Jump to content

మణి మాలికలు/పద్మకుమారి వంగర

వికీసోర్స్ నుండి

పద్మకుమారి వంగర
ఫ్లాట్ నెం. 201, హౌస్‌ నెం.5-9-22/1/1
అశోకా ఛాంబర్స్‌, ఆదర్శనగర్‌,
హైదారాబాద్‌-500063
కలం పేరు: స్ఫూర్తి
వృత్తి: సివిల్‌ ఇంజనీర్‌
మొబైల్‌ నెం. 93913 57134
ఈ-మెయిల్‌: vpadma39@yahoo.com
వెబ్‌: www.sphoorty1.blogspot.in

మాలికా పద్మాలు...
1. నాప్రేమ స్వచ్ఛమైనదైతే
    నువ్వెందుకు నాకు నీజ్ఞాపకమే చాలు

2. ఆకాశానికి అరనిమిషం విందు
    హరివిల్లొచ్చింది ఇవాళ మరి

3. మందారం సిగ్గుతో ముడుచుకుంది
   మల్లిక పరిమళం తాకి

4. మదిగది ఖాళీ చేస్తేచేసారు
   కనుల కొలను నింపిపోతారెందుకో

5. కన్నీళ్ళా కాకెంగిళ్ళా దోస్తీ
    అందమైన బాల్యం మరది.

6. తోటంతా పూసాయి పూలు
    ఏవెక్కడకెడతాయో తెలీదు గానీ

7. మానవత్వం మరణించింది
    ఓ నిమిషం మౌనం పాటిద్దాం

8. తనువెంత శ్రమిస్తోందీ
   చచ్చేదాక బ్రతికేందుకు

9. కాయితప్పడవలకిక శలవే
    నే పెద్దైపోయానుగా

10. పడిపోతానని భయమేమో
     జాబిలెప్పుడు ఇంద్రధనుసు పల్లకీ ఎక్కడు

11. చందామామని గోడకుర్చీ వేయించాలి
      ప్రతీఅమాసకీ స్కూల్‌ మానేస్తాడు

12. చినుకుపిల్లకి భలే ధైర్యం
     ఎవరికీ చెప్పకుండ వచ్చేస్తుందెప్పుడూ

13. తుషార కన్యది ఏ కాలేజో
     గడ్డిపరకలపై కూడ ఇళ్ళు కట్టేస్తుంది

14. మట్టి చల్లబడుతోంది
     రాలిన పూల పరిమళం పీల్చుతూ

15. వసంతం
     ప్రకృతికి సీమంతమేమో

16. మౌనపు బిరడా తీయవా
     ఊసుల తాయిలం పెడతా

17. అనుకున్నప్పుడల్లా కొనుక్కోలేము
     ఆనందంఅంగడి సరుకు కాదు

18. ఏంటో పేజీలు తడిసినట్లున్నాయి
     నువ్వూ ఏడ్చావా డైరీ

19. వసంతానికేం తెలుసు విరబూయడం తప్ప
     శిశిరానికేం తెలుసు రాల్చేయడం తప్ప

20. ఉలి తాకితేనే వికసిస్తాయి రాయీ రప్పా
     కవి అడిగితే పూలు వికసించడమేమి గొప్పా?

21. గాయం చేసే మాటతూాకు తెలియదాు
     తగిలి ముక్కలైన మనసు చిరునామా

22. ఆకాశం పాత బడదుగా
     సూర్యోదయం రోజూ ఉన్నా

23. ప్రతిపదం కవితవుతోంది
     ఏం మహత్తు పూసావు నాఅక్షరాలకు

24. అక్షరం అలంకారాలద్దుకుంటోంది
     ఆకాంక్షలకు ఆకారాన్నిస్తూ

25. నాశిష్యుడు అమెరికాలో ఇల్లుకట్టాడు
     పూరిగుడిసెలోని బడిపంతులు ఆనందం


26. శిశిరమొచ్చింది మరి
      తుమ్మెదకిక సాపాటుక్కరువే

27. గోరింట రాలాక అందమిస్తుంది
     చిత్రం వరిపంట కూడ రాలాకే ఆకలి తీరుస్తుంది

28. అరచేతిలోనే చందమామ ఎర్రగా
     పాపాయి నిద్రిస్తోంది ఆదమరచి

29. అడవిలో ఎర్రపూల తురాయిచెట్టు
     అందమంతా అడవిపాలంటే అర్ధమయ్యేట్టు

30. నువ్వూ నిద్రా రెండూ ఇష్టమే
     నిన్ను కలలో తెస్తుందమ్మా నిద్ర

31. ఏంటో నువ్వెళ్ళిపోయావ్‌
     నీ తలపులు మిగిల్చిన విషాదం నాతోనే ఆపి

32. మర్రిచెట్టు విస్తరిస్తూనే ఉంది
     నేలరాలిన ఆకుమాత్రం గొణుక్కుంటూనే

33. పిచ్చిదారం పూలకు బంధాలల్లుతోంది
     పూలు వాడి రాలిపోతూ దారం ఏకాకిగా మిగిలిపోతూ

34. రాత్రి కొండమీంచి దూకాడేమో సూరీడు
     గాయాలతో పొద్దున్నే వచ్చాడు ఎర్రగామండుతూ

35. ఉదయాన్నే చల్లనిగాలి
     రాతిరి జాబిలి వదిలిన వెన్నెలదేమో

36. మది ఎడరైంది
     ఎన్ని జ్ఞాపకాల వసంతాలనివ్వాలో పచ్చదనానికి

37. బాల్యాన్ని దాటి ఎదిగింది యవ్వనపు జలపాతం
     ఇప్పుడు నిశ్శబ్దమైన మౌనపు నదే..మరి

38. వసంతం గొప్ప గాయని
     ఏడదికి ఒకసారొచ్చే కోకిలకు ఇట్టే సంగీతం నేర్పేస్తుంది

39. జీవన ప్రయాణంలో ఎన్ని ఊర్లు మారానో
     నా తలపులు మాత్రం నీతోనే.... నీదగ్గరే

40. గాలి గొప్పసోషలిస్ట్‌
     పూలను ఆటపట్టిస్తూనే ముళ్ళతోనూ ముచ్చట్లాడుతుంది

41. నువ్వు కలలోకి వస్తానంటే
     జీవితాంతం నిదురిస్తూనే ఉంటా రని కలల కోసం!

42. మౌనం బలమైన ఆయుధం
     చేజారనీకు నిశ్శబ్దంలో సైతం సవ్వడించే ఏకైక నేస్తమది

43. విజయమెప్పుడూ ఒంటరిగానే పయనమౌతుంది
     విజేతమాత్రం ఎప్పుడూ ఒంటరవడు

44. కళ్ళల్లో మేఘాలున్నాయా
     నా చూపు సమీరానికి వర్షిస్తావ్‌

45. ఆకాశరాజు ప్రేమలేఖలు
     కుండపోతగా వాన ధరణి కన్నెపై

46. రాలిన పూలు చెప్పాయి
     నీ శ్వాస తాకలేదని

47. కవిత్వం నా భాష కాదు
     భావదారిద్య్రాంలో మగ్గిన నా అక్షరఘోష

48. నీ మాటలకన్నా నీ మౌనమే తేలిక
     నాకు ఇష్టమొచ్చిన భాషలో అర్ధం చేసుకోగలను

49. మృత్యు దేవత జెండర్‌ మార్చేసుకుందట
     మృగాళ్ళ దగ్గరకీ వెళ్ళాలిగా మరి

50. ధానుర్మాసపు శీతలం
     తారలన్నీ సూర్యుణ్ణి చేరాయట జాబిలినొదిలి

51. వసంతం పరుగెత్తుకొచ్చింది
     నా పిలుపు కోయిల పాటనుకొని

52. పలకరింపుల విత్తులు నాటు
     ప్రేమ పంట మనసుకొస్తుంది

53. అక్షరం అల్లిబిల్లిగా అల్లుకు పోతోంది
     ఉంటుందో లేదో తెలియని రేపటి కవిత కోసం

54. ఒంటరైనా విలువే
     సాహితీ ముత్యానికి

55. ఎంతవానో
     ఇంద్రధనుస్సు మాత్రం తడవట్లేదు

56. పరిమళాలు గాలికి గంధాలద్దుతున్నాయి
     చెలి చెక్కిళ్ళు తాకొచ్చాయేమో

57.మళ్ళీ చేద్దాం పయనం
     మురిపిస్తోందిగా ముద్దుగా బాల్యం

58.నిశ్శబ్దానికీ కన్నీళ్ళున్నాయి
     ఒంటరినదికీ కడగండ్లున్నట్లు

59.పిచ్చి కళ్ళు
     పరాయిబాధకు సైతం మండే వాకిళ్ళు

60.దూరంగా ఓ మౌనం
     జ్ఞాపకాలకు తెర దించుతూ

61.తేలికయింది మది
     ఊసులన్నీ నీ ముంగిట చల్లి

62.శిలగా మారు
     ఉలికైనా పనొస్తుంది

63. గుండెకు గాయమైనా
     కళ్ళే ఏడుస్తాయి అదేంటో మరి

64. పాపిట సింధూరం
     చెలి సిగ్గుల్లో సైతం సింగారాలొలకబోస్తూ

65. చేజారిన చెలిమినడుగు
     మాట తూలిన మనసెంత తు(స్వ)చ్ఛమో

66. పూబాలలకెలా తెలుసు
     నీపై వీచినగాలి తాకిందని..పరిమళిస్తున్నాయి

67. అద్భాుతాలన్నీ నీ అలవోకలోనే
     ఏడేడు వింతలు వేరెక్కడ

68. రేపటితో నాకు పనేంటి...
     నిన్నల్లో నీతో నిలిచాక

69. ప్రేమంటే
     ఒకనువ్వు ఒకనేనూ... కానే కాదు ఒక మనం...

70. మూగవోయింది కంటి విపంచి
     ఎదకు చెలమతీగలు బిగిస్తూ

71. రేయి గడవకుంది
     ఏంటో... సూరీడిక్కూడ ఆదివారం శలవేమో

72. తుషారకన్నెకి తెల్లవారలేదేమో
     కురుస్తూనేవుంది గుబులుగా

73. ఆరితే వెలిగించేందుకు తప్ప
     నా అరచేతులు దీపానికెందుకు

74. ఓ గుప్పెడు ఊసులీయవూ
     నా ఊపిరికూపిరి పోస్తా

75. గుండెలో భావాలన్నీ ఒలికిపోతున్నాయి
     శూన్యమైపోతుందేమో ఎద పాత్ర.

76. అడుగుజాడలు కనపడుతున్నా
     అనుసరించలేని అక్షరం నా కవిత్వం.

77. మరణస్తాను
     నువ్వు తోడుండే నిన్నల్లోనే

78. ఉలౌదామనుకున్నా
     నొప్పి కలుగుతుందని అలగా మారా

79. లోలాకులూ చాటు కావాలంటున్నాయి
     నీ చిలిపికబుర్లు వింటున్నాయిగా

80. వర్తమానమో అతుకుల బొంత
     ఎప్పుడూ మదిచిరుగులు కనిపిస్తూనే

81. మరణం చిన్నబోతోంది
     మరికొందరికి అవయవదానంతో జీవం చూసి

82. మేధావివే నెత్తురు రానీయవు
     సుతిమెత్తగా గుండెను కోస్తూ

83. వేచి విసుగ్గా రాల్తునాయి
     కాలపుకొమ్మ నుంచి క్షణాలపూలు

84. గడియారానికీ నాలా బద్ధాకమేమో
     నెమ్మదిగా ముళ్ళను కదిలిస్తూ

85. ష్‌.... చెలిమి నిదురిస్తోంది
     నీ పలుకుల అలికిడినీయకు

86.చెక్కిళ్ళకెందుకో ఇంత నిస్పృహ
     ఎన్నినీళ్ళు కారినా నిలవనీక

87. నాతో ఉన్న నిన్నల్నడుగు
     నేడు నీకున్న మధురాలేమిటో

88. శిలనే
     నువ్వు ఉలివై తాకేవరకు

89. శబ్దమే హాయి..
     నిశ్శబ్దం నిన్ను మించిన నియంత

90. అక్షరాలకు చిలిపితనం అబ్బేసింది
     సాహిత్యమంతా చిరునవ్వుల జలపాతమౌతూ

91. నీ వలపు గులాబీల నది
     నామమతను గుచ్చుతున్న ముళ్ళుసైతం మోస్తూ

92. నిద్ర చాలని నిశిలో
     ఈదుకొస్తూ ఎదురుగా ... నీజ్ఞాపకం

93. ప్రేమగా పదిజన్మలు మోస్తా
     ఈజన్మలో తలకొరివి పెట్టవూ

94. ఉలికులికి పడు తున్నావ్‌
     బలమైన జ్ఞాపకం సూటిగా తాకిందా

95. పూలు సింగారించుకొంటునట్లున్నాయి
     పరిమళాన్నో పరవశాన్నో

96. అలక పాట కష్టమే
     గొంతు బొంగురు పోతూ

97. ఎంత త్యాగమో...చిత్రంకదూ
     నిలువెల్లా గాయాలయిన వేణువు సైతం పాటపాపకు ఊపిరినిస్తూ

98. కాగితం వయారాలు పోతోంది
     అందాల అక్షర కన్యలన్నీ తన ముంగిట కొలువుంటాయని

99. ఏది పగిలినా ఆవేదనే
     నిశ్శబ్దం పగిలితేనే ....ఆనందం

100. యామినికి మర్యాద తెలీదు
     జాబిలికి దప్పికైనా తీర్చదెపుడూ

101. చెలిమి జీవిస్తోంది
     చచ్చేదాక బ్రతికించేందుకు

102. అక్షరం పారాడుతోంది
     కవితలో పరిమళించాలని

103. అలుకింత శీతలమా
     గుండె గదిని గడ్డకట్టేస్తూ

104. కాళ్ళు నొప్పిగా ఉన్నాయ్
     నీ కలల్లో నడిచివచ్చా

105. ఉత్తరమెంత బరువో...
     'అత్తింటికెళ్ళిన ఆడ' పిల్ల వ్రాసిందేమో

106. నిదురభామ అలకతో
కలలకన్యలకు మరణాలు

107. మావికన్యకి పెదవిగాటు
వసంతుడు కోయిలతో గాయం చేయించాడేమో

108. తీరానికెన్ని గాయాలో
అలలకన్య ముద్దాడుతుంటే

109. శిశిరకన్య గాయపడ్డట్లుంది.
పత్రరుధిరాలు జార్చుతోంది

110. లెక్కించలేనన్ని వెక్కి ళ్ళు
కాలం వేళ్ళ సందుల్లోంచి జారిపోయిన గతం వెక్కిరిస్తుంటే...

111. కలల కన్య చీకటిపై అలిగిందట
నాకళ్ళవాకిలికి రానంటోంది మరి నిద్దుర

112. ప్రేమలేఖ ఎలా వ్రాయాలి
ప్రతి తలపూ విరహగీతమౌతుంటే

113. కెంపులు పూయకు చెక్కిలికి
సూర్యాసవ్తమయం అవుతుందేమో పుడమికి

114. గుండెఎండలో ఆరేస్తున్నా
తడిసిపోతున్న జ్ఞాపకాలన్నీ

115. విషాదానికి మనసంటే ఎంతిష్టమో
పిలవకపోయినా పరుగెత్తుకొచ్చి కౌగిలిస్తుంది