మహాపురుషుల జీవితములు/కృష్ణమోహన బెనర్జీ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కృష్ణమోహన బెనర్జీ

ఈయన ప్రతిమయు మాకు దొరకలేదు, ఈయన బంగాళా దేశ బ్రాహ్మణుఁడు ఈయన తండ్రిపేరు జీవన్‌కృష్ణ బెనర్జీ ఈకృష్ణమోహను బెనర్జీ 1813 వ సంవత్సరమున మే నెలలో గలకత్తా నగరములో నుదయించెను. అయిదేండ్ల వయసువాఁడైనప్పుఁడతఁడు విద్యారంభముచేసి బంగాళీభాషలోఁ జదువుటయు వ్రాయుటయు లెక్కలు సేయుటయు నేర్చికొనెను. తరువాత గొంతకాలమున కాయన హిందూకళాశాలకుఁ బోయి యచ్చట నాంగ్లేయభాషను సంస్కృతమును నేర్చికొనియెను. 1828 వ సంవత్సరమున కృష్ణమోహనుని తండ్రి విశూచి జాడ్యమువలన లోకాంతరగఁడయ్యెను. పితృవియోగముచేత విద్యాభ్యాసము చక్కఁగా సాగనందున నతఁడు నెలకు పదియారు రూపాయిలు విలువఁగల విద్యార్థి వేతనమును సంపాదించి చదువనారంభించెను. మరుచటి సంవత్సరము వానికి ఢిల్లీ కళాశాలలో నొక యుపధ్యాయ కోద్యోగ మయ్యెను. కాని కొన్ని గృహసంబంధములగు నిబ్బందులచేత పోఁజాలక యతఁడా సంవత్సరము నవంబరులోనే హేరుదొరగారి పాఠశాలలో నుద్యోగము సంపాదించెను. ఆకాలమున బంగాళాదేశమున దృఢచిత్తులగు పడుచువాండ్రు కొంద ఱొక సంఘముగాఁ జేరి హిందూమతమును నిర్మూలింపవలయునని నిశ్చయించుకొని తద్విషయమయి పాలుమాలిక లేక పాటుపడఁ జొచ్చిరి. కృష్ణమోహనుఁడు గూడ నా సంఘమునఁ జేరి తద్విషయమున గట్టిప్[అనిఁ జేయుటకు నొక యింగ్లీషు వార్తాపత్రికను బ్రకటింపఁ జొచ్చెను. కృష్ణమోహనుని పద్ధతులు బంగాళీల కందఱకు మహాగ్రహమును దెప్పించెను, ఆగోలఁ జూచి యతని స్వజనముగూడ వాని నింటనుండి యవ్వలకుఁ బంపివేసెను. మొదటినుండియు నతనికిఁ గ్రైస్తవ మతబోధకులు మిత్రులుగా నుండుటచే వానికిఁ గ్రైస్తవ మతముపై నత్యంతాభిమానము బొడమెను. అయభిమానము కతనమున నతఁడు పలుమారు బైబిలు మొదలగు గ్రంథములు చదివి యెట్ట కేలకు 1832 వ సంవత్సరమున గ్రైస్తవమతము నవలంభించెను. డాక్‌టరు టఫ్ దొరగా రా సమయమున ప్రధనాచార్యుఁడై పరిశుద్ధస్నానము చేయించి వాని నా మతమునఁ గలిపిరి. కలిపిన వెంటనే కృష్ణమోహనుఁడు కొంతకాలమువఱకుఁ బ్రయాగ మండలమునఁ బ్రయాణముచేసి 1835 వ సంవత్సరమున తన భార్యను తన స్వాధీనము చేసుకొనెను. తరువాత చర్చిమిషను స్కూలులో నుపాధ్యాయుఁడై కొంతకాల ముండి యవ్వలనొక చర్చికధికారియై యచ్చటి పనులను మిక్కిలి సామర్థ్యముతో నెరవేర్చు చుండెను. తాను గలియుటయే గాక కృష్ణమోహనుఁడు తనతోడి హిందూ బాలకుల ననేకులఁ గ్రైస్తవ మతమున గలిపెను. 1852 వ సంవత్సరమున బిషపు కళాశాలలో నతఁ డుపాధ్యాయుఁడుగా బ్రవేశించి 1858 వ సంవత్సరము వఱకు నచ్చట పనిచేసెను. ఈయన తాను ప్రవేశించిన క్రొత్త మతమునందు మిక్కిలి యభిమానము గలవాఁడై యా మతమును తన దేశస్థులకు బోధించుచు దద్విషయమున ననేక గ్రంథములు బంగాళీలోను నొంగ్లీషులోను వ్రాసి ప్రచురించెను. ఈయన పదిభాషలలో పండితుఁడు. ఓడ్రభాషయందు సంస్కృతభాషయందు బి. ఏ. మొదలగు పరీక్షలకుఁ జాలకాలమతఁడు పరీక్షకుఁడుగా నియమింపఁబడెను. ఈయన వ్రాసిన గ్రంథములలోని రెండు ముఖ్యమయినవి గలవు. అందొకటి హిందువుల వేదాంతశాస్త్ర విషయమయి సంభా షణ పూర్వకముగా నున్నది. ఈపుస్తకము మన దేశమున కింగ్లాండు నుండి వచ్చు దొరల కత్యంతోప యుక్తముగాఁ నున్నది. రెండవ గ్రంథము క్రైస్తవమతము నందలి సత్యమునుఁ గూర్చి వేదములలో ప్రమాణము లున్నవని చెప్పుచున్నది, వేదమందున్న ప్రజాపతి శబ్దము యేసుక్రీస్తునకే యర్థమిచ్చుచున్నదని యతఁడీ గ్రంథమునందు సాధించెను.

కృష్ణమోహను బెనర్జీ క్రైస్తవమతములోఁ గలిసిన కొంత కాలమువఱకు మిక్కిలి మతావేశముగలవాడై తక్కిన మతస్థులను గఠినముగాఁ దూలనాడుచువచ్చెను. కాని వయస్సు ముదిరినకొలది యన్యమతసహనము గలవాడై సమస్తజనముల యెడల ప్రేమఁ గలవాఁడై యందఱి గౌరవమునకుఁ బాత్రుఁడయ్యెను. క్రైస్తవమత బోధకులు దేశస్థులగు బీదలయెడల పరమదయాళులై వారి కనేకోపకారముల చేసిన పక్షమునఁ గ్రైస్తవ మతమునందుఁ బ్రజల కాదర మెక్కుడు గలుగునని యాయన యభిప్రాయపడి తక్కువ జాతులవారికిఁ బలుమారు లుపకారములు సేయుచువచ్చెను. అందుచేత తన మతాభివృద్ధి యెటులున్నను ప్రజానురాగము మాత్ర మతనియందు హెచ్చుగా నుండెను. క్రైస్తవసంఘము వా రీయనకు 'రెవరెండు' అను బిరుదము నిచ్చిరి. విద్యాశాఖవా రనఁగా యూనివరుసిటీవా రతనికి మహాపండితుల కీయఁదగిన యల్. యల్. డీ. యను బిరుదమునిచ్చి గౌరవించిరి. ఈయన 1885 వ సంవత్సరము మేయి నెలలో కాలధర్మము నొందెను. ఆ కాలమందు బంగాళా దేశములో విద్యావిషయములు దేశాభిమాన విషయకములుఁ రాజకీయ విషయకములునగు ప్రసంగములు కృష్ణమోహనుబెనర్జీ లేనివి లేవు. ఇతఁడు మతాంతరుఁడైనను దేశాభిమానులలో నొకఁడు.


Mahaapurushhula-jiivitamulu.pdf