Jump to content

భోగీరలోయ, ఇతర కథలు/దీపం సెమ్మా

వికీసోర్స్ నుండి

దీపం సెమ్మా

ఆ రాగి సెమ్మా ఎన్ని శతాబ్దాల క్రితం చేశారో మా తాతయ్య కూడా చెప్పలేకపోయాడు. అయితేమాత్రం మా కుటుంబంలో ఆరు తరాల్నుంచీ దేవతార్చన పీఠం దగ్గిర ఆవు నెయ్యి వత్తులదీపం కాంతులు ఆనందంగా విరజిల్లుతూ వుండేది.

మా తాతయ్యే చిన్నతనంలో నన్ను కాళ్ల వుయ్యాల వూగిస్తూ, 'వుయ్యాలా దంపాలా' అని పాట పాడుతూ ఆ సెమ్మా కథ చెప్పాడు.

"చిట్టిగా అప్పుడే వయిందనుకున్నావు, మా తాతయ్య తాతయ్య తాతయ్య రామేశ్వరం నడిచి వెళ్తూ కుంభకోణంలో ఆగాడు."

"తాతయ్యా! కుంభకోణం మన చింతలదొడ్డి వెనకాలా? అక్కయ్య నువ్వు చెప్పావని చెప్పింది లే".

"కాదురా - ఇంకా దాని వెనక ఎంతో......దూరం. ఆ కుంభకోణంలో ఆయన సోమవారం వుదయమే కోనేరులో స్నానంచేసి, సంధ్యావందనం వార్చి, మడిబట్టలు, రాగి చెంబు, వుద్ధరిణెతో గోపురం దగ్గిరకు వెళ్లాడు."

"గోపురం అంటే - గుళ్ళో మనుషుల నెత్తిమీద పూజారి పెట్టడూ, అదా?"

"కాదురా నాన్నా! మనవూరి గుడికి ముందరగా ఇంకో గుళ్ళాగ ఎత్తుగా లేదూ; అది."

"అవును ఎన్నో బొమ్మలు చెక్కి వున్నాయి. మెట్లు మొన్నసాయంత్రం అప్పు డెప్పుడో చిట్టచివరదాకా నే నెక్కుతే - మీరంతా కంగారు బడ్డారు. అమ్మ ఏడ్చింది..."

"ఆరి నీ - గేపకం వుందీ ! విను అక్కడ ఒక ముసలమ్మ ఒక చిన్న పిల్లతో అడిలిపోతూవున్న చూపులతో యిటూఅటూ చూస్తూవుంది."

"ఆ చిన్నపిల్ల అందంగా వుందట. ఆవిడ మా తాతయ్య తాతయ్య తాతయ్యని చూచి ఒణుకుతూ తెలుగుతో "నాయనా మీ దేవూరు - మీరు తెలుగు వాళ్ళా" అని కంట నీరు పెట్టుకుంటూ వణుకుతూ అడిగిందట."

"అన్ని చోట్లా తెలుగేగా!"

"కుంభకోణంలో అరవం మాట్లాడుతారులే. అందుకని వాళ్ళు అరవవాళ్ళు".

"ఆ ముసలమ్మ తెలుగావి డన్నమాటా తాతయ్యా! ఆ తరవాత చెప్పవూ?"

"మా తాతయ్య తాతయ్య తాతయ్య 'అవునమ్మా మాది గోదావరీతీరం' అని కులగోత్రాలన్నీ చెప్పాట్ట. ఆ ముసలావిడ ఘోలుఘోలున దుఃఖిస్తూ 'నాయనా ! నా కొడుకు యిక్కడ రెండేళ్ళ కిందట రెడ్డిప్రభువుల పనిమీద వచ్చాడు. భార్యాకూతుళ్లనుకూడా తీసుకువచ్చాడు. ఆర్కాటు నవాబుల కొలువులో రెండేళ్లు వుండి చిదంబరం మొదలైన క్షేత్రాలు సేవిస్తూ వచ్చాడు యీ వూరు. ఇక్కడ రెండు నెల్ల క్రితం జబ్బుచేసి నా కుమారుడూ, మహాపతివ్రత కోడలూ నన్నూ యీ కసుగాయసూ దిక్కులేని వాళ్లని చేసి వెళ్లిపోయారు' అందిట. ఆమె పట్టలేక ఏడుస్తుంటే నలుగురూ మూగారట. మా తాతయ్య తాతయ్య తాతయ్యకు కూడా కన్నీళ్లు తిరిగి, వాళ్లని కోవిల్లోకి తీసుకుపోయి ఓ మండపంలో కూచోమని, తానూ కూచుని, వాళ్ల పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకున్నాడు.

కొడుకూ కోడలూ పోగానే రెడ్డి ప్రభువుల కా కబురంది ఆ ముసలమ్మకి కబు రంపా రట. ఆవిడ తక్షణం బయలుదేరి రామేశ్వరం వెళ్ళే జట్టును ఒకదాన్ని పట్టుకొని కుంభకోణం చేరిందట. తల్లిదండ్రు లిద్దరూపోగానే ఆ పిల్ల అస్తమానం ఏడుస్తూ బెంగపెట్టుకు పోయిందట. పాపం ఆ వూళ్లో వున్న పెద్ద సంపన్న గృహస్థు డో అయ్యరు ఆ పిల్లను తన ఇంట్లో వుంచుకున్నా అరవంరాక బెంబేలెత్తిపోయిందట. వాళ్ల బామ్మ రాగానే ఒక్క ఉరుకురికి కౌగలించుకొని మూర్ఛ పోయిందట."

"తాతయ్యా నాకూ ఏడుపు వస్తోంది"

మా తాతయ్య తాతయ్య తాతయ్య వాళ్లనితీసుకొని మన వూరు తీసుకు వచ్చాడు. కులగోత్రాలన్నీ చూసుకుని ఆ పిల్లని తన కొడుక్కి చేసుకున్నాడు. ఆ పిల్ల ఒక్కతె సంతానం గనక తండ్రి ఆస్తి అంతా మా నాన్న తాతయ్య తాతయ్యకు వచ్చిందిరా బాబూ."

2

మా తాతయ్య తాతయ్య తెచ్చిన ఆస్థిలోకల్లా ముఖ్యమైందే ఈ రాగి దీపం సెమ్మా. ఆ సెమ్మాతోనే వచ్చిం దాస్థి ఆవిడ తండ్రికి. గుంటూరు సీమనుంచి రెడ్ల ప్రభువుల రాయబారిగా వచ్చా డాయన ఆర్కాటు నవాబు దగ్గిరకు. ఒక రోజున ఆయన ఆ వూళ్లో తిరుగుతూ వుండగా అంగడివీధిలో ఈ సెమ్మా అమ్మకానికి వచ్చింది. ఆ సెమ్మా కళకళలాడుతూ దివ్యంగా కనపడింది ఆయనకు. మాట్లాడకుండా అడిగినంత డబ్బిచ్చి కొనుక్కొచ్చి ఆయన దేవతార్చనంపెట్టె దగ్గిర పెట్టాట్ట.

ఆ సెమ్మా శిల్పం పని అతి అందంగాను, నాజూకు గాను, అద్భుతంగాను వుంది. కిందమట్టు కమలం, అందులోంచి కాంతి తీగలా కలశాలు, చక్రాలు, కమలాలు, తీగెలు, తామరకాయలా పై కెదిగి అష్టదళ పద్మములా సెమ్మా ప్రమిద తెలిసింది. ఆ ప్రమిద మధ్య నుంచి ఒక తీగ పైకి పోయింది. ఆ తీగె చివర ఒక హంస చాలా ఒయ్యారంగా నిలిచి వుంది. ఆ హంస మీద సంపూర్ణ ప్రపుల్ల కమలం, దాని మీద పద్మాసనాసీన ఐన లక్ష్మీ-సరస్వతీ, చతుర్విధ పురుషార్ధాలు, విజ్ఞానవీణ, తాళాలు, అష్టహస్తాలతో పట్టుకొని హాసవిలాసంగా వున్న వదనంతో వెలిసి వుంది.

ఆ సెమ్మాలో ఆవు నెయ్యి గాని యింకోటి పోసేందుకే వీలులేదు. పమిడిపత్తి వత్తులు పెట్టి దీపం వెలిగిస్తే ఐశ్వర్యప్రదమైన వెలుగులు వెదజల్లుతూ, దేవతార్చనం పెట్టెలో వున్న దేవతల విగ్రహాలు ప్రాణశక్తులతో ప్రత్యక్ష మయ్యేటట్లుగా వెలిగేది.

ఆ సెమ్మా దేవతార్చనంపెట్టె దగ్గిరకు వచ్చి నప్పటి నుంచి ఆ బ్రాహ్మణుడికి వచ్చిన తెలివి తేటలు అద్భుతం. రాజకీయంలోనేకాకుండా శాస్త్రాల్లో, కవిత్వంలో అన్నిటిలో ఉత్సాహం కలగడం వాటిలో మాంచి ప్రజ్ఞకూడా కలగడం ఆరంభించింది. నవాబుగారికి ఆయనంటే గాఢం అయిన ప్రేమ కలిగి నిక్షువుదోసిళ్లు యివ్వడం ప్రారంభించాడు.

అల్లా రెండేళ్ళు జరిగింది. కుంభకోణం వెడదామని ఆయన యిల్లాల్నీ కూతుర్నీ వెంటబెట్టుకొని దేవతార్చనం పెట్టె తీసికొని, బలువని ఆ రాగిసెమ్మా మాత్రం వదిలిపెట్టి బయలుదేరాట్టాయన.

అది బెడిసికొట్టింది కాబోల్ను. కుంభకోణం వెళ్లాడో లేదో భార్యభర్తలకిద్దరికి కొంచెం జ్వరం వచ్చి, సంధి పుట్టి కూతురికి జననీజనకుల్ని యెడబాపిపోయారు.

వారి కుమార్తెను మా తండ్రి తాతయ్య తాతయ్యకు యిచ్చి వివాహం చేసినప్పుడు వారి ఆస్థితోపాటు రాగానే మా యింట్లో దేవతార్చనం దగ్గిర వెలిగిపోవడం ప్రారం భించింది ఆ సెమ్మా. అప్పటినుంచీ మా వాళ్ళంతా యే చదువు చదివినా అందులో సంపూర్ణ పాండిత్యం. ఏది పట్టినా బంగారం. మమ్మల్ని జమీందారులనే అంటారుగా!

ఆ సెమ్మా గృహం శుచి చేసి, ఇంటి ఆవిడ పూజల అరుగు అలికి, ముగ్గులు పెట్టి-దీపం పెట్టగానే ఆ లక్ష్మీ సరస్వతీదేవి పక్కున నవ్వేదట. ఆ దీపంలో నెయ్యి అయిపోయే ముందు యెవరికో ఒకరికి తప్పక జ్ఞాపకం వచ్చే తీరేదట. రాత్రల్లా యెవరికో ఒకరికి మెలకువ వస్తోనే వుండేది. తెల్లవారగానే గాలివేసినట్లు ఆరిపోయేది. అందాకా గాలివాన వీస్తున్నా కదిలేది కాదని చెప్తారు.


3

ఆ సెమ్మా పోయింది యిప్పుడు. అప్పణ్ణుంచి మా యింట్లో అన్నీ దురదృష్టాలే. ఎల్లా పోయిందో?

మా తండ్రిగారు ఇంగ్లీషు పరీక్షల్లో బాగా పేసవు కుంటూ వచ్చారు. ఆయన జిల్లాజడ్జీపని చేస్తున్నారు ఇప్పుడు. ఆయన ఉద్యోగంలో ప్రవేసించిన కొన్నాళ్ళకే మా తాతగారు కాలథర్మం చేశారు. కోర్టుమునసబీ పని చేసినన్నాళ్లూ మా తండ్రిగారు యెవరో ఒక బ్రాహ్మణ్ణి దేవతార్చనం కోసం వుంచారు. సబుజడ్జీ అయింది. అప్పట్నుంచి ఆ పని పోయింది. ఒక జమీందారుగారి కుమార్తెనని మా అమ్మ దీపం పెట్టడం మానేసింది. ఆ దేవతార్చనం పెట్టె నెమ్మదిగా మా స్వంత గ్రామంలో వుంచేసాం. ఇల్లా వుంటూవుండగా మా అమ్మకు జ్వరం ప్రారంభం; సంధిలోకి దింపింది. ఎంతమంది గొప్ప వైద్యులు ప్రయత్నాలు చేసినా మా అమ్మ మమ్మల్ని తీరని దుఃఖంలో ముంచి వెళ్ళిపోయింది.

ఆ తరవాత మా యింట్లో దొంగలు పడి పదివేల రూపాయల ఆస్థి దోచుకొని పోయినారు. మా చెల్లెలుకు కలరా వచ్చి మూడేళ్లకిందట కాలం చేసింది. అప్పుడే జడ్జీ పని అయింది మా నాన్నగారికి.

నేను బాగా పరీక్షల్లో కృతార్థుణ్ణి అవుతో వుండేవాణ్ణి. అల్లాంటిది బి యె. పరీక్షకు వెళ్ళాలంటే జబ్బు. మూడేళ్లు ప్రయత్నం చేశాను కాని లాభం లేకపోయింది. నాకు ఎంతో ఏడుపువచ్చింది. మా నాన్నగారి దగ్గరకి వెళ్ళాను.

"నాన్నగారూ యింక నేను చదువు మానేస్తా"

"పోనీలే! చదువు కేమి గాని మంచి బలంగా వుండే వాడివి నీకు కళ్ళు గుంటలుపడ్డాయి. బెంగా?"

"నాకు... ...ఏమీ తోచదండి. రెండుమూడుసార్లు ఆత్మహత్య చేసుకుందాం అని అనిపించింది."

"ఛా! వట్టి వెఱ్ఱివాడవులా వున్నావు. మొన్న డాక్టరు విశ్వనాధరావుగారు ఏమి చెప్పారు?"

"ఆయన నాతో ఏమీ చెప్పలేదు మీ తోనే మాట్లాడుతాను అన్నాడు." మా నాన్నగారికి అక్కణ్ణుంచి నాకు మల్లేనే బెంగ పట్టుకుంది. ఆరునెలలు సెలవు పుచ్చుకున్నారు. మేం అంతా మా స్వంత గ్రామం వెళ్ళాం. గోదావరి తీరాన్న నేను రోజూ విశ్రాంతికి వెళ్తూ వుండే వాణ్ణి.

ఒకనాడు నేనూ మా నాన్నగారూ మా మేనమామా యింకా యింకా యితర చుట్టాలూ వూళ్ళో వుండే పెద్దలూ అందరూ మా మేడ మీద కూర్చుని తాంబూలాలు వేసుకుంటూ వున్నాము. ఆ సమయంలో మా నాన్నగారు చటుక్కున లేచి కిందికి దిగివెళ్లారు. నాకు ఏమిటో భయం వేసింది. ఒళ్లు పులకరించింది. కూడా మేడ దిగి నేనూ వెళ్లాను. ఇద్దరం పడమటింటిలోనికి వెళ్లాం. అక్కడ అలుకులు, ముగ్గులు లేకుండా పూజ అరుగుంది. మా నాన్నగారికి కళ్ళనీళ్లు వచ్చి దేవతార్చనంపెట్టెలు కలశాలు వున్న అలమారు తలుపు తాళం తీసి, తెరిచారు. అందులో ఏమిటో ప్రాణం లేనట్టే వుంది. అన్ని విగ్రహాలూ వున్నాయి.

"బాబాయి రాగిసెమ్మా యేది?"

"ఏ రాగిసెమ్మా?"

"కుంభకోణం రాగిసెమ్మా"

"అవునవునండి ఏదీ? అడగనాండి మావయ్యనిపిలిచి?" ఎంతమందిని కనుక్కున్నా యెక్కడాలేదు.

అప్పణ్ణుంచి మా నాన్నగారు దీపం సెమ్మా కోసం లోకాలు తల్లక్రిందులు చేయడం మొదలు పెట్టారు.

4

నాకు నాలుగైదు సంబంధాలు, ఆంధ్రదేశం లోకి గొప్పవి వచ్చాయి. ఒక సంబంధం మా నాన్నగారికి ప్రాణ స్నేహితుని కుమార్తె. ఆ అమ్మాయి చాలా అందంగా వుంటుందని అందరూ అంటారు. ఆమె బొమ్మచూసిన నేనూ అల్లాగే అనుకున్నా. ఆ అమ్మాయిని చూడ్డానికి నేనూ మా నాన్నగారు వెళ్ళాం గుంటూరు.

అప్పుడు విజయదశమి. గుంటూర్లో అందరూ కలశాలు పెట్టి నవరాత్రములు జరుపుతారు.

మా నాన్నగార్ని నన్నూ ఆ యింట్లో చేసిన గౌరవం యింతా అంతా కాదు. అప్పుడే పండగలకు రాబోయే అల్లుడు వచ్చాడా అన్నారట లోకులు.

వాళ్ళింట్లో పండగబొమ్మలు పెట్టారు. ఒక గది యిచ్చారు వాళ్ల అమ్మాయికి. ఒక్కతే కూతురు. ఆ అమ్మాయి తమ్ముడు నా దగ్గిరకు వచ్చి అస్తమానం ఎగాదిగా చూడ్డం. అతని కళ్లు విశాలంగా బాగానే వున్నై; ఆతని అప్పగారి కళ్లు."

దశమిరోజున బొమ్మల గదిలో ఆ అమ్మాయిని చూడ్డానికి ఏర్పాటయింది. లోపలికి వెళ్ళా. మిల మిలలాడుతూ బంగారు బొమ్మలా నుంచుంది. సిగ్గు నవ్వు మోముతో ఆ అమ్మాయి. నాకు సిగ్గు వేసింది. నా గుండె కొట్టుకుంది. ఆ అమ్మాయి అందం వర్ణించడానికే వీలులేదు. "ఆ అది ఏమిటి? అయితే సూర్యనారాయణరావు- ఆ రాగిసెమ్మా ఎక్కడిదోయి?" అని అడిగాడు మెరిసిపోయే కళ్లతో మా నాన్న.

"చెన్నపట్టణంలో విక్టోరియా మందిరంలో కొన్నాను"

"ఈ సెమ్మా మాది సుమా"

"ఆహా ఏలా వెళ్లిందక్కడకు?"

అక్కణ్ణుంచి తంతివార్తల్తో విచారణ జరిపించ చివరకు ఒక పప్పు మిఠాయి అమ్మేవాడికి మా యింటి కాపలా కుర్రాడు అమ్మినట్టు. అది వాడు రాజమండ్రిలో కంచర దుకాణానికి అమ్మినట్టు, వాళ్ల దగ్గర ఒక గుమాస్తా కొని విక్టోరియా మందిరం వాళ్ల కమ్మినట్టు తేలింది.

ఆ సెమ్మా నా ప్రాణము, నా ఆత్మ లాగేసింది. ఆ అమ్మాయి మా యింటికి కాపురానికి వచ్చేటప్పుడు ఆ రాగి సెమ్మా పట్టుకొనే వచ్చింది.

మా తండ్రిగారు దేవతార్చన రోజూ చేస్తారు. నా ప్రియపత్ని, దీపం కాంతులు బంగారు మోమునకు అద్భుతమైన తేజం యివ్వగా, ఆ దీపం బమిడిపత్తి వత్తులతో రోజూ ఉదయాన్నే మడి గట్టుకొని వెలిగిస్తూ వుంటూంది.