మహాపురుషుల జీవితములు/సర్. జమ్సేట్జీ జీజీభాయి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
Mahaapurushhula-jiivitamulu.pdf


సర్ జేమ్సేట్జీజీజీభాయి

సర్ జేమ్సేట్జీ జీజీభాయి

ఘూర్జర దేశమున బరోడా యను స్వదేశ సంస్థాన మొకటి కలదు. అందలి నవసారీ యను గ్రామమున జీజీభాయి 1783 వ సంవత్సరము జూలై 15 వ తారీఖున జన్మించెను. వాని తలిదండ్రులు పేదలయ్యు గౌరవాస్పదులయి యుండిరి. ఇతఁడు పారసీజాతివాఁడు. ఈ పారసీలు ఘూర్జరదేశమందును మహారాష్ట్రదేశమం దంతటను వసించుచున్నారు. వీరు విద్యలయందు రూపమునందు ధనమునందు నసమానులు.

జీజీభాయి చిన్నతనమందేమాతాపితృవియోగ మొందుటచే మామగారియొద్ద బొంబాయినగరమున నుండవలసి వచ్చెను. కొంత కాలము ముందు పని నేర్చుకొని పిమ్మటనతఁడు మామగారితోఁ గలసి వర్తకవ్యాపారముఁ జేయ నారంభించెను. మన స్వదేశములోనే గూర్చుండి యెంతవర్తకముఁ జేసినను విశేషలాభములు గలుగ వనియును విదేశములతో వర్తకము చేయుటచేతనే చాలలాభములు గలుగుననియును జీజీభాయి గ్రహించి తన బంధువుఁడగు మఱియొక పారసీ వర్తకునితో గూడి పదునాఱవయేటనే చీనా దేశమునకుఁ బోవ పయన మయ్యెను.

స్వదేశము విడిచి వెళ్ళునప్పు డతఁడు తన యాస్తినంతయు వెంటఁ దీసికొనిపోయెను. ఆ యాస్తి యెంతయందు రేని నూటయిరువది రూపాయలు. చీనాదేశమున కరిగి కొలఁదికాలమే యచ్చట నుండి స్వదేశమునకు వచ్చి స్వయముగఁ దానె వ్యవహరింపఁ దలఁచి పెట్టుబడి నిమిత్తము ముప్పదియైదువేల రూపాయలు ఋణముఁ దీసికొని యతఁడు మరల చీనాకుఁ బోయెను. ఇదిగాక యతఁడు చీనాకు నాలుగుసారులు పోయెను. అందు 1806 వ సంవత్సరమునఁ జేయఁబడిన కడపటి ప్రయాణము కొన్ని యపాయములతో నిండి యున్నది. ఆ ప్రయాణమున బ్రన్సువిక్కను పేరుగల యోడమీఁద దా ననుభ వించిన కష్టము లన్నియు జీజీభాయి గుజరాతీ భాషలోఁ దన మిత్రుని కొక యుత్తరము వ్రాసెను. ఆ యుత్తరము లోని సంగతులఁ గొన్నిఁటి నిందుఁ బొందుపరచు చున్నాము.

"మే మెక్కిన యోడను ఫ్రెంచివారు పట్టుకొనిరి. మా దురదృష్టమునకుఁ దోడు మా యోడ కొంతనడచి మెరకయెక్కెను. ఒడ్డునకు మమ్ము బోనిమ్మని యోడమాలిమిని మే మెంతయు బ్రతిమాలితిమిగాని తన పై యధికారి యుత్తరువు లేదని యతడు మా కోరిక నిరాకరించి కొంతదూరము సాగిపోయిన వెనుక మమ్ము దిగనిచ్చి మా సరకులు మా కిచ్చెదమని వాగ్దానము చేసెను. ఆ మరునాఁడు అడ్మిరల్ (అనఁగా నావకు సర్వాధికారి) మాకు దర్శనమియ్య మా సిలుగుల మేము వానికివిన్నవించుకొని మమ్మొకదరిఁ జేర్పుమని ప్రార్థించితిమి. ఆయన మాయం దనుగ్రహించి మా మూటలు ముల్లెను పుచ్చుకొమ్మనియెను. గాని మా వర్తకపు సరుకులు మాత్రము మాకియ్య నొల్లడయ్యెను. ఆయన పిమ్మట నావద్దనున్న బియ్యపుమూట రెండు మల్లుతానులు మొదలగు కొన్ని వస్తువులం దీసికొని నా బట్టలపెట్టె నాకిచ్చెను. బియ్యపుబస్తా యొకటి యిమ్మని నేను వేడుకొంటిని గాని యా మహాత్ముఁడు నా మొఱ వినఁడయ్యె. అప్పుడు నా సరకులన్నియు నొక పెట్టెలో వేసికొని తక్కిన వారితోఁ గలిసి యోడ దిగిపోతిని. ఓడదిగి యొడ్డు చేరిన పిదప మేము 'కెప్టెన్ గ్రాంటు' అను నొక యింగ్లీషు నావికుని జూచితిమి. ఆయన మా యలమటవిని జాలిపడి యెంతయు నాదరించె. ఎట్లయినను ఫ్రెంచివారిచేతనుండి తప్పించుకొంటిమని సంత సించితిమి. మాలో 'టర్నర్‌' అను పేరుగల యొక యింగ్లీషు దొరగా రుండిరి. ఆయనవద్ద మూడువేల డోలరుల సొమ్ముండెను. ఆ సొమ్ముతో మేము కొంతకాలము గడపితిమి. ఒక డోలరు రెండు రూపలన్నరకు సమానము. ఆదినములలో బెద్దబియ్యపు కాటకము సంభవించుటచే ముప్పదియైదు డోలరు లిచ్చినను మాకొక బియ్యపు బస్తా దొరకుట యరుదయ్యెను. అందుచేత నొక్కొక్క మనుష్యుడు దినమున కరపౌనుబియ్యముకంటె నెక్కువతినగూడని నియమ మేర్పఱచుకొంటిమి. గొఱ్ఱెమాంస మొకటిమాకు కావలసినంతలభించుచు వచ్చెను. ఈవిధముగా గష్టములఁబడుచు గ్రాంటుదొరగారిదయచేత మేమెట్టులో మఱియొకయోడ నెక్క గలిగితిమి. మందభాగు లెక్కడికి బోయినను విపత్తులు విడవవుగగా! ఆయోడ కలాసులకు మాపై నిర్హేతుకాగ్రహముగలిగెను. అందుచేవారు మమ్మవమానింపఁదొడఁగిరి. అంతియగాక నేను నాతోనున్న నలుగు రింగ్లీషువారు మఱియొక మహమ్మదీయుఁడు మేమాఱుగురముగలసి తన్ను జంపుట కొకకుట్ర పన్ను చున్నారమని మాపయి ననుమానపడి యా యోడ యధికారి మాకు సంకిళ్ళు వేయించి యంతతో బోక మాకింకను దారుణదండన విధింతునని బెదరించెను. కీడులో మేలన్నట్లు నాతోనున్న నలువురి దొరలలో నొకనికి ఫ్రెంచిభాష వచ్చియుండెను. ఆభాషతో నతఁడు నావ యధికారితో మాస్థితిగతుల విస్పష్టముగ జెప్పి మాసామానులు పరీక్షింపుమని వేడగా నతడు సరేయని శోధించి మావద్ద ప్రాణములు తీయు నాయుధము లేవియు లేవని గ్రహించి మమ్ము విడిచి పుచ్చెను. ఇట్లు మాకష్టము లనంతములయి యుండెను. అటులుండ నాసమయమున డెన్మార్కు దేశమువారి యోడ కలకత్తాకు బోవు చుండెను. గ్రాంటుదొరగారు మమ్మాయోడమీద నెక్కించి బంగాళాదేశమునకుఁ బంపుదుమని వాగ్దానముచేసి యాయోడ యధి కారితో జెప్పనా నావమీఁద స్థలము లేదని యతఁడు బ్రత్యుత్తర మిచ్చెను. మేమేదోయొక మూల నిరికికూర్చుండి కాలక్షేపము జేయఁగలమని మరల వారికి వర్తమానమంప నతఁ డంగీకరించి నన్నును నాతోనున్న తురకవానిని నావయెక్కించుకొనుటకు నెనిమిదివందల డాలరులు (అనగా రెండు వేలరూపాయలు) కావలయునని యడిగెను. ఈ యోడ కిరాయి మిక్కిలి యెక్కువగా నున్నదని యభిప్రాయపడి గ్రాంటుదొరగారు కొంతతగ్గింపుమని మాపక్షమునబూని కొంతవఱకు వాదించిరి. కాని యాయోడ యధికారి పట్టినపట్టు విడువనందున గ్రాంటుగారు స్థితిగతులుచూచి యాయోడ దాఁటిపోయినచో మరల నేయోడయు దొరకదనియు దొరకినను కిరాయి యింతకంటె తక్కువ యుండదనియు నీ నడుమ గొఱ్ఱెమాంసము దక్క భోజనపదార్థము లేవియు దొరకవు గావున మిక్కిలి యవస్థ పడవలసియుండు ననియు జెప్పి యా బేరము నొప్పుకొమ్మని నా కుపదేశించిరి. ఆయుప దేశమును శిరసావహించి తురకయు నేనును చెరి యెనిమిదివందల శిఖారూపాయిలు కలకత్తాలో నోడయధికారుల కిచ్చునట్లొప్పుకొని పత్రముల వ్రాసియిచ్చి యోడయెక్కితిమి. మొదట మేమెక్కిన యోడలోనుండి యొకబియ్యపుబస్తా నెట్లయిన మాకిప్పించుమని వేడుకొంటిమి. అతఁ డట్లేయని యాయోడయధికారి కొక చీటివ్రాసి పంప నతఁడు మా కోరిక నిరాకరించె. అప్పుడు ముప్పదిడోలరులకు మేము మణుగున్నర బియ్యము కొంటిమి. అదిగాక నేను వెనుక దొంగతనముగా దాచుకొన్న బియ్య మొక యరబస్తాయుండెను. ఈసరకులతో బయలుదేరునప్పుడు గ్రాంటుదొరగారు మే మెక్కిన యోడయధికారితో మమ్ము దయతో నాదరింపుమని చెప్పెను. ఎవ రెంత జెప్పినను మాదురదృష్టము మమ్ము విడువదయ్యె పదునాఱువందల రూపాయలు పుచ్చుకొని యాయోడయధికారి తురకను నన్ను సామాన్యపు డింగీపడ వలలోఁ గూర్చున్నప్పుడున్నంత సౌఖ్యమైనను లేనిచోటుల గూలవేయుటయేగాక యెంత యనాదరణము సేయవలయునో యంత యనాదరణము చేసెను. మాకును మఱియేడుగురు మనుష్యులకును వంట చేసికొనుటకుఁ ద్రాగుటకు దినమున కొకకుండెడు నీ రతఁడు పంపుచు వచ్చెను. ఆయోడ యెక్కినది మొదలు పదునైదు దినములవఱకు మా మందభాగ్యముచేత మేము పడిన యిడుమ లిట్టిట్టివని నేను వ్రాయజాలను. తరువాత నాలుగైదు దినములకు (అనఁగా డిశంబరు 5 వ తారీఖున నర్థ రాత్రమున) మేము కలకత్తానగరము సురక్షితముగాఁ జేరితిమి."

ఇట్లు చచ్చిచెడి యెట్లో కలకత్తాచేరి జీజీభాయికొన్ని నాళ్ళచ్చటనుండి బొంబాయినగరమునకుబోయెను. ఆ పురమున కొంతకాల ముండి మరల చీనాదేశమున కింకొకసారి నావికాయాత్రచేసి 1857 వ సంవత్సరము తిరిగివచ్చి బొంబాయిపురమునస్థిరముగఁ గాపురముండెను. అదిమొదలుకొని వర్తకసమయమున నతఁడు తిరిగి ప్రయాణము చేయ లేదు. ఆనగరమునందే యతఁడు ముగ్గురు భాగస్వాములతోఁ గలసి యొకవర్తక సంఘముస్థాపించి మిక్కిలి పాటుపడి జాగరూకతతో వ్యవహరించి 1827 వ సంవత్సరమునకు రమారమి రెండుకోట్లరూపాయలు సంపాదించెను. ఆహాహా! నూటయిరువదిరూపాయిలతో జీవయాత్ర నారంభించిన యీపేద యిరువదియైదు సంవత్సరములలో నెంత ధనికుఁడయ్యెనో చూడుఁడు. దీనికిఁగారణమేమి! మనకు దైవ మింతియేయిచ్చినని నింద్యమయిన సంతుష్టినొంది "కూపస్థమండూకమువలె" స్వదేశముననేయుండి యిడుమలఁబడక పిన్న నాటనుండియు విదేశములలోవిరివిగా వాణిజ్యమును సేయుటయే దీనికిఁ గారణము. అతఁడు ధన మార్జించు నుపాయ మెంత బాగుగ నెఱిఁగి యుండెనో పాత్రాపాత్ర మెఱిఁగి బీదలనిమిత్తము దానిని వినియోగించు నుపాయము నంతబాగుగనే యెఱింగియుండెను. పునహా బొంబాయి సూరతు మొదలగు పట్టణములు ఘూర్జర దేశమునందలి నవసారీ మొదలగు గ్రామములు చూచినవారికి జీజీభాయి యొక్క యౌదార్యము భూతదయాళుత్వము తప్పక తెలియును. కృపాసముద్రుఁడగు నీపారసీ కులస్థుడు మహారాజు లిచ్చినట్లు మితిమీరిన ధనరాసులు దానములిచ్చి ధర్మవైద్యశాలలు పాఠశాలలుఁ చెరువులు, సత్రములు, బాటలు, నూతులు మొదలగువానిని నిర్మింపఁ జేసి లోకోపకార పారీణుఁ డయ్యెను. ఈదానములు చేయుటలో జాతి మత వర్ణ భేదముల నతఁడెన్నడు పాటింప లేదు. ఈదానకర్ణునికీర్తి సకలదేశవ్యాప్తమగుటచే శ్రీ విక్టోరియా మహారాజ్ఞిగారు వాని యౌదార్యమునకు మెచ్చి 1842 వ సంవత్సరమున నైటను బిరుదము నిచ్చెను.

అత్యంతగౌరవసూచక మగునీబిరుదు పొందినవారిలో హిందూదేశమున జీజీభాయియే మొట్టమొదటివాఁడు. ఆబిరుదు వచ్చినప్పుడు వానిస్వకులమువారగు పారసీలు చాల సంతసించి వానిని గౌరవించిరి. ఆబిరుదమును వాని కిచ్చినపుడు బొంబాయి గవర్నరు గారగు సర్ జార్జీ ఆండ్రసన్ దొరగారిట్లు పలికిరి "నీవు రాజు లిచ్చినట్లు దానము లిచ్చి మానవకోటి దుర్దశను దొలఁగించి యీ యపూర్వగౌరవమునకుఁ బాత్రుఁడవయితివి" 1843 వ సంవత్సరమునం దతఁడు బ్రిటిషుగవర్నమెంటువారివలన నొక బంగారుపతకమును బహుమానముగఁ బడసెను. అమితమగు దేశాభిమానము నౌదార్యము కలుగువాఁడగుటచే వాని కాపతక మీయఁబడినట్లు దానిమీఁదనే వ్రాయబడియున్నది. అప్పటి బొంబాయి గవర్నరు గారగు సర్ జార్జి ఆర్తరుదొరగా రాపతకమును ఆయన కిచ్చునప్పుడిట్లనిరి. "నీవు దేశోపకారార్థము కేవల సత్కార్యముల నిమిత్తమే తొమ్మిదిలక్షలరూపాయిలు దానము చేసియుంటివని యనేకులవలన వినియుంటిని. ఇట్టి యౌదార్యము దేశాభిమానము సూచించు ధర్మకార్యములను శ్రీరాణిగారు తగునట్లు గుర్తెఱుంగుదురుగాక."

అతని ధర్మకార్యములు ప్రత్యేకముగ నొకజాతికి నొక దేశమునకు యేర్పడియుండ లేదు. ఆంగ్లేయసైనికులు స్వదేశము సిపాయిలుగూడ మంచునెలవులగు కాబూలు కొండలనడుమ యుద్ధ భూములకు బలియగుచున్నప్పుడు ఐర్లండునందును స్కాట్లండునందును గాటంబులగు కాటకంబులచే జనములు మలమలమాడి హాహా కారములతో నలమటబడినప్పుడుఁ క్రిమియాయుద్ధమునందు దిక్కు లేక శూంశిఖామణు లనేకులు నిహతులైనప్పుడు ననాధలగువారి భార్యలు బిడ్డలు దురవస్థ ననుభవించుచుండ వెనుదీయక యీదాన కర్ణుఁడే గొప్పసహాయములఁ జేయుచు వచ్చెను. ఫ్రాన్సుదేశమున 1856 వ సంవత్సరమున నొకనదిపొంగి దేశమునకు మిక్కిలి చెరుపు చేసెను. ఆవరదవలన విపత్తులఁ బడినవారికిఁ బంచిపెట్టుమని యిక్కడనుండి యైదువేల రూపాయిలంపెను. ఆమహోపకారమునకు ఫ్రెంచివారు మిక్కిలి సంతసించి వానికిఁ గృతజ్ఞులయి వందనములఁ జేసిరి.

1856 వ సంవత్సరమున జీజీభాయియొక్క విగ్రహమొకటి నిర్మించి బొంబాయినగరమునఁ బెట్టవలయునని జనులు సభచేసిరి. ఆ సభకప్పటి గవర్నరు గారగు నెల్ఫినిష్టన్ ప్రభువుగా రగ్రాసనాధిపతిగా నుండిరి. ఆవిగ్రహమునకు రమారమి యేఁబదివేలరూపాయి లయినవి, ఆతఁడిప్పుడు లేక పోయినను వానికీర్తి దేహమో యన్నట్లా విగ్రహ మిప్పటికిని బొంబాయి పురమందిర మలంకరించు చున్నది. ఈతని భార్య దాతృత్వమున నీతని మించినది. బొంబాయినగరమునకు పాలసత్తీయను చిన్న ద్వీపమునకు నడుమనున్న వంతెన యీతని భార్యచేసిన దానమువలననే కట్టఁబడినది. అ వంతెన ముగింప బడినప్పుడు గవర్నరుగారగు సర్ జార్జి ఆర్తరు దొరగారు జీజీభాయిగారి భార్యను గొనియాడుచు నీక్రింది విధముగాఁ బలికిరి.

"1841 వ సంవత్సరమున వర్షకాలమం దొకనాఁడు రమారమి యిరువది పడవలు బొంబాయినుండి పాలసత్తికి గొందఱు మనుష్యులం తీసికొనిపోవుచు మునిఁగిపోయెను. ఈ యుపద్రవముచే జను లనేకులు మృతినొందిరి. జీజీభాయిగారి భార్య యతిదారుణమగు నీ వర్తమానమును విని ఖేదపడి యక్కడ యొకవంతెన దొరతనమువారేల కట్టింపఁగూడదని కొందఱి నడిగి ప్రాణాపాయమును నివారించు నట్టి సత్కార్యములను జేయుటకు దొరతనమువారు సొమ్ము వెచ్చించుటకు బూనుకొనరనివిని తన స్వంత సొమ్మిచ్చి యా మహాకార్యమును తానే నిర్వహింప నిశ్చయించుకొని యాపని కెంతసొమ్మగునో తెలియఁజేయుమని యింజనీరుల నడిగెను. అప్పుడు కొంద ఱింజనీర్లు చక్కఁగా విచారించి యా కార్యమున కఱువదియేడు వేల రూపాయిలు సరిపోవునని యంచనా వేసిరి. సాధారణముగా గొప్ప పనులకుఁ గావలసినసొమ్మునకు ఇంజనీరులు వేయు నంచనాలకు సంబంధముండదని మీరంద ఱెఱుంగుదురు. ఈ వంతెనకు వారు వేసిన యంచనాసొమ్ము నిజముగా గావలసిన సొమ్ములో మూడవవంతై యుండెను. దయాస్వరూపిణి యగు జీజీభాయి దొరసాని యింజనీరువారు కోరినసొమ్మంతయు (అనఁగా నఱువదియేడు వేల రూపాయలు) నిచ్చి తన సంకల్పించిన ధర్మకార్యము నెఱవేరునని యువ్యిళులూరుచుండ నింజనీరులు సొమ్మంతయుఁ బనిలో మూడవ వంతునకే సరిపెట్టి కాళ్ళుచాపుకొని కూర్చుండిరి. పనియాగిపోయి నదనివినియాయిల్లాలు మరల నిరువదిమూడువేల రూపాయలునిచ్చి (అనఁగా లక్షపూర్తిచేసి) పని కొనసాగింపు మనియెను. ఆ ధనముతోఁగూడ కార్యము తుదముట్టకపోవుటచే నామె వెండియుఁ బదివేలరూప్యము లిచ్చెను. ఆ సొమ్మునుసరిపోకపోవుటచే బొంబాయి దొరతనమువారు హిందూదేశ పరిపాలనము సేయుచున్న ఈస్టిండియా కంపెనీ డైరక్టర్లకు ధన సహాయము చేయిమని వ్రాసిరి. ఆ డైరక్టర్ల వద్దనుండి యెంతకాలమునకు బ్రత్యుత్తరము రాకపోవుటచే జీజీభాయి దొరసానిగారు మిక్కిలిచింతించి యెట్లయిన ప్రారంభింపఁబడినగార్యము కొనముట్టింపవలయునని యదివఱ కిచ్చిన మొత్తముగాక మరల నొకసారి నాలుగువేలు వేరొకసారి యాఱువేలు మరియొకసారి పదివేలు మొత్తము మీద నిరువదివేలరూపాయిలనిచ్చెను. ఈధనముతో నిదివఱకామె యిచ్చిన ధనమంతయు లక్షముప్పదివేలయ్యెను. చాలకాల మాలస్యము చేసిచేసి యింగ్లాండులోని డైరక్టర్లు ఎట్ట కేల కటమీద గావలసిన సొమ్మంతయుఁ దామే పెట్టుకొని యా కార్యము సమగ్రముగఁ జేయింతుమని యానతిచ్చి యాప్రకారము పనిచేయించిరి. కానికొంత సొమ్ము వ్యయముచేసిన తరువాత డైరక్టర్లు సొమ్ము లేదని నెపమున పని నిలుపుసేయు మన్నట్లు మొన్ననే నాకుఁ దెలిసినది. ఈ మాట వినినతోడనే దానము చేయుటకు విసువులేని యా జీజీభాయి దొరసానిగారు మునుపిచ్చిన సొమ్ముగాక వంతెన పూర్తిసేయుట కిఱువది రెండువేల రూపాయిలును గట్లువేయుట కైదువేల రూపాయలును దయచేసి యున్నది. దయాతరంగిణి యగు నీసాధ్వి యిప్పటికొక లక్షయేబదివేల రూపాయిల నీయొక్క కార్యమునకే యిచ్చియున్నది. దేశస్థులలో నిరుపేదలు తమకు గావలసినవస్తువులను తాము తెచ్చుకొనజాలరు గావున వారికిం గలుగు లోటుపాటుల సవరించుభారము భాగ్యవంతులదని యాసాధ్వీ యభిప్రాయము" అని యాగవర్నరుగారు కొండొకసేపామెను మఱికొండొకసేపామెభర్తను వారుచేసిన పాత్రదానములనిమిత్తమయి కొనియాడి మొత్తముమీద జీజీభాయి కుటుంబమువారు ధర్మ కార్యముల నిమిత్తము లక్షపౌను లనఁగా నిప్పటిధర ప్రకారము పదునైదులక్షల రూపాయిలు దానమిచ్చెనని సఘ్యలకుఁ దెలిపెను.

1858 వ సంవత్సరమున విక్టోరియాదేవిగారు మనదేశమును కంపెనీ యధీనమునుండి తనయేలుబడి క్రిందికిఁ దీసికొనినప్పుడు జీజీభాయిగారికి 'బేరొనెట్‌' అను బిరుదము నిచ్చిరి. ఈగౌరవ మంతకు ముందేగాక యిటీవల సయితము మనదేశస్థులలో నెవరికిం గలుగ లేదు. దయాసాగరుఁడగు నీ మహాదాత 1859 వ సంవత్సరమున ననఁగా డెబ్బదియాఱేండ్లప్రాయమునఁ గాలధర్మము నొందెను.

ఆయన చనిపోయినాఁ డనుమాటయేకాని చేసినసత్కార్యములవలన నిప్పటికి జీవించియున్నాఁడని మనము గ్రహింపవలయును. ఈ జీజీభాయిగారి చరిత్రమువలన మనము నేర్చికొనవలసిన నీతులు కొన్ని యున్నవి. అందు మొదటిది స్వతంత్రవృత్తిసంపాదించుకొనుట మన దేశములోఁ జదువుకొన్నవా రందఱు దొరతనమువారి నాశ్రయించి యేదో యుద్యోగము సంపాదించి జీవితమంతయునందులోనే గడుపుచు ననేక బాధలుపడుచున్నారుఁ అట్లుచేయుటతప్పు. స్వతంత్ర వృత్తిని సంపాదించుకొనవలయునేకాని యెల్ల కాలము దొరతనము వారినే నమ్ముకొనియుండఁగూడదు. జ్ఞానమునిమిత్తము చదువుకొనవలయునుగాని యుద్యోగమునిమిత్తము చదువుకొనఁగూడదు. తగిన జ్ఞానము సంపాదించుకొని స్వతంత్రవృత్తి నవలంబించుట పురుష లక్షణము. జీజీభాయి యీసిద్ధాంతము నమ్మినవాఁ డగుటచే స్వతంత్రవృత్తి నవలంబించి యెన్ని యిడుమలకైన నోర్చి యంతటి గొప్ప వాఁడయ్యె. రెండవది విదేశప్రయాణము. విదేశములకుఁ బోవుట తప్పని తలఁచినంతకాలము మనదేశస్థులు దారిద్ర్యము ననుభవింపుచునే యుందురు. నిరుపయోగములగు నిబంధనములఁబెట్టికొని సంకెళ్ళు తగిలించుకొన్న వానివలె విదేశములకుఁ బోవఁజాలక మన దేశముననే తిరుగుచుండుటచే మనయవస్థ యింతవఱకు వచ్చినది. విదేశములతో యధేచ్చముగ వర్తకముఁ జేయుటచేతనే జీజీభాయి మిక్కిలి గొప్ప వాఁడయ్యెను.

మూడవది దాతృత్వము, మన దేశములో దాతలసంఖ్యయధికముగానే యున్నది. కాని యాదాత లందఱు పాత్రాపాత్రము నుచితానుచితము నెఱుఁగక దానములు సేయుచున్నారు. బ్రాహ్మణులనిమిత్తమే యుపయోగించు సత్రములను నెవ్వరికి నుపయోగము లేని దేవాలయములకు నిమ్మన్న చో మన దేశస్థులు ముందంజవేయుదురు. దిక్కు లేనివారికి సత్రములువేయించుట మొదలగు సత్కార్యములు మన వా రిదివఱ కెఱుఁగనే యెఱుంగరు. బ్రాహ్మణులుగాని వారికి దానము సేయుట పాప హేతువని మనవారికి దురభిప్రాయము గలదు. జీజీభాయిగారి చరిత్రమువలన నట్టి దురభిప్రాయములు పోవుగాక!


Mahaapurushhula-jiivitamulu.pdf