Jump to content

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/జ్ఞానులా, వివేకవంతులా?

వికీసోర్స్ నుండి

77. జ్ఞానులా, వివేకవంతులా?

ఎన్నో నెలల నుంచి ఉన్న దుమ్మునీ, ఎండనీ వానలు తుడిచి పెట్టేశాయి. ఆకులు స్వచ్ఛంగా మెరుస్తున్నాయి. చిగుళ్లు తొడగటం మొదలు పెట్టాయి. రాత్రి పొడుగుతా కప్పల బెకబెకలతో నిండింది వాతావరణం. కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ మొదలుపెడతాయి. నది వేగంగా ప్రవహిస్తోంది. గాలి మృదువుగా ఉంది. వానలు అయిపోలేదింకా. నల్లని మబ్బులు గుమిగూడుతున్నాయి. సూర్యుడు మరుగున ఉన్నాడు. నేలా చెట్లూ, ప్రకృతీ - అంతా మరొకసారి పరిశుద్ధం కావటానికీ నిరీక్షిస్తున్నట్లుగా ఉంది. రోడ్డు నల్లమన్ను రంగులో ఉంది. పిల్లలు నీటిమడుగుల్లో ఆడుతున్నారు చుట్టూ గోడలుపెట్టి. నెలల తరబడి వేడిమి తరవాత వాతావరణం హాయిగా ఉంది. నేలనిండా పచ్చగడ్డి పెరుగుతోంది. ప్రతిదీ పునఃసృష్టి చెందుతోంది.
పునఃసృష్టిలో అమాయకత్వం ఉంటుంది. తాను విశేషజ్ఞానం ఉన్న వాణ్ణని ఆయన అనుకుంటాడు. ఆయనకి జీవితసారమే జ్ఞానం. జ్ఞానం లేని జీవితం మరణం కన్న చెడ్డదిట. ఆయనకున్న జ్ఞానం ఒకటి రెండు విషయాల్లో కాదు, జీవితంలోని ఎన్నోదశలకు సంబంధించినది. అణువు గురించీ, ఆహారం గురించీ, కమ్యూనిజం గురించీ, ఖగోళశాస్త్రం గురించీ, నదిలో సంవత్సరానికి ప్రవహించే నీరు గురించీ, ఆహారం గురించీ, జనాభా పెరుగుదల గురించి ధీమాగా మాట్లాడగలిగాడు. తనకున్న జ్ఞానానికి గర్విస్తున్నాడాయన. ప్రదర్శనా చతురుడిలా తన ప్రభావాన్ని కనపరచాడు. ఇతరులు మౌనంగా, గౌరవప్రదంగా ఉండేట్లు చేశాడు. మనకి జ్ఞానం అంటే ఎంత భయం! తెలిసిన వాణ్ణి మనం ఎంత గౌరవిస్తాం! ఆయన ఇంగ్లీషు కొన్నిసార్లు అర్థం చేసుకోవటం కష్టమనిపించింది. తన దేశాన్ని విడిచి ఎప్పుడూ వెళ్లలేదుట. కాని ఇతరదేశాల పుస్తకాలున్నాయట ఆయన దగ్గర. కొందరు తాగుడుకో, ఇంకేదో ఆకలి తీర్చుకోవటానికో అలవాటు పడిపోయినట్లు ఆయన జ్ఞానార్జనకి అలవాటు పడ్డాడు.

"వివేకం అంటే ఏమిటి జ్ఞానం కాకపోతే? జ్ఞానాన్నంతటినీ అణచి వెయ్యాలని ఎందుకు చెబుతారు మీరు? జ్ఞానం అత్యవసరం కాదా? లేకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్లం? ఇంకా ఆదిమవాసుల్లా, మన చుట్టూ ఉన్న అద్భుత ప్రపంచం గురించి ఏమీ తెలుసుకోకుండా ఉండిపోయేవాళ్లం. జ్ఞానం లేకపోతే ఏస్థాయిలో బ్రతకాలన్నా అసాధ్యం. అవగాహన కావటానికి జ్ఞానం అవరోధం అని ఎందుకు చెబుతున్నారు?"

జ్ఞానం ప్రభావితం చేస్తుంది. జ్ఞానం స్వేచ్ఛనివ్వదు. విమానంలో ఎగరటం, కొద్దిగంటల్లో ప్రపంచపు అవతలికొనకి వెళ్లటం తెలియవచ్చు, కాని అది స్వేచ్ఛ కాదు. జ్ఞానం సృజనాత్మకమైనది కాదు -జ్ఞానం కొనసాగుతూ ఉండేది కనుక. కొనసాగుతూ ఉండేది నిగూఢమైనదానికీ, అభేద్యమైనదానికీ, అపరిచితమైన దానికీ దారితీయలేదు. విశాలమైన దానికీ, అపరిచితమైన దానికీ, జ్ఞానం ప్రతిబంధకం. అపరిచితమైనదాన్ని పరిచితమైన దానితో కప్పి ఉంచటానికి కుదరదు. తెలిసినది ఎప్పుడూ గతంలోకి జరుగుతూ ఉంటుంది. గతం ప్రస్తుతాన్నీ, తెలియని దాన్నీ తన నీడలో ఉంచుతుంది. స్వేచ్ఛ లేకుండా, విశాలమైన మనస్సు లేకుండా అవగాహన సాధ్యం కాదు. అవగాహన జ్ఞానంవల్ల కలగదు. మాటల మధ్యా, ఆలోచనల మధ్యా ఏర్పడే విరామంలో అవగాహన కలుగుతుంది. ఈ విరామం జ్ఞానం భేదించలేని నిశ్శబ్దం. అది విశాలమైనది, అభేద్యమైనది, నిగూఢమైనది.

"జ్ఞానం ఉపయోగకరం, అత్యవసరం కాదా? జ్ఞానం లేకుండా కనిపెట్టటం ఎలా జరగగలదు?"

ఆవిష్కారం జరిగేది మనస్సు జ్ఞానంతో కిక్కిరిసినప్పుడు కాదు, జ్ఞానం లేనప్పుడే. అప్పుడే నిశ్చలత, విరామం ఉంటుంది. ఈ అవగాహన అయే స్థితిలోనే ఆవిష్కరణ జరుగుతుంది. జ్ఞానం ఒక స్థాయిలో ఉపయోగకరమే నిస్సందేహంగా. కాని మరొక దాంట్లో అది స్పష్టంగా హానికరమైనది. తన గొప్పతనాన్ని పెంపొందించుకోవటానికీ, తానుపైకి రావటానికీ, జ్ఞానాన్ని వినియోగించటం విభేదాన్నీ, విరోధాన్నీ పెంపొందింపజేసే దుష్టకార్యం. దేవుడు పేరుతో చేసినా, ప్రభుత్వం పేరుతో చేసినా, సిద్ధాంతం పేరుతో చేసినా ఆత్మవిస్తరణ వినాశమే. జ్ఞానం ప్రభావితం చేసేదైనప్పటికీ, ఒక స్థాయిలో అవసరమే: భాష, సాంకేతిక సామర్థ్యం మొదలైన వాటిల్లో. వీటివల్ల ప్రభావితం కావటం రక్షణ దాయకం, మన బాహ్య జీవనానికి అవసరమూను. కాని, ఇలా ప్రభావితం కావటాన్ని మానసికంగా ఉపయోగించుకున్నట్లయితేనూ, మానసిక సౌఖ్యానికీ, సంతృప్తికీ జ్ఞానం సాధనం అయినట్లయితేనూ, అప్పుడు జ్ఞానం సంఘర్షణనీ, గందరగోళాన్నీ పెంపొందించటం అనివార్యం. అది అలా ఉంచి, ఇంతకీ తెలుసుకోవటం అంటే అర్థం ఏమిటి? మీకు వాస్తవంగా తెలిసినది ఏమిటి?

"నాకు చాలా విషయాలు తెలుసు."

మీ ఉద్దేశం, మీకు చాలా విషయాల గురించి భోగట్టా తెలుసును. వివరాలు తెలుసును. కొన్ని యథార్థాల గురించి వివరాలు పోగుచేశారుః అయితే ఏమిటి? యుద్ధభీభత్సం గురించిన వివరాలు యుద్ధం రాకుండా చేస్తాయా? కోపం వల్లా, హింసవల్లా వ్యక్తిలోనూ, సంఘంలోనూ ఏర్పడే ఫలితాల గురించి మీ దగ్గర ఎన్నో వివరాలుండి ఉంటాయి నిశ్చయంగా. ఈ వివరాలు ద్వేషాన్నీ, వైరుధ్యాన్నీ అంతం చేయగలిగాయా? "యుద్ధం వల్ల కలిగే ఫలితాల గురించిన జ్ఞానం యుద్ధాలను తక్షణం అంతం చెయ్యకపోవచ్చు. కాని, చిట్టచివరికి శాంతిని నెలకొల్పుతుంది. జనానికి తెలియజెప్పాలి. వారికి యుద్ధఫలితాలనూ, సంఘర్షణ ఫలితాలనూ చూపించాలి."

జనం అంటే మీరు, ఇంకొకరూను. మీ దగ్గర ఇన్ని వివరాలున్నాయి. అందువల్ల మీరు తక్కువ ఆకాంక్షాపరులూ, తక్కువ హింసాపరులూ, తక్కువ స్వార్థపరులూనా? మీరు ఎన్నో విప్లవాల గురించి చదివారు. అసమానత్వం యొక్క చరిత్ర చదివారు. కాని, మీరు అధికులమనే భావం లేకుండానూ, మీకు మీరు ప్రాముఖ్యాన్ని ఇచ్చుకోకుండానూ ఉన్నారా? ప్రపంచంలోని దుఃఖాల గురించీ, దుర్ఘటనల గురించీ అపారమైన జ్ఞానం మీకున్నందువల్ల మీరు ప్రేమ చూపిస్తున్నారా? మనకి జ్ఞానం ఉన్నదనుకునే విషయాల గురించి మనకేం తెలుసును?

"యుగయుగాల నుంచీ కూడబెట్టిన అనుభవమే జ్ఞానం. ఒక రకంగా అది సంప్రదాయం, రెండోది వ్యక్తంగానూ అవ్యక్తంగానూ ఉండే సహజ ప్రవృత్తి. దాగి ఉన్న జ్ఞాపకాలూ, అనుభవాలూ, సంక్రమించినవిగాని. సంపాదించినవి గాని మార్గదర్శకులై మన చర్యలను తీర్చిదిద్దుతాయి. ఈ జ్ఞాపకాలు - జాతీయమైనవీ. వ్యక్తిగతమైనవీ ముఖ్యావసరం - మానవుడికి సహాయపడుతూ రక్షణనిస్తాయి కనుక. అటువంటి జ్ఞానాన్ని వదిలేసుకోమంటారా?"

భయం వల్ల రూపొందిన చర్య, భయం మూలంగా తీసుకోబడిన చర్య చర్యేకాదు. జాతీయ దురభిప్రాయాలూ, భయాలూ, ఆశలూ, భ్రమలూ - వీటి ఫలితంగా తీసుకున్న చర్య ప్రభావితమైనది. ప్రభావితమైనదంతా మనం చెప్పినట్లు, మరింత సంఘర్షణనీ, దుఃఖాన్నీ పెంపొందిస్తుంది. తరతరాల నుంచీ వస్తున్న సంప్రదాయాల ప్రకారం బ్రాహ్మణుడిగా మీరు ప్రభావితం అయారు. ఏ ప్రేరేపణకైనా, సాంఘిక పరివర్తనలకైనా, సంఘర్షణలకైనా మీ ప్రతిక్రియ బ్రాహ్మణుడిగానే ఉంటుంది. మీ ప్రతిక్రియ మీరు ప్రభావితమైన దాన్ని బట్టీ, మీ గతానుభవాలను బట్టీ, జ్ఞానాన్ని బట్టీ ఉంటుంది. అందుచేత కొత్త అనుభవం మరింత ప్రభావితం చేస్తుంది. ఒక నమ్మకం ప్రకారం, ఒక సిద్ధాంతం ప్రకారం అనుభవం పొందటం ఆ నమ్మకం, అభిప్రాయం మరింత కొనసాగేటట్లు జరగటం మాత్రమే. అటువంటి అనుభవం నమ్మకాన్ని పటిష్ఠం చేస్తుంది. అభిప్రాయం వేరుచేస్తుంది. ఒక అభిప్రాయం ప్రకారం, ఒక పథకం ప్రకారం మీరు పొందిన అనుభవం మిమ్మల్ని మరింత వేరుచేస్తుంది. జ్ఞానం, మానసికంగా కూడబెట్టినదయిన అనుభవం ప్రభావితం చేస్తుందంతే. అనుభవం పొందటం మరోరకంగా తన్ను తాను గొప్పగా చేసుకోవటమే. అనుభవం వల్ల కలిగిన జ్ఞానం మానసిక స్థాయిలో అవగాహనకి అంతరాయం కలిగిస్తుంది.

"మన నమ్మకం ప్రకారమే మనం అనుభవం పొందుతామా?"

అది స్పష్టమే, కాదా? ఒక రకమైన సమాజం వల్ల మీరు ప్రభావితం అయారు - అంటే మరొక స్థాయిలో - దేవుడిలో నమ్మకం, సాంఘిక విభేదాల్లో నమ్మకం; మరొకరు దేవుడు లేడనీ, ఒక ప్రత్యేక సిద్ధాంతాన్నీ అనుసరించాలనీ ప్రభావితం అవుతాడు. మీరిద్దరూ మీమీ నమ్మకాల ప్రకారమే అనుభవం పొందుతారు. కాని, అటువంటి అనుభవం తెలియని దాన్ని తెలుసుకోనివ్వకుండా ప్రతిబంధకమవుతుంది. అనుభవం, జ్ఞానం రూపంలో కొన్ని స్థాయిల్లో ఉపయోగకరమే. కాని అనుభవం మానసికమైన "నా" అనే అహాన్ని శక్తిమంతం చెయ్యటం ద్వారా భ్రాంతికీ, దుఃఖానికీ దారి తీస్తుందంతే. మనస్సు అనుభవాలతో, జ్ఞాపకాలతో, జ్ఞానంతో నిండిపోయి ఉన్నట్లయితే మనం ఏం తెలుసుకోగలం? మనం తెలుసుకుని ఉంటే, దాన్ని అనుభవం పొంద గలమా? అనుభవించటానికి తెలిసినది అడ్డురాదా? మీకా పువ్వుపేరు తెలిసి ఉండొచ్చు. అంత మాత్రం చేత ఆ పువ్వుని అనుభవం పొందినట్లేనా? అనుభవం ముందు కలుగుతుంది. తరవాత దానికొక పేరుపెట్టి అనుభవానికి బలాన్ని చేకూర్చటం జరుగుతుంది. ఈ పేరు పెట్టటం ఇంకా అనుభవించకుండా ఆటంకపడుతుంది. అనుభవించే స్థితిలో పేరు పెట్టకుండా జ్ఞాపకంతో సంపర్కం లేకుండా స్వేచ్ఛగా ఉండొద్దా?

జ్ఞానం పైపైదే. పైపైనే ఉన్నది ప్రగాఢమైనదానికి దారితీయగలదా? తెలిసి ఉన్నదాని ఫలితమైన మనస్సు, గతం యొక్క ఫలితమైన మనస్సు అది స్వయంగా తాను కల్పించుకున్న వాటికి అతీతంగా పోగలదా? కొత్తదాన్ని కనుక్కోవటానికి కల్పించటం మానెయ్యాలి. తన కల్పనలు లేకపోతే మనస్సే ఉండదు. జ్ఞానమూ, గతమూ తనకు తెలిసినదాన్నే రూపకల్పన చేయగలదు. తెలిసిన దానికి సాధనమైనది కొత్తదాన్ని కనిపెట్టేదిగా కాలేదు ఎన్నటికీ. కొత్తది కనుక్కోవటానికి తెలిసినదంతా అంతమైపోవాలి. అనుభవించటానికి అనుభవం అంతమవాలి. జ్ఞానం అవగాహనకు ఆటంకం.

"ఇంక మనకి ఏం మిగులుతుంది జ్ఞానం, అనుభవం, జ్ఞాపకం లేకపోతే? అప్పుడు మనం ఏమీ కాదు."

ఇప్పుడు మనం ఉన్నది అంతకన్న ఎక్కువ ఏమైనానా? "జ్ఞానం లేకపోతే మనం ఏమి కాదు" అని మీరు అనటం ఊరికే మాటల్లో ఉద్ఘాటిస్తున్నారంతే - ఆ స్థితిని అనుభవించకుండా. కాదా? మీరామాటలు అంటున్నప్పుడు భయానుభూతి కలిగింది - నగ్నంగా మిగిలిపోవాలన్న భయం. ఈ కూడబెట్టినవన్నీ లేకపోతే మీరు ఏమీకాదు - అదే సత్యం. అలాగే ఎందుకు ఉండకూడదు? ఎందుకీ వేషాలూ మోసాలూ? ఈ ఏమీ లేకపోవటాన్ని మనం కల్పనలతో, ఆశలతో, సౌఖ్యదాయకమైన ఊహలతో కప్పి ఉంచాం. ఈ కప్పిన వాటి క్రింద ఉన్న మనం ఏమీ కాదు. ఏదో వేదాంత భావం కాదు, వాస్తవంగానే ఏమీ కాదు. ఆ ఏమీ కాకపోవటమనే దాన్ని అనుభవించటమే వివేకానికి ఆరంభం.

మనకి తెలియదని చెప్పటానికి ఎంత సిగ్గుపడతాం! తెలియదన్న వాస్తవాన్ని మాటలతో వివరాలతో కప్పిపుచ్చుతాం. వాస్తవంగా మీరు మీ భార్యని తెలుసుకోరు. మీ ఇరుగుపొరుగుని తెలుసుకోరు. ఎలా తెలుసుకుంటారు. మిమ్మల్ని మీరే తెలుసుకోనప్పుడు? మీవద్ద మీగురించి బోలెడు వివరాలూ, నిర్ణయాలూ, సమర్థనలూ ఉన్నాయి. కాని, నిగూఢమైన దాన్ని మీరు తెలుసుకోలేదు. జ్ఞానం అనబడే సమర్థనలూ, నిర్ణయాలూ ఉన్నస్థితిని అనుభవించకుండా ఆటంక పరుస్తాయి. అమాయకంగా లేకుండా ఉంటే వివేకం ఎలా కలుగుతుంది? గతం మరణించకుండా అమాయకత ఎలా పునరుద్భవిస్తుంది? మరణించటం క్షణక్షణానికి జరుగుతుంది. మరణించటం అంటే కూడబెట్టకుండా ఉండటం. అనుభవించే వాని అనుభవం మరణించాలి అనుభవం లేకపోతే, జ్ఞానం లేకపోతే అనుభవించే వాడే ఉండడు. తెలియటమంటే అజ్ఞానంగా ఉండటం. తెలియకుండా ఉండటమే వివేకానికి ఆరంభం.