మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/భోగభాగ్యాలను త్యజించటం
25. భోగభాగ్యాలను త్యజించటం
ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చున్నాం మేము. అక్కడ నుంచి లోయ ఆకుపచ్చగా కనబడుతోంది. వడ్రంగి పిట్టలు తమ పనిలో మునిగి ఉన్నాయి. రెండు చెట్ల మధ్య చీమలు బారులు తీర్చి ముందుకీ వెనక్కీ చకచకా పోతున్నాయి. సముద్రపుగాలి దూరంగా ఉన్న పొగమంచు వాసనని మోసుకొస్తుంది. కొండలు నీలంగా కలలో మాదిరిగా ఉన్నాయి. తరుచు అవి ఎంతో దగ్గరగా ఉన్నట్లు కనిపించేవి. కాని, ఇప్పుడవి ఎంతో దూరంగా ఎక్కడో ఉన్నాయి. చిన్న పిట్ట ఒకటి పైపులోంచి కారి ఏర్పడిన చిన్ననీటి మడుగులోంచి నీళ్లు తాగుతోంది. రెండు బూడిదరంగు ఉడతలు పెద్ద కుచ్చుల్లాంటి తోకలతో, ఒకదాన్ని ఒకటి తరుముకుంటూ చెట్టు మీద పైకీ క్రిందికీ తిరుగుతున్నాయి. బాగా పైదాకా పాకి, మళ్లీ గిర్రున తిరిగి వెర్రివేగంతో దాదాపు నేలదాకా దిగిపోయి, మళ్ళీ పైకి పోతున్నాయి.
ఆయన ఒకప్పుడు బాగా ధనమున్నవాడు. తన భోగభాగ్యాలను త్యజించాడు. ఆయనకి చాలా ఆస్తిపాస్తులుండేవి. వాటి బరువు బాధ్యతలతో ఆయన సంతోషంగా ఉండేవాడు. ఆయన దానధర్మాలు చేసేవాడు. ఆయనది రాతి గుండె కాదు. వెనకా ముందూ ఆలోచించకుండా ఇచ్చేవాడు. ఇచ్చాక దాని సంగతి మరిచిపోయేవాడు. తనకు తోడ్పడిన వాళ్లతో మంచిగా ఉండేవాడు. వారికి లాభదాయకంగా ఉండేట్లు చేసేవాడు. డబ్బు సంపాదించటమే ప్రధానం అయిన ఈ ప్రపంచంలో ఆయన డబ్బు సులభంగానే సంపాదించాడు. ఆయన కొందరి లాగ, తమ కంటె తమ బాంక్ ఎకౌంట్లు, వడ్డీ వ్యాపారాలే ఎక్కువై, ఒంటరిగా ఉండి, జనానికి, వాళ్లు అడిగే వాటికీ భయపడుతూ, చిత్రమయిన ధనిక వాతావరణంలో తమ్ముతాము బంధించుకునే రకం కాదు. ఆయన కుటుంబానికి ఆయనంటే భయం లేదు. అలాగని అంత సులభంగా లొంగేవాడూ కాదు. ఆయనకి చాలామంది స్నేహితులున్నారు, ఆయన ధనం చూసి కాదు. ఆయన ఎందుకు తన ఆస్తిపాస్తుల్ని త్యజించాడో చెప్పుకొస్తున్నాడు. ఓ రోజున ఏదో చదువుతూంటే హఠాత్తుగా తట్టిందట - (ఇప్పుడు ఆయనకున్నది అతి స్వల్పం) ఆ డబ్బు సంపాదించటమూ, తన ధనమూ - అంతా ఎంత తెలివితక్కువ తనమో. నిరాడంబరమైన జీవితాన్ని సాగించటానికి ప్రయత్నిస్తున్నాడు. అదంతా దేనికోసమంటే, అసలు భౌతిక వాంఛల్ని మించిన దేదైనా ఉన్నదా అని కనుక్కునేందుకు.
కొంచెంతో తృప్తిపడి ఉండటం కొంతవరకు సులభమే. వేరే దేనికోసమో వెతుకుతూ ప్రయాణం చేసే వారికి తక్కిన బరువులన్నీ వదిలించుకుని స్వేచ్ఛగా ఉండటం కష్టం కాదు. అంతరంగ అన్వేషణ కోసం పడే తపన అధిక సంపదలు కలిగించే సందిగ్ధతని తొలగిస్తుంది. కాని పైపై వాటి నుంచి స్వేచ్ఛ పొందినంత మాత్రాన నిరాడంబరంగా జీవించటం అవదు. అంతరంగిక ప్రశాంతత నిష్కపటత్వం అనటానికి వీల్లేదు. పైకి నిరాడంబరంగా జీవించటం మంచిదే, అది కొంత వరకు స్వేచ్ఛ నిస్తుంది కాబట్టి. చిత్తశుద్ధికి అదొక నిదర్శనం. అయితే, ఎప్పుడూ ముందుగా పైపై వాటితోనే మొదలు పెడతామెందుకు? హృదయ నిరాడంబరతతో ఎందుకు ఆరంభించం? మనల్నీ, ఇతరుల్నీ మన ఉద్దేశాల గురించి నమ్మించటానికా? మనల్ని మనం ఎందుకు నమ్మించుకోవటం? వేటి నుంచైనా స్వేచ్ఛ పొందటానికి వివేకం కావాలి, అంతేకాని నిదర్శనాలూ, నమ్మకాలూ కాదు. వివేకం వ్యక్తిగతమైనది కాదు. సంపద లెక్కువగా ఉంటే ఏం జరుగుతుందో అంతా గ్రహించినట్లయితే, ఆ గ్రహింపే స్వేచ్ఛను కలుగజేస్తుంది. అటువంటప్పుడు గంభీరంగా ఉద్ఘాటించటాలూ, నిదర్శనంగా చేసి చూపించటాలూ అవసరంకావు. ఈ వివేకవంతమైన అవగాహన పని చేయనప్పుడే, క్రమశిక్షణలు, బంధనాలను తెంచుకోవట మొదలైన వాటిని మొదలు పెడతాం. ఎక్కువ, తక్కువ, అన్నది కాదు ముఖ్యం. వివేకం ముఖ్యమైనది. వివేకవంతుడైన మనిషి కొంచెంతోనే తృప్తిపడి, అధిక సంపదలు లేకుండా స్వేచ్ఛగా ఉంటాడు.
కాని సంతుష్టి పడటం అనేది ఒకటి, నిరాడంబరత వేరొకటి. సంతుష్టి పొందాలనే కోరిక గాని, నిరాడంబరంగా ఉండాలనే కోరికగాని బంధనం అవుతుంది. కోరిక చిక్కులు కల్పిస్తుంది. ఉన్నదాన్ని గ్రహించటం వల్ల తృప్తిపడటం జరుగుతుంది. ఉన్న దాంట్లో స్వేచ్ఛగా ఉన్నప్పుడు నిరాడంబరత వస్తుంది. పైకి నిరాడంబరంగా ఉండటం మంచిదే. కాని అంతర్గతంగా కూడా నిరాడంబరంగా నిర్మలంగా ఉండటం మరింత ముఖ్యం. నైర్మల్యం మనోదీక్షతోనూ, కర్తవ్యభారంతోనూ రాదు. మనస్సు దాన్ని సృష్టించలేదు. మనస్సు తన్ను తాను ఇముడ్చుకోగలదు, సర్దుకోగలదు, తన తలపులన్నిటినీ ఒక తీరులో పెట్టుకోగలదు. కాని, ఇది నైర్మల్యంగానీ నిరాడంబరత గానీ కాదు.
సంకల్ప పూర్వకమైన చర్య సంధిగ్ధతను కలుగజేస్తుంది. సంకల్పం ఎంత పవిత్రమైనదైనా కోరికకు మూలమవుతుంది. ఏదో అందుకోవాలనీ, మరేదో అవాలనే సంకల్పం ఎంత అవసరమైనదైనా, పవిత్రమైనదైనా, ఒక మార్గాన్ని సూచించి, సందిగ్ధతలోనే ఒక దారి కల్పిస్తుంది. కాని అటువంటి ప్రక్రియ ఒంటరితనానికి దారి తీస్తుంది. ఒంటరితనం వల్ల నైర్మల్యం రాదు. సంకల్పయుక్తమైన చర్య తాత్కాలికంగా కార్యోన్ముఖం కావటానికి కొంతవరకు దారి చూపించినా, దాని గతాన్ని తుడిచి పెట్టేయటం దాని వల్లకాదు ఎన్నటికీ, ఎందువల్లనంటే, సంకల్పం అనేది గతం నుంచి వచ్చినది కనుక. మన గతమే సంకల్పాన్ని పుట్టించి పోషిస్తుంది. ఆ సంకల్పం గతానికి పదునుపెట్టి దాని శక్తుల్ని మరింత అధికం చేస్తుంది. అంతేగాని, గతాన్ని ఎన్నటికీ తుడిచి పెట్టేయలేదు.
నిరాడంబరత మనస్సుకి సంబంధించినది కాదు. నిరాడంబరంగా ఉండాలని పధకం వేసుకోవటం గడుసుగా సర్దుకోవటం మాత్రమే; సంతోషం నుంచీ, బాధనుంచీ రక్షణ కల్పించుకోవటమే. అనేక రకాల సంఘర్షణనీ, గందరగోళాన్నీ పుట్టించే స్వార్థ పూరిత కార్యకలాపం అది. లోపలా, బయటా చీకటిని నింపే సంఘర్షణ అది. సంఘర్షణ, నైర్మల్యం ఒకేచోట ఉండలేవు. సంఘర్షణ లేని స్వేచ్ఛలోనే నిరాడంబరత వస్తుంది - సంఘర్షణను అణచివేయటం వల్లకాదు. ఒకసారి జయించిన దాన్ని మళ్లీ జయిస్తూనే ఉండాలి. దాంతో సంఘర్షణ అంతులేకుండా ఉంటుంది. సంఘర్షణని అర్థం చేసుకోవటం కోరికని అర్థం చేసుకోవటమే. కోరిక తన్ను తాను గమనించేదిగా, అవగాహన కర్తగా రూపొందించుకోవచ్చు. కాని, ఈ విధంగా దానికి ఔన్నత్యాన్ని ఆపాదించటం కోరికను కొనసాగించటమే గాని, అవగాహన చేసుకోవటం కాదు. ద్రష్ట (గమనించేది), దృశ్యం (గమనింపబడేది) - అనేది ద్వంద్వ ప్రక్రియ కాదు. అది ఒకే ప్రక్రియ. ఈ ఏక ప్రక్రియ అనే సత్యం అనుభవంలోకి వచ్చినప్పుడే కోరికనుంచీ, సంఘర్షణ నుంచీ స్వేచ్ఛ లభిస్తుంది. ఈ సత్యం ఎలా అనుభవంలోకి తెచ్చుకోవటం అనే ప్రశ్న రాకూడదు. అది సంభవించాలి, అంతే. ధ్యానంతో ఉన్నప్పుడూ, నిరాసక్తికరంగా గమనిస్తున్నప్పుడే అది సంభవిస్తుంది. మీ గదిలో సుఖంగా కూర్చుని విషసర్పం ఎదురైతే ఎలా ఉంటుంది అని ఊహిస్తేనూ, అంచనా వేస్తేనూ, నిజంగా ఎదురైనప్పుడుమీరు పొందే అనుభవం మీకు కలుగుతుందా? సర్పాన్ని ఎదుర్కోవాలంటే, నున్నని వీధుల్ని కృత్రిమ దీపాల్నీ దాటి ఇంకా ముందుకి పోయేందుకు సాహసించాలి.
ఆలోచన, భద్రపరచగలదు కానీ, సంఘర్షణారహితమైన స్వేచ్ఛని స్వయంగా అనుభవించలేదు. ఎందువల్లనంటే, నిరాడంబరత, నైర్మల్యం మనస్సుకి సంబంధించినవి కావు.