Jump to content

మహర్షుల చరిత్రలు/వ్యాఘ్రపాదమహర్షి

వికీసోర్స్ నుండి

మహర్షుల చరిత్రలు

వ్యాఘ్రపాదమహర్షి

పూర్వము కృతయుగమున మహాతపశ్శాలియు, వేద వేదాంగి విదుఁడును, ధర్మప్రవచనదక్షుఁడు నగునొక మహాముని యుండెను. ఆతఁడు కామక్రోధమదమాత్సర్యాదు లనుజంతువులయెడ భయంకర వ్యాఘ్రమువలెఁ జరించువాఁడు. అందుచే నాతనికి వ్యాఘ్రుఁ డను పేరు కలిగెను. అంతేకాక, ఆతనిపాదములు వ్యాఘ్రపాదములవలె నుండుటచేత నాతఁడు వ్యాఘ్రపాదుఁ డనియుఁ బేరందెను.

వివాహము

వ్యాఘ్రపాదుఁడు యుక్తవయస్సు రాఁగానే తపశ్శూరుఁడు, అధ్యయనశీలుఁడు, శమదమాదిగుణాన్వితుఁడు నయి యొకమునికన్యకను వివాహమాడి గృహస్థధర్మములను నిర్వర్తింపఁ గడంగెను. గృహస్థాశ్రమమున నాతఁడు యజనయాజనాధ్యయనాధ్యావనముల తోడను, అప్రతిగ్రహవ్రత పాలనముతోడను కాలము గడపుచుండెను.

సంతానము

ఇట్లుండ నాతని ధర్మపత్ని యాతనిదయకుఁ బాత్రురాలై తొలి చూలున ఉపమన్యు వను కుమారుని, మలిచూలున ధౌమ్యుఁ డనుకుమారుని గాంచి వారి నల్లారుముద్దుగాఁ బెంచుకొనుచుండెను. వారు బాల్యముననే తల్లి యనుమతిం గొని పరమేశ్వరుని గుఱించి ఘోరతప మొనరించి యాతనిం బ్రత్యక్షము చేసికొనిరి. పరమశివు కరుణ వడసి ఉపమన్యువు మహాజ్ఞాని మహాయోగి యయ్యెను. ధౌమ్యుఁడు మహర్షియై పాండవ పురోహితుఁ డయ్యెను.

వ్యాఘ్రపాదుఁడు కాశీవిశ్వేశ్వరుని కరుణవడయుట

ఒకప్పుడు వ్యాఘ్రపాదుఁడు కాశికాపట్టణముఁ జేరి విశ్వేశ్వరుని సందర్శించి నిరుపమాన మగుభక్తితో నిట్లు స్తుతించెను :

"గంగాతరంగ కనీయ జటాకలాపం
 గౌరీ నిరంతర విభూషిత వామభాగమ్,
 నారాయణప్రియ మనంగ మదాపహారం
 వారాణసీ పురపతిం భజ విశ్వనాథమ్.

 వాచామగోచర మమేయ గుణస్వరూపం
 వాగీశవిష్ణు సురసేవిత పాదపీఠమ్,
 వామేన విగ్రహభరేణ కళత్రవంతం
 వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్.

 రాగాది దోషరహితం సుగుణానురాగం
 వైరాగ్య శాంతినిలయం గిరిజా సహాయమ్,
 మాధుర్యధైర్య నిలయం గరళాభిరామం
 వారాణసీ పురపతిం భజ విశ్వనాథమ్.

 తేజోమయం సకలనిష్కళ మద్వితీయం
 ఆనందకంద మపరాజిత మప్రమేయమ్,
 నానాత్మకం సగుణనిర్గుణ మాదిదేవం
 వారాణసీపురవతిం భజ విశ్వనాథమ్.

 భూతాధిపం భుజగపుంగప భూషితాంగం
 వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రమ్,
 పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం
 వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్.
 
 ఆశాం విహాయ పరిహృత్య పరస్వనిందాం
 పాపే రతిం చ వినివార్య మనస్సమాధౌ,
 ఆధార హృత్కమలమధ్య గతం పరేశం
 వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్.

 శీతాంశుశోభిత కిరీట విరాజమానం
 ఫాలేక్షణానల వినాశిత పంచబాణమ్,
 నాగాధిపారచిత భాసుర కర్ణ పూరం
 వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్,

 పంచాననం దురితమ త్తమతంగజానాం
 నాగాంతకం దనుజపుంగవ పన్న గానామ్,
 దావానలం మరణశోక భయాటవీనాం
 వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్. "

[వారాణసీపురపతేః పరమేశ్వరస్య
 వ్యాఘ్రోక్త మష్టక మిదం పఠతే మనుష్యః,
 విద్యాశ్శ్రియం విపులసౌఖ్య మనంతకీర్తిం
 సంప్రాప్య దేహవిలయే అభతే చ మోక్షమ్.]

వ్యాఘ్రపాదుని భక్తిభరితసం స్తవమున కలరి విశ్వేశ్వరుఁ డాతనికి సాక్షాత్కరించి కోరినవరము లొసంగి యనుగ్రహించెను.

వ్యాఘ్రపాదస్మృతి

ఒకప్పుడు మహర్షు లనేకులు వ్యాఘ్రపాదుని కడకు విచ్చేసి వేద విదులలో నగ్రగణ్యుఁడు, హుతాగ్ని హోత్రుఁడు, సర్వశాస్త్రవిదుఁడు నగు నాతనిని "మునీంద్రా! సర్వలోకహితముఁ గోరి మాకు ధర్మ సంగ్రహమును వివరింపుము" అని కోరిరి. అందులకు వారి నభినందించి “ఋషులారా! మీకు నేను యథాశక్తి సర్వముఁ దెలిపెదను. సావధానులై వినుఁడు ” అని యిట్లు చెప్పఁ దొడంగెను !

“ఏ యే యుగములం దే యే ధర్మములు చెప్పఁబడినవో వాని నన్నిటిని శ్రద్దగాఁ బరిశీలింపవలయునే కాని యా ధర్మములను గాని యా ధర్మ ప్రవక్తలను గాని యెంతమాత్రము నిందింపరాదు. వైశ్వదేవ మొనర్పక భుజించు బ్రాహ్మణుఁడు కాకియై పుట్టును. బ్రహ్మచారి, గృహస్థుఁడు, యతి, వానప్రస్థుఁడు - వీరికొఱకై నే నీ ధర్మశాస్త్రమును ప్రవ చించెదను. ఎవఁడు బ్రాహ్మణుఁడై పుట్టి వేదవిద్య నాదరించి పఠింపఁడో వాఁ డాజీవితము శూద్రసముఁడే యగును. ఏబ్రాహ్మణుఁడు పితృ . ప్రీతికై పిండదానము, తిలతర్పణము నొనరింపఁడో, వాఁడు శూద్రుఁడే యగును.

తూర్పుగాఁ దిరిగి కాని ఉత్తరముగాఁ దిరిగి కాని బ్రాహ్మణుఁ డాచమింపవలయును. పశ్చిమముగాఁ దిరిగి మరల నాచమించి దక్షిణముగాఁ దిరిగి స్నానము చేయవలయును. గోకర్ణకృతహస్తమున మాషమాత్రజలమునే ఆచమనమువేళఁ గైకొనవలయును. అంత కెక్కువై నను, దక్కువై నను ఆ జలము జలముకాదు: రుధిరసమ మగును. మిక్కిలి చల్లనివి, వేఁడివి, నురుఁగులతోఁ గూడినవి కాని జలమును బ్రాహ్మణుఁడు బ్రహ్మతీర్థముగా భావించి దృష్టిపూతముఁ గావించి యాచ మింపవలయును. త్రాగఁగా మిగిలిన జలము, కాళ్ళు కడుగుకొనఁగా మిగిలిన నీరు, వీని నాచమింపరాదు. "శ్రాద్ధవిషయిక విధివిధానముల ననంతముగా నాతఁడు తెలిపెను. ఈధర్మము లన్నియు ““వ్యాఘ్రపాద స్మృతి" యనఁ బరగుచున్నవి.