మహాపురుషుల జీవితములు/మహాదేవ గోవింద రెనడీ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
Mahaapurushhula-jiivitamulu.pdf

మహాదేవగోవింద రెనడీ

మహాదేవగోవిందరెనడీ 1842 వ సంవత్సరం జనవరి 20 వ తేదీని జన్మించెను. ఈయన మహారాష్ట్ర బ్రాహ్మణుఁడు. తండ్రి కొల్లాపురసంస్థానములో నుద్యోగస్థుఁడు. రెనడీ ఎల్ఫినిష్టనుకాలేజీలో జేరి క్రమముగా విద్యాభ్యాసముచేసి 1862 వ సంవత్సరమున బి. ఎ. పరీక్షయందును. 1863 సంవత్సరమందున యమ్. ఎ. పరీక్షయందును గృతార్థుఁడై బంగారుపతకమును బహుమానముగ బడసి 1866 వ సంవత్సరమున యల్. యల్. బి. పరీక్షయందుఁ దేరెను. విద్య ముగించినపిదప నతఁడు గవర్న మెంటువారికి మహారాష్ట్రభాష నింగ్లీషులోనికి భాషాంతరీకరించు నుద్యోగమునందు బ్రవేశించెను. తరువాత నతనికిఁ గొల్లాపుర సంస్థానములో జడ్జీపనియైనది. 1868 వ సంవత్సరమందు మున్ను దాను చదువుకొన్న కళాశాలలోనే ఇంగ్లీషు భాషా పండితుఁడుగ నతఁడు నియమింపఁబడుట జే జడ్జీపని స్వల్పకాలములోనే మానుకొనెను. హిందూ దేశస్థు నొకనిని దొరతనమువా రింగ్లీషు భాషాపండితుఁడుగ జేయుట మన కపూర్వ గౌరవము చూపుటగదా! బొంబాయి రాజధానిలో విద్యాశాఖకధిపతిగాఁ (అనగాఁడైరెక్టరుగ) నుండిన సర్ అలగ్జాండరు గ్రాంటుదొరగారు సీమకు బోవునపుడు రెనడీగారిని గూర్చి మాటలాడుచు నతఁడా కళాశాలకు భూషణమనియు నతని బుద్ధిసూక్ష్మత నిరుపమాన మనియు మిక్కిలి కొనియాడెను. ఒకసారి రెనడీ విద్యార్థిగా నున్నపుడు గ్రాంటుదొరగారు వానిని దేశచరిత్రలలో బరీక్షించి తన ప్రశ్నల కతఁ డిచ్చిన యుత్తరములను మున్ను దాను చదువుకొన్న యాక్స్ఫర్డుకాలేజీకి పంపెను. హిందూవిద్యార్థుల తెలివితేటలు సీమలోనున్న దొరలకుఁ దెలుపుటకై యతఁడీపని జేసెను. చెన్నపట్టణములో నుండిన పూండీరంగ


నాధము మొదలియారుగారికి నిట్టి గౌరవమే జరిగెను. ఆయనను గణితశాస్త్రములో బరీక్షించి డైరెక్టరుగారు ఉత్తరపుకాగితములను సీమకంపిరఁట. రెనడీగారి కద్భుతమైన జ్ఞాపకశక్తిగలదు. ఏ పుస్తకమయిన నొకసారి జదివి యందలి ముఖ్యసారాంశమును మరల వ్రాయగలిగినవాడఁట. కళాశాలలో నతఁ డుపాధ్యాయుఁడుగనుండి బాలురకిచ్చు నుపన్యాసములు మిగుల మనోహరములుగను బహు శాస్త్రార్థ సమేతములుగనుండుటచే తోడియుపాధ్యాయులు డైరెక్టరు దొరగారుఁగూడ వానికడకుబోయి విద్యార్థులతోపాటు గూర్చుండి యాయుపన్యాసములను వినుచుండెడివారఁట. ఏశాస్త్రమునుగూర్చి యైన స్వయముగా నాలోచించఁగలిగినశక్తిగలవాఁడు. హిందూదేశములో రెనడీ యొక్కఁడే యని మఱియొక దొరగారు పలికిరఁట. 1871 వ సంవత్సరమున రెనడీగా రుపాధ్యాయ పదవి మాని పునహా నగరములో సబుజడ్జీగా నియమింపఁబడెను.

ఆసంవత్సరమందే రెనడీ యడ్వొకేటు పరీక్షయందు గృతార్ధుడయ్యెను. దీనిచేత నతనికి ఇంగ్లీషు బారిష్టరుతో సమానమైన గౌరవముగలిగెను. అది మొదలుకొని యతఁడు మృతినొందువఱకు న్యాయాధిపతి పదవియందే యుండెను. 1871 వ సంవత్సరము మొదలుకొని పదిసంవత్సరములవఱకు నక్కడక్కడ సబిజడ్జీగానుండి 1881 వ సంవత్సరమందు పునహాసతారా చిన్నచిన్న కోర్టులను బరీక్ష చేయుటకు జడ్జీగా నేర్పరుపబడెను. 1884 వ సంవత్సరమున నతఁడు స్మాలుకాజుకోర్టు జడ్జిగా నియమింపఁబడెను. అక్కడ నున్నప్పుడె డక్కను కాలేజీలో రెనడీ ధర్మశాస్త్రవిషయమై కొన్ని యుపన్యాసముల నిచ్చెను. 1886 వ సంవత్సరమం దతఁడు గవర్నమెంటు వారిచేత హిందూదేశముయొక్క యాదాయ వ్యయములను గూర్చి యేర్పరుపఁబడిన సంఘములో సభికుఁడుగా నియమింపఁ


బడి యప్పుడు గావించిన యుత్కృష్ట సహాయమునకు దొరతనము వారిచేత సి. ఐ. ఇ. అను బిరుదము నందెను. అదియునుగాక దొరతనమువారు వానినెన్నియో పర్యాయములు బొంబాయి గవర్నరుగారి శాసన నిర్మాణసభలో సభికుఁడుగ నేర్పరచిరి. 1893 వ సంవత్సరము నవంబరునెలలో కాశీనాథ త్రియంబక తిలాంగుగారు లోకాంతరగతుఁడగుటచే దొరతనమువారా నెల 23 వ తేదీని రెనడీగారిని హైకోర్టు జడ్జీగా నియమించిరి. నాడు మొదలుకొని రెనడీ తన మరణపర్యంతము నాయుద్యోగము మిక్కిలి సామత్యముతో నిర్వహించెను.

ఆయన 1901 వ సంవత్సరము జనవరి 17 వ తారీఖున మృతినొందెను. ఆతని మరణమునుగూర్చి హిందూదేశస్థులు తెల్లవారు సమానముగ శోకించిరి. దానిం బట్టియే జనులకతనియం దెంత యనురాగము గలదో తెలియగలదు. ఇటీవల వారిలో నెవరి మరణము జనులకు రెనడీ మరణమంత విషాదమును గలిగింపలేదు. ఏలయన రెనడి తన దేశస్థులయొక్క హృదయానురాగమునే సంపాదించుకొనెను. హిందూదేశముననున్న ప్రతిపట్టణమందు వానిమరణమును గూర్చి శోకించుటకును వాని కుటుంబమును పరామర్శ చేయుటకును సభలు జరుపఁబడెను. ఈసభలో హిందువు లొక్క రేగాక సర్వమతములవారు సర్వాభిప్రాయములవారును వాని యున్నత గుణములను మెచ్చి తమవిషాదముం దెలిపిరి. బొంబాయి హైకోర్టు జడ్జీలు వాని మరణము తమ హైకోర్టునకేగాక యావద్దేశమును నష్టకరమని వక్కాణించిరి. ఇండియాగవర్నమెంటువారు సయితము వాని మరణమునకు వగచుచు వాని సామర్థ్యాదులంగూర్చి యీ క్రిందివిధముగ వ్రాసిరి. అత్యధిక సామర్థ్యము పాండిత్యము స్వతంత్రస్వభావము గలిగిన రెనడీగారి మరణముచేత దేశమంతయు గొప్పనష్టముపాలై


నది. అతఁడు హైకోర్టు జడ్జీయగుటచేత నతని కంతకీర్తి రాలేదు. ఆతని యితర గుణములముందర నున్నతపదవి యెంతమాత్రమును బనికిరాదు. ఆతఁడు పరిపూర్ణ పండితుఁడు స్వతంత్రస్వభావము గాఢదేశాభిమాని రాజనీతివిశారదుఁడు గొప్ప సంఘసంస్కారి. మతసంస్కారకుఁడు ఇంక ప్రవర్తనమును గురించి విచారించితిమా కేవలము ఋషియని చెప్పవలయును. అతఁడు ప్రార్థనసమాజములో సభికుఁడు. మనస్సునందితడు బ్రహ్మసమాజమతస్థుఁడు. అతని మరణానంతరము ప్రస్తుతము బొంబాయి హైకోర్టులో జడ్జీగానున్న చంద్రవర్కరుగారు చిన్న మత విషయకోపన్యాసముచేసి రెనడీగారి జీవితము గొప్పదగుటకుఁ గారణము నీక్రిందివాక్యములతో జెప్పెను.

"రెనడీగారన నెట్టివారనియు నతని జీవితమునందు బ్రధాన కీలక మేదనియు నన్నుమీరడుగుదురేని యొక్కమాటలో జెప్పెదను. అతని యమితమైన భక్తియే గొప్పతనమునకుఁ గారణము. అతని యభిప్రాయప్రకారము మతమనగా నేజోక్యమునకుఁ బోక ముక్కు మూసికొని యొకమూలగూర్చుండుట గాదు. రాజనీతి విషయములలోను సాంఘిక విషయములలోను మతవిషయములలోను విద్యావిషయములలోను మనుష్యుఁడు ప్రవేశించి శక్తివంచనలేక దుర్గతిలో నున్న జనుల కుపకారముచేయుటయే మతమని యాయన యభిప్రాయము. ఏపనిలో నతఁడు ప్రవేశించినను దానిని మనఃపూర్వకముగా చేయువాఁడు. రెనడీ యొక్కొక్కప్పు డేదేవాలయమునందో పురాణార్థముల జనులకు బోధించుటయు మఱియొకప్పు డార్యసమాజము వారి పక్షమున నుపన్యాసమిచ్చుటయు యావజ్జీవము బ్రహ్మసమాజ సిద్ధాంతముల ప్రకారము నడచుకొనుటయుఁ బ్రార్థనసమాజములో సభికుఁడై యుండుటయు మన మెఱుంగుదుము. అదిచూచి కొందఱు రెనడీయొక్క మతమేదో తెలియక యతని చరిత్రము పరస్పరవిరుద్ధ


మని తలఁచి యతని మొగముమీఁదనే యామాట లనుచు వచ్చిరి. కాని దానియర్థము వారు గ్రహింపఁ లేదు. అతని చరిత్రము విరుద్ధము గాదు. మంచిమతములన్నిఁటియందు నతనికి సమానాదర ముండుటచే నతఁ డేమతములోను జేరినవాఁడు కాదనుకొనుటకంటె యతనిది విశాలహృదయమనియు నతఁడు సర్వసమానుఁడనియు మనము భావింపవలసియున్నది. అతని యభిప్రాయ మేమనగా ప్రపంచ ముత్తరోత్తర వృద్ధిగలదగుటచే క్రొత్తమతము లనేకములు పొడమినప్పుడు వైరుద్ధములు లేక సామ్యముగల విషయములలో నన్ని మతములవారుఁ గూడి పనిచేసి దేశము నుద్ధరింపవలయునని."

అతఁను తక్కిన రాజకీయాది విషయములలో జేసినపని యటుండ నిండు. ఆయన సంఘసంస్కార విషయమున జేసినపనికే దేశస్థు లందఱు మిగుల కృతజ్ఞులై యుండవలయును. అన్ని సంస్కారములకంటె సంఘసంస్కారమందే యతఁడత్యాదరము గలిగియుండువాఁడు. ఈ విషయమున నతఁడు తన యావచ్ఛక్తిని ధారవోసెను. ప్రతిసంవత్సరము దేశీయమహాసభ జరిగిన పట్టణములోనే సంఘ సంస్కరణసభగూడ గావించుచు నచ్చటికి విధిగా దానుబోవుచు నచ్చటసాంఘిక విషయమైన యుపన్యాసము మొకటి తానుచేయుచు నాసభలోజరిగిన చర్చలను స్వధనము వెచ్చపెట్టి ముద్రింపించుచు మరణకాలమువఱకు (ననగా బదునైదు సంవత్సరములు) ఆ మహాత్ముడు పాటుపడెను. ఆయననిజముగా మూఢాచారపరాయణులతో యుద్ధముచేయుచునే ప్రాణములు విడచెనని చెప్పవచ్చును. ఏలయన నతనిమరణమునకు నిరువదిదినముల క్రిందట దేశీయసభతో పాటు లాహోరునగరములో సంఘసంస్కరణ సభజరిగెను. రెనడీరోగపీడితుఁడై కదలలేక మంచమెక్కి యుండుటచే నక్కడ కెప్పటియట్ల పోలేక వాగ్జాలముగ దానియ్యవలసిన యుపన్యాసమును వ్రాసి


యొకరిచే జదువ బంపెను. ఆరోగ్యము మరల తిరుగనేలేదు. ఇతఁడు సంఘసంస్కారపక్షమువాఁ డగుటచే వానియభిప్రాయములు మతాంతరులగు తెల్లవారి యభిప్రాయము లేయని భావించి దేశస్థులలో గొందఱు తమకతఁడుచేయు నుపకార మెఱుంగక వానిని నవనాగరికుఁడని పూర్వాచార ద్వేషియని దేశమునకు శత్రువని యీప్రాంతముల సంస్కర్తల నిచ్చటివారు నిందించినట్లే నిందింపఁజొచ్చిరి.

సంఘసంస్కారము యుక్తమైనదని దగిన హేతువులు చెప్పి మన స్వదేశస్థులను మెప్పించుటకే యతఁ డెంతో కష్టపడుచుండ కొందఱాంగ్లేయులు గూడ నవనాగరికుల నధిక్షేపించుచు వచ్చిరి. రెనడీవారికిఁ గూడ దగిన యుత్తరములు చెప్పవలసి వచ్చెను. కాశీనాథ త్రియంబకతిలాంగుగారు కొన్ని యెడల పూర్వాచార పరాయణుఁడై కొన్ని విషయముల నవనాగరికుఁడై రెనడీవలెనేయుండి సంఘసంస్కారమునకై పాటుపడెను. అతనిని బూర్వాచార పరాయణులుఁ గొందఱు తెల్లవారు గూడ విరుద్ధ వర్తనుఁడని యధిక్షేపించిరి. ఆయధిక్షేపణలకు రెనడీ ప్రత్యుత్తరముల జెప్పుచుతిలాంగుగారి ప్రవర్తనమందు విరుద్ధమేమియు లేదని యీక్రిందివిధమున మాటలాడెను. ఈ సంగతులతఁడు ముఖ్యముగఁ తెల్లవారి నుద్దేశించియే పలికెను. "పరిపూర్ణమైన నాగరికతగలిగిన మీరు ప్రస్తుత ప్రాచీన నాగరికతల మధ్యమునబడి పరస్పరవిరుద్ధములగు రెండుమతముల సందున నిరికి యగచాట్లుపడుచున్న మమ్ముంజూచి మావర్తనము నర్థముచేసికొనలేకయున్నారు. అట్టిద్విభావ మక్కర లేదని తలంచు వారు మాలోకొందఱున్నారు. వారి యభిప్రాయమే మన దేశకాల పాత్రములబట్టి మనకేమార్పులు రాలేదనియు మనపూర్వులున్నట్లె యితరప్రపంచ సంబంధములేక మనముగూడ నుండవచ్చుననియు వారిమాట యటుండనిచ్చి రెండవపక్షము జూతము. ప్రాచీనమైన


దంతయు జచ్చినదనియు దానితో మన కేసంబంధము లేదనియు ప్రస్తుతనాగరికతను భవిష్యత్కాలమందువచ్చు నాగరికతను సమగ్రముగ నవలంబించి బ్రతుకుటయే మనకు గార్యమనియు దలంచువారును మనలో ననేకులు గలరు. ఈయిరువురకు నడుమ మరియొక జిన్న తెగ కలదు. ప్రాచీన నాగరికతలో మంచినంతను మన మవలంభించుచు నీశ్వరేచ్ఛచేత మనదేశమున వ్యాపించుచున్న నవనాగరికతనుగూడ వదలక దానిలోనున్న మంచినిగూడ గ్రహించి యారెంటికి సమన్వయముచేసి మనము లాభము నొందవలయుననియు నీ తెగవారు దలంచుచున్నారు. ఇట్లు మే ముభయపక్షములు నవలంభించుటచే మా మిత్రులు శత్రువులుగూడ మా యభిప్రాయము నర్థముచేసికొనలేక యున్నారు. గతించిన మన మిత్రుడు వేదాంతమార్గప్రదర్శకుఁడు ధీరుఁడు నగు తిలాంగు నిశ్చయముగ నీ తెగలో జేరినవాఁడే. ఆసచ్చరిత్రుఁడు క్రొత్తనాగరికతను వదలి పూర్వాచార పరాయణుఁడై యుండినను లేక పూర్వాచారములను వదలి నవనాగరికుఁడై ప్రాచీనమంతయు వదలుకొనియుండినను పాపమింత స్వల్ప కాలములో మృతినొందక దీర్ఘ కాలము జీవించియుండునని నేను తలంచుచున్నాను. అట్లయినచో నతనికి విచారము లుండకపోవును. దేహస్థితిత్వరగా చెడకయుండును. తిలాంగు వానిమిత్రులు పడియెడు మనఃపరితాపమును మన యింగ్లీషుమిత్రు లెఱుగక ద్విభావము గల వారిని వారి నధిక్షేపించుచుందురు.

రాజకీయ వ్యవహారములయందును వానికి మిక్కిలి ప్రవేశము గలదు. అతఁడు గవర్నమెంటువారి యుద్యోగస్థుఁడైనను దేశీయ మహాసభను స్థాపించిన వార నేకాంశములలో నితని యాలోచనమును గ్రహించుచువచ్చిరి. బొంబాయిరాజధానిలో నతనిచేతసవరింపఁబడని గొప్పమహజరులు వానియాలోచనముపుచ్చు కొనిన ఘనకార్యములు


వానిచేత నుపదేశము పొందని ఘనపురుషులు లేరఁట. అతనికి దేశ చరిత్రములయందు మిక్కిలి యభిరుచి. కడసారి యతఁడు చదివిన పుస్తకముగూడ నొకదేశచరిత్రయే. స్వదేశపువ్యాపారములు వృద్ధి పొందుటయు శిల్పవిద్యాదులు మనవారునేర్చుకొనుటయు నున్నప్పుడే మన దేశము బాగుపడునని యాయన తలంచెను. మహారాష్ట్ర బలోదయమనుపేర రెనడీ యింగ్లీషులో నొకచరిత్రము వ్రాసెను. అందు బ్రథమభాగము మాత్రమే ముగిసినది. రెండవభాగము ముగియక మునుపే మృత్యుదేవతయొక్క క్రూరహస్తము వాని నెత్తుకొని పోయెను. ఆ గ్రంథము ముగిసిన పక్షమున హిందువుల కెంతయో లాభము కలిగియుండును. హిందువులు మిక్కిలి దురదృష్టవంతులగుట చేతనే యాయుదారశీలుఁ డంతత్వరలోఁ జనిపోవుటయు నట్టియుగ్ద్రంథము ముగియకపోవుటయు సంభవించెను. అతని యుద్యోగముకన్న పాండిత్యముకన్న వానిసద్గుణములే జనుల కతనియం దనురాగమును బెంచినవి. మహాధికారియయ్యు నతఁడందఱికి నొదిగి యుండును. మహాపండితుఁడయ్యు శిష్యుఁడట్లు వినయమున నేర్చుకొనఁజూచును. పరులమనస్సులు నొవ్వకుండ తన యభిప్రాయమును జెప్పుచుండును. ఈతఁడు రామమోహనరాయలు, విద్యాసాగరుఁడు దేవేంద్రనాథ టాగూరు, కేశవచంద్రసేనుఁడు, ఆనందమోహనభోసు మొదలగు మహానీయులవలె మతాది సంస్కారములలోఁ గార్యసూరుఁడుగా నుండలేకపోయినను మనసులో సంస్కారమన్న మిక్కిలి యిష్టము గలవాఁడు. ఈయన చరిత్రము హిందూదేశస్థులు చిరకాలము జ్ఞాపక ముంచుకో దగినది.