధముగా నుంటినని ప్రత్యుత్తర మంపెను. ఆసంవత్సరము 16 వ నవంబరున నొకమహాసభజరిగెను. దాని కిరువది వేలమందికంటె నెక్కువ జనులు వచ్చిరి. జగత్ప్రసిద్ధులగు విశుద్ధానందుఁడు బాలశాస్త్రి మొదలగు దిగ్గజములవంటి పండితులనేకు లాసభకు వచ్చిరి. దయానందసరస్వతి యాయందఱ పండితులకు నోళ్ళాడకుండునటులు నాలుగు వేదములలో నుండియుఁ దనవాదమున కుపవనముగ ననేకప్రమాణములఁజూపి సభవారిని దిగ్భ్రాంతులఁజేసెను. శివప్రసాదు తెల్లఁబోయెను. పండితులు మొగ మొగంబులు చూచుకొనిరి. ఆవాదమున దయానందస్వామి సంపూర్ణముగఁ గాశీవిద్వాంసుల నోడించెను. ఆ విజయమునుగూర్చి హిందూ పేట్రియాటుపత్రిక వ్రాయుచు దయానందుని ప్రజ్ఞాదికములను జాల వర్ణించెను.

అనంతరము 1870 వ సంవత్సరము జనవరి నెలలోఁ గొందఱు పెద్దమనుష్యుల ప్రార్థనమున దయానందస్వామి కలకత్తా నగరమునకుఁ బోయెను. మతవిషయములను దనతో వాదింప నిచ్చలగలవారువచ్చి వాదింపుడని పిలుచుచు నితఁడు జాబు లచ్చు వేయించి పండితులకుఁ బంపెను. ఆపత్రికలఁ జూచుకొని యచ్చటిపండితులు వానితో మత విషయములో ననేక వాదములుచేసి యోడిపోయిరి. పండితుల నోడించి దయానందుఁడు కలకత్తాలోఁ బెద్ద సభ చేసి సాయంకాలము మూఁడుగంటలు మొద లాఱుగంటలవఱకు సంస్కృతభాషలో నుపన్యసించి జనులను మహానందసముద్రములో ముంచెను. సంస్కృతము వినిన వానినోటినుండియే వినవలయునని యచ్చటి పండితు లందఱైక కంఠ్యముగఁ బలికిరఁట. ఆయన హిందీ మరాతీ గుజరాతీ సంస్కృత మను నాలుగుభాషలలో ననర్గళధారగ మాటలాడఁగల సామర్థ్యము గలవాఁడు. ఏవిషయమును బ్రసంగించు నపుడైనఁ బ్రమాణములు వందలకొలఁది యతఁడు చూప శక్తిగలవాఁడు. వేయేల ! నాలుగు వేదములు వానికి వశములై యుండెనని లోకులు చెప్పుకొనిరి. ఆతఁడు కలకత్తాలో నున్న కాలమున కేశవచంద్రసేనుడు వానిని సందర్శించి మైత్రిచేసి వేదాంతవిషయము లనేకములు వానితోఁ జర్చించి క్రొత్త సంగతులు నేర్చికొనియెను. ఈగెలుపు లన్నిఁటినిగూర్చి యానాటి వార్తాపత్రికలే స్వామిని వేయినోళ్ళం బొగడుచు వ్రాసినవి. స్వామి కలకత్తానగరము విడిచి ప్రయాగ కాన్పూరు మొదలగు పట్టణములఁకుబోయి తనసిద్ధాంతము బోధించి కొంతకాల మాప్రాంతమున గడపి బొంబాయి నగరవాసులు తన్ను రమ్మని ప్రార్థింప 1874 వ సంవత్సరమున నచ్చటి కరిగెను.

బొంబాయి నగరవాసులు స్వామిని తద్దయు నాదరించి వాని యుపన్యాసములఁగడుశ్రద్ధతోవినిరి. దయానందుఁడాపట్టణమున దేవాలయ ధర్మకర్తలగు షోక్లీ గోసాయినులతో విగ్రహార్చనమును గురించి వాదించి యోడించి యచ్చట నార్యసమాజము స్థాపించి మరల నుత్తరహిందూస్థానమునకుం జనియెను. త్రోవలో నతని వద్దకు చంద్రపుర గ్రామవాసి యగు మునిషీపైరులాలను నతడు వచ్చి హిందూక్రైస్తవ మహమ్మదీయ మతములలో దేనియందు సత్యము గలదో తెలిసికొనుట కాయా మతస్థులచేత నుపన్యాసము లిప్పింప వలయునని తాను కోరుచుంటిననియు మహమ్మదీయ క్రైస్తవమతస్థు లుపన్యసింప నంగీకరించిరనియు హిందూమత పక్షమున విజయంచేసి యుపన్యసింప వలసినదనియు స్వామినిగోరెను. స్వామి దానికంగీకరించి యాగ్రామమునకుఁ బోయి మూడుదినములు వారితో వాదించి హిందూమత పక్షమున నుపన్యాసములిచ్చి క్రైస్తవులకు మహమ్మదీయు లకుఁ బరాజయము గలిగించెను. ప్రతివాదమందు దయానందుఁడు గెల్చుచుండినను గెలుపొందితి ననుగర్వములేక యోడిపోయిన వారి యెడల బరమదయాళువై మునుపటికంటె నెక్కుడు వినయసంపత్తి చూపుచుండును. అందుచేత నచ్చటికి గ్రైస్తవమతపక్షమునవచ్చిన రెవరెండుస్కాటుదొరగారికి మనస్వామికి నభిప్రాయ భేదములున్నను మైత్రిగలిగెను. పిమ్మట కొంతకాల మక్కడక్కడ తన మతము బోధించి స్వామి 1877 వ సంవత్సరమున ఢిల్లీ పట్టణమున జరిగిన దర్బారును జూడఁబోయి యచ్చోటికి వచ్చిన మహారాజులకు జమీందారులకుం దన సిద్ధాంతము నుప దేశించెను. ఆ మాటల మాధుర్యము జవిచూచి యంతతో దనివినొందక పంజాబు దేశస్థులు తమ దేశమునకు రమ్మని వానిం బ్రార్థించిరి.

వారిప్రార్ధన మంగీకరించి దయానందుడు పంజాబు దేశమునకుఁజని యచట ననేకస్థలములలో నార్యసమాజములను స్థాపించెను. ఎందుచేతనోగాని యీ యార్యమతము పంజాబు దేశమునందు మిక్కిలి యెక్కువవృద్ధిఁబొందెను. సాధారణముగా నా దేశమునం దార్యసమాజములేని గ్రామమేలేదు. పంజాబు దేశమునుండి దయానందస్వామి రాజపుత్రస్థానమునకువచ్చి యుదయపుర మహారాణా వారిచేత ప్రార్థితుఁడయి యానగరమున నెనిమిది మాసములు వసించెను. రాణావా రాకాలములో మనుస్మృతి చదివి రాజ్యతంత్రము నిర్వహించు విధమును నేర్చికొనిరి. రాజుగారిం జూచి యదివఱకెన్నఁడు పుస్తకముఁబట్టి యెఱుఁగని యుద్యోగస్థులు భక్తిశ్రద్ధలతో స్వామివద్ద చదువ నారంభించిరి. సంస్థాన మంతయుఁ గ్రమ క్రమముగఁ జక్కపడెను. అక్కడనున్న కాలములో రాణా యొకనాడు దయానందునిజూచి స్వామీ! మాయూరిలో గొప్పగోవెలయున్నది. దాని కెన్నియో మాన్యములున్నవి మీరు విగ్రహారాధన మంచిది గాదని చెప్పుట మానినపక్షమున మిమ్మాగుడికి మహంతునిజేసి యా సొత్తు మీయధీనముచేసెదనని పల్కెనటఁ! అప్పలుకులువిని దయానందుడు మహాకోపోద్దీపితుఁడై యట్టి దుర్భాషల నెన్నడు నాడవద్దనియు నెన్నికోట్ల ధనమిచ్చిన దాజెప్పదలచుకొన్నది చెప్పక మాన ననియు పలికి రాజుంగట్టిగ చీవాట్లు పెట్టెను. రాజుభయపడివానిపాదములపై బడి క్షమింపుమని వేడుకొనెను. అనంతరము దయానందుఁడు షాపూరు మహారాజుగారి పట్టణమునకుఁబోయి యచటకొన్నాళ్ళుండి వానికి రాజధర్మములునేర్పెను. అచట నుండగనే జోథ్‌పూరు మహారాజుగారు తమయూరువచ్చి తమ్ముపవిత్రులఁ జేయుమని వానింబ్రార్థించెను. ఆవేఁడుకోలు విని మన స్వామి జోథ్‌పురమును ప్రవేశించెను. అప్పటికి జోథ్‌పుర మెట్లుండవలయునో యట్లుండెను. మహారాజు నాంజహాన్ అను వేశ్యాంగన వలలోఁ దగులుకొని రాజ్యతంత్రములకు విముఖుఁడై యుండెను. మంత్రులు తక్కినయుద్యోగస్థులుతగని పన్నులు గట్టి ప్రజల వేధింపఁ జొచ్చిరి. రాజబంధువులు రాజుకంటె నెక్కుడు దుర్ణీతిపరులైరి. వేయేల సంస్థాన మంతయు వర్ణింపరాని దురవస్థలో నుండెను. దయానందుఁ డచ్చటికిఁబోయి సంస్థాపనస్థితిఁ గనిపెట్టి రాజును మంత్రులను మంచిత్రోవకు త్రిప్ప ప్రయత్నించెను. రాజు బాగుపడినచో తమయాటలు సాగిరావని దమపాలిటి కీయతి యెక్కడ దాపురించెనని విచారించి యుద్యోగస్థులు కొందఱు స్వామియెడ ద్వేషముఁబూనిరి. అది యటుండ వెలయాలుపొత్తులు మరగి నందు కతఁడు రాజును పలుమాఱులు చీవాట్లు పెట్టెను. ఒకనాఁడు దయానందసరస్వతి మహారాజును సందర్శించుట కంతఃపురమునకు వచ్చెను. ఆయన వచ్చునప్పటికి మహారాజుగారు నాంజహానుతోఁ గలసి ముచ్చటలాడుచుండిరి. స్వామి నల్లంతదవ్వులఁ జూచినంతనే మహారాజు దద్దరిలాడి మిండకత్తె నావలకుఁ బొమ్మని యానతిచ్చెను. అంతలో స్వామి యచ్చటకు వచ్చినందున నది యావలకుఁబోవునప్పు డాయనకంటఁ బడెను. పడుటయు కలియుగ శుకయోగీంద్రుఁ డగు నా మహాత్ముఁడు దుర్ణీతిపరుఁ డగు మహారాజు దుర్వినయము సహింపక కోపము పట్టఁజాలక తూలనాడి తలవాయునటుల చీవాట్లు పెట్టెను. ఆమాటలు చాటుననుండి వేశ్యాంగనవిని తనవలపు కానికిం దనకు నెడఁబాటు చేయఁదలంచిన యాపురుషునిఁ గడతేర్ప నిశ్చయించెను. ఆ సాయంకాలము దయానందునకు మహారాజుగారు పాలు పంపునప్పు డా దురాత్మురాలు పాలలో కొంచెము విసము గలిపి పంపించెను. అది యెఱుఁగక స్వామి యాపాలు పుచ్చుకొన్న వెంటనే చంపునది కాదు గావున వాని నొక్కమాసము బాధ పెట్టెను. మహారాజున కీసంగతి తెలిసినతోడనే సంస్థానమునందలి వైద్యుల నందఱ రప్పించి నేయవలసిన చికిత్సల నన్నింటిని చేయించెను. ఎన్ని చేసినను రోగము మాత్రము తిరుగక యంతకంత కెక్కువయ్యెను. ఆశ లేదని తెలిసినప్పుడు స్వామి జోథ్ పూర్ విడిచి యజమీరునకుఁ బోయెను. ఎంతబాధ పడుచున్న నబ్బా యన్నమాటయైన నోట రానీయఁడయ్యె. 1883 వ సంవత్సరము సెప్టెంబరు 30 వ తారీఖున విషప్రయోగము జరిగెను. అది మొద లొకనెల తీసికొని యా మహాత్ముఁడు భరతఖండముయొక్క దురదృష్టవశమున 31 వ అక్టోబరు తారీఖున శరీరము విడిచి శాశ్వతపదవి నొందెను. చనిపోవునాఁడు ముండనము చేయించుకొని స్నానముచేసి యందఱ నావలకుఁ బొమ్మని యొంటిగ నీశ్వరు ప్రార్థించి తెలివితో ప్రాణముల వదలెను. ఈశ్వరునియందు దృఢవిశ్వాసముతోడను, నిర్విచారముగను, నిర్భయముగను బ్రాణములు విడచుచున్న యా మహాయోగియొక్క చరమావస్థఁజూచి యద్భుతపడి యదివఱకు దేవుఁడు లేఁడని వాదించు నాస్థికుఁ డొకఁడు తక్షణము యాస్థికుఁ డయ్యెనఁట. ఆర్యసమాజ మతము స్థాపించి భరతఖండము నుద్ధరింపఁ దలఁచిన యా మహానుభావుఁడు తుదకీవిధముగా వేశ్యాంగనచేత మృతినొందవలసివచ్చెను.

దయానందుని జీవితము సంగ్రహముగఁ దెలిపితిమి గనుక నిఁక నాతని మతసిద్ధాంతము గుణగణములుఁ జెప్పవలసియున్నవి. ఆయన మతమునకు వేదమే ముఖ్యాధారము. వేదమే నిత్యమనియు నందుచేత నీశ్వరదత్తమనియుఁ దత్కారణమునఁ బరమప్రమాణ మనియు నతఁడు జెప్పుచువచ్చెను. ఆయన మతప్రకారము పురాణములు కల్పింపఁబడిన కట్టుకథలు. అబద్ధములు దుర్బోధకములు నగు నీపురాణముల మూలముననే మనదేశ మింత దుస్థితికి వచ్చినదని యాయన పలుమారు చెప్పుచువచ్చెను. వేదమునుతప్ప మఱియొక గ్రంథ మెన్నఁ డాయన ప్రమాణముగ గ్రహింపలేదు. వేదములు బ్రాహ్మణులొక్క రే చదువుట కేర్పడిన పుస్తకములు కావని యాయన నమ్మెను. నదులలో జలము, సూర్యుని తేజస్సు సకల జాతులవారి కెట్లుపయోగములుగ నున్నవో యట్లె వేదములుఁగూడ బ్రాహ్మణులకే గాక శూద్రులకు స్త్రీలకు మాలలకు సయితముఁ జదువఁ దగినవని యాయన చెప్పెను. వర్ణ భేదము పుట్టుకను బట్టి యుండఁగూడదని యతని సిద్ధాంతము. గుణమును బట్టియు వృత్తిని బట్టియు విద్యను బట్టియుఁ జండాలుఁడైన బ్రాహ్మణుఁడు గావచ్చును. విద్యాగుణహీనుఁడు బ్రాహ్మణుని కడుపునఁ బుట్టినవాఁడు ఛండాలుఁడే యగును. స్త్రీవిద్య తప్పక ప్రోత్సాహము చేయదగ్గదనియు నాడువాండ్రు చదువుకొననిపక్షమున దేశము మూర్ఖభూయిష్ఠమగు ననియు నతఁడు బోధించుచువచ్చెను. బాలికలకు యుక్తవయసు రాకమునుపు చిన్న తనమందె వివాహముసేయుట యశాస్త్రీయమనియు నతిబాల్య వివాహమువలన దేశ జనులందఱు బలహీనులై యున్న వారనియు నందుచేత మగవాని కిఱువదియైదు సంవత్సరములు వచ్చిన తరువాత నాడుదానికిఁ బదునారేండ్లు దాటినపిమ్మట వివాహములు జరుపవలసినదనియు నతఁడు వాదించెను. వితంతువులు మరల వివాహముఁజేసికొనఁ గూడదని వేదమునం దెచ్చటఁ జెప్పఁబడలేదు. కాఁబట్టి యా వివాహములు మంచివే యని యతని నమ్మకము. ఆయన సిద్ధాంతప్రకారము హిందువులందఱు విదేశములకుఁ బోయి నౌకాయాత్రలుచేసి రావచ్చును. అట్లు చేసినందువలన వారి జాతి మతములు చెడవు. వివాహాదులు వేదమంత్రములతోనే జరుగ వలయును.

ఆర్య సమాజమతములోఁ జేరినవారికిఁ గొన్ని వైదికకర్మలు గూడ విధింపఁబడియున్నవి. వేదములే ప్రమాణములని చెప్పుట, వైదికకర్మలు కొన్ని విధించుటతప్ప తక్కినవిషయములలో దయానందుఁడు బ్రహ్మసమాజమతస్థులవలె దేశాభివృద్ధికరము లగు మార్పులం జేసెను. ఈమహాత్ము డీమార్పులుజేసి ప్రాఁచీన వైదిక మతమును నిలుపఁ దలఁప పూర్వాచారపరాయణు లదియొక క్రొత్త మతముగ భావించి వానిని దూషించి యనేకవిధముల బాధించి యొకానొకప్పుడు చంపుటకుఁగూడఁ బ్రయత్నించిరి. ఒకమా ఱొక జమీందారుఁడు వానితోఁ గొన్ని యంశములు ముచ్చటించి తన వాదము పూర్వపక్ష మగుటచే నప్పుడె దయానందునిఁ గొట్టబోయి వీలు లేక యూరకొని రాత్రి దయానందుని జంపుమని నలువురు మనుష్యుల నంపెను. అప్పుడు దయానందుఁ డూరుబైట నొక చిన్న పాకలో నివసించుచుండెను. ఆనరహంతకులు నడిరేయివచ్చి స్వామిని బిలువ నతఁడు పాక వెడలి యావలకు వచ్చెను. పరమ శాంతమును పవిత్రతను వెదజల్లు నాతనివిగ్రహమును జూచినతోడనే హంతకులు తమచేయదలఁచిన ఘోరకృత్యమును మాని పాఱిపోయిరి. మఱి యొకసారి వైదికబ్రాహ్మణుఁ డొకఁడు భక్తిగలవానివలె వెళ్ళి విసము గలిపిన తాంబూలపుబీడా స్వామికిచ్చెను. కపట మెఱుఁగని యాస్వామి యదితిని విషబాధితుఁడై వమనమునకు మందుపుచ్చుకొని యెట్టెటో బ్రతుకగలిగెను. ఆయన కున్న ధైర్య మసాధారణము. ఎవరికిం జంకువాఁడుకాఁడు. ఒకమాఱు హిందూమతమును గూర్చి యొకగ్రామములో ముచ్చటించుచు నడుమ గ్రైస్తవమతమును ఖండించెను. అక్కడికివచ్చి యుపన్యాసము వినుచుండిన జిల్లాకలక్టరు దొరగా రుపన్యాసమును మానివేయవలసిన దనియు నట్లు చేయనిచో దండింపవలసివచ్చుననియు, వర్తమానమంపెను. అది విని స్వామి నవ్వి నన్నెవరు నేమి చేయ లేరని పలికి మఱింత దృఢముగనుపన్యసింపఁ దొడఁగెను. మఱియొకమాఱు స్వామి తన చిరమిత్రుఁ డగు రెవరెండుస్కాటుదొరగారిని జూచుటకు వారి చర్చికిఁ బోయెను. స్కాటుదొరకు స్వామియందు మిక్కిలి గౌరవముండుటచే వానిని లోపలకుఁ దీసికొనిపోయి వేదాంతవిషయ మేదియైన నుపన్యసింపుమని కోరెను. అట్లేయని స్వామి యుపన్యసింప నారంభించి క్రైస్తవ మతమును ఖండించి స్వమతమును బోధించెను. అంతమంది దొరల యెదుట క్రైస్తవుల గుడిలో క్రైస్తవమతమును ఖండించిన యాతని ధైర్య మెట్టిదో గనుఁడు.

మఱియొకసారి హిందువు లనేకులు స్వామిని గౌరవించి యొక దేవాలయములో నుపన్యాసమిమ్మని ప్రార్థించిరి. దేవాలయములో నుండుటచే విగ్రహారాధనము మంచిదికాదని యతఁడు చెప్పఁడని వారు తలంచిరి. స్వామి దేవవిగ్రహమున కెదురుగ నొక రాతిమంటపముమీఁద నిలిచి యుపన్యసించుచు నడుమ విగ్రహములమాట రాఁగా తన కాలిక్రిందనున్న మంటపురాళ్లెట్టివో గుడిలోనున్న యాదేవ విగ్రహము నట్టిదేయని పలికెను. అతని ధైర్యమునకు సభికు లంద రాశ్చర్యపడిరి. తాను నమ్మిన సంగతి నతఁడు మొగ మోటము లేక చెప్పఁగలిగెను, మంచిదని నమ్మినపని స్వయముగ నాచరించెను. ఆయనకు సత్యమునందుఁ గల యాదర మింతింత యనరాదు. ఒకసారి బ్రాహ్మణు లనేకులు వానివద్దకువెళ్ళి స్వామీ మీరెవరో యవతారపురుషులు మీమత మంతయు బాగున్నది. గాని విగ్రహములను దూషించుట బాగులేదు. విగ్రహదూషణ మానుదురేని మిమ్ము మేము గురువుగ నంగీకరింతు మని పలికిరి. ఆపలుకులువిని స్వామి కోపించి నన్ను మీరు గురువుగా నొప్పుకొనకున్న సరే నేను సత్యమును విడువను. నేను నమ్మిన దానిని జనులకు బోధించెదను. అని కఠినముగఁ జెప్పెను.

దివ్యజ్ఞాన మనుపేరుగల (తియసాఫికలు సొసయిటీ) వారు దయానందస్వామిని దమసంఘమున కధ్యక్షుఁడుగ నేర్పఱచిరి. కాని యాసమాజస్థాపకురా లగు బ్లానట్క్సీదొరసానిగా రొకగ్రామములో దేవుఁడు లేఁడని యుపన్యసించెనని విని యాస్వామి యా సమాజముతో సంబంధము వదలుకొనెను.

ఆయన శరీర మింగ్లీషువారి శరీరమువలె తెల్లగానుండును. మనుష్యుఁ డాజానుబాహుఁడు. ఆయన విగ్రహముఁ జూచినవారందఱికి తక్షణమే వానియందు భక్తికుదురును. దయానందుఁడు పరమ శాంతుఁడు, భూతదయాళువు, సుగుణరత్నాకరుఁడు. జితేంద్రియుడు, మహాపండితుఁడు నాలుగు వేదములకు స్వయముగ వ్యాఖ్యానము వ్రాసెను. శాంకరాచార్య విద్యారణ్యస్వాముల తరువాత నింతటి పండితుఁడు నింతటి మతబోధకుఁడు భరతఖండమున నుద్భవింప లేదని యనేకులు పలికిరి. ఆయన మతములో నిప్పుడు లక్షలకొలఁది చేరి యున్నారు. అందు కొందఱు మహారాజులుగూడ గలరు. ఆయన మతములో మనముచేరినఁ జేరకున్న దేశమునకు మహోపకారముఁ జేయఁదలఁచిన మహాత్ముఁడగుటచే దయానంద సరస్వతీస్వామి హిందువుల యందఱి గౌరవమునకుఁ బాత్రుఁడు.

ఈయన స్థాపించినమతము దేశాభివృద్ధికి మిక్కిలి సహాయకరముగ నున్నది. వేదమునే పరమప్రమాణముగా నితఁడు గ్రహించుటచేత నితనిమత ముత్తర హిందూస్థానములో మిక్కిలివ్యాపించు చున్నది. ఈ మతస్థులు వివాహములు వేదమంత్రప్రకారముగాఁజేసి కొందురు. మన మతములోనుండి మహమ్మదీయ మతములోఁగాని క్రైస్తవమతములోఁగాని కలిసిచెడిపోయినవారిని మరల నీమతస్థులు తమమతములోఁ గలుపుకొందురు. అంతియెగాక యితర మతస్థుఁ డెవండైన మన మతములోఁ జేరదలచుకొన్న పక్షమున వానిని గూడ నిరాటంకముగఁ జేర్చికొందురు. ఈ మతస్థులలో గొందఱు సన్యాసులై జనులందఱా సత్యమతము నవలంబించవలసినదని బోధించు చున్నారు. ఈ మతవ్యాప్తి నిమిత్తము లోకోపకారు లనేకులు పత్రికలు స్థాపించియున్నారు. శ్రీమంతులగు కొందఱు పాఠశాలలను, సర్వకళాశాలలను స్థాపించి తక్కిన పాఠములతోపాటు ఈ మత సిద్ధాంతములనుగూడ బాలురకుఁ జెప్పించుచున్నారు. అల్పకాలమున నీమత మింత యధికముగ దేశమున వ్యాపించుటకుఁ గారణము దయానంద సరస్వతీ స్వామియొక్క గొప్పతనమే యని తెలియవలెను. ఈయనవద్ద పాండిత్య మెంతయున్నదో సత్ప్రవర్తన మంతియ యున్నది. చిన్న తనమునందే వివాహ మక్కరలేదని వైరాగ్యమునుబూని సన్యసించిన మహాత్ముఁడు శంకరాచార్యుని తరువాత నీతఁడొక్కడే యని తోచుచున్నది. ఆయన పాండిత్యమును, శాంతమును, యోగ్యతనుజూచి రాజాధిరాజులు సయితము గడగడ వడంకి ఆయన చెప్పినచొప్పునఁ జేయుచువచ్చిరి. దక్షిణ దేశమం దార్యసమాజమత మిప్పటికి వ్యాపింపకపోవుటచే దయానందునిపేరు తరుచుగ నీ ప్రాంతములవారికిఁ దెలియదు. గాని యుత్తరహిందూ స్థానమున వాని పేరెఱుఁగనివారు లేరు. ఈయన చరిత్రమును జదివినవా రందఱును ఆయనవలెనె సత్యాదరము దైవభక్తి మొదలగు సద్గుణంబులు కలిగి వర్థిల్లునట్లు దైవ మనుగ్రహించుఁగాక.