మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/జ్ఞానం

వికీసోర్స్ నుండి

9. జ్ఞానం

మేము రైలుకోసం ఎదురుచూస్తున్నాం. అది రావటం ఆలస్యం అయింది. ప్లాట్‌ఫామ్ చెత్తగానూ, గొడవగానూ ఉంది. గాలి వెగటు పుట్టించేట్టుగా ఉంది. మాలాగే చాలా మంది నిరీక్షిస్తున్నారు. పిల్లలు ఏడుస్తున్నారు. ఒకావిడ పిల్లకి పాలిస్తోంది. సరకులమ్మేవాళ్లు టీ, కాఫీ మొదలైన సరుకుల పేర్లు అరుస్తూ అమ్ముతున్నారు. ఆ ప్రదేశమంతా హడావిడిగా గందరగోళంగా ఉంది. మేము ప్లాట్‌ఫామ్ మీద ఇటూ అటూ నడుస్తున్నాం. మా అడుగుల్ని మేమే చూసుకుంటూ, మా చుట్టూ జరుగుతున్నదంతా గమనిస్తున్నాం. ఒకతను మా దగ్గర కొచ్చి వచ్చీరాని ఇంగ్లీషులో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇంతసేపూ అతడు మిమ్మల్ని గమనిస్తున్నట్లూ, మాతో మాట్లాడాలనే భావాన్ని అణచుకోలేకపోయినట్లూ చెప్పాడు. ఎంతో మనస్ఫూర్తిగా చెప్పాడు - తను ఇక ముందు నుంచీ ఎంతో పరిశుద్ధమైన జీవితాన్ని గడపదలుచుకున్నట్లూ, ఆక్షణం నుంచి ఇక ఎప్పుడూ పొగత్రాగ దలచుకోలేదనీ చెప్పాడు. అతడు ఏమీ చదువుకోలేదుట. అతడు రిక్షాలాగేవాడు మాత్రమేనట. అతని కళ్లు చురుగ్గా ఉన్నాయి. అతడు చిరునవ్వు నవ్వితే బాగుంది.

ఇంతలో రైలు వచ్చింది. కంపార్టుమెంట్‌లో ఒకాయన తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. ఆయన ఒక ప్రసిద్ధ పండితుడు. ఆయనకి చాలా భాషలు వచ్చు. ఆయనకు ఎంతో అనుభవం, జ్ఞానం ఉన్నాయి. స్థితిమంతుడు. ఇంకా వృద్ధిలోకి రావాలనే ఆకాంక్ష ఉన్నవాడు. ధ్యానం చేయటం గురించి మాట్లాడాడు. కాని స్వానుభవంతో చెబుతున్నట్లుగా అనిపించలేదు, ఆయన చెప్పటాన్ని బట్టి. ఆయన దేవుడు పుస్తకాల్లోని దేవుడు. జీవితం పట్ల ఆయనకున్న అభిప్రాయాలు తరతరాలుగా వస్తున్నవీ, సంప్రదాయ బద్ధమైనవీ. ఆయనకు బాల్య వివాహాల్లోనూ, పెద్దలు కుదిర్చిన వివాహాల్లోనూ, కట్టుబాట్ల ప్రకారం నడిచే జీవితంలోనూ నమ్మకం ఉంది. ఆయన కులమూ, వర్గమూ, వివిధ కులాల మేధా సంపత్తిలో ఉండే హెచ్చుతగ్గులూ, అన్నీ పట్టించుకుంటాడు. తనకున్న జ్ఞానానికీ, హోదాకీ ఆయన ఒకవిధంగా పొంగి పోతున్నాడు.

సూర్యాస్తమయం అవుతోంది. రైలు చక్కని పల్లె ప్రదేశంలోంచి పోతోంది. పశువులు ఇళ్ళకు తిరిగి పోతున్నాయి. బంగారు వన్నెలో దుమ్ము రేగుతోంది. ఆకాశంలో నల్లని పెద్ద పెద్ద మబ్బులు. దూరాన్నుంచి పిడుగు పడ్డట్లు చప్పుడు. పచ్చని పొలాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. మలుపు తిరుగుతున్న ఆ కొండ నడుమ పల్లె చూడముచ్చటగా ఉంది. చీకటి పడుతోంది. నల్లని పెద్ద దుప్పి పొలాల్లో తింటూ తిరుగుతోంది. పక్కనుంచి రైలు అరుస్తూ పోతున్నా కన్నెత్తి అయినా చూడలేదు.

జ్ఞానం అనేది రెండు చీకట్ల మధ్య తళుక్కు మనే మెరుపు. కాని జ్ఞానం ఆ చీకటి పైకిగాని, దానికన్న ముందుకి గాని పోలేదు. సాంకేతిక నైపుణ్యానికి జ్ఞానం అవసరమే, యంత్రంలో బొగ్గు అవసరమైనట్లు. కాని, తెలియని దానిని అది చేరుకోలేదు. తెలియనిది తెలిసిన దానిలో చిక్కుకునేది కాదు. తెలియనిది ఆవిష్కృతం కావటానికి ఉన్న జ్ఞానాన్ని తొలగించుకోవాలి. కాని అది ఎంత కష్టం! మనం ఉండటం అంతా గతంలోనే. మన ఆలోచనలు గతంమీద ఆధారపడి ఉన్నాయి. గతమే మనకు తెలిసినది. గతం నీడ ప్రస్తుతాన్ని కప్పివేస్తుంది. ప్రస్తుతం తెలియకుండా ఉండిపోతుంది. అపరిచితమైనది భవిష్యత్తు కాదు. ప్రస్తుతమే. అనిశ్చితమైన ప్రస్తుతాన్ని తప్పించుకుని ముందుకు పోతున్న గతమే భవిష్యత్తు అవుతుంది. ఈమధ్య ఏర్పడే ఖాళీలో, విరామంలో జ్ఞానం అప్పుడప్పుడు తన కాంతిని నింపుతూ ఉంటుంది. ప్రస్తుతంలోని శూన్యం ఆవిధంగా నిండుతుంది. కాని ఈ శూన్యంలోనే జీవితం యొక్క అద్భుత శక్తి ఇమిడి ఉంది.

జ్ఞానానికి అలవాటు పడటంకూడా తక్కిన దురలవాట్ల వంటిదే. ఇది శూన్యత, ఒంటరితనం, నిరుత్సాహం, ఏమీ అవకుండా ఉండిపోవటం - వీటి భయం నుంచి తప్పించుకొనే మార్గాల్లో ఒకటి. జ్ఞానం యొక్క కాంతి మనస్సు ఛేదించలేని చీకటిని సున్నితంగా కప్పే పొర వంటిది. మనస్సు అపరిచితమైన దానికి భయపడుతుంది. ఆ భయాన్ని తప్పించుకోవటానికి జ్ఞానం, సిద్ధాంతాలూ, ఆశలూ, ఊహలూ వీటన్నిటిలోనూ తలదాచుకుంటుంది. తెలియని దాన్ని గ్రహించటానికి ఈ జ్ఞానమే ప్రతిబంధకమౌతుంది. జ్ఞానాన్ని త్రోసి పారవెయ్యటం అంటే భయాన్ని కొనితెచ్చుకోవటమే. దేన్నైనా గ్రహించటానికి వీలైన ఏకైక సాధనం మనస్సు. దాన్ని కాదంటే సుఖదుఃఖాలకు లోనుకావలసి వస్తుంది. కాని జ్ఞానాన్ని త్రోసి పారవెయ్యటం సులభం కాదు. అజ్ఞానంతో ఉండటం అంటే జ్ఞానం నుంచి స్వేచ్ఛ పొందటం కాదు. అజ్ఞానం అంటే తన్ను తాను తెలుసుకోలేక పోవటమే. తమ స్వార్ధచింతనను అర్ధం చేసుకోనట్లయితే జ్ఞానం అజ్ఞానమే అవుతుంది. తన్ను తాను అర్ధ చేసుకోవటమే జ్ఞానం నుంచి స్వేచ్ఛ లభించటం.

పోగు చేసుకోవటం, కూడబెట్టాలనుకోవటం - వీటి అర్ధం తెలిసినప్పుడే జ్ఞానం నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. కూడబెట్టి దాచుకోవాలనే కోరికకు మూలం సురక్షితంగా సుస్థిరంగా ఉండాలనే కాంక్ష. ఇది చెడ్డదనీ, ఇది సరియైనదనీ అంటూ ఏదో ఒక దానితో తన్ను ఐక్యం చేసుకోవటం, తద్వారా సుస్థిరతని కోరటం, భయంమూలాన్నే. ఈ భయమే దేన్నీ తెలుసుకోనీయకుండా చేస్తుంది. అన్నీ తెలిసినప్పుడు కూడబెట్టవలసిన అవసరమే ఉండదు. కూడబెట్టటం అనేది మనల్ని మనం సంకుచితం చేసుకునే చర్య. ఇది మన రక్షణ కోసం ప్రతిఘటించటానికే. జ్ఞానం ఈ చర్యను లేదా ప్రతిఘటనని మరింత శక్తిమంతం చేస్తుంది. జ్ఞానాన్ని ఆరాధించటం కూడా దేవతా విగ్రహాన్ని ఆరాధించటం వంటిదే. అది మన జీవితంలోని సంఘర్షణనీ, దుఃఖాన్నీ రూపుమాపలేదు. అంతకంతకు అధికమయే మన గందరగోళాన్నీ, విచారాన్నీ జ్ఞానవస్త్రం కప్పిపుచ్చుతుందే గాని, వాటి నుంచి మనకి విముక్తిని ప్రసాదించదు. మనోరీతులు సత్యానికీ ఆనందానికీ దారితీయవు. తెలిసి ఉండటం అంటే, తెలియని దాన్ని వద్దని అనుకోవడమే.