Jump to content

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/శిష్యుడు, గురువు

వికీసోర్స్ నుండి

6. శిష్యుడు, గురువు

"నేను ఫలానా గురువుకి శిష్యుణ్ణని నాతో చెప్పారు" అంటూ ప్రారంభించారాయన . "మీరేమంటారు? దీన్ని గురించి మీ అభిప్రాయం ఏమిటో నిజంగా తెలుసుకోవాలని ఉంది నాకు. నేను ఆ సమాజానికి చెందిన వాణ్ణని మీకు తెలుసును. ప్రవేశ దశలో ఉన్నవారిలో ఉత్తముడిగా అయే అవకాశం నాకు ఈ జన్మలో ఉందని అంతఃప్రభువులకు ప్రతినిధులైన బాహ్య అధికారులు చెప్పారు నాతో." ఆయన దాన్ని చాలా మనఃపూర్వకంగా నమ్మాడు. మేము చాలాసేపు మాట్లాడుకున్నాం.

ప్రతిఫలం అనేది ఏ రూపంలో లభించినా అత్యంత సంతోష దాయకమే. ముఖ్యంగా ప్రాపంచిక పదవులను లక్ష్యం చేయని వారికీ, మామూలు ప్రపంచంలో జయం సాధించలేని వారికీ, మహోన్నత స్థితికి పురోగమించిన ఒక ఆధ్యాత్మిక జీవి ప్రత్యేకంగా స్థాపించిన సమాజానికి చెంది ఉండటం అనేది చాలా తృప్తి కలిగించే విషయం. సహజంగా, వారు చెప్పినదంతా చేసినందరకూ, అవసరమైన త్యాగాలన్నీ చేసినందుకూ తగిన ప్రతిఫలం ముట్టవలసిందే. ప్రతిఫలం అంటే మామూలుగా ఏదో ఇచ్చినట్లు కాక, వారి ఆధ్యాత్మిక పురోగతిని ప్రశంసించటమో, లేక బాగా సమర్థవంతంగా నడపబడుతున్న సంస్థలో బాగా పని చేస్తే మరింత బాగా పని చేయటానికి వారి పనిని మెచ్చుకోవటమో లాంటిది.

అభివృద్ధిని ఆరాధించే ప్రపంచంలో ఈ రకమైన ఆత్మపురోభివృద్ధిని ఎవరైనా అర్ధం చేసుకుంటారు. ప్రోత్సహిస్తారు. కాని, మీరు ఒక గురువుకి శిష్యుడు అని ఎవరో చెబితే వినటమో, లేక స్వయంగా అనుకోవటమో ఎన్నో రకాలైన అసహ్యకరమైన స్వలాభపూరిత ప్రయత్నాలకు దారితీస్తుంది. దురదృష్టవశాత్తూ, ఇతరుల నుంచి స్వలాభాన్ని ఆశించేవారూ, వారి స్వలాభానికి గురి అయేవారూ కూడా తమ పరస్పర అనుబంధానికి మురిసిపోతూ ఉంటారు. ఈవిధంగా విస్తృతమయ్యే ఆత్మ తృప్తినే ఆధ్యాత్మిక పురోగతి అంటూ ఉంటారు. ముఖ్యంగా, శిష్యుడికీ గురువుకీ మధ్య కొందరు మధ్యవర్తులున్నప్పుడు, అందులోనూ గురువు మరో దూరదేశంలో ఉండి సులభంగా అందుబాటులో లేనప్పుడు పరిస్థితి మరింత అసహ్యకరంగానూ, దుర్భరంగానూ ఉంటుంది. ఈ అందుబాటులో లేకపోవటం, సూటిగా చేరలేకపోవటం ఆత్మ వంచనకూ అమాయకపు భ్రాంతికీ దారితీస్తుంది. ఇటువంటి భ్రాంతిని గడుసువాళ్ళూ, కీర్తికాంక్షా, అధికార కాంక్షా ఉన్నవాళ్ళూ తమ స్వలాభానికి అపయోగించుకుంటారు.

నమ్రత లేనప్పుడే ప్రతిఫలం, శిక్షా ఉంటాయి. ఆధ్యాత్మిక సాధనం వల్లనూ, ప్రాపంచిక విషయాలను త్యజించటం వల్లనూ సాధించే అంతిమ లక్ష్యం కాదు నమ్రత. నమ్రత సాధన చేసి పొందే గుణం కాదు; అభ్యాసంవల్ల సాధించేదీ కాదు. అలవరచుకున్న గుణం సద్గుణం ఏనాటికీ కాదు; అది కేవలం ఒక సాధించిన విజయం అవుతుంది, మీ గొప్పల పట్టికలో మరొక అంశం అవుతుంది. అంతే. సద్గుణాన్ని అలవరచుకోవడం అంటే అహాన్ని త్యజించడం కాదు. అహం ఉన్నదని స్పష్టంగా గ్రహించటం.

నమ్రతకి పైవాడు, క్రిందివాడు, గురువు, శిష్యుడు అనే భేదం తెలియదు. గురువుకీ శిష్యుడికీ మధ్యా, సత్యానికీ మీకూ మధ్యా విభజన ఉంటే అవగాహన అవటం సాధ్యంకాదు. సత్యాన్ని అర్ధం చేసుకోవటంలో గురువూ లేడూ, శిష్యుడూ లేడు, పురోగమించినవాడూ లేడు. అధోగతిలో ఉన్నవాడూ లేడు. గతించిన క్షణం యొక్క భారం గాని చిహ్నంగాని లేకుండా ఉన్నదానిని, అంటే వర్తమానాన్ని అనుక్షణమూ అర్థం చేసుకోవటమే సత్యం.

ప్రతిఫలం, శిక్ష అనేవి అహాన్ని శక్తియుతం చేసి నమ్రతను తోసి వేస్తాయి. నమ్రత ప్రస్తుతంలో ఉండాలి. భవిష్యత్తులో కాదు. మీరు నమ్రతగా అవబోవటం అనేది సాధ్యంకాదు. అవబోతున్నారంటేనే అహానికి ప్రాధాన్యాన్ని ఇవ్వటం కొనసాగిస్తున్నారని అర్ధం. అంటే సద్గుణాన్ని కలిగి ఉండటాన్ని ప్రస్తుతానికి విరమించుకున్నట్లేకదా. ఎప్పుడో జయం సాధించాలనీ, ఏదో అవాలనే కాంక్ష ఎంత బలమైనది! విజయం, నమ్రత ఒకచోట ఎలా ఉంటాయి? కాని, ఆధ్యాత్మికంగా స్వలాభం కోసం ఇతరులను ఉపయోగించుకునేవారూ, వినియోగింపబడేవారు కూడా చేస్తున్నదదే. అందులోనే సంఘర్షణ, దుఃఖమూ ఉంటాయి.

"అంటే, గురువు అనేవాడు లేడనీ, నేను శిష్యుణ్ణి అనుకోవటం కేవలం భ్రాంతి అనీ, కల్పన అనీ మీ ఉద్దేశమా?" అని అడిగాడాయన.

గురువు ఉన్నాడా లేడా అన్నది అల్ప విషయం. స్వలాభం కోసం ఇతరులను ఉపయోగించుకొనే వారికీ, రహస్య సంఘాలకీ, శాఖలకీ మాత్రం అది చాలా ముఖ్యమై విషయం. కాని, పరమానందదాయకమైన సత్యాన్నీ అన్వేషించే మనిషికి ఆ ప్రశ్న పూర్తిగా అసందర్భమైనదవుతుంది. గురువూ, శిష్యుడూ ఎంత ముఖ్యమైనవారో ధనవంతుడూ, కూలివాడూ కూడా అంతే ముఖ్యమైనవారు. గురువులున్నారో లేదో, ప్రవేశదశలో ఉన్నవారినీ, శిష్యులనీ తేడాలున్నాయో లేదో ముఖ్యం కాదు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవటమే ముఖ్యం. స్వీయ జ్ఞానం లేకుండా, సహేతుకంగా ఆలోచించడానికి ఆస్కారం లేదు. ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోకుండా సత్యం ఏమిటో ఎలా తెలుసుకోగలరు? స్వీయజ్ఞానం లేకపోతే భ్రాంతి మాత్రమే మిగులుతుంది. మీరు ఇది, మీరు అది అని ఎవరో చెబితే నమ్మటం పసితనం అనిపించుకుంటుంది. ఈలోకంలో గాని, ఇంకోచోట గాని ప్రతిఫలం చూపుతానన్న వాడిని కాస్త జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి.