మతము : విమతము
మతము : విమతము
(గోలకొండ పాదశాహీ వారి పర్మానుల సీలు యిచ్చట విప్పబడుటం జేసి దీనికి సికాకోల్ లేక చికాకోల్ అను పేరు కలిగెనని యిక్కడి వారందురు గాని, అది నిజము కాదు. ఈ పట్టణము బహు ప్రాచీనమైనది. దీని పేరు శ్రీకాకుళము. ఒకప్పుడిందు శ్రీకాకుళేశ్వరుని క్షేత్రముండెను. దానిని పడగొట్టి షేరు మహమ్మదు పెద్ద మసీదును కట్టెను. నిజమిది)
ఒక సంవత్సరమున కార్తీక మాస శుక్లపక్ష దశమి నాటి సాయంత్రం ఇద్దరు బ్రాహ్మణులు, ముప్పది యేండ్ల ప్రాయపుటతడొకడును, యిరువది యేండ్ల లోపు వయస్సు గల యతడొకడునూ తూర్పు నుండి పట్టణము దరియ వచ్చుచుండిరి.
నారాయణభట్టు మోము అత్యంత సంతోషముతో వికసితమై యుండెను.
“పుల్లా! మా వూరొచ్చాంరా. యిట్టి వూరు భూప్రపంచములో వుండబోదురా. కాళిదాసు అవంతిని ఉద్దేసించి చెప్పిన మాటలు దీనియందు వర్తిస్తున్నాయిరా, యేమి నది, యేమి వూరు! ఇది శ్రీకాకుళేశ్వరుడి క్షేత్రము, యెట్టి మహాక్షేత్రమని చెప్పను, అదుగో -
నారాయణభట్టు నిశ్చేష్టుడై నిలిచి, కొంత తడవు మాటాడకుండెను.
“యేమి స్వామీ! యేమి స్వామీ!” అని పుల్లంభట్లు అడుగ “యేమి చెప్పనురా పుల్లా! కోవిల గోపురం మాయమై పోయిందిరా!” అని నేలపై కూలబడెను.
“చెట్ల చాటునుందేమో స్వామీ?”
“యే చెట్లు కమ్మగలవురా, పుల్లా! ఆకాశానికి నెత్తుటిన ఆ మహా గోపురాన్ని, మనస్సు చివుక్కుమని పోయిందిరా పుల్లా! యీ పట్నానికీ మనకీ రుణస్య చెల్లిపోయింది. రా తిరిగీ కాశీ పోదాం .”
“గోపురం కోసవాఁ యిక్కడికి వచ్చాం స్వామీ? యెడతెగని మార్గాయాసం పడి యీ . నాటికి దేశం చేరాం గదా; మళ్ళీ వెంటనే పోవడానికి యినప కాళ్ళు కావు గదా? లెండి, నా మాట వినండి; దాని సిగ్గోసిన గోపురం, గోపురవఁన్నదే మీకు కావలసి వుంటే మా వూరు రండి. “ఓరి వెఱ్ఱివాడ! మీ వూరి గోపురం యెవరిక్కావాలిరా! నీకు బోధపడదు. చిన్నతనంలో యెప్పుడూ ఆ గోపురం మీదనే. యెందుకా తీపులు, మా గోపురం కథాశేషమైఁంది.”
లేచి “శివ శివ -” ఓరే, మీ వూరి గోపురం కూడా యీ మ్లేచ్చులు పడగొట్టి వుంటాఱ్ఱా!”
“మీకు యేమి ఉపద్రవం వచ్చింది? పడగొడితే ఆ పాపం వాళ్ళనే కొడుతుంది. ఆకలేస్తూంది, పెందరాళే వూరు చేరుదాం!
“యేం వూరు - యేం చారడం! ఆకలంతా పోయిందిరా!”
నారాయణభట్టు లేచి మౌనము వహించి కొంత తడవు నడచెను. అంతట తలయెత్తి చూడ సంజ చీకటిలో నెలి వెలుగు కమ్మిన పడమటి ఆకాశమును చూసి రెండు మసీదు స్తంభములు కళ్ళ యెదుట నిలిచెను. నారాయణభట్టు మరల నిలిచిపోయి స్తంభముల పరికించుచు;
“కాకుళేశ్వరుడి గుడి పగలగొట్టి మ్లేచ్ఛుడు మసీదు కట్టాడు” అనుకొనెను.
“దేవుఁడెందు కూరకున్నాడు. స్వామీ?
“ఆ మాటే యే శాస్త్రంలోనూ కనబడదురా పుల్లా. మసీదు వేపు పోదాం పద.”
“మసీదు గానీ సత్రం అనుకున్నారా యేమిటి? పెందరాళే భోజనం మాట ఆలోచించు కోకపోతే ఉపవాసం తటస్థిస్తుంది”.
“అంత మహాక్షేత్రం పోయిన తరువాత తిండి లేకపోతే వచ్చిన లోటేమిటి?”
కాలుకు కొత్త సత్తువ పుట్టి గురువును, కాలీడ్చుచు శిష్యుడును, గట్లంట పుట్టలంట బడి మసీదు ద్వారం చేరిరి.
“యేమి తీరుగా కట్టాడు స్వామీ, మసీదు”!
“వాడి శ్రాద్ధం కట్టాడు!"
గెడ్డము పెంచి యాబది సంవత్సరములు ప్రాయము గల ఒక తురక చిలుము పీల్చుచు కూర్చుని యుండ నారాయణ భట్టు 'సలా'మని ఇట్లడిగెను.
“భాయీ! యిక్కడే కదా పూర్వం శివాలయం వుంటూ వచ్చింది”.
తురక ఒక నిమిషమూరుకొని నోటిలోని పొగ నెగనూది “హా సైతాన్కాఘర్" అనీ యుత్తర మిచ్చెను.
“యేం పాట్లొచ్చాయీ దేవుఁళ్ళకి!”
“దేవుళ్ళకి యేపాట్లూలేవు - మన సాపాటు మాట ఆలోచించరేం?” “కుఱ్ఱవాళ్ళకి ఆకలి లావు. సాయీబు గారూ! యీ వూళ్ళో చేబ్రోలు వారుండాలి; వున్నారా? ఈ దేవాలయం దగ్గిరే వారి బస వుండేది. అనగా యిప్పుడు మీ మసీదగ్గరే!”
ముసల్మాను స్వచ్చమగు తెనుగు నవలంబించి “లేద”నెను.
“అయ్యో! మా పెద మావఁ రామావధానులు చిన్నమామ లక్ష్మణ భట్టు దేశాంతరగతులై నారా? మృతులైనారా?
సాయీబు చేత నుండి చిలుము నేలరాలి ముక్కలై నిప్పులు నలు దెసలా చెదర, 'నారాయణా! అని సమ్మోదముగా పిలిచెను.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.