Jump to content

మనుచరిత్ర/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి


శ్రీవక్షోజ కురంగనాభ మెదపై చెన్నొంద విశ్వంభరా
దేవిం తత్కమలాసమీపమున ప్రీతిన్నిల్పినాడో యనం
గా వందారు సనందనాది నిజభక్తశ్రేణికిం దోచు రా
జీవాక్షుండు కృతార్థుజేయు శుభదృష్టిం కృష్ణరాయాధిపున్‌

ఉల్లమునందు నక్కటికమూనుట మీకులమందు కంటిమం
చల్లన మేలమాడు అచలాత్మజమాటకు లేతనవ్వు సం
ధిల్ల కిరీటి పాశుపత దివ్యశరాఢ్యుని చేయు శాంబరీ
భిల్లుడు కృష్ణరాయల కభీష్టశుభ ప్రతిపాది కావుతన్‌

నాలుగుమోములన్‌ నిగమనాదములుప్పతిలం ప్రచండవా
తూలగతిన్‌ జనించు రొదతోడిగుహావళి నొప్పు మేరువుం
బోలి పయోజపీఠి మునిముఖ్యులుగొల్వగ వాణిగూడి పే
రోలగమున్న ధాత విభవోజ్వ్జలుజేయుత కృష్ణరాయనిన్‌

అంకముజేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బా
ల్యాంకవిచేష్ట తొండమున అవ్వలిచన్‌ కబళింపబోయి ఆ
వంక కుచంబు గాన కహివల్లభహారము గాంచి వే మృణా
ళాంకురశంక నంటెడు గజాస్యుని కొల్తు నభీష్టసిద్ధికిన్‌

చేర్చుక్కగానిడ్డ చిన్నిజాబిల్లిచే
సిందూరతిలకంబు చెమ్మగిల్ల
నవతంస కుసుమంబునందున్న ఎలదేటి
రుతి కించిదంచితశ్రుతుల నీన
ఘనమైన రారాపు చనుదోయి రాయిడి
తుంబీఫలంబు తుందుడుకుజెంద
తరుణాంగుళిచ్ఛాయ దంతపుసరకట్టు
లింగిలీకపు వింతరంగులీన

ఉపనిషత్తులు బోటులై యోలగింప
పుండరీకాసనమున కూర్చుండి మదికి
నించువేడుక వీణవాయించు చెలువ
నలువరాణి మదాత్మలో వెలయుగాత

కొలుతున్‌ మద్గురు విద్యా
నిలయున్‌ కరుణా కటాక్ష నిబిడ జ్యోత్స్నా
దళితాశ్రితజన దురిత
చ్ఛల గాఢ ధ్వాంత సమితి శఠకోపయతిన్‌

వనజాక్షోపము వామలూరుతనయున్‌ ద్వైపాయనున్‌ భట్టబా
ణుని భాసున్‌ భవభూతి భారవి సుబంధున్‌ బిల్హణుం కాళిదా
సుని మాఘున్‌ శివభద్రు మల్హణకవిం చోరున్‌ మురారిన్‌ మయూ
రుని సౌమిల్లిని దండి ప్రస్తుతుల పేర్కొంచున్‌ వచశ్శుద్ధికిన్‌

వ్యాసరచిత భారతామ్నాయ మాంధ్రభా
షగ నొనర్చి జగతి పొగడు కనిన
నన్నపార్యు, తిక్కనను కృతక్రతు, శంభు
దాసు నెర్రసుకవి తలతు భక్తి

భరమైతోచు కుటుంబరక్షణకుగా ప్రాల్మాలి చింతన్‌ నిరం
తర తాళీదళసంపుట ప్రకర కాంతారంబునం దర్థపుం
తెరువాటుల్‌ తెగికొట్టి తద్‌జ్ఞపరిషద్‌ విజ్ఞాత చౌర్యక్రియా
విరసుండై కొరతంబడుం కుకవి పృధ్వీభృ త్సమీపక్షితిన్‌

అని యిష్టదేవతా వం
దన సుకవిస్తుతులు కుకవితతి నికృతియు చే
సి నవీనకావ్యరచనకు
అనుకూలకథల్‌ తలచు ఆసమయమునన్‌

ఉదయాచలేంద్రంబు మొదల నెవ్వాని కుమా
రతకు క్రౌంచాచలరాజమయ్యె
ఆవాడపతి సకంధర సింధురాధ్యక్షు
లరిగాపు లెవ్వాని ఖరతరాసి
కా పంచగౌడధాత్రీపదం బెవ్వాని
కసివారుగా నేగునట్టి బయలు
సకలయాచకజనాశాపూర్తి కెవ్వాని
ఘనభుజదండంబు కల్పశాఖి

ప్రబల రాజాధిరాజ వీరప్రతాప
రాజపరమేశ బిరుదవిభ్రాజి యెవ్వ
డట్టి శ్రీకృష్ణదేవరాయాగ్రగణ్యు
డొక్కనాడు కుతూహలంబుప్పతిల్ల

ఇందీవరంబులనీను క్రాల్గన్నుల
శరదిందుముఖులు చామరములిడగ
బణినసూను కణాద బాదరాయణ సూత్ర
ఫక్కి విద్వాంసు లుపన్యసింప
పార్శ్వభూమి నభీరు భటకదంబ కరాళ
హేతి చ్ఛటా చ్ఛాయ లిరులుకొనగ
సామంత మండనోద్దామ మాణిక్యాంశు
మండలం బొలసి యీరెండ కాయ

మూరురాయర గండ పెండార మణి మ
రీచి రింఛోళి కలయ నావృతములగుచు
అంకపాళి నటద్దుకూలాంచలములు
చిత్రమాంజిష్ట విభ్రమశ్రీ వహింప

భువనవిజయాఖ్య సంస
ద్భవన స్థిత భద్రపీఠి ప్రాజ్ఞులగోష్టిన్‌
కవితామధురిమ డెందము
తవులన్‌ కొలువుండి సదయతన్‌ నను పల్కెన్‌

సప్తసంతానములలో ప్రశస్తి గాంచి
ఖిలముకాకుండునది ధాత్రి కృతియ కాన
కృతి రచింపుము మాకు శిరీషకుసుమ
పేశల సుధామయూక్తుల పెద్దనార్య

హితుడవు చతురవచోనిధి
వతుల పురాణాగమేతిహాస కథార్థ
స్మృతియుతుడ వాంధ్రకవితా
పితామహుడ వెవ్వరీడు పేర్కొన నీకున్‌

మనువులలో స్వారోచిష
మనుసంభవ మరయ రససమంచిత కథలన్‌
విననింపు కలిద్వంసక
మనఘ భవచ్చతురరచన కనుకూలంబున్‌

కావున మార్కండేయ పురాణోక్త ప్రకారంబునం జెప్పుమని కర్పూరతాంబూలంబు వెట్టినం పట్టి మహాప్రసాదం బని మోదంబున నమ్మహాప్రబంధ నిబంధనంబునకు ప్రారంభించితి నేతత్కథా నాయకరత్నంబగు నమ్మహీనాథు వంశావతారం బెట్టిదనిన

కలశపాథోరాశి గర్భవీచి మతల్లి
కడుపార నెవ్వాని కన్నతల్లి
అనలాక్షు ఘనజటా వనవాటి కెవ్వాడు
వన్నెవట్టు ననార్తవంపు పువ్వు
సకల దైవత బుభుక్షాపూర్తి కెవ్వాడు
పుట్టు గానని మేని మెట్టపంట
కటికిచీకటి తిండి కరముల గిలిగింత
నెవ్వాడు దొగకన్నె నవ్వజేయు

నతడు వొగడొందు మధుకైటభారి మరది
కళల నెలవగువాడు చుక్కలకు రేడు
మిసిమి పరసీమ వలరాజు మేనమామ
వేవెలుంగుల దొర జోడు రేవెలుంగు

ఆ సుధాధాము విభవ మహాంబురాశి
కుబ్బు మీరంగ నందను డుదయమయ్యె
వేదవేదాంగ శాస్త్రార్థ విశద వాస
నాత్త ధిషణా ధురంధురుండైన బుధుడు

వానికి పురూరవుడు ప్ర
జ్ఞానిధి యుదయించె సింహసదృశుడు, తద్భూ
జానికి నాయువు తనయుం
డై నెగడె, నతండు గనె యయాతి నరేంద్రున్‌

అతనికి యదు తుర్వసు లను
సుతు లుద్భవమొంది రహిత సూదనులు కళా
న్వితమతులు వారిలో వి
శ్రుతకీర్తి వహించె తుర్వసుడు గుణనిధియై

వాని వంశంబు తుళువాన్వవాయ మయ్యె
నందు పెక్కండ్రు నృపు లుదయంబు నొంది
నిఖిల భువన ప్రపూర్ణ నిర్ణిద్రకీర్తి
నధికులైరి తదీయాన్వయమున బుట్టి

ఘనుడై తిమ్మ క్షితీశాగ్రణి శఠ కమఠ గ్రావ సంఘాత వాతా
శన రా డాశాంత దంతి స్థవిర కిరుల జంజాటముల్‌ మాన్పి యిమ్మే
దిని దోర్దండైక పీఠిన్‌ తిరముపరచి కీర్తిద్యుతుల్‌ రోదసిం బ
ర్వ నరాతుల్‌ నమ్రులై పార్స్వముల గొలువ తీవ్రప్రతాపంబు సూపెన్‌

వితరణఖని యా తిమ్మ
క్షితిపగ్రామణికి దేవకీదేవికి నం
చితమూర్తి యీశ్వర ప్రభు
డతిపుణ్యుడు పుట్టె సజ్జనావన పరుడై

బలమదమత్త దుష్టపుర భంజనుడై పరిపాలితార్యుడై
యిలపయి తొంటి యీశ్వరుడె యీశ్వరుడై జనియింప రూపరెన్‌
జలరుహనేత్రలం దొరగి శైలవనంబుల భీతచిత్తులై
మెలగెడు శత్రుభూపతుల మేనుల దాల్చిన మన్మథాంకముల్‌

నిజ భుజాశ్రిత ధారుణీ వజ్రకవచంబు
దుష్ట భుజంగాహి తుండికుండు
వనజేక్షణా మనోధన పశ్యతోహరుం
డరిహంస సంస దభ్రాగమంబు
మార్గణగణ పిక మధుమాస దివసంబు
గుణరత్న రోహణ క్షోణిధరము
బాంధవసందోహ పద్మవనీ హేళి
కారుణ్యరస నిమ్నగాకళత్రు

డన జగంబుల మిగుల ప్రఖ్యాతి గాంచె
ధరణిధవ దత్త వివిధోపదా విధా స
మార్జిత శ్రీ వినిర్జిత నిర్జరాల
యేశ్వరుడు తిమ్మభూపతి యీశ్వరుండు

ఆ యీశ్వరనృపతికి పు
ణ్యాయతమతియైన బుక్కమాంబకు తేజ
స్తోయజహితు లుదయించిరి
ధీయుతులగు నారసింహ తిమ్మ నరేంద్రుల్‌

అందు నరసప్రభుడు హరి
చందన మందార కుంద చంద్రాంశు నిభా
స్పంద యశ స్తుందిల ది
క్కందరుడై ధాత్రి యేలె కలుషము లడగన్‌

శ్రీరుచిరత్వ భూతి మతి జిత్వర తాకృతి శక్తి కాంతులన్‌
ధీరత సార భోగముల ధీనిధి యీశ్వర నారసింహు డా
వారిజనాభ శంకరుల వారికుమారుల వారితమ్ములన్‌
వారి యనుంగుమామలను వారి విరోధుల బోలు నిమ్మహిన్‌

అంభోధి వసన విశ్వంభరా వలయంబు
తన బాహుపురి మరకతము జేసె
నశ్రాంత విశ్రాణ నాసార లక్ష్మికి
కవికదంబము చాతకముల జేసె
కకుబంత నిఖిల రాణ్ణికరంబు చరణ మం
జీరంబు సాలభంజికల జేసె
మహనీయ నిజ వినిర్మల యశ స్సరసికి
గగనంబు కలహంసకంబు జేసె

నతి శిత కృపాణ కృత్త మత్తారివీర
మండలేశ సకుండల మకుట నూత్న
మస్త మాల్య పరంపరా మండనార్చి
తేశ్వరుండగు నారసింహేశ్వరుండు

ఆ నృసింహప్రభుడు తిప్పాంబ వలన
నాగమాంబిక వలన నందనుల గాంచె
వీరనరసింహరాయ భూవిభుని నచ్యు
తాంశసంభవు కృష్ణరాయ క్షితీంద్రు

వీరనృసింహుడు నిజభుజ
దారుణ కరవాల పరుష ధారా హత వీ
రారి యగుచు నేకాతప
వారణముగ నేలె ధర నవారణ మహిమన్‌

ఆ విభు ననంతరంబ ధ
రావలయము దాల్చె కృష్ణరాయడు చిన్నా
దేవియు శుభమతి తిరుమల
దేవియునుం దనకు కూర్చు దేవేరులు గాన్‌

తొలగెను ధూమకేతు క్షోభ జనులకు
నతివృష్టి దోష భయంబు వాసె
కంటకాగమ ధీతి గడచె నుద్ధత భూమి
భృత్కటకం బెల్ల నెత్తువడియె
మాసె నఘస్ఫూర్తి మరుభూము లందును
నెల మూడువానలు నిండ గురిసె
నాబాలగోపాల మఖిల సద్వ్రజమును
నానందమున మన్కి నతిశయిల్లె

ప్రజలకెల్లను కడు రామరాజ్య మయ్యె
చారుసత్వాఢ్యు డీశ్వర నారసింహ
భూవిభుని కృష్ణరాయ డభ్యుదయ మొంది
పెంపు మీరంగ ధాత్రి బాలింపుచుండ

అల ప్రోతిప్రభు దంష్ట్ర, భోగివర భోగాగ్రాళి రా, లుద్భటా
చల కూటోపల కోటి రూపు చెడ నిచ్చల్‌ రాయగా నైన మొ
క్కలు భూకాంతకు నున్ననయ్యె నరస క్ష్మాపాలు శ్రీకృష్ణరా
యల బాహా మృగనాభి సంకుమద సాంద్రాలేప పంకంబునన్‌

క్రూర వనేభ దంత హత కుడ్య పరిచ్యుత వజ్రపంక్తి బొ
ల్పారు మిడుంగురుంబురువు లంచు వెసన్‌ గొనిపోయి పొంత శృం
గార వన ద్రుమాళి గిజిగాడులు గూడుల జేర్చు దీపికల్‌
గా రహి కృష్ణరాయ మహికాంతుని శాత్రవ పట్టనంబులన్‌

తొలుదొల్త నుదయాద్రి శిల దాకి తీండ్రించు
నసిలోహమున వెచ్చనై జనించె
మరి కొండవీడెక్కి మార్కొని నలియైన
యల కసవాపాత్రు నంటి రాజె
నట సాగి జమ్మిలోయ బడి వేగి దహించె
గోన బిట్టేర్చె, కొట్టాన తగిలె
కనకగిరి స్ఫూర్తి గరచె గౌతమి గ్రాచె
నవుల నా పొట్నూర రవులుకొనియె

మాడెములు ప్రేల్చె నొడ్డాది మసి యొనర్చె
కటకపురి గాల్చె గజరాజు కలగి పరవ
తోకచిచ్చన నౌర యుద్ధురత కృష్ణ
రాయ బాహు ప్రతాప జాగ్రన్మహాగ్ని

ధర కెంధూళులు కృష్ణరాయల చమూధాటీ గతిన్‌ వింధ్య గ
హ్వరముల్‌ దూరగ జూచి, తా రచట కాపై యుండుటన్‌ చాల న
చ్చెరువై యెర్రని వింత చీకటులు వచ్చెం జూడరే యంచు వే
సొరిదిం జూతురు వీరరుద్ర గజరా ట్శుద్ధాంత ముగ్ధాంగనల్‌

అభిరతి కృష్ణరాయడు జయాంకములన్‌ లిఖియించి తాళ స
న్నిభముగ పొట్టునూరి కడ నిల్పిన కంబము సింహ భూధర
ప్రభు తిరునాళ్ళకున్‌ దిగు సురప్రకరంబు కళింగమేదినీ
విభు నపకీర్తి కజ్జలము వేమరు బెట్టి పఠించు నిచ్చలున్‌

ఎకరాలన్‌ మండువా సాహిణముల గల భద్రేభ సందోహ వాహ
ప్రకరంబున్‌ గొంచు తత్తత్ప్రభువులు వనుపన్‌ రాయబారుల్‌ విలోకో
త్సుకులై నిత్యంబు శ్రీకృష్ణుని యవసరముల్‌ చూతు రందంద కొల్వం
దక యా ప్రత్యూష మాసంధ్యము పనిపడి తన్మందిరాళింద భూమిన్‌

మద కలకుంభి కుంభ నవమౌక్తికముల్‌ కనుపట్టు దట్టమై
వదలక కృష్ణరాయ కరవాలమునం దగు ధారనీట న
భ్యుదయము నొంది శాత్రవుల పుట్టి మునుంగగ ఫేనపంక్తితో
బొదిగొని పైపయిన్‌ వెడలు బుద్బుదపంక్తులు వోలె పోరులన్‌

వేదండ భయద శుండాదండ నిర్వాంత
వమథువుల్‌ పైజిల్కు వారి గాగ
తత్కర్ణ విస్తీర్ణ తాళవృం తోద్ధూత
ధూళి చేటల జల్లు దుమ్ము గాగ
శ్రమ బుర్బుర త్తురంగమ నాసికాగళ
ద్పంకంబు వైచు కర్దమము గాగ
కుపిత యోధాక్షిప్త కుంత కాంతార ఖే
లనములు దండ ఘట్టనలు గాగ

చెనటి పగర ప్రతాపంబు చిచ్చు లార్చు
కరణి గడిదేశములు చొచ్చి కలచి యలచు
మూరు రాయర గండాంక వీర కృష్ణ
రాయ భూభృ ద్భయంకర ప్రబల ధాటి

కరుణాకర వేంకటవిభు
చరణ స్మరణ ప్రసంగ సంగతమతి కీ
శ్వర నరసింహ మహీభృ
ద్వరనందన కృష్ణరాయ ధరణీపతికిన్‌

అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పం బూనిన స్వారోచిష మనుసంభవంబను మహాప్రబంధంబునకు కథాక్రమం బెట్టిదనిన జైమినిముని స్వాయంభువమను కథాశ్రవణానంతరంబున మీదనెవ్వండు మనువయ్యె నెరింగింపు మనవుడు పక్షులు మార్కండేయుండు క్రోష్టికిం జెప్పిన ప్రకారంబున నిట్లని చెప్పందొడంగె

వరణాద్వీపవతీ తటాంచలమునన్‌ వప్రస్థలీ చుంబితాం
బరమై సౌధసుధాప్రభా ధవళిత ప్రాలేయరుఙ్మండలీ
హరిణంబై అరుణాస్పదంబనగ ఆర్యావర్తదేశంబునన్‌
పురమొప్పున్‌ మహికంఠహార తరళ స్ఫూర్తిన్‌ విడంబింపుచున్‌

అచటి విప్రులు మెచ్చ రఖిలవిద్యాప్రౌఢి
ముది మదితప్పిన మొదటివేల్పు
నచటి రాజులు బంటునంపి భార్గవునైన
బింకాన పిలిపింతు రంకమునకు
అచటి మేటికిరాటు లలకాధిపతినైన
మును సంచిమొదలిచ్చి మనుప దక్షు
లచటి నాలవజాతి హలముఖాత్తవిభూతి
నాదిభిక్షువు భైక్షమైన మాన్చు

నచటి వెలయాండ్రు రంభాదులైన నరయ
కాసెకొంగున వారించి కడపగలరు
నాట్యరేఖా కళా ధురంధర నిరూఢి
నచట పుట్టిన చిగురుకొమ్మైన చేవ

ఆ పురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భా
షాపరశేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ
క్షాపరతంత్రు డంబురుహగర్భ కులాభరణం బనారతా
ధ్యాపనతత్పరుండు ప్రవరాఖ్యు డలేఖ్యతనూవిలాసుడై

వాని చక్కదనము వైరాగ్యమున చేసి
కాంక్షసేయు జారకామినులకు
భోగబాహ్యమయ్యె పూచిన సంపెంగ
పొలుపు మధుకరాంగనలకు బోలె

యౌవనమందు యజ్వయు ధనాఢ్యుడునై కమనీయ కౌతుక
శ్రీవిధి కూకటుల్‌ కొలిచి చేసిన కూరిమి సోమిదమ్మ సౌ
ఖ్యావహయై భజింప సుఖులై తలిదండ్రులు కూడి దేవియున్‌
దేవరవోలెనుండి ఇలుదీర్పగ కాపురమొప్పు వానికిన్‌

వరణాతరంగణీ దరవికస్వర నూత్న
కమల కషాయగంధము వహించి
ప్రత్యూషపవనాంకురములు పైకొను వేళ
వామనస్తుతిపరత్వమున లేచి
సచ్ఛాత్రుడగుచు నిచ్చలు నేగి అయ్యేట
అఘమర్షణస్నాన మాచరించి
సాంధ్యకృత్యము తీర్చి సావిత్రి జపియించి
సైకతస్థలి కర్మసాక్షి కెరగి

ఫల సమిత్కుశ కుసుమాది బహుపదార్థ
తతియు నుదికినదోవతులు కొంచు
బ్రహ్మచారులు వెంటరా బ్రాహ్మణుండు
వచ్చు నింటికి ప్రజ తన్ను మెచ్చిచూడ

శీలంబుం కులమున్‌ శమంబు దమముం చెల్వంబు లేబ్రాయముం
పోలంజూచి ఇతండె పాత్రుడని ఏ భూపాలు డీవచ్చినన్‌
సాలగ్రామము మున్నుగా కొనడు మాన్యక్షేత్రమున్‌ పెక్కుచం
దాలం పండు నొకప్పుడుం తరుగ దింటం పాడియుం పంటయున్‌

వండనలయదు వేవురు వచ్చిరేని
అన్నపూర్ణకు నుద్దియౌ అతని గృహిణి
అతిథులేతేర నడికిరేయైన పెట్టు
వలయు భోజ్యంబు లింట నవ్వారి కాగ

తీర్థసంవాసు లేతెంచినారని విన్న
ఎదురుగా నేగు దవ్వెంతయైన
ఏగి తత్పదముల కెరగి ఇంటికి తెచ్చు
తెచ్చి సద్భక్తి నాతిథ్యమిచ్చు
ఇచ్చి ఇష్టాన్నసంతృప్తులుగా చేయు
చేసి కూర్చున్నచో చేరవచ్చు
వచ్చి ఇద్ధరకల్గు వనధి పర్వత సరి
త్తీర్థ మాహాత్మ్యముల్‌ తెలియనడుగు

అడిగి యోజనపరిమాణ మరయు అరసి
పోవలయుచూడ ననుచు ఊర్పులు నిగుడ్చు
అనుదినము తీర్థసందర్శనాభిలాష
మాత్మనుప్పొంగ అత్తరుణాగ్నిహోత్రి

ఈవిధమున నభ్యాగత
సేవాపరతంత్ర సకల జీవనుడై భూ
దేవకుమారకు డుండం
గా వినుమొకనాడు కుతపకాలము నందున్‌

ముడిచిన యొంటికెంజెడ మూయ మువ్వన్నె
మెగముతోలు కిరీటముగ ధరించి
కకపాల కేదార కటక ముద్రిత పాణి
కురుచ లాతాముతో కూర్చిపట్టి
ఐణేయమైన ఒడ్డాణంబు లవణిచే
నక్కళించిన పొట్టమక్కళించి
ఆరకూటచ్ఛాయ నవఘళింపగ చాలు
బడుగుదేహంబున భస్మమలది

మిట్టయురమున నిడుయోగపట్టె మెరయ
చెవుల రుద్రాక్షపోగులు చవుకళింప
కావికుబుసంబు జలకుండికయును పూని
చేరె తద్గేహ మౌషధసిద్ధు డొకడు

ఇట్లు చనుదెంచు పరమయోగీంద్రు కాంచి
భక్తి సంయుక్తి నెదురేగి ప్రణతుడగుచు
అర్య్ఘపాద్యాది పూజనం బాచరించి
ఇష్టమృష్టాన్న కలన సంతుష్టు చేసి

ఎందుండి ఎందుపోవుచు
ఇందులకేతెంచినార లిప్పుడు విద్వ
ద్వందిత నేడుగదా మ
న్మందిరము పవిత్రమయ్యె మాన్యుడనైతిన్‌

మీమాటలు మంత్రంబులు
మీమెట్టినయెడ ప్రయాగ మీపాదపవి
త్రామల తోయము లలఘు
ద్యోమార్గచరాంబు పౌనరుక్య్తము లుర్విన్‌

వానిది భాగ్యవైభవము వానిది పుణ్యవిశేష మెమ్మెయిన్‌
వాని దవంధ్యజీవితము వానిది జన్మము వేరుసేయ కె
వ్వాని గృహాంతరంబున భావాదృశ యోగిజనంబు పావన
స్నానవి ధాన్నపానముల సంతసమందుచు ప్రోవు నిచ్చలున్‌

మౌనినాథ కుటుంబ జంబాల పటల
మగ్న మాదృశ గృహమేధిమండలంబు
నుద్ధరింపంగ నౌషధమొండు కలదె
యుష్మదంఘ్రిరజో లేశమొకటి తక్క

నావిని ముని ఇట్లను వ
త్సా మావంటి తైర్థికావళి కెల్లన్‌
మీవంటి గృహస్థుల సుఖ
జీవనమున కాదె తీర్థసేవయు తలపన్‌

కెలకులనున్న తంగెటిజున్ను గృహమేథి
యజమాను డంకస్థితార్థపేటి
పండిన పెరటికల్పకము వాస్తవ్యుండు
దొడ్డిబెట్టిన వేల్పుగిడ్డి కాపు
కడలేని అమృతంపునడబావి సంసారి
సవిద మేరునగంబు భవనభర్త
మరుదేశ పథమధ్య ప్రప కులపతి
ఆకటికొదవు సస్యము కుటుంబి

బధిర పం గ్వంధ భిక్షుక బ్రహ్మచారి
జటి పరివ్రాజ కాతిథి క్షపణ కావ
ధూత కాపాలికా ద్యనాథులకు కాన
భూసురోత్తమ గార్హత్యమునకు సరియె

నావుడు ప్రవరుం డిట్లను
దేవా దేవర సమస్త తీర్థాటనమున్‌
కావింపుదు రిలపై నటు
కావున విభజించి అడుగ కౌతుకమయ్యెన్‌

ఏయే దేశములన్‌ చరించితిరి మీరేయే గిరుల్‌ చూచినా
రేయే తీర్థములందు క్రుంకిడితి రేయే ద్వీపముల్‌ మెట్టినా
రేయే పుణ్యవనాళి ద్రిమ్మరితి రేయే తోయధుల్‌ డాసినా
రాయా చోటులకల్గు వింతలు మహాత్మా నాకెరింగింపవే

పోయి సేవింపలేకున్న పుణ్యతీర్థ
మహిమ వినుటయు నఖిల కల్మషహరంబ
కాన వేడెదననిన అమ్మౌనివర్యు
డాదరాయత్తచిత్తుడై అతని కనియె

ఓ చతురాస్యవంశ కలశోదధి పూర్ణశశాంక తీర్థయా
త్రాచణశీలినై జనపదంబులు పుణ్యనదీనదంబులున్‌
చూచితి నందు నందు గల చోద్యములన్‌ కనుగొంటి నాపటీ
రాచల పశ్చిమాచల హిమాచల పూర్వదిశాచలంబుగన్‌

కేదారేశు భజించితిన్‌ శిరమునన్‌ కీలించితిన్‌ హింగుళా
పాదాంభోరుహముల్‌ ప్రయాగనిలయుం పద్మాక్షు సేవించితిన్‌
యాదోనాథసుతాకళత్రు బదరీనారాయణుం కంటి నీ
యా దేశంబననేల చూచితి సమస్తాశావకాశంబులన్‌

అదియట్లుండె వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరధతురంగ శృంగార చారుచామర చ్ఛటా ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమరసముదయంబగు నుదయంబునంగల విశేషంబులు శేషఫణికినైన లెక్కింప శక్యంబె అంధకరిపు కంధరావాస వాసుకి వియోగభవజుర్వ్యథాభోగ భోగినీ భోగభాగ పరివేష్టిత పటీర విటపివాటికా వేల్లదేలా లతావలయంబగు మలయంబునంగల చలువకు విలువ యెయ్యది అకటకట వికట కూటకోటి విటంక శృంగాటకాడౌకమాన జరదిందుబింబ గళదమృతబిందు దుర్దినార్దీకృత చల్లకీపల్లవ ప్రభంజన పరాంజన హస్తిహస్తంబగు అస్తంబునంగల మణిప్రస్తరంబుల విశ్రాంతిం జింతించిన మేనం బులక లిప్పుడుం బొడమెడు స్వస్వప్రవర్ధిత వర్ధిష్ణు ధరణీరుహసందోహ దోహద ప్రధానాసమాన ఖేలదైలబిల విలాసినీ విలాస వాచాల తులాకోటి కలకలాహుమాన మానస మదాలస మరాళంబగు రజతశైలంబు నోలంబులం కాలగళు విహారప్రదేశంబులంగన్న సంస్రృతిక్లేశంబులు వాయవే సతత మదజల స్రవణపరాయ ణైరావణ విషాణకోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్కురువింద కందళవ్రాత జాతాలాత శంకాపసర్పదభ్రము భ్రమీవిభ్రమ ధురంధరంబగు మేరు ధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయం గనుంగొనుట బహుజన్మకృత సుకృత పరిపాకంబునంగాక యేల చేకూరనేర్చు నేనిట్టి మహాద్భుతంబు లీశ్వరానుగ్రహంబున స్వల్పకాలంబునం గనుంగొంటి ననుటయు ఈషదంకురిత హసన గ్రసిష్ణు గండయుగళుండగుచు ప్రవరుం డతని కిట్లనియె

వెరవక మీకొనర్తునొక విన్నప మిట్టివియెల్ల చూచిరా
నెరకలుకట్టుకొన్న మరి యేండ్లును పూండ్లును పట్టు ప్రాయపుం
జిరుతతనంబు మీమొగము చెప్పకచెప్పెడు నద్దిరయ్య మా
కెరుగ తరంబె మీమహిమ లీర యెరుంగుదు రేమిచెప్పుదున్‌

అనిన పరదేశి గృహపతి
కనియెన్‌ సందియము తెలియనడుగుట తప్పా
వినవయ్య జరయు రుజయును
చెనకంగా వెరచుమమ్ము సిద్ధులమగుటన్‌

పరమంబైన రహస్యమౌ నయిన డాపన్‌ చెప్పెదన్‌ భూమిని
ర్జరవంశోత్తమ పాదలేపమను పేరంగల్గు దివ్యౌషధం
పు రసం బీశ్వరసత్కృపంగలిగె తద్భూరిప్రభావంబునం
చరియింతుం పవమాన మానస తిరస్కారి త్వరాహంకృతిన్‌

దివి బిసరుహబాంధవ సైం
ధవసంఘం బెంతదవ్వు దగలేకరుగున్‌
భువి నంత దవ్వు నేమును
ఠవఢవ లే కరుగుదుము హుటాహుటి నడలన్‌

అనినన్‌ విప్రవరుండు కౌతుకభరవ్యగ్రాంతరంగుండు భ
క్తి నిబద్ధాంజలి బంధురుండునయి మీ దివ్యప్రభావం బెరుం
గని నా ప్రల్లదముల్‌ సహించి మునిలోకగ్రామణీ సత్కృపన్‌
నను మీ శిష్యుని తీర్థయాత్ర వలనన్‌ ధన్యాత్ముగా చేయరే

అనుటయు రసలింగము నిడు
తన వట్రువ ప్రేపసజ్జ దంతపుబరణిన్‌
నినిచిన యొకపస రిదియది
అనిచెప్పక పోసె తత్పదాంబుజయుగళిన్‌

ఆ మందిడి అతడరిగిన
భూమీసురుడరిగె తుహినభూధర శృంగ
శ్యామల కోమల కానన
హేమాఢ్య దరీ ఝరీ నిరీక్షాపేక్షన్‌

అనిన విని యమ్మహీసురవరు డట్లరిగి యెట్లు ప్రవర్తించె నతని పుణ్యవర్తనశ్రవణంబు మనంబునకు హర్షోత్కర్షంబు కల్పించె తరువాతి వృత్తాంతంబు కృపాయత్తచిత్తంబున నానతీయవలయునని యడుగుటయును

గంగా స్వచ్ఛ తరంగ భంగిక యశో గాఢ చ్ఛవి చ్ఛన్న సా
రంగాంకాంక నిరంకుశ ప్రతికళా ప్రౌఢి ప్రియంభావుకా
గాంగేయాచలదాప నూపుర వచో గాంభీర్య లీలాస్పదా
బంగాళాంగ కళింగ భూప సుభటాభ్రశ్రేణి ఝంఝానిలా

మండలిక తపనశోభిత
కుండలపతిశయన కర్ణకుండలిత రసా
ఖండ కవికావ్య దిగ్వే
దండ శ్రుతిదళన కలహతాడిత పటహా

కుకురు కాశ కురు కరూశ కోస లాంధ్ర సింధు భా
హ్లిక శకాంగ వంగ సింహళేశ కన్యకామణి
ప్రకర పాణిఘటిత రత్నపాదుకా కలాచికా
ముకుర వీటికా కరండ ముఖ్య రాజలాంఛనా

ఇది శ్రీమదాంధ్ర కవితాపితామహ సర్వతోముఖాంక పంకజాక్ష పాదాంబుజాధీన మానసేందిందిర నందవరపుర వంశోత్తంస శఠకోపతాపస ప్రసాదాసాదిత చతుర్విధ కవితా మతల్లి కాల్లసాని చొక్కయామాత్యపుత్త్ర పెద్దనార్యప్రణీతంబైన స్వారోచిషమనుసంభవంబను మహాప్రబంధంబునందు ప్రథమాశ్వాసము