మణిహారం

వికీసోర్స్ నుండి


అలఘువ్రతుడి మాటలకు నవ్వుతూ, “అలా జరగటం తప్పదు” అన్నాడు కళాపూర్ణుడు. ఆ పాపని చూసి, “ఇతని పుట్టుపూర్వోత్తరాలు, ఇతనికి ప్రథమాగమాదులు ఎలా కొడుకులో మాకందరికీ వివరంగా చెప్పమ”ని అడిగాడు. “అలాగే!” అని ఆ పాప ఇలా చెప్పింది

పాండ్యదేశంలో సోమశర్మ అనే అతను వుండేవాడు. అతని కొడుకు యజ్ఞశర్మ. ఎంత కష్టపడ్డా అతనికి వేదవిద్యలు ఒక్కముక్క ఒంటపట్టలేదని అతను బాధపడుతుంటే, అది మరిపించటానికి అతని తండ్రి నలుగురు గుణవతుల్ని తెచ్చి అతనికి పెళ్ళిచేశాడు. కోడళ్ళందరికీ ఎన్నో ఆభరణాలు, చీరలు, కావలసిన సదుపాయాలన్నీ సమకూర్చాడు. చివరి దశలో అతను కొడుకుని పిలిచి, కోడళ్ళకు వినపడేట్టు చెప్పాడు “మన వంశాచారం అన్నదానం. ఎలాటి పరిస్థితుల్లోనైనా దాన్ని ఆపకుండా నడుపు. దాని వల్ల నీకు నాలుగు వేదాల వంటి కొడుకులు కలుగుతారు. నా మాట తప్పదు” అని. “అలాగే”నని మాట యిచ్చాడు కొడుకు.

ఆ మాటమీద నిలబడి అతను క్రమం తప్పకుండా తన దగ్గరున్న సొమ్మంతా ఖర్చు పెట్టి అన్నదానాలు చేశాడు. చివరికి తన భార్యల సొమ్ములన్నీ అమ్మాల్సొచ్చింది. ఐతే అందుకు వాళ్ళేమీ బాధపడక పోవటమే కాకుండా “ముందుగా నావి తీసుకోండి, నావి తీసుకోండి” అని అందరూ వాళ్ళ ఆభరణాలన్నీ అతనికిచ్చారు.

ఆ యజ్ఞశర్మే ఈ అలఘువ్రతుడు. ఇతని గొప్ప అన్నదాన వ్రతం మూలాన ఈ పేరు వచ్చింది.

కొంతకాలానికి అతనికి దగ్గర వున్నదంతా ఐపోయింది. ఎలాగైనా తన వ్రతం జరపాలి గనక అందుకు మిగిలిన ఒకటే మార్గం తన భార్యల్ని అమ్మటం అని నిశ్చయించుకున్నాడు. ఐతే ఆ విషయం వాళ్ళకి చెప్పటానికి అతని మనసు రాలేదు. ఒక ఉపాయం ఆలోచించి, “తామ్రపర్ణి రేవులోకి వోడలు వచ్చాయి. నేను ఒకతనితో కలిసి ఓడవ్యాపారం చేసి అన్నదానాలకి డబ్బు సంపాయించుకు వస్తాను” అన్నాడు వాళ్ళతో. వాళ్ళు, “మీరు లేకుండా మేం వుండలేము, మమ్మల్నీ మీతో తీసుకెళ్ళండి” అని ప్రాధేయపడితే కష్టం మీద ఒప్పుకుని (అలా నటించి) వాళ్ళందర్నీ ఒక ఓడ మీద ఎక్కించాడు. తను చివర్లో ఎక్కుతానని చెప్పి కొంచెం దూరంలో దాక్కున్నాడు. ఐతే ఆ ఓడ కదిలి కొంచెం దూరం వెళ్ళేసరికి అతనికి ఎక్కడ లేని దుఃఖం కలిగింది. బోరున ఏడ్చాడు.

అతని భార్యలు చూశారది. ఆ నావికుడెవడో తమ భర్తని మోసం చేశాడనుకుని నలుగురూ ఒక్కసారిగా సముద్రంలోకి దూకేశారు! ఎంత వెదికినా వాళ్ళు దొరకలేదు. “నీ ఏడుపు మూలానే ఇంత జరిగింద”ని అతని కిచ్చిన డబ్బు కూడ లాగేసుకున్నారు నావికులు.

కనుక, తనకు నలుగురు కొడుకులున్నారనే విషయం ఇతను నమ్మలేక పోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఐతే ఇతనికి తెలియని కథ చాలా వుంది.

ఇతని భార్యలు సముద్రంలోకి దూకిన సమయంలో ఓ పెద్ద చేప నీళ్ళను లోనికి పీలుస్తున్నది. ఆ నీటితో పాటు వాళ్ళూ దాని నోట్లోకి వెళ్ళారు. ఆ తర్వాత అది కొంతదూరం వెళ్ళి ఆ నీటిని పైకి విసిరింది. దాంతో పాటు వాళ్ళూ పైకి ఎగిరారు. అలా ఎంతో ఎత్తు ఎగిరి వాళ్ళు అప్పుడు అక్కడ వెళ్తున్న ఓ విమానంలో పడ్డారు. తెలివొచ్చి కళ్ళు తెరిచేసరికి ఒక దేవతా దంపతుల్ని చూశారు. వాళ్ళు ఆ నలుగురినీ ఆదరించారు.

ఐతే వాళ్ళ లావణ్యం చూసిన దేవకాంతకి తన భర్త వాళ్ళ మీద మనసు పడతాడేమో ననే అనుమానం భూతమై పట్టుకుంది. వాళ్లనెలాగైనా వదిలించుకోవటం మంచిదని ఓ ఉపాయం పన్నింది. పాచికల ఆటలో తన భర్తని ఓడించి, అందుకు పందెంగా ఇద్దరూ మధురసం తాగి శృంగారక్రీడలు చెయ్యాలని చెప్పి, మధువు తాగేప్పుడు ఆ పాత్రలో తన రూపాన్నే చూసుకుని, “నేను కాక ఇంకెవర్నో తెచ్చిపెట్టుకున్నావా?” అంటూ అతన్తో పోట్లాటకి దిగింది.

అప్పుడు వాళ్ళ విమానం గోదావరీ తీరంలో వెళ్తోంది. అక్కడ ధర్మపురి అనే వూళ్ళో ముఖ్యవారకాంత ఇల్లు ఆకాశాన్ని తాకుతోంటే, ఈ నాటకంతో ఆ నలుగుర్నీ ఆ మేడ పైన దింపించింది. ఐతే వెళ్ళేముందు ఆమె భర్త, “పాపం వాళ్ళు తినటం, ఉండటం ఎలాగా?” అని విచారిస్తోంటే, “ఏం పర్లేదు, ఆ ఇంటి నిండా బోలెడు వస్తువు లున్నాయి. ఇకనుంచి ఆ వస్తువుల్ని వీళ్ళు గాక మరెవరు వాడబోయినా వాళ్ళకి మూడిందే!” అన్నది. ఆమె తన భర్త మీద అనుమానంతో అన్న ఆ మాట వాళ్ళకి వరంగా పరిణమించింది. విమానంలో వెళ్ళిపోయారు ఆ దేవతలు. ఆ యింటి యజమానురాలు ఇదంతా చూసి “వీరెవరో దేవతల్లా వున్నారు, వీళ్ళు ఇక్కడ వుండటమే నా అదృష్టం” అని వాళ్ళకి కనపడకుండా అన్ని సదుపాయాలూ వాళ్ళకి ఏర్పాటుచేసింది.

అప్పుడే వాళ్ళకు గర్భసూచనలు కనిపించాయి. కొన్నాళ్లకి నలుగురికీ నలుగురు కొడుకులు పుట్టారు. అనుకోకుండా అటు వచ్చిన ఒక యోగి ఆ బిడ్డల జాతకర్మలు నిర్వర్తించాడు. అతనే తన జ్ఞానదృష్టితో వాళ్ళు వేదరూపాలని గుర్తించి అదే విధంగా వాళ్ళకి నామకరణం కూడ చేశాడు. వాళ్ళు స్వయంగా అన్ని విద్యలూ తెలిసిన వాళ్ళైనా శాస్త్రోక్తంగా ఆ యోగి దగ్గర కూడ కొంత విద్యాభ్యాసం చేశారు. కొన్నాళ్ళకి వాళ్ళ తల్లులు ఇలా ఊరుకుంటే తమ భర్త విషయం ఎప్పటికీ తెలియదని, వెళ్ళి అతనికోసం వెదకటం మంచిదని, ఆ విషయం కొడుకుల్తో చెప్పారు. వాళ్ళు “మేము ఓ రాజు దగ్గర ప్రాపకం సంపాయించి వస్తాం. అప్పుడు ఆయన్ను వెదకటం తేలికౌతుంది” అని ఊళ్ళోకి వెళ్ళి విచారిస్తే, అక్కడి రాజు మదాశయుడని, అతను విద్యలు తెలిసినవాడనీ, ఐతే అతని పురోహితుని అనుమతి లేకుండా ఎవరికీ ప్రవేశం దొరకదనీ, ప్రతిభ వున్నవాళ్లు ఎవరికీ పురోహితుడి అనుమతి దొరకదనీ విన్నారు.

రాజుకు మామిడిపండ్ల బుట్టలు మోసుకెళ్ళే వాళ్ళతో కలిసి వాళ్ళ లాటి వేషాల్లో మోసుకెళ్ళి రాజు ముందర పెట్టారు. వాళ్ళ అమాయక చేష్టలు చూసి రాజు నవ్వుతూ, “అంతా బాగే కదా, దాపరికం లేకుండా చెప్పండి” అంటే వాళ్ళు తెలుగులో ఐతే ఒక అర్థమూ, సంస్కృతంలో ఐతే మరో అర్థమూ వచ్చే విధంగా మాట్లాడారు. మదాశయుడు వెంటనే వాళ్ళని నివురుగప్పిన నిప్పుల్లాటి వాళ్ళని గ్రహించి సాష్టాంగ నమస్కారాలు చేసి ఆదరించాడు. వాళ్ళని తనకు పురోహితులుగా వుండమని ప్రార్థించాడు. అలాగే నని ఒప్పుకుని వాళ్ళు ఆ తరవాత తమ తండ్రిని ఎంతగానో వెదికించారు.

ఈలోగా అలఘువ్రతుడు తను చేసిన పనికి విచారిస్తూ దేశాంతరాలు తిరుగుతూ మృగేంద్రవాహన ఆలయం గురించి విని అక్కడికి వెళ్ళి భువనేశ్వరీ మంత్ర జపం రెండేళ్ళ పాటు చేసి ఆ దేవి మహిమ వల్ల ఇక్కడికి వచ్చి పడ్డాడు” అని ముగించిందా పాప.

ఆశ్చర్యంతో ఈ కథంతా విన్న ఆ పురోహితులు పొంగిపోతూ తమ తండ్రిని కలుసుకుని నమస్కరించారు. కళాపూర్ణుడు కూడ వాళ్ళని సన్మానించాడు.

అప్పుడు అతని మంత్రుల్లో సత్వదాత్ముడనే వాడు ఆ బాలికతో, “అమ్మా, నేను వెర్రిగా కాసారపురంలో తిరుగుతుంటే జనం నాకు సత్వదాత్ముడని పేరు పెట్టారు. అంతకుముందు నా చరిత్ర ఏమిటో నాకేమీ తెలియదు. ఇన్ని తెలిసిన దానివి నా సంగతి కూడ చెప్పు” అని అడిగాడు. ఐతే ఎందువల్లనో ఆ పాప కేవలం పసిపాప లాగా కళ్ళు నులుముకుని ఏడుపు సాగించిందే తప్ప ఎంత బతిమాలినా ఇంకో ముక్క మాట్లాడలేదు.

కళాపూర్ణుడు మదాశయుణ్ణీ రూపానుభూతినీ చూసి, “విన్నారు కదా, ఇకనుంచి మీరు నాకు అత్తమామలు. మీరు కొలువుకు రానక్కరలేదు. ఇంటికి వెళ్ళి ఈ మధురలాలసని పెంచండి” అని పంపాడు. అలాగే అలఘువ్రతుణ్ణి కూడ అతని భార్యల దగ్గరకు పంపించాడు. అతని అన్నదాన వ్రతం సాగటానికి అనేక గ్రామాలిచ్చాడతనికి.

కాలం గడుస్తోంది. మధురలాలస పెద్దదయింది. చెలుల ద్వారా తన చిన్నప్పటి వృత్తాంతం విని కళాపూర్ణుడి మీద మనసు పెంచుకుంది. ఐతే కళాపూర్ణుడు అభినవకౌముదితో ఆనందంగా వుంటూ, రాజ్యవ్యవహారాల్లో మునిగిపోయి మధురలాలస విషయం పూర్తిగా మరిచిపోయాడు.

వసంతం వచ్చింది. చెలికత్తెల్తో మధురలాలస వనవిహారానికి వెళ్ళింది. డేగవేట మీద కళాపూర్ణుడు కూడ వాళ్ళున్న దగ్గరకు వెళ్ళాడు. ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి. భారంగా ఒకరికొకరు దూరమయ్యారు.

కళాపూర్ణుడు ఒక వృద్ధవిప్రుణ్ణి పిలిచి తను వనంలో చూసిన సుందరి గురించి చెప్పి ఆమె ఎవరో కనుక్కోమన్నాడు. అతను కొంతసేపు ఆ రాజుతో నర్మగర్భంగా మాట్లాడి చివరికి మెల్లగా బయటపెట్టాడు, ఆమె ఎవరో కాదు మధురలాలసే నని. ఆమె చిన్నప్పుడే కళాపూర్ణుడు ఆమె తల్లిదండ్రుల్ని తనకు అత్తమామలుగా చెప్పుకున్న విషయం గుర్తు చేశాడు.

ఇంకేముంది, ఏర్పాట్లు చకచక జరిగిపోయాయి వాళ్ళ వివాహానికి! అభినవకౌముదినీ, మధురలాలసనీ సమానంగా చూసుకుంటూ ఇద్దరితోనూ ఆనందంగా గడుపుతున్నాడు కళాపూర్ణుడు.

ఒక రోజు అభినవకౌముది వీణ వాయిస్తూ హాయిగా గానం చేస్తోంది. కళాపూర్ణుడు తను కూడ వింటుందని మధురలాలసని అక్కడికి రప్పించి ఆమెను కూడ పాడి వినిపించమన్నాడు. ఆమె “ఈ వీణ ముందు నా స్వరం సరిపోదేమో!” అని అనుమానిస్తే, “నువ్వు మామూలుగా పాడు, ఆ వీణని పట్టించుకోకుండా” అన్నాడతను. అప్పుడామె తన గొంతెత్తి పాడేసరికి ఆ స్వరపటిమకి వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. ఆమె గాత్రం ముందు ఆ వీణ చాలదని గ్రహించాడతను. అంతకన్నా మంచి వీణ ఎక్కడన్నా వుందా అని అభినవకౌముదిని అడిగాడు. ఆమె “నేను తనకు ప్రియశిష్యురాలినని తుంబురుడు దీన్ని నాకు ఇచ్చాడు. అప్పుడతను ఇంతకన్నా మంచి వీణ ఇంకెక్కడా లేదని చెప్పాడు” అని కొంచెం ఆలోచించి, “ఐతే, ఈ మధ్య నారదుడు తుంబురుణ్ణి గానంలో ఓడించాడని విన్నాను” అన్నది.

ఆ మాటతో హఠాత్తుగా అతనికి మధురలాలస చిన్నప్పుడు చెప్పిన తన పూర్వజన్మ కథ గుర్తొచ్చింది. దాంతో పాటే స్వయంగా అతనికి కూడా పూర్వజన్మ విషయాలు గుర్తుకొచ్చాయి. అప్పుడు మణికంధరుడిగా తన వీణను మృగేంద్రవాహనాలయంలో దాచటం గుర్తొచ్చింది. అదే ఆమె కంఠానికి తగిన వీణ అని గ్రహించి, “నీ కంఠానికి సరిపడే వీణ ఒకచోట వుంది. దాన్ని నీకోసం తెప్పిస్తాను” అన్నాడు మధురలాలసతో.

అభినవకౌముది చెలికత్తెలు ఆమెను పక్కకు తీసుకెళ్ళి తన ఎదుట తన భర్త తన సవతిని అంతగా గౌరవించటం ఆమెకెంత అవమానమో బాగా నూరిపోశారు. దాంతో ఆమె మొహం ముడుచుకుని వుంటే కళాపూర్ణుడు ఆ వీణని తెచ్చి ఆమెకే ఇచ్చి ఆమెని గానంలో అందరి కంటే మిన్నగా చేస్తానని వాగ్దానం చేశాడు.

ఐతే ఈ వార్త వెంటనే మధురలాలసకి చేరింది. తన కోసం తెస్తానన్న వీణని ఇప్పుడు అభినవకౌముదికి ఇవ్వబోతున్నాడని ఆమె కోపగించుకుని అలిగింది. ఆమె అలక తీర్చటానికి అన్ని దిక్కుల రాజుల మహారాణుల మౌళిమణుల్తో ఆమెకు కాలి అందెలు చేయిస్తానని శపథం చేశాడు కళాపూర్ణుడు.

అలా ఆ ఇద్దరికిచ్చిన మాటలు తీర్చుకోవటానికి దిగ్విజయాలు చేసి ఆ వస్తువుల్ని సంపాదించి తెచ్చాడు. వీణని అభినవకౌముదికిచ్చాడు. మధురలాలసకి పాదమంజీరాలు చేయించమని తన మంత్రిని నియమించాడు.

అతనలా దిగ్విజయం చేసి వచ్చినందుకు ఆనందంగా రకరకాల భూషణాల్ని అలంకరించుకుని ఆ సందర్భంలో తన చిన్నప్పుడు కళాపూర్ణుడు తనకు కానుకగా ఇచ్చిన హారం విషయం చెలికత్తెలు గుర్తు చేస్తే దాన్ని బయటకు తీసి అది మరీ చిన్నదిగా వున్నందువల్ల పొడవు పెంచి వేసుకుంది మధురలాలస.

అప్పుడు సత్వదాత్ముడనే మంత్రి ఆమెకు కొత్తగా చేయించిన అందెలు తీసుకొచ్చి ఆమెకు సాష్టాంగనమస్కారం చెయ్యబోతే ఆమె అతన్ని వారిస్తూ, “వద్దు వద్దు, నువ్వు నాకు మేనమామవు” అంటూ తనే అతనికి నమస్కరించింది.

అందరూ ఆశ్చర్యంగా చూశారామెను.

కళాపూర్ణుడు నవ్వుతూ, “చూస్తే, నీకు చిన్నప్పుడు కలిగిన జననాంతర జ్ఞానం మళ్ళీ కలిగినట్టుంది. అతను అప్పుడు తనెవరో చెప్పమంటే చెప్పలేదు. ఇప్పుడు అడక్కుండానే చెప్తున్నావు. ఐతే అతను నీకు ఎలా మేనమామో కొంచెం వివరంగా చెప్పు. అలాగే, ఇంత గొప్ప జ్ఞానం ఆ వయసులోనే నీకెలా కలిగిందో అప్పుడే ఎందుకు అడగలేదా అని ఎప్పుడూ బాధపడుతుంటాను. ఆ విషయం కూడ చెబుదువు గాని” అన్నాడామెతో.

ఒక విసనకర్రతో అతనికి విసురుతూ ఇలా చెప్పింది మధురలాలస “ఇతను ఇదివరకు మహారాష్ట్ర దేశం ఏలే సుగ్రహుడనే రాజు. మా తల్లి రూపానుభూతి ఇతనికి అక్క. ఇతనికి పిల్ల నివ్వాలని ఎంతోమంది రాజులు పత్రికలు పంపారు. ఐతే వాళ్ళలో ఎవరితో సంబంధం చేసుకోవాలో తేల్చుకోలేక చాలా కాలం గడిపితే వాళ్ళు కోపగించి తలా ఓ నెపం పెట్టుకుని ఇతని మీదకు దండయాత్రలు చేశారు. రాజ్యం విడిచి వెళ్ళి బయటనుంచి వాళ్ళని జయిద్దామని ఇతను అడవిలోకి పారిపోయాడు. ఆ రాజులు మాత్రం “రాజు లేని రాజ్యాన్ని ఆక్రమించటంలో గొప్ప ఏమిటి?” అనుకుని ఆ రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయారు.

అది ఇతనికి తెలీదు గనక అడవిలోనే వుండి “ఉన్నచోటనే వుండి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోగలిగిన వాడు కదా నిజంగా గొప్పవాడు!” అని ఎలాగైనా ఆ శక్తిని సంపాయించాలని బృందావనానికి వెళ్ళి బాలకృష్ణుడి గురించి తపస్సు చేశాడు. ఇతని తపస్సుకి మెచ్చి విష్ణువు బాలరూపంలో మర్రి ఆకు మీద పడుకుని ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. తనకు సర్వజ్ఞత్వం కలగాలని అడిగాడితను. అప్పుడు విష్ణువు తన మెడలో వున్న ఒక హారాన్ని తీసి ఇతని కిస్తూ, “ఈ హారంలోని నాయకమణి ఎవరి హృదయస్థానానికైనా ఎంతసేపు తాకివుంటుందో అంతసేపు వాళ్ళకు సర్వజ్ఞత్వం వస్తుంది. ఐతే, బ్రాహ్మణులకి మనస్తాపం కలిగించిన వాళ్ల దగ్గర మాత్రం ఇది వుండదు” అని వివరించి మాయమయ్యాడు.

ఇతను ఆ హారాన్ని తీసుకుని వస్తూ దార్లో ఓ దేవాలయం దగ్గరకు వెళ్ళాడు. అక్కడొక అద్భుత సుందరమైన ప్రతిమ వుంది. దాన్ని చూస్తూ ఇతను కొంచెం దూరంలో కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి ఒక యోగి వచ్చాడు. ఆ ప్రతిమని చూసి అతని మనసు చెదిరింది. ఎవరూ దగ్గర్లో లేరులే అనే ధైర్యంతో దాన్ని బలంగా కౌగిలించుకున్నాడు. అంతలోనే ఆ దగ్గర్లో వున్న సుగ్రహుణ్ణి గమనించి, ఆ చుట్టుపక్కల వున్న ప్రతిమలన్నిట్నీ కౌగిలించుకోవటం మొదలెట్టాడు. ఐతే సుగ్రహుడు అది చూసి నవ్వుతూ, “ఎంత నటించినా నువ్వు నన్ను మోసపుచ్చలేవు. నీ ఆంతర్యం నాకు తెలుసులే!” అని గేలిచేశాడు. ఆ యోగికి కోపం వచ్చింది. “ఇప్పటిదాకా నీకున్న జ్ఞాపకాలన్నీ పోతాయి పో!” అని శపించాడు. ఇతను భయపడి ప్రాధేయపడితే “నా యీ రహస్యచేష్ట గురించి ఎవరైనా మాట్లాడితే అప్పుడుగాని నీకు నీ పాత జ్ఞాపకాలన్నీ తిరిగిరావు!” అని చెప్పాడు.

అలా కలిగిన మతిమరుపు వల్ల ఒక్క క్షణం కిందటనే ఆ పక్కన తను పెట్టుకున్న హారం సంగతి మరిచిపోయాడితను. మతిలేని వాడిలా తిరుగుతూ గంగాసరయూ సంగమ స్థలాన్ని చేరాడు. అప్పుడు కాసారపురానికి రాజు లేకపోతే వాళ్ళు ఒక ఏనుగుకు పూలమాల ఇచ్చి “ఇది ఎవరి మెడలో ఈ మాల వేస్తుందో అతనే ఇకనుంచి రాజు” అని పంపారు. అది ఇతని మెడలో వేసిందా మాలని. అలా కాసారపురానికి రాజై, నీ తల్లిదండ్రుల్తో పరిచయమై ఆ తర్వాత నీకు మంత్రి అయ్యాడు. అది ఇతని కథ!

ఇక నాకు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయనే విషయం గురించి సుగ్రహుడు ఆలయం దగ్గర వదిలేసిన హారాన్ని మధురలో వుండే ఒక బ్రాహ్మణుడు తీసుకెళ్ళి ఎంతో కాలం పూజించి ఆ తర్వాత ద్వారకకు వెళ్ళి దాన్ని కృష్ణుడికి కానుగ్గా ఇచ్చాడు. దాన్ని కృష్ణుడు మణికంధరుడి కవిత్వానికి మెచ్చి అతనికిచ్చాడు. అతను దాన్ని ధరించాడు కాని అతని హృదయభాగం దాకా రాలేదది!

తను శ్రీశైలంలో భృగుపాతానికి వెళ్తూ మణికంధరుడు దాన్ని అలఘువ్రతుడికి ఇచ్చాడు. అతను నీకిస్తే నువ్వు నాకు ఇచ్చావు. అప్పుడు నేను చిన్నదాన్ని గనక దాని నాయకమణి నా హృదయభాగానికి తాగింది. అలా నాకు సర్వజ్ఞత్వం కలిగింది. ఐతే నేను కొంచెం కదిలినప్పుడు ఆ శక్తి పోయింది.

అలా ఇన్నాళ్ళూ మనకెవరికీ ఈ హారం ప్రభావం తెలీలేదు. ఈరోజు నేను అనుకోకుండా దాన్ని పొడవు చేసి వేసుకోవటం వల్ల మళ్ళీ అది నా హృదయస్థానాన్ని తాకి నాకీ జ్ఞానం కలిగింది” అంటూ అన్ని విషయాలు వివరించింది మధురలాలస.

సత్వదాత్ముడికి కూడ తన పూర్వజ్ఞాపకాలన్నీ తిరిగొచ్చాయి. తన మహారాష్ట్ర రాజ్యానికి తిరిగివెళ్ళి దాన్ని మళ్ళీ పాలించాడతను.

మధురలాలస కౌగిలిలో ఆ నాయకమణి తన హృదయాన్ని కూడ తాకేట్టు చేసి కళాపూర్ణుడు కూడ ఆ విడ్డూరాలన్నీ స్వయంగా గ్రహించాడు. ఆ పూర్వజన్మ జ్ఞానంతో తను మాట ఇచ్చిన ప్రకారం అభినవకౌముదిని గానంలో ఎదురులేకుండా తీర్చిదిద్దాడు.

రాజ్యవ్యవహారాల్లో తనకు కావలసిన విషయాల్ని ఆ హారం ప్రభావంతో కనుక్కుంటూ సుఖంగా రాజ్యపాలన చేసి పుత్రపౌత్రాభివృద్ధి పొందాడు కళాపూర్ణుడు.  

"https://te.wikisource.org/w/index.php?title=మణిహారం&oldid=247880" నుండి వెలికితీశారు