మహాపురుషుల జీవితములు/సర్. మంగల్‌దాస్ నాథూభాయి

వికీసోర్స్ నుండి

సర్ మంగళదాస్ నాథూభాయి

మంగళదాస్ నాథూభాయి 1832 వ సంవత్సరం అక్టోబరు నెలలో బొంబాయినగరమున జన్మించెను. అతఁడు గుజరాతీలలో కపూల్ బనియాతెగలోఁ జేరినవాఁడు. అనఁగా నొక తెగ కోమటి యని అర్థము. అతని పూర్వులు కతేవారు ద్వీపకల్పమునందలి గోగ్లాయను పట్టణమునుండి వచ్చి బొంబాయిలో నివసించుచుండిరి. మంగళదాసుయొక్క తాతయగు రామదాసు మనోహర దాసు కాలమున నీ కుటుంబము ధనవంతమై ప్రఖ్యాతిఁ గాంచెను. ఇతని తండ్రియగు నాథూభాయి రామదాస్ శెట్టి కుమారుఁడు మంగళదాసు పదునొకండు సంవత్సరముల ప్రాయముగల గలవాఁడైనప్పుడే మృతి నొందెను. మంగళ దాసు కొంతకాల మాంగ్లేయభాష ప్రారంభించి పాఠశాలలోఁజదివి తరువాత నొక యుపాధ్యాయునిఁ బెట్టుకొని యింటివద్ద నింగ్లీషు నేర్చికొనెను. అతనికి బదునాఱవయేఁట రుక్మిణీభాయి యను నామె నిచ్చి బంధువులు వివాహముచేసిరి. తరువాత రెండుసంవత్సరములకు అనఁగా యుక్తవయస్సు వచ్చినతరువాతఁ వాని యాస్తి వాని కప్పగించిరి.

చిన్న తనమునుండియు మంగళదాసునకుఁ దనసంఘమునందుఁ బ్రబలియుండిన దురాచారములఁ దొలగించి కొన్నిమార్పులు చేయవలెనని తలంచుచుండెను. కపూల్‌కోమటులుచేయు హోళీపండుగల నాగరికులు చేయఁగూడదని మద్యపానాది దుర్వ్యాపారములు పెక్కు లుండెను. మంగళదాసాకార్యముల నివారించి పండుగ సలక్షణముగా జరుగునట్లు కొన్ని యేర్పాటులు చేసెను. ఆ యేర్పాటులు మంచివగుటచే జనసమ్మతములుగ నుండెను. గుజరాతీదేశమున


సర్. మంగళదాస్ నాధూభాయి

లగు నా మహారాజులు గురువులని పేరుపెట్టుకొని నిజముగా మహారాజులకన్న నెక్కువ భోగము లనుభవించుచు మతము పేరుపెట్టి శిష్యులకు దుర్నీతులను బోధించుటయేగాక యెంత మోటవాండ్రయిన సిగ్గుబడ వలసిన నీతిబాహ్య కర్మముల స్వయముగఁ జేయు చుందురు. ఈ గురువు లందరుఁ వల్లభాచార్య మతస్థులు. ఈ యాచార్యులు చేయు దౌర్జన్యములు చూచి సహింపలేక మంగళదాసు వారి దుర్మార్గముల బయలుపెట్టఁ దలఁచెను. అతని తలంపున కనుకూలముగ నా కాలమున కెరనన్‌దాస్ మాల్జీయను యధార్థవాది యొకఁడు బయలుదేరి సత్య ప్రకాశిక యను నొకపత్రిక స్థాపించి యందులో నీ మహారాజులు చేయు నీతిమాలిన పనులను వెల్లడింపుచురాఁగా మంగళదాసువానికిఁ దోడ్పడి కుడిభుజమయి పనిచేసెను. ఆ మహారాజులలో నొకడు మాల్జీగారిమీఁదఁ బ్రతిష్టా నష్టమునకు వ్యాజ్యము తేగా నప్పుడు నాథూభాయి వానికభయ మిచ్చి వేయివిధముల కనిపెట్టుటయే గాక తాను వాని పక్షమున సాక్ష్యముఁగూడ నిచ్చెను. మంగళదాసు సాక్ష్యము నేరమును విచారించిన జడ్జీలకు మంచియభిప్రాయమును గల్గించెను. అందుచేత తీర్పువ్రాయునప్పుడు జడ్జీలలో నొక రిట్లనిరి. "తనమతములోఁ జాల దురాచారము లున్నవని దృఢమయిన నమ్మకము తన మనస్సులో లేనిపక్షమున మంచిస్థితియు గౌరవమును గల మంగళ దాసువంటి పెద్దమనుష్యుఁడు కోర్టుకు వచ్చి, కులస్థులయొక్కయు బంధువుల యొక్కయు దూషణకైన నోర్చి యేల సాక్ష్యమిచ్చును." అదివర కతని వర్ణమునకు వంశపరంపరగా వచ్చునట్టి కులపెద్ద యొకఁ డుండెను. వర్ణపుఁ గట్టుబాటులలో నతఁడెంత చెప్పిన నంతజరుగుచు వచ్చెను. వర్ణవ్యవహారములెల్ల నొక్కమనుష్యుని పెత్తనముమీఁద వంశపరంపరగా వచ్చుట యనుచితమని చెప్పి, యెప్పటికప్పు డొక పెద్ద నేర్పరుచుకొమ్మని యుపదేశించి తనమాట వారందఱు వినునట్లు చేసెను. అంతతోఁ బోనీయక వెనుక పెత్తనముఁ జేసిన శెట్టి మీఁద వ్యాజ్యము తెప్పించి యతనియొద్ద ధర్మవ్యయనిమిత్తఁమున్న సొమ్ము తీసికొని కులస్థులు ధర్మమునిమిత్త మిచ్చిన సొమ్ము యెక్కువ మంది యభిప్రాయము ననుసరించి వ్యయము చేయవలసినదే కాని యొక్క కులపెద్దమాట చొప్పుననే జరుగఁగూడదని యేర్పాటు చేసెను. మంగళదాసు నాథూభాయికి మొదటినుండియు విద్యాభివృద్ధిఁ జేయవలెననియభిలాష గాఢముగానుండెను. 1862 వ సంవత్సరమున బొంబాయిపుర వాసులగు కొందఱు పెద్దమనుష్యులు మగపిల్లల కొకపాఠశాల స్థాపింపదలప దాని కాతడు సహాయము చేసెను. హిందూ దేశములో పెద్దపరీక్షలయందు గృతార్థులయి పిదప విదేశము లందు జదువ నుద్దేశించువారి నిమిత్త మత డిరువదివేలరూపాయల బొంబాయి యూనివర్సిటీ వారికిచ్చెను. 1864 వ సంవత్సరమున మంగళదాసుభార్య మృతినొందెను. ఆమెజ్ఞాపకార్థ మతండు కళ్యాణ నగరమున నేబదివేలరూపాయిల వ్యయముచేసి యొక ధర్మవైద్యశాల గట్టించి దాని ఖర్చుల నిమిత్తము మఱి యిరువదివేల రూపాయిలు దొరతనమువారి చేతికిచ్చెను. పునహానగరములో డేవిడ్ సాసూ ననువారు కట్టించిన ధర్మవైద్యశాలలో గతిలేని హిందూ స్త్రీల నిమిత్త మొగభాగము మూడువేలు కర్చుపెట్టి మంగళదాసు కట్టించెను.

1860 వ సంవత్సరమున గవర్నమెంటువారు కొత్తగావచ్చు బడి పన్ను (అనఁగా ఇన్‌కంటాక్సు) ప్రజలమీద వేసినప్పుడావిషయ మయిన సంగతులు విచారణచేయుట కీతని కమీషనరుగా నియమించిరి. కాని యాపన్నెట్లు వేయవలయు నను నభిప్రాయములో నితనికి దక్కిన కమీషనర్లకును సరిపడనందున నతఁడాపనిని స్వల్పకాలములోనే మానివేసెను. మంగళదాసునకు రాజకీయ వ్యవహారముల యందుగూడ జాల నభిలాషకలదు. అట్లుండుట చేతనే యతడు 1867 వ సంవత్సరమున 'బోంబే ఎసోసియేషను' అను నొకసంఘమును స్థాపించెను. ఈ సంఘము యొక్క ముఖ్యోద్దేశము హిందూ దేశస్థులకు రాజకీయవ్యవహారముల యందభిరుచి పుట్టించుటయే, ఈ కార్యములు చేయుటచేత నతఁడు ప్రజల విశ్వాసమునకు బాత్రుడయి బొంబాయి గవర్నరుగారి యాలోచన సభలో సభ్యుఁడుగాఁ బ్రజలవలన నేర్పరుపబడి యెనిమిది సంవత్సరము లాపని చేసెను. ఆ కాలములో జరుగు ప్రతివిషయమునుగూర్చి యతఁడు గాఢముగాఁ జర్చించుటయేగాక ప్రజాక్షేమముకై యధికారులతో నిర్భయముగ బోరాడుచు వచ్చెను. 1874 వ సంవత్సరమున మంగళదాసు దేహారోగ్యము సరిగాలేక నాపని మానుకొనినప్పుడు బొంబాయి గవర్నమెంటువారీ క్రిందియుత్తరమును వ్రాసిరి.

మీరు గవర్నరుగారి యాలోచనసభలోఁ జిరకాలము కష్టపడి పనిఁజేసి యిప్పుడు మానుకొనుచున్నందుకు లోకోపకారార్థముగ మీరు చేసిన పనినిగూర్చి మేము ప్రశంస జేయకపోవుట పాడిగాదు' 1872 వ సంవత్సరము 1 వ మే తారీఖున బొంబాయి గవర్నరుగారగు సర్ సేమోరీఫిర్జరాళ్డు దొరగారు మంగళదాసునకు సి. ఎస్. ఐ. అను బిరుదమునిచ్చుచు నీ క్రిందివిధముగాఁ జెప్పిరి.

"మంగళదాసుగారూ! ఈ బిరుదమునకుఁ దగిన యుత్తమ పురుషులపేళ్ళు కొన్ని డెలియజేయుమని పై యధికారులు నన్ను గోరగా నేను శ్రీవిక్టోరియా మహారాజ్ఞిగారికి సంతోష పూర్వకముగా మీపేరు వ్రాసిపంపితిని. దయాస్వరూపిణియగు శ్రీవిక్టోరియామహాదేవి గారు నాచేసిన విన్నపము నాదరించినారు మీ స్వతంత్రప్రవర్తనము మీలోకోపకార పరాయణత మీరీ బిరుదునకు తగుదురని ఋజువు చేసినవి. అందుచేత నెంతో సంతోషముతోనే నీబిరుదములను మీకిప్పుడు సమర్పించుచున్నాను. ఈబిరుదులు చిరకాలమువహించుటకు భగవంతుడు మీ కాయు రారోగ్యము లొసంగుఁగాక," 1875 వ సంవత్సరమున విక్టోరియా రాణిగారు వానికి సర్ అనుబిరుదమునిచ్చిరి. ఈ బిరుదుపొందిన హిందువులలో నితఁడే మొట్ట మొదటివాడు. ఆ సంవత్సరమందే విక్టోరియారాణిగారి జ్యేష్టపుత్రులును మనప్రస్తుత చక్రవర్తిగారు నగు ఎడ్వర్డుగారప్పుడు యువరాజుగానుండి మనదేశమును జూడవచ్చి బొంబాయి నగరమునకుఁబోయి మంగళదాసు యొక్క యిద్దఱుకుమారుల వివాహమహోత్సవ కాలమునను స్వయముగ వచ్చి వానిని గౌరవించెను. యువరాజుగారు స్వయముగ నింటికి వచ్చిన గౌరవము హిందువులలో మంగళదాసునకుఁ దప్ప మఱి యెవ్వరికిని లభింపలేదు. మంగళదాసు నింటికి వివాహము నిమిత్తము వచ్చిన చుట్టము లందఱు మహానందభరితులయిరి. తనకు గలిగిన యీ యపూర్వ గౌరవముచేత మహానందభరితుడయి మంగళదాసు తనకృతజ్ఞతను యువరాజునకు దెలుపుకొనెను. యువరాజును జూచుట కాసమయమున వర్తకు లనేకులు వచ్చిరి. ఆవచ్చిన వారిలో లక్షాధిపతులు కోటీశ్వరులు నగువారిం గొందఱిని యువరాజునకు జూపి పిమ్మట వాని కత్తరు పన్నీరు తాంబూలములిచ్చి వారినిబంపెను. ఆ సమయమున మంగళదాసునియింట పువ్వులు కుప్పలు కుప్పలయి పడెను. తనయింట జరిగిన వివాహము యువరాజదర్శనము నను నీ రెండుసంగతుల జ్ఞాపకార్థము మంగళదాసు బొంబాయినగరములో నిరువదియైదువేల రూపాయలు మూలధనముతో నొక సత్రము వేసెను. ఆ మూలధనము పేరు సర్ మంగలదాసు నాథూభాయి కపూ నిరాశ్రయల్ నిధి. అదిగాక మఱి యిరువదియైదు వేల రూపా యిలు మూలధనమిచ్చి గుజరాతీ కోమటులందఱి యుపయోగము నిమిత్తము వాకేశ్వరయను గ్రామమున నొక యన్నసత్రము వేయించెను.

1877 వ సంవత్సరమున శ్రీ యువరాజుగారు హిందూదేశమును జూచినందులకు కొందఱిని గౌరవింపదలచి దొరతనమువారు కొన్ని వెండిపతకములు చేయించి యందొకదానిని మంగళదాసు కిచ్చిరి. ఆపతకమును మంగళదాసున కప్పటి బొంబాయి గవర్నరు గారగు సర్ రిచార్డుటెంపిల్ దొరగారు స్వయముగా సమర్పించుచు నా సమయమున నిట్లని చెప్పిరి. "శ్రీ రాణీగారిచేత నీయబడిన యీ పతకమును మంగళదాసునకు సమర్పించుట కింతకన్న మంచి సమయము దొరకదు గనుక నిప్పుడే యీ మిత్రులయెదుట దీని నిచ్చుచున్నాను. అతని నిదివఱకే నెఱింగియుండిన యీ తెల్లదొర యొక్కయు స్వదేశస్థులయొక్కయు సముఖమున మంగళదాసు దేశమునకు బొంబాయినగరమునకు దనసంఘమునకుఁ జేసినయుపకారములను వాని యౌదార్యమును వాని మనశ్శుద్ధిని వేరే నేను వేయినోళ్ళ బొగడ నక్కరలేదు. ఇంగ్లీషువారి యధీనములోనున్న హిందూస్థానములో నెల్ల శ్రేష్ఠమైనది గుజరాతీదేశము. ఆ దేశస్థులలో మిక్కిలి గొప్పదియగు కోమటి తెగలో జేరినవాఁడు మంగళదాసు. అతని సంఘమునకు నతను తగిన ప్రతినిధియని మీరందఱొప్పుకొనఁదగిన యంశమే, గడచిన నూరుసంవత్సరములనుండి వాని బూర్వులు దొరతనమువారిచేతఁ బ్రజలచేతఁ జాల గౌరవింప బడుచున్నారు. ఏటేట వారి యైశ్వర్యము వృద్ధి యగుచున్నది. ఇతఁడు బొంబాయి సంఘమునకు ప్రధాన పోషకుఁడు. ఈయన బొంబాయి రాజధానికి వెనుకటి గవర్నరుగారకు సర్ బార్టిల్ వ్రయర్‌గారి యాలోచనసభలో నెనిమిదేండ్లు సభ్యుడుగా నుండెను. అతడు దానములుచేయునపుడు కుడిచేయి ఇచ్చినదానిని నెడమచేయి నెఱుగదన్నట్లు దానము సేయువాడు. కళ్యాణనగరమున కట్టించిన ధర్మవైద్యశాలయు బొంబాయినగరమున స్థాపించిన బాలికపాఠశాలయు వాని యౌదార్యమును ఘోషించుచున్నవి.

మంగళదాసునాథూభాయి ఆ 1890 వ సంవత్సరమున లోకాంతరగతుడయ్యెను. అతడు మృతినొందునప్పు డొక్కమరణ శాసనము వ్రాసి యందు రమారమి యెనిమిదిలక్షల రూపాయలు ధర్మకార్యముల నిమిత్తము వ్యయముచేయుమని నియమించెను. అందు ముఖ్యదానములివ్వి. వాకేశ్వరగ్రామమువద్ద ధర్మవైద్యశాల గట్టించుటకు డెబ్బదివేలరూపాయలు. వానిపేరస్థాపింపబడిన బాలికా పాఠశాలకు రెండు వేలరూపాయలు, తన తెగకోమటులలో బీదలకు సాయముచేయుటకు వేయిరూపాయలు, వాకేశ్వరధర్మశాల మరమ్మతు చేయుటకయిదువేల రూపాయలు. ఇంగ్లాండునకు బోయి చదువుకొను హిందూవిద్యార్థుల నిమిత్త మిదివఱకిచ్చిన ఇరువది వేలు గాక మఱియు గొంత ధనమిచ్చునట్లు మరణ శాసనములో వ్రాసెను.