మహర్షుల చరిత్రలు/శుక్రమహర్షి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మహర్షుల చరిత్రలు

శుక్రమహర్షి

(ఉశనసుఁడు)

జననము

భృగుమహర్షి నవబ్రహ్మలలో నొకఁడై మహో త్తమ వంశమూల పురుషుఁడై ప్రఖ్యాతినందెను. ఆతఁడు కర్దమప్రజాపతి కూఁతు రగు ఖ్యాతి యనునామెను బెండ్లాడి ధాత, విధాత యను నిరువురుకుమారులను శ్రీ యనుకూఁతును గనెను. ఆతఁడు పులోమ యనునామెను బెండ్లాడి చ్యవనమహర్షిని గాంచెను. ఉశన యను నామెను బెండ్లాడి యామె కొక కుమారుని జ్రసాదించెను. ఇతఁడే ఉశనసుఁడు. ఈతనికి శుక్రుఁ డనుపేరు తరువాత కలిగెను.

ఉశనసుఁడు బాల్యమునుండియు సర్వవిద్యలును సంపాదించి మహాతపస్సు చేసి “మృతసంజీవని" (చచ్చినవారిని బ్రదికించునది) అను గొప్పవిద్యను సంపాదించెను. ఈ లోకోత్తరశక్తి వలన ఉశనసుఁడు మహావిఖ్యాతి నార్జించెను.

శుక్రుఁ డను పేరు వచ్చినవిధము

ఉశనసుఁడు తపోబలముచేతను యోగబలముచేతను సర్వశక్తులు సంపాదించి విఱ్ఱవీఁగుచుండెను. ఒకప్పు డాతఁడు ధనార్థియై కుబేరుని కడ కేగి యాతని నవలీలగా మోసపుచ్చి యాతనిధననిక్షేపముల నపహరించెను. కుబేరుఁడు చేయునది లేక యీశ్వరునికడ కేగి యాతనితో మొఱపెట్టుకొనెను. తనభ క్తునకు ద్రోహము చేసిన భార్గవవంశజుఁ డగు ఉశనసునిపైఁ గోపించి యీశ్వరుఁడు శూలమెత్తి యా దుర్మార్గుఁ డెచట నున్నాఁ డని ప్రళయగర్జ చేసెను. అది విని ఉశనసుఁడు గడగడలాడిపోయి పోయిపోయి మాఱుమూలల సందుగొందుల తుప్పలలో దూఱి యుండి యందు నక్కియున్నను దనకు శివకోపమునఁ జావు తప్పదని భయపడిపోయి శరవేగమున శివునికడకే చేరి యాతనిహస్తమునఁ బ్రవేశించెను. ఉగ్రమూర్తి యగుశివుఁడు ఉశనసునిఁ జూచి కోపముతో మ్రింగివేసెను. శివునికడుపులో నుండి యిటునటు తిరుగుచు బయటఁ బడఁ దలఁచిన ఉశనసుని తలంపెఱింగి శివుఁడు తనదేహరంధ్రముల నన్నిఁటిని మూసివైచి తనమూత్రమార్గమును మాత్రము మూయ కుండెను. ఉశనసుఁ డిఁక గతిలేక శివునిమూత్ర ద్వారమునుండి బయట పడెను. అప్పుడును శివుఁ డాతని నింకను శిక్షింప హుంకరించెను. ఉశనసునియదృష్టవశమునఁ జెంత నున్న పార్వతి “దేవా! ఈతఁ డెట్టి వాఁడై నను నీకడుపునఁ బుట్టుటచే నాకుఁ గొడుకైనాఁడు. ఈతనితప్పు లన్నిఁటిని మన్నించి దయదలఁచి యీతనిని సుఖవంతు నొనర్పు" మని ప్రార్థించెను. ఆ సుందరీలలామవదనారవిందముఁ గనుసరికి నా మె మృదుమధుర శుకాలాపములు వినుసరికి శివుని కెక్కడికోప మక్కడకుఁ బోయెను. చిలుకలకొలుకు లగు కలుకులపలుకు లెవనికోపముఁ బాపలేవు ?

శివుఁ డప్పుడు ఉశనసునికి గొప్పతేజస్సు నిచ్చి పార్వతితో నిట్లనెను. “దేవీ! వీని యోగము గొప్పది. నీ దయ యీతనిపైఁ గలిగినది. నీ దయ నా దయ. నీ కోపము నా కోపము. నీప్రీతి నాప్రీతి. ఈతఁడు శుక్రరూపమున బయటపడుటచే నిఁక నీతఁడు శుక్రుఁ డను పేరఁ బరఁగును. ఉపరిమార్గమునుండి కాక అధోమార్గమునుండి వచ్చినవాఁ డగుట నీతఁడు సన్మార్గులకుఁగాక దుర్మార్గులగు రాక్షసులకు గురువయ్యెడు ” నని పలికి ఉశనసుని విడిచిపుచ్చి కుబేరుని నిధులు కుబేరునికిఁ జేర్చెను.

"సజ్జనులవలనికోపమైనను క్షేమదాయకమే. దుర్జనులవలని ప్రేమయైనను బ్రమాద హేతువే" అన్నవాక్యము ఉశనసునిపట్ల ధ్రువ మయ్యెను.*[1]

రాక్షసగురుత్వము

కాలక్రమమున రాక్షసరాజు లెల్లరు విచ్చేసి తమకులగురువై తమక్షేమము నరయుచుండు మని ఉశనసునిఁ బరిపరివిధములఁ బ్రార్థించిరి. ఎట్టకేలకు, తాను దేవగురువు కాఁదలఁచియు దేవతలు తన్నుఁగాక బృహస్పతిని గురువుగా వరించియున్న కోపముకతమున, ఉశనసుఁడు రాక్షస లోకగురువుగా నుండ నంగీకరించెను. నాఁటినుండి యాతఁడు శుక్రాచార్యుఁ డని యెల్లరచేఁ బిలువఁ బడుచుండెను. అసలుపేరు మూలఁబడి యీపేరే ఆతనికి శాశ్వత మయ్యెను.

శుక్రుఁడు అసురులను శపించుట

శుక్రాచార్యుని గురుత్వమహత్త్వమున హిరణ్యకశిపుఁడు డెబ్బదిరెండు నియుతంబుల రెం డర్బుదంబుల యెనుబదివేల సంవత్సరములు (726160000) మూఁడులోకములను ఏకచ్ఛత్రాధిపతియై తన్నుఁ గాదనఁ గలుగుమగవాఁడు లేక పరిపాలించెమ.

తరువాతఁ జిరకాలమునకు రాక్షసులను విడిచి యజ్ఞపురుషుఁడు దేవతలకడకుఁ బోయెను. నాఁటినుండి దేవతలకు విజయము, శుభము, సౌఖ్యము పరంపరలుగాఁ గలుగుచుండెను. రాక్షసులకు పరాజయము, అశుభము, ఆసౌఖ్యము అవిచ్చిన్నముగాఁ గలుగుచువచ్చెను. మూఁడులోకములందును పరాజయ మందిన రాక్షసులు తమకులగురు వగు శుక్రాచార్యునిఁ జేరి తమకష్టనష్టములు తెలుపుకొని రక్షింపఁ బ్రార్థించిరి. శుక్రాచార్యుఁడు వారి కభయమిచ్చి శౌరిసాయమున దేవతలు జయించు చుండి రనియుఁ దాను శిపునిసాయము సంపాదించి యాతనివరముల మహత్త్వమున రాక్షసులు మరల మూఁడులోకములు నేలునట్లు చేయఁ గలనని శపథముచేసి వారిని పంపివేసెను. వెంటనే తనమాటప్రకారము శుక్రుఁడు కైలాసపర్వతమున కేగి పరమశివుని భజించి "దేవదేవా ! దేవతల పరాజయమునకు రాక్షసుల విజయమునకు బృహస్పతి యెఱుంగనిమంత్రరహస్యములను నాకు బోధింపు" మని ప్రార్ధించెను. "భార్గవా! నీవు తలక్రిందులుగ కణధూమపానముచేయుచు వేయిసంవత్సరములు తపస్సుచేసినయెడల నీకోరిక సిద్ధించు" నని చెప్పి పొమ్మనెను.

పరమశివునియనుగ్రహ మట్లు పొంది యాతఁడు చెప్పిన చొప్పున శుక్రాచార్యుఁడు తదేకనిష్ఠాగరిష్ఠుఁడై “కణధూమవ్రత" మమ గొప్ప వ్రతము నవలంబించి తలక్రిందులుగాఁ దపసుచేయ నారంభించెను. ఇట్లుండ దేవతలు విజృంభించి యొక్క పెట్టున రాక్షసుల నుక్కడఁ గింపఁ దొడంగ వారు గతి లేక శుక్రాచార్యుఁడు లేమి విచారించి యాతని తల్లియు భృగుపత్నియు నగు ఉశనకడ కేగి మొఱపెట్టుకొనిరి. ఆమె వారి కభయ మిచ్చి యాదరించెను. ఈ సంగతి విని యింద్రుఁడు దేవతలతో నామెపై కి యుద్ధమునకు వచ్చెను. ఉశన వెంటనే యోగ బలమున నిద్రాదేవత నింద్రునిపై కిఁ బంపెను. ఆ కారణమున నింద్రుఁడు మోహబద్ధుఁడై కదలలేక మెదల లేక కునికిపాటులు పడుచుఁ గూర్చుండి పోయెను. దేవత లెంత యత్నించిన నాతనికి తెలివి కలుగకుండెను . అపుడు దేవతలంద ఱాలోచించి పరుగుపరుగునఁబోయి హరిని శరణుఁ జొచ్చి జరిగినసంగతి విన్నవించి కాపాడు మని ప్రార్థించిరి. హరి వారి కభయమిచ్చి వారివెంట భృగువత్నికడ కేగి యచటఁ బడియున్న యింద్రునిఁ దనలోఁ బ్రవేశింపు మనఁగా నాతఁ డాహరియందుఁజేరి తెలివంది శుక్రమాతతో యుద్ధమునకుఁ దలపడెను. శుక్రమాతయు, భృగువత్నియు నగు ఉశనాదేవి కన్నుల నిప్పులు గ్రక్కుచు “ఓరీ! ఇంద్రా!

“అగణితమాహాత్మ్యుం డగు
 భృగుమౌనికి నేను బత్ని నెవ్వనిలో మ్రు
 చ్చుగ నీవు చొచ్చితివొ యా
 భగవంతుని నిన్నుఁ గూడ భస్మ మొనర్తున్."

అని యా మహాసాధ్వి పలికిన వెంటనే ప్రమాద మాశంకించి విష్ణువు తన చక్రమున నా మెతల నఱికెను. భృగుపత్ని శిరము వెంటనే నేలఁబడెను. ఇంద్రుఁడు ఉపేంద్రుఁడు వెడలిపోయిరి.

ఆ సమయముననే భృగుమహర్షి యాశ్రమమునకు వచ్చెను. రాఁగానే యాతనికి నేలపైఁ దలతెగి పడియున్నపత్ని గోచరించెను. దివ్యదృష్టి పాఱించి సంగతియంతయుఁ దెలిసికొని తోకఁదొక్కినత్రాచువలె లేచి “ధర్మ మెఱిఁగియుఁ దరుణిని జంపినదోషమునకు విష్ణువు భూమిపై నేడుమారులు నరుఁడై పుట్టుఁగాక ” యని శపించి భృగుమహర్షి భార్య తలతీసి మొండెముకడ నుంచీ యతికి " నేను ధర్మస్థిరు డనే యైనచో నాపత్ని తత్క్షణమే బ్రదుకుఁగాక ! ” యని పలికినంతనే దివ్యసాధ్వియై యా మహాసాధ్వి లేచి నిలిచి భర్తకు మ్రొక్కెను.

ఈ సంగతి తెలిసి యింద్రుఁడు భయపడిపోయి శుక్రాచార్యుఁడు తపమున శివుని మెప్పించి వచ్చినచో నింకను గొంపమునుఁగు నని యెంచి యాతనితపోభంగ మొనరింప నిశ్చయించెను. చక్కని చుక్కయు, సర్వశుభలక్షణయు నగు జయంతి యను తనకూఁతును బిలిచి శుక్రాచార్యుని కుపచారములు చేసి యెట్లైన నాతనిని వలలో వేసికొ మ్మని నియోగించెను.

జయంతి తండ్రియాజ్ఞ నౌదలధరించి పోయి శుక్రాచార్యునికిఁ బరిచర్యలు చేయుచుండెను. ఆతఁడు కోరకున్నను దనపాణిపద్మములచే నాతని పదపద్మము లొత్తుచుండెను. తపోగ్ని మధ్యమున ముచ్చెమటలు పోసినపు డాతనిస్వేద మామె తనమనోహర చీనిచీనాంబరముచేఁ దుడుచుచుండెను. అతఁడు కనువిప్పినవేళఁ దనకడకంటి చూడ్కు లాతనిపై గుమ్మరించెడిది. అగ్నిహోత్రము కూర్చుచు, పూలు కోసి కొని వచ్చియిచ్చుచు, పైఁటకొంగుతో విసరుచు, ఆ యిందువదన మందగమనముఁ జూపుచు నాతని వశపఱచుకొను నెడరు వేచియుండెను. కాని, వ్రతనిష్ఠాగరిష్ఠుఁడై యాతఁడు వేయిసంవత్సరములు నచంచలుఁడై గడపెను.

శుక్రునిమహానిష్ఠకు సంతసించి శివుఁడు ప్రత్యక్షమై "భార్గవా! ఇంతవఱకు ఈ “కణధూమవ్రత' మాచరించి తుదనెగ్గిన వాఁ డెవ్వఁడును లేఁడు. నీ విందు నెగ్గుటచే నీకోరిన కోరిక తీరుటయే కాక నిన్ను జయించు వాఁడే యెవఁడు నుండఁడు. ధనము, వ్రజ, విజయము, నిన్ను వరింప నీవు మహానుభావుఁడ వయ్యెద” వని వరము లిచ్చి యదృశ్యుఁ డయ్యెను.

పిదప శుక్రాచార్యుఁడు తనకు నిరుపమాన మగుసేవ యొనరించిన జయంతిని ముద్దులుమూటగట్టు నవయౌవనవిరాజితను గాంచి “తరుణి ! నీ వేకోరికఁ గోరి నన్నర్చించితివో నీకా కోరిక సిద్దింపఁజేసెదను. చెప్పు” మని యడిగెను. "దేవా! నిన్ను భర్తగ వరించి యీసేవలు చేసితిని. పదివేలసంవత్సరములు నీవు నాతో సుఖించువర” మిమ్మని ప్రార్థించెను. శుక్రుఁ డందుల కంగీకరించి యామెకొక మనోహరకేళిగృహము నిర్మించి యొరు లెవ్వరికిని గానరానివిధమున నామెతోఁ గామసుఖము లనుభవించుచుఁ బదివేలసంవత్సరము లుండిపోయెను.

ఈలోఁగా శుక్రుఁ డెంతటికిని దిరిగిరాకపోవుటకుఁ గారణ మెఱుంగక రాక్షసు లందఱు ధైర్యహీనులై తేజోహీనులగుచుండిరి. వారి నింకను జెఱుప నిదే సమయమని యెంచి బృహస్పతి శుక్రవేషమును ధరించి రాక్షసులకడకు వచ్చిచేరెను. అతఁడు నిజముగఁ దమగురువే యనుకొని రాక్షసు లపరిమితానందమున నాతనిని స్వీకరించి కులగురువుగాఁ బూజించుచుండఁగా వేయిసంవత్సరములు గడచెను. అప్పటికి శుక్రుఁడు జయంతికి గామసంతృప్తి పరిపూర్ణముగా నొసంగి యా మెవలన నలువురుకుమారులను, ఒక కొమార్తెను గాంచెను. చండుఁడు, అమర్కుఁడు, త్వష్ట, ధరాత్రుఁడు అనునలువురు కొడుకులను, దేవయాని యనుకూఁతును దీసికొని జయంతిని బంపివేసి శుక్రుఁడు రాక్షసనగరమునకు విచ్చేసి తనయాగమనవార్త శిష్యులకుఁ దెలిపెను. ఎవ్వరును వచ్చి యాతనిని గౌరవింపరై రి. ఇదేమని యాతఁడు రాక్షస సభ కేగి చూడ నచట శుక్రవేషమున నున్న బృహస్పతి కనిపించెను. శుక్రుఁ డాతనిమోసమును గ్రహించి కోపముతో " ఓరీ! నేను లేని సమయముఁ గనిపెట్టి నా శిష్యుల నిటులు మోసగింతువా ? వారు నిన్ను గుర్తెఱిఁగినతత్క్షణము నిన్నుఁ జీలికలు వాలికలు చేయుదురు. ఆసనము దిగి వెంటనే పొ"మ్మని హుంకరించెను. బృహస్పతి యాతనిం జూచి "ఓరీ ! ఇదివఱకు ధనతస్కరులనే మే మెఱుఁగుదుము కాని రూపతస్క రుల నెఱుంగము. ఇపుడు నిన్నుఁ జూచితిమి. చాలు. నిన్ను నమ్ము వా రెవరును లేరు. పొ"మ్మని చెప్పెను. అపుడు నిజమైనశుక్రుఁడు రాక్షసుల నుద్దేశించి జరిగినమోస మంతయు వివరించి చెప్పెను. కాని వా రందఱు దొంగశుక్రుని నిజమైనశుక్రునిగాఁ దలఁచినవా రగుట నీతని మాటలను బాటింపరైరి. అంతేకాదు. బృహస్పతిమాటలను బట్టి యాతని మెడపట్టి గెంటివేసిరి. ఇట్లు శుక్రాచార్యుఁడు నిజశిష్యులచేతనే ఘోరావమానమునకుఁ. బాల్పడి రాక్షసవంశములు నాశనము లగుఁగాక యని శపించి తనబిడ్డలతోఁ దపోవనమునకు వెడలిపోయెను. "పిల్లి శాపమునకు ఉట్లు తెగి క్రిందఁ బడునా? దొంగవాఁడు కపట నాటకమాడి మనలను శపించిన, ఆ శాపము మనకు సోఁకునా?" యని బృహస్పతి రాక్షసులకు నమ్మఁబలికి వారిని విజయవంతముగా మోసగించెను.

రాక్షసులకు వైదికమతవిశ్వాసముఁ బోఁగొట్టినఁగాని వారు శాశ్వతముగా నాశము కారని యెంచి యిదే యద ననుకొని బృహస్పతి రాక్షసు లండఱఁ బిలిచి వేదబాహ్య మగు ఆర్హత మతమును వారికిఁ జక్కఁగా బోధించి వారి కది బాగుగా నొంటఁబట్టినపిమ్మట వారి నందఱను యమునాతీరమునకుఁ గొనిపోయి స్నాతులఁ జేయించి ఆర్హ మత వేషముల ధరింపఁజేసి "ఆర్హ తాయ నమో" అన్నమంత్ర ముపదేశించి వారిని వేదబాహ్యులను. కర్మభ్రష్టులను పరిపూర్ణముగా నొనరించి రహస్యముగా దేవలోకమునకుఁ బోయెను. దేవతలు వెంటనే యుద్ధము ప్రకటించి రాక్షసులను ముప్పుతిప్పలఁ బెట్టి మూఁడుచెఱువులనీళ్ళు త్రాగించి తుక్కుతుక్కుగ నుక్కడఁగి. చిరి. అప్పటికి వారికి జరిగిన మోస మంతయుఁ దెలియవచ్చెను. చేతులు కాలినపిదప నాకులు పట్టిన నేమిలాభము ?

రాక్షసు లందఱును శుక్రాచార్యుని వెదకికొనుచుఁ బోయిపోయి తుద కాతనిఁ గాంచి పాదములఁ బడి తమ్ము క్షమించి పురికి విచ్చేయుమని ప్రార్థించిరి. ఆతఁడు వారిని గంటనై నఁ గనక, మాటయై న మాటాడక గర్హించి పాఱఁదోలెను. "ఉభయ భ్రష్టత, ఉపరి సన్న్యా సము " అన్న నానుడి రాక్షసులకుఁ బూ ర్తిగా వర్తించెను. అపుడు వారు గోలుగోలున నేడ్చుచుఁ దాము పడ్డ మోసమునకుఁ చేసినమోసమునకు లెంపలు వై చుకొని పశ్చాత్తాపపడి ప్రహ్లాదునికడ కేగి రక్షింపుమని యాతనిపాదముల పైఁ బడిరి. దయార్ద్రహృదయుఁ డగు నా మహానుభావుఁడు రాక్షసపురస్కృతుఁడై శుక్రాచార్యులపాలి కేగి రాక్షసకుల మొనరించిన మహాపరాధమును మన్నించి కాపాడు మనియు, బృహస్పతి పన్నినకుట్రచే నిజము తెలిసికొనలేకపోయిరే కాని గురుద్రోహబుద్దికాని గురుగౌరవరాహిత్యముకాని రాక్షసుల కెంతమాత్రము లేదనియు, తన్నుఁ జూచియైన వారిని క్షమించి కాపాడుమని పదేపదే ప్రార్థించెను. రాక్షసలోకమంతయు వచ్చి శుక్రునిమ్రోల సాష్టాంగపడెను. సహజ దయార్ద్ర హృదయుఁ డగు శుక్రాచార్యుని కప్పటికి వారిపై జాలికలిగి నిజ శివతపశ్చర్యావృత్తాంతము, వరగ్రహణము వారికి సవివరముగాఁ దెలిపి ప్రహ్లాదునిమనుమఁడు, సకలగుణసంపన్నుఁడు, బలవిద్యా తేజస్వంతుఁడు, భక్తిసంపన్నుఁడు నగు బలిని వారికి నాయకు నొనరించి యాతనిచే ముల్లోకములు మరల నేలింతు నని చేసిన ప్రతిజ్ఞ మరలఁ జేసి తాను గడించినమంత్రరహస్యములను బలికి మిగిలినరాక్షస నాయకులకుఁ దెలిపెను.

శుక్రాచార్యుని కారణమున రాక్షసు లందఱు మహావీర్యవంతులై యుద్ధసన్నద్ధులై బలియాజమాన్యమున నవలీలగా ముల్లోకములను జయించిరి. వెంటనే శుక్రుఁడు బలిని చక్రపర్తి నొనరించి యింద్రాది దేవతలను బృహస్పతిని బాఱఁదోలించి పరిభవించి యిరువది నియుతముల యొక యర్బుదము నఱువది వేల సంవత్సరములు (20, 30,64, 0000) ఆతనిచే రాజ్య మేలించెను.*[2]

శుక్రునికూఁతురు దేవయానివృత్తాంతము

వృషవర్వుఁ డను రాక్షసరాజు ఆచార్యుఁ డగుశుక్రుని మహాభక్తి గౌరవములతో భజించుచు, నాతనిం దనపురమున రాజప్రాసాదమునఁ బెట్టుకొని యాతనిఁ దనకంటె నెక్కుడుగాఁ బూజించుకొనుచుండెను ఇంత వినయవిధేయతలఁ జూపుశిష్యునివల్ల గురువగు శుక్రాచార్యుఁడునం దయాపరుఁడై యాతనితలలో నాలుకవలె మెలఁగుచుండెను. వృషపర్వుఁడు మహాయుద్ధముల నొనరించి దేవతల నేడ్పించుచుండెను. యుద్ధములో మృతు లై నరాక్షసుల నెల్ల రను మృతసంజీవనీ విద్యచే గురువు బ్రదికించుచుండుటచే రాక్షసుల జయింప దేవతలకు సాధ్యము కాదయ్యెను. అప్పుడు దేవత లందఱు నాలోచించి యెట్లైన శుక్రాచార్యునివలన మృతసంజీవనీవిద్య గ్రహించి తేఁగలవాఁ డెవఁ డని యాలోచించి బృహస్పతిపుత్రుఁ డగు కచుఁడుదక్క నన్యుల కది సాధ్యము కాదని గ్రహించి యాతని నందులకై ప్రార్థించిరి.

దేవహితార్థియై కచుఁడు బయలుదేఱి వృషపర్వునినగరుచేరి యందు వేదాధ్యయనశీలుఁడై సకలదైత్యదానవగణోపాధ్యాయుఁ డయి యున్న శుక్రాచార్యునిం గని సాష్టాంగనమస్కార మొనరించి “ఆచార్యా! నేను బృహస్పతిపుత్తుఁడను, నన్నుఁ గచుఁడందురు. నేను నీకడ శిష్యుఁడనై యుండి విద్యలు నేర్వ వచ్చితిని. నీవు న న్ననుగ్రహింపు" మని ప్రార్థించెను. బాలుఁడయ్యును నియమవ్రతశీలుఁడై న వాఁడు, సుకుమారుఁడు, ప్రకాశవంతుఁడు, ప్రశాంతుఁడు, విశేషించి బృహస్పతియంతవాని పుత్రుఁడు వచ్చి శిష్యత్వ మంగీకరింపునుని ప్రార్థించిన నంగీకరింపకుండు టెట్లని శుక్రుఁడు పరమప్రితి నాతని నాదరించి యభ్యాగతపూజ లొనరించి యాత్మశిష్యు నొనర్చుకొనెను.

అది మొదలు శుక్రాచార్యుఁ డేపని చెప్పినను వెంటనే చేయుచు మనోవాక్కాయకర్మలచే గురుసేవ చేసి యాతనిమనస్సును, అంతకన్న మిన్న గా నాతనికన్న కూఁతురగు దేవయాని సున్నితహృదయమును కచుఁ డపహరింపఁ గలిగెను. కచుఁడు దేవయాని గీచినగీఁతదాటఁడు. ఆతడామెను హితమిత భాషణములచేతను, పుష్పఫలాదిదానములచేతను, నిరంతరము సంతోష పెట్టుచుండెను. ఇట్లు కొన్ని సంవత్సరములు జరిగెను. గురుశుశ్రూషా కౌశలమునఁ గచుఁడు గురునకుఁ బ్రియశిష్యుఁడు. గురుతనూజకుఁ బ్రియమిత్రుఁడు నయ్యెను.

ఇది చూచి రాక్షసులు సహింపలే రైరి. అందుచే నొకనాఁడు వనములో హోమధేనుపులంగాచు కచుని బట్టుకొని చంపి రాక్షసులు వాని శవము నొకచెట్టునకుఁ గట్టిపోయిరి. నాఁడు చీఁకటి పడుసరికి ఆవు లింటికి వచ్చినవి కాని, కచుఁడు రాఁడయ్యెను. కచుఁ డన్నఁ బంచ ప్రాణములుగా నున్న దేవయాని యాతనికొఱ కేడ్చుచుఁ దండ్రితో మొఱ పెట్టుకొనెను. శుక్రాచార్యుఁడు దివ్యదృష్టిని జూచి జరిగినదెల్ల గ్రహించి యాతనిం బ్రదికించి తీసికొనిరమ్మని తన మృతసంజీవనీవిద్యం బంపెను. మహాప్రసాద మని యా విద్య శరవేగమున నేగి కచుని సంజీవితు నొనర్చి తీసికొని వచ్చెను. తండ్రికూఁతు లిరువురు నాతనింజూచి సంతోషించిరి.

ఈ సంగతి నెఱింగిన రాక్షసు లీసారి యట్లు కాదని యడవికిఁ బువ్వుల కరిగినకచునిఁ బట్టుకొని చంపి కాల్చి బూడిదచేసి యా బూడిద కల్లులోఁ గలిపి యా కల్లు తెలుపకుండ శుక్రునిచేఁ ద్రాగించిరి. సురాపాన మోహితుఁడగు శుక్రాచార్యుఁ డేమియు నెఱుఁగఁ డయ్యెను. దేవయాని కచునిం గానక వెక్కి వెక్కి యేడ్వఁదొడంగెను. “ఓసీ ! ఏల యేడ్చెదవు? ఇంక నెన్నిసారులు బ్రదికించినను రాక్షసు లాతనినిఁ జంపక మానరు. అతఁడు సుగతికే పోయియుండును. ఇంక నతని కొఱ కేడ్వకు" మని శుక్రాచార్యుఁడు దేవయానితో ననెను. అంత దేవయాని కన్నులనీరు వఱదలై చన్నులవెంటఁ బ్రవహింప :

"మతిలోకోత్తరుఁ డై నయంగిరసుమన్మం డాశ్రితుం డా బృహ
 స్పతికిం బుత్రుఁడు మీకు శిష్యుఁడు సురూపబ్రహ్మచర్యాశ్రమ
 వ్రతసంపన్నుఁ డకారణంబ దనుజవ్యాపాదితుండైన న
 చ్యుతధర్మజ్ఞ! మహాత్మ ! య క్కచున కే శోకింప కెట్లుండుదున్ ?
                                                          భార. అది. 3. 1,1,8.

వానినిఁ జూచి కాని నే భుజింప; నిద్రింప; జీవింప" నని యేడ్చెను. శుక్రాచార్యుఁడు కొంత సేపటికిఁ గూరిమిపట్టి పైఁగల మమత్వము, అనుంగు శిష్యునిపైఁ గలవాత్సల్యము స్మరించి దివ్యదృషి సారించి లోకాలోక పర్యత పర్యంతభువనాంతరమున నెక్కడమ గచుని గానఁ డయ్యెను. తుదకు బూడిదయై సురతోఁ గలిసి తన కడుపుననే యున్న కచుఁ డాతనికి గోచరించెను. సురాపాన దోషము, అసురాపకారావమానము హృదయమును దహింప శుద్రాచార్యుఁ డిట్లు తలపోసెను. " అయ్యో ! ఎన్ని జన్మములందో యెంతో శ్రమపడి సంపాదించినపుణ్య మంతయు నొక్క క్షణములో సురాపానదోషమునఁ బోవుటేకాళ మహాపాపము పైఁ బడుఁగదా! ఇట్టిదోషభూయిష్ట మైనసురాపానము బ్రాహ్మణులకు క్షంతవ్యమగునా ? సర్వరాక్షసలోకగురుఁడను; సర్వవిద్యా వివేకకోవిదుఁడను, నేనే యీ దోషమున నింత యవివేకముగా మోసపోతినే? ఇఁకఁ బ్రపంచముగతి యేమి? ఇట్లు తలపోసి శుక్రాచార్యుఁడు సురాపానము మహాపాపమనియు విశేషించి విపుల కది సర్వవినాశహేతు వనియు శపించెను.

శుక్రుఁడు విద్యావినయవివేకసంపన్నుఁడు, విశేషించి ప్రియశిష్యుఁడు నగుకచుని బ్రదికింప కెట్లుందు ననుకొని యాతనిం దనసంజీవనీ మంత్రముచేఁ గడుపులోనే బ్రదికించెను. కచుఁడు కడుపులోనుండి " జయ గురుదేవా! కృతజ్ఞుఁడను. నీ దయవలన శరీరము, ప్రాణము, బలమును పొందితిని. బయటపడు నుపాయముఁ జెప్పి రక్షింపవే” యని మిక్కిలి ప్రార్థించెను. అందులకు శుక్రాచార్యుఁ డిట్ల నెను. “వత్సా ! నా కడుపు బ్రద్దలైనఁగాని నీవు బయటపడలేవు. నా కడుపు బ్రద్దలైనచో నేను చనిపోవుదును. నన్ను బ్రదికించు విద్య మృతసంజీవని నీకు బోధింపవలయును. నే నట్లు చేసినచో నీ వచ్చినపనియై దేవతలకు మేలగును. నా శిష్యులగు రాక్షసులకుఁ గీడగును. ఐనఁ గానిమ్ము. విద్యావినయవివేకములు, శ్రద్ధాభయభక్తులుగలిగి, గురుశుశ్రూషాపరాయణులు, లోకోపకారకులు, నియమవ్రతశీలురునగు ఆత్మీయప్రియ శిష్యులకుఁ బరమరహస్య విద్యయైనను బోధింపక దాచుకొనుగురువు గురువు కాఁడు, నిరయవాసి యగును. కావున, ఏదియేమైనను నీ కీ విద్య బోధించెదను. నీవు నాకడుపు ప్రక్కలుచేసికొనివచ్చి చచ్చిన నన్ను బ్రదికింపుము."

ఇట్లు పలికి శుక్రాచార్యుఁడు లోకోత్తర మగుసంజీవనీ విద్యను లోకోత్తరుఁడగు కచునకు లోకోత్తరపద్దతిని బ్రసాదింపఁగనే కచుఁడు గురునికడుపు బ్రద్దలు చేసికొని బయటికివచ్చి వెనువెంటనే తాను నేర్చిన విద్యచే విగతజీవుఁడై పడియున్న వేదమూర్తిని బ్రదికించెమ. ఆ గురుశిష్యులను సర్వదేవతలు నభినందించి పుష్పవృష్టి వారిపైఁ గురియించిరి. | దేవయానియానందమునకుఁ బట్టపగ్గములు లేకుండెను.

ఇట్లు శుక్రాచార్యుఁడు సమస్తము నెఱిఁగియు శిష్యరత్నమగు కచునకుఁ దనకు ప్రాణప్రదమగువిద్యను బోధించి తన యుదారతను, నిష్కలుషతను, విద్యావిషయమున శత్రుమిత్రభేదభావ రాహిత్యమును జూపి లోకోత్తరపురుషుఁ డయ్యెను.*[3]

శుక్రాచార్యుఁడు యయాతిని శపించుట

కచుఁడు దేవలోకమున కేగ తన్ననుమతింపు మని కోరఁగా దేవయాని తన్నుఁ బెండ్లాడు మని కోరెను. కచుఁడు ధర్మరహీత మని దాని గంగీకరింపకపోఁగాఁ దనతండ్రివలన గ్రహించిన మృతసంజీవని కచునకుఁ బనిచేయకుండుఁ గాక యని యామె శపించెను. “నా కది పని చేయక పోయినను నావలన గ్రహించినవారికది పనిచేయుఁగాక ! నన్న కారణముగ శపించితివి కావున నిన్ను బ్రాహ్మణుండు వివాహమాడకుండుఁ గాక ” యని కచుఁడు ప్రతిశాపమిచ్చి వెడలిపోయెను.

వృషపర్వునికూఁతురగుశర్మిష్ఠ తన వేయి మందిచెలికత్తెలతో దేవయానితో వనవిహారమున కేగి యందు దేవయానితో మాట పట్టింపు వచ్చి దేవయానిని బాడునూఁతం ద్రోయించి చెలికత్తెలతో నింటికి వచ్చి చేరెను. యయాతిమహారాజు వేఁటకువచ్చి డస్సి దప్పికచెంది దైవికముగా ఆ నూఁతికడకువచ్చి జలములు తీయ లోనికిఁ జూడ నాతనికి సర్వాంగ సౌందర్యవతి, యువతి యగు దేవయాని పడియుండి కనిపించెను. యయాతి యామెను బలుకరించి యాయమచరిత్ర లడిగి తెలిసికొని తన కుడిచేతితో నామెను బట్టుకొని నూఁతినుండి బయటికిఁదీసి యోదార్చి వేడలిపోయెను. దుర్మార్గురాలై నశర్మిష్ఠఁ గన్న తండ్రినగరము చూడ నని దేవయాని యటనే యుండి తండ్రికి వార్తవం పెను. శుక్రుఁడు వెంటనే కూఁతు రున్న చోటుచేరి యామెవలన జరిగినసంగతి యంతయు విని "తల్లీ !

అనుపమనియమాన్వితులై
అనూనదక్షిణలఁ గ్రతు సహస్రంబులు చే
సినవారికంటె అక్రో
ధనుఁడ కరం బధికుఁ డండ్రు తత్త్వవిధిజ్ఞుల్ .
 

అలిగిన నలుగక యెగ్గులు
పలికిన మఱి విననియట్లు ప్రతివచనంబుల్
పలుకక బన్నమువడి యెడఁ
దలఁపక యున్న తఁడ చూవె ధర్మజ్ఞుఁ డిలన్.
                                       భార. ఆది. 146, 147.

కావున, బుద్ధిహీనులే కాని బుద్ధిమంతులు ఎవరిమీఁదను గోపింపరు. ఇంతకు శర్మిష్ఠ రాజుకూఁతురు. చిన్నపిల్ల . దాని తెలివితక్కువ తనముఁ జూచి జాలిపడవలయునే కాని కోపింపఁ జనదు" అని బోధించెను. కాని, దేవయాని వినక " తండ్రీ !

కడు ననురక్తియు నేర్పును
గడఁకయుఁ గలవారి నుఱక కడవఁగ నెగ్గుల్
నొడివేడి వివేకశూన్యుల
కడ నుండెడు నంతకంటెఁ గష్టము గలదే.
                               (భార. ఆది. 3. 149)

నేనేమైన నా నగరు తొక్క" నని భీష్మించి యుండ శుక్రాచార్యుఁడు నటనే నిలిచిపోయెను. ఈ సంగతి యంతయుఁ జారులవలన విని వృషపర్వమహారాజు త్వరితగతి వచ్చి తండ్రికూఁ తుళ్ళ కెఱఁగి “ఆచార్య! నీవలననే రాక్షసకుల ముద్దరింపఁ బడినది. నీ ఋణము మే మెట్లును దీర్చుకొనలేము. మా సమస్తైశ్వర్యములు, పుత్రమిత్ర పరివారము, ధనధాన్యసంపదలు అన్నియు నీవే. నీ వెట్లు చెప్పిన నట్లు నడచుకొందుము. దేవయాని యేమి చేయుమన్న నది చేయుదును క్షమింపు” మని ప్రార్థించెను.

అట్లైన "నీకూఁతును వేయిమందికన్యకలతో నాపాద దాసి నొనర్పు" మని దేవయాని వృషపర్వుని గోరెను. ఆతఁడు మహాప్రసాద మని యట్లే యొనరించెను. శర్మిషయుఁ దనతప్పిదము నెఱింగి క్షమింపఁ బ్రార్థించి తండ్రియానతి తలధరించి దేవయానికి వేయిమంది కన్యలతో సేవచేయుచుండెను. ఒకనాఁడు శర్మిష్టయు నామె పరివారమును దన్ను సేవించుచుండ దేవయాని వనవిహారమున కేగెను. దై వికముగా నచట యయాతిమహారాజు తటస్థపడెను. ఆతఁడు దేవయానిం బలుకరించి మిగిలినవారంద ఱెవ్వ రని యడిగెను. దేవయాని సమస్తము నాతనికి జెప్పి తన్నుఁ బెండ్లాడు మని ప్రార్థించెను. అంత యయాతి క్షత్త్రియుఁడు బ్రాహ్మణకన్యను బరిగ్రహించుట ధర్మవిరుద్ద మని తా నధర్మమునకుఁ బాలుపడుచో లోకప్రవృత్తి విపరీత మగు నని వాక్రుచ్చెను. “ఐనచో, నాతండ్రి చెప్పిన నంగీకరింతువా? ” యని యయాతి నడుగ నాతఁ డంగీకరింతు ననెను. వెంటనే దేవయాని తండ్రిని బిలిపించి విషయ మంతయుఁ జెప్పెను. శుక్రాచార్యుఁడు వారివివాహ మధర్మము కాకుండునట్లు వర మను గ్రహించి వారికి వివాహ మొనరించి తన కూఁతుతోపాటు శర్మిష్ఠను సఖులను రాజున కొప్పగించి వడుక తక్క దిక్కినన సమస్తసుఖములు నామె కొసంగు మని చెప్పి యయాతి నొప్పించి శుక్రాచార్యుఁడు వారందరిని యయాతితోఁ బంపివేసెను. కాలక్రమమున యయాతి దేవయానివలన యదుతుర్వసు లను కుమారులం గాంచెను.

శర్మిష్ఠ యౌవనవతియై తనయంద మంతయు నడవిని గాచిన వెన్నెల కాఁగా దుఃఖించుచుఁ దనకుఁ బతి లేఁడయ్యె నని కృశించుచు యయాతితోడి సంగమము మనసునఁ గోరి యుండఁగా నొకనాఁడు దైవికముగా నామె యొంటరియై యున్నప్పుడు యయాతి యొంటరిగా నరుదెంచెను. అపుడు శర్మిష్ఠ చేతులు జోడించి నమస్కరించి తనకు సంగమసుఖ మిమ్మని ప్రార్థించెను. “శయన సుఖముతక్క మిగిలిన సుఖములు నీ కిమ్మని శుక్రుఁడు నా కాదేశించినాఁడు. దానికి విరుద్ద మొనరించిన నసత్యదోషము నాకువచ్చు" నని యయాతి పలుక శర్మిష్ఠ "దేవా! ప్రాణవిత్తమాన భంగములందు వివాహవధాసమయములను బొంకవచ్చు ననుట ధర్మబద్దము కావున నన్నేలు" మని పైఁబడెను. అసదృశరూప యౌవనవిలాసిని యగునామె కా మహారాజటనే యపుడే యామె కోరిన కామసుఖము నపారమొసంగి గర్భము నిలిపి చనెను. కాలక్రమమున శర్మిష్ఠకుఁ గొడుకుపుట్టి పెరుగుచుండ దేవయాని చూచి యా కొడుకెట్లు పుట్టె నని శర్మిష్ఠ నడిగెను. ఒకమునీశ్వరుని దయచేఁ గలిగె నని శర్మిష్ఠ బొంకెను. దేవయాని యది నిజమని నమ్మి వెడలిపోయెను. యయాతి యతి రహస్యముగా శర్మిష్ఠాసంగమ మొనరింప నామెకుఁ గ్రమముగా నాతనివలన మువ్వురుపుత్రు లుదయించిరి.

కాలక్రమమున నొకనాఁడు శర్మిష్ఠాయయాతుల గుట్టు బట్టబయలు కాఁగా దేవయాని సమస్తము నెఱింగి తండ్రికడకుఁ బోయి తనభర్తయగు యయాతి యధర్మమున ధర్మమునకుఁ గీడు కలిగించి, ఆసురపద్దతి నాసురియందు ముగ్గురుకొడుకులఁ గని తన కవమానము కల్గించెనని యేడ్చెను. శుక్రుఁడు కోపముతో వచ్చి యయాతిం జేరి " నీవు యౌవనగర్వమున రాగాంధుఁడవై నాకూఁతున కప్రియము చేసితివి. జరాభారపీడితుఁడవు క"మ్మని శపించెను. యయాతి ఖేదపడి తనకుఁ గామసుఖము తీరలే దని శాపముఁ బాపుమని ప్రార్థించెను. శుక్రాచార్యుఁడు “నీ ముదిమి నీ కొడుకునకిచ్చి యాతని యౌవనము నీవు తాల్చి రాజ్యసుఖంబు లనుభవింపవచ్చు. తుదిని నీముదిమి నీవు తాల్చి నీ కుమారునియౌవన మాతని కీయవచ్చు. అట్లొడంబడిన కుమారునికే నీవు రాజ్య మీయవలయు. అతఁడే వంశకర్త యగు"నని శాపము మార్చి కూఁతు నూఱడించి యయాతిఁ దృప్తిపఱచి వెడలిపోయెను.*[4]

శుక్రాచార్యుఁడు బలిచక్రవర్తికి నీతి బోధించుట

శుక్రుడు బలికి సమస్త నీతులను బోధించి యాతనినిఁ జక్రవర్తి నొనరించి దేవతలయు, ఇంద్రునియు, దిక్పాలకులయు గర్వ మణఁవం జేసి యాతనిచే శతాధికములగు యజ్ఞములు చేయించి దానము లొనరింపఁజేసి సత్యము, దయ, ధర్మము, త్యాగము, యోగము పంచప్రాణములుగా నొనరించి జగజ్జేగీయమానముగాఁ దనయాచార్యత్వము నిర్వహించెను. ఇట్లుండ విష్ణుమూర్తి వామనుఁడై బలిని యాచింప వచ్చుటయు, బలి వామనుఁడు కోరిన మూఁడడుగులభూమిని దానముచేయ నంగీకరించుటయు జరిగెను. అపు డీసంగతి విని తన దివ్యదృష్టిని జరుగఁ బోవున దెఱిఁగినవాఁ డయ్యు శుక్రాచార్యుఁడు తనవిధి తాను నిర్వర్తింపఁ దలఁచి బలిని జేరి యిట్లు పలికెను. “దనుజేంద్ర ! ఈ పొట్టివాఁడు చాల గట్టివాఁడు. బడుగు బాపనయ్య కాఁడు. దేవకార్యము సాధించుటకై యీవటువు రూపమున నీకడకు వచ్చినాఁడు. ఈ సంగతి నీ వెఱుంగక యీతనికి నీవు దాన మిచ్చెద నంటివి. ఇచ్చితివా రాక్షసలోకమున కంతకు ముప్పు తెచ్చినవాఁడవే యౌదువు. ఈతఁ డీ మూఁ డడుగుల దానము మిషచే నీ లక్ష్మీ, నీ తేజము, నీ యిల్లు, నీ యైశ్వర్యము, నీ సమస్తముఁ గొనిపోయి యింద్రుని కిచ్చును. మూఁడుపాదములతో మూఁడు లోకముల నాక్రమించి నిన్నుఁ బాతాళమునఁ గూల్చును. ఇచ్చెదనని ఈయకున్న చో నరకమే వచ్చును. కాని, దానిని దప్పించుకొన నీవు సమర్థుఁడవు. ఏ దానమున వినాశము సంభవించునో యది దానమే కాదని పెద్ద లందురు. గృహస్థుఁ డగువాఁడు తనయింటఁ గలధన మైదుభాగములుగాఁ జేసి కామము, అర్థము, ధర్మము, యశము, ఆశ్రితజనము అనునై దిటికి సమముగాఁ బంచవలయును. అంతేకాని తనకు మాలినధర్మము ధరణి లేదు. “బహ్వృచగీత " ఈ భావమునే తెలుపును. వినుము. అంగీకరించినను, అఖిలము పోవునపుడు లే దనిన అసత్యము కాదు. ఆత్మ యనువృక్షమునకు అసత్యము మూలము. ఐనను ఆత్మ చెడదు. ఆత్మ యనువృక్షమునకు సత్యము పుష్పఫలములు. మ్రాను చెడుటతో పుష్పఫలములును పోవును. ఫలపుష్పములు లేకపోయినను వృక్షము మూలముతో వృద్ధిపొందును. కావునఁ దాను నశింపకుండు పక్షమున దానము చేయవలయును గాని తానే పోవునపుడు దానము చేయుట తెలివిగలపని కాదు. మఱియును

వారిజాక్షులందు వై వాహికములందుఁ
బ్రాణవిత్తమానభంగమందుఁ
జకితగోకులాగ్రజన్మరక్షణమందు
బొంకవచ్చు నఘము పొందఁ డధిప!

నేఁ జెప్పినమాటలు పాటించి కులము, రాజ్యము, తేజము నిలుపుకొనుము. ఈ దానము గీనము మానుము.”

ఆ మాటలు విని బలిచక్రవర్తి "ఆచార్య! నీవు నిజము చెప్పితివి. గృహస్థులకు నీవు చెప్పినదే పరమధర్మము. కాని, నే నీదాన మిచ్చి తీరెద" నని పలికి శుక్రుని పలుకులు పాటింపఁ డయ్యెను. కాని, శుక్రాచార్యుఁ డొనరించిన హితబోధవలన నాతఁ డాగతానాగతవర్తమానవేది యాచార్య ధర్మనిర్వహణబుద్ధి యని వెల్లడియైనది,

ఔశనససంహిత

ఉశనసుఁడు అనులోమప్రతిలోమజాత్యంతర వివాహములనుగూర్చి చెప్పినధర్మములు ఔశనస సంహిత యని ప్రసిద్ధిగాంచినవి. ఈ సంహిత పూర్తిగా లభింప లేదు. లభించిన సంహితలో ఆరంభమున " అతఃపరం ప్రవక్ష్యామి జాతివృత్తివిధానకం, అనులోమవిధానం చ ప్రతిలోమవిధింతథా" అని కలదు. (ఇంతకుఁ బూర్వ మేదియో చెప్పి యుండ వచ్చు. ఈ సంహితనే ఔశనసధర్మశాస్త్రమనియు, ఔశనసస్మృతి, శుక్రస్మృతియనియు నందు రని తుదిఁగలదు.) ఇందు 51 శ్లోకములు మాత్రమున్నవి 51 వ శ్లోకము :

“ఏతత్సంక్షేవతః ప్రోక్తం జాతివృత్తివిభాగశః,
జాత్యంతరాణి దృశ్యంతే సంకల్పాదిత ఏవ తు. "

ఔశనసస్మృతి

ఇదియే ప్రధాన మగు శుక్రధర్మశాస్త్రము. శౌనకాది మహామునులు భార్గవుఁడగు ఉశనసునిఁజేరి ధర్మశాస్త్ర వినిర్ణయ మొనరింపు మని ప్రార్థించిరి. ధర్మతత్త్వవిదుఁ డగు ఉశసుఁడు ధర్మార్థకామమోక్షహేతువు, పాపనాశనకరము సగుధర్మశాస్త్రమును మొదటఁ దండ్రికి నమస్కరించి ప్రారంభించి చెప్పెను. మొదటి అధ్యాయమున బ్రహ్మచారిధర్మసార వర్ణనము, రెండవ అధ్యాయమున బ్రహ్మచారిశౌచాచారవర్ణనము, మూఁడవఅధ్యాయమున బ్రహ్మచారికి సంబంధించిన యనేకవిషయములవర్ణనము, గాయత్త్రీ మంత్రసారవర్ణనము, నిత్యనై మిత్తిక విధివర్ణనము, నాలుగవ అధ్యాయమున శ్రాద్ధవిషయవర్ణనము, ఐదవయధ్యాయమున అదే విషయముయొక్క వివరణము, ఆఱవ అధ్యాయమున అశౌచ వర్ణనము, ఏడవ అధ్యాయమున గృహస్థు లొనరింపఁదగిన ప్రేతకర్మ విధివర్ణనము, ఎనిమిదవ అధ్యాయమున ప్రాయశ్చిత్తవర్ణనము, తొమ్మిదవ అధ్యాయమున ఆ విషయముయొక్క విపులీకరణము అను విషయములు ఔశనసస్మృతిలోఁ గలవు. మచ్చు శ్లోకములు :

"కృతోపనయనో వేదా నధీయీత ద్విజోత్తమః,
 గర్భాష్టమే వ్యష్టమే వా స్వ సూత్రోక్త విధానత :
 దండే చ మేఖలా సూత్రే కృష్ణాజినధరో మునిం
 భిక్షాహారో గురుహితే వీక్షమాణా గురోర్ముఖం

 ....... ......... .......... ......... ..........
 ......... ........ ........... ......... ...........
 ఉపాసనే గురూణాం చ సాంధ్యయో రుభయోరపి,
 ఉపవీతీ భవేన్నిత్యం విధి రేషః సనాతనః.

 ......... .......... .......... ......... ..........
 ........ .... ..... ......... .......... ..........
 అమావాస్యాయాం యో బ్రాహ్మణం సముద్దిశ్య పితామహమ్,
 బ్రాహ్మణీస్త్రీం సమభ్యర్బ్య ముచ్యతే సర్వపాతకై :
 అమావాస్యాం తిథిం ప్రాప్య యమమారాధయేద్భవమ్,
 బ్రాహ్మణానాం భోజయిత్వా స్సర్వపాపై : ప్రముచ్యతే.
 కృష్ణాష్టమ్యాం మహాదేవం తథా కృష్ణచతుర్దశీం,
 సంపూజ్య బ్రాహ్మణముఖై : సర్వపాపై ః ప్రముచ్యతే.
 త్రయోదశ్యాం తథా రాత్రౌ సోపహారం త్రిలోచనమ్,
 దృష్ట్వేవ ప్రథమో యామో ముచ్యతే సర్వపాతకైః.
 సర్వత్ర దానగ్రహణే ముచ్యతే సోమయాగతః.

శాంత్యాచ దక్షిణాం గృహ్ణన్ హిరణ్యప్రతిమా మపి,
అయుతేనై వ గాయత్ర్యా ముచ్యతే సర్వపాత కై : .

శుక్రధ్యానము

శ్లో. జటిలం సాక్షసూత్రం చ
             వరదండ కమండలుమ్,
    శ్వేతవస్త్రావృతం శుక్రం
             ధ్యాయేద్దానవపూజితమ్.”

శుక్ర స్తుతి

శ్లో. శుక్ర శ్శుభగ్రహ శ్రీమాన్
           వర్షకృద్వర్ష విఘ్నకృత్,
    తేజోనిధిః జ్ఞానదాయీ
           యోగి యోగవిదాంవరః

   దైత్యసంజీవన శ్రాంతో
           దైత్యనేత్రోశనాః కవిః,
   నీతికర్తా గ్రహాధీశో
           విశ్వాత్మా లోకపూజితః,

   శుక్ల మాల్యాంబరధరః
          శ్రీ చందన సమప్రభః,
   అక్షమాలాధరః కావ్యః
         తపోమూర్తి ర్ధనప్రదః."

శుక్రాష్టో త్తరశతనామస్తుతిః

"శ్లో|| శుక్ర శ్శుచి శ్శుభగుణ శ్శుభద శ్శుభలక్షణః,
       శోభనాక్ష శుభ్రరూప శుద్ధ స్ఫటిక భాస్వరః.
       దీనార్తిహారకో దైత్యగురుర్దేవాభినందితః,
       కావ్యాసక్తః కామపాలః కవిః కల్యాణదాయకః.
       భద్రమూర్తి ర్భద్రగుణో భార్గవో భక్తపాలనః,
       భోగదో భువనాధ్యక్షో భుక్తి ముక్తి ఫలప్రదః.
       చారుశీల శ్చారురూప శ్చారుచంద్ర నిభాననః,
       నిధి ర్నిఖిల శాస్త్రజ్ఞో నీతివిద్యా ధురంధరః.
       సర్వలక్షణసంపన్నః సర్వావగుణ వర్జితః,
       సమానాధిక నిర్ముక్తః సకలాగమపారగః.
       భృగు ర్భోగకరో భూమీసురపాలనతత్పరః,
       మనస్వీ మానదో మాన్యో మాయాతీతో మహాశయః.
       బలిప్రసన్నో౽భయదో బలీబల పరాక్రమః,
       భవపాశ పరిత్యాగో బలీబంధ విమోచకః.
       ఘనాశయో ఘనాధ్యక్షో కంబుగ్రీవః కళాధరః,
       కారుణ్యరససంపూర్ణః కల్యాణగుణవర్ధనః.
       శ్వేతాంబర శ్శ్వేతవపుః చతుర్భుజ సమన్వితః,
       అక్షమాలాధరో౽ చింత్యో అక్షీణగుణభాసురః.
       నక్షత్ర గణ సంచారో నయదో నీతిమార్గదః,
       హర్షప్రదో హృషీకేశః క్లేశనాశకరః కవిః.
       చింతితార్థప్రద శ్శాంతమతిశ్చి త్తసమాధికృత్,
       ఆధివ్యాధిహరో భూరివిక్రమః పుణ్యదాయకః.
       పురాణపురుషః పూజ్యః పురుహూతాదిసన్నుతః,
       అజేయో విజితారాతి: వివిధాభరణోజ్జ్వలః.

కుందపుష్పప్రతీకాశో మందహాసో మహామతిః,
ముక్తాఫలసమానాభో ముక్తిదో మునిసన్నుతః,
రత్న సింహాసనారూడో రథస్థో రజత ప్రభః,
సూర్యప్రాగ్దేశసంచారః సురశత్రుసుహృత్ కవిః.
తులావృషభరాశీశో దుర్ధరో ధర్మపాలకః,
భాగ్యదో భవ్యచారిత్రో భవపాశవిమోచకః,
గౌడదేశేశ్వరో గోప్తా గుణీగుణవిభూషణః,
జ్యేష్ఠానక్షత్ర సంభూతో జ్యేష్ఠః శ్రేష్ఠః శుచిస్మితః,
అపవర్గవ్రదో౽నంత స్సంతానఫలదాయకః,
సర్వైశ్వర్యప్రద స్సర్వగీర్వాణగణసన్నుతః. "  1. *భారతము; శాంతిపర్వము.
  2. *పద్మపురాణము. సృష్టిఖండము. బ్రహ్మాండ పురాణము
  3. *భారతము ఆదిపర్వము.
  4. *భారతము ఆదిపర్వము భాగవతము, నవమస్కంధము.