మనుచరిత్ర/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


శ్రీఖండ శీతనగ మ
ధ్యాఖండక్షోణిమండ లాఖండల వి
ద్యాఖేలనభోజ సుధీ
లేఖద్రుమ కృష్ణరాయ లీలామదనా

అవధరింపుము జైమిని మునీంద్రునకుం ప్రజ్ఞాసాంద్రంబులగు పక్షీంద్రంబు లవ్వలికథ ఇట్లని చెప్పందొడంగె

అటజనికాంచె భూమిసురు డంబరచుంబి శిర స్సర జ్ఝరీ
పటల ముహుర్ముహు ర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్‌
కటకచరత్‌ కరేణు కర కంపిత సాలము శీతశైలమున్‌

కాంచి అంతరంగంబునం తరంగితంబగు హర్షోత్కర్షంబున

నరనారాయణ చరణాం
బురుహ ద్వయ భద్రచిహ్నముద్రిత బదరీ
తరు షండమండలాంతర
సరణిన్‌ ధరణిసురుండు సన చన నెదుటన్‌

ఉల్లల దలకా జలకణ
పల్లవిత కదంబ ముకుళ పరిమళ లహరీ
హల్లోహల మద బంభర
మల్లధ్వనులెసగ విసరె మరుదంకురముల్‌

తొండముల్‌ సాచి యందుగు చిగుళ్ళకు నిక్కు
కరుల దంతచ్ఛాయ కడలుకొనగ
నెలవుల వనదంశములుమూగి నెరెవెట్ట
కోల్పులుల్‌ పొదరిండ్ల గురకలిడగ
సెలయేటి యిసుకలంకల వరాహంబులు
మొత్తంబులై త్రవ్వి ముస్తెలెత్త
అడ్డంబు నిడువు నాబడ్డలగతి మను
బిళ్ళు డొంకలనుండి క్రేళ్ళుదాట

ప్రబల భల్లుక నఖ భల్ల భయద మథన
శిథిల మధుకోశ విసర వికీర్ణ మక్షి
కాంతరాంతర దంతురి తాతపమున
పుడమి తిలతండుల న్యాయమున వెలుంగ

పరికించుచు డెందంబున
పురికొను కౌతుకముతోడ భూమీసురు డ
గ్గిరి కటక తట నిరంతర
తరు గహన గుహా విహార తత్పరమతియై

నిడుద పెన్నెరిగుంపు జడగట్ట సగరు ము
మ్మనుమండు తపము గైకొనిన చోటు
జరఠ కచ్ఛప కులేశ్వరు వెన్ను గానరా
జగతికి మిన్నేరు దిగిన చోటు
పుచ్చడీకతనంబుపోబెట్టి గిరికన్య
పతిగొల్వ నాయాసపడిన చోటు
వలరాచరాచవా డలికాక్షు కనువెచ్చ
కరగిన యల కనికరపు చోటు

తపసియిల్లాండ్ర చెలువంబు తలచి తలచి
మున్ను ముచ్చిచ్చును విరాళిగొన్న చోటు
కనుపవులు వేల్పుబడవాలు కన్నచోటు
హర్షమున జూచి ప్రవరాఖ్యు డాత్మలోన

విలయ కృశానుకీలముల వేడిమి పోడిమి మాలి వెల్మిడిన్‌
కలసిన భూతధాత్రి మరి క్రమ్మర రూపయినిల్చి యోషధుల్‌
మొలవగ జేయునట్టి నయముం ప్రతికల్పము నెట్లు గాంచు నీ
చలిమలవల్ల నుల్లసిలు చల్లదనంబును నూనకుండినన్‌

పసపునిగ్గులుదేరు పాపజన్నిదమొప్ప
ప్రమథాధిపతి యింటిపట్టెరింగె
శచి కీత గరపుచు చదలేట సురరాజు
జలకేశి సవరించు చెలువెరింగె
అదనుతో చేపి చన్నవిసి యోషధుల మ
న్మొదవు కొండలకెల్ల పిదుకనెరిగె
వేల్పుటింతులలోన విర్రవీగుచు మేన
నవరత్నరచనల రవణమెరిగె

పరిపరివిధంపు జన్మంపు పరికరంపు
సొంపుసంపద నిఖిల నిలింపసభయు
నప్పటప్పటికిని జిహ్వత్రుప్పు డుల్ల
నామెత లెరింగెనీ తుషారాద్రి కతన

తలమే బ్రహ్మకునైన యీ నగమహత్వ్తంబెన్న నే నియ్యడం
గల చోద్యంబులు రేపు కన్గొనియెదం గాకేమి నేడేగెదన్‌
నళినీబాంధవ భాను తప్త రవికాంత స్యంది నీహార కం
దళ చూత్కారపరంపరల్‌ పయిపయిన్‌ మధ్యాహ్నముం దెల్పెడున్‌

అనుచు గ్రమ్మరువేళ నీహారవారి
బెరసి తత్పాదలేపంబు కరగిపోయె
కరగిపోవుట యెరుగ డద్ధరణిసురుడు
దైవకృతమున కిల నసాధ్యంబు కలదె

అతడ ట్లౌషధహీనుడై నిజపురీ యాత్రా మిళత్‌ కౌతుకో
ద్ధతి బోవన్‌ సపది స్ఫుటార్తి చరణద్వంద్వంబు రాకుండినన్‌
మతి చింతించుచు నవ్విధం బెరిగి హా నన్నిట్లు దైవంబ తె
చ్చితె యీ ఘోర వనప్రదేశమునకున్‌ సిద్ధాపదేశంబునన్‌

ఎక్కడి యరుణాస్పదపుర
మెక్కడి తుహినాద్రి క్రొవ్వి యే రాదగునే
అక్కట మును సనుదెంచిన
దిక్కిదియని యెరుగ వెడలుతెరు వెయ్యదియో

అకలం కౌషధసత్వముం దెలియ మాయా ద్వార కావంతి కా
శి కురుక్షేత్ర గయా ప్రయాగములు నే సేవింప కుద్దండ గం
డక వేదండ వరాహ వాహరిపు ఖడ్గ వ్యాఘ్ర మిమ్మంచుకొం
డకు రాజెల్లునె బుద్ధిజాడ్యజని తోన్మాదుల్‌ గదా శ్రోత్రియుల్‌

నను నిముసంబుగానకయున్న నూరెల్ల
నరయు మజ్జనకుడెం తడలునొక్కొ
ఎపుడు సంధ్యలయందు నిలువెళ్ళనీక న
న్నోమెడు తల్లి యెంతొరలునొక్కొ
అనుకూలవతి నాదు మనసులో వర్తించు
కులకాంత మదినెంత కుందునొక్కొ
కేడ తోడునీడలై వర్తించు సచ్ఛాత్రు
లింతకు నెంత చింతింతురొక్కొ

అతిథిసంతర్పణంబు లేమయ్యెనొక్కొ
అగ్నులేమయ్యెనొక్కొ నిత్యంబులైన
కృత్యములబాసి దైవంబ కినుకనిట్లు
పారవైచితె మిన్నులుపడ్డ చోట

నను నిలుసేర్చు నుపాయం
బొనరింపగజాలు సుకృతి యొక డొదవడొకో
యనుచున్‌ చింతాసాగర
మున మునిగి భయంబు గదుర పోవుచు నెదురన్‌

కులిశధారాహతి పొలుపున పైనుండి
యడుగుమోవగ జేగురైనతటుల
కనుపట్టులోయ గంగానిర్ఝరము వార
చలువయౌ నయ్యేటి కొలకులందు
నిసుకవెట్టిన నేల నేచి యర్కాంశుల
చొరనీక దట్టమై యిరులు గవియు
క్రముక పున్నాగ సారంగ రంభా నారి
కేళాది విటపి కాంతారవీథి

గెరలు పిక శారికా కీర కేకి భృంగ
సారసధ్వని తనలోని చంద్రకాంత
దరులు ప్రతిశబ్దమీన గంధర్వ యక్ష
గాన ఘూర్ణితమగు నొక్క కోనగనియె

కనుగొని యిది మునియాశ్రమ
మను తహతహవొడమి యిచటి కరిగిన నాకున్‌
కననగు నొక తెరకువ యని
మనమునగల దిగులు కొంత మట్టువడంగన్‌

నికట మహీధరాగ్ర తట నిర్గత నిర్ఝరధార బాసి లో
యకు తలక్రిందుగా మలకలైదిగు కాలువవెంట పూచు మ
ల్లిక లవలంబనంబుగ నలిప్రకరధ్వని చిమ్మిరేగ లో
నికి మణిపట్టభంగసరణిన్‌ ధరణీసురుడేగి చెంగటన్‌

తావుల్‌ క్రేవలజల్లు చెంగలువ కేదారంబు తీరంబునన్‌
మావుల్‌ క్రోవులు నల్లిబిల్లిగొను కాంతారంబునం దైందవ
గ్రావాకల్పిత కాయమాన జటిల ద్రాక్షా గుళుచ్ఛంబులన్‌
పూవుందీవెల నొప్పు నొక్క భవనంబున్‌ గారుడోత్కీర్ణమున్‌

కాంచి తదీయ విచిత్రో
దంచిత సౌభాగ్యగరిమ కచ్చెరువడి య
క్కాంచనగర్భాన్వయమణి
యించుక దరియంగ నచటికేగెడు వేళన్‌

మృగమద సౌరభ విభవ
ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీగంధ
స్థగితేతర పరిమళమై
మగువ పొలుపు తెలుపు నొక్క మారుతమొలసెన్‌

అతడా వాతపరంపరా పరిమళ వ్యాపార లీలన్‌ జనా
న్విత మిచ్చోటని చేరబోయి కనియెన్‌ విద్యుల్లతావిగ్రహన్‌
శతపత్రేక్షణ చంచరీకచికురన్‌ చంద్రాస్య చక్రస్తనిన్‌
నతనాభిన్‌ నవలా నొకానొక మరున్నారీ శిరోరత్నమున్‌

అమల మణిమయ నిజమందిరాంగణస్థ
తరుణసహకార మూల వితర్ధి మీద
శీతలానిల మొలయ నాసీనయైన
అన్నిలింపాబ్జముఖియు అయ్యవసరమున

తతనితం బాభోగ ధవళాంశుకములోని
అంగదట్టపు కావిరంగువలన
శశికాంతమణిపీఠి జాజువారగ కాయ
లుత్తుంగ కుచపాళి నత్తమిల్ల
తరుణాంగుళీ ధూత తంత్రీస్వనంబుతో
జిలిబిలిపాట ముద్దులు నటింప
ఆలాపగతి చొక్కి యరమోడ్పు కనుదోయి
రతిపారవశ్య విభ్రమము తెలుప

ప్రౌఢి పలికించు గీతప్రబంధములకు
కమ్ర కరపంకరుహ రత్న కటక ఝణఝ
ణధ్వనిస్ఫూర్తి తాళమానములు కొలుప
నింపు తళుకొత్త వీణ వాయింపుచుండి

అబ్బురపాటుతోడ నయనాంబుజముల్‌ వికసింప కాంతి పె
ల్లుబ్బి కనీనికల్‌ వికసితోత్పలపంక్తుల క్రుమ్మరింపగా
గుబ్బమెరుంగు చన్గవ గగుర్పొడువన్‌ మదిలోన కోరికల్‌
గుబ్బతిలంగ చూచె నలకూబరసన్నిభు నద్ధరామరున్‌

చూచి ఝళంఝళత్‌ కటకసూచిత వేగ పదారవిందయై
లేచి కుచంబులున్‌ తురుము లేనడు మల్లలనాడ నయ్యెడన్‌
పూచిన యొక్క పోక నునుబోదియజేరి విలోకనప్రభా
వీచికలన్‌ తదీయ పదవీ కలశాంబుధి వెల్లిగొల్పుచున్‌

మునుమున్‌ పుట్టెడు కొంకు లౌల్యమునిడన్‌ మోదంబు విస్తీర్ణతన్‌
జొనుపన్‌ కోర్కులు క్రేళ్ళుద్రిప్ప మదిమెచ్చుల్‌ రెప్పలల్లార్ప న
త్యనుషంగస్థితి రిచ్చపాటొసగ నొయ్యారంబునన్‌ చంద్రికల్‌
దనుకన్‌ చూచె లతాంగి భూసురు ప్రఫుల్లన్నేత్రపద్మంబులన్‌

పంకజముఖి కప్పుడు మై
నంకురితములయ్యె పులక లావిష్కృత మీ
నాం కానల సూచక ధూ
మాంకురములు బోలె మరియు నతనిన్‌ చూడన్‌

తొంగలిరెప్పలం తొలగద్రోయుచు పైపయి విస్తరిల్లు క
న్నుంగవ యాక్రమించుకొనునో ముఖచంద్రు నటంచు పోవనీ
కంగజు డానవెట్టి కదియన్‌ గురివ్రాసె ననంగ జారి సా
రంగమదంబు లేజెమట క్రమ్మె లలాటము డిగ్గి చెక్కులన్‌

అనిమేషస్థితిమాన్పె బిత్తరపుచూ పస్వేదతావృత్తి మా
న్పె నవస్వేదసమృద్ధి బోధకళమాన్పెన్‌ మోహవిభ్రాంతి తో
డనె గీర్వాణవధూటికిన్‌ భ్రమరకీటన్యాయ మొప్పన్‌ మను
ష్యుని భావించుట మానుషత్వము మెయింజూపెట్టెనా నత్తరిన్‌

ఇట్లతని రూపరేఖావిలాసంబులకుం జొక్కి యక్కమలపత్రేక్షణ యాత్మగతంబున

ఎక్కడివాడొ యక్షతన యేందు జయంత వసంత కంతులన్‌
చక్కదనంబునన్‌ గెలువజాలెడువాడు మహీసురాన్వయం
బెక్కడ ఈ తనూవిభవమెక్కడ యేలనిబంటుగా మరున్‌
డక్కకొనంగరాదె అకటా నను వీడు పరిగ్రహించినన్‌

వదనప్రభూత లావణ్యాంబుసంభూత
కమలంబులన వీని కన్నులమరు
నిక్కి వీనులతోడ నెక్కసక్కెములాడు
కరణినున్నవి వీని ఘనభుజములు
సంకల్పసంభ వాస్థానపీఠికవోలె
వెడదయైకనుపట్టు వీని యురము
ప్రతిఘటించు చిగుళ్ళపై నెర్రవారిన
రీతినున్నవి వీని మృదుపదములు

నేరెటేటియసల్‌ తెచ్చి నీరజాప్తు
సానబట్టిన రాపొడిచల్లి మెదిసి
పదను సుధనిడి చేసెనో పద్మభవుడు
వీని కాకున్న కలదె ఈ మేనికాంతి

సుర గరు డోరగ నర ఖే
చర కిన్నర సిద్ధ సాధ్య చారణ విద్యా
ధర గంధర్వ కుమారుల
నిరతము కనుగొనమె పోలనేర్తురె వీనిన్‌

అని చింతించుచు మీనకేతన ధనుర్య్జా ముక్త నారాచ దు
ర్దిన సమ్మూర్ఛిత మానసాంబురుహయై దీపించు పెందత్తరం
బున పేటెత్తిన లజ్జ నంఘ్రికటకంబుల్‌ మ్రోయ నడ్డంబు ని
ల్చిన నయ్యచ్చర జూచి చేరజని పల్కెన్‌ వాడు విభ్రాంతుడై

ఎవ్వతెవీవు భీతహరిణేక్షణ ఒంటి చరించె దోటలే
కివ్వనభూమి భూసురుడ నే ప్రవరాఖ్యుడ త్రోవతప్పితిన్‌
క్రొవ్వున నిన్నగాగ్రమునకున్‌ చనుదెంచి పురంబుచేర నిం
కెవ్విధి కాంతు తెల్పగదవే తెరువెద్ది శుభంబు నీకగున్‌

అని తనకథ నెరిగించిన
తన కనుగవ మెరుగులుబ్బ తాటంకములున్‌
చనుగవయు నడుము వడకగ
వనిత సెలవివార నవ్వి వానికి ననియెన్‌

ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర ఏ
కాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు లా
గింతియ కాక నీవెరుగవే మునువచ్చిన త్రోవచొప్పు నీ
కింత భయంబులే కడుగ నెల్లిదమైతిమె మాటలేటికిన్‌

అని నర్మగర్భంబుగా బలికి క్రమ్మర నమ్మగువ యమ్మహీసురున కిట్లనియె

చిన్ని వెన్నెలకందు వెన్నుదన్ని సుధాబ్ధి
పొడమిన చెలువ తోబుట్టు మాకు
రహివుట్ట జంత్రగాత్రముల రాల్‌ కరగించు
విమలగాంధర్వంబు విద్య మాకు
అనవిల్తుశాస్త్రంపు మినుకు లావర్తించు
పని వెన్నతోడ పెట్టినది మాకు
హయమేధ రాజసూయములన పేర్వడ్డ
సవనతంత్రంబు లుంకువలు మాకు

కనకనగసీమ కల్పవృక్షముల నీడ
పచ్చరా చట్టుగమి రచ్చపట్టు మాకు
పద్మసంభవ వైకుంఠ భర్గ సభలు
సాముగరిడీలు మాకు గోత్రామరేంద్ర

పేరు వరూధిని విప్ర కు
మార ఘృతాచీ తిలోత్తమా హరిణీ హే
మా రంభా శశిరేఖ లు
దారగుణాఢ్యలు మదీయలగు ప్రాణసఖుల్‌

బహురత్న ద్యుతిమేదురోదర దరీభాగంబులం బొల్చు ని
మ్మిహికాహార్యమునన్‌ చరింతుమెపుడున్‌ ప్రేమన్‌ నభోవాహినీ
లహరీ శీతల గంధవాహ పరిఖేల న్మంజరీ సౌరభ
గ్రహణేందిందిర తుందిలంబులివి మత్కాంతార సంతానముల్‌

భూసుర కైతవకుసుమశ
రానన మాయింటి విందవైతివి గైకొ
మ్మా సముదంచ న్మణిభవ
నాసీనత సేద తీరి యాతిథ్యంబున్‌

కుందనమువంటి మేను మధ్యంది నాత
పోష్మహతి కందె వడదాకె నొప్పులొలుకు
వదన మస్మద్గృహంబు పావనము సేసి
బడలికలు వాసిచను మన్న బ్రాహ్మణుండు

అండజయాన నీవొసగునట్టి సపర్యలు మాకునచ్చె నిం
దుండగరాదు పోవలయునూరికి నింటికి నిప్పుడేను రా
కుండ నొకండువచ్చి మరియొండునె భక్తియ చాలు సత్క్రియా
కాండముతీర్ప వేగ చనగావలయున్‌ కరుణింపు నాపయిన్‌

ఏ నిక నిల్లుసేరుటకు నెద్ది యుపాయము మీ మహత్వ్తముల్‌
మానిని దివ్యముల్‌ మది తలంచిన నెందును మీ కసాధ్యముల్‌
కానము కాన తల్లి ప్రజలన్‌ నను కూర్పుమటన్న లేత న
వ్వాననసీమ తోప ధవళాయతలోచన వానికిట్లనున్‌

ఎక్కడియూరు కాల్నిలువ కింటికిబోయెదనంచు పల్కె దీ
వక్కట మీ కుటీరనిలయంబులకున్‌ సరిరాకపోయెనే
యిక్కడి రత్నకందరము లిక్కడి నందనచందనోత్కరం
బిక్కడి గాంగసైకతము లిక్కడి యీ లవలీనికుంజముల్‌

నిక్కముదాపనేల ధరణీసురనందన యింక నీపయిన్‌
చిక్కె మనంబు నాకు నను చిత్తజుబారికి నప్పగించెదో
చొక్కి మరందమద్యముల చూరల పాటలువాడు తేంట్ల సొం
పెక్కినయట్టి పూవు పొదరిండ్లను కౌగిట గారవించెదో

అనుటయు ప్రవరుం డిట్లను
వనజేక్షణ యిట్లు పలుక వరుసయె వ్రతులై
దినములు గడిపెడు విప్రుల
చనునే కామింప మది విచారము వలదే

వేలిమియున్‌ సురార్చనయు విప్రసపర్యయు చిక్కె భుక్తికిన్‌
వేళ యతిక్రమించె జననీజనకుల్‌ కడువృద్ధు లాకటన్‌
సోలుచు చింతతో నెదురుసూచుచునుండుదు రాహితాగ్ని నే
దూలు సమస్తధర్మములు తొయ్యలి నేడిలుసేరకుండినన్‌

నావుడు విన్నబాటు వదనంబున నించుక దోప పల్కె నో
భావజరూప యిట్టి యెలప్రాయము వైదికకర్మనిష్ఠలం
పోవగ నింక భోగములబొందుట యెన్నడు యజ్ఞకోటులం
బావనులౌటకున్‌ ఫలము మా కవుగిళ్ళ సుఖించుటే కదా

సద్యోవినిర్భిన్న సారంగనాభికా
హృదమై పిసాళించు మృగమదంబు
కసటువో బీరెండ కరగి కర్రలవంటి
గమగమ వలచు చొక్కపుజవాజి
పొరలెత్తి ఘనసారతరువుల తనుతాన
దొరగిన పచ్చకప్పురపు సిరము
గొజ్జంగి పూబొదల్‌ కురియంగ పటికంపు
దొనల నిండినయట్టి తుహినజలము

వివిధ కుసుమకదంబంబు దివిజతరుజ
మృదుల పనస ఫలాస వామేయ రత్న
భూషణంబులు కలవిందు భోగపరుడ
వయి రమింపుము ననుగూడి యనుదినంబు

అందునకు కొరయె వెన్నెల
గంధర్వాంగనల పొందు కాదని సంసా
రాంధువున పడియె దకట ది
వాంధము వెలుగుగని గొందినడగిన భంగిన్‌

ఎన్ని భవంబులన్‌ కలుగు నిక్షుశరాసన సాయక వ్యథా
ఖిన్నత వాడి వత్తలయి కేల కపోలములూది చూపులన్‌
విన్నదనంబు తోప కనువేదురునన్‌ పయిగాలి సోకినన్‌
వెన్నవలెన్‌ కరంగు అలివేణుల కౌగిటచేర్చు భాగ్యముల్‌

కుశలత యే వ్రతములనగు
నశనాయాపీడ నింద్రియనిరోధమునన్‌
కృశుడవయి యాత్మనలచుట
సశరీరస్వర్గసుఖము సమకొని యుండన్‌

అనిన ప్రవరుండు నీవన్న యర్థమెల్ల
నిజము కాముకుడైనవానికి అకాము
డిది గణించునె జలజాక్షి యెరిగితేని
నగరమార్గంబు చూపి పుణ్యమున పొమ్ము

బ్రాహ్మణు డింద్రియవశగతి
జిహ్మాచరణైక నిపుణ చిత్తజ నిశితా
జిహ్మగముల పాలై చెడు
బ్రహ్మానందాధిరాజ్య పదవీచ్యుతుడై

అనిన నత్తెరవ యక్కరకరిపలుకుల కులికి గరిగరింగరప గరకరిం జెరకువిలుకాడు పరగించు విరిదమ్మిగొరకలు నెరకుల చురుకుచురుక్కునం గాడిన గడుం గెరలి పరిణత వివిధ విబుధతరు జనిత మధురమధురసం బాను మదంబు నదటునం జిదిమిన నెరుంగక మదనహరునైన జదురునం గదియ గమకించు తిమురునం గొమిరెప్రాయంపు మదంబునను నొంటిపాటునం గంటికిం బ్రియంబై తంగేటిజున్ను చందంబునం గొంటుదనంబెరుంగక కురంగటనున్న యమ్మహీసురవరకుమారు తారుణ్య మౌగ్య్ధంబులం జేసి తన వైదగ్య్ధంబు మెరయగలిగెనని పల్లవించు నుల్లంబు నుల్లాసంబునం గదురు మదంబున నోసరించక చంచల దృగంచలప్రభ లతని ముఖాంబుజంబున బొలయ వలయ మణిగణచ్ఛాయాకలాపంబు లుప్పరంబెగయ కొప్పుచక్కం జెక్కుచు జక్కవగిబ్బలుంబోని గబ్బిగుబ్బలన్‌ జొబ్బిల్లు కుంకుమరసంబునం బంకిలంబులగు హారముక్తా తారకంబుల నఖకోరకంబులం గీరి తీరువడంజేయుచు పతిత వనతరు కుసుమ కేసరంబులు రాల్చు నెపంబున పయ్యెదవిదిల్చి చక్కసవరించుచు నంతంతం బొలయు చెలులం దలచూపకయుండం దత్తరంబునంజేసి బొమముడిపాటుతో మగిడిమగిడి చూచుచు జిడిముడిపాటు చూపుల నంకురించు జంకెల వారించుచుం జేరి యిట్లనియె

ఎందే డెందము కందళించు రహిచే నేకాగ్రతన్‌ నిర్వృతిం
జెందుం కుంభగత ప్రదీపకళికాశ్రీ దోప నెందెందు పో
కెందే నింద్రియముల్‌ సుఖంబు గను నా యింపే పరబ్రహ్మ, “మా
నందో బ్రహ్మ” యటన్న ప్రాజదువు నంతర్బుద్ధి నూహింపుమా

అనుచు తన్నొడబరుచు నయ్యమరకాంత
తత్తరము జూచి యాత్మ నతండు తనకు
సిగ్గు వెగటును బొడమ నిస్పృహత తెలుపు
నొక్క చిరునవ్వు నవ్వి యయ్యువిద కనియె

ఈ పాండిత్యము నీకు దక్క మరియెందే కంటిమే కామశా
స్త్రోపాధ్యాయినినా వచించెదవు మేలోహో త్రయీధర్మముల్‌
పాపంబుల్‌ రతి పుణ్యమంచు నిక నేలా తర్కముల్‌ మోక్ష ల
క్ష్మీప థ్యాగమసూత్ర పంక్తికివెపో మీ సంప్రదాయార్థముల్‌

తరుణీ రేపును మాపు హవ్యములచేతం తృప్తుడౌ వహ్ని స
త్కరుణాదృష్టి నొసంగు సౌఖ్యము లెరుంగన్‌ శక్యమే నీకు ఆ
కరణుల్‌ దర్భలు నగ్నులుం ప్రియములైన ట్లన్యముల్‌ కా వొడల్‌
తిరమే చెప్పకు మిట్టితుచ్ఛసుఖముల్‌ మీసాలపై తేనియల్‌

అనుటయు మాటలేక హృదయాబ్జము జల్లన మోము వెల్లనై
కనలుచు నీరుదేరు తెలికన్నుల నాతని పుల్కుపుల్కునన్‌
కనుగొని మాటలం బొదువు గద్గదికం తలయూచి యక్కటా
వనిత తనంతతా వలచివచ్చిన చుల్కన కాదె యేరికిన్‌

వెతలంబెట్టకుమింక నన్ననుచు నీవీబంధమూడన్‌ రయో
ద్ధతి నూర్పుల్‌ నిగుడన్‌ వడిన్‌ విరులుచిందం కొప్పువీడం తనూ
లత తోడ్తో పులకింపగా ననునయాలా పాతిదీ నాస్యయై
రతిసంరంభము మీర నిర్జరవధూరత్నంబు పైపాటునన్‌

ప్రాంచద్భూషణ బాహుమూలగతితో పాలిండ్లుపొంగార పై
యంచుల్‌ మోవగ కౌగిలించి యధరంబాసింప హా శ్రీహరీ
యంచున్‌ బ్రాహ్మణు డోరమోమిడి తదీయాంసద్వయం బంటి పొ
మ్మంచున్‌ ద్రోచె కలంచునే సతులమాయల్‌ ధీరచిత్తంబులన్‌

త్రోపువడి నిలిచి ఘన ల
జ్జా పరవశయగుచు కొప్పుసవరించి యొడల్‌
దీపింప నతని చురచుర
కోపమునన్‌ చూచి క్రేటుకొనుచున్‌ పలికెన్‌

పాటున కింతులోర్తురె కృపారహితాత్మక నీవు త్రోవ ని
చ్చోట భవన్నఖాంకురము సోకె కనుంగొనుమంచు చూపి య
ప్పాటలగంధి వేదననెపంబిడి యేడ్చె కలస్వనంబుతో
మీటిన విచ్చు గుబ్బచనుమిట్టల నశ్రులు చిందువందగన్‌

ఈ విధమున నతికరుణము
గా వనరుహనేత్ర కన్నుగవ ధవళరుచుల్‌
కావికొననేడ్చి వెండియు
నా విప్రకుమారు జూచి యలమట పల్కెన్‌

చేసితి జన్నముల్‌ తపము చేసితి నంటి దయావిహీనతన్‌
చేసిన పుణ్యముల్‌ ఫలముసెందునె పుణ్యములెన్నియేనియున్‌
చేసినవాని సద్గతియె చేకురు భూతదయార్ద్రబుద్ధి కో
భూసురవర్య యింత తలపోయవు నీచదువేల చెప్పుమా

వెలివెట్టిరే బాడబులు పరాశరు బట్టి
దాశకన్యాకేళి తప్పుచేసి
కులములో వన్నెతక్కువయయ్యెనే గాధి
పట్టికి మేనక చుట్టరికము
అనుపుకాడై వేల్పు నాగవాసము గూడి
మహిమ గోల్పడియెనే మాందకర్ణి
స్వారాజ్య మేలంగనీరైరె సుర లహ
ల్యాజారుడైన జంభాసురారి

వారికంటెను నీ మహత్వ్తంబు ఘనమె
పవన ప ర్ణాంబు భక్షులై నవసి యినుప
కచ్చడాల్‌ కట్టుకొను మునిమ్రుచ్చులెల్ల
తామరసనేత్ర లిండ్ల బందాలు కారె

అనిన నేమియు ననక యవ్వనజగంధి
మేని జవ్వాదిపస కదంబించు నొడలు
కడిగికొని వార్చి ప్రవరుండు గార్హపత్య
వహ్ని నిట్లని పొగడె భావమున తలచి

దివిషద్వర్గము నీముఖంబునన తృప్తిం గాంచు నిన్నీశుగా
స్తవముల్‌ సేయు శ్రుతుల్‌ సమస్తజగదంతర్యామివిన్‌ నీవ యా
హవనీయంబును దక్షిణాగ్నియును నీయం దుద్భవించున్‌ క్రతూ
త్సవసంధాయక నన్ను కావగదవే స్వాహావధూవల్లభా

దాన జ పాగ్నిహోత్ర పరతంత్రుడనేని భవత్పదాంబుజ
ధ్యానరతుండనేని పరదారధనాదుల కోరనేని స
న్మానముతోడ నన్ను సదనంబున నిల్పు మినుండు పశ్చిమాం
భోనిధిలోన క్రుంకకయమున్న రయంబున హవ్యవాహనా

అని సంస్తుతించిన నగ్నిదేవుం డమ్మహీదేవు దేహంబున సన్నిహితుం డగుటయు నమ్మహాభాగుండు గండుమీరి పొడుపుగొండ నఖండ సంధ్యారాగ ప్రభామండ లాంతర్గతుండగు పుండరీకవనబంధుడుంబోలె నుత్తప్త కనకద్రవధారాగౌరంబగు తనూచ్ఛాయా పూరంబున నక్కాన వెలిగించుచు నిజగమననిరోధిని యగు నవ్వరూధిని హృదయకంజంబున రంజిల్లు నమందానురాగరస మకరందంబు నందంద పొంగంజేయుచు పావకప్రసాద లబ్ధంబగు పవనజవంబున నిజమందిరంబునకరిగి నిత్యకృత్య సత్కర్మకలాపంబులు నిర్వర్తించెనని మార్కండేయుండు క్రోష్టికిం జెప్పెనని చెప్పిన

జైమిని యా దివ్య ఖగ
గ్రామణులం జూచి వేడ్కగడలుకొనంగా
ఆ మీద వరూధిని విధ
మేమయ్యె నెరుంగ చెప్పరే నా కనుడున్‌