మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/నిశ్శబ్దం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

24. నిశ్శబ్దం

ఆ కారు ఇంజను మంచి శక్తిమంతంగా, అవసరానికి తగినట్లుగా ఉంది. కొండలమీదకు సునాయాసంగా పోతోంది. ఏచప్పుడూ లేకుండా అద్భుతంగా పుంజుకుంటోంది. లోయ దాటిన తరవాత పైకి వెళ్లేదారి నిటారుగా ఉంది. నారింజ తోటల మధ్యనుంచీ, ఎత్తుగా విశాలంగా పెరిగిన అక్రోటుచెట్ల మధ్య నుంచీ పోతోంది. దారి కిరుప్రక్కలా నలభైమైళ్ళ పొడుగున కొండదిగువదాకా విస్తరించి ఉన్నాయి తోటలు. ఆ దారి ఒకటి రెండు చిన్న గ్రామాల మధ్యనుంచి కూడా విశాలమైన పొలాల్లో పచ్చగా నిగనిగలాడే సెనగచేల మధ్య నుంచి సాగింది. మళ్ళీ ఎన్నో కొండల మధ్య మెలికలు తిరుగుతూ చివరికి ఆదారి ఎడారిలోకి వచ్చింది.

ఆ రోడ్డు నున్నగా ఉంది. కారు ఇంజను చప్పుడు తడబాటు లేకుండా స్థిరంగా ఉంది. రద్దీ చాలా తక్కువగా ఉంది. అన్నిటినీ తీవ్రంగా గమనించటం జరుగుతోంది - ఆ ప్రదేశాన్ని మధ్యమధ్య పక్కనుంచి వెళ్లేకారునీ, రోడ్డు సిగ్నల్సునీ, నిర్మల నీలాకాశాన్నీ, కారులో కూర్చున్న శరీరాన్నీ. కాని, మనస్సు మాత్రం నిశ్చలంగా ఉన్నది. అలసటవల్ల ప్రశాంతంగా ఉండటంకాదు, విశ్రాంతి తీసుకోవటంవల్లనూ కాదు. చురుకుతనంతో కూడిన నిశ్చలత అది. మనస్సు నిశ్చలంగా ఉన్నది ఏ కేంద్రం నుంచీ కాదు. ఆ ప్రశాంతతని గమనించే వాడెవడూ లేడు. అనుభవించేవాడు లేనే లేడు. ఏవో అనేక విషయాల మీద సంభాషణ జరుగుతున్నా, ఈ నిశ్శబ్దంలో ఒక్క అల అయినాలేదు. కారు దూసుకుని పోతూంటే రివ్వున వీచే గాలి శబ్దం వినిపిస్తోంది. కాని ఈ నిశ్శబ్దం ఆ గాలి శబ్దాన్నుంచిగాని, కారు చప్పుళ్ళనుంచి గాని, మాట్లాడుతున్న మాటలనుంచి గాని వేరు చేయరానిది. ఇంతకు ముందు ఇటువంటి నిశ్శబ్దం గురించిగాని తెలిసిన వేరే నిశ్శబ్దాల గురించి గాని ఎటువంటి జ్ఞాపకమూ లేదు మనస్సులో. "ఇదీ ప్రశాంతత" అనలేదు మనస్సు. దాన్ని మాటల్లోకి రూపొందించలేదు. మాటల్లోకి రూపొందించట మంటే అటువంటిదే మరొక అనుభవాన్ని గుర్తుతెచ్చుకొని ఇది కూడా అటువంటిదేనని నిశ్చయించటం. మాటలలోకి రూపొందించటంలేదు. కాబట్టి ఆలోచన లేదు. దానికొక స్థిర రూపాన్నివ్వటం లేదు కాబట్టి ఆలోచన ఆ నిశ్శబ్దాన్ని అందుకొని దాన్ని గురించి ఆలోచించలేకపోయింది - "నిశ్శబ్దం" అనేమాట నిశ్శబ్దం కాదు కనుక. మాటలేనప్పుడు మనస్సు పనిచేయలేదు. అందుచేత అనుభోక్త దాన్ని మరికొంత సుఖాన్ని అనుభవించే సాధనంగా దాచుకోలేడు. కూడబెట్టాలనే ప్రక్రియ జరగటం లేదు. పోల్చి చూడటంగాని, అంతర్లీనం చేసుకోవటంగాని లేదు. మనస్సు యొక్క సంచలనమే లేదు.

కారు ఇంటిదగ్గర ఆగింది. కుక్క మొరగటం గాని, కారులోంచి సామాను దించటంగాని, ఆ మొత్తం గొడవగాని ఏవిధంగానూ ఈ అసాధారణమైన నిశ్శబ్దాన్ని భంగపరచలేదు. అసలు గొడవ లేనేలేదు. నిశ్శబ్దం కొనసాగుతూనే ఉంది. దేవదారు చెట్ల మధ్య గాలివీస్తోంది. వీటి నీడలు పొడుగ్గా పడుతున్నాయి. ఓ అడవి పిల్లి పొదలమాటున దూరి పోయింది. ఈ నిశ్శబ్దంలో సంచలనం ఉంది. ఆ సంచలనం ధ్యానభంగం కలిగించటం లేదు. దేని మీదా ప్రత్యేకమైన ధ్యానం లేదు, అందువల్లనే దేనికీ ధ్యానభంగం కావటంలేదు. ఒక ముఖ్యమైన దాన్నుంచి ఆసక్తి మళ్ళినప్పుడే ధ్యానభంగం అవుతుంది. కాని ఈ నిశ్శబ్దంలో దేనిపైనా ఆసక్తి లేదు. అందువల్ల ఇటూ అటూ ఊరికే తిరగటం లేదు. ఆ సంచలనం నిశ్శబ్దానికి దూరంగా లేదు. ఆ నిశ్శబ్దంలోనిదే. అది మరణంలో ఉండే నిశ్చలతకాదు, క్షీణదశలో ఉండేది కాదు. సంఘర్షణ ఏమాత్రం లేకుండా ఉండేది. మనలో చాలామందికి సుఖదుఃఖాల పోరాటం, కార్యాతురతా మనజీవితానికి అర్ధాన్నిస్తాయి. ఆ ఆత్రుతని తీసి పారవేస్తే మనం దిక్కులేని వారమై అతి త్వరలో నాశనమై పోతాం. కాని, ఈ నిశ్చలత, ఈ సంచలనం నిత్యనూతన సృష్టి. ఈ సంచలనానికి ఆదిలేదు. అందువల్ల అంతం కూడాలేదు. కొనసాగటం అనేది లేదు. సంచలనం కాలంతో సంబంధించినట్లు ఉంటుంది. కాని కాలం లేదు. కాలం అంటే ఎక్కువ, తక్కువ, దగ్గర, దూరం, నిన్న, రేపు. కాని, ఈ నిశ్చలతలో పోల్చి చూడటం అంతా ఆగిపోతుంది. ఆ నిశ్శబ్దం అంతం అయేదీ, మళ్ళీ మొదలయేదీ కాదు. మళ్ళీ అదేవిధంగా జరగటం ఉండదు. కపటమైన మనస్సు వేసే టక్కరి వేషాలు ఎక్కడా ఉండవు.

ఈ నిశ్శబ్దం భ్రమే అయినట్లయితే మనస్సుకీ, దానికీ సంబంధం ఉండి ఉండేది. దాన్ని కాదనటమో, దాన్ని పట్టుకు వ్రేళ్ళాడటమో, దాన్ని సహేతుకంగా చెప్పటమో, లేదా, పైకి కనిపించకుండా తృప్తిపడి దానితో సమైక్యం కావటమో చేసేది. ఈ నిశ్శబ్దంతో దానికి ఎటువంటి సంబంధమూ లేదు కనుక మనస్సు దాన్ని అంగీకరించటమూ లేదు, కాదనటమూ లేదు. మనస్సు తనలోంచి వచ్చిన వాటిపైన, తన రూపకల్పనల పైనే పని చేయగలదు. తాను పుట్టించని వాటితో దానికి సంబంధము ఉండదు. ఈ నిశ్శబ్దం మనస్సులోంచి వచ్చినది కాదు. అందువల్ల మనస్సు దాన్ని అలవాటు చేసుకోవటం గాని, దానితో సమైక్యత పొందటంగాని చెయ్యలేదు. ఈ నిశ్శబ్దంలో ఉన్నదాన్ని మాటలతో కొలవటానికి వీలులేదు.