మహాపురుషుల జీవితములు/గోకులదాసు తేజ్ పాలు
గోకులదాసు తేజ్‌పాలు
గుజరాతిదేశములో ప్రసిద్ధమగు కచ్చి యను సంస్థానము గలదు. అందు కొఠారా యను చిన్నగ్రామము గలదు. ఆగ్రామమునం దొక బీదకుటుంబమున నిద్దరు బాలురు పుట్టిరి. అందొకఁడు 1793 వ సంవత్సరమున జన్మించెను. రెండవయతఁడు 1798 వ సంవత్సరమునఁ బుట్టెను. అందు జ్యేష్ఠుఁడగు నాంజి పదియేండ్లప్రాయముననే తనపొట్ట పోసికొనుటకు బొంబాయికిఁ బోవలసివచ్చెను. పాప మతఁడు పగలు వీధులవెంబడి తిరిగి గుడ్డలమ్ముకొని రాత్రి యొక యింటికిఁ గావలిపండుకొని జీవయాత్ర గడపనారంభించెను. ఎన్ని యవస్థలఁబడినను రోజుకూలియైనను సరిగా గిట్టకపోవుటచే నతఁడు చాలశ్రమపడుచు వచ్చెను. ఆతని తమ్ముఁడగు తేజపాలు రెండేడ్ల తరువాత బొంబాయికిఁ బోయి యన్నను కలిసికొనియె. అతఁడు గూడఁ జాల పరిశ్రమజేసి తన యిరువదియవయేట వర్తకుఁడయి స్వతంత్ర వ్యాపారముచేసి ముప్పదివేల రూపాయలు గడించి రమారమి పదునొకండు సంవత్సరములు వయసుగల కుమారుఁ డొకఁ వత్సరమున కాలధర్మమునొందెను. మృతినొందు నప్పటి కతనికి రమారమి పదునొకండు సంవత్సరములు వయసుగల కుమారుఁ డొకఁ డుండెను. అతఁడే గోకులదాసు తేజపాలు. ఆ బాలుని దురదృష్టముచేతఁ దండ్రిపోయిన కొలఁది కాలములోనే పెదతండ్రియగునాంజిగూడ లోకాంతరగతుఁ డయ్యెను. మరణ మొందునప్పటికిఁ నాంజివద్ద మూడు లక్షల రూపాయి లుండెను. నాంజికిఁగూడ బిడ్డలు లేకపోవుటచే వాని ధనమంతయు గోకులదాసునకే జెందెను. ఈ గొప్ప యాస్తిని సరిగాఁ జక్క పెట్టుటకు వానితండ్రియుఁ బెదతండ్రియు సంరక్షకు నెవ్వని నేర్పరచిపోనలేదు. స్వయముగా జక్క పెట్టుకొనుటకు వానికిఁ దగిన వయసుగాని విద్యగాని లేదు. నైనను వానితల్లి మిక్కిలి బుద్ధిశాలిని యగుటచే బాలుఁడు చెడిపోవకుండ ధనము క్షయముగాకుండ నెంతయు జాగరూకతతో మెలంగి ప్రాయము వచ్చిన తరువాత ద్రవ్యమంతయుఁ బుత్రున కప్పగించెను. అది మొద టతఁడు వ్యాపారములయందు మిక్కిలి శ్రద్ధాళువై ధనవృద్ధి జేయుటయేగాక సంఘమున కెంతో యుపకారియయ్యెను. అతఁడు యావజ్జీవము విదేశములకు సరకు లెగుమతిసేయుటయు నచ్చటనుండి వచ్చిన సరకులు స్వదేశమునకు దిగుమతిచేయుటయు ముఖ్యవ్యాపారముగ బెట్టుకొనెను. ఇతఁడు గుజరాతీలలో భట్టియాకులస్థుఁడు. ఆ తెగలో భాగ్యవంతులగువారు తప్పక వస్త్రములయంత్రములనో మఱియేయితర యంత్రములనో తెప్పించి వ్యాపారము సేయుచుందురు. ఇతఁడో వారి మార్గము ననుసరింపక క్రొత్తపుంత ద్రొక్కెను. అతఁడు చేసిన ప్రతివ్యాపారమున వానికి లాభము విశేషముగావచ్చెను. ఎంతధనము సంపాదించినను గోకులదాసు ధనగర్వమునొందక సర్వజన సులభుఁడయి యెల్ల వారికిష్టుడై యుండెను. అతఁడు సంఘసంస్కరణమునం దభిలాష కలవాఁడని చెప్పుదురు గాని యావిషయమున జెప్పఁదగిన పనియెద్దియు జేసినట్లు కనఁబడదు. ఇతఁడు ముఖ్యముగ దానమునకు బ్రసిద్ధికెక్కెను. 1854 వ సంవత్సరమున నతఁడు మొట్ట మొదట జన్మభూమికి బోయి యచ్చటనున్న తన తెగవారి యుపయోగము నిమిత్తము లక్షరూపాయిల నొక్కమారే దానముచేసెను. ఆ మరుచటి సంవత్సరమే గోకులదాసు తీర్థయాత్రలు సేయఁబోయి యా పుణ్య క్షేత్రములలో గొన్నిచోట్ల చెరువులు త్రవ్వించి కొన్ని తావుల సత్రములు గట్టించి కొన్నియెడల నన్నప్రదానములు సేయించి మొత్తముమీఁద ధర్మకార్యముల నిమిత్తము రెండు లక్షలరూపాయిలు వ్యయపరచెను. అక్కడనుండి వచ్చి గోకులదాసు బొంబాయిలో నున్న గుజరాతివారి విద్యాభివృద్ధినిమిత్తము రెండుపాఠశాలలు స్థాపించెను. అవిగాక బొంబాయిలో నతఁడొక ధర్మవైద్యశాల పెట్టించి దాని పోషణము నిమిత్తము లక్షయేబదివేల రూపాయిలనిచ్చెను. ఆవైద్యశాలకు నింకను గావలసిన కర్చులు బొంబాయి మునిసిపాలిటీవారు దొరతనమువారు వహించి గోకులదాసు పేర దానినిప్పుడు జరుపు చున్నారు.
బొంబాయిలో నున్న గొప్పవైద్యశాలలు మూడు. అందులో గోకులదాసు తేజపాలుగారి దొకటి. ఈ దానములు గాక గోకులదాసు తన మరణశాసనములో మరికొన్నిసత్కార్యముల నిమిత్తము ధనదానము చేయవలసినదని మిక్కిలి విస్పష్టముగా వ్రాసెను. ఈ మరణశాసనము మిక్కిలి బాగుండుటచే నేఁటికిని బొంబాయిలో మరణశాసనములు వ్రాయఁదలంచువా రనేకులు దీనినే మాదిరిగా పుచ్చుకొని వ్రాయుచుందురఁట దానికంత ప్రసిద్ధివచ్చుటకుఁగారణ మేమన దానిలో రెండు గొప్పవిశేషము లున్నవి. అందు మొదటిది ఆ మరణశాసనముబట్టి తదనంతరము ధర్మ కార్యములు జరుపువారే ధర్మ మెట్లు జరపవలయునో దేని కేయేసాధనసామగ్రులు కావలయునో యాయానిబంధనలన్నియు నందు విస్పష్టముగాఁ జెప్పఁబడి యున్నవి. అందుచే దాతయొక్క ముఖ్యోద్దేశ మెప్పుడు జరగక తప్పదు. రెండవది ఆ శాసనములో గోకులదాసు తన బంధువులకు తనయొద్ద పనిచేసిన సేవకులకుతన్ను నమ్ముకొనియున్న యనుజీవులకు మరచిపోక వేరువేరుగ నొక్కొక్కనికి గొంతసొమ్మియ్య వలయునని వ్రాసెను. ఆ శాసనములందు మొట్టమొదట చిరకాలము తన్ను సేవించిన పరిచారకునకుఁ దనయనంతరమున శ్రాద్ధకర్మచేయించు బ్రాహ్మణునకుఁ దనకుఁ జాలకాలము వండిపెట్టిన వంటవానికిఁ బూర్వము తనవద్ద సేవకుఁడయి యుండి మృతినొందిన యొక వృద్ధుని కుమారుల కిద్దఱకు మొత్తముమీఁద నలుబదియాఱువేల రూపాయ లిమ్మని వ్రాసెను. అవి మొదటవ్రాసి తరువాత రెండు సంస్కృత కళాశాలల స్థాపించుటకు నందలి విద్యార్థుల కన్నము పెట్టుటకు నొక చెరువు త్రవ్వించుటకు నొక ధర్మశాల కట్టించుటకు నొకలక్ష పదునైదువేల రూపాయ లిమ్మినియెను. పిమ్మట ననేకధర్మకార్యముల నిమిత్తము గోకులదాసు రమారమి ఎనిమిదిలక్షల రూపాయలిమ్మని వ్రాసి ప్రతిధర్మకార్యము నిర్విఘ్నముగా సాగునట్టు లేర్పాటులు చేసెను. ఈ మొత్తములో డెబ్బదియైదువేల రూపాయిలు వేరుగా నుంచి దానిమీఁద వచ్చినవడ్డీతో నిద్దఱుగుమాస్తాలను, ఒకకార్యదర్శి (సెక్రటెరి)ని వేయవలసినదనియు, తాను చేసిన ధర్మకార్యములన్నియు సరిగా జరగుచున్నవో లేవో చూచుటయు వారిపనిగానుండవలసిన దనియు, నతఁడు శాసనములో వ్రాసెను. ఆకార్యదర్శి సంవత్సరాంతమున లెఖ్కలన్నియు దొరతనమువారి గణికులచేత సరిచూపించి యింగ్లీషుభాషలోను గుజరాతీభాషలోను తప్పక యా లెక్కలను ప్రకటింపవలసిన దనికూడ నతఁడు నియమించె. దగ్గర చుట్టములను సరిగ జ్ఞాపక ముంచుకొని యెవ్వ రెవ్వరికి కెంతధన మియ్యవలయునో యంతధనమునిచ్చి వారిలో సంతానములేని స్త్రీలకు యావజ్జీవ మనుభవించునట్లు స్వాతంత్ర్యమిచ్చి తక్కినవారికి సంపూర్ణ స్వాతంత్ర్యమిచ్చి గోకులదా సందఱి మెప్పుల వడసెను. ఇవన్నియు వ్రాసి కడపటి నతఁడు తన యుత్తరక్రియలకు భార్యశ్రాద్ధములకు నొకవేళ తానే ముందుగా బోయినయెడల తనతల్లి పరలోకక్రియలకు, దగిన యేర్పాటులు చేసెను. ఈ మరణశాసనము వ్రాయునప్పటికి గోకులదాసునకు నలువదియైదవ సంవత్సరము, ఏవిధమైన వ్యాధియులేక యతఁడు మంచి యారోగ్యము కలిగియుండెను, ఆ శాసనము వ్రాయవలసిన యవసర మేమియు లేకపోయినను గోకులదాసు "దేహము లస్థిరము, లెటుపోయి యెటువచ్చునో ముందే వ్రాసియున్న మంచి"దని సుఖముగా నున్నపుడె దానిని లిఖించెను. కాని దైవవశమున నది వ్రాసిన సంవత్సరమునకే గోకులదాసున కొకవ్యాధి ప్రవేశించి యేచికిత్సలకు లొంగక తుదకాయుదార చరిత్రు నెత్తుకొనిపోయెను. గోకులదాసు మహాదానముల నిమిత్తము వ్యయముచేసిన ధనముగాక మృతినొందునప్పటి కతనివద్ద ముప్పదియేడులక్షల రూపాయలుండెను. కాని పాప మతనికిఁ బురుషసంతానము లేకపోవుటచే భార్యకు బెంచుకొమ్మని యధికార మిచ్చెను.
ఎంత కట్టుదిట్టముగ వ్రాసిన మరణశాసనములైనను వివాదములు లేక యుండవుగదా! అట్లె గోకులదాసు మరణశాసన విషయమునగూడ ప్రారంభమున గొన్ని వివాదములు సంభవించెను? కావున నీవివాదములు వచ్చుటచే సొమ్ము ధర్మకర్తలచేతికి వచ్చునప్పటికి గొంత యాలస్యమయ్యెను. కాని యాయాలస్యముకూడ కొంత మేలేయైనది. ఏలయన తగవులన్నియు దీరునప్పటికి కర్చులతోను వడ్డీతోను సొమ్ము పదునైదులక్షలయ్యెను. గోకులదాసు చేసిన ధర్మకార్యము లన్నింటిలో మిక్కిలి యెన్నదగిన దొక్కటియున్నది. అది యిది, చదువుకొనఁ దలచు బీదవిద్యార్థులకు భోజనశాల యొకటి యతఁడేర్పరచెను. అందులో నిరువదియెనమండ్రు విద్యార్థుల కన్నముపెట్టి జీతములు పుస్తకములు బట్టలు మొదలగునవిచ్చి పట్టపరీక్షయందు గృతార్థు లగువరకు వారికి జదువుచెప్పించు నట్లేర్పాటులు చేయబడి నవి. అతడు స్థాపించిన పాఠశాలలు ముఖ్యముగా నైదున్నవి. ఒక సంస్కృతకళాశాల యొక బాలికాపాఠశాల మగపిల్లల నిమిత్తము మూడింగ్లీషుపాఠశాలలు ఈ యయిదుపాఠశాలలలో జదువుకొను పిల్లల సంఖ్య 1200 లు, వీరిలో నూటి కిరువది యయిదుగురికి ధర్మార్థము చదువు చెప్పబడును. ఇదిగాక తన జన్మదేశమగు కచ్చిలో జిన్నవి పెద్దవి కలసి మఱి యాఱు పాఠశాలలు కలవు. అందొక దానిలో బాలురకుసంస్కృతముమాత్రమేనేర్పబడును. ఇవియన్నియు గాక బారిష్టరు పరీక్షకు వైద్యశాస్త్ర పరీక్షలకు జదువుకొన గోరు విద్యార్థులకు సాయము జేయు నిమిత్తము కొంత మూలధన మతఁ డిచ్చెను. ఈపరీక్షలకు జదువుకొనదలంచి వచ్చినవారిలో దనతెగవారగు భట్టియాలకే యెక్కువ ప్రాముఖ్యత నీయవలసినదని యతఁడు వ్రాసెను. ఇట్లు విద్యాదానము నిమిత్తము సదుపాయములు పెక్కులు చేసి యూరకొనక దేవస్థానములు మొదలగువానికి గూడ నతఁడు కొంతధనమిచ్చెను. అందు ముఖ్యముగానొక దేవాలయమునకు కొంత ధనమిచ్చి యే టేట నచ్చట నుత్సవములు మహావైభవముతో జరుగునట్లు నియమించెను. భట్టియాశాఖలోఁజేరిన దిక్కులేని వితంతువులను దలిదండ్రులులేని బీదబాలురను బోషించునిమిత్తమును దిక్కులేని యాడుపిల్లలకు వివాహము సేయునిమిత్తమును గతిలేనివారికి మరణాంతమున శ్రాద్ధకర్మలు జరుపు నిమిత్తమును గోకులదాసు ప్రత్యేకముగా లక్షాయేబది వేల రూపాయలిచ్చి దానివడ్డీతో బయిన చెప్పిన కార్యములు సేయుమనియెను.
బొంబాయి నగరమున ధన మెంతయున్నదో ధర్మము నంతే యున్నది. ఎందరెందరో ధనవంతులు విశేషదానముల నిచ్చిరిగాని దీనులకు నెల్లవారలకు నత్యంతోపయుక్తముగా నుండునట్టి ధర్మములు గోకులదాసు చేసినట్లెవరును జేయలేదు. ఈ గోకులదాసు తేజపాలు యొక్క పేరు గుజరాతీదేశమున నెఱుగనివారు లేరు. అతని పేరు చెప్పుకొనని యిల్లులేదు. అతని నామ స్మరణము చేత నొక దానమైన చేసి యెఱుగని మహాకృపణులు సయితము ఔదార్యము గలవారై తెగించి తమ యర్ధమున కొంతభాగము దానము చేయక మానరు. భరత ఖండము గర్భమున బుట్టిన బిడ్డలలోఁ దన సత్కార్యములచేత నిజముగా జరితార్థుడైన పురుషు డితఁడే యని చెప్పవచ్చును.