మహాపురుషుల జీవితములు/కృష్ణదాసు మూల్జీ

వికీసోర్స్ నుండి

కృష్ణదాసు మూల్జీ

ఇతఁడు 1832 వ సంవత్సరము జూలై 25 వ తారీఖున జన్మించెను. ఈతని పసితనమునందె తల్లి కాలధర్మము నొందుటచేఁ దండ్రి రెండవపెండ్లి చేసికొనిమాతృహీనుఁడగు నీ బాలకుని బెంచుమని తనతోఁబుట్టువు కప్పగించెను. ఈకృష్ణదాసు మేనత్త సంరక్షణములో నుండి బొంబాయిలోనియెల్ఫిన్‌ష్టన్ కళాశాలలో విద్య నేర్చుకొనుచుండెను. ఆ కాలమున నతఁడు రమారమి యిరువది యొక్క సంవత్సరముల వయసుగలవాడై నప్పుడు వాని విద్య కంతరాయము సంభవించెను.

గుజరాతి దయాన్ ప్రసారికమండలి యను నొక సభ గుజరాతులో నేర్పడి స్త్రీపునర్వివాహ విషయమున మంచి యుపన్యాసము వ్రాసినవానికి నూటయేబది రూపాయలు బహుమాన మిచ్చునట్లు ప్రకటించిరి. కృష్ణదాసు తద్బహుమానము సంపాదింపవలయునని యుపన్యాసము వ్రాయ మొదలుపెట్టెను. కొన్ని పుటలు వ్రాసిన తరువాత వాని వ్రాసిన కాగితము లెవరో వానికి దెలియకుండ తీసికొని మేనత్తకుఁ జదివి వినిపించిరట. పూర్వాచారములపై నత్యంత భక్తిగల యా యవ్వ యావ్రాతలు వినిన తోడనే పిడుగడచినట్లు నిశ్చేష్టయయి స్త్రీలకు పునర్వివాహము చేయుట మంచిదని వ్రాసిన పరమదుర్మార్గునిఁదా నన్న వస్త్రములిచ్చి పెంచుటయు మహాపాతకమే యని తక్షణమె వాని నింటనుండి యావలకు వెడల నడచెను. కృష్ణదాసున కిది పెద్దదెబ్బ. దీనిచే నతఁడు నిరాధారుఁడై యన్న వస్త్రము లిచ్చువారే లేకపోవుటచేఁ జదువు సయితము మానుకోవలసి వచ్చెను. అతడు కొంచెము పశ్చాత్తాపము నొంది యుప
వ్యాసము వ్రాయుటమాని తన యభిప్రాయములు మారినవని మేనత్తతో జెప్పి సరిపుచ్చుకొన్న పక్షమున నతఁ డెప్పటియట్ల నామె యనుగ్రహమునకుం బాత్రుడయి యుండును. కాని కృష్ణదాసు అట్లు చేయువాఁడుకాఁడు. సంఘసంస్కరణాసక్తి వాని హృదయమునం దగ్నిహోత్రమువలె ప్రజ్వరిల్లుచుండుటచేత నతడు మిగుల ధైర్యము నుత్సాహము గలిగి తనునమ్మినది సరియని యా మార్గము నుండి తొలగనని చెప్పెను.

మిక్కిలి యవసరములగు నన్న వస్త్రములకే యతఁ డిబ్బంది పడుచుండుటచే నేదైన యుద్యోగము సంపాదింపఁ దలఁచి గోకులదాసు తేజపాలుగారి పాఠశాలలో నుపాధ్యాయత్వము సంపాదించి కొంతమనశ్శాంతి గలిగి సంఘసంస్కరణము నభివృద్ధి జేయుటకై పూనుకొనియెను. ఆ కాలమున బొంబాయిలో స్వదేశవార్తాపత్రికలు మిక్కిలి హీనస్థితిలో నుండెను. వానిని నడుపువారు తగినంతజ్ఞానము గాని లోకానుభవముగాని లేనివారయి యుండిరి. పారసీలు నడపు పత్రికలు తప్పులతడకలయి నీచ పదప్రయోగములు గలిగి గుజరాతి భాషలోను నింగ్లీషుభాషలోను బ్రకటింపఁబడుచువచ్చెను. ఈస్థితిని జూచి వార్తాపత్రికల దురవస్థను తొలగించుటకు విద్యావంతులు లోకోపకారులు నగు కొందఱు పారసీలు 'రాస్టుగాప్తర్‌' యను గుజరాతిపత్రికను బయలుతీసి నడిపింపఁజొచ్చిరి. దాని నసమానముగ జేయ వలయునని తత్ప్రవర్తకులు సంకల్పించుటచే కృష్ణదాసుకూడ వారికి సాయము చేయఁదలచి కొన్ని విషయములు వ్రాసి తాను పత్రికకు పంపుచువచ్చెను. కానియప్పుడప్పు డితరుల పత్రికకుఁదాను వ్రాసి పంపుచుండుటయు వారనుగ్రహించి తనవ్రాతలు పత్రికలో వేయుటయు నతనికంతగా యిష్టములేదు. సంఘసంస్కరణమును ములన్నియు స్వపత్రిక లోనే వెల్లడింప వలయునని సత్యప్రకాశిక యను పత్రికను నడపింప నారంభించి మనోరథసిద్ధి చేసికొనియె.

కృష్ణదాసు వార్తాపత్రికను నడపుటకుఁ దగినసామర్థ్యముమన స్వాతంత్ర్యము లోకానుభవముగలవాఁ డగుటచేఁ బత్రిక మంచిదశకు వచ్చెను. హిందువుల సంఘములోఁ జిరకాలమునుండి కాపురముండి బయలుపడకుండ సంఘమును నాశనము చేయుచుండిన దురాచారముల నతడు పత్రికాముఖమున బయలుపుచ్చి యపహాస్యము పాలుచేయుచుండుట చే హిందువు లందఱిలోను ముఖ్యముగా భట్టియాలలోను వైశ్యులలోను మిక్కిలి కళవళము పుట్టెను. బొంబాయిలోనుండు వైశ్యులు భట్టియాలు వాణిజ్యాదులు చేయుటలో బుద్ధిమంతులే యయినను సంఘమత విషయములలో మూర్ఖులయి గురువులకు బానిసలయి వారు గీచినగీటు దాట వెఱచి నీచముగ బ్రతుకుచున్నారు. ఈగురువులు మన దేశమునం దున్న గురువులవలె స్వాములవారలు సన్యాసులని పిలువంబడక మహారాజులని పిలువఁబడుదురు. పేరునకు వారు సన్యాసు లయినను నిజముగా మహారాజులకంటె నెక్కువ భోగములను వైభవములను ననుభవించుచుందురు. ఈ గురువులు శ్రీకృష్ణుని యవతారములని శిష్యజనులునమ్మి భ్రష్టులగుచున్నారు. ఈమతము వల్లభాచార్యమతమని చెప్పఁబడును. ఇదియొక విధమయిన వైష్ణవ మతము, దానిస్థాపకుఁడు వల్లభాచార్యుఁడు. ఈతఁడిప్పటికి రమారమి నాలుగువందల యేండ్లక్రిందట నుండినవాఁడు. ఈయనకొంతకాలము దక్షిణదేశముతిరిగి పిదపఁ బశ్చిమమునకుఁబోయి గుజరాతుదేశమున నొక వైష్ణవమతముస్థాపించెను. ఆమత గురువులే యీమహారాజులు ఈమతసిద్ధాంతమునుబట్టి శిష్యులు గురువునకు తమతనువు మనస్సు ధనము సమస్తము నర్పించి కైంకర్యము చేయవలయును. ఈధర్మము మొట్టమొదట శిష్యులు గురువులయెడల మిక్కిలి భక్తికలిగియుండ వలయు నను మంచియుద్దేశముతో నేర్పడియుండవచ్చును. కాని యిటీవల మహారాజులను పేళ్ళతో బయలుదేరిన గురువులుదురాశా పాతకులయి శిష్యులను వంచించి మూర్ఖులనుజేసి వారిధనము నపహరించుటయేగాక వారిచేత నీచమయిన సేవలు చేయించుకొనుటయే కాక శిష్యులయింట నుండు పడుచుపడంతుల సయితము భక్తితోఁ గాపురమునకుఁ బంపకమునుపు వ్యభిచారమునిమిత్తము గురువుల వద్దకు పంపవలయునని శిష్యులు కుపదేశించు చున్నారు.

ఈ గురూపదేశము విని యందువలన పుణ్యము వచ్చునని నమ్మి యా మతస్థులు తమ భార్యలను పుత్రికలను దోఁబుట్టువులను గురువులగుం దార్చి తాము కృతార్థుల మయితిమని సంతసింతురు. ఈ మూర్ఖుల భక్తి యింతతో సరిపోవలేదు. ఈ గురుమహారాజులు నడిచిన నేలమీఁది దుమ్ము వారిపాదపద్మ సంసర్గముచేతఁ బావన మైనదని శిష్యు లామట్టిభక్షింతురు. వారిపాదుకలు వారుకూర్చుండు పీఁటలు పూల పూజింతురు. వారి యడుగులను బంగారునగలతో నర్చింతురు. గురువులు నమలి యుమిసిన తమలపాకులతమ్మి స్త్రీపురుషులు వెలయిచ్చి కొని కన్నుల నద్దుకొని తినిధన్యులగుదురు. గురువు కాళ్ళు గడుగుకొన్న నీరు త్రావుదురు. అతని యుచ్ఛిష్టాన్న మారగింతురు వేయేల? అతనిబట్టలు పిడిచిననీరుసహితము పరమభక్తితో గ్రహించి పానము చేయుదురు. జనులయందున్న యీ మూర్ఖత చూచి గురువులు పై నుదహరింపఁబడిన పనులు చేయనిచ్చినందుకు శిష్యుల వద్దనుండి చాలధనము గ్రహింతురు. ఈ విషయమున మున్నొకసారి రావుబహుదూరు కందుకూరి వీరేశలింగము పంతులుగారు వ్రాసిన వాక్య మొక టిందుదహరించుచున్నాము.

'ఈమహారాజులు శిష్యులవలన, దర్శనమిచ్చినందున కయిదు రూపాయిలును శరీరములు ముట్టనిచ్చినందుకు ............ రూపాయిలును, ఉయ్యలలోఁబెట్టి యూఁచనిచ్చినందునకు నలువది రూపాయిలును, గంథముపూయనిచ్చినందున కఱువదిరూపాయిలును, ఏకశయ్యాగతులు కానిచ్చినందున కేఁబది మొదలుకొని యేనూరు రూపాయిలు వఱకును, కలసి రాసక్రీడ చేయనిచ్చినందునకు నూరు మొదలుకొని యిన్నూరు రూపాయిల వఱకును, ఉమిసిన తాంబూలమును తిననిచ్చినందునకు పదునేడురూపాయిలును, తాము స్నానము చేసినట్టిగాని తాము కట్టుకొన్న బట్ట యుతికినట్టిగాని నీరు త్రాగ నిచ్చినందునకు పందొమ్మిది రూపాయులును, గ్రహింతురఁట. మనుష్యజన్మమెత్తినవా రింతకంటె నెక్కువగాఁ జెప్పుట సాధ్యమగునా?"

నాగరికులయిన జనులు తలంచుకొనుటకైనను హేయములగు నీ దురాచారములను నిర్మూలింపఁదలఁచి కృష్ణదాసుమూల్జీ యీగురు పిశాచములవికృత చేష్టలను తనపత్రికాముఖమున బయలుపుచ్చి యల్లరి చేయసాగెను. తమగుట్టు బయలుపడుటచే గురువులు భయపడి లంచములచేతను బెదిరింపుల చేతను వానిని మిన్నకుండ చేయవలయునని యత్నించిరిగాని కృష్ణదాసు తనసంకల్పమును విడువడయ్యె. కృష్ణదాసు వ్రాయువ్రాతలు గురుమహారాజులకు భరింపశక్యములుగాక యుండుటచే నామహారాజులనేకులుకూడి తమ శిష్యజనులందరిచేత మూల్జీని వెలివేయించి యిబ్బందిపెట్టుటకు ప్రయత్నించి 1859 వ సంవత్సరము జనవరి నెలలో నొక యొడంబడికను వ్రాసికొనిరి. అందున్న ముఖ్య నిబంధనలివ్వి. 1 వల్లభాచార్యమతములోఁ జేరిన వైష్ణవుఁడెవఁడును గురుమహారాజులను న్యాయస్థానమునకు రప్పించుటకు సమనులు చేయించగూడదు. అట్టి సమనులు తీసుకురాకూడదు. 2. గురుమహారాజుల నేకోర్టులకు సమను చేసి పిలుపింపగూడదని దొరతనమువారిచేత నొకచట్టము నిర్మింపఁజేయుటకు వలసినంతసొమ్ము పోగుచేయ వలయును. 3. చట్టములు నిర్మింపబడులోపున నీమహారాజుల శిష్యుడు కానివాఁడెవడయిన వారికి సమనులు చేయించినపక్షమున నట్టి వ్యవహారమునకుఁ గావలన ధనమంతయు శిష్యవైష్ణవులు పెట్టుకొనవలయును. 4. గురుమహారాజుల శిష్యుఁడగు వైష్ణవుం డెవండయిన వారిమీఁద చెడువ్రాతల వ్రాసినపక్షమున వెంటనే కులస్థులందఱు వానిని వెలివేయవలయును.

ఇట్లు వ్రాసి యా యొడంబడిక పత్రమును గురువులు శిష్యులందఱకు యధేచ్చముగ బంచిపెట్టిరి. ఆకాగితమునుజూచి మూల్జీ దానికి బానిసపత్రమని పేరుపెట్టెను. ఒడంబడక లెన్ని వ్రాసికొన్నను శిష్య జనులు చాలమంది దానిలో వ్రాలుచేయనందున మహారాజులు తమ యిచ్ఛాప్రకారము కృష్ణదాసును బహిష్కరింపఁ జాలరయిరి. ఇటులుండ 1860 వ సంవత్సరమధ్యమున సూరతు నగరమునుండి యొక మహారాజు బొంబాయి నగరమునకు విజయం చేసెను. వచ్చినకొన్ని నాళ్ళకె యాగురువునకును సత్యప్రకాశిక పత్రికాధిపతియగు మూల్జీకిని మతాచారములలో గొన్ని సందిగ్ధవిషయములనుగూర్చి చర్చజరిగెను. కృష్ణదాసడిగిన ప్రశ్నలకుఁ దగినయుత్తరములు చెప్పఁజాలక గురుమహారాజుగారు "శేషంకోపేన పూరయే" త్తను లోకోక్తి నిజముగ మహాకుపితులై మూల్జీనాస్తిక వాదములు చేయుచున్నాఁడనియు మతమునకు జెరుపుగావింపు చున్నాఁడనియు నిందారోపణము చేసెను. గురువులు తన కారోపించిన యీనీలాపనిందలకు మూల్జీ 1860 వ సంవత్సరము అక్టోబరు 21 వ తారీఖున ప్రకటింపఁబడిన సత్యప్రకాశికలో సహేతుకమయిన మంచి యుత్తరమిచ్చి యందు వేదములలో నుండి శాస్త్రములలోనుండి యెన్నోశ్లోకములనెత్తి వ్రాసి గురువులు చేసిన వాదము లప్రమాణికములని ఋజువుచేసి ప్రపంచము నీ గురుమహారాజులకంటె దురాత్ములగు ................. లేరని కఠినముగా వ్రాసెను. ఆవ్రాత గురువునకు నషాలమంటి తల వెఱ్ఱి యెత్తించినను యెందుచేతనో వారు కొంతకాల మూరకుండి దుస్సహమయిన యీ పరాభవమునకుఁ బ్రతిక్రియఁ జేయుటకు గాఁబోలు 1861 వ సంవత్సరమున మేనెల 14 వ తారీఖున నతఁడు కృష్ణదాసు మూల్జీమీఁద ప్రతిష్ఠ నష్టమునకు బొంబాయి హైకోర్టులో నొక యభియోగము (దావా) తెచ్చెను. కృష్ణదాసుమూల్జీ యీ దోషారోపణకుఁ దాను నేరస్థుఁడు కాఁడనియు, వ్రాసినవ్రాత వారి కప్రతిష్టాకరము కాదనియు దాను వ్రాసిన దానిలోఁ బ్రత్యక్షరము నిజమే యనియు వాదించెను.

అంతియగాక వల్లభమత గ్రంథములలో వ్యభిచారము భక్తిగఁ జెప్పఁబడి యున్నదనియు నీ మతగురువు లందఱు వ్యభిచరించుచునే యుందురనియు సూరతు గురు మహారాజుగారు కూడ నట్టి తెగలోనివాఁడే కాని వారికంటె భిన్నుఁడు కాఁడనియు మూల్జీ కోర్టువారికి విన్నవించెను. అనంతరము కృష్ణదాసు చేయుచున్న మహోపకారమును దెలిసికొన లేక మూర్ఖులయి భట్టియా జాతివారు సభయొకటిచేసి గురుమహారాజులకు విరుద్ధముగ నెవ్వరు కృష్ణదాసు పక్షమున సాక్ష్యమియ్యగూడదని నిర్ధారణచేసికొనిరి. ఈ నిర్ధారణము గురువులకు శిష్యులకు నష్ట మేగాని లాభము గలిగింప లేదు. ఏలయనఁ దన కులస్థులందఱు జేరి తనపైఁ గుట్రలు పన్ను చున్న వారిని కృష్ణదాసు వారిపై నొక యభియోగము దెచ్చెను. గురువులు తెచ్చిన దావా యటుండ మూల్జీ కులస్థులపై దెచ్చిన యభియోగములో న్యాయాధిపతులు భట్టియాలలో ముఖ్యులగు నిద్దఱకుఁ జెరియొక వేయిరూపాయిలను మఱి యెనమండ్రుగురిలో నొక్కొక్కని కైదువందల రూపాయిల చొప్పున ధనదండన విధించిరి. ఆనాఁడు మూల్జీ కోర్టునుండి యావలకుఁ బోగానే యోడిపోవుటచేత కడుపుమండి యున్న భట్టియాలు వానిని దిట్టముగఁ గొట్టిరి. అందుచేత రాజభటుల సాహాయ్యము గైకొని యింటికిఁ బోవలసి వచ్చెను.

గురువు దాఖలుచేసిన ప్రతిష్టానష్టపు దావా హైకోర్టులో నలువదిదినములు విచారింపఁబడెను. న్యాయాధిపతియగు జోసఫ్ అర్‌నాల్డు దొరగారు మూల్జీ నేరస్థుఁడు గాఁడని తీర్పు చేయుటయేగాక యతఁడు లోకోపకారి యనియు నీతిస్థాపనము నిమిత్తము చాలధైర్యముజూపె ననియుఁ దమ తీర్పులలో వ్రాసిరి. ఆ కాలమున నమెరికా ఖండములో గొప్పయుద్ధములు జరుగుచుండుట చేజనులు కృషి వాణిజ్యాదుల యందు శ్రద్ధ విడిచినందున దూదిపంట యల్పమయ్యె. అమెరికా ఖండపు దూదియే యదివఱ కింగ్లాండునకు విస్తారముగా నెగుమతి యగుచుండెను. ఆ ఖండమునందు దూదిపంట యల్పమయినందున నింగ్లాండువర్తకులు హిందూదేశపు దూది మిక్కుటముగాఁ గొనగోరి బేరములిచ్చిరి. అప్పుడు మనదేశములోదూదివెల యెక్కువయ్యెను. అందుచేత మూల్‌జీ తన పూర్వపువృత్తిని మాని దూది వర్తకము చేసినచో మిక్కిలి లాభము వచ్చునని కృష్ణదాసు మాధవదాసనుపేర నొక వర్తకపు సంఘముపెట్టి వ్యాపారముచేయ నారంభించెను. విదేశముతో వాణిజ్యము సేయునప్పుడు వర్తకుఁ డా దేశమునకు బోవనిచో వ్యాపారము సరిగ జరుగదని కృష్ణదాసు పయనమయి యింగ్లాండునకుఁ బోయెను. కాని యంతశ్రద్ధతో నతడు వ్యాపారము చేసినను దైవవశమున దూదిబేరములలో ధరలు మిక్కిలి మందమగుటచే మూల్‌జీ స్థాపించిన వర్తకపు సంఘము నష్టము నొంది యంతరించెను. కాబట్టి మూల్‌జీ యింగ్లాండులో నుండవలసిన యవసరము లేక 1874 వ సంవత్సరమునకు మరలివచ్చెను. ధనలాభము లేదు సరిగదా యింగ్లాండు పోయినందుకు మూల్‌జీకి మరియొక యుపద్రవము సంభవించెను. చిరకాలమునుండి యతని మీదఁ మిక్కిలియక్కసు బూనియున్న గురుమహారాజులు లదేసమయముగదా యని విదేశము వెళ్ళినందుకు వానికి వెలివేసి బహువిధముల బాధ పెట్టిరి. ఎన్ని బాధలు పెట్టినను మూల్‌జీ మేరువువంటి ధైర్యము గలవాఁడయి జడియక నిలచెను. ఇటులుండ నప్పటి బొంబాయిగవర్నరుగారు మూల్‌జీయొక్క సామర్థ్యమును, నీతిని, ధైర్యమును నెరిగినవా రగుటచే నొక స్వదేశసంస్థానమునకు వానిని దివానుగా నేర్పరచెను. ఉద్యోగస్థుడయి యున్న కాలమున, నతఁ డాపదవిలో దన్ను నియోగించిన దొరతనమువారికిని తనచేఁ బాలింపబడు ప్రజలకును సంతుష్టిగలుగునట్లు దేశము నేలెను. కాని యీ యుద్యోగమున నతఁడు చిరకాలముండలేదు. అచిర కాలములోనే యొక వ్యాధి సంభవించి యెట్ట కేలకు వానిం దనపొట్ట బెట్టుకొనియెను. ఈ సత్పురుషుని మరణమునకు బొంబాయి గవర్నమెంటువారు సయితము విచారించి తమ గెజటులో నా విచారమును తెలియపరచిరి. కృష్ణదాసు మూల్‌జీ సత్యము నిమిత్తము కష్టముల ననుభవించిన సూరశిఖామణి, సంఘసంస్కరణము నందితడు తనకు గల యభిమానము మాటలచేతగాక క్రియలచేతజూపి మొదటి నుండియు తన వర్తనమున నసందర్భములు లేకుండ నేకరీతిని నడపినవాడు. ఆ కాలపు బొంబాయి గవర్నరుగారే కాక యింక ననేకులు శ్లాఘాపాత్ర మగువాని చరిత్రమును మెచ్చుకొనుచుండిరి. సర్ రిచ్చర్డు టెంపిల్‌గారు తన కాలపు మనుష్యుల చరిత్రములను వ్రాయుచు నీతని గూర్చి శ్లాఘ్యమగు మాటలతో వ్రాసిరి.