మహాపురుషుల జీవితములు/బంకిం చంద్ర చటర్జీ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

బంకిం చంద్ర చటర్జీ

ఇతఁడు 1838 వ సంవత్సరమున జన్మించెను. వానితండ్రియగు యాదవచంద్ర చటర్జీ యింగ్లీషు ప్రభుత్వవారిక్రింద నొకడిప్యూటీ కలక్టరుగా నుండెను. బంకింగుచంద్రుఁడు మొదట నింగ్లీషు హుగ్లీ కాలేజీలోఁ జదువుకొని పిమ్మట విద్యాసమాధికై ప్రసిడెన్సీకాలేజికిఁ బోయి చదివెను. బంగాళాదేశమునందు మొట్టమొదట బి. యే పరిక్షయందుఁ గృతార్థుఁడైన విద్యాకుశలుఁ డితఁడే. అతడు తొలుదొల్త పత్రికాధిపతిగానుండి జీవితకాలముగడుపఁ దలఁచెను. ఈతలం పుండుటచేతనే ఆతఁడు బి. యే. పరీక్షయందుఁ గృతార్థుఁడు గాకమునుపే 'ప్రభాకర' యను స్వభాషాపత్రికను నడుపుచున్న యీశ్వరచంద్రగుప్తుఁ డనువానివద్దకుబోయి పత్రిక నడుపుపని కొంతకాలము నేర్చికొనియెను. కాని యతఁడు తాననుకొన్నట్లు పత్రికాధిపతి గాఁ డయ్యె. యేలయన పట్టపరీక్షయందుఁ దేరినతోడనే గవర్నమెంటువారు వానికి డిప్యూటీ కలక్టరుపని నిచ్చెదమన జీతమున కాసపడి యతఁడా యుద్యోగమున, జేరెను.

పత్రికాధిపతి కాఁదలఁచుకొన్నందువలన వానికొన లాభముఁ గలిగెను. ప్రభాకరపత్రికాకార్యస్థానమున నున్న కాలముననతఁడనేక స్వభాషాగ్రంథములు చదువవలసి వచ్చినందునఁ గొంతపాండిత్య మతని కందులోఁ గుదిరెను. దానింబట్టి యతఁడు వచనగ్రంథములను జేయ సమర్థుఁడై గొప్పయుద్యోగములోనున్న దీరికచేసికొని గ్రంథరచనా వ్యాసంగమును మానక చేయుచుండెను. మహాకవి యగు మదుసూదనదత్తు బంగాళీభాషలో మృదుమధురకవిత్వము చెప్పి యానాటి గొప్పకవులకుసయితము నాశ్చర్యమును గలిగించు చుండెను. బంకించంద్రుఁడు మధుసూదనదత్తు ననుసరించి నిర్యతి ప్రాసమగు కవిత్వము చెప్పబూనుకొనెను. ఎంతకృషి చేసినను బంకించంద్రునకుఁ గవిత్వములో మధుసూదనున కలవడిన లలితశయ్య యలవడకపోవుటచే నది తనకుఁదగదని మానుకొని వచనకావ్యములలో గృషిచేయ మొదలుపెట్టెను.

చటర్జీ యింగ్లీషుభాషలోని చిత్రవచనకావ్యములను (Novels) విసుపును తనివియు లేక యహోరాత్రములు చదువుచుండెను. అందులో 'సర్ వాల్టరుస్కాటు' అను మహాకవి రచియించిన వీరరసప్రధానము లగు చిత్రవచనకావ్యములయం దతనికి మిక్కిలి తమకము. అవి చదివినపిదప స్కాటు వ్రాసిన గ్రంథములను మరల బంగాళీభాషలో వ్రాయుట యసాధ్యమయినను స్కాటు మార్గము ననుసరించి స్వభాషలో స్వకపోలకల్పితముగఁ గొన్ని చిత్రవచన కావ్యములు వ్రాయవచ్చునని నమ్మి యతఁ డాపనికిఁ బూనుకొనెను. 1864 వ సంవత్సరమునం దతఁడు దుర్గేశనందిని యను దేశచరిత్ర గర్భితమయిన మొట్టమొదటి చిన్నవచనకావ్యమును రచించెను. అదియే యిప్పటికిని బంగాళీవచన కావ్యములలో నగ్రగణ్యమని కొనియాడబడుచున్నది. ఇందలికల్పన మతిచిత్రము. స్థలపదార్ధాది వర్ణనము శ్లాఘ్యము. కథ మిక్కిలి మనోహరము బంగాళాభాషలో మరల నటువంటి కల్పితవచనకావ్యమిప్పటికిం బుట్ట లేదు. మధుసూదనదత్తును బరిహసించినట్లె బంకించంద్రునిగూడ జనులు క్రొత్తమార్గమున వచనకావ్యములు నిర్మించినందుకు బరిహసించిరి. పట్టుమని పదిబంతులు సరిగ వ్రాయుటకు సమర్థులుండరుగాని సరసముగ నొకరు వ్రాసినదానిని విమర్శకులమని పేరు పెట్టుకుని నిందించి యపహాస్యము చేయుట కనేకులుందురుగదా! బంకించంద్రుని గ్రంథమును శైలి మనోహరముగా లేదనియు సందర్భసిద్ధి పొందబడలేదనియు వర్ణనము లుండవలసి నట్లుండ లేదనియుఁ గొందఱు పండిత మనుష్యులు వాని వ్రాతలను ఖండించిరి. కాని యతడు వారి విమర్శనములను జూచి వగవక తనపూనినపని మానక బంగాళీభాషకుఁ జిత్రవచన కావ్యము లనియెడు క్రొత్తయలంకారములను దెచ్చిపెట్టెను.

తరువాత నతఁడు మరికొన్ని వచనకావ్యములనుగూడ రచించెను. అందు ముఖ్యమయినవి కపాలగుండల యనునదియు మృనళినీ యనునదియు, కపాలకుండలయను కథ కేవల కల్పితమయి శాక్తేయ మతమునందుగల ఘోరకృత్యములనే వెల్లడిచేయును. మృనళినీ బంగాళీల యాచార్య వ్యవహారములఁ దెలుపునట్టికథ. 1872 వ సంవత్సరమున బంకించంద్రుఁడు వంగదర్శినియను పత్రికను ప్రకటింప నారంభించెను. ఇది కేవలము విద్యావ్యాసంగములు గలదై జనరంజకమై స్వల్పకాలముననే యనేకులచేత జదువబడుచు బ్రసిద్ధి కెక్కెను. అదివఱకతఁడు వ్రాసిన వచనకావ్యము లన్నియుఁ బూర్వవృత్తాంత ములనే దెలుపుచు వచ్చినందున నన్నియు నొక్కవిధముగానే యుండఁగూడదని బంగాళీదేశమున నాకాలమున సంఘస్థితి యెట్లున్నదో దానిని వర్ణించు నొకటి రెండు గ్రంథములను వ్రాసెను. అవి వంగదర్శినిలో బ్రకటింపబడి మిక్కిలి రసవంతములై యున్న యవి. సంఘస్థితిని వర్ణించిన వచనకావ్యములలో విషవృక్ష మనునది మిక్కిలి చిత్రమయినది. అదియు వంగదర్శినియందు నెలనెలకు బ్రకటింపఁ బడుచు వచ్చెను. దాని రమణీయకమునుబట్టి యది యింగ్లీషుభాషలోనికిగూడ తర్జుమాచేయబడినది. ఆకారణమున బంకించంద్రునిపేరు ఫ్రెంచివారికి నింగ్లీషువారికిఁ దెలియవచ్చెను.

ఇతఁ డింక ననేక వచనకావ్యములు రచించె. అందు ముఖ్యమయినవి దేవీచందూరాణీ ఆనందమఠము మొదలగునవి. ఇతడు మొదటినుండియు బూర్వాచార పరాయణుఁడు, సంఘసంస్కారము బ్రహ్మసమాజమతము మొదలైన వతని కంతగా కిట్టవు. ఇతఁడు వయసు ముదిరినకొలది మతమునం దత్యంతాసక్తిగలవాడై కృష్ణుని మహిమలు గొనియాడుచు నొక గ్రంథము వ్రాసెను. అందు శ్రీకృష్ణుడు సద్గుణ సంపన్నుడనియు నతనిం గూర్చి భాగవతాది గ్రంథములలో వ్రాయబడినదంతయు గేవలము కవి కల్పితమగు నబద్ధమనియు నతడు వ్రాసెను. ఈయన వేదములం జక్కఁగఁ జదివినవాఁడు. ఈయనకు గవర్న మెంటువారు రాయబహద్దరనియు సి. ఐ. ఇ. అనియు బిరుదుల నిచ్చిరి. ఈయన 1894 వ సంవత్సరమున మృతినొందెను.