మహాపురుషుల జీవితచరిత్రములు (ప్రథమ సంపుటము)/థెమిస్టాకిలీసు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

థెమిస్టాకిలీసు

ఆథెన్సుపట్టణములో, థెమిస్టాకిలీసుయొక్క వంశీకులంతగఁ బేరుకెక్కినవారుగారు, అతని మాతాపితృవంశములలో నట్టివాఁ డొకఁ డైనను లేఁడు; తలిదండ్రు, లవియు, సామాన్యస్థితిగతులే.

బాలుఁడుగనున్న దినములలో నతఁ డేపనిచేయుటకు వెనుకతీయ లేదు; మహా చొరవరి; పెద్దపనులను జేయుటకు యత్నించెను. ఇతర బాలురవలె కాలము నాటపాటలలో వ్యర్థ పుచ్చక, పాఠములను జదువుటయందో, ప్రసంగించుటయందో సెలవుదినముల నతఁడు గడిపెను. “అబ్బాయి, నీవు సామాన్యుఁడవుకావు. నీవలనఁ బ్రజలకు శుభమైన నశుభమైన కలుగు”నని యుపాధ్యాయుఁ డనెను. సాహిత్యజ్ఞాన మతనికి గష్టముమీఁదఁ గలిగెను; రాజనీతిశాస్త్రమును ధారాళముగ నతఁడు జదివెను. అందులో నతని యీడుకు మించిన బుద్ధికుశలతను గనఁబఱిచెను.

మొదట థెమిస్టాకిలీసు విచ్చలవిడిగ సంచరించెను; నడవడిలో నిలుకడచూపలేదు; అతని గుణములు విపరీతములు; అవియైనను కేవలము మంచి వని కేవలము చెడ్డ వని చెప్ప రాదు. అతఁడు శృంగారపురుషుఁడు; కొంతకాలము విషయ భోగములలో గడిపెను. అతని దుర్వ్యాపారములను జూచి, తల్లి యాత్మహత్యఁ జేసికొన బూనెను; తండ్రి, కోపగించెను. "దుష్టాశ్వములు మొదట వెఱ్ఱిగ తిరిగినను, శిక్ష చేసి కళ్లెములు తగిలించినపైని, మార్గములోనికి వచ్చి సాధువు లగు"నని థెమిస్టాకిలీసు చెప్పుచుండెను. ప్రజారాజ్యములోని 'ఆథెన్సు' పట్టణములో నుద్యోగముఁజేసి కీర్తిప్రతిష్ఠలను బొందవలె నని యతఁడు వాంఛగలవాఁ డాయెను. ఏవిధముననైన, నేకార్యమైనఁ జేసి, పెద్దల దృష్టిలోఁ బడవలె నని యతని కోరిక. అంతియగాని, యతఁడు ముందువెనుక లోలోచించక వ్యవహారములలో దిగుచుండెను. అందుచేత, నతనికి 'ఆరిస్టైడీసు'నకు పరస్పరవైరము కలిగెను. ఇతఁడు దూరదర్శి; శాంతుఁడు; వ్యవహారములలో తొందరపాటులేనివాఁడు. అతఁడు బ్రజలను బెద్దపనులకు బురికొలుపును; ఇతఁడు వారిని శక్తికి తగిన పనులకు నియోగించు. థెమిస్టాకిలీసు చిన్నతనములో 'రాధాను' యుద్ధముజరిగెను. స్వబలపరాక్రమములు చూపించుట కవకాశము లేకపోయె నని యతఁడు చింతించెను. ఈ యుద్ధము 'పారసీకు'లకును "అథీనియను”లకును జరిగెను; అందులో పౌరసీకు లోడిపోయిరి. మున్ముందుకు వారితో పెద్దయుద్దములు జరప వలసియుండునని యతఁ డూహించెను. పూర్వాచారము ప్రకారము 'అథీనియనులు' వెండిగనులు త్రవ్వి, వెండిని తెచ్చుకొని, తమలో దాము దానిని బంచుకొనుట వాడుకకలదు. స్త్రీలు విశేషముగ నాభరణములను ధరించుచుండిరి. వెండి బంగారము నిలవచేయుటకు బదులు వానిని వ్యయపఱచి, నావలను కట్టిన, సముద్రముమీఁద పరదేశములతో వ్యాపారముఁజేసి లాభములను బొందుటకు సమర్థత కలుగుటయెగాక, స్వపర దేశీయులను లొంగదీసి, తమరౌన్నత్యమును బొందుటకుఁగూడ శక్తికలుగు నని 'అథీనియనుల'కు థైమిస్టాకిలీ సుపదేశించెను. అతని యుపదేశముప్రకారము, వారు వెండి బంగారములను గర్చు పెట్టి, నావలను కట్టిరి. వారి యోడవర్తకము సాగెను; లాభమువచ్చెను. వారికి సముద్రమనిన భయము లేకపోయెను, వారు మంచినావికు లైరి; నౌకాహవములో వారు శత్రువులనోడించిరి.

అతఁడు మహావైభవముతో బ్రదుకుచుండెను. అందుకుఁ దగిన ధనముగావలెను గనుక , నతఁడు గొన్ని నీచపుఁబనులను జేసెను. అధికారి యని ప్రజలు తెచ్చియిచ్చిన కానుకల నతఁ డమ్మివేయుచుండెను. ఈ కానుకలను బుచ్చుకొనుటలో నతఁ డారితేరెను. ఒకరి వస్తు వేదైన నతఁడు చూచిన, దానిని వారివద్దనుండి నయముననో భయముననో దెప్పించు కొనువఱ కతఁడు నిద్రించుటలేదు.

కులము తక్కువవాఁడు గనుక, అతఁడు పేరుపొందవలె నని గోరుచుండెను. వైణికులు, గాయకులు, నటులు నతని మాట కడుగుతీయలేదు. ప్రతిదినము పండుగులవలె "ఒలిం పుకు” క్రీడలలో నతఁడు ధనమును కర్చు పెట్టుచుండెను. అతనిని డాంబికుఁడని ప్రజ లనుచుందురు.

"ఆ థెన్సుపట్టణములో నతఁడు పెద్దయుద్యోగమును సంపాదించెను. అతని శత్రువైన” ఆరిస్టైడీసు దేశోచ్చాటన నందెను. థెమిస్టాకిలీసు కోరిక నెర వేరెను. వ్యవహారములలో నతని నడ్డగించువారు లేరు. ఈ కాలములో పారసీకులు నావలతో బయలుదేరివచ్చిరి. సముద్రముమీఁద యుద్ధము జరగవలసె. గ్రీకులంద ఱేకీభవించిరి. వారిలో నథీనియనులే 'విశేషముగ నావలు గలవారు. సేనాధిపత్యమును మొదట' థెమిస్టాకిలీసు పుచ్చుకొనెను. కాని, తరువాత 'స్పార్టను'లలో నొకని కిచ్చివేసెను. ఘోరముగ నౌకా హవము జరిగెను. పారసీకులు పెద్దకేకలు, బొబ్బలు పెట్టుటయే గాని, క్రియశూన్యము. వీనికి గ్రీకులు భయపడుదురా, అందులో నథీనియనులు సముద్రముమీఁద నారి తేరినవారు. యుద్ధములో జయాపజయము లెవరివో తెలియకుండె. పారసీకచక్రవర్తి 'క్షారుఁడు' కొంత భూసెస్యమును దీసికొని గ్రీకుదేశముపైకి దండెత్తివచ్చెను. ఇటుల గ్రీకులు రెండువైపులనుండి యెదురుకొనఁబడిరి. పారసీకులు "తెర్మాపొలెయి" యను కనుమగుండ వచ్చినగాని, గ్రీసుదేశములోనికి రాలేరు. కనుమముఖద్వారమున 'లియాను దాసుఁ'డను సేనాధిపతి, 600 స్పార్టను సైనికులతో నిలిచి, పారశీకుల లక్షసైన్యము నెదిర్చెను. పారసీకుల శిరములు తాటికాయలవలె వ్రాలుచుండెను. అంతలో గ్రీకులలో నొకఁడు పారసీకులకు కనుమలోని రెండవమార్గమును జూపి ,, వారి సైన్యమును త్రోవదప్పించి నందున, స్పార్టనులు రెండు వాహినులచేత నొక్కఁబడి వీరస్వర్గము నొందిరి. సేనాధిపతికూడ రణములోఁబడెను.

ఈ యపజయము గ్రీకులు వినిరి. చక్రవర్తి 'క్షారుఁడు. ఫౌఁజులను నడిపించుకొనివచ్చెను. గ్రీకులకు వ్యవధిలేదు; ఏమిచేయుటకు తోఁచదయ్యె; బంధుమిత్రవర్గంబులను, గృహములను విడిచిపోలేరు: పట్టణములోనుండిన, మరణము నిశ్చయము. అప్పుడు థెమిస్టాకిలీసు ఇచ్చిన సలహాపైని యా బాల గోపొలము పడవల నెక్కిరి. స్త్రీ బాల వృద్దు లొక ద్వీపమునకుఁ బంపఁబడిరి, కరువు, దారిద్ర్యము, బంధువియోగము, శత్రుధాటియు వారికొక్కమారె కలిగెను. అథీనియనులు గంట నీరు పెట్ట లేదు. పట్టణ మశేషము నిర్జన మయ్యెను. .

శత్రువు వచ్చి యెదుట నిలిచియుండెను. గ్రీకులు వారిలో వారు గ్రుద్దులాడుచుండిరి. అథీనియనులా, స్పార్టనులా — వీరిలో నెవరు యుద్ధములో ముందునడువవలె నని వారు వాదులాడిరి. "ఎవరు నడిచిననేమి? "దేశము శత్రువునకు స్వాధీనమై, మనము వానికి లోఁబడకూడ"దని థెమిస్టాకిలీసు బుద్దిచెప్పెను. దేశోచ్చాటన చేయఁబడినవారు, ఉత్తరువైనందున, వచ్చి చేరిరి. ఆరిస్టైడీసు గూడవచ్చెను. కలహమునకుఁ గాలముగాదని, వీరిరువు రేకమైరి. వీరి సలహాపైని, నౌకాహవముఁ జేయుటకు గ్రీకులు సమ్మతించిరి. అందుకు శుభశకునము లగుపడెను. సముద్రముమీఁద వారుండిన స్థలమున యుద్దము. జరిగిన, వారు జయము నొందుదు రని వారితో థెమిస్టాకిలీసు చెప్పెను. మొదట వారందుల కంగీకరించిరి గాని, శత్రువుల యోడలను జూచినపైని, వారి కధైర్యముగలిగెను. పారసీకుల యోడ లొక వెయ్యియుండె; వీరివి నూటయెనుబదిమాత్ర ముండెను. అందుచేత స్పార్టనులు రాత్రి రాత్రియే బయలుదేరి వారి దేశమునకుఁ బోవలెనని సిద్ధముగనుండిరి. -

గ్రీకులలో నెవరు వెళ్లిపోయినను దేశమునకు ముప్పు వచ్చు నని థెమిస్టాకిలీసు ఎంచి వారితో నెంతచెప్పినను స్పార్టనులు వినరైరి. మాటలతో గార్యములేదని తలఁచి, తన యొద్దనున్న పారసీకపు మునిషీని పిలిచి "నీవు చక్రవర్తిక్షారుని వద్దకుఁబోయి, గ్రీకులు పారిపోవఁ దలఁచినారు. వారు పారిపోకుండునటుల పారసీకుల యోడలను నాలుగువైపుల'కాపుంచుమని యతనితోఁ జెప్పిరమ్మ”ని చెప్పిపంపెను. ఆప్రకారము మునిషీ చక్రవర్తియొద్దకుఁ బోయి, చెప్పెను. శత్రువుల యోడలు క్షణములో నాలుగువైపు లాక్రమించెను. గ్రీకులు పారిపోవుటకు వీలులేకపోయెను.

మరుసటిదినము సూర్యోదయము కాఁగానె, సముద్రముమీఁద యుద్ధ మారంభమయ్యెను. గ్రీకుల పడవలు తేలి. కయినవి; శత్రువులవి, బరువు. వారు వానిని సుళువుగ గడిపిరి; గడుపుటకు వీరు కష్టపడిరి. వీ రుభయులు యుద్ధముచేసినచోటు సముద్రములోఁ ప్రదేశ బోటుఎక్కువ. శత్రువులు గాలికి యెదురుగ వారి నావలను గడపవలసివచ్చెను. కొండ చరియపైని యొక రత్న సింహాసనముమీఁద చక్రవర్తి గూర్చుండెను. అతనినిచుట్టి చరిత్రకారు లుండిరి. యుద్ధ మారంభమయ్యెను. ఇరుతెగలవారు మోటుగ పోరాడిరి. సాయంకాలమువఱకు పోరాటము జరిగెను. పారసీకు లోడిపోయిరి.

"పారసీకులు జలసంధిమీఁద కట్టిన పడవల వంతెన విరుగఁగొట్టి, వారిని సంహరించుట మే”లని థెమిస్టాకిలీసు చెప్ప, “ఇదివఱకు వారేమి చేయుదు రోయను భయముతోనుంటిమి. ఇప్పుడు వారు మన దేశమునుండి తరలిపోవు మార్గము చూడవలెను గాని, నీవు చెప్పిన ప్రకారమైన, వారు మన దేశములోనే యుండి, మనలను మఱింత పీడింతు"రని ఆరిస్టైడీసు సలహాచెప్పెను. పడవలవంతెనను విరుగఁగొట్టుటకు గ్రీకులు సిద్ధముగ నుండి రను మాటను చక్రవర్తివిని, సైన్యముతో శీఘ్రముగ బయలుదేరి దేశము విడిచిపోయెను. వైజయంతికమహోత్సవములు గ్రీకులు సలిపిరి. వారి వారి స్వదేశములకు అందఱును వెళ్లిపోయిరి.

ఆ సంవత్సరము జరిగిన 'ఒలింపికు' క్రీడలలో, థెమిస్టాకిలీసుకు వీరకిరీటమును గ్రీకు లిచ్చిరి. అక్కడకు వచ్చినవా ఱంద రతనినే చూచుచుండిరి. అతఁడు స్పార్టనుల దేశమునకు వెళ్లెను; అక్కడ వారిచేత మర్యాదలను బొందెను. పరమోచ్చపదవి నతఁ డధిష్ఠించెను.

"గ్రీకులంద ఱథీనియనులు చెప్పినమాటను గౌరవింతురు. అథీనియనులు నా మాటను మన్నింతురు. నేను నా భార్యమాట వినుచున్నాను. నా భార్య నా కుమారుని మాట విను”నని యతఁడు హాస్యముగఁ జెప్పును,

ఒక సమయమున, నిరువురు నాగరకులువచ్చి, యతని కూఁతురు నిమ్మని వేరు వేరుగ నడిగిరి. వారిలో నొకఁడు బుద్ధిమంతుఁడు; మఱియొకఁడు ధనవంతుఁడు. "ధనములేని ఫురుషునికే, నా కూఁతు నిచ్చి వివాహము చేసెదగాని, ధనము కలవాఁడైనను పురుషుఁడు కానివాని కియ్యనొల్ల'నని యతఁడు చెప్పెను.

ఆ థెన్సుపట్టణమున కతఁడు చుట్టు పరిఘను కట్టించెను. పట్టణమునుండి రేవుకు పోవువఱ కిరువైపులను పెద్దగోడలను కట్టించెను. శత్రువుల దాడికి భయపడి, గ్రీకులంద ఱొక సంఘముగఁ గూడిరి. అందులో నథీనియనులు నాయకులుగ నుండిరి. ఆ థెన్సును ఇంత గొప్పపదవిలోనికిఁ దెచ్చిన థెమిస్టాకిలీసును ఆ పట్టణపౌరులు చిన్ననేరము మోపి దేశభ్రష్టునిఁ జేసిరి.

అతఁడు దేశము విడిచిపోయెను. అతఁడు లేనిసమయమున, పూర్వము జరిగిన యుద్ధములోఁ బారసీకులతో, గలిసి స్వదేశ స్వాతంత్ర్యమును బోఁగొట్టఁదలఁచినాఁడని యెంచి, అథీనియను లతనికి మరణదండన విధించిరి. ఆ సంగతి తెలిసి, నిర్దోషి గనుక, అతఁడు పారసీక దేశమునకుఁ బారిపోయెను. క్షారునికుమారుఁడు 'ఆర్తక్షారుఁడు' చక్రవర్తియయ్యెను. ఇతనిని థెమిస్టాకిలీసు శరణువేఁడెను. చక్రవర్తి యతనిని మన్నించి గౌరవించెను. థెమిస్టాకిలీసు పారసీకమున నుండిపోయె.

ఇంతలో గ్రీకులకును పారసీకులకును యుద్ధము తటస్థమయ్యెను. గ్రీకులపైకి యుద్ధమునకుఁ బొమ్మని చక్రవర్తి థెమిస్టాకిలీసున కుత్తరువుచేసెను. స్వదేశీయులతోఁ బోరాడుట కిష్టము లేక, విషముత్రాగి, 65 సం|| రముల వయస్సున, క్రీ. పూ. 460 సం॥ రమున నతఁడు స్వర్గస్థుఁడయ్యెను.


Maha-Purushula-Jeevitacaritramulu.pdf