మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/సంతృప్తి
80. సంతృప్తి
ఆకాశం మబ్బులతో నిండి ఉంది, పగలు వేడిగా ఉంది, ఆకులతో గాలి ఆటలాడుతున్నప్పటికీ, ఎక్కడో దూరాన ఉరిమింది. వానజల్లుకి రోడ్డుమీద దుమ్ముపడుతోంది. చిలకలు విచ్చలవిడిగా ఎగురుతున్నాయి, వాటి చిన్న తలకాయలు పగిలేటట్లు అరుస్తూ. పెద్ద డేగ ఒకటి చెట్టుపై కొమ్మమీద కూర్చుని క్రింద జరుగుతున్న ఆటని తిలకిస్తోంది. ఒక చిన్న కోతి మరో కొమ్మమీద కూచునుంది. ఆ రెండూ ఒకదానిపైన మరోటి కన్నేసి క్షేమంగా ఉండేటంత దూరంలో కూర్చున్నాయి. అంతలోనే ఒక కాకి వాటితో కలిసింది, ఉదయం దాని కాలకృత్యాలు అయిన తరవాత. ఆ డేగ కొంతసేపు నిశ్చలంగా ఉండి తరవాత ఎగిరిపోయింది. మానవమాత్రులికి మినహాయించి, అది ఒక క్రొత్తదినం. ఏదీ నిన్నటిలా లేదు. ఆ చెట్టూ, ఆ చిలకలూ అవేకాదు. గడ్డీ, పూలమొక్కలూ వేరే లక్షణంతో ఉన్నాయి. నిన్నటి జ్ఞాపకం ఈ రోజుని చీకటిగా చేస్తుంది. పోల్చటం, గ్రహించకుండా ఆటంక పరుస్తుంది. ఈ ఎరుపు, పసుపు పువ్వులు ఎంత రమణీయంగా ఉన్నాయి! రమణీయత ఒక సమయానికి చెందినది కాదు. మనం మన బరువుల్ని ఒకరోజు నుంచి మరో రోజుకి మోసుకుపోతూ ఉంటాం. ఎన్నో నిన్నల నీడ పడని రోజుండదు. మన రోజులన్నీ కొనసాగుతూ ఉండే ఒక చలనం, నిన్న ఈనాటితో, రేపటిలో కలుస్తూ, ఎప్పుడూ అంతం అంటూ ఉండదు. అంతమవుతుందంటే మనకి భయం. అంతం అవకుండా కొత్తది ఎలా ఉండగలదు? మరణం లేకపోతే జీవం ఎలా ఉండగలదు? ఆ రెండింటి గురించీ ఎంత కొంచెం తెలుసు మనకి! మన దగ్గర అన్ని మాటలూ, వివరణలూ ఉన్నాయి. అవి మనకి తృప్తినిస్తాయి. మాటలు అంతాన్ని వికృతం చేస్తాయి. మాట ఉండకుండా ఉన్నప్పుడే అంతం ఉంటుంది. అంతం అనేది మనకి తెలిసిన మాటలకే. మాటల్లేకుండా జరిగే అంతం, మాటలతో ప్రమేయం లేని నిశ్శబ్దం మనం ఎప్పటికీ తెలుసుకోలేము. తెలుసుకోవటమంటే జ్ఞాపకం. జ్ఞాపకం ఎప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. కోరిక అనేది ఒక రోజునీ, మరొక రోజునీ బంధించే దారం. కోరిక అంతమైతేనే కొత్తది ఉంటుంది. మరణమే కొత్తది. కొనసాగే జీవితం జ్ఞాపకం మాత్రమే అది శూన్యంగా ఉంటుంది. కొత్తదానిలో ఉండే జీవితం మరణం ఒక్కటే.
ఓ కుర్రవాడు పెద్దపెద్ద అంగలు వేసుకుంటూ నడుస్తున్నాడు, నడుస్తూ పాడుతున్నాడు. దారిపొడుగునా ఎదురైన వాళ్లందరినీ చూసి చిరునవ్వు నవ్వుతున్నాడు. చాలామంది స్నేహితులున్నట్లు కనిపిస్తోంది. ఒంటిమీద సరియైన దుస్తుల్లేవు. తలకి ఒక మాసిన గుడ్డ చుట్టుకున్నాడు. కాని ముఖం కాంతివంతంగా ఉంది. కళ్లు మెరుస్తున్నాయి. పెద్ద పెద్ద అంగల్లో, టోపీ పెట్టుకున్న ఒక లావుపాటి ఆయన దాటి వెళ్ళాడు. లావుపాటాయాన కాళ్లు ఎడంగా పెట్టి ఊగిసలాడుతూ నడుస్తున్నాడు ముఖం వ్రేలాడేసుకుని - వ్యాకుల పాటుతో, ఆదుర్దాతో. ఆ కుర్రవాడు పాడుతున్న పాటని వినలేదు. పాట పాడిన వాడివైపు ఒక్కసారి చూడనైనా లేదు. ఆ కుర్రవాడు పెద్ద గేటు మధ్యనుంచి అంగలు వేసుకుంటూ పోయి, అందమైన తోట దాటి నది మీది వంతెన దాటుకుని, వంపు తిరిగి సముద్రం వైపుకి వెళ్లాడు. అక్కడ అతని తోటివాళ్లు కలిశారు. చీకటి పడ్డంతో, వాళ్లంతా కలిసి పాడటం మొదలు పెట్టారు. ఒక కారు దీపాల వెలుగు వాళ్ల ముఖాల మీద పడింది. వాళ్ల కన్నులు ఏదో తెలియని ఆనందంతో నిండి ఉన్నాయి. ఇప్పుడు బాగా దట్టంగా వర్షం కురుస్తోంది. అన్నీ తడిసి నీళ్లు కారుతున్నాయి.
ఆయన వైద్యంలో డాక్టరే కాదు, మనస్తత్వ శాస్త్రంలో కూడా. బక్క పలచగా, ప్రశాంతంగా తృప్తిగా ఉన్న ఆయన, కొన్ని సముద్రాలు దాటి వచ్చాడు. ఈ దేశంలో చాలా కాలంపాటే ఉన్నందువల్ల ఎండకీ, పెద్ద వానలకీ అలవాటు పడ్డాడు తను యుద్ధంలో డాక్టరుగానూ, మనస్తత్వ పరిశీలకుడు గానూ పనిచేశానని చెప్పాడు. తనకు చాతనయినంత సహాయం చేశాడుట. కాని తాను ఇచ్చిన దాంతో తనకు తృప్తి కలగలేదుట. ఇంకా ఎంతో ఇవ్వాలనీ, ఇంకా ఎక్కువగా సహాయపడాలనీ కోరుతున్నాడుట. తను ఇచ్చినది చాలా తక్కువట. అందులో ఏదో లోపం ఉందిట.
చాలాసేపటి వరకూ ఒక్కమాట కూడా మాట్లాడకుండా కూర్చున్నాం - ఆయన తన మనస్తాపం వల్ల కలిగే ఒత్తిడులన్నిటినీ కూడగట్టుకుంటున్నంత సేపూ. నిశ్శబ్దం చిత్రంగా ఉంటుంది. నిశ్శబ్దం ఆలోచనవల్ల రాదు. ఆలోచన దాన్ని రూపొందించదు. నిశ్శబ్దాన్ని ఒకచోట కూడబెట్టటం కుదరదు. ఇచ్ఛా పూర్వకమైన క్రియ ద్వారా అది రాదు. నిశ్శబ్దం గురించిన జ్ఞాపకం నిశ్శబ్దం కాదు. నిశ్చలంగా స్పందించే నిశ్శబ్దం ఉంది గదిలో. సంభాషణ దాన్ని భంగం చేయలేదు. ఆ నిశ్శబ్దంలో సంభాషణకీ అర్థం ఉంది. మాటల వెనక నిశ్శబ్దం ఉంది. నిశ్శబ్దం ఆలోచనకి మాటల రూపాన్నిచ్చింది. కాని ఆలోచన నిశ్శబ్దం కాదు. ఆలోచన లేదు. నిశ్శబ్దం ఉంది. నిశ్శబ్దం భేదించుకుంటూ పోయి ప్రోగుచేసి, మాటల రూపాన్నిచ్చింది. ఆలోచన ఎన్నటికీ చొచ్చుకుంటూ పోలేదు. నిశ్శబ్దంలోనే సంపర్కం ఉంటుంది.
డాక్టరు చెబుతున్నాడు ప్రతి దాంట్లోనూ తనకు అసంతృప్తి కలిగిందని; తన పనితోనూ తన సామర్థ్యంతోనూ, ఎంతో జాగ్రత్తగా పోషించుకున్న తన అభిప్రాయాలతోనూ. ఎన్నో రకాల సిద్ధాంతాలను ప్రయత్నించాడుట. కాని వాటన్నిటితోనూ అసంతృప్తి కలిగిందట. ఇక్కడికి వచ్చిన తరవాత ఎన్నో నెలలపాటు ఎన్నో రకాల గురువుల వద్దకు వెళ్లాడుట. కాని మరింత అసంతృప్తితో వచ్చేశాడుట. ఎన్నో సిద్ధాంతాలను ప్రయత్నించాడుట. నిత్యశంకాతత్వాన్ని కూడా. కాని ఇంకా అసంతృప్తి అలాగే ఉందిట.
ఇంతకీ మీరు సంతృప్తికోసం వెతికి దాన్ని కన్నుక్కోలేకపోయారా? సంతృప్తిని కోరటం వల్లనే అసంతృప్తి కలుగుతుందా? వెతకటం అనగానే తెలిసిన దానికోసం అని అర్థం వస్తుంది. మీరు అసంతృప్తిని పొందానంటున్నారు, అయినా ఇంకా అన్వేషిస్తున్నారు. మీకింకా అది దొరకలేదు మీకు సంతృప్తి కావాలి. అంటే మీకు అసంతృప్తి లేదు. మీకు నిజంగా అసంతృప్తి ఉంటే దాన్నుంచి పారిపోయే మార్గం కోసం ప్రయత్నించరు. సంతృప్తి పడాలని ప్రయత్నిస్తే ఏదో విధమైన బాంధవ్యంలో - సొంతమైన వాటితోగాని, ఒక మనిషితోగాని, ఒక సిద్ధాంతంతోగాని ఏర్పడిన బాంధవ్యంలో అసంతృప్తి దొరకుతుంది మీకు.
"అవన్నీ చూడటం అయింది. అయినా నాకు అసంతృప్తి ఉంది."
"మీకు బాహ్య సంబంధాలతో అసంతృప్తి కలిగి ఉండవచ్చు. కాని సంపూర్ణ సంతృప్తిని కలిగించే మానసిక బంధం కోసం మీరు అన్వేషిస్తూ ఉండవచ్చు."
"అదీ అనుభవం అయింది. అయినా ఇంకా అసంతృప్తిగానే ఉంది."
నిజంగా అలా ఉన్నారా అని నా అనుమానం? మీరు పూర్తిగా అసంతృప్తిగా ఉంటే ఏ దిశలోనైనా కదలటం అంటూ ఉండదు, ఉంటుందా? మీకు గదిలో ఉండటమే పూర్తిగా అసంతృప్తికరంగా ఉంటే మరో పెద్ద గదికోసం, మంచి సామానుతో ఉన్న గదికోసం వెతకరు. కాని ఇంతకంటె మంచి గది కావాలనే కోరికనే మీరు అసంతృప్తి అంటున్నారు. మీరు అన్ని గదులతోనూ అసంతృప్తి పొందలేదు - ఈ ప్రత్యేకమైన గదిలో మాత్రమే. దాన్నుంచి మీరు తప్పించుకోవాలనుకుంటున్నారు. మీరు నిజంగా తృప్తికోసమే వెతుకుతున్నారు. అందుకనే మీరు నిత్యం నిర్ణయిస్తూ, పోలుస్తూ, బేరీజు వేసుకుంటూ, కాదంటూ తిరుగుతున్నారు. అందువల్ల సహజంగా అసంతృప్తి పడుతున్నారు. అంతేకాదా?
"అలాగే కనిపిస్తోంది, కాదా?
అందువల్ల మీరు నిజంగా అసంతృప్తి పడటం లేదు. ఇంతవరకు ఎందులోనూ మీకు సంపూర్ణమైన, శాశ్వతమైన సంతృప్తి దొరకటం లేదు, అంతే. మీకు కావలసినదదే. సంపూర్ణ సంతృప్తి, ఏదో ప్రగాఢమైన అంతర్గత తృప్తి, శాశ్వతంగా ఉండేది.
"కాని, నాకు సహాయం చెయ్యాలని ఉంది. అయితే, ఈ అసంతృప్తి నన్ను నేను సంపూర్ణంగా అర్పించుకోకుండా అడ్డుపడుతోంది." మీ లక్ష్యం సహాయం చెయ్యటం, ఆ చెయ్యటంలో సంపూర్ణ తృప్తిపొందటం. మీరు నిజంగా కోరేది సహాయం చెయ్యాలని కాదు, సహాయ పడటంలో సంతృప్తి కోసం. సహాయపడటంలో సంతృప్తికోసం వెతుకుతున్నారు. ఇంకొకరు ఏదో సిద్ధాంతంలోనో మరొక అలవాటులోనో వెతుకుతారు. సంపూర్ణంగా సంతృప్తిని కలిగించే మందుకోసం వెతుకుతున్నారు. ప్రస్తుతానికి ఆ మందుని సహాయపడటం అంటున్నారు. సహాయపడటానికి కావలసినవన్నీ సమకూర్చుకోవటానికి ప్రయత్నించటంలో సంపూర్ణంగా తృప్తి పొందటానికి కావలసినవి మీకు మీరు సమకూర్చుకుంటున్నారు. మీకు నిజంగా కావలసినది శాశ్వత ఆత్మ సంతృప్తి.
మనలో చాలామందిలో అసంతృప్తి ఉంటే సులభంగా తృప్తి లభిస్తుంది. అసంతృప్తిని త్వరలోనే నిద్రపుచ్చుతారు. దానికి మందువేసి ప్రశాంతంగా మర్యాదగా ఉండేటట్లు చేస్తారు. బాహ్యంగా మీరు అన్ని సిద్ధాంతాలనూ కొట్టివేసి ఉండవచ్చు. కాని, మానసికంగా లోలోపల శాశ్వతంగా పట్టుకుని ఉండేలా ఏదైనా ఉందేమోనని వెతుకుతున్నారు. ఇతరులతో అన్ని వ్యక్తిగత సంబంధాలూ తెంచేసుకున్నానని చెబుతున్నారు. వ్యక్తిగత బాంధవ్యంలో మీకు శాశ్వతమైన సంతృప్తి లభించకపోయి ఉండొచ్చు, అందువల్లనే మీరు ఒక భావనలో సంబంధాన్ని వెతుకుతున్నారు. భావన ఎప్పుడూ స్వయంకల్పితమైనదే. పూర్తిగా తృప్తి కలిగించే అనుబంధం కోసం, అన్ని తుఫానులనూ తట్టుకునే సురక్షితమైన ఆశ్రయం కోసం వెతకటంలో తృప్తినిచ్చే అసలైన దానినే మీరు పోగొట్టుకోరా? తృప్తిపడటం అనేది అసహ్యకరమైన మాట కావచ్చు. కాని నిజంగా తృప్తిపడటం అంటే ఎదుగూ బొదుగూ లేకుండా స్థిరపడిపోవటం, సమాధానపడటం, అనునయింపబడటం, సున్నితత్వం లేకుండా ఉండటం అని అర్థం రాదు. తృప్తిపడటం అంటే ఉన్నస్థితిని అర్థ చేసుకోవటం. ఉన్నస్థితి ఎప్పుడూ స్థిరమైనది కాదు. ఉన్నస్థితికి అర్ధాలు వివరించే మనస్సు, అనువాదం చేసే మనస్సు సంతృప్తి గురించి తనకున్న దురభిప్రాయంలో తానే చిక్కుకుంటుంది. అర్థాలు వివరించటం అవగాహన చేసుకోవటం కాదు.
ఉన్నస్థితిని అవగాహన చేసుకోవటంతో అనంతమైన ప్రేమా, మార్దవం, నమ్రతా కలుగుతాయి. బహుశా మీరు అన్వేషించేది అదే కావచ్చు. కాని దాన్ని వెతకటం, కనుక్కోవటం సాధ్యం కాదు. కావాలని మీరేం చేసినా సరే మీరు కనుక్కోలేరు ఎన్నటికీ. అన్వేషణ అంతా అంతమైనప్పుడు అది ఉంటుంది. మీకు తెలిసిన దాన్ని గురించే, అంటే మరింత తృప్తికోసమే ఎప్పుడూ మీరు వెతకగలరు. అన్వేషించటం, జాగ్రత్తగా గమనించటం వేరువేరు ప్రక్రియలు. ఒకటి బంధిస్తుంది. రెండవదానివల్ల అవగాహన కలుగుతుంది. అన్వేషణకి ఎప్పుడూ ఒక గమ్యం దృష్టిలో ఉంటుంది. కాబట్టి ఎప్పటికీ బంధంలోనే ఉంటుంది. అనాసక్తంగా జాగ్రత్తగా గమనించటం వల్ల క్షణక్షణమూ ఉన్నస్థితి అవగాహన అవుతుంది. ఉన్నస్థితి క్షణక్షణానికీ అంతమవుతుంది. అన్వేషణలో కొనసాగటం జరుగుతుంది. అన్వేషణ వల్ల కొత్తది ఎప్పుడూ దొరకదు. అంతమైనప్పుడే కొత్తది ఉంటుంది. కొత్తది అనంతమైనది. ప్రేమ ఒక్కటే నిత్యనూతనమ్యేది.