మహాపురుషుల జీవితములు/విశ్వనాథ నారాయణమండలికుడు

వికీసోర్స్ నుండి

విశ్వనాథ నారాయణ మండలికుఁడు

మహారాష్ట్రమందలి కొంకణగిరి జిల్లాలోఁ మురుదాయను నొకగ్రామము గలదు. విశ్వనాథ నారాయణ మండలికుఁడు 1833 మార్చి 8 వ తారీఖున జన్మించెను. ఈమండలీక కుటుంబము పూర్వకాలమునందు శ్రీమంతులగు పీష్యాలతో సంబంధబాంధవ్యంబులు కలిగియుండుటచే మిగుల గౌరవాస్పదమైనది. ఈతని ముత్తాత పీష్వాలవద్ద నొకమండలమునకు సుబేదారుగానుండెను. ఈ మండలికుఁడు మొట్టమొదట నక్షరాభ్యాసము తనతాతయగు దుండిపంటు వద్ద చేసి యనంతరము గ్రామపాఠశాలలోఁ జేరెను. అక్కడ కొన్ని నాళ్ళు గడచుటయుఁ దలితండ్రులు వాని కింగ్లీషు చెప్పించుటకై రత్నగిరికిఁ బంపిరి. అతని యదృష్టవశమున నచ్చటపాఠశాలలోనుపాద్యాయ శిరోమణియగు రావుబహదూరు రామచంద్రబాలకృష్ణుఁ డనునతఁడు ప్రధానోపాధ్యాయుఁడై యుండుటచే నక్కడ యున్నంత వఱకు విద్యఁ జక్కగ నేర్చి పిమ్మట బొంబాయికిఁ బోయి యెల్ఫినిష్టనుపాఠశాలలో నతఁడుచేరెను. పూవుపుట్టగానే పరిమళించునన్నట్లు మండలికుఁడు విద్యార్థియై యున్ననాఁడె తెలివికిఁ బ్రసిద్ధొకెక్కి ఫీజుస్కాలరుషిప్పును పేరుగల విద్యార్థి వేతనమును సంపాదించెను. అక్కడ నుపాధ్యాయులుగానున్న దొరలనేకులు తెలివితేటలంబట్టి యాబాలునిమీఁది నెంతయు నభిమానముఁబూనిరి. ఆపాఠశాలలోని యొజ్జల కతనిమీఁద నెంతయభిమానము నెంతగౌరవము గలవో యీ క్రిందిపనివలనం దెలియవచ్చును.

ఆ బడిలోనున్న గణితశాస్త్రపండితుఁ డొకమాసము సెలవు పుచ్చుకొనెను. మంటలీకు డప్పటికింకను విద్యార్థియై యుండినను పాఠశాలాధికారు లామాసముదినములు పనిచేయుటకు బాలుఁడని యెంచక వానినే నియమించిరి. పాఠశాలాధికారులు వాని ప్రజ్ఞకు
మిక్కిలి సంతసించి 1851 - 52 సంవత్సరములకు వ్రాసిన సంవత్సర చర్యలో వానినిగూర్చి యిట్లువ్రాసిరి. "విశ్వనాథనారాయణ మండలికుఁడు మిక్కిలి చురుకుగల విద్యర్థియని మేము నిరుడే వ్రాసితిమి. ఈసంవత్సరపు విద్యార్థులలో గూడ నతఁడే ప్రసిద్ధుఁడు. ఈసంవత్సరము పేటన్ పండితుఁడు సెలవుదీసికొనిన నెలలో నితఁడాపనిచేసెను. చేసినపని మిక్కిలి తృప్తికరముగా నున్నది.

ఆ కాలమున బి. ఏ. మొదలగు పరిక్షలులేవు. అప్పుడున్న పరిక్షలలోఁ గొప్పదానియందు మొదటివాఁడుగ మండలికుఁడు గృతార్థుడయ్యెను. విద్యాసమాప్త మగునప్పటికి కతనికి బందొమ్మిదవయేడు. అందుచే నతని గురువులలో నొకఁడు సీమకుఁబోయి సివిలు సర్విసు పరిక్షకుఁ జదువుకొమ్మని వాని నెంతయుఁ బురికొల్పె. కాని వానికుటుంబ మట్టియుద్యమమును బూననియ్యకపోవుటచే నతఁడు చిన్నతనమందే యుద్యోగము సంపాదింపవలసి వచ్చెను. సింధుదేశమున దొరతనమువారి యేజంటుగానుండి 'సర్ లిగ్రాండుజేఁకబు దొర'గారు కార్యనిర్వాహకమందుఁ దనకు సహాయకుఁ డొకఁడు కావలయునని కోరగా గొందఱు దొరలు మండలీకు నప్పగించిరి. ఆజేకబుదొరగారు తనక్రింద పనిచేయుచున్న మండలీకునిమీఁద జాల నభిమానముగలిగి యాకాలపు గొప్ప దొరల పరిచయము వానికిఁ గలుగఁజేసెను. మండలీకుఁడు కనఁబడు సుగుణముల కన్నిఁటికిఁ గారణ మాదొరలతోఁ దాను చేసిన స్నేహమే యని పలుమారు చెప్పుచువచ్చెను. అతఁడు వారివద్దనుంచి నేర్చుకొనిన గుణములివి. పట్టుదలతోఁ బనిచేయుట, కార్యదీక్ష, సంపూర్ణ స్వతంత్రబుద్ధి మఱియు నీ గుణంబులకు మెఱుగుబెట్టిన దొకటి గలదు. అది యేమన తన యర్హకృత్యమునం దేమరుపాటు లేక పని చేయుట. ఈతడు కొంతకాలము పాఠశాలలు పరీక్షించు సహాయపరీక్షకుడుగా, బిదప సబు జడ్జీగా, బిమ్మట దొరతనమువా రచ్చు వేయించిన పుస్తకముల విక్రయించు నుద్యోగస్థుఁడుగ ననంతరమువచ్చు బడిపన్నునుగూర్చి యేర్పడిన కమీషనరుగారికి సహాయుఁడుగానుండి యుద్యోగములు చేసెను. కాని దొరతనమువారి ఉద్యోగములో నున్నంతకాలము తన తెలివితేటలు బయలుపడవనియు దొరతనము వారు మిక్కిలి దయగలిగి యిచ్చినపక్షమున నింకొకటిరెండు గొప్ప యుద్యోగములే యిచ్చెదరనియు నల్లవారికి తెల్లవారితో సమానముగ నుద్యోగములీయరనియు నతఁడు నిశ్చయముగ నమ్మి హైకోర్టులో న్యాయవాదిగ నుండుట మంచిదని తలంచి సర్కారుపనిమాని న్యాయవాది పరీక్షయందు గృతార్థుఁడై 1863 వ సంవత్సరమున హైకోర్టులో వకీలుగ జేరెను. అప్పుడు హైకోర్టులో బుద్ధిసూక్ష్మతగల న్యాయవాదులు లేనందున మండలీకునివంటి నేర్పరికి వ్యాపకమున కవకాశముండెను. అప్పటి న్యాయవాదులలో నింగ్లీషునేర్చినవారు మిక్కిలి తక్కువ. జడ్జీలలో సహితము హిందూ ధర్మశాస్త్రము నిశ్శంకముగా నేర్చినవారు లేరు. అందుచేత నతఁడు స్వల్పకాలములోనే చాల ధనము సంపాదింప గలుగుటయేగాక జడ్జీల గౌరవములుగూడ సంపాదించెను. ప్రజలకు తన కిచ్చిన వ్యాజ్యములలో నున్న సంగతులు శ్రద్ధతో జదివి వచ్చినవారి కేదోయుపకారము చేయవలయునని తలంచువాఁడు. వేళమీరి యెన్నడు కోర్టునకు బోవలేదు. ఒకసారి పునహాకోర్టునకుఁ బోవలసియుండి బొంబాయి హైకోర్టులోనున్న పనితొందరవల్ల జాగుచేసి యతఁడు పొగబండి నందుకొనలేకపోయెను. బండి మించినది నేనేమి చేయనని వంక బెట్టక సొమ్ము చూచుకొనక బొంబాయినుండి పునహాకు తనకు బ్రత్యేక మొక పొగబండి నేర్పరచుకొని యుచిత సమయమున


కక్కడకు బోయివాని పక్షము వాదించెను. మరియొకసారి కొంకణదేశమున రత్నగిరికిఁ బోవలసియుండి యక్కడ బొగయోడ దొరకకయుండుటచే ప్రత్యేకమొక పొగయోడ తన నిమిత్తము దెప్పించుకొని చాలసొమ్ము వ్యయముచేసికొని యాయూరు చేరెను.

అతఁడు న్యాయవాది శబ్దమును సార్థకముచేసినన్యాయవాది. వ్యాజ్యములుతనవద్దకు తెచ్చినవారికి రుసుమెప్పుడునీయ లేదు. అతడు తనకెంతంత ధనమిచ్చెదమన్ననుసరే యోడినవారిపక్షమున నెన్నడు పనిచేయువాఁడుకాడు. ఆ కాలమందు హైకోర్టులో నసలువ్యాజ్యముల విచారణకు నప్పీళ్ళవిచారణకుఁ గొంతభేదముండెను. అప్పీళ్ళ విచారణలోనున్నంత సులువు అసలు వ్యాజ్యములలో లేదు. అందుచేత రెండింటికి సమానమైన సౌకర్యములు సేయుమని మండలీకుఁడు జడ్జీలను వేడెను. వారట్టివిధముగా నందఱకుఁ జేయుట కిష్టపడక కావలసినయెడల మండలికునకును మఱియొక రిద్దరికి నుపకారము చేయుదుమనిరి. మండలీకుఁడు స్వప్రయోజనపరుఁడు గాకపోవుటచే నందఱకు లేని సౌకర్యము తనకొక్కనికి నక్కరలేదని నిరాకరించె. 1884 వ సంవత్సరమున గవర్న మెంటు వకీలుగానుండిన నానాభాయి హరిదాసు హైకోర్టుజడ్జీగా నియమింపబడెను. అందుచే దొరతనము వారు మండలీకుని తమ వకీలుగా నియమించుకొనిరి.

మండలీకుని గొప్పతనము చాలధనము సంపాదించిన న్యాయవాది యనియేగాదు. అతఁడు బొంబాయిలో మునిసిపల్ కమీషనరుగా నుండెను. అదియునుగాక గొప్పసంస్కృత పండితుఁడు. మఱియు దేవభాషను జక్కగనేర్చి యందనేక గ్రంథములువ్రాసెను. కొంతకాలము వార్తాపత్రికలనుగూడ నడపెను. దొరతనమువారి శాసననిర్మాణ సభలోఁ జాలకాలము సభికుఁడైయుండెను. వేయేల!


అతఁడు జనులవిశ్వాసమునకుఁ బాత్రుడై యెల్లవిషయముల వారి కాలమునందు నాయకుఁడైయుండెను. 1805 వ సంవత్సరమందుదొరతనమువారతనికి "జస్టిసుఆఫ్‌దిపీస్" అను గౌరవోద్యోగమునిచ్చిరి. ఇది బెంచిమేస్ట్రీటు మునిసిపల్ కమీషను మొదలగు నుద్యోగములవలె జీతములేనిదె గౌరవమున కధికారముగలదై యుండును. ఆ కాలమందు బొంబాయిలో మునిసిపాల్టీ యేర్పడనందున నగరము యొక్క పారిశుధ్యమును విచారించు నధికారమీ జస్టిసునందే యుండెను. ఈ జస్టిసులందఱికిని నొక ప్రధాన పురుషుని దొరతనము వారేర్పరచి కార్యనిర్వాహక మంతయు వానికప్పగించిరి. అతఁడు మిక్కిలి బుద్ధిశాలియు లోకానుభవము గలవాఁడునయినను ధనమనావశ్యకముగా వ్యయముచేయుటయు నప్పుడప్పు డపహరించుటయు మొదలగు దురభ్యాసముల కలవడెను. విశ్వనాధనారాయణ మండలికుఁడు వాని చెడుచేతలకిష్టపడక యెదిరించి వానిగుట్టు బయలుపెట్టఁ జూచెను. స్థితిగతులు బొత్తుగ చెడిపోయినవని దొరతనమువారు గ్రహించి 1872 వ సంవత్సరమున మునిసిపాలిటీయేర్పరచి బొంబాయి నగరమును జస్టిసులచేతిలోనుండి తప్పించి యా మునిసిపాలిటి కప్పగించిరి. మండలీకుఁడీసభలో ప్రధానసభికుఁడై యుండెను.

1879 వ సంవత్సరమందును మరల నెనుబదియవ సంవత్సరమందును మండలీకుఁడు బొంబాయి మునిసిపల్ చేర్మన్‌గా నియమింపబఁడెను. బొంబాయివంటి మహానగరమందు నంతటియధికారముచేయుట మిక్కిలికష్టమైనను మండలీకుఁడు నిష్పక్షపాతముగను న్యాయముగను జనసమ్మతముగను వ్యవహరించెను. 1862 వ సంవత్సరమం దతఁడు బొంబాయి యూనివర్సిటిలో సభికుఁడయ్యెను. అందుండి పలుమారు లాయన మహారాష్ట్రభాషలో సింధుభాష


లోను గుజరాతుభాషలోను పదునాలుగు సంవత్సరములు బి. యల్. పరీక్షలోను పరీక్షకుఁడుగా నుండెను.

1874 వ సంవత్సరమునం దాయన బొంబాయి దొరతనము వారి శాసననిర్మాణసభలో సభికుఁడయ్యెను. ఈ సభలో నిదివఱ కనేకులు సభికులై యుండిరికాని ప్రజలపక్షమువాఁడితఁడే. అది వఱకు దొరతనమువారు సాధారణముగా మహారాజులను జమీందారులను నేర్పచుటచే వారందరు గంగిరెద్దులవలె దొర లేమాటలాడిన నామాటలకే తలలూచు చుండెడివారు. మండలీకుఁడు గవర్నమెంటువారిచే నేర్పరుపఁబడినను ప్రజలకు నష్టమువచ్చు శాసనము లేర్పరచునప్పుడు ప్రజాపక్షముఁబూని పోరాడుచు ధైర్యశాలి యెంతపని చేయగలడో యిదిచూపెను, శాసననిర్మాణసభకు మండలీకునట్లు మరియొకరు తగియుండరు. ఏలయన నతఁడు పరిపూర్ణపండితుఁడు బుద్ధిశాలియగు న్యాయవాది గొప్ప యనుభవశాలి. దేశ స్థితిగతులు చక్కగా నెఱిఁగినవాఁడు. మఱియు స్వతంత్రుఁడు. అధికారులు కన్నెఱ్ఱజేసిన మాత్రమున వెరచి తన యభిప్రాయములను దాఁచుకొనువాఁడుకాఁడు. ఒకసారి వానికొక గవర్నరు బెదరించెనఁట. మండలీకుఁడపుడు వానియాటలు తనవద్ద సాగిరావని మెల్లగఁజెప్పి మందలించెనఁట. అతఁడు బొంబాయి శాసననిర్మాణసభలో వరుసగా మూఁడుసారులు సభికుఁడుగా నేర్పరుపఁ బడెను.

1884 వ సంవత్సరమునం దతఁడు గవర్నరు జనరల్ గారగు రిప్పన్ ప్రభువుగారిచేత వారి శాసననిర్మాణసభలో సభికుఁడుగా నియమింపఁ బడెను. బొంబాయి దేశస్థుఁడు గవర్నరుజనరలుగారి యాలోచన సభలో సభికులగుట కదియే మొదలు ఆసభలోఁ గూర్చుండుట కతఁడు బొంబాయినుండి పోవునప్పుడు పౌరులు వాని నుత్సవముజేసి మన్నించిరి. కలకత్తా చేరినతోడనే యానగరవాసులుగూడ వానిని


సన్మానించిరి. రిప్పన్ ప్రభువుగారి తరువాత వచ్చిన ఢఫ్రిన్ ప్రభువు గారును వానికి శాసననిర్మాణ సభలో సభికత్వమిచ్చి గౌరవించిరి. అతఁడు సభికుఁడుగా నున్న కాలమున వచ్చు బడిపన్ను కట్టుట మొదలగు కార్యము లనేకములు జరిగెను. అట్టి పన్నులు కట్టఁగూడదని యతఁడు శక్తివంచన లేక దొరతనమువారితోఁ బోరాడెను. దేహారోగ్యము సరిగా నుండకపోవుటచే నతఁడు 1887 వ సంవత్సరమున దన సభికత్వము మానుకొనెను. కలకత్తానుండి యతఁడు వచ్చిన తోడనే దేశమునకతఁడు చేసిన యుపకారములంబట్టి వానిపేరు స్థిరముగా జ్ఞాపకముండునటు లేపనిజేసిన బాగుండునని యోచించుటకు బొంబాయిలో నొకసభ జరిగెను. ఏటేట నొక బంగారు పతకమతని పేర చేయించి సంస్కృతభాషావిషయుమున మంచి యుపన్యాసము వ్రాసిన విద్యార్థికి బహుమాన మిచ్చుటకును వాని ప్రతిమ నొకటి తెప్పించి జనులందఱు వచ్చుచు బోవుస్థలమున నుంచుటకును నాడు జనులు నిశ్చయించిరి. పునహానగరమందుఁగూడ నట్టి సభయే జరిగెను. అక్కడిజనులును వేదశాస్త్రపండితునకు మండలీకునిపేర నేటేట బహుమానమీయ నిశ్చయించిరి.

మండలీకుడు విద్యాభిమాని గ్రంథకర్తయని యీవఱకే చెప్పియుంటిని. మొదటనతఁడు దేశభాషలోగొన్ని గ్రంథములురచించెను. అతఁడు విద్యార్థియై యుండిననాడే యింగ్లీషులో లాటరీ యను పేర నున్న చిన్న నీతికథను మరాటిభాషలోనికిమార్చి బహుమానమందెను. తరువాత రాజకీయవ్యవహారములం దెలుపు నర్థశాస్త్రమును భాషాంతరీకరించెను. సింధు దేశమున నున్న కాలమున సింధుభాషను నేర్చికొని దానిలోఁ జిన్న వ్యాకరణమును వ్రాసెను. గుజరాతీభాషలోఁ జాలపరిశ్రమజేసి యాయన యెల్ఫినిష్టను దొరగారుచేసిన హిందూ దేశచరిత్ర నాభాషలోనికి మార్చెను. ఈగ్రంథము పాఠశాలలో


విద్యార్థులకు బఠనీయ గ్రంథముగా నేర్పరుపఁబడెను. 1867 వ సంవత్సరమున నతఁడు హిందూ లా సంగ్రహమను నొకగ్రంథము నింగ్లీషున వ్రాసి దానికి గుజరాతిలో నర్థము వ్రాసెను. అదియే యిప్పు డనేకులు జదువుచుందురు. మఱియు నతఁడు కిండరుసులే దొరగారు రచియించిన సాక్ష్య శాస్త్రమును స్వభాషలోనికి మార్చెను. సివి లధికారము క్రిమిలధికారము కలక్టర్ల చేతులోనుండి తప్పింపవలసినదని యాయన యభిప్రాయపడి తద్విషయమున నాయన కొంతవ్రాసెను. ప్రాచీన శాసనాదులఁగూర్చి బొంబాయిలోనున్న యాసియాఖండ సంఘమువారియెదుట నతఁ డాఱుపన్యాసములు జదివెను. నీలబంధు ద్వాఖ్యానముతోనున్న యాజ్ఞవల్క్యస్మృతిని నిర్దోషముగా నత డచ్చు వేయించి దానికి నింగ్లీషున భాషాంతరీకరణము గావించి ప్రచురించెను. అది హిందూధర్మశాస్త్రమును గరతలామలకముగ దెలుపునని యా కాలమున నెల్లవారు గొనియాడిరి. ఆగ్రంథములకు మండలీకుఁడు చక్కని పీఠికవ్రాసి దానిలోహిందూధర్మ శాస్త్రముయొక్క చరిత్రము దానిస్వభావము నిర్వచించి స్మృతులను విభాగించి స్మృతి ప్రమాణములకు ననుగుణముగా కోర్టులిచ్చిన తీర్పులందుద హరించి భిన్నములగు నాచార వ్యవహారములను బేర్కొని యెల్ల విధముల గ్రంథ మత్యంతోపయుక్తమగునట్లు చేసెను. అతఁడు పత్రికాప్రవర్తకుఁడని కూడ నీవఱకుఁ జెప్పియుంటిని. అతఁడు "స్వదేశీయుల యభిప్రాయ" మనుపేర నొకయింగ్లీషు పత్రికను 1864 వ సంవత్సరమున స్థాపించి 1871 వ సంవత్సరమువఱకు బ్రకటించెను.

అతఁడుచేసిన దేశోపకారము నెఱింగియే దొరతనమువారు గూడ వానిని చాలగౌరవించిరి. అతఁడు స్కూళ్ళ యినస్పెక్టరు పని మానుకొన్నప్పుడు దొరతనము వారదివఱ కతనికిఁ నుద్యోగవశమున నిచ్చిన రావుసాహేబుబిరుదము యావజ్జీవముంచుకొన వచ్చునని యుత్తరువిచ్చిరి. గవర్నరుగారి యాలోచనసభలో సభికుఁడుగనున్న


కాలమున బొంబాయినగరమునకు షరీపుగ నుండుమని యతనినిగోరిరి. కాని యితఁడు రెండుపనులు జేయుటకుఁ వీలు లేదని యాయుద్యోగము వద్దని చెప్పెను. 1876 వ సంవత్సరమున గవర్నరు జనరలుగారగు లిట్టనుప్రభువుగారు బాలురపాఠశాలలోఁ జదువవలసిన పుస్తకములు నిర్ణయించుట కొక్కసభ కూర్ప దలఁచి యందు మండలీకు నొక సభికునిఁగా నియమించెను. కాని యతఁడు శరీరదౌర్భల్యము చేత నందుండుటకు వీలులేదని మానుకొనెను. 1877 వ సంవత్సరమున విక్టోరియారాణిగారు చక్రవర్తి బిరుదము వహించినప్పుడు "హిందూదేశ మిత్రజ్యోతి" యనునర్థమువచ్చు సి. యస్. ఐ. యను బిరుదును దానితో నొక వెండిపతకమును దొరతనమువా రతనికిచ్చిరి.

మండలికుఁడు 1889 వ సంవత్సరము మేనెల తొమ్మిదవ తేదీని కాలధర్మనొందెను. ఆదినమునందే బొంబాయిమునిసిపాలిటీవారు సభగూడి విశ్వనాథనారాయణ మండలికుడు మునిసిపల్ కమీషనరుగా నుండియు జస్టీసుగానుండియు బొంబాయినగరమునకు జేసినమహోపకారమునకు గృతజ్ఞులై యతనిమరణమునకు విచారించిరి. అతనిమరణమునుగూర్చి శోకించుచు జనులు మహారాష్ట్ర దేశము నందంతటసభలు జరిపిరి. అతనికిసంఘ సంస్కరణము లేదుగాని వితంతువులకు దలగొరిగించుటయతఁడొప్పుకొనలేదు. పూర్వాచారములన్నియు నతనికిష్టములయినను విదేశములు మరలఁ గొన్ని కట్టుబాటులమీఁద సంఘమునఁ జేర్చుకొనవచ్చుననియతఁడు చెప్పుచువచ్చెను. అతనిభార్య యెల్లప్పుడు రోగిష్టియైయుండెను. అయినను మండలీకుఁడు సత్ప్రవర్తకుడై దయాళువై యామె కుపచారములు చేయించుచు నేకపత్నీ వ్రతస్తుఁడై కాలముబుచ్చెను. అతఁడు బంధువులకు చాలధనసహాయము జేసెను. భార్య కోరికమీఁద నామెయుం దాను వెండితోఁ దులాభారము దూఁగి యా సొమ్ము దానము చేసెను. ఆకాలమం దెల్లవిధముల నంతవాఁడు లేఁడని యెల్లవారు నంగీకరించిరి.