మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/వివేకం పోగుచేసుకునే జ్ఞానం కాదు
81.వివేకం పోగుచేసుకునే జ్ఞానం కాదు.
కుటీరం ఎత్తుగా పర్వతాలపైన ఉంది. అక్కడికి చేరటానికి కారులో బంజరు భూమి దాటి ఎన్నో ఊళ్లమధ్యనుంచీ, చక్కని తోటల్లోంచీ, చిక్కని పొలాల్లోంచీ వెళ్లాలి. నీటి సదుపాయం చేసి కష్టపడి పనిచేసే సాగుచేసిన బంజరులో పెంచిన తోటలు,పొలాలు అవి. అందులో ఒక ఊరు మరీ ఆహ్లాదకరంగా ఉంది. పచ్చని మైదానాలతో, పెద్ద పెద్ద నీడనిచ్చే చెట్లతో;దగ్గరలోనే ఒక నది ఉంది. అది దూరాన ఉన్న పర్వతాల్లోంచి బయలుదేరి బంజరు మధ్యదాకా వస్తుంది. ఈ ఊరుకి అవతల నదీ జలపాతం వైపు నుంచి వెళ్లేదారి మంచుశిఖరాలవరకూ దారితీస్తుంది. ఇక్కడ నేలంతా రాళ్లు, బోడిగా ఎండకు మాడి ఉన్నాయి.నదీ తీరాల పొడుగునా మాత్రం చెట్లున్నాయి. దారిలోపలికీ పైకి మలుపులు తిరుగుతూ పైకంటా పోతోంది, పురాతనమైన సరుగుడు చెట్లతో నిండిన అడవుల మధ్య నుంచి. ఎండ వాసన వేస్తోంది వాటినుంచి. గాలి చల్లంగా, స్వచ్ఛంగా అయింది.త్వరలోనే కుటీరానికి చేరుకున్నాం.
రెండురోజులయాక, మాకు బాగా అలవాటు పడిన తరువాత ఒక ఎరుపు, నలుపు రంగుల చారలున్న ఉడత వచ్చి కిటికీలో కూర్చుని మమ్మల్ని చూసి అరుస్తూ ఉండేది. దానికి పప్పులు కావాలి. అక్కడికి చూడటానికి వచ్చిన ప్రతివారు తినిపించి ఉంటారు దానికి. ఇప్పుడు చూడటానికి వచ్చేవాళ్లు చాలా తక్కువ, వచ్చే శీతాకాలనికి దాచుకోవాలని అది ఆత్రుత పడుతోంది. అది చాలా చురుకుగా ఉత్సాహంగా ఉండే ఉడత. అది ఎప్పుడూ కూడబెట్టటానికి సిద్ధంగా ఉంటుంది, ముందు రాబోయే చల్లని మంచు నిండే నెలల కోసం. దాని నివాసం ఒక చెట్టు తొర్రలో ఉంది. అది ఎండిపోయి చాలా ఏళ్లయి ఉంటుంది.ఒక పప్పు ని చటుక్కున నోటకరచుకొని ఆ పెద్ద చెట్టు మొదలువైపుకి పరుగెత్తి చప్పుడు చేస్తూ పైకెక్కుతూ, అరుస్తూ, బెదిరిస్తూ ఆ కన్నంలోికి దూరిపోతుంది. మళ్లీ ఎంత వేగంగా దిగి వస్తుందంటే జారి క్రిందపడి పోతుందేమోననిపిస్తుంది. కాని ఎప్పుడూ పడలేదు. ఒక ఉదయం దానికి ఒక సంచీడు పప్పులు ఇస్తూ గడిపాం. అది ఎంతో స్నేహంగా అయి బాగా గది లోపలి దాకా వచ్చేది. దాని బొచ్చు మెరుస్తూ, దాని పెద్ద పూసల్లాంటి కళ్లు మిలమిల లాడుతుండేవి. దాని పంజాలు మొనదేరి ఉన్నాయి. దానితోక కుచ్చులా ఉంది. అది ఆనందంగా బాధ్యతాయుతంగా ఉన్న చిన్న జంతువు, అది ఆ చుట్టు పక్కల ఉన్నదాన్నంతా సొంతం చేసుకున్నట్లుగా ఉంది. ఎందుకంటే అది తక్కిన ఉడతల్ని అక్కడికి రాకుండా దూరంగా ఉండేట్లు చేసింది.
ఆయన సరదాగా ఉన్నాడు. వివేకంకోసం ఆత్రుత పడుతున్నాడు. దాన్ని ఆ ఉడత పప్పులు పోగుచేసుకున్నట్లుగా సేకరించాలనుకుంటున్నాడు. బాగా డబ్బున్నవాడు కాకపోయినా ఆయన చాలా చోట్లకే వెళ్లి ఉంటాడు. ఎందుకంటే, ఆయన ఎన్నో దేశాల్లో ఎంతోమందిని కలుసుకున్నట్లుగా కనిపిస్తున్నాడు. బాగా చదివినట్లు కూడా కనిపిస్తున్నాడు. గ్రీకు భాషలో బాగా చదవగలడన్నట్లు చెప్పాడు. సంస్కృతంలో కూడా స్వల్ప పరిజ్ఞానం ఉంది. ఆయనకి ముసలితనం వస్తోంది. అందుకని వివేకాన్ని సేకరించచాలని ఆత్రుత పడుతున్నాడు.
వివేకాన్ని సేకరించగలరా ఎవరైనా? "ఎందుకు వీలుకాదు? అనుభవమే మనిషిని వివేకవంతుణ్ణి చేస్తుంది. వివేకం ఉండటానికి జ్ఞానం ముఖ్యావసరం."
పోగుచేసుకున్న మనిషి వివేకవంతుడు కాగలడా?
"జీవితమంటేనే పోగుచేయటం. వ్యక్తి గుణం క్రమక్రమంగా రూపొందుతుంది. మెల్లిగా వికసిస్తుంది. అనుభవం అంటే జ్ఞానాన్ని కూడబెట్టుకోవటమే కదా. ఏది అర్థం చేసుకోవాలన్నా జ్ఞానం అత్యవసరం."
జ్ఞానంతోనూ, అనుభవంతోనూ అవగాహన కలుగుతుందా? జ్ఞానం అనుభవ శేషం, గతాన్ని సేకరించటం; జ్ఞానం, అనుభవం ఎప్పుడూ గతమే. గతం ఎప్పటికైనా అవగాహన చేసుకోగలదా? ఆలోచన నిశ్శబ్దంగా ఉన్న విరామసమయాల్లో కాదా అవగాహన కలిగేది? ఆ విరామ స్థలాన్ని పొడిగించటానికీ, కూడబెట్టటానికీ చేసిన కృషివల్ల అవగాహన కలుగుతుందా?
"సేకరణ లేకపోతే మనమే ఉండం. ఆలోచనకీ, ఆచరణకీ కొనసాగింపే ఉండదు. సేకరణే వ్యక్తి గుణం, సేకరణ సద్గుణం. పోగుచేయకుండా మనం బ్రతకలేం. ఆ కారు నిర్మాణం గురించి నాకు తెలిసి ఉండకపోతే నేను దాన్ని అర్థం చేసుకోలేను. సంగీత క్రమం తెలియకపోతే దాని విలువని నేను లోతుగా తెలుసుకోలేను. లోతులేని వాళ్లే సంగీతాన్ని విని సంతోషిస్తారు. సంగీతం విలువని తెలుసుకోవటానికి అది ఎలా రూపొందిందో, ఎలా సమకూడిందో తెలుసుకోవాలి. తెలుసుకోవటమే సేకరించటం. వాస్తవంగా తెలుసుకోకుండా వాటి విలువను తెలుసుకోలేము. ఏదో ఒక విధమైన సేకరణ అవసరం అవగాహనకి - అదే వివేకం."
కనుక్కోవటానికి స్వేచ్ఛ ఉండాలి, ఉండొద్దా? మీరు బంధింపబడి ఉంటే ఎంతో దూరం పోలేరు. ఏ రకమైన సేకరణ ఉన్నా స్వేచ్ఛ ఎలా ఉండగలుగుతుంది? డబ్బుని గాని, జ్ఞానాన్ని గాని కూడబెట్టిన మనిషి స్వేచ్ఛగా ఎన్నటికీ ఉండలేదు. వస్తువులు కూడబెట్టుకోకుండా మీరు స్వేచ్ఛగా ఉండి ఉండవచ్చు. కాని జ్ఞానంకోసం ఆశపడటం కూడా బంధమే, మిమ్మల్ని పట్టుకొని ఉంటుంది. ఏరకంగా కూడబెట్టినా దానికి కట్టివేయబడిన మనస్సు ఇటూ అటూ ఎంతో దూరం తిరిగి కనుక్కోగలదా? సద్గుణాన్ని సేకరించే మనస్సు సద్గుణాన్ని ప్రదర్శించగలదా ఎన్నటికైనా? ఏదో ఒకటి అవకుండా స్వేచ్ఛగా ఉండటమే సద్గుణం కాదా? వ్యక్తిగుణం కూడా బంధమే కావచ్చు. కాని సద్గుణం ఎన్నటికీ బంధనం కాలేదు. కాని ఏవిధమైన సేకరణ అయినా బంధనే.
"అనుభవం లేనిదే వివేకం ఎలా ఉంటుంది?"
వివేకం ఒకటి, జ్ఞానం వేరొకటి. కూడబెట్టిన అనుభవమే జ్ఞానం. అది కొనసాగే అనుభవం. అదే జ్ఞాపకం. జ్ఞాపకాన్ని పోషించుకోవచ్చు. పటిష్ఠం చేసుకోవచ్చు. మలుచుకోచ్చు, ప్రభావితం చేసుకోవచ్చు; కాని వివేకమంటే జ్ఞాపకం విస్తృత మవటమేనా? కొనసాగింపు ఉండేది వివేకమా? మనవద్ద జ్ఞానం ఉంది, యుగాలనుంచీ కూడబెట్టినది. కాని మనం వివేకవంతులుగా ఆనందంగా సృజనాత్మకంగా ఎందుకులేం? జ్ఞానం ఆనందానికి కారణ మవుతుందా? తెలుసుకోవటం అంటే అనుభవాన్ని సేకరించటం, అనుభవించటం కాదు. తెలుసుకోవటం అనుభవించటానికి ఆటంకాన్ని కలిగిస్తుంది. అనుభవాన్ని సేకరించటం కొనసాగుతూ ఉండే ప్రక్రియ. ప్రతి అనుభవం దీన్ని శక్తిమంతం చేస్తుంది. దానికి ప్రాణాన్ని పోస్తుంది. ఈవిధమైన నిత్య ప్రతిక్రియ జరగకపోతే జ్ఞాపకం రూపుమాసిపోతుంది. ఆలోచనే జ్ఞాపకం, మాట, సేకరించిన అనుభవం. జ్ఞాపకం గతం, చైతన్యం లాగే. ఈ గత భారమంతా కూడితేనే మనస్సు, ఆలోచన. సేకరించబడినది ఆలోచన. ఆలోచన ఎన్నటికైనా కొత్తదాన్ని కనిపెట్టగలదా? అది అంత మొందాలి కొత్తది ఉండాలంటే.
"ఇంతవరకూ అర్థం చేసుకోగలను. కాని ఆలోచన లేకుండా అవగాహన ఎలా కాగలదు?"
అవగాహన గతానికి చెందిన ప్రక్రియా? లేక అది ఎప్పుడూ ప్రస్తుతంలోనే ఉండేదా? అర్థం చేసుకోవటం అంటే ప్రస్తుతం జరిగే కార్యం. అవగాహన ఒక క్షణంలో జరిగేదనీ, దానికి సమయంతో నిమిత్తం లేదనీ మీరెప్పుడూ గమనించలేదా? మీరు క్రమంగా అర్థంచేసుకుంటారా? అర్థం చేసుకోవటం ఎప్పుడూ తక్షణమే, ఇప్పుడే కాదా? ఆలోచన గతంలోంచి వచ్చిన ఫలితం. అది గతం మీద ఆధారపడినది. అది గతం యొక్క ప్రతిక్రియ. గతం కూడబెట్టినది. ఆలోచన సేకరింపబడిన దానికి ప్రతిక్రియ. అలాంటప్పుడు, ఆలోచన ఎలా అవగాహన చేసుకోగలదు ఎప్పటికైనా? అర్థం చేసుకోవటం కావాలని జరిపే ప్రక్రియా? అర్థం చేసుకోవటానికి ప్రత్యేకం పూనుకుంటారా? ఒక సాయంకాలపు అందాన్ని ఆనందించాలని ఎంచుకుంటారా?
"అర్థం చేసుకోవటం చైతన్యంతో చేసే కృషి కాదా?"
చైతన్యం అంటే మన ఉద్దేశం ఏమిటి? మనం చైతన్యంగా ఎప్పుడుంటున్నాం? ఏదైనా ఎదురైనప్పుడు, ప్రేరణ కలిగినప్పుడు. సుఖప్రదమైనది గాని, బాధాకరమైనదిగాని, దానికి జరిగే ప్రతిక్రియేకాదా చైతన్యం అంటే? ఎదురైన దానికి జరిగే ప్రతిక్రియ అనుభవం. అనుభవం అంటే పేరుపెట్టటం, మాటల్లో పెట్టటం, దేనితోనో సంబంధం కలిగి ఉండటం. పేరుపెట్టకుండా ఏ అనుభవమూ ఉండదు, ఉంటుందా? ఎదురువటం, ప్రతిక్రియ, పేరు పెట్టటం, అనుభవం - ఈ మొత్తం ప్రక్రియ అంతా కలిస్తే చైతన్యం, కాదా? చైతన్యం ఎప్పుడూ గతానికి చెందిన ప్రక్రియే. తెలిసిన కృషి, అవగాహన చేసుకోవాలనే ఇచ్ఛ. పోగు చెయ్యాలనీ, ఉండాలనే ఇచ్ఛ కొనసాగుతున్న గతమే. కొంతమార్పుతో కావచ్చు, కాని అప్పటికీ గతమే. ఏదో ఉండాలనీ, ఏదో అవాలనీ మనం ప్రయత్నించటంలో, ఆ ఏదో అనేది మన కల్పనే. మనం అర్థం చేసుకోవటానికి తెలిసి కృషిచేస్తే మనం సేకరించిన వాటి చప్పుడే మనం వింటాం. ఈ చప్పుడే అవగాహనకి ఆటంకం.
"అయితే వివేకం అంటే ఏమిటి?"
జ్ఞానం అంతమైనప్పుడే వివేకం ఉంటుంది. జ్ఞానం కొనసాగుతుంది. కొనసాగింపు లేకపోతే జ్ఞానం ఉండదు. కొనసాగేది ఎప్పటికీ స్వేచ్ఛగా కొత్తగా ఉండలేదు. అంతం ఉన్నదానికే స్వేచ్ఛ ఉంటుంది. జ్ఞానం ఎప్పటికీ కొత్తది కాదు. అది ఎప్పుడూ పాతదవటమే. పాతది కొత్తదాన్ని ఇముడ్చుకుంటూ ఉంటుందెప్పుడూ. అ విధంగా శక్తిని పొందుతూ ఉంటుంది. పాతది అంతం అవాలి కొత్తది ఉండాలంటే.
"అంటే మీరనేది, ఇంకోరకంగా చెప్పాలంటే, ఆలోచన అంతమవాలి వివేకం ఉండాలంటే, కాని, ఆలోచన అంతమవటం ఎలా?"
ఏ రకమైన శిక్షణ ద్వారా గాని, సాధన ద్వారా గాని, బలవంతంతో గాని ఆలోచన అంతంకాదు. ఆలోచించేవాడే ఆలోచన. తనమీద తానే ప్రయోగించుకోలేడు. అలా చేసుకుంటే అది ఆత్మవంచనే. అతడే ఆలోచన. అతడూ, ఆలోచనా వేరువేరు కాదు. తాను వేరనుకోవచ్చు. వేరుగా ఉన్నట్లు నటించవచ్చు. అది ఆలోచన యొక్క నైపుణ్యతే - తనకు తాను శాశ్వతత్వాన్ని ఆపాదించుకోవటానికి. ఆలోచన ఆలోచనని అంతం చేసుకోవటానికి ప్రయత్నించటం దాన్ని అది శక్తిమంతం చేసుకోవటమే. మీరు దాన్ని ఏంచేసినా, ఆలోచన దాన్ని అది అంతం చేసుకోలేదు. దీనిలోని సత్యాన్ని గ్రహించినప్పుడే ఆలోచన అంతమవుతుంది. ఉన్నస్థితి యొక్క సత్యాన్ని గ్రహించటంలోనే స్వేచ్ఛ ఉంటుంది. ఆ సత్యాన్ని గ్రహించటమే వివేకం. ఉన్నస్థితి ఎప్పుడూ స్థిరంగా ఉండదు. దాన్ని అనాసక్తంగా జాగ్రత్తగా గమనించటానికి ఏవిధమైన సేకరణా లేకుండా స్వేచ్ఛగా ఉండాలి.