మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/మాన్యత

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

10. మాన్యత

తనకు దురాశ లేదనీ, కొంచెంతోనే తాను తృప్తిపొందుతాననీ, మామూలుగా మనిషికొచ్చే కష్టాలు కొన్నిటిని అనుభవించినా మొత్తం మీద తన జీవితం బాగానే గడిచిందనీ సమర్ధించుకుంటూ చెప్పాడాయన. ఆయన నెమ్మదస్తుడు. ముందుకి తోసుకొచ్చే రకంకాదు. తాను పట్టిన మార్గానికెవ్వరూ అడ్డురాకూడదని ఆశిస్తాడుట. తనకేవీ పెద్ద ఆకాంక్ష ల్లేవన్నాడు, కాని, తనకున్న దానికోసం, తన సంసారం కోసం, జీవితం సాఫీగా సాగిపోవాలని భగవంతుణ్ణి ప్రార్థించాడు. సమస్యల్లోనూ, సంఘర్షణల్లోనూ తన స్నేహితులూ, బంధువులూ మునిగిపోయినట్లు తన్ను ముంచనందుకు దేవుడికి కృతజ్ఞత తెలుపుకున్నాడు. ఆయనకు క్రమంగా మంచి మాన్యత లభిస్తోంది. పై తరగతికి చెందిన వాళ్లలో తానూ ఒకడినయానన్న ఆలోచనతో ఆయన ఆనందంగా ఉన్నాడు. పరస్త్రీ వ్యామోహం లేదుట ఆయనకి, ఆయన సంసార జీవితం ప్రశాంతంగానే సాగిపోతున్నదట. ఏవో సాధారణంగా భార్యాభర్తల మధ్య వచ్చే తగువులు మినహాయించి, ప్రత్యేకమైన దురలవాట్లేమీ లేవుట ఆయనకి. తరుచు ప్రార్ధన చేస్తూ ఉంటాడుట. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడుట. "ఇదేమిటంటారు? నాకేవిధమైన సమస్యలూ లేవేం?" అని అడిగాడు. సమాధానం కోసం ఆగకుండానే, తృప్తిపడుతున్నట్లుగానూ, ఏదో దైన్యం ఉట్టిపడుతున్నట్లుగానూ చిరునవ్వు నవ్వుతూ తన గత చరిత్రంతా చెప్పటం మొదలుపెట్టాడు - ఆయన ఏం పనిచేస్తూ ఉండేవాడో. తన పిల్లలకు ఎటువంటి చదువు చెప్పించాడో - అదంతా. తాను ధారాళంగా దానాలు చెయ్యకపోయినా, కొద్దోగొప్పో ఇక్కడా అక్కడా ఇచ్చాడుట. ప్రతివాడూ ఈ ప్రపంచంలో ఒక విశిష్టస్థానాన్ని సంపాదించుకునేందుకు కష్టపడాలని ఆయన దృఢాభిప్రాయం.

మాన్యత అనేది ఒక శాపం. మనస్సునీ, హృదయాన్నీ హరించి వేయగలిగేటంత 'చెడ్డది'. మనకు తెలియకుండానే మనలో దూరి మన ప్రేమను ద్వంసం చేస్తుంది. మాన్యత పొందటం అంటే విజయం సాధించినట్లు భావించటం, ప్రపంచంలో తన కొక స్థానాన్ని ఏర్పరచుకోవటం, తన చుట్టూ సుస్థిరత అనే గోడ కట్టుకోవటం, ధనం, అధికారం, విజయం, సామర్థ్యం, సద్గుణం - వీటన్నిటి మూలంగా వచ్చే ఒక విధమైన ధీమాతో ఉండటం. ఈ ధీమాతో వచ్చే ప్రత్యేకత మూలంగా, సమాజం అనే మానవ సంబంధం పట్ల ద్వేషం, విరోధం బయలుదేరుతాయి. మాన్యత పొందిన వారు ఎప్పుడూ సమాజంలో ముఖ్యులు. సంఘర్షణకీ దుఃఖానికీ వారే ఎప్పుడూ కారకులవుతారు. ద్వేషింపబడేవారిలాగే మాన్యత పొందినవారు కూడా పరిస్థితులకు బానిసలే. తమ చుట్టూ ఉన్న పరిసరాలు పరంపరగా వస్తున్నవి. వాటి ప్రభావాలు వారికెంతో ముఖ్యం. ఇవే వారిలోని లేమిని దాచి ఉంచుతాయి. మాన్యత పొందిన వారెప్పుడూ తమ్ము తాము రక్షించుకుంటూ భయంతోనూ, అనుమానంతోనూ ఉంటారు. వారి హృదయాల్లో ఎప్పుడూ భయమే. అందుచేత ఆగ్రహమే వారి సుగుణం. వారికి రక్షణ నిచ్చేవి వారి సద్గుణమూ, భక్తీ. వారు లోపల శూన్యంగా ఉండి, కొట్టగానే పెద్ద చప్పుడు చేసే మద్దెలవంటివారు. మాన్యత పొందినవారు సత్యాన్ని ఎప్పటికీ ఎదుర్కోలేరు. ద్వేషింపబడేవారి లాగే, వీరు కూడా తమ అభివృద్ధి కోసం పడే తాపత్రయంలోనే మునిగి ఉంటారు. వారు సత్యాన్ని తప్పించుకుంటున్నందువల్ల ఆనందం అనేది లభ్యంకాదు వారికి.

దురాశ లేకుండా ఉండటానికీ, ఔదార్యం లేకుండా ఉండటానికీ దగ్గర సంబంధం ఉంది. రెండూ స్వార్ధాన్ని కప్పిపుచ్చే పద్ధతులే - అవి స్వార్ధ పరాయణతకు మరో అదృశ్య రూపం. దురాశ ఉంటే చురుకుగా ఉండాలి, నలుగురితో తిరగాలి, శ్రమించాలి, పోటీ చెయ్యాలి, బలంగా ముందుకు తోసుకుపోవాలి. ఈ పట్టుదల లేకుండా ఉంటే మీకు దురాశలేనట్లు కాదు; స్వార్ధాన్ని కప్పి ఉంచటం మాత్రమే. నలుగురితో కలవటం ఇబ్బంది, బాధాకరమైన విషయం. అందుచేత దురాశ లేకుండా ఉండటం అనే మాటలతో స్వార్ధపరాయణతని కప్పిపుచ్చటం జరుగుతోంది. చేతితో ఔదార్యం చూపించటం ఒకటి. హృదయంలో ఔదార్యం ఉండటం ఒకటి. చేతితో ఔదార్యం చూపించటం సులభమయిన పనే. మీకున్న సంస్కృతి, సందర్భాలను బట్టి. కాని హృదయంలో ఔదార్యం ఉండటానికి ఎంతో ప్రగాఢమైన అర్ధం ఉంది. దానికి విస్తారమైన చైతన్యం, అవగాహనా అవసరం. ఉదారంగా ఉండకపోవటం కూడా సంతోషదాయకంగానే ఉంటుంది. అది కూడా మూఢ స్వార్ధతత్పరతే. ఇది బహిరంగంగా వ్యక్తం కాదు. ఈ స్వార్ధతత్పరతతో చేసే పనులు వేరు. కలల్లో చేసేవాడి చర్యల్లాగ అవి మెలకువ తెప్పించవు. మెలకువ వస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. అందుచేత చిన్నవాళ్లూ, ముసలివాళ్లూ, అందరూ ఎందుకొచ్చిన బాధ ఇదంతా, మామానాన మమ్మిల్ని వదిలేసి, గౌరవంగా బ్రతికినన్నాళ్లు బ్రతకనిచ్చి తరువాత చచ్చిపోనివ్వండి అంటారు.

హృదయ ఔదార్యం లాగే చేతి ఔదార్యం కూడా బహిరంగ కార్యక్రమమే. కాని, అది తరుచు బాధాకరంగా, వంచకంగా, స్వార్ధం బయటపడిపోయేట్లుగా ఉంటుంది. చేతితో ఔదార్యం చూపించటం సులభంగానే అలవడుతుంది. కాని హృదయ ఔదార్యం అలవరచుకుంటే వచ్చేది కాదు. కూడబెట్టటం అనేది ఎంత మాత్రం లేకుండా ఉన్నప్పుడు ఏర్పడే స్వేచ్చ అది. క్షమించాలి అంటే, మనస్సులో మానని గాయం ఏదో ఉన్నట్లే కదా. మనస్సు గాయపడింది అంటే స్వాభిమానం కూడబెట్టి ఉండటం వల్లనేకదా. "నా", "నాది" అని అనుకున్నప్పుడు హృదయంలో ఔదార్యం ఉండదు.