మహాపురుషుల జీవితములు/రాజా రామమోహనరాయలు

వికీసోర్స్ నుండి
రాజా రామమోహనరాయలు

రాజారామమోహనరాయలు

రామమోహనరాయలు బంగాళాదేశమందలి, హుగ్లీ మండలములో రాధానగరమున క్రీస్తుశకము 1774 వ సంవత్సరమున జననమొందెను. అతనితండ్రి రమాకాంతరాయలు. చిన్న జమీందా రయియుండి, కొంతకాలము మూర్ష దాబాదు నవాబులయొద్ద నుద్యోగముచేసి యాప్రభువులు రాజ్యభ్రష్ఠులైన పిదప బర్డవాను మహారాజునొద్ద కొలువుచేసెను. రామమోహనుతల్లి తారుణీ దేవి, సత్ప్రవర్తనకును, యోగ్యతకును బ్రసిద్ధికెక్కెను. ఆతని తలిదండ్రు లిరువురు దైవభక్తిగలవారును, మతవిషయమునఁ బట్టుదల గలవారునైరి. ఆదినములలో పారసీభాషయే రాజభాషగా నుండుటంజేసి, రామమోహనుఁడు బంగాళీభాషఁ గొంతనేర్చిన వెనుకఁదొమ్మిదివత్సరముల ప్రాయమున నరబ్భీ పారసీభాషలు నేర్చుకొనుటకయి పాట్నానగరమునకుఁ బంపఁబడెను. అచ్చట రెండు సంవత్సరములలోఁ గుశాగ్రబుద్ధి యగునాతఁ డాభాషలలో నుద్గ్రంథముల ననేకములు చదివి, సంస్కృతవిద్యాభ్యాసముఁ జేయుటకయి పండ్రెండవ యేటఁ గాశికానగరమునకుఁ జని యాభాషలోఁ గొలఁదికాలములోనే బండితుఁడయి యుపనిషత్తులం జదివి, తత్సారమును గ్రహించెను. రామమోహనుఁ డుపనిషదర్ధముఁ దఱచి గ్రహించి తనపదునారవ యేటనే బంగాళీభాషలో విగ్రహారాధనము నిషేధించుచు నొకగ్రంథము వ్రాసెను. ఇదియే బంగాళీభాషలో మొట్టమొదటి వచన కావ్యము. విగ్రహారాధనము హిందువులు ప్రమాణముగ గ్రహించు చున్న వేదశాస్త్రములచేత నిషేధింపబడినదనియు, మనపూర్వులగు

మహర్షులమతమున కిది విరుద్ధ మనియు జనులందఱు శిలావిగ్రహార్చనము విడిచి యేకేశ్వరారాధనము సేయవలసిన దనియు నీగ్రంథమున నతఁడు స్థాపించెను. తనకొడుకు సనాతనధర్మమగు విగ్రహారాధనమును ఖండించుచున్నాఁడని విని రమాకాంతరాయలు కోప పరవశుఁడయి యాయకార్యమును జేసినందుకు రామమోహనుని యింటనుండి వెడలనడచెను. బాల్య మింకను గడచిపోవకమునుపే, స్వతంత్రముగఁ జీవించుటకు ఱెక్కలు రాకమునుపే, యాగర్భశ్రీమంతుఁడయి చిన్న నాఁటనుండియుఁ గడుగారాబమునఁ బెఱిగిన యా బాలుఁడాకస్మికముగఁ దండ్రిచే నింటనుండి వెడలనడువంబడియు, స్వభావమున గంభీరుఁడగుటచేత హిందూదేశమునఁ బలుతావులుఁ దిరిగి యెట్ట కేలకు హిమాలాయపర్వతములు దాఁటి టిబెట్టుదేశమునకుఁ బోయి బౌద్ధక్షేత్రమగు లాసానగరముం జొచ్చి యచ్చటి భాషల నలవరచుకొని, బౌద్ధమతసిద్ధాంతములఁ గ్రహించెను. ఆస్తికుఁడగు రామమోహనుఁడు నాస్తికులగు నచటిబౌద్ధులతో నీశ్వర విషయములగు చర్చలంజేయ వాదములు ముదిరి భేదములయి తుదకు వానికిఁ బ్రాణభయము నాపాదించెను. మతద్వేషముచేత బౌద్ధగురువులు నిష్కారణముగా నాబాలునిఁ కడతేర్పబ్రయత్నింపగా నచటి స్త్రీలు కొందఱు వారికడుపు చల్లగ వానిని రహస్యముగ దాచి బ్రతికించి యావలకుఁ బంపిరి. అందుచేత నాఁట నుండి స్త్రీలయెడఁ గడుఁ గృతజ్ఞుఁడై వారి కష్టములఁ దొలఁగింప నాతఁడామరణముఁ బ్రయత్నించెను. కొడుకిల్లు వెడలుటమొదలు వానికొఱకయి బెంగఁగొని తండ్రి మరల వానిని పిలిపించి యాదరించెనుగాని, క్రమ్మర నాతఁడు బ్రాహ్మణుల మతాచారములను ఖండించుటచేత, తండ్రి వానిని రెండవమారింటనుండి సాగఁదోలెను. తరువాత కొంతకాలమునకు రమాకాంతరాయలు లోకాంతరగతుఁడుగాఁ ధారుణీదేవి కడుపుతీపిచేఁ గొడుకునుం బిలిపించి యింటనిలుపు

కొనెను. రామమోహనుఁ డంతట మనస్థ్సిమితము గలవాఁడయి యిరువదియవయేడు మొదలు యిరువదియాఱవ యేడువరకు ఇంగ్లీషు భాషయందుఁ గృషి చేసి, దానిం జులకగఁ జదువ వ్రాయఁగలిగెను. ఆ భాషకుఁ దోడు ఫ్రెంచి, లాటిను, గ్రీకు, హీబ్రూ భాషలయందు సయిత మాతఁడు ప్రవీణుఁడయ్యెనని చెప్పుదురు. క్రీస్తుశకము 1800 వ సంవత్సరమున రామమోహనుఁడు రంగపురము కలక్టరగు డిగ్బీ దొరగారి కచ్చేరీలో చిన్న గుమాస్తాగాఁ బ్రవేశించెను కాని దొర యాపిన్న వాని చాక చక్యమును దెలివి తేటలును గని పెట్టి, తనయెదుటి కతఁడు వచ్చినప్పుడు, నిలువఁబెట్టి పని పుచ్చుకొనననియు, చిన్న గుమాస్తాల కుత్తరువు చేయునట్టు చేయననియు, వాగ్దానముచేసెను. ఆచిన్న యుద్యోగమునుండి యతఁడు క్రమక్రమముగ జిల్లాసిరస్థదారుడయి తనకృత్యము లను జక్కఁగ నెరవేర్చి యధికారుల మెప్పొంది, 1813 వ సంవత్సరమున నుద్యోగమునుమాని శేషమగు జీవిత కాలము లోకోపకారార్థము గడపఁదలఁచి 1814 వ సంవత్సరమున గలకత్తా నగరమున గాపురముండ వచ్చెను. అతఁడు కలకత్తానగరము వచ్చునప్పటికి, మనదేశస్థితి యెట్లుండెనో యించుక చెప్పవలసియున్నది. బంగాళాదేశమున శాక్తేయమతమును దైతస్యమతమును వైష్ణవ మతము వృద్ధిలో నుండుటచే, శాక్తేయులకు వైష్ణవులకు మత ద్వేషములు తరుచుగఁ గలుగుచు వచ్చెను. నరబలులు, శిశుహత్యలు, దేశమందంటఁ బ్రబలియుండెను. వానికిందోడుగ నతిభయంకరము ననానుషంబు, నసహ్యమునగు, సహగమన మను దురాచార మొకటి భరతఖండమందంతటను, ముఖ్యముగ వంగదేశమందును దృఢముగ నాటుకొని యుండెను. ఈ సహగమనమునుభర్తృవియోగముచే నీలోకమున బ్రతుక నిచ్చలేకఁ గొందఱు పతివ్రతలు మనఃపూర్వకముగఁ జేయుచు వచ్చిరిగాని, కాలక్రమమున వితంతువు నెట్లో కాల్చి చంపి, యాస్తివేసికొనవలయు నను జ్ఞాతులును లోక


నిందకు జంకిన బందుగులును, మగఁడు చనిపోవుటచే సగము చచ్చి యున్న యాడుదానివద్దఁ జేరి మృతభర్తతో సహగమనముఁ జేసిన దానికిఁ బుణ్యము గలుగుననియుఁ గుటుంబమునకుఁ సత్కీర్తి సంఘటిల్లు ననియు, వేనోళ్ళఁ బొగడి మనసువిరిచి భయముపెట్టి, బలవంతముగ నాస్త్రీచే నొప్పించియు, నొప్పుకొననిచో విరిచికట్టియు స్మశానమునకుఁ దామె దీసికొనిపోయి మండుచున్న నిప్పులపైఁ బడవేసి హృదయము గరిగించు నామె యేడ్పు లెవ్వరికి వినఁబడ కుండ భేరీలు వాయింపించి, నడుమ నడుమ దుస్సహమగు బాధచే నామె లేవఁబోయినప్పుడు, వెదురుకఱ్ఱలచేఁద్రొక్కి యడచిపెట్టించి యెట్లో నిండుప్రాణముఁ దీసి, కృతార్థులగుచు వచ్చిరి. 1815 వ సంవత్సరము మొదలు 1828 వ సంవత్సరమువఱకు నొక్క కలకత్తా నగరమునందే దాదాపుగ నైదువేలమంది సుందరు లూఘోరమరణము పాలైరి. అశాస్త్రీయము నతిక్రూర మనార్యము నగు నీప్రత్యక్ష రాక్షస కృత్యములఁ జూడలేక రామమోహనరాయ లాదురాచారమును మాన్పుటకయి ప్రయత్నింప నిశ్చయించుకొని కలకత్తా నగరము వచ్చినది మొద లావిషయమయి పాటుపడి, యా యాచారమును తుదముట్టించి భరతఖండ స్త్రీల కుపకారము చేయుఁడని దొరతనమువారికి, పలుమారు మహజర్లు బంపియుఁ దద్విషయమయి తాను కొన్ని చిన్న గ్రంథములను వ్రాసియు, నుపన్యాసము లిచ్చియుఁ, బండితులతో వాగ్వాదములు చేసియు, జనులకు దాని క్రౌర్యమును బోధింపసాగెను. కొద్దిమంది జనులు రామమోహనరాయలు పక్షము వహించిరి గాని, లక్షోపలక్షలు పూర్వాచార పరాయణులయి సహగమనము లేకపోయినచో హిందూ మతము చెడిపోవుననియు, సనాతనమయిన యాయాచారమును కొట్టి వేయక నిలుపవలసినదనియు ప్రభుత్వమువారికి మరల మహజర్ల బంపిరి. ఛాందసులగు పండితులు, రామమోహనరాయలను నిందించుచు గ్రంథముల వ్రాసి ప్రజల మెప్పు గనిరి. అప్పటి


గవర్నరుజనరలుగారగు లార్డువిలియంబెంటింకుదొరగారు రామమోహనరాయల వాదములు యుక్తియుక్తములుగ నున్నవని గ్రహించి లోకోపకారకమగు నతనియుద్యమమునకుఁ దోడ్పడి యాదురాచార పిశాచము నడుగంటద్రొక్కందలంచి 1829 వ సంవత్సరము డిశంబరు నాలుగవ తారీఖున సహగమనము నిషేధించుచు నొక చట్టమునిర్మించి పుణ్యము గట్టుకొనెను. చూచుటకు, వినుటకు : దలఁచుకొనుటకు సయితము నతిదారుణమగు నీయాచారమును నిర్మూలము చేసిన మహానుభావుఁడు రామమోహనరాయలగుటచే భరతఖండమునందలి స్త్రీ పురుషు లందఱు నా చంద్రతారకముగ నతనికిఁ గృతజ్ఞులయి యుందురుగాక ! రామమోహనరాయలు కలకత్తాకువచ్చినక్రొత్తలో వేదాంతశాస్త్రమును వేదాంతసారమును బంగాళీభాషలోనికిఁ తర్జుమా చేసెను. 1816-17 వ సంవత్సరములలో నతఁడు ముఖ్యములగు నుపనిషత్తుల నింగ్లీషుభాషలోనికి బంగాళీభాషలోనికి భాషాంతరీకరించెను. ఇట్లు వేదాంతరహస్యముల బయలుపరచినందుకు పూర్వాచారపరాయణులు రామమోహనుని నిందింపనారంభించిరి. ఈమహాత్ముఁడు సంస్కృతముఁజదివి వేదశాస్త్రముల శోధించుటయేగాక అరబ్బీభాష నేర్చుకొని తురకల వేదమగు ఖొరాను చదివి, హీబ్రూ, గ్రీకుభాషల నేర్చుకొని క్రైస్తవులవేదమగు బైబిలు పఠించి తద్గ్రంథముల సారములు గ్రహించి దోషముల బైలుపెట్ట నారంభించెను. 1820 వ సంవత్సరమున నితఁడు యేసుక్రీస్తు, ధర్మములను గూర్చి, బంగాళీ సంస్కృతభాషలలో గ్రంథములు వ్రాసి ప్రకటించి యందు క్రీస్తు మతగురవగునుగాని, దేవునికుమారుఁడగుట యబద్ధమని వ్రాసెను. ఇందుచే నచ్చటి క్రైస్తవమతబోధకులకును, రామమోహనునకును గొప్ప వివాదములు బైలు దేర క్రైస్తవులు వ్రాసిన దానికి రామమోహనుఁడును, రామమోహనుడు వ్రాసినదానికి క్రైస్తవులును యుత్తరప్రత్యుత్తరముల నిచ్చుకొనుచు వచ్చిరి. ఇంత


వఱకు రామమోహనుఁడు తాను వ్రాసిన గ్రంథములన్ని క్రైస్తవ మతబోధకుల, ముద్రాయంత్రములోనే యచ్చు వేయుచు వచ్చెను. ఆమతబోధకులు రామమోహనుని వాక్యములు యుక్తియుక్తములుగనుండి జనుల యాదరణబడయుచుండుటచే నీర్ష్యఁ జెంది యతఁడు తమవ్రాఁతల ఖండించుచు నిచ్చిన కడపటి ప్రత్యుత్తరము నచ్చు వేయమనిరి. రామమోహనుఁడు పంతము వచ్చి నప్పుడు తీసిపోవు వాఁడుకాఁడు గావున దానే స్వయముగ నచ్చుకూటమును గొని తన గ్రంథము నచ్చొత్తించెను. ఈయిరువుర గ్రంథము లింగ్లాండునకుఁ బోయినప్పు డచ్చటివారు, బంగాళాబ్రాహ్మణుని యుక్తులకును, సర్వతోముఖ పాండిత్యమువరకును, వాద నైపుణ్యమునకును జాల మెచ్చుకొనిరి.

ఈసత్పురుషునకుఁ బరిశుద్ధమగు నుపనిషన్మతముపై నభిమాన మెక్కుడు గలుగుటచే భగవధ్యానము నిమిత్తము కలకత్తానగరములో నాత్మసభయను పేర నొకసభ నేర్పఱచెను. పిమ్మట వేదాధ్యయనము నభివృద్ధి చేయఁదలఁచి వేదమందిర మను నొక పాఠశాలను 1817 వ సంవత్సరమున స్థాపించెను. ఈమతములోఁ జేరినవారందఱు ప్రార్థనాదికములు చేసికొనుటకు 1830 వ సంవత్సరమున నతడు బ్రహ్మమందిరము నొకదానిని గట్టించి, దానిపోషణకయి కొంత మూలధనము సయిత మొసంగెను. హిందువులకు, మహమ్మదీయులకు క్రైస్తవులకు నుపయుక్తముగ నుండునటుల నొకమతము నిర్మింపఁ దలఁచి యుపనిషత్తులలో నున్న పరమార్ధమును గ్రహించి, యీ మతమును గల్పించెను. ఆయన వేదములనుమాత్రమే ప్రమాణములని యొప్పుకొనక, బైబిలు, ఖొరాను, జండవస్తమొదలగు మత గ్రంథములలోనున్న సత్యమును ధర్మమును గ్రహింపవలసిన దే యనియు, నవి యన్నియు వేదములవలెఁ బ్రమాణములే యనియు, నమ్మి ప్రజలకు బోధించుచుండెను. బ్రహ్మసమాజమే, పూర్వఋషులపరిశుద్ధా స్థికమతమని యాయన గట్టిగ నమ్మెను. తాను మతసిద్ధాంతము


లను, సంస్కరణవిషయములును, బ్రకటించుటకయి సంబంధుకౌముది యను నొకపత్రికను స్వభాషలోఁ బ్రకటించుచు వచ్చెను. అతని ప్రతిపక్షు లందఱుఁ జేరి ధర్మసభ యనుపేర నొకసమాజము నేర్పఱచి చంద్రికయను నొకపత్రికను బ్రచురించి, రామమోహనుని నిందించుటయే ప్రధానముగఁ జేసికొనిరి. మతసంస్కారమందేగాక, సంఘసంస్క రణమునందును నాతఁడు గట్టిపనిచేసెను. స్త్రీ పునర్వివాహములు శాస్త్రీయము లనియు, నింద్యములు కావనియు, నతనియభిప్రాయము. బంగాళాదేశములో కులీనులను నొకతెగ బ్రాహ్మణులుగలరు. వారిని పరమపావనులనియచ్చటిజనులు నెక్కుడుగాగౌరవింతురు. పవిత్రులగు కులీన బ్రాహ్మణులతో సంబంధము చేయుట కడుగౌరవమని యెంచి యాదేశ బ్రాహ్మణులు తమ కన్యలకు తగు వరులు దొరకనందున, వేలకొలఁది రూప్యముల కట్నముల నిచ్చి, యొక్కొక్క కులీనునకు ముప్పది, నలువది, ఏఁబది, యొకప్పుడు నూరుమంది కన్యలను గట్టఁబెట్టెడి యాచారము గలదు. ఇట్లు వివాహము చేసికొన్న భర్త మృతినొందునప్పుడు నూరుగురుభార్యలు సహగమనము చేయవలసి యుండెను. దగ్గరనున్న వారు భర్తతోఁ గలసియు, దూరమున నున్నవారు మగనియొక్క గుడ్డపేలికయో, మరియే వస్తువో తెప్పించి మీఁద వేసికొని తమరున్న యూళ్ళలో చిచ్చురికి శరీర త్యాగము చేయుచుందురు.

రామమోహనుఁడే ముగ్గురుభార్యలనువివాహము చేసికొనెను. మొదటిభార్య చిన్నతనమందే మృతినొందుటం జేసి, ఆయన మఱి యొక కన్యను వివాహము చేసికొనెను. ఈధర్మపత్ని జీవించియున్నపుడే రామమోహనునకుఁ దండ్రిగారు మఱియొక కన్యను బాణిగ్రహణము చేయించిరి. బహుభార్యాస్వీకారమువలనఁ గలుగు నష్టములను స్వయముగఁ జూచుటఁ జేసి యాదురాచారమును నిర్మూలించుటకయి యతఁడు ప్రయత్నించెను. కాని వెంటనే కృతకృత్యుఁడు గాఁడయ్యె.

ఈ సంస్కారములు గాక దేశమున కతఁ డింక ననేకోపకారములు చేసెను.

హిందువులకుఁ బాఠశాలలు స్థాపించి యాంగ్లేయభాష నేర్పింపుఁడని గవర్నరు జనరలుగారగు, ఆమ్హ రష్టుప్రభువుగారి కొకయుత్తరము వ్రాయుటయేగాక, నిరువురు దొరలతో గలిసి 1817 వ సంవత్సరమున హిందూకళాశాలలు స్థాపించెను. బంగాళీ బాషలో వచన కావ్యములు వ్రాయుటకుదారితీయుటయేగాక, యాభాషలో లలితపద గర్భితములగు కృతుల ననేకములు రచించెను. ఆకృతులు వంగ దేశపు స్త్రీ పురుషు లిప్పటికిని బాడుచుందురు.

రామమోహనునకుఁ జిరకాలమునుండి యూరపుఖండమును ముఖ్యముగ నింగ్లాండుదేశమును జూడవలయునని యభిలాష యుండెను. స్వదేశమున తనతోడి ప్రజలకుఁ జేయవలసిన సత్కార్యము లనేకము లుండుటంజేసి యదివఱ కతనికిఁ బోవీలు చిక్కఁదయ్యె ! 1830 వ సంవత్సరమున నతని యభిలాషకు ననుగుణముగ నొక యదను గలిగెను. అప్పటి ఢిల్లీ చక్రవర్తి, పేరునకుమాత్రము సార్వ భౌముఁడయి యుండి యేలుటకు రాజ్యము, ననుభవించుట కైశ్వర్యములేక, తన దీనదశ నింగ్లాండులోని పార్లమెంటు మహాసభవారికిఁ దెలియఁ జేసికొనఁ గోరి తాస్వయముగఁ బోఁజాలక తనపక్షమున సీమకుఁ బొమ్మని రామమోహనుని బ్రార్థించి, యతనికి రాజా యను బిరుదము నిచ్చి, తగు ధనమిచ్చి పంపెను. తన యభిలాషకు, ఢిల్లీశ్వరుని బనికిం దోడుగ, రామమోహనునకుఁ గర్తవ్య మింకొకటి యుండెను. సహగమనము నిచ్చటి గవర్నరు జనరలుగారు మాన్పించిరను కోపమున బూర్వాచార పరాయాణులు, ప్రాఛీనమగు నాయాచారమును నిలుపుఁడని పార్ల మెంటువారికి పలుమహజర్ల నంపిరి. రామమోహనుఁడు గవర్నరుజనరలుగారు చేసినపని మంచిదనియు, నా యాచారము తుదముట్ట నిర్మూలింప వలసినదనియు, ప్రజలవలనఁ,


గొన్ని మహజర్ల వ్రాయించి వానింజేకొనిఁ స్వయముగ పార్ల మెంటు వారికి సమర్పింపఁ దలఁచి 1830 వ సంవత్సరము నవంబరు 15 వ తారీఖున నతఁ డింగ్లాండునకుఁ బయనమయి పోయెను. మన మెఱిఁగినంతవఱకు సముద్రయానము చేసిన బ్రాహ్మణులలో నితఁడే మొట్టమొదటివాఁడు. ఆతనికీర్తి యతనికన్న మున్నే యింగ్లండునకుఁ బోయి నెలకొనియుండుటచే వాని నందఱు గారవించిరి. రాజ దర్శనము స్వయముగఁ జేయుటయేగాక యాయన పట్టాభిషేక సమయమున, రామమోహనరాయ లన్య దేశపు రాయబారులతో సమానముగ గౌరవింపఁబడెను. ఆ కాలమునం దా దేశంబున నున్న కవీశ్వరుఁలు, తత్వరాస్త్రజ్ఞులు, చరిత్రకారులు, ప్రకృతశాస్త్ర పండితులు వాని పరిచయము చేసికొనుట గౌరవ హేతువనియెంచి, స్వయముగ వచ్చి చూచియు, జాబులువ్రాసి బ్రత్యుత్తరముల దెప్పించుకొనియు దనివినొందిరి. హిందూదేశపు రాజకీయవ్యవహారముల విషయమయి రామమోహనుఁడు పార్ల మెంటు కమిటీవారివద్ద కడు నిపుణముగ, సాక్ష్యమిచ్చెను. సహ గమనము నుద్ధరింపవలయునని ఛాందసులు పంపినమహజర్లు పార్ల మెంటుసభవారు విచారణ సేయునపుడు రామమోహనుఁడు స్వయముగ నచటనుండి తానుతెచ్చిన మహజర్లు వారికి సమర్పించి, చెప్పవలసినసంగతులఁ జెప్పి యా యాచారము రూపుమాయునట్టు చేసెను. 1831 వ సంవత్సరమున నాతఁడు ఫ్రాన్సుదేశముబోయి యచట కొంతకాలముండి ఫ్రెంచి భాష నేర్చికొనెను. అచట నున్న కాలములో నతఁడు ఫ్రెంచిరాజును సందర్శించి రెండుమూడుమారు లాయనతో విందు లారగించి గౌరవ పాత్రుఁడయి యింగ్లాండునకు మరలవచ్చి యాంగ్లేయభాషలో కొన్ని గ్రంథములు వ్రాసెను. ఆగ్రంథముల శైలికిని, నిపుణత్వమునకును, మంచిమంచి యింగ్లీషుకవులు వానినుగ్గడించి మెచ్చుకొనిరి. ఇట్లు యూరపుఖండములో సుప్రసిద్ధుఁడయి కీర్తిగాంచిన, యీమహాపురు


షుఁడు మరల స్వదేశమునకు వచ్చి తన యాత్రావిశేషముల దన మిత్రులకుఁ దెలుప నతనికి కాలము లేదయ్యెను.

1833 వ సంవత్సరము సెప్టెంబరునెలలో డాక్టరు కార్పెంటరు దొరగారు వానిని బ్రిస్టలునగరమునకు బిలుచుకొనిపోయి, గౌరవించెను. అక్కడనుండఁగ నాయనకు, సెప్టెంబరు 10 వ తారీఖున జ్వరముతగిలెను. ప్రజ్ఞావంతులగు వైద్యు లెన్ని చికిత్సలఁ జేసినను కార్పెంటరుదొరగారెన్ని శ్రమలబడినను, నవియెల్ల నిరర్థకములు కాఁగా హిందువుల భాగ్యదోషమున రామమోహనరాయలు సెప్టెంబరు 27 వ తేదీని కాలధర్మము నొందెను. అక్కడిమిత్రు లామహాత్ముని బ్రిస్టలునగరసమీపమున భూస్థాపితము చేసిరి. పిమ్మట పదిసంవత్సరములకు రామమోహనుని ప్రియమిత్రుఁడగు ద్వారకనాథ టాగూరుగారు సీమకుఁ బోయి యాపురుషశ్రేష్ఠునకు నొకసమాధి గట్టించి ధన్యుఁడయ్యెను.

పదునాలుగేండ్ల వయసు వచ్చినది మొదలు దేశమునిమిత్తము దేశస్థులనిమిత్తము, పలుకష్టములఁబడి యాసుజనుడు తుదకు పర దేశమున బంధుమిత్రులు లేనిచోట దేశోపకారార్థమై ప్రాణముల విడిచెను. ఈలోకోపకారకుని ఋణము భరతఖండవాసు లెన్నిటికిని దీర్చుకొనఁజాలరు. ఈతఁపు కార్యశూరుఁడు. అవసరమయినయపుడు సకలకష్టములకులోనై ధైర్యముతో నిలిచి తనకు మంచిదనితోచెడు కార్యమును నిర్వహించెడివాఁడు. దయామయుఁడు, ధర్మశాలి ; స్వగౌరవమును జక్కఁగఁ గాపాడుకొనుచు నీతిమార్గము ననుసరించువాఁడు. మతవిషయమునను స్వదేశవిషయమునను ప్రతిమనుష్యునకు స్వాతంత్ర్య ముండదగునని యతనివాదనము. ఒకనాడు డాక్టరు మిడిల్‌టన్ అను క్రైస్తవమతబోధకుఁడు రామమోహనునిం బిలిచి క్రైస్తవమతమునం గలియుమని బోధించి దానివలన పలుకుబడి, ధనము, అధికారము, గౌరవము, కలుగునని నొక్కి చెప్పెను.


ఆమాటలు విని రామమోహనుఁడు కోపోద్దీపితుఁడయి తుచ్చ గౌరవములు సంపాదించుటకయి తానుమతము మార్చుకొననని వానితో స్పష్టముగఁ జెప్పి యానాఁడుమొద లాదొరగారితో స్నేహము మానెను. గ్రంథవిస్తరభయమునమానవలనెగాని రామమోహనుని యౌదార్యవినయశాంతగుణములను దెలుపుకథ లనేకము లున్నవి. అంతటి నీతిశూరుఁడు లోకోపకారియు మరల నిప్పటివరకును మన భరతఖండమున జనియింపక పోవుటయే, యాతఁడు సుగుణసంపదలో నద్వితీయుఁడని చెప్పుటకుఁ దార్కాణము "ఏకమేవా ద్వితీయం బ్రహ్మ" అను నుపనిషద్వాక్యమును నమ్మి యాతఁడు విగ్రహారాధనము నిరాకరించి పరిశుద్ధాస్తికమతము నవలంబించెను. గావున దయామయుఁడగు నాపరబ్రహ్మమే యాతని యాత్మకు శాశ్వతానంద మిచ్చుగాత.


ఈశ్వరచంద్ర విద్యాసాగరులు

హిందూ దేశమున మృతిపొందిన భర్తతో చిచ్చునఁబడిచావ వలసిన యాడువాండ్రను బ్రతికించి దేశమునకు మహోపకారము జేసినయతఁడు రామమోహనరాయలు ; అతని ప్రసాదమున బ్రతికిన వితంతువులను యావజ్జీవ మిహలోక నరకమగు వైధవ్యమునుండి తప్పించి వారిని మరల ముత్తయిదువలఁ జేసి పసపుకుంకుమలు నిలిపిన పరమోపకారి యీశ్వరచంద్ర విద్యాసాగరులు

ఈయన బంగాళాదేశ కులీన బ్రాహ్మణుఁడు. ఈతఁడు 1820 వ సంవత్సరమున హుగ్లీమండలములోని వీరసింఘ గ్రామమున నొక నిరుపేద కుటుంబమునం బుట్టెను. వాని తాతయగు రామజయబెనర్జీ సన్యాసియై దేశాటనముఁ జేయుచు కాలక్షేపము చేసెను. తండ్రి యగు ఠాకరుదాసుబెనర్జీ యొక వర్తకునియొద్ద నెలకు పదిరూపాయిల