Jump to content

మహాపురుషుల జీవితచరిత్రములు (ప్రథమ సంపుటము)/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక

శ్లో|| క్వసూర్యః ప్రభవో నంశః క్వచాల్పవిషయామతిః |
      తితీర్షుదు౯ స్తరం మోహాదుడుపేనాస్మిసాగరమ్ ||
      మందః కవియశః ప్రార్థీగమిష్యామ్యపహాస్యతాం |
      ప్రాంశు లభ్యే ఫలే లోభా దుద్బాహురినవామనః ||
                                          కాళిదాసః, రఘు. 1. 3-4.


లోకము కర్మసూత్రగ్రధితము. కర్మము ద్వివిధముః స్తోకమని, అస్తోక మని. మనుజుఁడు కర్మిష్ఠి. కర్మలేని భోగం బపోహంబు. అసందర్భంబు లసంభవములు. వర్తమాన దుఃఖంబులు భూతకాల స్వకర్మోపార్జింతంబులు, స్వస్తోక కర్మోద్భవంబులు. ఇవి యసాధువులు, రిక్తములు, దేశాభివృద్ధి నిరోధకములు. ఆ హేతువంజేసి త్యాజ్యంబులు. స్తోకకర్మిష్ఠులు కనిష్ఠులు.

వర్తమానమెటుల భూతకాలభవమో, అటులనె, భవిష్యత్కాలము వర్తమానోద్భవము. భవిష్యత్కాలభోగంబులకు వర్తమానకర్మ లుపాదానంబులు. ఆ కారణముంజేసి, అస్తోకకర్మ లనుష్ఠేయంబులు. అస్తోకకర్మిష్ఠులు గరిష్ఠులు. స్వాస్తోకకర్మ లతిరేకములు. అతిపథమునకు గరిష్ఠు లధ్వగులు. వారి నిదర్శనము లనన్యాదృశ్యంబులు; వారి యనుభవములు మనుజుల కనుబోధము; వారి రాకలు మేలురాకలు; వారి సంభాషణలు మోహాంధకారవిదళనచంద్రికలు. వారి సఖ్యము శ్రేయోదాయకము; వారి యుపదేశము శ్రోతవ్యము. వారి సంపర్కము షడ్గుణైశ్వర్య సంధానకరణి. వారు నిర్మలులు, నిష్కళంకులు, నిరాశ్రయులు, నిత్యతృప్తులు, నిరాభాసులు. వారు లక్ష్యైకాగ్రచిత్తులు, సిద్ధసంకల్పులు, మృతజీవులు. వారి యాచరణవిధానముల నుపలక్షించి, తద్విధమున దేశకాలానుగుణ్యముగ గమనించుట మనుజులకు కర్తవ్యంబు.

ఆంధ్రభాషయందు పాశ్చాత్యమహాపురుషజీవితచరిత్రంబులు లోపంబులు. తల్లోపపూరితార్థం బీ మదీయప్రథమోద్యమంబు. ఈ గ్రంథము స్వకల్పనశక్తిశక్తిశూన్యంబు; సరసవచన విరహితంబు. ఈ చరిత్రములు "బుధులకు నవనిధుల దాపురంబును విపులజయలక్ష్మికిఁ గాఁపురంబును" గనుక, మదీయ లోపంబులు సహ్యంబులగుగాక.

ఇంతియకాదు. ఆంధ్ర దేశముననుండు "సకలకళా విభూషితులు శబ్దవిదు ల్నయతత్త్వబోధకుల్ప్రకటకవీంద్రు" లందఱు తమ తమ శక్త్యానుసార మాంధ్ర మాతను "ప్రీతిపూర్వకంబుగాఁ జతుర్విధ శుశ్రూషలు గావించుచు సేవించుచుఁ బూజించుచు భావించుచు నమస్కరించుచు నారాధించు"చున్న సమయంబున, షోడశోపచారపూజావిధానంబు గుర్తెఱుంగని నేనామెనారాధించుట సమకట్టి, 'పత్ర పుష్పం ఫలం తోయం యోమె భక్త్యాప్రయచ్ఛతి' అనునటుల నామె ప్రసన్నవదనయై సంభావించునని నా భావము. క్లిష్టపండితజనంబుల కామె సంస్తవనం బసంగతంబు. కాళిదాస విరచితంబగు నీ స్తవము నిందుఁ బొందుపఱచుచున్నాఁడను:-

కళ్యాణి - ఖండజాతి - లఘువు.

పల్లవి:- నమో భక్త సురతరు లతే దేవి లలితే,

(1) త్రిపురసుందరి కృపాపాంగ లలితే ||
     చంద్రచూడః ప్రియే చంద్రతిలకాలికే చంద్రముఖి చంద్రి
     కామాందహాసే! కుంద సుందర రదన బంధు జీవాధరే కోటి
     విద్యుల్లతా బృందభాసే ||
                                              నమో భక్త..............||

(2) దరదలిత కమలముకులోచ్చలిత మదకలిత విలసదలి లలితలోచన
      విలాసే! అధర రా గారుణోదయ విధృత దైత్యగురు రుచిరుచి
      ర మౌక్తి కోల్లసితనాసే ||
                                              నమో భక్త...............||

(3) హంసగమనే సకల నిగమ వనశారికే హంసముని హంసమానస
      మరాళే! కంసరిపు సోదరీ కామితార్థప్రదేత్వాంశరణ్యం కాళి
      దాస నరదే ||
                                              నమో భక్త...............||

నా లిఖిత గ్రంథమునుజూచి శాంతముతో సంస్కరించినందుకు, నా గురువులు శ్రీ వేదమూర్తులయిన బ్రహ్మశ్రీ భళ్ల మూడి దక్షిణామూర్తిశాస్త్రిగారికిని, సారిపాక నర్సింహశాస్త్రిగారికిని వందనములు చేయుచున్నాను. చిత్తులు సవరణలతోఁ గూడిన లిఖిత పత్రములనుజూచి వానిలోఁ గొన్ని పత్రములను స్ఫుటముగ వ్రాయుటలోఁ దోడ్పడిన నా ప్రియ స్నేహితులు మ. రా. రా. చిలుకూరి నారాయణరావుపంతులు బి. ఏ. గారి నభినుతించుచున్నాను. నా ముఖ్య స్నేహితులు మ. రా. రా. ఉలుగండం వెంకటనర్సుపంతులుగారు గాన రూపమైన స్తవమునకు రాగము, తాళము సరిపెట్టినందుకు వారిని సన్నుతించుచున్నాను. నా ప్రాణస్నేహితులు మ. రా. రా. గా. హరిసర్వోత్తమరావుపంతులు ఎం. ఎ. గారు దీనికి మెఱుఁగుబెట్టి వన్నె తెచ్చినందుకు వారిని సంస్తుతిజేయుచున్నాను. "విజ్ఞానచంద్రికామండలి"వారు దీనిని స్వీకరించుటచే దీనికి గురుత్వము వచ్చినదని నా భావము. వారీగ్రంథము నతిత్వరితముగ ముద్రింపించి ప్రచురింపించినందుకు వారికిఁ గృతజ్ఞతాపూర్వకముగ నభివందనము లిడుచున్నాను.

ఇట్లు

విధేయుఁడు

గ్రంథకర్త.

గంజాం జిల్లా,

శ్రీకాకుళం

22 - 5 - 1913