Jump to content

మహర్షుల చరిత్రలు (మొదటి భాగము)/అష్టావక్ర మహర్షి

వికీసోర్స్ నుండి

మహర్షుల చరిత్రలు

అష్టావక్ర మహర్షి

పూర్వ మొకప్పు డేకపాదుఁ డను సద్బ్రాహ్మణుఁ డొకఁడు నిరంతరతపోనిరతుఁడై యుండెను. అతనికి సుజాత యను నుత్తమకన్య భార్యయై సకలోపచారములు సంతోషముతోఁ జేయుచుండెడిది. సద్గృహస్థుఁడు వేదవేత్త యగు నేకపాదునికడకు వటువరులు వచ్చి యధ్యయన మర్దించిరి. ఏకపాదుఁడు వటువులయధ్యాపనము కూడఁ దపోంగముగా భావించి శిష్యులచే నెల్ల వేళల వల్లింపఁ జేయుచుండెను.

ఏకపాదుఁ డష్టావక్రుని శపించుట

ఇటు లుండఁ గొంతకాలమునకు భర్తయనుగ్రహమున సుజాత గర్భము ధరించెను. ఏకపాదుఁడు నిరంతర శిష్యాధ్యాపనముతో గాలముఁ గడుపుచుండెను. సుజాత గర్భముననున్న బాలునికి గర్భమున నుండఁగనే పుణ్యవశమున వేదము లలవడెను. ఒకనాఁడాతఁడు మాతృగర్భము నుండియే స్వరము తప్పిన దని తండ్రికిఁ జెప్పెను. మఱియొకపర్యాయ మాతఁడు “నిద్రాహారములైన లేకుండ శిష్యుల నెల్లపుడును జదివింతు వేల? మాతృగర్భమున నుండి యొక్క సారి వినఁగానే నాకు వేదములు వచ్చినవి. వారి నింతగా బాధించు చుందువేల?" యని తండ్రి నడిగెను. అంత నేకపాదుఁడు తనకు జన్మించు కుమారుఁడు దివ్యమహిమోపేతుఁ డని గ్రహించి యానందించెను. కాని యింత బాల్యముననే తండ్రికిఁ దప్పు దిద్దుటయు నధ్యయనమును గూర్చి వక్రముగఁ బల్కుటయు శిక్షార్హములే కాని క్షమార్హములు గా వనియు శిక్షింపవలసినపుడు పుత్త్రభావ మడ్డు రారాదనియు నెంచి యాతని నెనిమిది వంకరలతోఁ బుట్టు మని శపించెను. పిమ్మట నా బాలుఁ డగ్నికల్పుఁడై తల్లి కడుపునఁ బెరుగుచుండెను.

ఏకపాదుఁడు జలమజ్జితుఁడగుట

ఒకనాఁడు సుజాత ప్రసవభారమునకు వెఱచి ఘృతతైల ధాన్యములఁ దెం డని యేకపాదునిఁ గోరెను, ఏకపాదుఁడు నట్లే యని ధనార్థియై జనక చక్రవర్తిపాలికిఁ బోయెను. అప్పుడు జనక చక్రవర్తి వరుణవుత్రుఁ డగు వందితో వాదము చేసి గెలిచినవారికి సమస్తము నిచ్చెద ననియు నోటువడిన వారు జలమజ్జితులై యుండవలె ననియుఁ బ్రకటించెను. ఏకపాదుఁడు విజయకాంక్షియై వందితో వాదమునకు దిగి దైవవశమున నోటువడి జలమజ్జితుఁడై యందుండెను.

అష్టావక్రుఁ డుదయించి తండ్రిని రక్షించుట

ఇట్లుండగా సుజాత యింటియొద్దఁ బుత్రునిఁ గనెను. ఆ పుత్రుఁడు తండ్రి శాపకారణమున నెనిమిది వంకరలతోఁ బుట్టి యష్టావక్రనాముఁ డయ్యెను, ఆ సమయముననే సుజాత తల్లి - ఉద్దాలకుని భార్య - కూడ నొకపుత్త్రునిఁ గనెను. ఆతఁడు శ్వేతకేతుఁ డను నామమునఁ బెరుఁగుచుండెను. మాతుల భాగినేయు లగు నష్టావక్ర శ్వేత కేతు లిరువురును బాల్యము నుండియు నుద్దాలకునికడ నేక సంధాగ్రాహులై చదివి యధ్యయనశూరులైరి. ఉద్దాలకుఁడు తండ్రి యనియు శ్వేతకేతుఁడు భాత్ర యనియు నష్టావక్రుఁ డెంచుచుండెను. ఒకనాఁడు శ్వేత కేతుఁ డష్టావక్రుని “మీ తండ్రికడకుఁ బొ"మ్మని కసరెను. అట్లవమానింపఁబడి తల్లి యగు సుజాతకడ కేఁగి యష్టావక్రుఁడు తన తండ్రి సంగతిఁ జెప్పుమనెను. సుజాత యేకపాదుఁడు జనక నృపాలు నగరమున కేఁగి వందితోడి వాదమున నోడి జలమజ్జితుఁ డగుటఁ దెల్పెను.

అష్టావక్రుఁడు వెంటనే మాతులుఁ డగు శ్వేత కేతునిఁ దీసికొని పోయి జనకమహారాజు నాస్థానమునఁ బ్రవేశింపఁజూడ విదగ్ధులగు వృద్దులే కాని బాలు రట రాఁ గూడ దని ద్వారపాలకుఁడు నివారించెను. అష్టావక్రుఁ డట ద్వారపాలునితో సంవాదము చేసి "జ్ఞానము కలిగినవాఁడే వృద్ధుఁడు కాని వయావృద్దు వృద్దా? బాలుఁడైనను జ్ఞాని వృద్దనమానుఁ డగుట మీ రాజు నన్ను నివారింపఁడు, మఱియు, నంధుని త్రోవకును బధిరుని మార్గమునకు. స్త్రీపథముసకును, రాజు వర్త్మనమునకును, బ్రాహ్మణుని యధ్వమునకును, బ్రతిబంధకము కలిగింపరా"దని యాతఁడు శాస్త్రసమ్మతముగ వాదించెను. ఆద్వారపాలుఁ డాతని శక్తిసామర్ధ్యముల కచ్చెరువంది ప్రవేశ మొసఁగెను. జనకునిపాలి కేఁగి యష్టావక్రుఁడు వందితో వాదింతు ననెను. జనకుఁ డాచిఱుతవానిసాహసమునకు మెచ్చియు "నీవంటి బాలుఁడా వందిని గెల్చుట?" యని హేళనము చేసెను. అష్టావక్రుఁడు జనకునితో సంవాదము చేసి తన శక్తిఁ గొంత యాతనికి జూపెను జనకుఁ డాశ్చర్యపడి వందితో వాదింప నాతని కనుజ్ఞ నిచ్చెను. నాఁడు మహా సభాంగణమున బ్రాహ్మణశ్రేష్ఠుల నడుము నష్టావక్రుఁడు వాదమున వందిని డీకొనెను. “అగ్ని యొక్కఁడే ప్రజ్వలించును; సూర్యుఁ డొక్కఁడే ప్రకాశించు; శివుఁడొకఁడే సర్వవ్యాపి " యని వంది ప్రారంభించెను. “ ఇంద్రాగ్నులిద్దఱు మిత్రులు ; నారదపర్వత లిద్దఱు దేవర్షులు; అశ్వినేయు లిద్దఱు రూపవంతులు ; భార్యాభర్తలిద్దఱు సంసార మూలము" లని యష్టావక్రుఁడు బదులు చెప్పెను. ఈ ప్రకార మిరువురు ద్వాదశ సంఖ్యవఱకు సమానముగా వాదించుచు వచ్చిరి కాని, యష్టావక్రుఁ డింకను వాదించి వంది నోడించెను. వెంటనే జనక చక్రవర్తి యష్టావక్రు నభినందించి యాజ్ఞాపిం పుమనెను. అష్టావక్రుఁడు తన తండ్రిని నాతనితో జలమజ్జితులై యున్న బ్రాహ్మణులను విడిపించి వందిని జలమజ్జితునిఁ జేయింపుమనెను. వంది తన తండ్రియగు వరుణదేవుని యజ్ఞమునకై యామిషచే బ్రాహ్మణప్రవరుల నటకుఁ బంపితినే కాని బాధింప లేదని చెప్పి యష్టావక్రు నభినందించి వెడలిపోయెను. నాఁటినుండి యష్టావక్రుని కీర్తిచంద్రిక లెల్లెడల వ్యాపింపఁ జొచ్చెను. జనక చక్రవర్తి యష్టావక్రుని నేకపాదుని గడుఁగడుఁ, బూజించి వక్రునినుండి యద్వైత వేదాంత రహస్యముల నెల్ల గ్రహించెను. వక్ర జనకుల యీ సంవాదమే యష్టావక్ర సంహితయై యద్వైతత రహస్యముల సద్భుతముగా వెల్లడించు చున్నది. అంత డాత్మానందమును జూఱగొని యష్టావక్రుని సమ్మానించి లివెను

అష్టావక్రుఁడు వీర్వక్రుఁడై సుందరుఁ డగుట ఏక పాదుఁడు కుమారుని గొప్పతనమునకును బిత్రుభ క్తి కిని చీ యష్టావక్రునిఁ జూచి " నాయనా ! నీ యీ యంగ వైకల్య ఁ గారకుఁడను నేను. నీ పిత్రుభక్తి, పొండిత్య మాహాత్మ్య కు సంతసించితిని. నిపు వెంట నేపోయి సమంగానదియందు తుఁడవై యింటికి ర "మ్మని చెప్పి ఆ నింటికి వెడలిపోయేను. వక్రుఁడు జనకు సనతిని దిన్న గా సమంగా నదీజలముల కేఁగి ను మునిగి తేలఁ గానే తన దేహవక్రతలు నశించుటఁ గని శ్చార్యపడి యది తన తండ్రి మాహాత్మ్యమని యేక పొదు నెంతయు >చెను. అతఁ డంత దివ్యసుందరవిగ్రహుఁడై గృహమున కేఁగి 'ండ్రుల కమితానందముఁ తేకూర్చి వారికి శుశ్రూష చేయుచు కర తపోవృత్తియందుండెను. * అష్టావక్రుని వివాహ వృత్తాంతము - కొంత కాలమున కేకపాదుఁడు కుమారునిఁ బిలిచి “నాయనా! ; ద్యాపరిగ్రహమున, ననుపమాన బ్రహ్మచర్యాశ్రమమున నీయలో క మనోహరమై వ్యాపించినది. నీ విఁక గృహస్థాశ్రమమును fించి యుత్తనుగార్హస్య ధర్మనిర్వహణమున నాకును మీతల్లి కిని దము చేకూర్పు " నుని వచించెను. అష్టావక్రుఁడు తండ్రి యాజ్ఞ

  • భారతము - నవత్వము,

శిరసావహించి వివాహమాడఁ గృతనిశ్చయుఁ డాయెను. అంత నష్టావక్రుఁడు దనకుఁ దగినకన్నియ యెవతె యని యాలోచించి వదాన్యమహర్షి తనూజ యగు సుప్రభను వివాహము కాఁదలఁచి వదాన్యు నాశ్రమమునకుఁ బోయెను.

వదాన్యుఁ డష్టావక్రునికీర్తిచంద్రికలు కాంచినవాఁడయ్యు నాతని నింకను బరీక్షింపఁ గోరియుండెను. తనకడకు రాఁగానే యష్టావక్రు నాతఁడు గారవించి వచ్చినపని యడిగెను. అష్టావక్రుడు సుప్రభను వివాహ మొనరింపఁ గోరెను. వదాన్యుఁ డంగీకరించెను. కాని యాతనిఁ బరీక్షింపఁ గోరి "అష్టావక్రా! నీవంటి యుత్తమునకుఁ బిల్ల నిచ్చుటకంటెను నాకుఁ గావలసిన దేమున్నది? కాని, నా కూతును వివాహమాడఁ గోరువాఁడు ముందుగా నుత్తరదిశకుఁ బోయి కుబేరుని నగరమును దాఁటి హిమగిరిపైనున్న పార్వతీపరమేశ్వరులఁ బూజించి మఱియు నుత్తరమునకుఁ బోఁగాఁ గాననగునీ పవనమును గని యందు సువర్ణనిర్మిత మైన సౌధములతో నున్న నగరమును బరిపాలించు రమణిని జూచి యామె యాశీర్వచనమంది రావలయును. అప్పుడు సంతోషముతో నాకొమార్తె యగు సుప్రభ నిచ్చి విహహము చేయుదు" నని చెప్పెను. ఇది యెంతపని యని పలికి యష్టావక్రుఁడాపనికై బయలుదేఱి పోయెను.

అష్టావక్రుఁడు పర్వతములను నదులను దాఁటుచుఁ బయనించు చుండెను.. ప్రకృతిరామణీయకముఁ దిలకించుచు నతఁడు నిజమాన సబంభరమును బరమేశ్వరుని పాదారవిందములపై వ్రాలఁ జేయుచు బాహుదానదిఁ గాంచి యం దవగాహితుఁడై యొకదిన మందుఁ గడపి యలకాపురమార్గమును బట్టెను. కుబేరుఁ డష్టావక్రునిరాక యెఱిఁగి వాని కెదురువచ్చి సమాదరముతోఁ బుష్పకారూఢునిఁ జేసి యలకానగరమునకుఁ దీసికొనిపోయెను. అచ్చట బహురమణీయ స్వర్ణ సౌధము నష్టావక్రునకు విడిదిగా నిచ్చి రంభాద్యప్సరోభామల నాతనికిఁ బరిచారికలఁగా నేర్పఱిచెను. వా రనుదినమును నృత్య గీత వాద్యములచే నాతని నానందింపఁ జేయు చుండిరి. కాని, యష్టవక్రుఁ డేమాత్రమును వారిమోహ వాగురలకు లోనుగాక యొక్క వత్సర మలకాపురమునఁ గడపెను. కుబేరుఁడు నాతనిఁ బలువిధముల గీర్తించి వీడుకొలిపెను. అంత నష్టావక్రుడు హిమాలయ సమీపమునకుఁ బోయి యటఁ గాన నగు మహర్షులకు నమస్కరించుచు నానందతన్మయుఁడై హిమశైలతట మధిష్టించెను. అందుఁ బార్వతీ పరమేశ్వరులకుఁ బ్రమథగణములకుఁ బలువిధముల బూజ లర్పించి సర్వేశ్వరస్తోత్రముతోఁ గొంత కాల మటఁ గడపెను. పిమ్మట నింకను నుత్తరమున కేఁగ వదాన్యుఁడు చెప్పిన కడిమిలేమ్రాకుల యడవి తోఁచెను. అందాతఁడు ప్రవేశింపఁగానే దివ్యసుందర స్త్రీవిలసితము లగు హేమసౌధములు గోచరించెను. వానిని జూచి యాశ్చర్యమందుచు నష్టావక్రుఁడు లోనికిఁ బోయి యట గానవచ్చిన నారీజనానీకమునకు వశుఁడు గాక వారల రాజ్ఞిఁ జూపుమనెను. అంత వారు భవనాంతర్భాగమున కాతని గొనిపోయి దివ్య దీధితితో నొప్పు నొక మదవతిని జూపిరి. ఆమె యనంతవిలాస హాసములతో నష్టావక్రు నాహ్వానించి యర్ఘ్యపాద్యాదులొసఁగి యాదరించెను. పిమ్మట రాత్రిపడఁగా నాతని నిష్టమృష్టాన్నముల సంతృప్తునిఁ జేసి యాతఁడు నిద్రించుతఱి నాతనిశయ్యఁ జేరి యామె యతనిఁ గవయఁగోరెను. తా నస్ఖలిత బ్రహ్మచారి ననియుఁ బరసతి నపేక్షించుట పాపహేతువనియుఁ జెప్పి నాఁటి కాతఁడు తప్పించుకొనెను. కాని మఱునాఁడు మరల నాతని కామె యభ్యంగనాదు లొనర్చి షడ్రసోపేతముగా నధి కాదరమున విందుచేసెను. మమకారరహితుఁడై యాతఁ డన్నిటి కంగీకరించెను. కాని, యా రాత్రి తిరిగి యాతనిఁ దన్నుఁ గవయ వలయునని యామె బలవంతము చేసెను. ఆమె యెన్ని చెప్పివను వినక యాతఁడు స్త్రీలకు స్వాతంత్ర్యము లే దనియు బాల్యమునఁ దండ్రి యౌవనమున భర్త వార్దక్యమున సుతుఁడు రక్షించును గాని స్త్రీ యెన్నఁడు స్వతంత్రించి యే కార్యమును జేయరా దని యుపదేశించెను. కాని, యామె మన్మధభాధావివరణము చేయుచుఁ దనశక్తి ప్రభావముచే ననుక్షణాతి శయసౌందర్యశోభిత యయ్యెను. ఐన, నష్టావక్రుఁ డేమాత్రమును జలింపక నిర్లిప్తుఁడై యుండెను. అప్పుడామె స్వస్వరూపమునఁ గాననై తాను వదాన్యుని ప్రార్ధనమున నష్టావక్రుఁ బరీక్షింప నంతయుఁ బన్నినయుత్తర దిశాంగన నని చెప్పి యాతనిదీక్షావిజయమున కెంతయు నభినందించి సుప్రభాకన్యను వివాహమై త్రిభువన వినుతముగా గృహస్థాశ్రమమును నిర్వహింపుమని యాశీర్వదించెను. అష్టావక్రుఁడట్లు పరీక్షావిజయమంది వదాన్యు నింటికేఁగి యావద్వృత్తాంతము నివేదించేను. వదాన్యుఁడు నానందించి వివాహముహూర్త మేర్పఱిచెను. ఏకపాదుఁడు సుజాతయుఁ గుమారుని విజయమున కభినందించి యానందముతో సబంధుమిత్త్ర పరివారముగా నష్టావక్రుని వివాహమునకుఁ దరలివచ్చిరి. సుప్రభాష్టావక్రుల వివాహము పరమవైభవముతో జరిగెను. కుబేరాదులు వివాహము చూడవచ్చిరి. దేవతలు వధూవరులపైఁ బుష్పవృష్టిఁ గురిసిరి, కిన్నరు లాకసమున నాట్యమాడిరి. బ్రహ్మర్షులు వధూవరుల నాశీర్వదించిరి. అష్టావక్రుఁడు పిమ్మట సుప్రభాసహితుఁడై యాశ్రమమున కేఁగి తపోవృత్తినుండెను.[1]

అష్టావక్రుఁడు రంభాదులమ శపించుట

అష్టావక్రమహర్షి గృహస్థాశ్రమము సద్వితీయముగా నాదర్శ ప్రాయముగాఁ గడపి సుప్రభాదేవిమూలమున నుత్తమమగు పుత్రసంపదఁ బడసెను. తరువాత, నాతఁడు జలమధ్యముఁ జేరి ఘోర తపస్సు చేయుచుండెను. ఒకనాఁడు రంభాద్యప్పరస లాతనికడకు వచ్చి నమస్కరించిరి. "మీరేల వచ్చితి” రని వారి నాతఁ డడిగెను. నృత్యగీతములను దామువిని చిరకాలమైనది. ఒకసారి తమకుఁ జూపి మెప్పుపొంద వచ్చితి" మని వారనిరి. అట్లైనఁ బ్రదర్శింపుఁ డని యష్టావక్రుఁడు జలములోనే కూర్చుండెను. రంభాదు లద్భుతముగాఁ దమనై పుణ్యముఁ జూపిరి. అందుల కష్టావక్రుఁ డానందించి మీకేమి కావలెనో కోరుకొండనెను. అంత వారు విష్ణుమూర్తితోడి సంభోగము కావలె నని కోరిరి. అష్టావక్రుఁ డాలోచించి శ్రీ విష్ణుమూర్తి కృష్ణావతారముఁ దాల్చినపుడు మీరు గోపికలై జనింతురు. అప్పుడు మీకోరిక సిద్ధించును. పొం" డని చెప్పి బయటకు వచ్చెను. అతని యాకారముఁజూచి రంభాదులు వెంటనే నవ్విరి. అష్టావక్రుఁడు వారి యవినయమునకు గర్వమునకు నసహ్యించుకొని "మీకోరిక సిద్ధింప వరమిచ్చిన నన్నుఁ జూచియే మీరు నవ్వితిరి. కాన, మీరు శ్రీకృష్ణుని పరోక్షమున బోయ వాండ్రచేఁ జుట్టుముట్టఁబడి ఘోరావమానముల నందుదురు గాక" అని శపించి యాశ్రమమున కేఁగెను.[2]

అష్టావక్రుఁడు భగీరథుని దీవించుట

అష్టావక్రమహర్షి ఘోరతపఃకార్యముచే దేహజవసత్వములఁ గోల్పోయి యస్థిపంజరము మాత్రము మిగిలినదా యనునట్లుండెను. ఈ స్థితిలో నొకనాఁ డష్టావకుఁ డొకచోటికిఁ బోవుచుండెను. దారిలో భగీరథుఁ డితని కెదురు వచ్చెను. సగర పుత్త్రులు కపిలమహర్షి కనుమంటచే భస్మీభూతులై పోవ వారి భార్యలు నారాయణు నారాధించి "వంశోద్దారకుఁ డగు సత్పుత్త్రు నీయకయే భర్తలు చనిపోయిరి. ఇఁక మాగతి యే" మని నారాయణుఁడు ప్రత్యక్షమైనప్పు డడిగిరి. విష్ణుమూర్తి వారిపై జాలిగొని “కాంతలారా! మీరు భర్తృవిహీనలైనను వైధవ్యదోషము మీకుఁ గలుగకుండు నట్లనుగ్రహించితిని. మీకు నుత్తమోత్తముఁ డగుకుమారుఁ డుదయించు" నని యొక యుపాయము చెప్పి యంతర్హితుఁ డయ్యెను. వారట్లుచేయఁగ భగీరథుఁడు జన్మించెను. కాని, యాతఁడు శుక్రము లేక యే జన్మించినకతమున బాల్యమునుండియు సర్భకుండై పడుచు లేచుచు నుండువాఁడు. ఈ భగీరథునిఁ గాంచి యష్టావక్రుఁడు దన కృశశరీరమును గాంచి యాతఁడపహాసము చేయుచుండెనని భావించెను. కాని, స్థిరముగా నిశ్చయము చేసికొననివాఁ డగుట నాతఁ డపహాసమున కట్లు తూలుచు నడుచుచున్నచో వెంటనే భస్మ మగునట్లును గానినాఁడు దృఢశరీరుఁడై సుందరాకారుఁ డగునట్లును శపించెను. వెంటనే యాశాపము భగీరథునికి వరప్రసాదము కాఁగా భగీరథుఁడు దృఢగాత్రుఁడై సుందరాకారుఁడయ్యెను. అష్టావక్రుఁడది చూచి యోగదృష్టివలన నాతని జన్మాదుల నెఱఁగి యాతఁడు గంగను భూమికిఁ దీసికొని వచ్చి యాతని పిత్రుపాదుఅను స్వర్గమునకుఁ బంపు నని యాశీర్వదించి తన దారిని బో యెను.

అష్టావక్రుని పూర్వజన్మ కథ

అష్టావక్రమహర్షి యనేకసంవత్సరములు పుష్కర తీర్థమునను మాల్యవంతమునను బరమవైష్ణవుఁడై పరమజ్ఞానియై మహా తపస్సు చేసెను. పిమ్మట నొకనాఁడు శ్రీకృష్ణుఁడు. రాధాదిభార్యలు బలరామప్రభృతులుఁ గూడరాఁగా బృందావనమున విహరించుచు జలక్రీడలఁ దనిసి యొక మఱ్ఱిచెట్టుక్రిందఁ గూరుచుండి సరససల్లాపము లాడుచుండఁగా నష్టావక్రమహర్షి వచ్చి శ్రీకృష్ణునకు సాష్టాంగ నమస్కారములొనర్చి యీశ్వరదత్తమగు స్తోత్రమున నిట్లని కీర్తించెను.

సీ|| "ప్రకృతియు మూలంబు బ్రహ్మేశవిష్ణువుల్
               శాఖలు సుర లుపశాఖ లఖిల
       తపములు పుష్పముల్ విపులసంసారాది
              కంబులు ఫలసమూహంబు లగుచుఁ
       దనరు బ్రహ్మాండపాదమున కర్థి నా
.

          డవును పరాశారుఁడవు మహాత్మః

సర్వమయుఁడవు మఱియు స్వేచ్చామయుఁడవు
ముక్తిమయుఁడవు నఖిల ముముక్షులకును
ముక్తిదాయకుఁడవు జగన్మూర్తి వీపు
నీకు నతు లాచరించెద నీరజాక్ష "
                         [ బ్రహ్మవైవర్తము - శ్రీకృష్ణఖండము ]

పిదప, అష్టావక్రుఁ డాపరమాత్మునియందు పవిత్రమగు తన మనస్సు లయ మొనర్చి శ్రీకృష్ణుని పాదములపైఁ బడి మరణించెను; వెంటనే యాతని తేజము దివ్యరూపమును ధరించి పుష్పక విమాన మధిష్ఠించి గోలోకమున కేఁగి ముక్తి నందెను. అప్పుడు శ్రీకృష్ణుఁ డాతని దేహమునకు దహనాది కృత్యములు స్వయముగా నొనర్చి యాతని కశ్రుతర్పణము లొసఁగి క్రియాకలాపములు పూర్తిచేసెను. ఇది యంతయుఁజూచి యాశ్చర్య నిమగ్నమైన రాధ యాతని వృత్తాంతముఁ దెలుపు మని శ్రీకృష్ణునిఁ బార్థించెను.

అప్పుడు శ్రీకృష్ణుఁడు వా రందఱు సావధానమనస్కులై వినుచుండఁగా నష్టావక్రమహర్షిని గుఱించి యిట్లు చెప్పెను; “ఈ మహర్షి యష్టావక్రుఁ డను నా పరమభక్తుఁడు, జితేంద్రియుఁడు, మహాతపస్సంపన్నుఁడు, బ్రహ్మవంశస్థుఁడు. తొల్లి సృష్ట్యాదిని నా నాభికమలమునుండి బ్రహ్మను బుట్టించి విశ్వసృష్టి చేయ నియోగించితిని. ఆతఁడు సనకసనందన సనత్కుమారసనాతన నామధేయు లగు నల్వురు కుమారులఁ దన మానసము నుండి సృజించి వారిని సృష్టింపుఁ డని కోరెను. వారు స్త్రీసంపర్క మొల్లక బరబహ్మానుసంధానమున నిత్య తపస్వులైరి. తరువాత వశిష్ఠాంగిరోమరీచి ప్రచేతసులు మున్నగు మానసపుత్రులఁ బుట్టించి వారిని జగత్సృష్టికై యుజుఁడు నియమించెను. వారందఱు మహాతపస్సంపన్నులై తండ్రి పనుపున వివాహమాడి పలువురు పుత్త్రులఁ బడిసిరి. అందుఁ బ్రచేతునకుఁ గొంతకాలమున కసితుఁ డను కుమారుఁడు జన్మించి విష్ణుభక్తుఁడై తపోవృత్తి నుండెను. కొంతకాలమున కాతఁడును వివాహితుఁడై తన సతికి సంతానము కలుగని కారణమున విచారించుచుండఁగా నాకాశవాణి యీశ్వరుని గుఱించి తపింపు మని ప్రబోధించెను. అసితుఁడు నీశ్వరుని గుఱించి మహా తపము చేయ నాతఁడు ప్రత్యక్షమై రాధామంత్ర మను స్తోత్ర రాజము నుపదేశించి యంతర్హితుఁడయ్యెను. ఆసితుఁ డేకాంతమునఁ జిరకాల మామంత్రము జపించి రాధాకారుణ్యమునఁ దనభార్యయం దొక పుత్త్రునిఁగని దేవలుఁ డని నామకరణము చేసెను. దేవలుఁడును మాలావతియను రాజకుమారిని వివాహమై సంతానమును బడసి మహావిరాగియై తపోవృత్తి నుండెను. అతని తీక్ష్ణతపోనలము త్రిలోకములను వేధింపఁ జొచ్చెను. ఆతని తపోభంగమునకై యింద్రుఁడు రంభను బంపెను, ఆమె యెంత ప్రయత్నించిన నాతని హృదయము చలింపదాయెను. అందుచే నామె కోపించి "ఓ దేవలా ! నీవు నన్నష్టకష్టములపాలు చేసితివి. నా యభీష్టము దీఱకుండఁ జేసితివి. కావున, నీవు మఱుజన్మమున నష్టావక్రుఁడవై జనింతు"వని శాప మిచ్చెను. అంత నామె వెడలిపోవుచు “దేవలా! నిన్ను నేననవసరముగ శపించితిని. ఐన, నాశాప మమోఘము. నీ వష్టావక్రుఁడవై జనించియు నీ తండ్రి కృపవలన దివ్యశరీరుఁడవై మహాజ్ఞానివై ముక్తి నందఁగల" వని రంభ స్వరోకమున కేఁగెను. 'ఆతఁడే యేకపాద సుజాతలకు బన్మించి సమంగానదీస్నానమున దివ్యశరీరియై మహా తపోధికుఁడై నేఁడిట్లు ముక్తి నందినాఁ" డని శ్రీకృష్ణుఁడష్టావక్రుని చరిత్రముఁ జెప్పి యందఱతో నిజగృహమున కేఁగెను.[3]

అష్టావక్ర సంహిత

ఇట్లు ప్రత్యక్షముగా శ్రీకృష్ణుని పాదారవిందములఁ బ్రాణములు వీడఁ గనిన యష్టావక్రమహర్షి సుకృతవిశేషము వర్ణనల కంద నిది. ఈమహర్షి జనకరాజర్షి తోఁ జేసిన వేదాంత విచారణ మద్వైత వేదాంతసారము నద్భుతముగా వెలిపుచ్చునదై యష్టావక్రసంహిత యను పేర శాశ్వతమై వెలసినది. ఈయష్టావక్రసంహితయందు ఆత్మోపదేశము, ఆత్మానుభవోల్లాసము, ప్రత్యాక్షేపద్వారోపదేశము, ఆత్మజ్ఞానసంకీర్తనము, లయయోగము, జ్ఞానయోగము, అనుభవపంచకము, బంథమోక్షవ్యవస్థ, నిర్వేదము, ఉపశమము, జ్ఞానము, స్వరూప సంస్థితి. ఆత్మసౌఖ్యానుభూతి, శాంతి, తత్త్వోపదేశము, విశేషోపదేశము, తత్త్వజ్ఞస్వరూపము, శాంతిశతకము, అత్మస్థితుని యనుభవము జీవన్ను క్తి యను నిరువది యధ్యాయములలో నాయా విషయము లద్భుతముగా వివరింపఁబడినవి. ఈసంహిత నిత్య పారాయణ యోగ్యము. అష్టావక్రుని బోధామృతమును గ్రోలి జనక రాజర్షి పొందిన యాత్మానంద మనిర్వాచ్యమైనది. ఈ సంహితయందలి "ఆకాశవదనంతో౽హం, ఘటవత్ ప్రాకృతం జగత్." "మహదధిరివాహం స ప్రపంచో వీచిసన్నిభః " "అహంనా సర్వభూతేషు" మున్నగు నద్వైతవేదాంతఘీంకారవములు అష్టావక్రమహర్షిని ధన్యాతిధన్యుని జేసివై చినవి.




  1. భారతము - అనుశాసనికము.
  2. విష్ణు పురాణము.
  3. బ్రహ్మ వైవర్తపురాణము - శ్రీకృష్ణ ఖండము.