మహాపురుషుల జీవితములు/మధుసూదన దత్తు

వికీసోర్స్ నుండి

మధుసూదన దత్తు

మధుసూదనదత్తు బంగాళాదేశములోని 'జస్సూరు' జిల్లాలో సగందరి యను గ్రామమున 1824 వ సంవత్సరమున జన్మించెను. వాని తండ్రియగు రాజనారాయణుఁడు సాదరుదివానీఅదాలత్‌' కోర్టులో న్యాయవాదిగా నుండెను. ఆయనకు నలుగురు భార్యలు. ఈ మధుసూదనుఁడు జ్యేష్ఠభార్య కుమారుఁడు. ప్రారంభమున నతఁ డందఱు బాలకులవలెనే మాతృభాషయగు బంగాళీని కొంతకాలము నేర్చుకొని యనంతరమున 1837 వ సంవత్సరమున హిందూకళాశాలలో జేరెను. ఆకళాశాల యా కాలమున డిరోజియోయను దొరగారి పరిపాలనముక్రింద నుండెను. ఆయన బంగాళాబాలకుల ప్రవర్తనమును జక్క జేసి విద్యాబుద్ధులు చెప్పి పనిచేయుటలో జాలపని చేసెను. ఆయనకు శిష్యులై విద్యనేర్చికొనిన బంగాళాబాలకు లనేకులు సంఘ సంస్కార ప్రియులై హిందూమతములలో నుండు దురాచారములను దొలగించుటకై పాటుపడిరి. మధుసూదనదత్తును వారిలో నొకఁడయ్యెను.

ఆ పడుచు వాండ్రందఱు సంఘదురాచారములను దొలగించి దేశమున కుపకారము జేయదలంచుటయేగాక రాజ్యాంగవిషయములయందుఁ గూడ బనిచేసి భరతఖండము నున్నతస్థితికి, దెచ్చుటకును స్వభాష నభివృద్ధి చేయుటకును సంకల్పించిరి. అంతియగాక తామభ్యసించిన శాస్త్రవిద్యలచేత తా మాంగ్లేయభాషలోగూడ కవనము చెప్పి చిత్రవచన కావ్యముల రచించి ప్రసిద్ధిగాంచగల వారమని నమ్మియుండిరి. మధుసూదనదత్తును దనమనంబున నిట్టి నమ్మకము గలవాడె. అతఁడు 1837 వ సంవత్సరము మొదలు 47 వ సంవత్సరము వఱకు హిందూకళాశాలలో విద్యార్థియైయుండి యా
కాలముననే యింగ్లీషుభాషలో ననేక పద్యములరచించెను. అప్పుడు హిందూకళాశాలలోఁ జదువుకొను విద్యార్థులందరిలో మదుసూదనదత్తు బుద్ధికి బృహస్పతియను పేరుపడెను. అతఁడు తరుచుగా మోహము దేశాభిమానము మొదలగు విషయములఁ గూర్చి యింగ్లీషులో పద్యములు వ్రాయఁజొచ్చెను. వానికి బాల్యము నుండియు నింగ్లాడుదేశముఁ జూడవలయునను గుతూహలము గలదు. ఆ దేశము తా నెన్నఁడు జూడగలుగుదునో యని యౌత్సుక్యము నొందుచు నింగ్లీషులో నొక చిన్నపద్యము వ్రాసెను. ఆ పద్య మెంతయు మనోహరముగా నుండును.

హిందువులలో సామాన్య బాలకులకే చిన్న తనమందనేకులు పిల్లనిచ్చి పెండ్లిచేయుచుందురు. అట్టియెడ కుశాగ్రబుద్ధియై విద్య నభ్యసించుచున్న మధుసూదనదత్తు వంటి వానికి సంబంధములు వచ్చుట యాశ్చర్యముగాదు. అందుచేత నతనితండ్రి కుమారునకు వివాహముచేయ నిశ్చయించి యొక చిన్నపిల్లను గుదిర్చి తద్విషయ ప్రయత్నములు చేయనారంభించెను. నలుగురు భార్యలం గట్టుకొని నానా యవస్థలం బడుచున్న తండ్రి తనకుఁ గూడ చిన్న తనమందే వివాహము చేయఁదలంచి నప్పుడు మధుసూదనదత్తునకు వివాహ మిష్టము లేకపోయెను. అతఁడు తన యనిష్టము సూచించియు తన మాట సాగదని తలంచి వివాహ సమయమున నిల్లువిడిచి పోయెను, పోయి క్రైస్తవ మత బోధకులగు నాంగ్లేయుల శరణు జొచ్చి యదివఱకె క్రైస్తవ మతములోఁ గలిసియున్న కృష్ణమోహన బెనర్జీ సహాయమున నాలుగు దినము లెవ్వరికిం గనఁబడకుండ దాగి యుండెను.

ఎట్ట కేలకు 1843 వ సంవత్సరమున ఫిబ్రేవరి నెలలో నతఁడు క్రైస్తవమతములో గలసి యానాఁడు మొదలు మైకేలు మధుసూదన దత్తను పేరఁ బరగుచుండెను. మైకేలనునది యతఁడు క్రైస్తవమతములోఁ గలసినప్పుడు కలిగిన నామము. అతని తండ్రి వానియిష్టము లేకుండ బలవంతముగ వివాహము చేయఁదలంపకపోయిన పక్షమున మధుసూదనదత్తు క్రైస్తవమతములోఁ గలియక తన సహాధ్యాయుల వలెనే పేరునకైన హిందువుఁడై స్వమతమునందే యుండును. కాని యతనికిఁ గలిగిన నిర్బంధమువలన నతఁడు స్వమత పరిత్యాగముచేసి కృష్ణమోహనబెనర్జీవలెనే మతాంతరుఁడు కావలసివచ్చెను. పుత్రవాత్సల్య మతిశయముగాఁగల రాజనారాయణుఁడు మతభ్రష్ఠుఁడైన యాకొమరున కెప్పటియట్ల ధనమిచ్చి భిషప్ కాలేజీలో నాలుగు సంవత్సరములు చదువు చెప్పించెను. కాని కొన్ని కారణముల వలన కొడుకునకుం దండ్రికి మనస్పర్ధలు పొడమ రాజనారాయణుఁడు కుమారుని విడిచినందున మధుసూదనుఁ డసహాయుఁడై యుండవలసివచ్చె.

ఆకాలమున చెన్నపట్టణమునుండి కొందఱు బాలకులు వచ్చి బిషప్‌కాలేజీలో విద్యార్థులై కలకత్తాలోఁ జదువుచుండిరి. ఆ విద్యార్థుల ప్రోత్సాహముచేత చెన్నపట్టణమునకుఁ బోయి కొంచెము బాగుపడవచ్చునని కలకత్తా విడిచి యా పట్టణమునకుఁ బోయెను. చెన్న పట్టణమునకు వచ్చినపిదప వానిస్థితి మునుపటికన్న హీనము కాఁగా నతఁడు దారిద్ర్యబాధ మిక్కుటముగా ననుభవించి పొట్ట పోసికొనుట కేయుపాయమును గానక ఇంగ్లీషు వార్తాపత్రికలకు వృత్తాంతములను వ్రాసి దానిచే గొంతధనమును సంపాదించి జీవయాత్ర గడుపుచుండెను. ఆ నిరుపేదతనమందును మధుసూదనుఁ డింగ్లీషుకవనము మానక యందుఁ గృషిచేయుచు 1849 వ సంవత్సరమున "చెరలోనున్నస్త్రీ" యను శీర్షికతో నొక మనోహరమైన పద్యకావ్యమును రచించెను. ఆ కావ్యమును జెన్నపురమందలి స్వదేశీయులు నాంగ్లేయులుఁగూడ గడుమెచ్చిరి. ఇంగ్లీషుకవులలోఁ గడు ఖ్యాతివహించిన స్కాటు బేరను మొదలగువారి కవనములకు దత్తుకవనము దీసిపోదని యొక యింగ్లీషు వార్తాపత్రిక దనయభిప్రాయము నిచ్చె. ఈ పద్య కావ్యమును మధుసూదనుఁడు కలకత్తాలో నున్న బెత్యూను దొరగారికిఁ బంపినప్పు డాయన దానిం జదివి మహానందభరితుఁడై మధుసూదనదత్తునకు నొకజాబువ్రాసి దానిలో "నీవాంగ్లేయభాషలో జేసిన పరిశ్రమము స్వభాషలోనే చేసి దానికై యుపయోగించినకాలము నీస్వభాషకై యుపయోగించి గ్రంథములు రచించిన పక్షమున నీవు దేశోపకారము స్వభాషాభివృద్ధియుఁ జేయుటయే గాక నింతకంటె నెక్కుడు ప్రసిద్ధిని గాంచఁగలవు సుమీ" యని హితోపదేశముచేసెను. ఆ యుపదేశమును మన్నించి దత్తు వెంటనే కలకత్తానగరమునకు 1856 వ సంవత్సరమున వచ్చెను.

చెన్నపురమం దెనిమిది సంవత్సరములు వసియించినను వాని భాగ్యముకనుబొమ్మమీఁది వెండ్రుకవలె నెదుగుబొదుగులేక కలకత్తానుండి బయలు దేరినప్పు డెట్లుండెనో మరల కలకత్తాకు వచ్చినప్పు డట్లేయుండెను. జీవనాధార మేదియు లేకపోవుటచే నతఁడు రాగాఁనే కలకత్తా పోలీసుకచ్చేరిలో నొకగుమస్తాపని సంపాదించి తెలివితేటలు గలవాఁడగుటచే కొలఁదికాలములోనే తర్జుమాచేయు నుద్యోగస్థుఁడయ్యెను. ఇట్లు బ్రదుకుతెర వేర్పరచుకొని మనస్థ్సిమితము నొందిన పిదప దత్తు బెత్యూను చెప్పిన హితోపదేశము చొప్పున నడువఁ దలంచి బంగాళీభాషలోనున్న గ్రంథములను సమగ్రముగఁ జదివి 1858 వ సంవత్సరమున శర్మిష్ఠయను నొక నాటకమును రచియించి ప్రకటించి మరుసటి సంవత్సరమున పద్మావతియను మఱియొక నాటకమును వ్రాసెను. ఈనాటకము రచించిన వెంటనేయతఁడు రెండు ప్రహసనములు వ్రాసెను. అందొకటి బంగాళాబాలకులదురాచారము లనుగూర్చియు రెండవది బంగాళాదేశవృద్ధులు భోగపరాయణత్వము కపటమును గూర్చియు వ్రాయఁబడెను. ఈగ్రంథమువలన నతనికి గొంతపేరు గలిగెనుగాని వానికి మిక్కిలి ఖ్యాతి యతఁడు తరువాత రచియించిన పద్య కావ్యములవలనఁ గలిగెను. మొదటనుండియు నతనికి పద్యములలో యతిప్రాసము లుండుట యిష్టములేదు. అందుచేత యతిప్రాసములులేని పద్యములు వ్రాయుట మంచిదని యట్లు చేయ నిశ్చయించెను. యతిప్రాసలులేని వట్టిపద్యములు రసవంతముగా నుండవని యానాఁటిపండితులు నైకకంఠ్యములుగ నమ్మిరి. ఇతరులుమాట యేల? మధుసూదనదత్తునకు నధికసహాకారియై వానికిం బ్రోత్సాహముకలుగఁజేసిన మహారాజా జ్యోతీంద్రమోహన టాగూరు గారే యట్టి కవిత్వమును గూర్చి సందేహించిరి. అయినను దత్తు యతిప్రాస శూన్యమైన కావ్యమును రచియించుటకుఁ గృతనిశ్చయుఁడగుటచే టాగూరుగారు దాని నచ్చు వేయించుటకు వాగ్దానము చేసిరి. ఆ సహాయమునుజూచుకొని మధుసూదనుఁడు తిలోత్తమయను నిర్యతి ప్రాసకమయిన పద్య కావ్యమును రచియించి 1860 వ సంవత్సరమునఁ బ్రకటించెను. అపూర్వరచనగల యాపద్య కావ్యము ప్రకటింపఁబడిన తోడనే బంగాళాదేశమున గలిగిన కళవరము రమేశచంద్రదత్తుగా రీక్రింది విధముగా వర్ణించియున్నారు.

"నిర్యతిప్రాసకమయిన యీ గ్రంథము కనఁబడినతోడనే పండిత మండలమంతయు నాశ్చర్యమునొందెను. కల్పనాగౌరవము వర్ణనాచమత్కృతి శయ్యామృదుత్వము మొదలగునవి యందులేవని యెవ్వరు ననఁజాలరు గాని యతిప్రాసలు దీసివేయుటకు సాహసించి నందుల కిష్టపడక పండితులం దరు వాని పుస్తకము చెడిపోయినదని పలికిరి. ఈసాహసమునకుఁ గొందఱు వానిని పరిహసించిరి. కొందఱు నిందించిరి. ఈశ్వరచంద్రగుప్తుడు మొదలగు ప్రాచీనపద్ధతి కవులును విద్యాసాగరుఁడు ఆఖ్యకుమారబెనర్జీ మొదలగు నవీనపద్ధతి కవులును దత్తుయొక్క గ్రంథము యతిప్రాసలు తీసివేసినందున దుష్కావ్యమైనదని యభిప్రాయ మిచ్చిరి. మంచి యెచ్చటనున్నను దానిని మెచ్చుకొనునట్టి గుణగ్రహణపారీణుఁడు విద్యాసాగరుఁడు తిలోత్తమ భ్రష్ఠ కావ్యమని పలికెను. విద్యాసాగరుఁడే యట్లన తక్కువ ప్రజ్ఞఁగల తక్కిన కవులందఱు దత్తును గేలికొట్టి దూషించిరని వేరెచెప్ప నేల"

ఇట్లనేకులు గ్రంథమును గ్రంథకర్తను నిరసించినను మెచ్చుకొనువారుకొందఱు లేకపోలేదు. జ్యోతీంద్రమోహనటాగూరు డాక్టరు రాజేంద్రలాలుమైత్రా మొదలగు రసికులు కొందరు తిలోత్తమ యందలి రసములను గ్రహించి కవినిం బొగడఁజొచ్చిరి. జ్యోతీంద్రమోహన టాగూరు కావలసిన ధనమిచ్చి గ్రంథము నచ్చొత్తించెను. రాజేంద్రలాలుమైత్రుడు బంగాళీభాషలో యతిప్రాస శూన్యమైన కవిత్వమును గ్రొత్తగాఁ దెచ్చిపెట్టినందుకు సంతసించి దత్తును బొగడెను. రాజనారాయణభానుఁడను పండితుఁడు తద్గ్రంథవిషయమున నిట్లు వ్రాసెను. "దేవేంద్రుఁడు బంగాళీభాషను మాటలాడాఁ దలంచుకొనునేని నిశ్చయముగా నతఁడీ గ్రంథములోనున్న శైలినే మాటలాడును. అ గ్రంథకర్తయొక్క మహోన్నతములయిన కల్పనలను స్వభావవర్ణనమునఁగల ప్రజ్ఞయు రసపుష్టి జేయుటలోఁగల సామర్థ్యము పదలాలిత్యము విశేషించి పద్యముల నడకయు మమ్ము మహానంద భరితులఁ జేయుచున్నవి."

ఇట్లు తిలోత్తమ యను గ్రంథము చక్కఁగా నుండ లేదని విరుద్ధాభిప్రాయముల నిచ్చిన పండితులు మఱికొన్ని దినములకు మధుసూదనదత్తు రచియించిన మేఘనాధవధ యను మఱియొక కావ్యమును జూచి చిన్న బుచ్చుకొనిరి. ఆ పండితు లందఱుఁ జిట్టచివరకు మేఘనాధవధ మిక్కిలి సుందరముగా నున్నదని యొప్పుకొనక తప్ప దయ్యె. అట్లొప్పుకొన్న వారిలోనగ్రగణ్యుఁడు గుణగ్రహణపారీణుఁడు నగు విద్యాసాగరుఁడే. మహాభారతము బంగాళీభాషలో వ్రాసిన కాళీప్రసన్న సింహుఁడు మధుసూదనదత్తుయొక్క బుద్ధికుశలతకు మెచ్చి యీకవిపేరుపెట్టి యొక విద్యాసంఘము నేర్పరచేను. ఆ సంఘముననే దత్తు కృష్ణకుమారి యను నాటకమును నప్పటికి సమాప్తము కాని వీరాంగన యను పద్య కావ్యమురచించెను. 1862 వ సంవత్సరమున మధుసూదనుఁడు యూరపుఖండమునకుఁ బయనమయి తన చిర మనోరథమును నెరవేర్చుకొనెను.

అప్పు డతఁ డింగ్లాండునకుఁ బోయి యా దేశమునఁ నైదు సంవత్సరములుండి బారిష్టరు పరీక్షకుఁ జదివి 1867 వ సంవత్సరమున మరల మన దేశమునకువచ్చి కలకత్తా హైకోర్టులో బారిష్టరుగాఁ బనిచేయఁ జొచ్చెను. ప్రారంభము సరిగానే యుండెను. కాని వాని వృత్తిలో వానికి రావలసినంత పేరుమాత్ర మెందుచేతనో రాలేదు. బారిష్టరయిన పిదప నతఁ డాఱుసంవత్సరములు మాత్రమే జీవించి యుండెను. ఆకాలమయినను సుఖముగా గడువక కష్టములతోను దారిద్ర్యముతోను మనస్తాపములతోను వెళ్ళెను. ఆయన 1873 వ సంవత్సరమున అల్లిపురము నందలి యాసుపత్రిలో కాలధర్మము నొందెను. మరణమునకు సిద్ధముగానున్న కాలమునందును మధుసూదనదత్తు బంగాళీభాషలో మాయకనా రను పద్య కావ్యమును వ్రాసి తనజీవిత మెట్టు దుఃఖకరముగా ముగిసెనో దానిలో కథయు నంత దుఃఖకరముగా ముగించెను.

వెనుక నతఁడు చెన్నపురిలో నున్నపుడు నీలిమందుపంట పండించు నొక ఇంగ్లీషువారి కొమార్తెను పెండ్లియాడెను. కాని యీ వివాహము వానికి సుఖప్రదము గాకపోవుటచే నతఁడు భార్య వలన విడుదల పత్రిక పుచ్చుకొని మఱియొక దొరసానిని పెండ్లి యాడెను. ఈరెండవ భార్య వానికిమిక్కిలి యనుకూలమై ప్రవర్తించుటయేగాక వాని సుఖదుఃఖములను సమానముగ ననుభవించి యతనికన్న మూడుదినములు ముందుగామృతినొందెను. ఈ రెండవ భార్యవలన వాని కిరువురు కొమారులు గలిగిరి.

మధుసూదనదత్తు బంగాళాదేశములో పందొమ్మిదవ శతాబ్ద మందలి మహావిద్యావంతులలో నొకఁడు. ఆతఁడు మహాకవియేగాక గొప్ప సాహిత్య చక్రవర్తి. హిందూకళాశాలలోఁజదువు కాలమునఁ నతఁ డింగ్లీషును పారసీభాషను జదువుకొనెను. బిషపు కాలేజీలో గ్రీకు లాటిను సంస్కృతమును నేర్చెను. చెన్నపురమం దున్నపుడు తెనుగును ద్రావిడమును నభ్యసించెను. యూరపుఖండమునకు వెళ్ళినప్పుడు ఫ్రెంచి జర్మనీ ఇటాలియను హీబ్రూ భాషలయందుఁ బ్రవేశము సంపాదించెను. బంగాళీభాష వచ్చుననిమనము వేరుగ చెప్ప నక్కరలేదు గదా!

మధుసూదనదత్తున కుపకారము చేసిన మిత్రులలో నిద్దఱు ముఖ్యులు గలరు. ఒకఁడు మనోమోహనఘోషు. రెండవ యతఁ డీశ్వరచంద్ర విద్యాసాగరుఁడు. ఒకమారు మధుసూదనదత్తు ఋణబాధచేతఁ జెరసాలకుఁ బోవలసినవాఁడై యుండగా నాసొమ్ము ఋణప్రదాతలకిచ్చి విద్యాసాగరుఁడు వానికికారాగృహబాధ తప్పించెను. మధుసూదనుడు తన మరణకాలమున దిక్కుమాలిన తన యురువుర కుమారులను మనోమోహన ఘోషునకు నప్పగించెను. ఆయన చందాలు వేయించి సొమ్ము పోగుచేసి తల్లిదండ్రులు లేని యాబిడ్డలను పెంచి పెద్దవారిగ జేసెను.

మైకేలు మధుసూదనదత్తుయొక్క జీవితచరిత్రము నెఱిఁగిన వారందఱు నేర్చికొనవలసిన మంచినీతు లొకటి రెండు గలవు. అతి బాల్య వివాహంబులే మన దేశంబునకు సమస్తవిధములగు నరిష్టములను దెచ్చుచున్నవనియు నట్టి వివాహములు చేయుట మాని నప్పుడుగాని దేశమభివృద్ధి నొందదనియు బాలికలకు భర్తలకు బాలురకు భార్యలను దెచ్చునపుడు వారి కిష్టము లేనివాండ్రం దేగూడ దనియు నిందువలన మనము గ్రహింపవలసియున్నది. మధుసూదనదత్తుయొక్క తండ్రి యీరహస్యమును గ్రహింపలేకపోవుటచేతనేగదా కుశాగ్రబుద్ధియై విద్యాసంపన్నుడై వివేకియై బంధుమిత్రులకు మహానందము నొడగూర్పఁ జాలువాని కుమారుఁడు మతాంతరుఁడై తలిదండ్రులకు శాశ్వతమయిన దుఃఖమును గలిగించెను. అది యటుండ మనము నేర్చుకొనవలసిన యంశ మింకొకటి యున్నది. కవిత్వము చెప్పుటలోఁగాని మఱి యేయితర విషయములోఁగాని పదుగురు నడచు దారింబోక తనకు మంచిదని తోఁచిన క్రొత్తపుంతను ద్రొక్కనవారిని జనులు మొట్టమొదట నిందింతురనియు దానిమంచి కాలక్రమంబున వెల్లడియైనకొలఁది ప్రజలు వానిని గౌరవింతురనియు గూడ మన మిందువలన నెఱుంగవలసియున్నది.