భోగీరలోయ, ఇతర కథలు/నాగేటిచాలు

వికీసోర్స్ నుండి

నాగేటిచాలు

1

కర్కశమైన ఆ భూమి, పొదలతో, ముళ్ళచెట్లతో, తెలియని ఓషథులతో నిండి వుంది. ఆకాశంలోకి కారు మేఘం ప్రవహించివచ్చింది. గాలి లేక ఊపిరైనా ఆడని ఆవిషపూరిత వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది.

ఆ నేలంతా మిట్టపల్లాలుగా వుంది. అపసృతి స్వర భూయిష్టమైన రాగంలో ఆ ప్రదేశం చుట్టూ దిశలు ఆవరించుకుని వున్నాయి. పక్షుల కలకూజితా లెరుగని ఆ నేల ఆకాశంలో చల్లని గాలులను దొర్లించుకుంటూ నిండు గర్భాలలో తళతళమెరిసే బిందుశిశువులను దాల్చుకుని వేయిమంది గర్భిణీగుర్విణులు కదలి వచ్చినట్లు శాంతంగా నీల మేఘాలు ఆవరించుకున్నాయి.

ఒక్కసారి మిన్నుల తలుపులు ఊడిపోయినవి. గంభీరంగా తేలుకొంటూ మొయిళ్లే భూమి మీద వచ్చి వ్రాలినవి. సమీపారణ్యాలల్లోంచి నెమళ్లు వచ్చి నాట్యాలలో అలరింపు సాగించినవి. పికిలి పిట్టల గములు మేఘాలల్లో భాగాలై జనపద గీతా లాలపిస్తూ హంగులై తరలివచ్చాయి. భోరుమని అఖండ వృష్టి కురిసినది.

2

ఆ భూమి సౌరభావృతమైపోయింది. జల ప్రవాహాలు పరవళ్లు తొక్కుతూ ప్రవహించివచ్చాయి. చిన్నవీ, పెద్దవీ, సెలఏళ్లు, ఏళ్లుపతనాలు, సుడిగుండాలు, ఆటలు, పాటలు, ఫేరణీ నృత్యాలు, వృత్తాత్మికా చంక్రమణాలు, ఆ నేల ఉప్పొంగిపోయింది. భూమికి దిగివచ్చిన ఆ నీలజీమూతంలో లయమైపోయింది. మబ్బులో రంగరింపై కిందికి దిగివచ్చిన ఆకాశంలో కరిగిపోయింది. నేలా నీలిమబ్బుల ఆకాశమూ ఒక్కటైపోయాయి. ఒక్కసారిగా భూనభోంతరాళాలు పగిలేటట్లు మేఘ గర్జనములు నిండిపోయాయి. లోకమే మండిపోయినట్లు కోటి మెరుపులు తళతళలాడిపోయాయి. మబ్బులు మాయమయ్యాయి. ఆకాశం పైకిపోయింది. ఆ భూమిపైన ఒక ఆంధ్ర మానవుడు బలిసి, కండలు తిరిగి పోతరించి, హిమాలయ శిఖరంలా ధవళాచ్ఛమై వెలిగి పోతున్న రెండు గిత్తలకు నాగలి కట్టి ఆ భూమి దున్నుతూ వున్నాడు. ఆ మానవుని మోము ఆకాశంలా స్వచ్ఛమైవుంది. ఆ ఆంధ్రుని వదనము ఆంధ్రభూమిలా గంభీరరేఖా విలసితమై వున్నది. అతని విశాల ఫాలంలో వరదగోదావరి నున్నని ప్రవాహం ప్రత్యక్షమైంది. ఆతని కళ్లు సోగకళ్ళు. చిన్నచిన్న కోనేరులలో హృదయమార వికసించి పరిమళాలు వెదజల్లే నీలి కలువలు ఆతని కళ్లు. ఆ కళ్ళల్లో కాంతులు యెల్లలు యెరుంగని దూరాలకు ప్రసరించిపోయే శక్తివంతాలైనవి. ఆ కళ్ళ కొలుకుల్లో అననుభూతమైన ఆశయాలు మిలమిలలాడుతున్నవి. తెలంగాణపు భూమివంపులా అతని నాసిక వక్రతతో ప్రవహించి పైకుబికి వంపు తిరిగి అతని సోగ మీసాలల్లో లయమైపోయింది. ఒకనా డాతని చేతిలో ఆయుధమైన విల్లువంటి ఆతని పెదవులు ఆంధ్ర దేశంలోని ఉదయారుణ రాగాలతో తాంబూలం సేవించుకున్నవి. తెలుగు నేలల పండిన మామిడికాయ, ఆంధ్ర భూముల వెలసిన కోహినూరు వజ్రం ఆతని చుబుకము, తెలుగు సముద్రపు కెరటాలు పళ్ళెరాన తీసుకునివచ్చి సమర్పించిన శంఖమే ఆతని కంఠం. ఆతని బాహువులు కృష్ణా, గోదావరీ నదులు. అతని అంసలు మహేంద్ర నల్లమల పర్వతాలు. విశాలాంధ్రభూమి ఆతని ఛాతి. నెత్తిని కోరతలపాగా, మొలను పైకెగదోసి కట్టిన పంచకట్టు, ఆ యువకుడు యాదగిరి రెడ్డి.

3

ఆ వీరుని ఉత్సాహము వరహగిరి నుంచి యాదగిరి చుట్టి కదిరివరకు ప్రత్యక్షమై వేంచేసిన నరసింహ దేవర హృదయం.

ఓ యాదగిరిరెడ్డీ! నువ్వు కమ్మ నాటి రెడ్ల కళా కౌశల్యము కలవాడవు. పాకనాటి రెడ్ల ప్రభావము సము పార్జించుకున్న వాడవు. పెనుగొండ కొండరాయల నాటి రెడ్ల ప్రతాపము పుణికి పుచ్చుకున్నావు. తెలుగునాటి మోటాడ రెడ్డి పోటుతనంతో శక్తివంతుడవు. నువ్వు భూమంచిరెడ్డివి, నువ్వు తెలగా వీరుడవు, నువ్వు వెలమ నాయకుడవు. నువ్వు చెన్నప్పరెడ్డివి, బంగారపు కడ్డివి.

ఆ మేఘంలోంచి ప్రత్యక్షమయాడు యాదగిరిరెడ్డి. ఆ భూమి మీద నిల్చినాడు. ఆతని ఎడమచేత మేడితోక, కుడిచేత ఆ తెల్లటి గిత్తలను తోలే ములుగోరు కర్ర. నాగేటిచాలు సాగిపోతూవుంది. ఆతని కంఠంలోంచి మధురశ్రీలు ఆకాశం నిర్మలాలు, అడవి మల్లెల పరిమళాలు పొదివిపుచ్చుకున్న జీవజాను తెలుగుపాట వెడలి నేలా, ఆ దిశలూ, ఆ ఆకాశం నిండిపోతున్నవి.

సాగించు నాగలి
సాగించు రెడ్డి
నేలంత ప్రవహించు
చాలుతో దుక్కితో

అని పాడుకుంటున్నాడు.

4

యాదగిరిరెడ్డి శాతవాహనుల కాలం నుంచి యీ నాటి వరకు నాగలి దున్నుతూనే వున్నాడు. పరభూములను మంత్రించి బంగారు పండు పంటభూములను చేసినాడు. అవి రాజనాలో, సన్నారులో, ముతక అక్కుళ్లో, కృష్ణకాటుకాలో పాలాట్రగడాలో, తెల్లజొన్నలో, పసిడిపచ్చ జొన్నలో, కందులు - సెనగలు - పెసలు - మినుములో నువ్వులో కుసుమలో.....

యాదగిరిరెడ్డి నాగలి అటు నందిపర్వతంనుంచి ఇటు తెలవాహా నది వరకు సాగుతూనే వుంది. భూమి దున్నేవాడు, పంటపండించేవాడు, పాటపాడేవాడు. బండ్లపై ధాన్యాలు యింటికి తెచ్చేవాడు. దేశంపై దోచుకునేందుకు వచ్చిన పాడుమూకల్ని కత్తికట్టి చీల్చి చండాడి నాశనం చేసేవాడు. రాజ్యాలు నిర్మించాడు. రాజ్యాలు యేలాడు. పాడురాజుల్ని నాశనం చేశాడు. మంచిరాజుల్ని తక్తుపై యెక్కించి కూర్చో పెట్టాడు. ఆ నాడు రాజై కవులను సత్కరించాడు. దేవాలయాలు నిర్మాణం చేయించాడు. శిల్పాలు, చిత్రలేఖనాలు దేశం అంతా సౌభాగ్యం నింపాడు. పాటలు పాడాడు. పాడించాడు. బంగారాలు తెచ్చాడు. సువర్ణాలు వెదజల్లాడు.

ఈ నాడు యాదగిరిరెడ్డి తానే రాజ్యభారం వహించడానికి సంకల్పించాడు. అతి తెలివైన వాళ్ళ కృతిమాలు ఆతనికి అడ్డా! దేశభక్తులమంటూ దేశద్రోహం చేసే పాడు జీవితా లతనికి ఆనకట్టలా ! యాదగిరిరెడ్డి నాగలి గిత్తలను అదిలిస్తూ "సాగండె, గొప్పు లడ్డమా, రాళ్లు అడ్డమా, లోపల విషంపెట్టుకున్న మనసులు అడ్డమా - మనకి, సాగండె" అనేవాడు. వానచే తడసిన ఆ బంగారుభూమి నాగేటిచాలుకు ఆనందంతో దారి యిస్తూ, గంధం అలదికొన్నట్లు సువాసన వెదజల్లుతోంది. యాదగిరిరెడ్డి యీ రోజు తెల్లటి ఆ దుక్కి గిత్తలను తోలుతూ నాగేటిచాలు సాగిస్తాడు. ఆతని నాగేటిచాలుకి దేశముఖులు అడ్డం కారు. ఆతడు వతందార్లకు వెరవడు. కవులు దార్లను చిన్నచిన్న గులక రాళ్ళలా పార వేస్తాడు. ఆ జమీ అంతా అతడే దున్నుతాడు. అతడు ఆకాశరైతుకూ భూమి రైతాంగనకూ పుట్టిన ఆంధ్ర వీరుడు.

5

ఉదయం మొదలుపెట్టిన దుక్కి ఆ సాయంత్రం వరకు సాగుతూనే వుంది. ఆ భూమంతా భూమిదేవి పులకలు లా, తందానతాన పాటలు లా ఆకాశంలో చుక్కల నడకల లా నాగేటిచాలు లతో నిండిపోయింది. మధ్యాహ్నం చెల్లెలు గంపలో పట్టుకువచ్చిన జొన్నరొట్టె, పులుసూ, కూరా మెక్కినాడు యాదగిరిరెడ్డి. ఈ రాజ్యం తనదై ఈ భోజనం గోధుమరొట్టెఅయి, ఘనపురం బియ్యం అన్నమై, రేపు ఉదయించదా అనుకున్నాడు యాదగిరిరెడ్డి. నాగలి విప్పి బుజాన వేసుకొని ఎద్దుల తోలుకుంటూ పాట పాడుకుంటూ దగ్గరవున్న తన గ్రామానికి దారితీశాడు ఆ యువకుడు.

"రామపాదం కొలుచుకొంటూ
సాగరమే వెలిసే నంటా
కొండా గుట్టా అడవీగట్రా
పండి పోసే బంగారుభూమంటా
నేల నాదీ, గాలి నాదీ
చాలు నడచిన వాలు నాదీ
కాలమే ఇకముందు
నాదే నోయ్!
అడవి నాదీ పుడమి నాదీ
కడిమి పూలా పడుచు నాదీ
విడని ధైర్యం విజయం నాదే నోయ్"

అప్రయత్నంగా కాళ్లు నడుస్తాయి. అడ్డాలు తీరి నడక సాగిస్తున్నాడు. అరమూతలు పడిన అతని చూపుల్లో తెలంగాణ మంతా భరతదేశాన్నే ఉద్ధరించే పాడిపంటల దేశమై, మెరుముశక్తితో పరువులెత్తే పరిశ్రమల ఆశ్రమాలతోనిండి ఎదుట ప్రత్యక్షమైంది. ఆత డనుకొన్నాడుః ఈ నేలంతా ఒకనాడు అడవులతో నిండి ఋష్యాశ్రమాలతో విలసిల్లేదట. ఈ నాడు పోడిమి తేలే ప్రజలతో ఈ పరిశ్రమాగార ఆశ్రమాలతో నిండి వుండదా? యాదగిరిరెడ్డి చదువుకున్నాడు. అతని చేతిలో నాగలి మేడితోక మాయమై ఆ యింజను నాగలి నడిపే మరచక్రమై నిలిచింది, పది ఎకరాలు సాగు సాగిన ఫలసాయం పదివేల ఎకరాలు ఫలించిన పంటై ప్రత్యక్షమైంది. అతని ఆ స్వప్నలోకంలో ఆతని తమ్ముడు ఆ గ్రామాలన్నిటికీ మెరుము వెలుగుల దీపాలు ఉరుమునడకల శక్తులూ ప్రసాదించే యింజనీరై కనపడ్డాడు.

ఆతని తెలుగునాడు ప్రసరించి ప్రసరించి అటు తూర్పుతీరం చేరింది. ఇటు కన్నడిగ చెల్లెలిని కౌగలించింది. ఆ వైపు మహారాష్ట్రంతో నెయ్యమాడింది. ఈ వైపు అరవ మరదలితో సరసాలాడింది. గోదావరీ జలాలు - కృష్ణానదీ వళులలో సుళ్లుతిరిగి తుంగభద్ర కాలవలలో ప్రవహించాయి.

యాదగిరిరెడ్డి యింటికి చేరుకున్నాడు. అతని భార్య కంచుమెరుగు నవయౌవన సౌందర్యవతి. కోలమోమున మోదుగులు ప్రసరించిన బాలిక. కొండ తంగేటిమొగ్గ ముక్కు కలదై, కలిగట్టు చెట్టుపూవు గులాబిరంగు పెదవులు కలదై యెదురువచ్చి నాగలి దింపి వేన్నీళ్లు పోసుకోవడానికి రమ్మని నవ్వుతూ ఆహ్వానించింది. ఆమె తొడిగిన గద్వాల అంచుల రెవిక, ఆలేరు కెంపురంగుల చీర ఆమె సౌష్టవాంగపూరిత సౌందర్యానికి జోహారులన్నాయి. ఆమె మాట కూకురు గుడ్డంగిపిట్ట గొంతులోని తీపులు కలది.

నీళ్లు పోసుకుని వచ్చిన భర్తకు బతుకమ్మ జొన్నారొట్టి అన్నం వడ్డించి భోజనం పెట్టింది. బతుకమ్మ అచ్చంగా పొలం పడుచు. అన్నం వడ్డించే తన భార్య సొగసు చూస్తున్న యాదగిరిరెడ్డి మనసులో ఏవో మెరుములు మెరిసినవి. బతుకమ్మ తెలుగునాటి బంగారుదేవత. బతుకమ్మ పండగ కాబోలు ననుకున్నాడు యాదగిరిరెడ్డి. తెలంగాణపు రైతును యెప్పుడూ యెవరో బాధిస్తూనే వున్నారు. ఆతడు తన బ్రతుకును రాజరికం చేసుకున్న రోజులు కాకతీయులతోనే వెళ్ళిపోయాయి. తురక ప్రభువులకు వంగి సలాము చేసినా ఆ నాటి యాదగిరిరెడ్డి ముక్కు పుటాలు విస్ఫారితం కావడం మానలేదు. ఆతని నడుం గూను కాలేదు. ఆ నాడు ఆతడు పండించిన పంటంతా, దొడ్లో కాసిన కాయగూర లన్నీ, ఆతని మేకలు, కోళ్లు, ఆతని ఆవులు, బర్రెలు వాటి పాలు దేశముఖుల, వతందారుల, కౌలుదార్ల, పటేలు పట్వారీ, పోలీసు ముంతజీముల వంట శాలలల్లోకిపోయినా ఆతడు మట్టి తినే జీవించాడో, ఆకు అలమూ ఆస్వాదించి బ్రతికాడో? శాతవాహనుల నాడు, చాళుక్యుల కాలంలో, కాకతీయుల దినాలల్లో తెలుగునాడు పొలాలల్లో ఏరికూర్చుకున్న శరీర బలమూ, మనోబలమూ కరిగి కరిగీ, తరిగి తరిగి, మరిగి మరిగి నాశనమైనా మధ్యన వున్న చావైనా, చెక్కుచెదరకుండా నిల్చి వుండడం చేత తనవంటి యాదగిరిరెడ్లు, తన భార్య వంటి బతుకమ్మలు యీ నాటి విమిక్తిలో సగర్వంగా నిలబడ గల్గారు.

తన దేశంలో వెట్టిచాకిరీ పోతుంది. తన భూమి తనది. జమీందార్లు, జాగీర్దార్లు హరించి పడమటిగాలిలో మాయమై పోతారు.

ఈ అందాల ప్రోగైన తన భార్య గర్భంలో స్వచ్ఛ స్వేచ్ఛావాతావరణంలో దివ్యగాంధర్వం ఆలాపించ గల్గే తన పుత్రుడు యింకో యాదగిరిరెడ్డి కదులుతూ వున్నాడు. రాత్రి నిశ్వనాలు మాటుమణిగే కోకిల కంఠంలో, చెట్ల జేరే కొంగల అరుపుల్లో, జీబురాయల తాళగతులలో, ఊరిబయట నక్కల అరుపుల్లో, కుక్కల మొరుగుల్లో నిశ్శబ్దం ఆవరిస్తూవుంది.

సప్తమేఘాలు దిగివచ్చినట్లు భోరున కుంభవృష్టి కురుస్తూవుంది. దూరాన యాదగిరి కొండపైన లక్ష్మీ నరసింహస్వామి "ఓయి తెలుగు వీరుడా, బహుపరాక్" అని సింహగర్జన చేస్తున్నాడు.