మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/నిశ్చలత, ఇచ్ఛ

వికీసోర్స్ నుండి

78. నిశ్చలత, ఇచ్ఛ

పొడుగ్గా వంపుతిరిగి ఉన్న ఆ సముద్రతీరం మీద ఎవ్వరూ లేరు. కొద్దిమంది జాలరి వాళ్లు మాత్రం ఆ పొడుగాటి కొబ్బరిచెట్ల మధ్యనుంచి గ్రామానికి వెడుతున్నారు. నడుస్తూనే దారం వడుకుతున్నారు - తమ తొడల మీద దూదిని ఒత్తి, దారం బండికి చుడుతూ. ఆ దారం సన్నగా బలంగా ఉంది. కొంత మంది సునాయాసంగా ఒడుపుగా నడుస్తున్నారు. తక్కిన వాళ్లు కాళ్లు ఈడుస్తున్నారు. వాళ్లు సరియైన తిండి లేక, ఎండకి నల్లగా మాడి ఉన్నారు: ఓ కుర్రవాడు పాడుతూ వెళ్లాడు. పెద్దపెద్ద అంగలు వేసుకుంటూ. సముద్రం పొంగుతూ లోపలికొచ్చింది. గాలి విసురుగా లేదు, కాని సముద్రం మాత్రం నిండుగా ఉంది, ఉధృత తరంగాలతో, నీలి, పచ్చరంగు నీళ్లలోంచి నిండు చంద్రుడు అప్పుడే పైకి లేస్తున్నాడు. పచ్చని ఇసుకకి ఎదురుగా తెల్లని అలలు.

జీవితం అసలు ఎంత సరళంగా ఉంటుందో, దాన్ని మనం అంత క్లిష్టం చేస్తాం! జీవితం క్లిష్టమైంది. కాని దానితో సరళంగా ఎలా ఉండాలో మనకి తెలియదు. క్లిష్టంగా ఉన్నదాన్ని సరళంగా సమీపించాలి, లేకపోతే దాన్ని ఎన్నటికీ అర్థం చేసుకోలేము. మనకి అతిగా తెలుసు, అందుకే జీవితం మనకి అందకుండా పోతోంది. అతిగా ఉంటే అసలు లేనట్లే. ఉన్న కొంచెంతో అపారమైన దాన్ని ఎదుర్కొంటాం. అపరిమితమైన దాన్ని ఎలా కొలవగలం? మన దర్పం మనల్ని మందకొడిగా చేస్తుంది. మన అనుభవం, జ్ఞానం మనల్ని బంధించి ఉంచుతాయి. జీవన ప్రవాహం మన పక్కనుంచే కొట్టుకుపోతుంది. ఆ కుర్రాడితో కలిసి పాడటం, ఆ జాలరి వాళ్లతో కలిసి కాళ్లీడుస్తూ నడవటం, తొడమీద దారం పేనటం, అ గ్రామస్థులతో ఉండటం, కారులో ఉన్న ఆ దంపతులతో ఉండటం, అవన్నీ చేయటానికి వారితో కలిసిపోయే చాకచక్యం కాదు. దానికి ప్రేమ కావాలి. ప్రేమ క్లిష్టమైనది కాదు. కాని, మనస్సు దాన్ని అలా చేస్తుంది. మనం మనస్సుతోనే మితిమిక్కిలిగా ఉంటాం. ప్రేమ మార్గాలూ మనకి తెలియవు. మనకి కోరిక రీతులూ, కోరికలోని పట్టుదలా తెలుసును. కాని మనకి ప్రేమ ఏమిటో తెలియదు. ప్రేమ పొగ లేని జ్వాల. మనకి పొగ బాగా తెలుసు. దానితో మన తలలూ, గుండెలూ నిండిపోతాయి. మనం చీకటిగా ఉంటాం. జ్వాల యొక్క సౌందర్యంతో మనం సరళంగా ఉండలేం. దానితో మనల్ని మనం చిత్రహింస పెట్టుకుంటాం. జ్వాలతో కలిసి, అది మనల్ని ఎక్కడికి చురుకుగా తీసుకుపోయినా, దానితో కలిసి జీవించం. మనకి మితి మిక్కిలిగా అంటే, బహుస్వల్పంగా తెలుసు. దాంతో ప్రేమపథాన్ని నిర్మిస్తాం. ప్రేమ మనకి అందకుండా మురిపిస్తుంది. మనకున్నది ఖాళీచట్రం మాత్రమే. తమకు తెలియదని తెలిసి ఉన్నవారు సరళమైన వారు. వారు ఎంతో దూరానికి పోతారు, వారికి జ్ఞానభారం ఉండదు కనుక.

ఆయన కొంతపేరు ప్రఖ్యాతులున్న సన్యాసి. కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నాడు దూరంగా ఎటో చూస్తూ. ఆయన ఎన్నో సంవత్సరాల క్రితమే అన్నీ త్యజించానని చెప్పుకొస్తున్నాడు. ఇప్పుడు ఈ లోకంగాని, మరోలోకంగాని ఏదీ ఆసక్తి కలిగించని స్థితికి చేరుకున్నాడుట. ఆయన ఎన్నో కఠోర నియమాలను సాధన చేశాడుట. తన శ్వాసమీదా, మానసిక స్థితి మీదా అసాధారణమైన నిగ్రహం చూసేవాడుట. దీనివల్ల ఆయన కోరకపోయినా, గొప్ప శక్తీ, అనుభూతీ కలిగిందిట.

ఆకాంక్షకీ, దర్పానికీ ఉన్న శక్తి లాగే ఈ శక్తి కూడా అవగాహనకి హానికరం కాదా? దురాశ కూడా భయం లాగే శక్తివంతమైన చర్యకి కారకమవుతుంది. శక్తీ, ఆధిపత్యం అనే అనుభూతీ అంతా ఆత్మని, "నేను" అనేదాన్ని "నా" అనే దాన్ని శక్తివంతం చేస్తుంది. సత్యానికి "నేను" ప్రతిబంధకం కాదా?

"అధమంగా ఉన్నదాన్ని అణచిపెట్టటమో, లేదా ఉన్నతమైనదానికి అనుగుణంగా ఉండేట్లో చెయ్యాలి. వివిధ మనో, శారీరక వాంఛల మధ్య సంఘర్షణ లేకుండా నిశ్చలంగా చెయ్యాలి. ఇలా నిగ్రహించటంలో స్వారి చేసేవాడు శక్తిని చవిచూస్తాడు. అయితే, ఈ శక్తి మరింత ఉన్నతంగానో, మరింత ప్రగాఢంగానో పోవటానికి ఉపయోగిస్తాడు. శక్తిని స్వార్థంకోసం వినియోగిస్తే హానికరం. అంతేకాని, మహోన్నతమైనదాని కోసం మార్గాన్ని సిద్ధం చేసినందువల్లకాదు. ఇచ్ఛ అనేది శక్తి. అది ఆదేశం, వ్యక్తిగత లక్ష్యం కోసం ఉపయోగిస్తే వినాశకరం, కాని సరియైన మార్గంలో వినియోగిస్తే లాభ దాయకం. ఇచ్ఛ లేకుండా చర్య అనేదే జరగలేదు."

ప్రతి నాయకుడూ అధికారాన్ని ఒక లక్ష్యానికి సాధనంగానే వినియోగిస్తాడు. మామూలు మనిషి కూడా అదే పని చేస్తాడు. కాని, నాయకుడు అందరి క్షేమం కోసం వినియోగిస్తున్నానని చెబుతాడు. మామూలు మనిషి తన కోసమే తాను చూసుకుంటాడు. నియంతా, అధికారీ, నాయకుడూ - వీరి లక్ష్యమూ, వారిని అనుసరించేవారి లక్ష్యమూ ఒకటే, ఒకలాంటివే. ఒకటి విస్తృతమైతే మరొకటి అవుతుంది. రెండూ స్వయంకల్పితాలే. మనం ఒకదాన్ని నిరసించి రెండవదాన్ని మెచ్చుకుంటాం. కాని, లక్ష్యాలన్నీ తమకున్న దురభిప్రాయాలూ, ఉద్దేశాలూ, భయాలూ, ఆశలూ వీటి ఫలితంగా వచ్చినవే కాదా? మీరు ఇచ్ఛా, కృషీ, శక్తి వినియోగిస్తారు మహోత్కృష్టమైన దాని కోసం. మహోత్కృష్టమైనది కోరిక - అంటే ఇచ్ఛ రూపొందించినదే. ఇచ్ఛ తన లక్ష్యాన్ని తాను సృష్టించుకుని దానికోసం ప్రతిదాన్నీ త్యాగం చెయ్యటమో, అణచిపెట్టటమో చేస్తుంది. లక్ష్యం తానే. కాని, దాన్ని మహోత్కృష్టమైనది అనీ, ప్రభుత్వం అనీ, సిద్ధాంతం అనీ పేర్లు పెడుతుంది.

"ఇచ్ఛాశక్తి లేకుండా సంఘర్షణ అంతం కాగలదా?"

సంఘర్షణ తీరుల్ని, అది ఎలా బయలుదేరిందనేదాన్ని అవగాహన చేసుకోకుండా ఊరికే సంఘర్షణని అణచి పెట్టటంలోగాని, దాన్ని మహనీయంగా చేయటంలో గాని, దాని స్థానంలో మరొకదాన్ని ప్రత్యామ్నాయంగా ఉంచటంలో గాని విలువ ఏముంటుంది? ఒక రోగాన్ని మీరు అణచిపెట్టవచ్చు. కాని, అది మరోరూపంలో తలెత్తుతుంది. ఇచ్ఛ అనేదే సంఘర్షణ. పోరాటంలోంచి పుట్టినదే అది. ఇచ్ఛ అంటే ఒక ప్రయోజనాన్ని, ఒక మార్గాన్ని అనుసరించే కోరిక. కోరిక పనిచేసే రీతిని అర్థం చేసుకోకుండా కేవలం దాన్ని నిగ్రహించటం మాత్రమే చేయటం వల్ల మరింత మంటా, బాధా కొనితెచ్చుకున్నట్లవుతుంది. నిగ్రహం అంటే తప్పించుకోవటం - ఒక చిన్నపిల్లవాణ్ణిగాని, ఒక సమస్యని గాని అణచిపెట్టవచ్చు. కాని దానివల్ల పిల్లవాణ్ణి గాని సమస్యనిగాని అర్థం చేసుకున్నట్లుకాదు. ఒక లక్ష్యాన్ని చేరుకోవటం కన్న దాన్ని అర్థం చేసుకోవటం ఎక్కువ ముఖ్యం. ఇచ్ఛానుసారం చేసిన క్రియ వినాశకరం. ఎందుకంటే, ఒక లక్ష్యంతో చేసిన పని స్వార్థపూరితంగా, అందరినీ వేరు చేసేట్లుగానూ, విడిగా, ఒక్కరుగా ఉండేట్లూ చేస్తుంది. సంఘర్షణనీ, కోరికని అణచిపెట్టలేరు. ఎందువల్లనంటే, ఆ కృషి చేసేవాడు కూడా సంఘర్షణ నుంచీ, కోరిక నుంచీ పుట్టిన వాడే కనుక. ఆలోచించేవాడూ, అతని ఆలోచనలూ కూడా కోరిక నుంచి వచ్చినవే. కోరికని, అంటే ఆత్మని, దాన్ని ఉన్నతస్థానంలో ఉంచినా, నీచ స్థానంలో ఉంచినా, దాన్ని అర్థం చేసుకోకుండా ఉన్నట్లయితే మనస్సు ఎప్పటికీ అజ్ఞానంలో చిక్కుకుని ఉంటుంది. మహోత్కృష్టమైన దానికి మార్గం ఇచ్ఛలోనూ, కోరికలోనూ లేదు. కృషి చేసేవాడు లేనప్పుడే మహోత్కృష్టమైనది ఉద్భవిస్తుంది. ఇచ్ఛ అనేదే సంఘర్షణనీ, ఏదో అవాలనే కోరికనీ, లేదా, మహోత్కృష్టం కావటానికి మార్గం వేసుకోవటాన్నీ పెంపొందిస్తుంది. కోరిక ద్వారా సంఘటితమైన మనస్సు కృషి లేకుండా అంతమొందినప్పుడే, అప్పుడే, ఆ నిశ్చలతలోనే యథార్థం - లక్ష్యం కానిది - ఆవిర్భవిస్తుంది.

"కాని ఆ నిశ్చలతకి నిరాడంబరత్వం అత్యవసరం కాదా?"

నిరాడంబరత్వం అంటే మీ ఉద్దేశం ఏమిటి? అంటే నిరాడంబరత్వంతో ఏకీభవించటమా, లేక నిరాడంబరంగా ఉండటమా?

"నిరాడంబరమైన వాటితో బాహ్యంగా గాని, అంతర్గతంగా గాని తాదాత్మ్యం చెందకుండా నిరాడంబరంగా ఉండలేరు."

మీరు నిరాడంబరంగా అవుతారు. అంతేనా? మీరు గందరగోళంగా ఉంటారు. కాని తాదాత్మ్యం చెందటం ద్వారా, రైతులాగో, సన్యాసిలాగో దుస్తులు వేసుకోవటం ద్వారా, మిమ్మల్ని వాటితో కలుపుకోవటం ద్వారా మీరు నిరాడంబరంగా అవుతారు. నేను ఇది, నేను అది అవుతాను. కాని, ఈ అయే విధానం నిరాడంబరత్వానికి దారి తీస్తుందా. లేక నిరాడంబరత్వం అనే భావానికి మాత్రమేనా? నిరాడంబరత్వం అనే భావంతో తాదాత్మ్యం కావటం నిరాడంబరత్వం కాదు, అవునా? నేను పనికట్టుకుని నిరాడంబరుడనని చెప్పుకున్నందువల్లనో, నిరాడంబరత్వం అనే రీతితో నన్ను నేను కలుపుకోవటం వల్లనో నేను నిరాడంబరంగా ఉన్నట్లా? ఉన్నస్థితిని అర్థం చేసుకోవటంలోనే నిరాడంబరత ఉంటుంది. అంతేగాని ఉన్నస్థితిని నిరాడంబరత్వానికి మార్చటంలో కాదు. ఉన్నస్థితిని అది కాని స్థితికి మార్చగలరా? దేవుని కోసం గాని, ధనం కోసంగాని, తాగుడు కోసం గాని ఉండే ప్రలోభం ఎన్నటికైనా ప్రలోభంకానిది అవుతుందా? మనం దేనితో ఏకం అవాలనుకుంటామో అది ఎప్పుడూ స్వయం కల్పితమైనదే - అది మహోత్కృష్టమైనదైనా, ప్రభుత్వమైనా, కుటుంబమైనా. ఏ స్థాయిలో ఏకం కావాలనుకుంటున్నా అది స్వార్థంతో కూడుకొన్నదే.

నిరాడంబరత్వం అంటే ఉన్నస్థితిని అవగాహన చేసుకోవటం, అది ఎంత గందరగోళంగా ఉన్నా సరే. ఉన్నస్థితిని అర్థం చేసుకోవటం కష్టంకాదు. కాని అవగాహనకి అడ్డువచ్చేదేమిటంటే, పోల్చటం ద్వారా, ఖండించటం ద్వారా, దురభిప్రాయం ద్వారా, వ్యక్తమయినా, కాకపోయినా, ఈవిధంగా దృష్టి మరో వైపుకి మరలటమే. ఇవే గందరగోళానికి కారణం. ఉన్నస్థితి దానంతట అది ఎప్పుడూ గందరగోళంగా ఉండదు. అది ఎప్పుడూ సులభంగానే ఉంటుంది.

మీరున్న స్థితిని అర్థం చేసుకోవటం సులభమే. కాని, దాన్ని మీరు సమీపించే పద్ధతి దాన్ని గందరగోళం చేస్తోంది. అందుచేత గందరగోళాన్ని సృష్టించే ఆ మొత్తం పద్ధతి అవగాహన కావాలి. పిల్లవాణ్ణి నిందించకుండా ఉంటే పిల్లవాడు ఉన్నవాడు ఉన్నట్లుంటాడు. అప్పుడు ఏదైనా చెయ్యటానికి అవకాశం ఉంటుంది. నిందించటం గందరగోళానికి దారితీస్తుంది. ఉన్నస్థితిలో వర్తించటం నిరాడంబరత.

నిశ్చలత్వానికి ముఖ్యంగా కావలసినది నిశ్చలత్వం తప్ప మరేదీ కాదు. దానికి మొదలూ, తుదీ అదే. దాన్ని తెచ్చేందుకు అత్యవసరమైనవేవీ లేవు. అది ఉంటుంది. అంతే. ఏ సాధనలూ నిశ్చలత్వానికి దారితీయలేవు. నిశ్చలత్వం ఏదో విధంగా సాధించవలసిన దానిలా అయినప్పుడు మాత్రమే సాధనాలు అత్యవసరమవుతాయి. నిశ్చలత్వాన్ని కొనుక్కోవాలనుకున్నది నిశ్చలత్వం కాదు. సాధనాలు గొడవగా, హింసాత్మకంగా, పైకి తెలియకుండా లాభకరంగా ఉంటాయి. గమ్యం కూడా అలాగే ఉంటుంది, గమ్యం కూడా సాధానాల్లోనే ఉంటుంది కనుక. ఆదిలో నిశ్శబ్దం ఉంటుంది. చప్పుడు, మరింత చప్పుడు చేయటం వల్ల - కృషీ, క్రమశిక్షణా, కఠోర నియమాలూ, ఇచ్ఛా - వీటి చప్పుడు వల్ల అంతం కాదు. దీనిలోని సత్యాన్ని గ్రహించండి, నిశ్శబ్దం ఉంటుంది.