మహాపురుషుల జీవితములు/గాజుల లక్ష్మీనర్సు శెట్టి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
Mahaapurushhula-jiivitamulu.pdf


పిదప 'సిద్ధుల శెట్టి కంపినీ' యను పేరు పెట్టి తండ్రియుఁ దానునుగలసి వాణిజ్య మారంభించిరి. ఆకంపెనీవారు నీలిమందు నమ్ముటయేగాక చెన్నపట్టణపు రుమాళ్లుగూడ నమ్మి చాలలాభము సంపాదించిరి.

అనంతరము కొంతకాలమునకు సిద్ధుల శెట్టి మృతినొంది లక్ష్మీనర్సు స్వతంత్రుఁడై విరివిగా వ్యాపారమును జేసెను. ఆకాలమున నమెరికా ఖండములోని దేశములుకొన్ని యంతఃకలహములు గలిగి యుండుటచే నచట ముఖ్యముగా పైరగుచుండిన దూదిపంట చెడిపోయెను. ఆకారణమున హిందూదేశమునందు నీజిప్టుదేశమునందు, ననేకులు దూది వర్తకము మీఁదబడిరి, లక్ష్మీనర్సు శెట్టియు దాని యద నెరిగి వివేషముగా దూదివర్తకము చేసెను. అతని యదృష్టము బాగుండుటచేఁ జేసిన బేరమెల్ల లాభకరమయ్యెను. అందుచేఎ నతఁడు స్వల్ప కాలములోనే లక్షలకొలఁది ధనము సంపాదించెను. కావలసినంత ధనమున్నది గదాయని సంతుష్టుడై యతఁడు మునుపటివలె వ్యాపారముమీఁద నంత శ్రద్ధ నిలుపక తనదేశస్థులకు రాజకీయ వ్యవహారములలో నెక్కుడు స్వాతంత్ర్యమునుగలుగ జేయవలెనని దృష్టియంతయు దానియందే నిలిపెను. ఆనాటిహిందువులు బొత్తుగా నింగ్లీషు తెలియనివా రగుట దను ప్రభుత్వ మెట్టిదియో బొత్తిగ నెఱుంగని మూఢులైయుండి చెన్నపట్టణములోనున్న యధికారులే సర్వస్వతంత్రాధికారులని భావించి సీమలో వారిపై యధికారులున్నారనియు వీరన్యాయములు చేసినప్పుడు వారికప్పీళ్ళు పంపుకొనవచ్చుననియు నెఱుంగక యిక్కడి యధికారులచేత ననేక బాధలు పడుచుండిరి. లక్ష్మీనర్సు శెట్టిమాత్రమే యాదొరల యన్యాయము లెఱిఁగిన వాడగుటచే "చెన్నపట్టణస్వ దేశసంఘ" మనుపేర నొక సంఘము స్థాపించెను. దాని ముఖ్యోద్దేశము జనులందఱికి నప్పటి దేశస్థితిగతులు తెలిపి ప్రజల కష్టసుఖములు దొరతనమువారికి వినయ


పూర్వకముగా దెలుపుకొనుటయే ధనవంతులగు వర్తకులు దొరతనమువారిక్రింద నుద్యోగములు చేయని పెద్దమనుష్యులు పలువురాసంఘములో జేరి పనిచేసిరి. ఆసంఘమువారు పలుమారు సభలు చేసి ప్రజలు పడియెడు కష్టముల జర్చించి తన్ని వారణార్థము సీమలో నున్న యధికారులకు మహజరుల నంపిరి.

ఈ శెట్టిగారి మొదటి పోరాటము క్రైస్తవమత బోధకులతో సంభవించెను, అప్పటికి గ్రీస్తు మత బోధకులు కొందఱు మనదేశమునకు వచ్చి పాఠశాలలుపెట్టి యింగ్లీషులోని శాస్త్రవిద్యలు మనవారికి నేర్పి యుపకారము చేయుచువచ్చినను పాఠశాలలోని బాలకులను దమ మతములో గలుపుకొనుచు వచ్చిరి. ఆ కాలమున మనవారిలో ననేకులు ఇంగ్లీషు రాకపోవుటచేతను రాజభాషయగు నింగ్లీషు వచ్చినగాని యుద్యోగములు దొరకకపోవుటచేతను మనవా రుద్యోగముల మీఁది యాశచేత తమబిడ్డలను గ్రైస్తవుల పాఠశాలలకే బంపవలసిన వారైరి. ఆమతబోధకులు తమబడికివచ్చిన విద్యార్థులలో మిగుల లేబ్రాయముగలవారిని సయితము స్వమతమున గలుపుకొనిరి. గొప్ప యుద్యోగములలోనున్న తెల్లదొరలందరు క్రైస్తవమతబోధకుల కీకార్యమునందు దగిన సహాయము జేసిరి. అందు ముఖ్యములగు వారి గొందర నిందు బేర్కొనుచున్నారము. తిరునల్వేలి జిల్లాకలక్టరగు థామసుదొరగారు క్రైస్తవమతబోధకులు. తమతమ వ్యాప్తికి జేయు పనులకు బహిరంగముగ జాల సహాయము చేసిరి. అందు చెన్నపట్టణము సాదరుకోర్టులో జడ్జీయగు సర్ విలియంబర్టను దొరగారు మతబోధకులమీఁద దనకుఁగల యభిమానమును స్పష్టముగ దెలుపుటయేగాక కోర్టులో ధర్మపీఠమున గూర్చున్నప్పుడు సయితము తానే హిందువులకప్పుడు క్రైస్తవమతము బోధింపజొచ్చెను. అప్పుడు గవర్నమెంటు సెక్రటరుగారగు మరియొక థామసుదొరగారు హిందు


వులకుద్యోగములీయక క్రైస్తవ మతములో గలసినవారికే విశేషముగానుద్యోగములీయజొచ్చెను. చెంగల్పట్టు జిల్లాజడ్జీగా రొకనాడు వ్యాజ్యములో విచారణ చేయుటమాని తమ కచేరీ యొక మతబోధకుని యుపన్యాసము నిమిత్త మెరు విచ్చెను. క్రింది యధికారు లిట్లధర్మముగా ప్రవర్తించుచుండ దొరతనమువా రేమైన వారి నదపులో నుంచిరో యన నదియు లేదు. మీదుమిక్కిలి వారు మతబోధకులకు వ్యతిరేకముగా బనిచేసిన నెల్లవారి కపకారములు చేయసాగిరి. చెన్నపట్టణపు సాదరు కోర్టులో నొకజడ్జి దొరతనమువారు చెప్పినట్లు వినక న్యాయదృష్టి గలిగి మతబోధకులకు వ్యతిరేకముగా బనిచేసి నందున వారు వాని యుద్యోగమును దీసి వేసిరి. ఆజడ్జీగారిని హిందువులు గౌరవించి వారికి దమకృతజ్ఞతను దెలిపినప్పు డాదొరగారీ క్రిందివిధముగ దెలిపిరి.

"సాదరుకోర్టు జడ్జీల కిష్టములేని కార్యములు దొరతనమువారు చేయుమని వారినడిగినప్పుడు జడ్జీలు నోరు మూసుకొని యూరకొన్న పక్షమున దొరతనమువా రికముందు స్పష్టముగా హిందువులందరు గ్రైస్తవులలో గలియవలయునని యాజ్ఞాపింతురు. చెన్నపట్టణపు గవర్నరుగారు తమకట్టి యభిప్రాయము లేదని తెలిసినను గవర్నమెంటు సంబంధముగల కొందఱు పెద్దమనుష్యుల కిట్టిసంబంధములు గలవనియు వారు తలంచుకొన్నంతపని చేయగలరనియు ననుభవమువలన దెలియవచ్చుచున్నది. గవర్నమెంటువారి ప్రవర్తనంబట్టి సాదరుకోర్టు జడ్జీలు వారి యుత్తరువులం గొన్నింటిని మన్నించుటకు వీలు లేకపోయినది. అట్టి యుత్తరువులను న్యాయదృష్టిగల యే జడ్జీయు మన్నింపడు. న్యాయస్థానముయొక్క గౌరవమును ధర్మమును నిలువబెట్టుటకు గృతనిశ్చయుఁ డైనందునకే దొరతనమువారు నన్ను తీసివేసిరి. క్రైస్తవమతబోధ


కులు నీతినియమములు లేక బాలురను గలుపుకొనుటయు వారికి రహస్యముగ దొరతనమువారు దోడ్పడుటయు నెఱిఁగి హిందువు లందఱు విశేషముగ మనస్తాపము నొందుటచేత లక్ష్మీనర్సు శెట్టి, స్వదేశస్థుల మతవిషయములలో నింగ్లీషువారు సంబంధము కలుగ జేసికొనమని మొదట ప్రతిజ్ఞ చేసి పిదప జేయరాని పనులు చేయుచుండినందున వాని నివారించుటకుఁ తనసర్వశక్తిని వినియోగించి పని చేయవలయునని కృతనిశ్చయుం డయ్యెను. ఆకాలమున జెన్నపురియందు నేటివు సర్క్యులేటరను నొక పత్రిక యింగ్లీషులో ప్రకటింపఁబడుచుండెను. వానికి నారాయణస్వామి నాయఁడను నతఁడు పత్రికాధిపతి. లక్ష్మీనర్సు వానియొద్ద నాపత్రికను ముద్రాయంత్రమును వెలకుఁ గొని "క్రెసెం"టను క్రొత్తపత్రికను ప్రచురింపఁదలచి దానికి హార్లేయను నొక దొరగారి నధిపతిగా నేర్పరచెను. క్రెసంటు శబ్దమునకుఁ జందమామయని యర్థము. హార్లేదొర యంతకుమున్ను సైన్యములో బనిచేసినవాఁడు గావున నతఁడు పత్రికను నడుపునప్పుడు సైతము వెనుకటి వీరరౌద్రరసములు చూపుచు నందరకు భయంకరుఁడై యుండెను. ఆపత్రికయొక్క మొదటిసంచిక 1844 వ సంవత్సరము 2 వ యక్టోబరు తారీఖున బయలు వెడలెను. అప్పటికి మన శెట్టికి ముప్పది యెనిమిదేండ్ల వయస్సు హిందూదేశస్థులను సమున్నతస్థితికిఁ దెచ్చుటయే యాపత్రికయొక్క ముఖ్యోద్దేశమని యందు వ్రాయబడెను. ఆదినములలో రికార్డు అనునొక పత్రికను బ్రకటింపుచు వచ్చిరి. క్రెసెంటు పత్రిక రికార్డు పత్రికలోని తప్పులను జూపుచు గ్రైస్తవమత బోధకుల దురాచారములను ఖండించుచు వారి యవకతవకలను వెలిపుచ్చుచువచ్చెను. మొట్టమొదట క్రెసెంటుపత్రికమీద ననేకులకుఁ గోపమువచ్చెనుగాని యెవరికి గోపమువచ్చిననను లెక్క సేయక యది తనపనిచేయుచు కాలూది నిలచెను. దొరతనమువారి గొప్పయుద్యో


గస్థులు వారి యాజ్ఞావర్తులగు జడ్జీలు క్రెసెంటు పత్రికలోని సూది పోటులవంటి మాటల కుడికి బహిరంగముగా దానినేమియు జేయఁజాలక లోలోపల మతబోధకులకు దొంటికంటె నెక్కుడు సహాయము బ్రోత్సాహము చేయసాగిరి. ఆకాలముననున్న యితరపత్రికలకు జూపిన యాదరమును దొరతనమువారు క్రెసెంటుపత్రికకు జూపరైరి. దీనికొక్క తార్కాణముగలదు. క్రెసెంటును పేరుతోనొక పత్రికాదిపతి గవర్నమెంటువారికి విజ్ఞాపనముచేయ దక్కిన పత్రిక లన్నిటికి అట్టి యాదరముచూపిన గవర్నమెంటువారు దీనిపేరు తమ గెజిటులో వేయుటకు వీలు లేదని తెలియజేసిరి.

ఈనడుమ దొరతనమువారు క్రైస్తవులలో గలసిన హిందువులకు కష్టములు లేకుండుటకు నొక చట్టము నిర్మింపదలంచిరి. ఆ చట్టమునుబట్టి క్రైస్తవమతములో గలసినహిందువులకు స్వమతములోనున్నప్పుడు వచ్చునట్లే పిత్రార్జితమగు నాస్తిలో దమవంతు భాగము నిరాటంకముగ వచ్చును. ఈచట్టము ధర్మవిరుద్ధమనియుఁ బ్రజలకుహానికరమనియుదలంచి లక్ష్మీనర్సు శెట్టి 1845 వ సంవత్సరము 9 వ యేప్రియల్ తారీఖునఁ జెన్నపురములో మహాజనుల నందఱిని బిలిచి సభచేసి సీమలోని యధికారులకు మహజరు బంపుట నందఱ నొప్పించెను. ఆసభకు సమస్తజనులు వచ్చి దొరతనమువారు చేయఁదలంచుకొన్న చట్టము హిందువుల యాచార వ్యవహారములకు విరుద్ధమనియు దానిని నిర్మింపనీయవద్దనియుఁ బ్రార్థించుచు గొప్ప మహజరువ్రాసి యింగ్లాండునకు బంపిరి. చెన్నపురి దొరతనమువారికి సీమలోని యధికారులకు గొంతకాల ముత్తర ప్రత్యుత్తరము జరిగిన పిదప నట్టిచట్టము నిర్మించుట లేదని యింగ్లాండులోని యధికారు లభయమిచ్చిరి. ఈకార్యమున విఫలప్రయత్నులై క్రైస్తవ మతబోధకులు తమ తమ వ్యాప్తికి మరియొక దారి వెదకికొనఁ


దలంచి దృష్టి పాఠశాలలవంకఁ ద్రిప్పిరి. అదివఱకు దొరతనమువారి పాఠశాలలో శాస్త్రాది విద్యలేగాని మతము చెప్పుటలేదు. మతబోధలు వారి ప్రోత్సాహకులగు దొరలు బాలురను బరీక్షించునప్పుడు వారు నేర్చిన శాస్త్ర విద్యలలోఁ బ్రశ్నలు వేయుటకు మారుగ మున్నెప్పుడు వారు చదివి యెఱుగని క్రైస్తవమత గ్రంథములలోను తత్వశాస్త్రములలోనుగల విషయములం గూర్చి ప్రశ్నలు వేసి యవి చెప్పలేనివారు గవర్నమెంటువారి యుద్యోగమున కనర్హులని త్రోసివేయుచు వచ్చిరి. అట్లు చేయుట న్యాయమాయని హిందువులు పాఠశాలాధికారుల నడుగ బైబిలుగ్రంథము బాలురచే పాఠశాలలలో జదివించిన పక్షమున నిట్టి చిక్కులు రావనియు నట్లు చేయుటకు సమ్మతింపవలసిన దనియు వారు చెప్పిరి.

లక్ష్మీనర్సు శెట్టి యీ దుర్నయము నడంపదలచి 1846 వ సంవత్సర అక్టోబరు నెల 7 వ తారీఖున గొప్ప సభచేసి యింగ్లాండులో నున్న డైరక్టర్లకు గొప్ప మహజరు వ్రాసి తమకు గలిగిన యా యుపద్రవము నివారింపుడని ప్రార్థించుచు చాల మందిచే వ్రాళ్ళు చేయించి యామహజరును బంపెను. ఆమహజరునందున్న ముఖ్యాంశము లివి. 1 మొదట హిందువుల మత విషయములజోలికి రామని గవర్నమెంటువారు వాగ్దానముచేసినను వెనుకటి గవర్నరుగారు తద్విషయమున విరుద్ధముగఁ బ్రవర్తించిరి. 2 మతబోధకులు హిందువుల బిడ్డలను స్వేచ్ఛగా స్వమతములో గలుపుకొనుచున్నారు. దొరతనమువారి యుద్యోగస్థులు వారిం బురికొల్పుచున్నారు. 3 మతబోధకులు హిందూబాలకుల పరీక్షలలో గృతార్థులై యుద్యోగమును సంపాదించుకొనకుండ ప్రయత్నించుచున్నారు. 4 చెన్నపురి రాజధానిలోని జిల్లాలలో పాఠశాలలు పెట్టించి గవర్నరుగారు జనుల కింగ్లీషు చెప్పింపకున్నారు. 5. గవర్నమెంటువారు తమ కచేరీలలో హిందువు


లకు విశేషముగా బనులిచ్చుట లేదు. 6. న్యాయస్థానములగు కోర్టులలోఁ దరుచుగ నన్యాయమే జరుగుచున్నది. 7. ఇదిగాక యానాటివా రనుభవించెడు ననేకకష్టములను గూర్చియువ్రాయబడి యున్నది. ఆ సభకు లక్ష్మీనర్సు శెట్టి యగ్రాసనాధిపతి యయ్యెను. సభ మొదటి నుండి చివరవఱకు నిశ్శబ్దముగ గ్రమముగ రాజభక్తికి లోపము లేనట్టుగా జరిగినను గొందఱు దొరలు సభలో నల్లరి జరిగెననియు నగ్రాసనాధిపతి రాజద్రోహగర్భితములకు మాటల నుపన్యసించె ననియు వానిమూలమున జనులు పితూరీ చేయుదురనియు జాట జొచ్చిరి. ఆసభలో "శెట్టి మనకష్టములను బై యధికారులకు వినయ పూర్వకముగా విన్నవించు కొందుమేని వారు మన యాపదలను నివారింపకపోరని చెప్పెనేగాని చెప్పకూడదని నేమియు నుపన్యసింపలేదు. ఆ మహజరులో వ్రాలు చేయవలదని దొరతనమువారి పక్షమువారు కొందఱు జనులను భయపెట్టిరి. గాని యెందఱు బెదిరించినను దానిలో బండ్రెండువేలజనులు వ్రాళ్ళు చేసిరి. అతడా మహజరు గవర్నరుగారి ద్వారా సీమకు బంపెను. గవర్నరుగారా మహజరు తనవద్దకు వచ్చినప్పుడు దానిమీద "జనులు గవర్నమెంటు వారు చేయు కార్యములు నెఱుగక మిడిమిడిజ్ఞానముగలవారి ప్రేరణమున నిట్టి పనులు చేయుచున్నా"రని వ్రాసియింగ్లాండునకు బంపిరి. గవర్నరుగారు వ్రాసిన వ్రాతలనుబట్టి యా మహజరు సీమలో బుట్టదాఖలయ్యెను. జనులు మహజరు లంపుచున్నారని సందేహించి దొరతనమువారు పాఠశాలలో బైబిలు చదివించుట కొంతకాలము మాని 1853 వ సంవత్సరమున వెండియు దద్విషయమున బ్రయత్నించిరి. కాని నార్టనుదొరగారు లక్ష్మీనర్సు శెట్టిగారు కలసి పాటుపడి యాపని సాగనియ్యరైరి.

ఆకాలమందే యింగ్లాండు పార్లమెంటుమహాసభలో నొకసభికుడగు డాంబిసేమరు దొరగారు హిందూదేశమునుజూడవచ్చిరి. శెట్టిపం


పినమహజర్ల వల్ల నతని పేరింగ్లాండులోనిదివఱకే పార్లమెంటుసభికులకు బరిచితమైనందున సేమరుదొరగారు నావదిగినతోడనే లక్ష్మీనర్సుశెట్టి బాగున్న వాడాయని యడిగెను. శెట్టియు వానిదర్శనముచేయ వారిరువురకు నొండొరులపై గౌరవమునను రాగము జనియించెను. శెట్టి దొరగారిని దనయింట గొంతకాలము విడియించి సమయము దొరికినప్పుడెల్ల గవర్నమెంటువారు మతవిషయములలోను రాజకీయ విషయముల లోను జనులకు చేయుచుండిన యపకారమును మనస్సుకు నాటునట్లు చెప్పుచువచ్చెను. సేమరుదొరగారు శెట్టిని వెంటబెట్టుకొని కడలూరు కుంభకోణము కోయంబత్తూరు మొదలగు దక్షిణ హిందూస్థానములోని ముఖ్యపట్టణములకు బోయి సర్కారుకట్టిన దుర్భరములగు పన్ను లిచ్చుకొనలేక రయితులు పడియెడు బాధలను స్వయముగా జూచెను. అతడు కొన్ని పట్టణములలో పన్ను లిచ్చుకొనలేని రయితులీక్రింద చెప్పబడిన విధమున దారుణ బాధల పడుచుండ జూచెను. కొందరు రయితులు మట్టమధ్యాహ్నపు టెండలో నడుములు వంచుకొని నిలిచియుండిరి. వారి వీపులమీద సర్కారు నౌకర్లు పెద్దరాళ్లెత్తిరి. కొందఱి కాళ్ళకు బొండవేసిరి. కొందఱిని మెడకుం గాలిగి నంటకట్టి చెట్లకో స్తంభములకో వ్రేల దీసిరి. ఆ బాధలు పడలేక యారయితులు గోలుగోలుమని యేడ్చు చుండిరి. ఇది యంతయు తాలూకా కచ్చేరీ యెదుటనే జరుగుచున్నను మేజస్ట్రీటుగారు తహస్సీలుదారుగారు వారివంక కన్నెత్తి యైన జూడక వారి మొరలు వినిపించుకొనక సుఖముగా సంతోషముగా బని చూచుచుండిరి. సేమరుదొరగారు బ్రిటిషు గవర్నమెంటు వారు పన్ను వసూలు చేయుటకు రహితులను బెట్టుచున్న యా దారుణ బాధలను గన్నులారచూచి జ్ఞాపకార్థ మొక పుస్తకములో వ్రాసికొని యాదారుణ కృత్యములలో నుపయోగింపబడు పనిముట్లు


కొన్ని పుచ్చుకొని కట్టగట్టి తనవారికి జూపుటకు సీమకు తీసుకొని పోయెను.

1854 వ సంవత్సరము జూలై నెలలో సేమరుదొరగారు పార్లమెంటులో హిందూదేశ ప్రసంగము వచ్చినపుడు హిందువులు హానికరములగు దుష్కార్యములు చేసినందుకేగాక పన్ను లిచ్చుకొనలేనందుకుగూడ గవర్నమెంటువారిచేత క్రూరముగ బాధింపబడు చున్నారని చెప్పెను. దేశము చూచివచ్చిన సేమరుదొర యట్టిబాధ లున్నవని చెప్పుచుండ మనదేశమెన్న డెఱుగని పార్ల మెంటుసభికులు చాలమంది యట్టిపీడలు హిందూదేశమున లేవనివాదించి యంతతో తనివినొందక వ్యర్థదోషారోపణముల జేయుటకు దేశమందలి మారు మూలలు తిరిగితివి గాబోలునని సేమరుదొరను నిందించి యధిక్షేపించిరి. ఇండియా బోర్డున కప్పుడు ప్రసెడెంటుగా నుండిన వుడ్డుదొరగారు మాత్రమది యబద్ధమై యుండదని దానింగూర్చి విచారణ చేయదలచి తద్విషయమున సాక్ష్యములు పుచ్చుకొమ్మని ప్రత్యేక మొక చిన్నసభ నేర్పరచెను. ఆసభవారు కొన్ని ప్రదేశములు తిరిగి యా విషయమున సాక్ష్యములు తీసికొని పార్ల మెంటు మహాసభకు పంపిరి. దొరతనమువారి విచారణ జరుగుచుండ యా విషయమున బ్రజల యభిప్రాయమునుగూడ యధికారులకు దెలియ జేయవలయునని లక్ష్మీనర్సు శెట్టి చాలమంది చేత వ్రాళ్ళుచేయించి యొక మహజరు పంపెను. ఇవి యన్నియు జేరినతోడనే పార్ల మెంటువారు పన్ను లిచ్చుకొనలేని జనులను బాధించుట దౌర్జన్యమని యట్టి దురాచారము నడంచిరి.

1852 వ సంవత్సరమున లక్ష్మీనర్సుశెట్టి ప్రేరణమున జెన్నపురి స్వదేశసంఘమువారు తమకష్టములన్నియుం బేర్కొని వానిని నివారింపుమని వేడుచు పార్ల మెంటువారికి మఱియొక మహజరంపిరి.


ఆ మహజరులోనున్న ముఖ్యాంశములివి. హిందూదేశమున వచ్చు బాధలన్నియు మితిమీరిన పన్నులవలనను వానిని వసూలుచేయు క్రూర పద్ధతుల వలనను గవర్నమెంటువారి కోర్టులలో జరుగు నాలస్యము దుర్య్యయము మొదలగు వానివలనను సంభవించుచున్నవి. మాకు ముఖ్యముగా గావలసినవి మంచిరోడ్లు వంతెనలు చేల కదును దప్పకుండ నీరిచ్చు కాలువలు పల్లెటూళ్ళ బాలురకు విద్యనేర్పు బాఠశాలలు మొదలగునవి గవర్నమెంటు పరిపాలనావిషయమున జేయు వ్యయము తగ్గింపవలయును. దేశ మభివృద్ధి పొందునట్లు ప్రజలు సుఖపడునట్లు గవర్నమెంటువారు ప్రభుత్వము చేయవలయును. పై సంగతు లన్నిటిని వ్రాసి వారా మహజరులలో చిట్టచివర నీక్రింది వాక్యముల బొందుపరచిరి. "హిందూదేశపాలన మిప్పుడున్నట్లు కంపెనీవారి చేతిలోనున్నను సరే లేక మరియొకరి చేతిలోనున్నను సరే. పాలించుపద్ధీతిలో మార్పులు కాలానుసారముగ నభివృద్ధులు తప్పకనుండవలయును. ఆమార్పులు మూడేండ్లకొకసారిగాని లేనిచో నై దేండ్లకొకసారిగాని దేశముయొక్క స్థితినిబట్టి యవసరములనుబట్టి చేయుచుండవలయును. విశాలమైన యీ దేశమునందుండు ప్రజలు తమపడు సంకటములు తెలిసికొని పైవారికి దెలుపుకొనుటకును, దెలుపుకొనినపిదప తగినవిచారణజరుగుటకుపార్ల మెంటుమహాసభలో నప్పుడప్పుడు హిందూదేశ విషయమున జర్చలు జరుగుచుండవలయును. ఇక్కడదొరతనము చేయువారు జాగ్రత్తతో ప్రజాపాలనము చేయుచున్నవారో లేదో కనుగొనుటకు సీమలోనున్న యధికారులు వీరు చేయుపనులను శ్రద్ధతో విమర్శింపు చుండవలయును."

ఈపై మహజరు 1853 వ సంవత్సరం ఫిబ్రవరినెల 25 వ తారీఖున పార్ల మెంటు ప్రభుసభలో నెల్లింబ్రాప్రభువుగారు దాఖలుచేసిరి. ఆసభలో మఱియొక ప్రభువు హిందూ డేశ విషయమునఁ బ్రసంగిం


చుచు సభికులతో నిట్లని చెప్పెను. 'ఈమహజరులోనున్న సంగతులు సత్యములని తెలుపుటకు హిందూ దేశస్థులవలన వ్రాయబడిన యుత్తరములు రెండు నావద్ద నున్నవి. ఆయుత్తరములు వ్రాసినవారు పెద్ద మనుష్యులు యోగ్యులు మనవలెనే వారు నింగ్లీషు చక్కగా వ్రాయగలరు మాటలాడగలరు. ఆయిద్దరిలో నొకరు లక్ష్మీనర్సు శెట్టి గారు ఆయన 1853 వ సంవత్సరం జనవరి 24 తారీఖున నాపేర నీక్రింది విధముగా నుత్తరము వ్రాసినారు. "మేము పడుచున్న బాములను విచారణసేయుట కొక ప్రత్యేకసభ యేర్పడునేని మేము చెప్పిన విషయములన్నియు కన్నులకు గట్టినట్లు ఋజువు కాగలవు. అవి వివరించుటలో సాక్ష్యములు తీసికొనుట వలననేగాని మఱియొక లాగున యూరపుఖండమువారికి దెలియదు.

అని యాప్రభువు లక్ష్మీనర్సు శెట్టి మాటలయందు మిక్కిలి గౌరవము నమ్మికగలిగి మాటలాడెను. ఆసంవత్సరమే పార్లమెంటు సభలోఁ బ్రధానసభికుఁడు లోకానుభవము గలవాఁడు నగు బ్రైడుదొరగారు లక్ష్మీనర్సు శెట్టి వ్రాసిన యుత్తరములు తాను జూచినట్లె వాని మాటలు తనకు సత్యములని తోఁచినట్లు చెప్పి హిందూదేశస్థులు పడు బాధలను విచారణసేయుటకుఁ ప్రత్యేకసభ నొకదాని నేర్పరుపవలసినదని పట్టుపట్టెను. లక్ష్మీనర్సు శెట్టి వెనుక పంపించిన మహజర్లతోదృప్తినొందక హిందూ దేశప్రభుత్వముకంపెనీవారియొద్ద నుండి తీసుకుని యింగ్లాండు రాజుగారు స్వయముగా బరిపాలించిన బాగుండునని ప్రార్థించుచు పదునాలుగువేల జనులచేత వ్రాళ్ళు చేయించి పార్లమెంటుకు మఱియొక మహజరుపంపించెను. చెన్నపట్టణమందు లక్ష్మీనర్సు శెట్టియు బొంబాయియందు కొందరు బంగాళము నందు మఱికొందరు బడిన పరిశ్రమచేత పార్లమెంటువారు మనదేశ ప్రభుత్వము కంపెనీవారివద్దనుండి తీసికొనక పోయినను కొన్ని


మార్పులఁజేసిరి. అందు ముఖ్యమైనవి, హిందూదేశములో గొప్ప యుద్యోగములు పరీక్షలయందుఁ గృతార్థులైనవారికేగాని యధికారులకుఁ దోచినవారి కియ్యగూడదు. అదివఱకున్న సాదరుకోర్టులుపోయి హైకోర్టులు వానిస్థానమందు వచ్చెను. అంతలో హిందూదేశమున గొప్ప సిపాయిపితూరీ 1857 సంవత్సరమునఁ బుట్టుటచే 1858 వ సంవత్సరమునఁ హిందూదేశప్రభుత్వమును స్వయముగా నింగ్లాండు దేశపు రాణీగారగు విక్టోరియాగారే వహించిరి."

పచ్చయప్ప మొదలియారను సత్పురుషు డొకడు సత్కార్యముల నిమిత్తము లక్షలకొలది రూపాయలిచ్చి చనిపోయెను. ఆ ధనమునకు గొందఱు ధర్మకర్తలేర్పడి పాఠశాలలు మొదలైనవి పెట్టించిరి. లక్ష్మీనర్సు శెట్టిగారు పరోపకార పారీణు డగుటచే ధర్మకర్తగా నుండదగినవాఁడని తక్కినవారు వానింగూడ నందు చేర్చుకొనిరి.

ఇట్లు ప్రజాపక్షము వహించి పనిచేయుటచే లక్ష్మీనర్సు శెట్టి రాజద్రోహి యనియు విశ్వాసపాత్రుఁడు గాఁడనియు దొరతనమువారు భావించి యతడిచ్చిన యుపన్యాసములను మిక్కిలి శ్రద్ధతో శోధించుచు నతడెక్కడికి బోయిన నక్కడకు వెంటవెంట పోలీసు వారిని బంపుచుండిరి. 1857 వ సంవత్సరమున జరిగిన సిపాయి పితూరీకిఁ గారణము దొరతనమువారు మతసంబంధము కలుగ జేసికొనుటయే. అటుపిమ్మట నట్టి మత సంబంధము కలుగజేసికొనవద్దని శెట్టి గవర్నమెంటువారికొక మహజరు పంపించెను. ఆ మహజరు మిక్కిలి బాగుండెనని శ్లాఘించి యింగ్లాండులోని యధికారులు వారి యాలోచనము నంగీకరించిరి. ఇట్లు కొంతకాలము గడచునప్పటికి మునుపు శెట్టిగారిమీఁద ద్వేషముపూనిన దొరలు క్రమక్రమముగా నుద్యోగములు ముగించుకొని స్వదేశములకు పోవుటచేతను శెట్టిగారి


మీద లోకుల కంతకంత కనురాగము హెచ్చుచుండుట చేతను దొరలలో గొందఱు సయితము వానిధైర్యమునకు వాని పరోపకార చింతకు నద్భుతము నొంది శ్లాఘించుటచేతను, అప్పటి చెన్నపురి దొరతనమువారు వానిని నిందింపమానిరి. మానుటయేగాక యా దొరతనమువారు వానిచేసిన దేశోపకారముల మెచ్చుకొనుచు వానికి సి. యస్. ఐ. అను బిరుదము నిచ్చి గవర్నరుగారి శాసననిర్మాణసభలో నొక సభికుడుగ 1863 వంసంవత్సరమున నేర్పరచిరి. ఈ పదవియందు వాని నుంచుట సమస్తమతములవారికి సమస్త జాతుల వారికి దృప్తికరముగ నుండెను.

అటుమీద లక్ష్మీనర్సుశెట్టి తన దృష్టి మైసూరురాజ్య వ్యవహారములవంక నిలిపెను. ఇంగ్లీషువారు మైసూరును జయింపబోయినప్పుడు హైదరాబాదు నిజాముగారి సహాయమును బడసి మైసూరు సంస్థానము స్వేదేశరాజున కీయకపోయిన పక్షమున నిజామును దామును గలసి పంచుకొనునట్లొడంబడిక చేసుకొనిరి. లక్ష్మీనర్సుశెట్టి మైసూరుసంస్థాన మింగ్లీషువారు దాని రాజున కప్పగింపనిష్టములేకున్న వారని తెలిసికొని స్వయముగ మైసూరువెళ్ళి వృద్ధరాజును దర్శించి వంశపరంపరగ నుండునట్లు పుత్రుం బెంచుకొమ్మనియుఁ బెంపు స్థిరపరుప దొరతనమువారిని నొక్కి యడుగవలసినదనియు వానికి హితోపదేశము చేసెను. ఒక వేళ నింగ్లీషువారు మైసూరు రాజుయొక్క పుత్రస్వీకారము నంగీకరింపక బోవుదురేమో యను భయమున లక్ష్మీనర్సు హైదరాబాదు నిజాముగారి మంత్రియు సుప్రసిద్ధుఁడు నగు సలారుజంగును గలిసికొని మైసూరుసంస్థానము రాజునకు దొరతనమువా రియ్యనియెడల వెనుకటి యొడంబడికను బట్టి నిజామునకు సమముగా బంచిపెట్టవలసినదని యడుగుమని యాయనం బురికొల్పెను. అప్పుడింగ్లీషువారు మైసూరు రాజుయొక్క పుత్రస్వీకా


రము నంగీకరించుటయో లేక నిజామున కందులో భాగము పంచి పెట్టుటయో రెంటిలో నేదో యొకటి చేయవలసివచ్చినందున రాజునకు సంస్థానమిచ్చుట యెక్కుడు గౌరవమని దత్తతపుత్రుఁడు యుక్తవయస్కుఁడైన పిదప రాజ్యమిచ్చు నట్లొప్పుకొనిరి. శెట్టి జానుబ్రూసు నార్టనుదొరగారితో గలసి రాజ్యభ్రష్టుడైన తంజావూరి మహారాజు భార్యల దురవస్థను గొంతవఱకు చక్కపరచి మృతినొందిన కర్నాటక నవాబుయొక్క కుటుంబ మనుభవించు కష్టములను జాలవరకు తగ్గించెను. ఈ పనులు 1864 వ సంవత్సరమున జరిగెను.

అప్పటికి శెట్టిభాగ్యముక్షీణించెను. క్రెసెంటుపత్రిక నడపుటకే వాని ధనమంతయు వ్యయ మయ్యెను. అతఁడు తన వ్యాపారము కుమారున కప్పగించుట చేత వాని తెలివితక్కువవలన నది బొత్తుగ చెడిపోయెను. కావలసిన ధనము లేమి క్రెసంటుపత్రిక ప్రకటింపఁ బడుట మానెను. అది మొదలుకొని లక్ష్మీనర్సు శెట్టి జీవితకాల శేషము పేదయైగడపెను. ఆయన 1868 వ సంవత్సరమున మృతినొందెను. ఆయన దేహము నశించినను కీర్తిదేహమిప్పటివఱకు దక్షిణ హిందూస్థానముననున్నది. ఆయన మృతినొందిన కొన్నినాళ్ళకు చెన్నపురి మహాజనులు పచ్చయ్యప్పగారి పాఠశాలలో సభగూడి వానిమరణమునకు మిక్కిలి విచారించి వానిపేరు చిరకాలము జ్ఞాపకముండుటకు వాని బొమ్మయొకటి నిర్మింపఁజేసి యది యా పాఠశాలలో బెట్టుటకును ప్రసిడేన్సీ కాలేజీలో సంస్కృతము జదువుకొను బాలురలో సూక్ష్మబుద్ధి గలవానికి నెలకు కొంతసొమ్ము విద్యార్థి వేతనముగ నిచ్చుటకును గృతనిశ్చయులైరి. ఆరెండు కార్యములకుఁ గావలసిన ధనము నాకాలపు గొప్పవారంద ఱిచ్చిరి. తిరువాన్కూరు మహారాజుగారు, వారి మంత్రి సర్. టి. మాధవరావుగారు శెట్టిగారి మరణమున దమకుఁ గలిగిన సంతాపము నెఱిఁగించుచు గొంత చందాసొమ్ము


నంపిరి. ఈయన దేశాభిమానులలో ప్రథమగణ్యుఁడని చెప్పవచ్చును. సాధారణముగ దేశోపకారము జేయబూనువారు ప్రజలమెప్పుకొఱకు దొరతనము వారిచ్చుబిరుదుతోకలకొఱకు నెదురుచూతురు. ఈ శెట్టిగారు సంపాదించిన ధనమంతయు లోకహితముకొఱకు వ్యయము చేసి దొరల కోపమునకు బాత్రుఁడై ప్రజాపక్షము బూని పాటుపడి కడకు నిరుపేదయై చచ్చెను. దొరతనమువారి లోపములను మొగమోటములేక ఖండించి చెప్పుట కీదినములలో సయితము గొప్ప విద్యావంతులు ధనవంతులు భయపడుచుండ నేబది యఱువది యేండ్లక్రిందట నింగ్లీషువిస్తారము రానివాడు గొప్పపరీక్షల గృతార్థుడు కానివాడు దొరతనమువారితో బ్రతికక్షబూని నిర్వహించుటయెంత కష్టమోయోచింపుడు. మొదటవానిమంచితన మెఱుగక దొరలు వాని నేవగించుకొన్నను నిజము నిలుకడమీద తెలిసికొని త్రాచుబామను కొన్నది పూలదండయయ్యెనని తలంచి దూషించినవారె భూషించిరి. అతఁడు నిజమైన లోకోపకారబుద్ధిగలవా డగుటచే స్తోత్రములకుబ్బక నిందలకు వెఱువక తాను మంచిదని నమ్మినపని చేసెను. ఈతఁడు రాజకీయ వ్యవహారములయందెగాక సంఘసంస్కరణము నందు నిష్టముగలవాఁడె. వితంతువివాహములు మంచివని యీయన యభిప్రాయము. స్త్రీవిద్యాభివృద్ధికి స్వధనముతో గొన్ని పాఠశాలలు పెట్టించెను. అరవపండితులకుఁ దెనుఁగు పండితులకుఁ జాల సహాయము చేసెను. వేయేల లక్ష్మీనర్సుశెట్టియే లోకోపకారి. అతడే ధన్యుఁడు.


Mahaapurushhula-jiivitamulu.pdf