మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/ధనవంతులు, దరిద్రులు

వికీసోర్స్ నుండి

7. ధనవంతులు, దరిద్రులు

వేడిగానూ, ఉక్కగానూ ఉంది. పట్నవాసపు చప్పుళ్ళతో గాలి నిండి ఉంది. సముద్రం మీంచి వచ్చే గాలి వెచ్చగా ఉంది. తారువాసన, పెట్రోలు వాసనా వేస్తోంది. దూరాన నీటిలో అస్తమిస్తున్న సూర్యుడు ఎర్రగా ఉన్నాడు. ఇంకా వేడి తగ్గేట్లుగా లేదు. గది నిండా మూగిన జనం అప్పుడే వెళ్ళారు. మేము వీధిలోకి వచ్చాం. చిలకలు పచ్చని మెరుపుల్లా వస్తున్నాయి గూటికి చేరుకోవటానికి. పొద్దున్నే ఉత్తరం వైపుకి తోటలూ, పొలాలూ బాహాటంగా ఉన్నచోటికి ఎగిరి వెళ్లాయి. సాయంకాలం తిరిగి వస్తున్నాయి పట్నానికి రాత్రిపూట చెట్లల్లో గడపటానికి. అవి ఎప్పుడూ మెల్లిగా ఎగరవు. ఎప్పుడూ, లక్ష్యం లేనట్లు చప్పుడు చేస్తూ కలకల్లాడుతూ ఉంటాయి. తక్కిన పక్షుల్లా అవి ఎప్పుడూ తిన్నగా ఎగరవు. ఎప్పుడూ ఎడమవైపుకో, కుడివైపుకో తిరుగుతూ హఠాత్తుగా ఏ చెట్టులోనో దూరుతాయి. ఎగురుతున్నంత సేపూ స్తిమితంగా ఉండవు. కాని, ఎర్రటి ముక్కులతో మిసమిసలాడే పచ్చదనంతో కాంతి వెదజల్లుతూ ఎంతో అందంగా ఉంటాయి. అసహ్యకరంగా ఉన్న పెద్ద పెద్ద డేగలు చుట్టూ తిరిగి తిరిగి తాటి చెట్లమీద కుదుట పడ్డాయి రాత్రికి.

ఎవడో పిల్లనగ్రోవిని వాయించుకుంటూ వస్తున్నాడు. నౌకరులా ఉన్నాడు. వాయించుకుంటూనే కొండమీదకి ఎక్కుతున్నాడు. మేము అతని వెనకాతలే నడుస్తున్నాం. అతను పక్కనున్న వీధుల్లో ఒక దాంట్లోకి మళ్ళాడు. ఇంకా వాయిస్తూనే ఉన్నాడు. గొడవ గొడవగా ఉండే పట్టణంలో ఆ పిల్లనగ్రోవి పాట వినటానికి వింతగా ఉంది. దాని శబ్దం గుండె లోతుల్లోనికి చొచ్చుకొని పోతోంది. ఎంతో బాగుంది. ఆ పిల్లనగ్రోవి పాటగాడి వెనకాలే కొంతదూరం వెళ్ళాం. ఎన్నో వీధులు దాటి చివరి కొక పెద్ద వీధిలోకి వచ్చాం. ఈ వీధిలో దీపాలతో వెలుగు బాగా ఉంది. కొద్ది దూరంలో ఎవరో కొంతమంది గుంపుగా రోడ్డుపక్కని కూర్చుని తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నారు. పిల్లనగ్రోవి వాయించేవాడు వాళ్ళదగ్గరికి చేరాడు. మేమూ అదే పని చేశాం. అతను వాయిస్తుంటే మేమూ చుట్టూ కూర్చొని వింటున్నాం. వాళ్ళంతా డ్రైవర్లూ, ఇళ్ళలో పనిచేసే నౌకర్లూ, రాత్రిపూట కాపలా కాసేవాళ్ళూ, కొంతమంది చిన్నపిల్లలూ, ఒకటో రెండో కుక్కలూ. పక్కనుంచి కార్లు పోతున్నాయి. ఒకదాంట్లో అందమైన దుస్తులు వేసుకున్న ఒకావిడ ఒంటరిగా కూర్చునుంది. కారులో దీపాలు వెలుగుతున్నాయి. డ్రైవరు కారు నడుపుతున్నాడు. ఇంకోకారు వచ్చి అక్కడ ఆగిపోయింది. డ్రైవరు దిగివచ్చి మాతోబాటు కూర్చున్నాడు. వాళ్ళంతా కబుర్లు చెప్పుకుంటున్నారు సరదాగా నవ్వుతూ, చేతులూపుతూ, పిల్లనగ్రోవి మీద పాట మాత్రం తొట్రుపడలేదు. ఎంతో ఆనందదాయకంగా ఉంది.

అంతలో మేము అక్కణ్ణించి లేచి సముద్రం వైపుకి వెళ్ళే రోడ్డు మీదుగా, దీపాలతో వెలుగుతున్న ధనవంతుల ఇళ్ళను దాటుకుంటూ బయలుదేరాం. ధనవంతులు వారి ప్రత్యేక వాతావరణంలో వారు ఉంటారు. ఎంత సంస్కృతి ఉన్నప్పటికీ, ఎంత అసాధారణంగా ఉన్నప్పటికీ, సంప్రదాయం, పై మెరుపూ ఉన్నప్పటికీ, ధనవంతుల్లో, లోతు తెలియనంత విశ్వాసపూరితమైన గాంభీర్యం, చెక్కు చెదరని స్థైర్యం, అభేద్యమైన కాఠిన్యం ఉంటాయి. వారు ధనాన్ని సొంతం చేసుకోవటం కాదు, ధనమే వారిని సొంతం చేసుకుంటుంది. అది మరణం కన్న అధమస్తమైనది. వారి అహంభావమే వారి ధర్మబుద్ధి. తమ సంపదకు తాము రక్షకుల మనుకుంటారు. వారు దానాలు చేస్తూఉంటారు. ధర్మ సంస్థలు స్థాపిస్తూ ఉంటారు. అన్నిటినీ నిర్వహించేదీ, నిర్మించేదీ, ధారపోసేదీ వారే. క్రైస్తవ మందిరాలూ, దేవలయాలూ నిర్మిస్తారు. కాని వారి దేవుడు బంగారం దేవుడు. ఇంత దారిద్ర్యం, ధైన్యం చుట్టూ ఉండగా ధనవంతులుగా ఉండటానికి ఎవరైనా బాగా మోటుతేరి ఉండాలి. వారిలో కొంతమంది ప్రశ్నలు వెయ్యటానికీ, చర్చించటానికీ, సత్య శోధనకీ వస్తూ ఉంటారు. దరిద్రులకు మల్లేనే ధవవంతులకి కూడా సత్యాన్వేషణ అతి కష్టం. దరిద్రులు, ధనం, అధికారం సంపాదించాలని తాపత్రయ పడుతుంటారు. ధనవంతులు తాము పన్నిన వలలో తామే చిక్కుకుని ఉంటారు. కాని వారి నమ్మకాలు వదలుకోకుండా ఆ దారినే సాగిపోతూ ఉంటారు. వర్తక సామగ్రితోనే గాక దైవంతో కూడా వారు వ్యాపారం చేస్తారు. రెండింటితోనూ వినోదిస్తారు. కాని విజయం సాధించేది వారు కోరుకున్న విషయాల్లోనే. వారి నమ్మకాలూ, పూజలూ, వారి ఆశలూ, భయాలూ - వాటికి సత్యంతో ఎలాంటి సంబంధమూ లేదు. వారి హృదయాల్లో శూన్యం తప్ప ఏమీ లేదు. పైకి ఎంత డాబుగా ఉంటే లోపల అంత దారిద్ర్యం ఉంటుంది.

సంపద, సుఖం, హోదా - వీటిని వదలిపెట్టటం అంతకష్టమేమీ కాదు. కాని, ఎదో ఉండాలనీ పడే తాపత్రయాన్నీ వదిలిపెట్టాలంటే విశేషమైన తెలివీ, అవగాహనా కావలసి ఉంటుంది. సంపదవల్ల వచ్చే అధికారం సత్యాన్ని గ్రహించకుండా ఎలా ఆటంకం కలిగిస్తుందో అలాగే ప్రతిభా సామర్థ్యాల శక్తి కూడా ఆటంకం కలిగిస్తుంది. ఈ విధమైన ఆత్మవిశ్వాసం స్వార్ధచింతన వల్ల ఏర్పడేదే. కష్టమైనప్పటికీ, ఇటువంటి ఆత్మవిశ్వాసాన్నీ, శక్తినీ త్రోసి పుచ్చటం సాధ్యమే. ఇంతకన్న ఎంతో అస్పష్టమైనదీ, పైకి కనిపించనిదీ - ఏదో అవాలన్న తాపత్రయంలో ఉండే శక్తి, ఉత్సాహం. అహాన్ని పెంపొందించుకోవడం - ఏరూపంలోనైనా సరే - సంపదతో గాని, సద్గుణంతో గాని అది సంఘర్షణా ప్రక్రియే. దానివల్ల కలిగేది ద్వేషం, గందరగోళం. ఏదో అవాలనే తాపత్రయంతో నిండిన మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండలేదు. ప్రశాంతత సాధన వల్ల గాని, సమయానుకూలంగా గాని లభించేది కాదు. అవగాహనలోనే ప్రశాంతత ఉంటుంది. ఏదో అవాలనే కోరిక అవగాహన కానివ్వదు. ఏదో అవాలనుకోవటం సమయాభావాన్ని కలుగచేస్తుంది. అంటే, నిజానికి, తక్షణం అవగాహన చేసుకోకుండా ముందుకి నెట్టటమే. "ఫలానాగా అవుతాను" అనే భ్రాంతి అహానికి ప్రాధాన్యం ఇవ్వటం వల్లనే కలుగుతుంది.

పట్టణంలాగే సముద్రంకూడా అల్లకల్లోలంగా ఉంది. కాని దీని కల్లోలంలో నిగూఢత్వం ఉంది, నిండుతనం ఉంది. ఆకాశంలో నక్షత్రం కనిపిస్తోంది. మేము వెనక్కి మళ్ళి, బస్సులూ, కార్లూ మనుష్యులతో హడావిడిగా ఉన్న ఒక వీధిలోనుంచి నడుచుకుంటూ వెళ్ళాం. వీధి పక్కని ఒకచోట ఒకడు ఒంటిమీద బట్టలు లేకుండా పడుకున్నాడు. ముష్టివాడు. బాగా అలసిపోయి, బొత్తిగా తిండి లేకుండా ప్రాణావశిష్టంగా ఉన్నాడు. అతణ్ణి లేపటం కష్టం. ముందుకి పోతే పచ్చని గడ్డితో నిండిన ప్రదేశాలూ, పబ్లిక్ గార్డెన్లో రంగు రంగుల పువ్వులూ ఉన్నాయి.