Jump to content

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము/మొదటి ప్రకరణము

వికీసోర్స్ నుండి

శుభమస్తు

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్

స్వీయ చరిత్రము.

మొదటి ప్రకరణము.


మానాయనమ్మకు నాయందు మిక్కిలియిష్టము. శైశవమునందు నాకు సర్వమును ఆమెయే అయి ఉండెను. నిద్రించుట, కూర్చుండుట, భుజించుట, అన్నియును నేనామెవద్దనే. ఆమె ఎప్పుడు కాళీ ఘట్టమునకు పోయినను ఆమెతోగూడ నేనును పోవువాడను. నన్ను విడిచి ఆమె జగన్నాధ క్షేత్రమునకును బృందావనమునకును వెడలి నప్పుడు నేను వెక్కి వెక్కి ఏడ్చితిని. ధర్మమునందామెకు మిక్కిలి నిష్ఠయుండెను. అనుదినమును ఆమె ఉదయముననే గంగాస్నానము చేయుచుండెడిది. ప్రతిదినమును సాలగ్రామమునకు స్వహస్తములతో పుష్పమాల గ్రుచ్చుచుండెడిది. అప్పుడప్పుడామె ఉదయాస్తమయములు సాధనలో మునిగియుండెడిది. సూర్యుడుదయించినది మొదలు అస్తమించు వరకును సూర్యునకు అర్ఘ్యప్రదానము చేయుచుండెడిది. ఆసమయములలో ‘డాబా’ మీద ఎండలో నేనును ఆమెతో నుండెడివాడను. “జబాకుసుమ సంకాశం కశ్యపేయ మహాద్యుతిః” అనుసూర్యార్ఘ్య ప్రధానమంతము వినగవినగ నాకుకూడ అభ్యాసనుయ్యెను.

ఒక్కొక్క రోజున ఆమె హరివాసరోత్సవము సల్పుచుండెడిది. అప్పుడు రాత్రి అంతయు హరికథలు భజనలు జరుగుచుండెడివి. ఆశబ్దమువల్ల నాకు నిద్రపట్టకుండెడిది. గృహకృత్యములు చాలవరకు ఆమెయే స్వయముగా నిర్వహించుచుండెను. ఆమె కార్యదక్షతవలన గృహకృత్యములన్నియు సుశృంఖలముగా సాగుచుండెను. ఇంటివారందరును భుజించిన పిమ్మట ఆమె స్వహస్తపాకము భుజించుచుండెను. నేనును ఆహవిష్యాన్నములో భాగము పొందువాడను. భోజనముకన్న నాకీప్రసాదమే ఎక్కువయిష్టముగా నుండెడిది. మా అవ్వకు ధర్మమునందెంత యాసక్తి యుండెనో, కార్యనిర్వహణము నందెంత నైపుణ్యముండెనో ఆమె శరీరముకూడ అంత సౌందర్యముగ నుండెను. వైష్ణవ గోసాయీలు తరుచువచ్చుచుంచుట ఆమెకిష్టము లేకుండెను. ధర్మము యెడల అంధవిశ్వాసముతో బాటు ఆమెకు కొంత స్వాతంత్ర్యముకూడ యుండెను. గోపీనాధ ఠాకూరును చూచుటకు మాపురాతన గృహమున కామెతో వెళ్ళుచుండువాడను. కాని ఆమెను విడిచి మాత్రము బయట గదుల లోనికైనను వచ్చుట కిష్టము లేకుండెడిది. ఆమె యొడిలో కూర్చుండి గవాక్షము ద్వారా శాంతభావముతో సమస్తమును చూచుచుండెడి వాడను.

ఇప్పుడింక మాయవ్య లేదు, కాని ఎంతయో కాలమునకు, ఎంతయో అన్వేషించిన పిమ్మట, నేటికీ అవ్వల కెల్ల నవ్వయగు లోక మాతను కనుగొని ఆమె క్రోడమున కూర్చుండి జగత్తు యొక్క లీలను తిలకించుచున్నాను.

మా నాయనమ్మ తను చనిపోవుటకు కొలది దినముల పూర్వము, “నాకున్నదంతయు నీకుతప్ప వేరెవ్వరికిని యివ్వన” ని నాతో జెప్పెను. పిమ్మట ఆమెపెట్టె తాళము చెవి నా చేతికిచ్చెను. పెట్టె తెరచిచూడగా అందులో నాకు కొన్ని రూపాయలు మొహరీలు, కనబడెను. అపుడు నేనందరతో ‘నాకు అటుకులు మరమరాలు దొరకెన’ ని చెప్పితిని. 1835 వ సంవత్సరమున మఅవ్వ యొక్క అంత్య దినములలో మాతండ్రిగారు అలహాబాదునకు సంచారము వెడలిరి. ఇంతలో ఆమెకు దేహమునందస్వస్థత ప్రవేశించెను. వైద్యుడువచ్చి రోగినింక గృహమునందుంచ కూడదని చెప్పెను. కావున ఆమెను గంగానదీ తీరమునకు గొని పోవుటకు మావారలు యత్నముచేయ నారంభించిరి. కాని మాయవ్వకింకను బ్రతుకవలెనని యుండెను. గంగకుపోవుట కామె యిష్టపడలేదు. “ద్వారకానాధుడింటివద్ద నున్నచో నన్నిట్లు బయటకు గొనిపోవ గలిగియుందురా?” అనెను. కాని ఆమాటలు చెవిని బెట్టక ఆమెను గంగాతీరమునకు గొనిపోయిరి. “నామాటలు వినక నన్నిచటకు గొనివచ్చి మీరు నాకెట్లు కష్టమును గలిగించిరో అట్లే నేనును మీకందరకు విశేషకష్టముకలుగ జేసెదను; నేను త్వరలో మరణము నొందను” అనెను. ఆమెను గంగాతీరమున ఒక తాటియాకు పాకలో నుంచిరి. ఆమె మూడు రాత్రులారీతిగ జీవించి యుండెను. ఆ సమయమున గంగాతీరమున సర్వదా నేనామెవద్దనే యుండువాడను.

మాఅవ్వ చనిపోవుటకు పూర్వపు రాత్రి ‘నింతోలాఘాట్’•[1] వద్ద నేను ఆసాల ముందొక చాపపై కూర్చుంటిని. నిండుపున్నమరేయి. ఆకసమున వెన్నెల వెదజల్లుచు చల్లని చందమామ. చెంతనే స్మశానము. అత్యుత్సాహముతో నీశ్వరనామ సంకీర్తనగావింపబడుచుండెను. “ఆహా! ఇటువంటిదినమెన్నడైన వచ్చునా, హరినామస్మరణతో ప్రాణము పోవుచున్నది!” [2]t

ఆనిశాసమయ మందమారుతము నధివసించి ఈగీతములు చల్లగ నావీనుల చేరుచుండెను. అకస్మాత్తుగ నామనసునందొక వింతయైన ఉదాసభావ ముదయించెను. నేను పూర్వపు మనుజుని కానట్లు నాకు దోచెను. ఐశ్వర్యమునందొక్కమారువిముఖత్వము జనించెను. నేను కూర్చుండియుండిన ఆతాటియాకు చాపముందు రత్నకంబళములు, చీని చీనాంబరములు ఏహ్యములుగ దోచెను, మనసునందు మున్నెన్న డెరుంగని నూతనానంద మొకటి యుద్భవించెను. అప్పటికి నావయసు పదునెనిమిదేండ్లు.

రెండవ ప్రకరణము.

ఇంతవరకును నేను విలాసము యొక్క ఆమోదములో మునిగి యుంటిని. తత్వజ్ఞానమును గురించి అణుమాత్రమయిన నాలోచింపలేదు. ధర్శమన నేమియో, ఈశ్వరుడన నేమియో నా కేమియు తెలియదు. ఏమియు నేర్చికొనలేదు. కానినాడు స్మశానవాటిక యందు నేను పొందిన సహజస్వాభావిక ఆనందమును నామనసునందింక ఉంచుకొనలేకపోతిని. భాష సర్వవిధముల దుర్బలమైనది. నేను పొందిన ఆనందమును లోకులకు దెల్పుటెట్లు? అది స్వాభావికానందము. తర్కము వల్లను యుక్తి వల్లను దాని నెవ్వరును పొందజాలరు. దానిని మానవహృదయముల ప్రవహింప జేయుట కీశ్వరుడే తరుణమును వెదకుచుండును. ఇట్లు సమయమును కనిపెట్టి దానిని నాకుదయచేసి యున్నాడు. ఇక ఈశ్వరుడు లేడని యెవడు చెప్పగలడు? ఇదియే ఆయన ఆస్తిత్వ ప్రమాణము. ఇట్టి యానందము పొందుటకు నేను సంసిద్ధుడనై యుండలేదుగదా. మరి నేనెక్కడనుండి దీనిని పొందితిని?

ఈ ఆనంద భావముతోను ఔదాస్య భావముతోను రాత్రి రెండు జాముల వేళ ఇల్లు చేరితిని. ఆరాత్రి నాకింక నిద్రదపట్ట లేదు. అట్లు, నిద్రరాకుండుట కాయానందమే కారణము. రాత్రియంతయు ఈ ఆనం

  1. కలకత్తానందలి స్మశానవాటికలలో ముఖ్యమైనది.
  2. " ఏమొ౯ది౯ కిహాబే, హరినామ్ బొలియాప్రాణ్ జాబే ,,