మణి మాలికలు/రెండు పాదాల నిండు కవిత్వం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రెండు పాదాల నిండు కవిత్వం

తెలుగు సాహిత్య పరిణామక్రమంలో అనేక ప్రక్రియలు వెలుగు చూస్తుంటాయి. అన్నీ ఆహ్వానించదగినవే. భావాన్ని ఇతరు లతో పంచుకుని రసాస్వాదన చేయడం ప్రధానం. సమస్త బంధనాన్ని తెంచుకుని స్వేచ్ఛగా పదాల్ని కూర్చడం అందర్నీ ఆకర్షిస్తుంది. అంతే కాకుండ కఠిన పదాలు, దీర్గ…సమాసాలు ఉండవు. సూటిగా మనసుకు హత్తుకునేలాచెప్ప డమే నియమం. అంతే. కవితా నిర్మాణాన్ని ఆకళింపు చేసు కుంటే చాలు ఒక అభిరుచి సొంతమవుతుంది. మణిమాలికల పట్ల అనేకమంది యువకవులకు మక్కువ కలిగింది అందుకే, ఇక్కడ యువకవులు అంటే వయసుకు సంబంధించి కాదు. కొత్తగా కవితారంగంలోకి ప్రవేశించేవారని అర్థం చేసుకోవాలి. ప్రతి వ్యక్తికీ తనకే సొంతమైన అనుభవాలుంటాయి. ఉద్వేగాలుంటాయి. ఆనందాను భూతులుంటాయి. ఎవరికి చెప్పుకోవాలి? ఎలా వ్యక్తపరచుకోవాలి? చాలినంత సమయం, వెసులుబాటు ఉండదు. మొలకలెత్తే భావాల్ని అక్షరబద్ధం చేసే ఓపిక ఉండదు. నిత్య దైనందిన వ్యాపకాల్లో కూరుకుపోయి తనలోని సృజనను చంపేసుకోవాలి తప్ప మార్గం లేదు. సరైన వేదిక లభించకపోవడమే కారణం. అట్లాంటి వారికి దొరికితే భావాలు కవిత్వమై అవిచ్చన్నంగా ఊపిరిపోసుకుంటాయనడానికి ఇదిగో ఈ మణిమాలికలే గొప్ప ఉదాహరణ.

ఏకరీతి అభిరుచులు గల వ్యక్తులే. కాకపోతే ముఖపరిచయాలుండవు. భిన్న ప్రాంతాల్లో భిన్న భాషా సమూహాల్లో సరిహద్దుల్లేని ప్రపంచంలో బిజీగా ఉంటారు. అంతర్జాలం (ఇంటర్నెట్) అనే ఒక ఉపకరణం. అందర్నీ ఒకచోట రచ్చబండ మీద కూర్చుని ముచ్చట్లాడుకునే అవకాశం కల్పించింది. అనుసంధానమంతా దాని ద్వారానే. ఎన్నో ఆలోచనలు, ఊహలు, అనుభూతి స్పందనలు అద్భుతంగా భావప్రసార మవుతున్నాయి. వీరందర్నీ ఒక సమూహంలోకి కూడగట్టడం పెద్దపనే. ఆ పనిని విజయంతంగా చేసి ఒక ప్రక్రియకు రూపశిల్పి అయినవారు ప్రసాద్‌ అట్లూరి. సుమారు మూడవేలమంది సభ్యుల్ని ఒక చోట చేర్చడం అంటే అందులో ఎంతటి ఆకర్షణశక్తి మిళితమైందో అర్థం చేసు కోవాలి. ప్రసాద్‌ వృత్తి రీత్యా భవన నిర్మాణ కర్త ప్రవృత్తి రీత్యా సేద తీరేది కవిత్వంలో ఆయన లోని సహృదయత, స్నేహపాత్రత ఫేసుబుక్ సాక్షిగా వీరందరూ కవులుగా ప్రత్యక్షమై మనముందు ఇలా నిలబడ్డానికి కారణమైంది.

ఇప్పటికే తెలుగు సాహితీ లోకంలో హైకూలు, నానీలు, రెక్కలు వంటి లఘు ప్రక్రియలు ప్రవేశించి కవిత్వాన్ని సుసంపన్నం చేసాయి. ప్రకృతి ప్రధానంగా హైకూలు, తాత్విక వివేచన తో రెక్కలు అర్థసమన్వయంతో నానీలు ఘనతకెక్కాయి. ఆయా ప్రక్రియల్లో వందలాది కవితాసంపుటులు వెలువడ్డాయి. పెనౖ పేర్కొన్న ప్రక్రియ లకు మణిమాలికలకు

మౌలికమైన భేదం ఉంది. వాటన్నిటికీ అక్షరాలు, క్లుప్తతే ప్రాతిపదిక. అయితే ఇందులో పదాల సంఖ్య ముఖ్యం. క్లుప్తత అనేది రెండింలోనూ సమానధర్మం. మణిమాలికలు మొదటి పాదంలో అవసరాన్ని బట్టి రెండో మూడో పదాలుంటాయి. రెండో పాదంలో మొదటి పాదం పదాల సంఖ్యతో సమానంగా నైనా ఉండొచ్చు లేదా దాని గుణిజాల్లో పదాలు ఉండొచ్చు. ఉదాహరణకు మొదటి పాదంలో రెండు పదాలుంటే రెండో పాదాంలో రెండుగానీ నాలుగుగానీ ఆరుగానీ పదాలుంటాయి. ఆరు కంటే ఎక్కువ పదాలుండకూడదని నియమం ఉంది. ఇక నిర్మాణరీతి వల్ల ఒక లయ స్వచ్చంగా ఏర్పడే అవకాశం ఉండనే ఉంది. మణి మాలికలు తెలుగు కవిత్వానికి ఒక చేర్పుగా వినూత్న కవితారూపంగా సృజనాత్మకతలో కొత్తదానం గల ప్రక్రియగా అవతరించగలదాని ఆశించవచ్చు.

మణిమాలికల్లో తాత్విక భావ చైతన్యం మెండుగా ఉంది. హైకూలు కాసింత విరామం పాటించి చదివితే ఊహించుకునే కొలదీ పెద్ద దృశ్యం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. ఇందులో అలా కాదు. తక్షణమైన స్పందన మెరుపులా తడుతుంది. అడ్డంకులు లేకుండా సులభంగా ప్రవేశించగలగడం పనుల మధ్య, ప్రయాణాల్లోనూ మనసులో కలిగిన భావాన్ని అంది పుచ్చుకుని సులువుగా రాయొచ్చు. రాసేవారికి చదివే వారికీ ఆత్మతృప్తి.

సౌందార్యాత్మకత, తత్వ జిజ్ఞాస అనుభూతి అనుభవ సాంద్రత జీవిత సత్యాన్వేషణ ఈ మణి మాలికలలో పుష్కలంగా ఉంది. సాధారణ పదాల ద్వారా కవితా నిర్మాణాన్ని సాధించి గంభీరమైన లోతైన అర్థాన్నిచ్చే ద్విపదాలెన్నో ఉన్నాయి. ఇందులో వేగం, యాంత్రికత చోటు చేసు కున్న నేటికాలంలో ఇలాంటి లఘు ప్రక్రియలు పుట్టుకు రావడం సహజమే. అది చొచ్చుకుపోయి నలుగుర్నీ ఆకర్షించి పదికాలలు నిలబడుతుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

ఒక చిన్న కవితలో అనంతమైన అర్థవిస్స్తృతి ఉంటుంది. చదావగానే మనం కొన్ని అనుభవాలు తవ్వుకోవాలి. కొన్ని జ్ఞాపకాల్ని స్మృతికి తెచ్చుకోవాలి. కొన్ని అనుభూ తుల్ని సంలీనం చేసుకోవాలి. ఏకకాలంలో ఇవన్నీ సంభవించి మన సంస్కారం ఉన్నతీకరించబడాలి. కొన్ని మణిమాలికల్ని పరిశీలిద్దాం.

ఊహలు మనసును మోసే గుర్రాలైతే
వాస్తవాలు ఎగిరి తన్నే గాడిదలు (ప్రసాద్‌ అట్లూరి)


ఊహలకు అదుపాజ్ఞలు ఉండవు. అవకాశం ఇవ్వాలే గానీ చెలరేగి పోతాయి. అవి ఎల్లాంటివి? మనసును మోసే గుర్రాల్లాంటివి. అది అలా ఉంచండి. మరి వాస్తవాలు? గిల్లి చూసుకుంటే వాస్తవంలోకి వస్తాం. వాస్తవాలు ఊహలంత సజావుగా ఉంటాయని చెప్పలేం. ఊహలకు భిన్నంగా ఉంటాయి. అవి ఎల్లాంటివి? ఎగిరి తన్నే గాడిదల్లాంటివి.

12

గుర్రం, గాడిదలతో ఊహల్నీ వాస్తవాల్నీ పోలిక చేసి చెప్పడం వల్ల ఒక తాత్విక భావాల్ని సునాయాసంగా అందివ్వగలిగింది ఈ మణి మాలిక.

నాది ఊష్ణపు శరీరమే మరి
నీజ్ఞాపకాల కుంపటి గుండెల్లో రగిలించాక (దయానందరావ్‌ దేవరాజుల)


జ్ఞాపకాలు చేదుగా ఉంటే గుండె కుంపటవుతుంది. ఫలితం-నిద్రలేని రాత్రులు... చిట్లుతున్న మెదడు వెరశి శరీరమంతా ఊష్ణమే. గుండెల్ని రగలించని జ్ఞాపకం గురించి అయితే మరో మణి మాలిక రాయాల్సిందే.

కన్నుల మాటునే కాపు కాసా
కౌగిళ్ళకు నెలవు కలలే అన్నావని (జానకి పాదుక)


కలల చిరునామా ఎప్పుడూ వైయక్తిక అనుభూతే. అది కన్నుల మాటునో రెప్పల ప్రకంపనాల చెంతో కాపు కాస్తే చిక్కేది కాదని తెలుసు. అంతర్గత భావన నుంచి కూడ కవి ఏదైనా ఆశిస్తాడు.

మాట గుండెను భేదిస్తే
మౌనం మనసును కోసేస్తుంది (శ్రీనివాస్‌ ఆర్‌.వి.ఎస్‌.ఎస్‌)


పెళుసు మాట గుండెను బాధిస్తుంది.తట్టుకోడానికి కొంత సమయం పడుతుంది. మౌనం కూడ ఒకలాంటి ఆయుధమే. అది ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. ఒకోసారి మనసును విరిచేస్తుంది. కోసేస్తుంది. దీన్ని అధిగమించడం కష్టం.

మానవత్వం మరణిస్తుంది
ఓ నిముషం మౌనం పాటిద్దాం (పద్మకుమారి వంగర)


తెల్లారి లేచి దినపత్రికలు, చానల్స్‌లోకి వెళితే మానవత్వం మంటగలిసే సంఘటనలెన్నో. మౌనం పాటించడం అంటే సానుభూతి తెలయజేయడం. అశక్తత నైరాశ్యమేనా మిగిలేది? కాదు.. కాకూడదు. మానవత్వం పరిమళించాలని మనసారా కోరుకోవడం ఈ మణి మాలికలో ఉంది.
నాలోని నిన్ను వేరుచేయమన్నా వల్ల కాదంటూ చేతులెత్తేసింది రాయంచ (లక్ష్మి యలమంచిలి) మమ్మల్ని ఎవరూ విడదీయలేరు. మేమిద్దరం ఒకటే. ఇక్కడ ప్రేమబంధాన్ని వేరు చేసే వారెవ్వరూ లేరు. హంస పాలు నీళ్ళువేరు చేస్తుందంటారూ కదా. అది కూడ ఏమీ చేయలేదు. ఏకత్వం ఎంతగా పెనవేసుకున్నదో చెబుతుంది ఇది.

హోళీ అంటే తనకిష్టమంది
నల్లరంగే చల్లుతోంది... మనసుపై (సాయి కామేష్‌)


ఇష్టాన్ని రంగుల్లో చెప్పొచ్చు. ఏ రంగైనా పర్వాలేదు. కాని నల్లరంగు దేనికి

13

ప్రతీక? మనుసుపై అది చల్లుతుందట. వైముఖ్యాన్ని తెలియజేయడానికి అంతకంటే మార్గం లేదు. దీనికి వ్యాఖ్యానం ఎంతైనా చెప్పుకోవచ్చు.

నిలువెల్లా గాయాలే చేసినా
మది వేణవుకెందుకో నీతలపుల గేయాలు (సిరి వడ్డే)


ఎన్నో గాయాలు చేసావు.. నిలువెల్లా. తట్టుకోలేరెవ్వరూ. అయినా చిత్రం -
నా మది వేణవు ఎందుకో నీ తలపుల గేయాలే పాడుతూంది. ప్రేమ విఫలం అయినా తలపులు మాసిపోవు.

మణిమాలికలు కవులు గొప్ప ఉత్సాహంగా రాస్తున్నారు. తమ స్పందనను పదాలుగా గుచ్చి పరిమళాలుగా వెదజల్లుతూ భవిష్యత్‌లో మంచి కవులుగా మారే వాగ్దానం చేస్తున్నారు. ఆ దాఖలాలు ప్రతి ద్విపదలోనూ కనిపించింది. ఉదాహరణగా చెప్పాలి కదా
అన్ని కొన్నింటిని గురించి మాత్రమే రాయడం జరిగింది.

మణి మాలిక... మధుర భావాక్షర దీపిక గ్రూప్‌లోకి ప్రవేశించి చూడండి.
అక్కడ తెలుగు పదాల చక్క ని అల్లికతో భావామృతం తొణికిసలాడే మాలికలు కనిపిస్తాయి. కవిత్వం మనకు సరిపడదులే అనుకున్న వాళ్ళు కూడ కవులైపోతారు. నాకైతే ఎంతో ఆనందమూ ఆశ్చర్యమూ కలిగింది. ఔత్సాహిక కవుల పరంపర విరజిమ్మన కవిత్వం
గుబాళించింది. అనేకానేక స్పందనలు, భావ వీచికలు మనల్ని తప్పక రసానుభూతికిలోను చేస్తాయి. ప్రచురణ మాధ్యమం లోని కూర్పుల అంక్షలు లేవు. పరిధి విశాలం. అంతర్జాలం ఒక ఉపకరణంగా ఎంతో మంది కవిత్వం పట్ల ఆకర్షితులవు తున్నారు. ఇప్పటికే 'కవి సంగమం' ఇదే విషయాన్ని ఋజువు చేసింది. కంప్యూటరు సౌకర్యం
ఉన్న వారికి పరిమితం కాకుండ పుస్తకంగా తీసుకురావడం అభినందనీయం. వీరంతా భవిష్యత్తు తెలుగు కవిత్వానికి ఆశాదీపాలు. అంతర్జాలం ఇచ్చిన స్ఫూర్తితో వీరందరూ తలుగునాట గర్వించదగిన కవులుగా రూపాంతరం చెందుతారని ఆకాంక్షిస్తున్నాను.

యానాం,
25-5-2014

- దాట్ల దేవదానం రాజు

14