భోగీరలోయ, ఇతర కథలు/నరసన్న పాపాయి

వికీసోర్స్ నుండి

నరసన్న పాపాయి

రుద్రేశ్వరం గుడి యెదుట శివరాత్రి ఉత్సవంలో, గుడి లోకి రాబోయాడని మా అన్నయ్య ఆతన్ని చావ గొట్టాడు. మా అన్నయ్య ఆతన్ని చావగొట్టాడు ! ! మా అన్నయ్య ఆతన్ని చావగొట్టాడు ! ! !

నిజమే. ఆ బాలుడు హరిజనుడే ! అంత మాత్రాన మా అన్నయ్య వాడిని చావగొట్టడమే! ఆ కుఱ్ఱవాడు చేసిన తప్పు? శివరాత్రినాడు రుద్రేశ్వరస్వామి గుడి లోకి మా అందరి తోటీ రావాలని ప్రయత్నించాడు.

మేము కోనేటిలో స్నానాలు చేసి, పట్టు బట్టలు కట్టుకొని, పళ్ళూ కొబ్బరికాయలూ పువ్వులూ ఆరతికర్పూరం ఊదువత్తులు మొదలయినవి పట్టుకు బయలుదేతాం. మా వూరుకు రుద్రేశ్వరం ఎనిమిదిమైళ్లు వుంటుంది. రాత్రి బళ్లు కట్టుకుబయలుదేరాం. తెల్ల వారగట్లకు రుద్రేశ్వరంవచ్చాం. మా రెండెడ్ల బండే మాకు డేరా అయింది. దాని చుట్టూ తెరలు కట్టుకున్నాం. చాపలు కట్టాం. వంటలకు అన్ని సరంజాములు మా అమ్మచేసింది. ఆ తర్వాతనే తెలతెల్లవారే సరికి కోనేరులో దిగాం. ఆ బాలుడు మా వూరు పెద్దమాలపల్లిలో వుండే అబ్బాయి. వాళ్ళ అయ్య మా వూళ్ళో వున్న కరణంగారి పాలేరు.

మా అన్నయ్య వాడిని చావకొడుతూవుంటే వాడు పెట్టిన గోల రాతినైనా కరిగిస్తుంది. నేను వెక్కి వెక్కి ఏడ్చాను. ఆ అబ్బాయి సొమ్మసిల్లి మూర్చపోయాడు. నేను ముందుకు పరుగెత్తి వాడిమీద నా చెంబులోవున్న నీళ్లు చల్లాను. వాడికి మెలకువ వచ్చి లేచి గుండె కరిగి పోయేటట్లు యేడుస్తూ తూలుతూ నడిచిపోయాడు.

నాకు నరసన్న ఏడుపు వినిపిస్తున్నది. స్వామికి అర్చన చేయించే పూజారి మంత్రాలు వాడి ఏడుపులా వున్నవి. గుడిలో మ్రోగించే గంటలు వాడు యెక్కియెక్కి రోదించినట్లే వున్నవి. నేను అప్పుడు చిన్నబిడ్డనే అయినా నాకు నరసన్నను మా అన్నయ్య కొట్టడం నన్నే కొట్టినట్లయింది. నన్నుకూడా మా అన్నయ్య కొడ్తాడేమో అనిపించింది. నేనూ వెక్కి వెక్కి ఏడ్చాను. నాకు ఎనిమిది సంవత్సరాలు.

'ఒసే రవణా ! ఎందుకే యింకా ఏడుస్తున్నావు?' అని మా అమ్మ కొంచెం ఘాటుగా అడిగింది.

'దానిని రెండు వేస్తే వూరుకుంటుంది' అని మా అన్నయ్య. ఎంత కోపం? మా అన్నయ్యకు నేను వూరికే భయపడ్డానా? వచ్చిన వేలకొలది జనంలో తొక్కిసలాడుతూ బయటకు వచ్చాం. నరసన్న ఏడుపు, జనకోలాహలం, డప్పులు, బూరాలు, 'శివశివశివోహం' అనే భక్తుల కేకలు నా నిశ్శబ్దబాష్పాలు, మా అన్నయ్య నన్ను తిట్టడం, మా అమ్మ నన్ను కేకలు వెయ్యడం; నరసన్న ఏడుపు; ఏడుపు ! మా అన్నయ్య వాణ్ణి గుళ్లోకి వస్తున్నాడని చావకొట్టాడు.

నరసన్న పెద్దవాడయ్యాడు, నేనూ పెద్దదాన్నయ్యాను. నాకూ పెళ్ళయింది, నరసన్నకూ పెళ్ళయింది.

రుద్రేశ్వరం గుడి యెదుట మా అన్నయ్య శివరాత్రి ఉత్సవంలో వాడు గుడిలోకి రాబోయాడని అతన్ని చావ గొట్టాడు. అది నా పెళ్ళి లోనూ నాకు జ్ఞాపకమే ; వాడికి పెళ్ళి అవుతోందంటేనూ నాకు జ్ఞాపకమే!

నరసన్న మా అత్తవారికి పెద్దపాలేరయ్యాడు. ఆ వూరికి పెద్దమాల అయ్యాడు. కాని గుడి యెదుట వాణ్ణి మా అన్నయ్య కొట్టితే వాడు ఏడ్చిన ఏడుపే నాకు స్నేహితురాలయింది. అదే నాకూ నరసన్నకూ మధ్య ఏదో విచిత్రమైన పవిత్రమైన సంబంధం ఏర్పాటుచేసింది.

మా అన్నయ్య అతన్ని కొట్టిన సంగతి నేను మరచిపోలేదు. మా అన్నయ్యే మరచిపోయాడు. ఆ కొట్టడం చూస్తూ వున్న మా అమ్మా వాళ్ళూ మరచిపోయారు. ఆఖరుకు నరసన్నే మరిచిపోయాడు.

'ఏమయ్యా నరసన్నా! నీ భార్య కడుపుతో వుందట!' 'అవునండి ఖామందుగారూ!' అన్న అతని మొగం పూవులా వికసించింది.

నరసన్న ఒడ్డూ పొడుగూ అయ్యాడు. నరసన్న నల్లని రాయిచెక్కిన విగ్రహంలా మూర్తితాల్చాడు.

నరసన్నకు చదువులేదు. కాని వాడు చెప్పిన సలహా తిమ్మరుసు సలహా!

నరసన్న మా పాలేరు అవడానికి నేనే కారకురాలిని. అతడు మా పాలే రయినందుకు మాకు కోటివిధాల లాభమే అయింది. ఆ వూళ్ళో (మా వూరు 'పాడు') మా పొలం లా పండే భూమేది?

నరసన్న రుద్రేశ్వరం శివరాత్రి వుత్సవంలో గుడిలోకి వెళ్ళబోతోవుంటే మా అన్నయ్య అతన్ని చావ గొట్టాడు!

మాలలూ మాదిగలూ యెన్నిసారులు పెద్దకులాల వారిచే దెబ్బలు తినలేదు !

మాలలూ మాదిగలూ యెంతమంది క్రిష్టియన్ మతంలో చేరలేదు !

మాలలూ మాదిగలూ మాకు దూరంగా వుండాలి ! మేము అంటు అవుతాము. నరసన్న భార్యను యెవరూ చూడకుండా నా దగ్గరకు రమ్మనేదాన్ని, నా తల దువ్వమనే దాన్ని, రత్తాలు మొదట నవ్వేసింది. తర్వాత నా బ్రతిమాలడాలు, నా కోపడపడాలవల్లా భయపడుతూ ఒప్పుకొని నాకు తల దువ్వింది. నా ఒళ్లు ఝల్లుమంది. నరసన్న రుద్రేశ్వరం గుడిలోకి వెళ్ళినట్లయింది. గుడిలోకి వెళ్ళినా వెళ్ళని నేను! గుడిలోకి వెళ్ళబోయే మా అన్నయ్యచేత దెబ్బలుతిన్న నరసన్న! నరసన్న భార్య నాకు తలదువ్వింది. నేను నరసన్న భార్య రత్తాలు తల దువ్వాను.

ఓట్ల రోజులు. కాంగ్రెసువారికీ కమ్యూనిస్టులకూ పోటీ.

మాల మాదిగలలో - వాళ్ళని హరిజనులంటారు - కాంగ్రెసువాళ్ళనీ కమ్యూనిస్టులనీ ఏదో ఫెడరేషననీ యీ ముగ్గురికీ పోటీ!

మా ఆయన నరసన్నను పోటీ చేయమన్నారు. ఆయన కాంగ్రెసువారు. నరసన్న చిన్నతనంలో చదవలేదు. కాని మా వారే రోజూ నరసన్నకు చదువు చెప్పారు. అతనికి వచ్చిన చదువు యెంతో పెద్దది. రుద్రేశ్వరుని గుడియెదుట మా అన్నయ్య కొట్టిన దెబ్బలు అతనికి ఓనమాలు.

ఎంతమంది హరిజనులు గుళ్ళయెదుట, బజారులలో, అంగళ్ళ వీధిలో, పొలాలలో దెబ్బలు తినటం లేదు?

వాళ్లు ఏ దేవుణ్ణి చూడగలరు? వెంకటేశ్వరుడు, చిదంబరస్వామి, రామలింగేశ్వరుడు, శ్రీరంగశాయి వాళ్లకు కనబడతారా? మా రుద్రేశ్వరుడే నరసన్నకు కనపడలేదు.

నరసన్న భార్య కడుపుతో వుంది! నరసన్నకు కొడుకు పుడ్తాడా, కూతురా? ఆ పాపాయికి రుద్రేశ్వరుడు కనబడడు.

'రత్తాలూ! చదువుచెప్తా చదువుకోవూ?' అన్నాను. 'నాకు చదువెందుకండీ కామందుగోరూ!' అన్నది రత్తాలు పకపక నవ్వుతూ! నరసన్న మాకు పాలేరయిన కొద్ది రోజులకు రత్తాలుతో అలా అన్నాను. అంతటితో వదిలానా రత్తాలుచేత 'వీరవల్లడు' చదివించాను.

నాకు బాగా చదువు చెప్పించారు మా వాళ్లు. ఇంటి దగ్గిరే ఇంగ్లీషూ చదివా! మా వారూ ఏదో బందరువెళ్ళి ఇంటరుమేడియేటు ఫేలయివచ్చి వ్యవసాయంపెట్టారు.

ఆయన 'మన నరసన్న హరిజనుడు రవణా ! ఎన్ని శతబ్దాలనుంచి వాళ్లు అలా బాధపడుతున్నారూ? వాళ్లు మనుష్యులు కాదనా మనవాళ్లు రవణా!' అని నన్ను దగ్గిరకు చేర్చి ఏదో తనలో అనుకున్నట్టుగా అన్నారు.

'నరసన్నను మా అన్నయ్య కొట్టాడండీ!'

'ఎప్పుడూ?' ఆయన ఆదుర్దా యెంతో మూర్తి తాల్చింది.

'చిన్నతనం లో నండీ! రుద్రేశ్వరస్వామి గుళ్ళోకి రాబోయాడు. మా అన్నయ్య వాణ్ణెరుగును. మా అన్నయ్య చావగొట్టాడు!' చిన్ననాటి ఆ దృశ్యం అంతా జ్ఞాపకంవచ్చి నాకూ కళ్లనీళ్లు తిరిగాయి.

మా వారు నన్ను తమ హృదయానికి పొదివి కొని, "నీ హృదయం నవనీతం రవణా" అన్నారు. ఆయన ముద్దులు నాకు గాఢమైన ఆనందమూ, యెంతో సిగ్గూ కలిగిస్తాయి. 'నరసన్న భార్యకు తలదువ్వాను !' నా కళ్ళల్లో భయమూ, ఏ మంటారు యిక అన్న అల్లరితనమూ రెండూ నర్తించాయి.

'ఇక నన్ను మా వారు తన కౌగిలిలో నలిపివేశారు. నా రవిక ముడి వీడిపోయినా, నాకు సిగ్గు పొంగుకువచ్చినా ఆయనకేమీ! అల్లరి అబ్బాయి.'

'రత్తాలు పాపాయి నెత్తుకుంటుంది!' ఆయన కళ్లు నా కళ్లల్లోకి అతి గాఢంగా చూచాయి.

నా కంటి రెప్పలు అరమూతలుగా వాలినవి.

'ఆ పాపాయి రుద్రేశ్వరం గుడిలోకి వెడ్తాడా అండీ?'

'రుద్రేశ్వరమే? కాశీ విశ్వేశ్వరమే!'

"ఆ పాపాయిని మా అన్నయ్య వంటి వారు ఎవరూ కొట్టరు కదాండీ,' నా గుండె దడదడలాడింది.

రత్తాలు పురిటికి కష్టం అయింది. అంత బండలాంటి నరసన్నా ఒకటే గోల!

మా వారు పెద్ద డాక్టర్ని తీసుకు వచ్చారు.

రత్తాల్ని వాళ్ళగూడెంలో గుడిసెనుండి మా ఇంటికి తీసుకువచ్చారు. మా దంపుళ్ళ గది పురిటిగది అయింది.

డాక్టరుగారు మూడు గంటలు కష్టపడ్డారు. నరసన్న కూతురు ప్రపంచ రంగంలో ప్రవేశించి 'కేరు' మంది.

నేను లోపలికి పరుగెత్తాను. సిద్దిలా చేతులూ కాళ్లూ ఆడిస్తూ అల్లరి చేస్తూంది ఆ పాపాయి. ఇంకో హరిజన పాపాయి ప్రపంచంలోకి వచ్చింది. అదీ విసిరేసినట్లు ఊరిబయట! దానికీ చింపిబట్టలు. దానికీ తలదువ్వుకోటానికి నూనె వుండదు! దానికీ చదువు వుండదు! దానికీ కడుపునిండా తినడానికి తిండివుండదు! అదీ రుద్రేశ్వరం గుడియెదుట గుళ్ళోకి వెళ్ళబోయి ఏ మా అన్నయ్య వల్లనో తన్నులు తినాలి.

నాకు దడదడయెత్తి ముచ్చెమ్మటలు పోశాయి. నరసన్నను మా అన్నయ్య రుద్రేశ్వరం దేవాలయం ఎదుట శివరాత్రినాడు చావగొట్టాడు కాదూ !

ఆ హరిజన పాపాయీ వాళ్లమ్మా నీళ్లుపోసుకొని వాళ్ల గూడెం వెళ్లిపోయారు. చిట్టి కృష్ణుని లా తయారయింది ఆ చిట్టిపాప. పదిహేను రోజులలో వుంగరాలజుట్టు, అల్ల నేరేడు పండు లాంటి ముక్కు, నల్లదొండ పళ్లు దాని పెదవులు, గవ్వలలాంటి వేళ్లు, ఆ బొజ్జ, ఆ చిన్న కాళ్లు, ఆ చిన్నారి చేతులు అందాలు ఒలకపోసుకుంటూ నులకమంచంమీద దొర్లడమే! నేనూ మా ఆయనా రాత్రిళ్ళ ప్పుడు నరసన్న ఇంటికిపోయి రత్తాలు నీ, పాపాయి నీ చూచి వచ్చే వాళ్ళం!

నా చీరలూ, దుప్పట్లూ దొళ్ళదోపిడీ ఇచ్చాను. ఆ చిన్న పాపాయికి చిట్టి చొక్కాలు ఎన్నో కుట్టి ఇచ్చాను. ఆ ముద్దుపాపను చూచినపు డల్లా మా ఆయన చిన్నిపాపడై కన్పించేవారు. నా రవికజేబులు పిక్కటిల్లేవి. ఊళ్ళోవాళ్ళు మేము కులం నాశనం చేశామని తిట్టుకుంటున్నారట. రాములవారిలా ఆజానుబాహువులు కలవారూ, అందమైనవారూ, బంగారం చాయ కలవారూ, సాధుమూర్తీ అయిన మా వా రంటే అందరికీ భయమూ, భక్తీ! అయినా మమ్మల్ని అందరూ తిట్టేవారు.

వాళ్ళంతా రుద్రేశ్వర దేవాలయం లోకి నరసన్న వంటి హరిజన బాలకులు వస్తే చావగొట్టే జాతి వాళ్ళు! మా అన్నయ్య నరసన్నను ఒక శివరాత్రినాడు చావకొట్టాడు. మా అన్నయ్య మా ఇంటికి మేం నరసన్న భార్యను పురిటికి తీసుకు వచ్చినప్పటి నుండీ మా ఇంటికి రావడం మాని వేశాడు. నరసన్నే నాకు అన్న! 'అవును రవణా! రుద్రేశం తల్లికడుపున బుట్టిన అతడే నీకు అన్న! అతడే మన కింత తిండి పెడుతున్నాడు!' అని వెన్నెలలాంటి చిరునవ్వు నవ్వుతూ మా ఆయన అన్నారు.

మా వారు భగవంతులే !

నరసన్న ఎన్నికలలో నెగ్గాడు. చెన్నపట్టణం శాసన సభకు సభ్యుడట !

ఆ రోజు మావారు కాంగ్రెసు నాయకులకూ ఊళ్ళ వారందరికీ విందుచేశారు. నరసన్న మా వారి పక్కనే కూర్చున్నాడు విందులో. మా నరసన్న, నరసన్నగారు. సభ్యుడు. ఇప్పుడూ మా అన్నయ్య నరసన్నను కొడతాడా రుద్రేశ్వరం గుడి ఎదుట ! ఏమో ! మా అన్నయ్య ఎంతకైనా తగును !

నరసన్నకు మా దంపుళ్ళసావిడి అయిదువందల రూపాయలుపెట్టి చక్కని ఇల్లులా సిద్ధంచేసి మా వారు అందులో ప్రవేశించ బెట్టారు. ఇంక మా స్థితి? నాకు నరసన్నపాపాయి ఆప్తురాలు.

నేనూ, నరసన్న భార్య రత్తాలూ - రత్నమ్మా, ఖద్దరు వడకడం ప్రారంభించాము. మా వారు ఎప్పటి నుంచో ఖద్దరు కడుతున్నారు. ఇప్పుడు నరసయ్య అన్నా, రత్నం మరదలూ, మేనకోడలు భరతాంబా అందరూ ఖద్దరు కడుతున్నాం.

నరసయ్య అన్నా, అతని కుటుంబమూ శుభ్రంగా తిండి తింటున్నారు. శుభ్రంగా బట్టలు కట్టుకుంటున్నారు. రుద్రేశ్వర దేవాలయం ఎదుట మా అన్నయ్య కొట్టిన దెబ్బలూ, ఆతని ఏడుపూ నరసన్నకు ఆశీర్వచనాలు !

భరతదేశం లోని హరిజను లందరూ రుద్రేశ్వర దేవాలయం ఎదుట మా అన్నయ్యచేత దెబ్బలు తినాలా?

భరతదేశం లోని హరిజను లందరూ ఇంత తిండీ, ఇంత బట్టా సంపాదించుకోవాలంటే శాసన సభ్యులవ్వాలా ?

ఇంతకూ మా నరసయ్యన్న పాపాయిని నేనే పెంచడం. పిల్లలులేని వాళ్లు ఇంకోళ్ళ పాపని తెచ్చుకు పెంచుకుంటే పిల్లలు కలుగుతారంటారు. భరతాంబ నా దగ్గిరే. నన్ను "అత్తా!" అంటుంది. నా దగ్గిర పండుకొనే నిద్రపోతే ఓ రాత్రివేళ వాళ్ళమ్మ వచ్చి తీసుకుపోయేది.

ఓ రోజున ఆ పెంకి భరతం అల్లరి చేసింది నా దగ్గిర పడుకుని నిద్రపోయి రవిక పిన్ను ఊడిపోయి నా బంగారు నిధులు, పొడిబంగారు కలశాలు, కర్కశపు ఉబుకులు, చిన్న బిడ్డ పుణుకులు ఎరగని, పనికిరాని వట్టి అందాలు, భరతాంబ నోటితో అందిపుచ్చుకుని, పట్టి మొనలు పునకడం ప్రారంభించింది. నాకూ నిద్రపట్టింది కాబోలు ! వళ్ళు ఝల్లుమని మేనెల్లా తీపులు ప్రవహించి ఆనందం ముంచెత్తి ఎవరో బంగారు పాపాయి నా గర్భం పండించి నాపాలు పుణుకుతున్నట్లయి మెలకువవచ్చింది. భరతం కొంటిపాప నిద్రలో పుణుకుమని వట్టి వట్టిపాలు తాగుతున్నది.

ఆసి అల్లరిదానా అని సిగ్గుపడి మా ఆయన నిద్రపోతూ ఉండటం చూచి, నెమ్మదించుకొని, దిబ్బెసలాంటి భరతాంబ పిరుదులపై రెండు చిన్నదెబ్బలు తగిలించి వాళ్ల అమ్మని పిలిచి భరతాన్ని అందిచ్చాను.

అక్కడనుంచి రోజూ కలలు! రెండు నెలలకు నాకు నెల తప్పింది. నా కన్న ! నా భరతం నాకు వరమిచ్చింది.

ఇంక మారత్తాలు - రత్నం - సంతోషం ఇంతా అంతా! మా ఆయన నన్ను పూజించారంటే, వారు పదహారుకళల చంద్రు లయ్యారు. తొమ్మిది నెలలలో వెన్నెల ముద్దకట్టి నాకు ఓ పాపాయి ప్రత్యక్షమైంది.

'ఆసి బంగారుతల్లీ ! అచ్చంగా తండ్రిపోలిక, వదిన గారూ!' అన్నది రత్నం పాపాయికి నీరుపోస్తూ!

ఈ నా కన్నతల్లి భరతాంబ మరదలు. మా వారి ప్రేమమూర్తికట్టిన వరలక్ష్మీ! నరసన్న మా అన్నయ్యచేత దెబ్బలుతిన్నప్పుడు ఏడ్చిన ఏడుపులో ఉన్న కరుణరసం నిండిన కలశం! వచ్చింది. ఆమెకు మేము 'పూర్ణస్వరాజ్య లక్ష్మి!' అని పేరుపెట్టుకున్నాం.